"క్విట్ ఇండియా ఉద్యమంలో మీ భర్త బైద్యనాథ్ 13 నెలలు జైలులో ఉన్నప్పుడు మీకు చాలా కష్టంగా ఉండుంటుంది కదా?" నేను పురూలియాలో భవానీ మహాతోని అడిగాను. "ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని నడుపుతూ..."

"అతను ఇంటికి తిరిగి వచ్చాక, అదింకా చాలా ఘోరంగా ఉండేది," ఆమె ప్రశాంతంగా, కానీ దృఢంగా చెప్పారు. "అతను తన స్నేహితులను తీసుకొస్తూనే ఉండడం, లేదా నేను వారి కోసం వండుతూ ఉండటం, వారు ఆహారాన్ని తీసుకెళ్ళడం- ఇలా ఉండేది. ఒకోసారి 5, 10, 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నాకు ఒక్క క్షణమైనా విశ్రాంతి దొరికేదికాదు."

"కానీ క్విట్ ఇండియా ఉద్యమంతో మీ అనుబంధం తప్పనిసరిగా ..."

"దానితో గానీ, లేదా అలాంటిదే మరోదానితోనైనా గానీ నేనేం చేస్తాను?" ఆమె అడిగారు. “ఆ పోరాటంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా భర్త బైద్యనాథ్ మహాతో ఆ ఉద్యమాన్ని చేశారు. నేను ఒక పెద్ద కుటుంబాన్ని చూసుకోవడంలో ఊపిరిసలపకుండా ఉన్నాను. వాళ్ళందరికీ, నేను ఎంత వంట చేయాల్సి వచ్చేది - ప్రతిరోజూ వంట పెరిగిపోతూ ఉండేది!" అంటారు భవానీ. "గుర్తుంచుకోండి, నేను పొలం పనులు కూడా చేశాను."

మేం కుంగిపోయాం. మా ముఖాల్లో ఆ నిరాశ కనిపిస్తూండవచ్చు. ఇప్పటికీ జీవించి ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల కోసం వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్‌లోని ఈ మారుమూల ప్రాంతానికి మేం చాలా దూరమే వచ్చాం. మన్‌బజార్ I బ్లాక్‌లోని చెపువా గ్రామంలో ఆ పాత్రకు సరిపోయిన గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్నారు; భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన చారిత్రాత్మక పోరాటంతో ఎటువంటి సంబంధాన్నీ నిరాకరించినవారు.

భవానీ మహతో వయసు 101 నుండి 104 సంవత్సరాల మధ్య ఎక్కడైనా ఉండవచ్చు. ఆమె చాలా స్పష్టతతో, నిర్ణయాత్మకతతో మాట్లాడతారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల వయస్సును డాక్యుమెంట్ చేయడం చాలా చిక్కులతో కూడుకున్నది. ఒక శతాబ్దం క్రితం ఆమె జన్మించినప్పుడు, ఇది దాదాపు ఉనికిలో ఉండివుండదు. కానీ  ఆమె దివంగత భర్తకు సంబంధించిన రికార్డుల ద్వారా, 70ల వయస్సులో ఉన్న ఆమె కొడుకుతో సహా ఆమె పెద్ద కుటుంబంలోని సభ్యుల ద్వారా మేము భవానీ వయస్సును గురించి ఒక అంచనాకు రాగలిగాము. పురులియాలో మేము సందర్శిస్తున్న కొన్ని గ్రామాలలో ఆమె కంటే కొంచెం చిన్నవారైన సమకాలికుల నుండి కూడా.

ఏమైనప్పటికీ, ఇక్కడ పనిచేయని ఆధార్ కార్డ్ వ్యవస్థ ద్వారా ఆమె తరానికే చెందిన వ్యక్తులకు ఇష్టానుసారంగా అందజేసిన వయస్సుల కంటే ఇది మరింత నమ్మదగిన లెక్క. అక్కడ, భవానీ పుట్టిన సంవత్సరంగా 1925ను కేటాయించారు. ఆ ప్రకారంగా చూస్తే ఇప్పుడామెకు 97 ఏళ్లన్నట్టు.

భవానీకి 104 సంవత్సరాలని ఆమె కుటుంబ సభ్యులు చెపుతున్నారు.

Bhabani’s age is somewhere between 101 and 104. Here she is with her son Shyam Sundar Mahato who is in his 70s
PHOTO • P. Sainath

భవానీ వయస్సు 101 నుండి 104 ఏళ్ళ మధ్య ఉంటుంది. ఇక్కడ ఆమె తన 70 ఏళ్ల వయస్సున్న కుమారుడు శ్యామ్ సుందర్ మహాతోతో కలిసివున్నారు

"మాది పెద్ద ఉమ్మడి కుటుంబం," అని ఆమె చెప్పారు. "అన్ని బాధ్యతలూ నావే. పనులన్నీ చేశాను. అన్నీ నేనే చూసుకున్నాను. మొత్తం అంతా . కుటుంబాన్ని నడిపించాను. 1942-43లో ఆ సంఘటనలన్నీ జరిగినప్పుడు నేను అందరినీ చూసుకున్నాను." భవానీ ‘ఆ సంఘటనలకు’  పేరు పెట్టలేదు  కానీ, వాటిలో క్విట్ ఇండియా ఉద్యమ ప్రకంపనలు కూడా ఉన్నాయి. ప్రసిద్ధిగాంచిన ఆ 1942 సెప్టెంబర్ 30న, అప్పటికి బెంగాల్‌లోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న 12 పోలీసు స్టేషన్లలో, స్వాతంత్ర్య సమరయోధులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ప్రయత్నంచేశారు

నేటికీ, మొత్తం కుటుంబాల్లో మూడోవంతు పూర్తిగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జిల్లా పురూలియా. ఇది ఇప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక స్థాయి పేదరికం ఉన్న జిల్లాగా నివేదికలున్నాయి. భవానీగారి ఈ భారీ కుటుంబానికి కొన్ని ఎకరాల భూమి ఉంది. అది ఇప్పటికీ ఉంది. ఈ భూమి వారి జీవన స్థితిగతులను ఆ ప్రాంతంలోని చాలామంది కంటే సాపేక్షికంగా మెరుగ్గా ఉండేలా చేసింది.

ఆవిడ భర్త బైద్యనాథ్ మహతో ఒక స్థానిక నాయకుడు. ఆయన బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేక కార్యకలాపాలలో చాలా చురుగ్గా పాల్గొనేవారు. పురులియాలో ఇప్పటికీ పిరాహ్ గ్రామంలో జీవించి ఉన్న ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు ఠేలు మహతో, 'లోఖి' మహతో మాతో చెప్పినట్లుగా, మారుమూల ప్రాంతాలకు ఏదైనా వార్త చేరడానికి చాలా సమయం పట్టేది. "క్విట్ ఇండియాకు పిలుపునిచ్చిన ఒక నెల రోజుల తర్వాత మాత్రమే మేం ఇక్కడ దాని గురించి తెలుసుకున్నాం" అని ఠేలు మహతో చెప్పారు.

కాబట్టి ఆగష్టు 8, 1942న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో మహాత్మా గాంధీ బ్రిటిష్ వారికి 'క్విట్ ఇండియా'కు పిలుపునిచ్చిన 53 రోజుల తర్వాత, ప్రతిస్పందనగా ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధమైన చర్య సెప్టెంబర్ 30, 1942న జరిగింది. ఆ తర్వాత వచ్చిన అణిచివేతలో బైద్యనాథ్ అరెస్టయ్యారు, కష్టాలుపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన పాఠశాల ఉపాధ్యాయుడు కావాల్సి ఉంది. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు రాజకీయ సమీకరణలో కీలక పాత్ర పోషించారు. అది కూడా కొన్ని దశాబ్దాల పాటు స్వతంత్ర భారతదేశంలోకి తీసుకువెళ్ళగలిగే పాత్ర.

*****

Bhabani ran the family’s farm for decades right from preparing the soil for sowing, to supervising the labour and the harvesting. She even transported the produce back home herself
PHOTO • P. Sainath

నేలను సిద్ధం చేయడం దగ్గర నుండి విత్తడం వరకు, కూలీలను పర్యవేక్షించడం దగ్గరనుండి పంట కోతల వరకు ఆమె దశాబ్దాలుగా కుటుంబానికి చెందిన భూమిలో పనులు నడిపించారు. ఫలసాయాలను ఇంటికి తరలించడం కూడా ఆమె చేశారు

పోలీసు స్టేషన్లను ఆక్రమించి జెండా ఎగురవేసేందుకు వివిధ శక్తులు ప్రయత్నించాయి. బ్రిటిష్ వారి దోపిడీపాలనతో విసిగిపోయిన ప్రజానీకం ఉంది. భిన్న నేపథ్యాలకు చెందిన మరికొందరు ఉన్నారు. వామపక్ష విప్లవకారులు, గాంధేయవాదులు ఉన్నారు. మేము గ్రహించినదేమిటంటే ఠేలు, 'లోఖి' మహతో వంటి వ్యక్తులు కూడా ఉన్నారని. వీరు చాలామంది ఇతరుల వలెనే ఒప్పించడం ద్వారా వామపక్షవాదులు, వ్యక్తిత్వం ద్వారా గాంధేయవాదులు.

వారి రాజకీయాలు, వారి అభిరుచి వామపక్షాలతోనే ఉండేది. వారి నైతిక నియమాలు, జీవనశైలి మాత్రం గాంధీ ద్వారా మార్గనిర్దేశం చేయబడినవి. తరచుగా ఈ రెండు మార్గాల మధ్య నలిగిపోయేవారు. వారు అహింస ను విశ్వసించారు కానీ కొన్నిసార్లు హింస ద్వారా బ్రిటిష్ వారిపై ప్రతీకారం తీర్చుకున్నారు. వారిలా అంటారు: “చూడండి, వాళ్ళు మాపై కాల్పులు జరిపారు. తమ కళ్ల ముందే తమ స్నేహితులను, కుటుంబ సభ్యులను లేదా సహచరులను పోలీసులు కాల్చి చంపడాన్ని చూసినప్పుడు ప్రజలు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు." ఠేలు, 'లోఖి'లిద్దరూ కుర్మీ సామాజికవర్గానికి చెందినవారే.

భవానీ కుటుంబం కూడా కుర్మీలే. పశ్చిమ బెంగాల్, జంగల్‌మహల్ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద సామాజికవర్గం కుర్మీ.

బ్రిటీష్ రాజ్ వారిని 1913లో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసింది. అయితే 1931 జనాభా లెక్కల సందర్భంగా ఈ సమూహాన్ని ఆ వర్గం నుంచి తొలగించింది. చిత్రంగా వారు, 1950 నాటి భారతదేశంలో ఒబిసిలుగా జాబితా చేయబడ్డారు. వారి ఆదివాసీ హోదాని పునరుద్ధరించమని అడగడం ఈ రాష్ట్రంలోని కుర్మీల ప్రధాన డిమాండ్‌గా మిగిలిపోయింది

ఇక్కడ జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో కూడా కుర్మీలు ముందుభాగాన నిలిచి పోరాడారు. 1942, సెప్టెంబర్ నెల చివరి రెండు రోజులలో జరిగిన 12 పోలీసు స్టేషన్లపై కవాతులో అనేకమంది పాల్గొన్నారు.

Baidyanath Mahato was jailed 13 months for his role in the Quit India stir
PHOTO • Courtesy: the Mahato family

భవానీ భర్త భైద్యనాథ్ మహతో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో 13 నెలలపాటు జైలులో ఉన్నారు

"బైద్యనాథ్ తరువాత 13 నెలలపాటు జైలులో గడిపాడు" అని అతని కుమారుడు, డెబ్భయ్యవ వడిలో ఉన్న శ్యామ్ సుందర్ మహతో చెప్పారు. "ఆయన్ని భాగల్పూర్ క్యాంప్ జైలులో ఉంచారు." ఆయన్ని జైలులో ఉంచడం వల్ల ఆమెకు కలిగిన కష్టం గురించి భవానీని మేం అడిగినప్పుడు, అతను ఇంటికి తిరిగి వచ్చాకనే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని, ఆమె ఆశ్చర్యపరిచే సమాధానం ఇచ్చారు.

“అంటే ఎక్కువ మంది జనం వచ్చేవారు. మరింత మందికి ఆహారం ఇవ్వాలి. మరింత మందిని చూసుకోవాలి. అతను తిరిగి వచ్చినప్పుడు నేను చాలా ఏడ్చాను. అతని గొప్ప వీరత్వం అంతా నాదీ, అతని కుటుంబానిదీ పడిన శ్రమపైననే ఆధారపడి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసాను. అతను తిరిగి రావడంతో, నా పని మరింత పెరిగింది.”

మనం దృష్టిని మరోసారి భవానీపై కేంద్రీకరిద్దాం. ఆమె ఆలోచనలపై గాంధీ ప్రభావం ఉందా? సత్యాగ్రహం, అహింస ల గురించి ఆమె ఏమనుకుంటున్నారు?

ఆమె ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ, భవానీది స్పష్టమైన, భావస్ఫోరకమైన వ్యక్తీకరణ. అర్థం చేసుకోలేని మబ్బుమొహం పిల్లలకు వివరిస్తున్నట్టుగా ఆమె మనవైపు మృదువుగా చూసి, మాట్లాడతారు.

"గాంధీ... మీ ఉద్దేశ్యం ఏమిటి?" అని ఆమె అడుగుతారు “మీ ఉద్దేశ్యం ఏమిటి? నేను కూర్చుని ఆ విషయాల గురించి దీర్ఘంగా ఆలోచిస్తానని మీరు అనుకుంటున్నారా? ప్రతిరోజూ నేను వండివార్చాల్సినవారి సంఖ్య, సేవచేయాల్సినవారి సంఖ్య, బాగోగులు చూసుకోవలసినవారి సంఖ్య పెరుగుతూనే ఉంది," నొక్కి చెప్తున్నట్టుగా మా వైపు చేయి ఊపుతూ చెప్పారామె.

“దయచేసి అర్థం చేసుకోండి, పెళ్ళయేనాటికి నాకు తొమ్మిదేళ్లు. ఇంత గొప్ప విషయాల గురించి ఆ వయసులో నేనేం ఆలోచించగలను? ఆ తర్వాత దశాబ్దాల తరబడి ఒక భారీ ఉమ్మడి కుటుంబాన్ని ఒంటిచేత్తో చూసుకుంటున్నాను. నేను పొలం కూడా చేశానని దయచేసి తెలుసుకోండి. మట్టిని సిద్ధం చేయడం దగ్గర నుండి విత్తడం వరకు, మునిష్ (కూలీలు)ను పర్యవేక్షించటం, కలుపు తీయడం దగ్గరనుంచి పంటకోత కోయడం వరకూ... ” ఆ పనులప్పుడు ఆమె వ్యవసాయ కూలీలకు ఆహారాన్నివండి అందించేవారు.

ఆ తర్వాత ఆమె అడవి అంచున ఉన్న తమ పొలాల నుండి పంటను ఇంటికి తరలించేవారు.

ఎటువంటి యాంత్రిక పరికరాలు లేని యుగంలో ఆమె ఇవన్నీ చేశారు - ఎలక్ట్రిక్ పరికరాల గురించైతే ఎక్కడా విన్నది కూడా లేదు. పొలాల్లో ఆమె చేసిన శారీరక శ్రమ కూదా పెద్దవీ, మగవాళ్ళు ఉపయోగించడానికి అనుకూలంగా రూపొందించబడిన - ఇప్పటికి కూడా - నమ్మశక్యం కాని పాత ఉపకరణాలతో, పనిముట్లతో. అదికూడా, అత్యంత కరువు పీడిత ప్రాంతంలో, అసమానతలతో, ఆకలితో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతంలో.

బైద్యనాథ్‌తో ఆమెకు పెళ్లైన మూడు దశాబ్దాల తర్వాత, అతను మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈసారి అతను భవానీ స్వంత సోదరి, ఆమె కంటే దాదాపు 20 సంవత్సరాలు చిన్నదైన ఊర్మిళను వివాహం చేసుకున్నారు. పెద్ద కుటుంబంలో ఒక పెద్ద  సంక్షోభానికి దారితీసిన ఒక సంఘటన ఇందుకు కారణమైందని వారి బంధువులు చెప్పారు. అక్కచెల్లెళ్ళకు ఒక్కొక్కరికి ముగ్గురేసి పిల్లలు పుట్టారు.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

పురులియా జిల్లా, చెపువా గ్రామంలోని తన ఇంటిలో భవానీ

అదంతా నెమ్మదిగా జీర్ణమయింది. భవానీ మహతో తన కుటుంబం కోసం పంటను పండించి, కుటుంబం కోసమే కాక, ఇంకా చాలా మంది కోసం ఆహారం వండి, రవాణా చేశారు. ఆమె 1920ల చివరి నుంచి 1930ల వరకు ఆ పని చేసేవారు, 1940 లలో కూడా.

ఆమె ఎన్ని ఎకరాల్లో పని చేసింది అనే వివరాలు సరిగ్గా తెలియటంలేదు. ఆ కుటుంబం తమ సొంత భూమిగా భావించి సాగుచేసుకున్న భూమికి హక్కు పత్రాలు లేవు. వారు జమీందార్ ఇష్టానుసారం దానిపై పనిచేశారు. 20 మంది సభ్యులతో కూడిన ఆమె భారీ కుటుంబం  భబానీ పుట్టినిల్లు ఉన్న జన్రాలోనూ, చెపువాలోని ఆమె మెట్టినింటిలోనూ నివసించారు. రెండు గ్రామాల్లోనూ కలిపి దాదాపు 30 ఎకరాల పొలాన్ని వాళ్ళు సాగుచేశారు.

ఆమె మేలుకొని ఉన్న సమయమంతా క్రూరమైన పని భారం ఆమెను తినివేసేది. అటువంటి పనిగంటలు ఆమెకు అనేకానేకంగా ఉండేవి.

అయితే ఆమె తెల్లవారుజామున 4 గంటలకు లేచేవారా? "అంతకంటే చాలా ముందే," ఆమె వెక్కిరింతగా అంటారు. "అంతకంటే చాలా ముందే." చూస్తే, ఆమె తెల్లవారుజామున 2 గంటలకే లేచేటట్లు కనిపిస్తోంది. “నేనెన్నడూ రాత్రి 10 గంటలలోపు నిద్రపోలేదు. సాధారణంగా, అంతకంటే ఆలస్యమే అయ్యేది.”

ఆమె మొదటి బిడ్డ విరేచనాల కారణంగా మరణించింది. “మేము కవిరాజ్ అనే ఫకీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. కానీ అదేం పనిచేయలేదు. బిడ్డ చనిపోయినప్పుడు ఆమె వయస్సు కేవలం ఒక సంవత్సరం మాత్రమే."

నేనామెను గాంధీ గురించీ, ఉద్యమం గురించీ మళ్లీ అడిగే ప్రయత్నం చేశాను. "నేను తల్లిని అయిన తర్వాత, చరఖా తిప్పటం కానీ, అప్పటికి నేను చేస్తున్న అన్ని రకాల పనులను చేయడానికి కానీ నాకు సమయం దొరకలేదు" అని ఆమె చెప్పారు. ఆమె మరోసారి మనకు గుర్తుచేస్తారు - "నాకు పెళ్లి అయినప్పుడు నా వయస్సు 9 సంవత్సరాలు."

కానీ ఆ తర్వాత, ఆమె జీవించిన కాలాన్నీ, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులనూ బట్టి చూస్తే, భవానీ ఆ కాలంలో ఎదుర్కొన్న మూడు మహత్తరమైన అనుభవాల గురించి మనతో మాట్లాడగలరేమో కదా?

“నేను ప్రతి క్షణం పొంగిపోయాను. దయచేసి నా జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. మీరేమనుకుంటున్నారు, నేను కూర్చుని దీని గురించి ఆలోచించబోతున్నానా? నేను ఈ భారీ ఇంటిని ఎలా నిర్వహించాలో, ఎలా నడపాలో చూస్తున్నాను. బైద్యనాథ్ తదితరులు పోరాటంలో మునిగివున్నారు. నేను వాళ్ళందరికీ తిండి సమకూర్చాను.”

నలిపివేసే పని భారం, ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిడీ ఆమెకు కలిగినప్పుడు ఆమె ఏం చేసేవారు? “నేనక్కడ మా అమ్మతో కూర్చుని ఏడ్చేదాన్ని. మీరు గమనించండి, బైద్యనాథ్ తన వెంట తీసుకొస్తూనే ఉండే జనాలకు వంట చేయాల్సి వచ్చినప్పుడు నాకు చిరాకు కలిగేదికాదు. నాకు ఏడవాలనిపించేది."

మనం ఆమెను బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నట్టుగా, ఆమె పదే పదే అదే మాటలను వల్లిస్తున్నారు - "నాకు చిరాకు కలిగేదికాదు. నాకు ఏడవాలనిపించేది."

*****

1940లలో వచ్చిన అతిపెద్ద బెంగాల్ క్షామం రోజుల్లో ఆమెకీ భారం మరింత ఎక్కువగా ఉండేది. ఆ కాలంలో ఆమె పడిన కష్టాలు ఊహలకు అందేవి కావు

వీడియో చూడండి: భవానీ మహతో - పురూలియాకు చెందిన 'అసాధ్యురాలైన' స్వాతంత్ర్య సమరయోధ

మేమింక బయలుదేరడానికి సిద్ధమై మా కుర్చీల నుండి లేస్తునప్పుడు, బైద్యనాథ్ లాగే ఉపాధ్యాయుడైన ఆయన మనవడు పార్థసారథి మహాతో మమ్మల్ని కూర్చోమని అడిగారు. ‘పార్థ దా ’కు మాకు చెప్పేందుకు కొన్ని మాటలున్నాయి.

జాలువారిన మాటలు.

ఆమె తన పెద్ద కుటుంబం కోసం కాకుండా వంట చేస్తూ ఉండిన ఆ ఇతర వ్యక్తులు ఎవరు? బైద్యనాథ్, ఆమెను భోజనాలు సిద్ధం చేసేలా చేసిన ఆ ఐదు-పది-ఇరవై మంది వ్యక్తులు ఎవరు?

"ఆమె ఆ వంటలు చేసిపెట్టింది విప్లవకారుల కోసం," అన్నారు పార్థ దా . అజ్ఞాతంగా ఉండి ప్రతిఘటించేవారు, శత్రువుకు చిక్కకుండా అడవిలో దాగివుండి పోరాడేవారు."

కొన్ని క్షణాలు మేమలాగే మౌనంగా కూర్చుండిపోయాం. 9 సంవత్సరాల వయస్సు నుండి దాదాపు తన జీవిత పర్యంతం తన కోసం, తన కోసమంటూ ఒక్క క్షణం కూడా లేని ఈ మహిళ పరిపూర్ణ త్యాగం మమ్మల్ని పూర్తిగా అబ్బురంలో ముంచెత్తింది.

1930లు, 40లలో ఈమె చేసింది స్వతంత్ర సమరంలో పాల్గొనటం కాకపోతే మరేమిటి?

ఆమె కొడుకు, ఇంకా ఇతరులు మమ్మల్నే చూస్తున్నారు, ఇదంతా మాకు అర్థం కాలేదన్నట్టు. వాళ్ళు దీన్నంతా ఏమాత్రం ప్రాముఖ్యంలేని చాలా మామూలు విషయంగా తీసుకున్నారని మాకు తెలుసు.

తాను ఏమి చేస్తోందో, ఎవరికోసం చేస్తోందో భవానీకి తెలుసా?

నిజానికి అవుననే చెప్పాలి. ఆమెకు వారి పేర్లు తెలియకపోవచ్చు, లేదా వారిని వ్యక్తులుగా గుర్తించలేకపోవచ్చు. బైద్యనాథ్, అతని తోటి తిరుగుబాటుదారులు గ్రామ మహిళలు వండిన ఆహారాన్ని అజ్ఞాతంలో ఉన్నవారికి అందించేవారు. అలా చేయటం ఒక విధంగా ఇరు పక్షాలవారినీ తమకు సాధ్యమైనంత ఉత్తమ పద్ధతిలో రక్షించడమే అవుతుంది.

ఆ కాలపు పురులియాలో పరిస్థితిని పరిశోధించిన పార్థ దా , తరువాత మాకు ఇలా వివరించారు: “గ్రామంలో ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితిలో ఉన్న కుటుంబాలు మాత్రమే వారికి నిర్దేశించిన రోజున ఎంత మంది అజ్ఞాత కార్యకర్తలు అక్కడ ఉన్నా, భోజనం సిద్ధం చేసేవారు. ఇలా చేస్తున్నప్పుడు, మహిళలను తమ వంటగదిలో వండిన ఆహారాన్ని అక్కడే వదిలివేయాలని కోరేవారు.

“ఎవరు వచ్చి ఆహారాన్ని తీసుకువెళ్తున్నారో, లేదా వారు ఎవరి కోసం వండుతున్నారో వారికి తెలియదు. తిరుగుబాటు ఎన్నడూ గ్రామ ప్రజలను ఈ రవాణా కార్యకలాపాలకు ఉపయోగించలేదు. బ్రిటీష్‌వారికి గ్రామంలో గూఢచారులు, ఇన్ఫార్మర్లు ఉన్నారు. అలాగే వారితో కుమ్మక్కైన భూస్వామ్య జమీందార్లు కూడా ఉన్నారు. స్థానికులు అడవికి బరువులు మోసుకెళ్లడాన్ని ఈ ఇన్‌ఫార్మర్లు కనిపెడతారు. ఇది మహిళలకూ, అజ్ఞాతంలో ఉన్నవారికీ కూడా ప్రమాదం కలిగిస్తుంది. ఆహారాన్ని సేకరించడానికి వారు పంపిన వ్యక్తులను - బహుశా రాత్రి చీకటిగా ఉండటం వలన కావచ్చు - ఎవరూ గుర్తించలేరు. భోజనాన్ని ఎవరు తీసుకుపోతున్నారో మహిళలు కూడా చూడలేదు.

"ఆ విధంగా, ఇరువైపులా బహిర్గతం కాకుండా రక్షించబడ్డారు. అయితే ఏం జరుగుతుందో మహిళలకు తెలుసు. చాలామంది గ్రామీణ మహిళలు ప్రతి ఉదయం చెరువులు, వాగులు, సరస్సుల వద్ద గుమిగూడేవారు. ఇటువంటి పనుల్లో పాల్గొన్నవారు తాము గమనించినవాటినీ, అనుభవాలనూ ఒకరితో ఒకరు చెప్పుకునేవారు. వారు ఎందుకు, దేని కోసం ఈ పనులు చేస్తున్నారో వారికి తెలుసు. కానీ ప్రత్యేకించి ఎవరి కోసమన్నదే తెలియదు.

*****

PHOTO • P. Sainath

మనవడు పార్థ సారథి మహాతోతో ( దిగువ కుడివైపు) సహా తన ప్రస్తుత కుటుంబంలోని మరో 13 మంది సభ్యులతో భవానీ. ఫొటో తీసే సమయంలో కొందరు కుటుంబ సభ్యులు అక్కడ లేరు

మహిళలు అంటే వీరిలో కేవలం 'కౌమార దశలో' ఉన్న బాలికలు కూడా భాగమే. వీరంతా చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భవానీ ఇంట్లోకి పోలీసులు వస్తే? ఆమె ఎత్తి చూపినట్లుగా, ఆమెగానీ, 'ప్రతిదానికీ' ఆమెపై ఆధారపడిన ఆమె కుటుంబం గానీ ఏమవుతారు? అయితే, అజ్ఞాత ఉద్యమ నియమనిబంధనలు చాలా వరకూ పనిచేశాయి.

అయినప్పటికీ, స్వదేశీ, చరఖా, ఇతర ప్రతిఘటనకు సంబంధించిన చిహ్నాలను స్వీకరించిన కుటుంబాలు ఎల్లప్పుడూ నిఘాలో ఉండేవి. ప్రమాదాలు నిజమయ్యేవి.

అయితే, అలా అజ్ఞాతంలో ఉన్నవారికి భవానీ ఏం వండిపెట్టేవారు? ఆమెతో మా సమావేశం తర్వాత మాకు వాటిగురించి వివరించడానికి పార్థ దా ఉన్నారు. జోనార్ (జొన్న), కోడో (అరికెలు), మాడోవా (రాగులు), మహిళలకు అందుబాటులో ఉండే ఏవైనా కూరగాయలు. భవానీకీ, ఆమె స్నేహితులకూ కృతజ్ఞతలు. వారు తమ ఇళ్ళల్లో లభించే ముఖ్యమైన ఆహార పదార్థాలనే తరచుగా తినేవారు.

కొన్ని సందర్భాల్లో, వారు మరమరాలు లేదా చీడె (అటుకులు)ని తినేవారు. మహిళలు కొన్నిసార్లు వారికి పండ్లు కూడా పంపేవారు. ఇవే కాకుండా వారు అడవి పండ్లు, బెర్రీలు తినేవారు. పాతవాళ్ళు గుర్తుచేసుకునే మరో అంశం క్యాండ్ (లేదా తిరిల్ ). ఒకటి కంటే ఎక్కువ ఆదివాసీ భాషలలో, తిరిల్ అంటే కేవలం అడవి పండు అని అర్థం.

ఒక యువభర్తగా, తన తాత అకస్మాత్తుగా ప్రత్యక్షమై భవానీకి కొన్ని ఆదేశాలు ఇచ్చేవారని పార్థ దా చెప్పారు. అది అడవిలో ఉన్న స్నేహితుల కోసం కాబట్టి, అనివార్యంగా ఎక్కువమందికి ఆహారం సిద్ధం చేయవలసి వచ్చేది

ఇంకా ఇది కేవలం బ్రిటీష్ వారితో సమస్య మాత్రమే కాదు. 1940లలో వచ్చిన అతిపెద్ద బెంగాల్ క్షామం రోజుల్లో ఆమెకీ భారం మరింత ఎక్కువగా ఉండేది. ఆ కాలంలో ఆమె పడిన కష్టాలు ఊహలకు అందేవి కావు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆమె సాహసాలు కొనసాగాయి. 1950వ దశకంలో, ఆ కుటుంబం ఇప్పటికీ నివసిస్తోన్న మొహల్లా ని భారీ అగ్నిప్రమాదం మొత్తంగా నాశనం చేసింది. అక్కడ ఉన్న ప్రజల ధాన్యం నిల్వలన్నిటినీ అది ధ్వంసం చేసింది. భవానీ జన్రా గ్రామంలోని తన పుట్టింటివారి భూముల నుంచి ధాన్యం, ఉత్పత్తులను తీసుకొచ్చారు. తదుపరి పంట వచ్చే వరకు కొన్ని వారాలపాటు మొత్తం తన సామాజికవర్గాన్నే ఆ విధంగా ఆకలి నుంచి రక్షించారు.

1964లో, అప్పటి బీహార్‌లో భాగంగా ఉన్న జంషెడ్‌పూర్ సమీపంలో మతకలహాలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దీని మంటలు పురూలియాలోని కొన్ని గ్రామాలను కూడా దహించాయి. భవానీ తన గ్రామంలోని చాలా మంది ముస్లిములకు తన సొంత ఇంట్లో ఆశ్రయం కల్పించారు.

మరో రెండు దశాబ్దాల తరువాత, అప్పటికే వృద్ధాప్యంలో ఉన్న భవానీ స్థానికుల పశువులపై దాడి చేస్తున్న ఒక అడవి పిల్లిని చంపేశారు. ఆమె దీనితోనే ఆ పని చేసింది, అంటూ పార్థ దా , ఒక బలిష్టమైన చెక్కను చూపించారు. ఇది అడవి నుండి బయటకు వస్తున్న ఖాటాస్ లేదా పునుగు పిల్లి అని తేలింది.

*****

PHOTO • Courtesy: the Mahato family

1980 లలో భర్త బైద్యనాథ్, సోదరి ఊర్మిళతో భవానీ మహాతో ( మధ్యలో). అంతకు ముందరి కాలం నాటి కుటుంబ ఛాయాచిత్రాలు లేవు

మేము భవానీ మహతోని రెట్టించిన గౌరవంతో చూశాము. స్వాతంత్ర్య సమరయోధుడు గణపతి యాదవ్‌పై నేను చేసిన కథనం గుర్తుకు వచ్చింది. సతారాలోని అజ్ఞాత ఉద్యమానికి కొరియర్‌గా ఉన్న ఆయన అక్కడ ఆశ్రయం తీసుకున్న యోధుల కోసం అడవుల్లోకి ఆహారాన్ని తీసుకెళ్ళేవారు. నేను ఆయనను కలిసినప్పుడు 98 ఏళ్ళ వయసులో కూడా ఆయన రోజుకు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతుండేవారు. అద్భుతమైన ఆ మనిషిపై ఒక కథనం చేయడం నాకు చాలా నచ్చింది. కానీ ఆయనను ఒక సంగతి అడగలేదు: ఆయన చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఆహారాన్ని అడవుల్లోకి తీసుకువెళ్లాడు. కానీ ఆ వంట చేసిన అతని భార్య సంగతేమిటి?

నేనాయనను కలవడానికి వెళ్ళినపుడు ఆమె తన బంధువుల ఇంటికి వెళ్ళారు.

గణపతి గడిచిపోయారు. కానీ భవానీని కలవడం వలన నాకో విషయం అర్థమవుతోంది. నేను వెనక్కి వెళ్లి వత్సలా గణపతి యాదవ్‌తో మాట్లాడాలి. ఆమెను తన స్వంత కథను చెప్పనివ్వాలి.

నేతాజీ బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరి, బర్మా (ఇప్పుడు మయన్మార్) అడవుల్లో, సింగపూర్‌లోని వారి శిబిరాల్లో ఉన్న ఒడియా స్వాతంత్ర్య సమరయోధురాలు లక్ష్మీ పాండా మాట్లాడిన శక్తివంతమైన మాటలను కూడా భవానీ నాకు గుర్తుకు తెచ్చారు.

“నేనెప్పుడూ జైలుకు వెళ్లలేదు, నేను రైఫిల్‌తో శిక్షణ పొందాను, కానీ ఎవరిపైనా బుల్లెట్ పేల్చలేదు, అంటే నేను స్వాతంత్ర్య సమరయోధురాలిని కానట్టా? నేను బ్రిటిష్ బాంబు దాడులకు గురి అయిన INA అటవీ శిబిరాల్లో మాత్రమే పనిచేశాను. అంటే నేను స్వాతంత్య్ర పోరాటానికి ఎలాంటి సహకారం అందించలేదనా? 13 ఏళ్ళ వయసులో, నేను బయటకు వెళ్లి పోరాడుతున్న వారందరికోసం క్యాంపు వంటశాలలో వంట చేస్తున్నాను. అయితే నేను పోరాటంలో భాగం కాదా?”

లక్ష్మీ పాండా, సాలిహాన్, హౌసాబాయి పాటిల్, వత్సల యాదవ్‌ల వలే భవానీ నిజంగా పొందవలసిన గౌరవాలు, గుర్తింపును ఎన్నడూ అందుకోలేదు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో వారందరూ పోరాడి, అందరిలాగే గౌరవప్రదంగా తమ నిర్దోషిత్వాన్ని ప్రకటించుకున్నారు. కానీ వారు స్త్రీలు. మహిళలపై దురభిప్రాయాలు, మూస అభిప్రాయాలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాలలో, వారి పాత్రకు చాలా అరుదుగా విలువ ఇవ్వబడింది.

అయినా ఇది భవానీ మహాతోను ఇబ్బంది పెడుతున్నట్టు లేదు. బహుశా ఆమె ఆ విలువలను తన లోపల లయం చేసుకున్నారా? బహుశా తనకు మాత్రమే స్వంతమైన ఈ అపురూపమైన దోహదాన్ని తక్కువగా అంచనా వేయడానికి ఇది దారి తీస్తుందా?

కానీ మేము తిరిగి వెళ్తున్నప్పుడు ఆమె మాకు చెప్పిన చివరి విషయం ఇది: “నేను ఏమి పెంచుకున్నానో చూడండి. ఈ పెద్ద కుటుంబం, ఇన్ని తరాలు, మా పొలం, అన్నీ. కానీ ఈ యువతరం...." చాలామంది మనవరాళ్లు మా చుట్టూ చాలా శ్రద్ధతో పనిచేస్తున్నారు. వారు స్పష్టంగా తమ వంతు కృషి తాము చేస్తున్నారు. అయినప్పటికీ, భవానీ తన కాలంలో ఇదంతా ఒంటరిగా చేశారు.

నిజానికి ఆమె వారిని కానీ, మరింకెవరినైనా గానీ నిందించటంలేదు. ‘ అంతా ’ చేయగలిగినవారు తక్కువమంది ఉన్నారని ఆమె బాధపడుతున్నారు.


ఈ కథలో ప్రధానమైన ఇన్‌పుట్‌లను అందించినందుకు, భవానీమహాతో మాట్లాడుతున్నప్పుడు ఏకకాలంలో దోషరహితంగా అనువాదం అందించినందుకు స్మితా ఖటోర్‌కు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే, జాషువా బోధినేత్ర అందించిన అమూల్యమైన ఇన్‌పుట్‌లకు, ముందస్తుగా రెక్కీ ట్రిప్ నిర్వహించి, మేము చేసిన సమావేశాలు, ఇంటర్వ్యూలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసినందుకు నా ధన్యవాదాలు. స్మిత, జాషువా లేకుంటే ఈ కథనం సాధ్యమై ఉండేది కాదు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli