మా సంభాషణ ప్రాథమిక విషయాలతో మొదలైంది. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన శివారెడ్డి (62) నాతో మాట్లాడుతూ, “నాకు ఐదెకరాల భూమి ఉంది. మూడు ఎకరాల్లో అరటి, రెండెకరాల్లో దొండకాయ, ఒక ఎకరంలో ఉల్లి పండిస్తాను...’’ అన్నారు.  అంటే మీకు ఉన్నది ఐదు కాదు, ఆరు ఎకరాలు కదా- అని నేను అడిగాను.

Amaravati, Andhra Pradesh

శివ నవ్వారు. మా మాటలు శ్రద్ధగా వింటున్న అతని మిత్రుడు, రైతు కూడా అయిన అరవై సంవత్సరాల సాంబి రెడ్డి, “అతనికి పది ఎకరాల దాకా ఉంది. ఎవరు ఎవరో సరిగ్గా తెలియదు కాబట్టి (మా భూమి గురించి) మేం నిజం చెప్పం. మీరు ఈ సమాచారమంతా ఎవరికి ఇస్తారో, వాళ్ళు దాంతో ఏం చేస్తారో మాకు తెలీదు కదా!” అన్నారు.

కానీ ఇదేదో సాధారణంగా జర్నలిస్టుల గురించో అధికారుల గురించో ఉండే  అనుమానం కాదు. “కొత్త రాజధాని గురించి ప్రకటించినప్పటి నుంచి మేము భయంతో, అనిశ్ఛితితో బతుకుతున్నాం,” సాంబి రెడ్డి అన్నారు. “గతంలో కూడా చాలా సార్లు మా సొంతవాళ్ళే రాష్ట్ర ప్రభుత్వానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి సమాచారం ఇచ్చి మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు.”

శివ, సాంబి ఇద్దరూ కూడా నదీతీరంలో నిర్మించబోయే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కోసం తమ భూమిని వదులుకోవల్సి వస్తుందేమో అనే భయంలో ఉన్నారు. సెప్టెంబర్ 2014లో ప్రభుత్వం ఈ కొత్త గ్రీన్ ఫీల్ద్ రాజధాని కోసం కృష్ణా నది ఉత్తర తీరంలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి వ్యవసాయ భూములను సేకరిస్తామని ప్రకటించింది. శివ ఉంటున్న ఊరు కూడా అందులో ఒకటి.

2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల దాకా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు రెండిటికీ  కలిపి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండబోతుంది. అందుకే 2024 కల్లా కొత్త రాజధాని మొదటి దశ పనులు పూర్తవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధి అధికార సంస్థ (ఎపిసిఆర్‌డిఎ) అనేక పత్రికా ప్రకటనలలో తెలిపింది. రెండో దశ 2030 కి, మూడో దశ 2050 కి పూర్తి అయ్యేలా నిర్ణయించారు.

ఈ కొత్త రాజధానిని ‘ప్రపంచ స్థాయి’ నగరంగా రాష్ట్రం ప్రచారం చేస్తుంది. జనవరి 2018లో విజయవాడలో జరిగిన అమరావతి మారథాన్ ముగింపులో “అమరావతి ప్రజల రాజధాని, ప్రపంచంలోని ఐదు అగ్ర నగరాల్లో ఒకటి అవుతుంది.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.

A sample idea of the future city of Amaravati
PHOTO • Rahul Maganti
Jasmine gardens in Penumaka being grown on lands which have not been given for pooling.
PHOTO • Rahul Maganti

కొత్త రాజధాని కోసం భూములు సేకరిస్తున్న గ్రామాల్లో ఒకటైన ఉద్దండరాయునిపాలెంలో అమరావతి నమూనా. కుడి: పెనుమాక గ్రామంలో ఇంకా ప్రభుత్వానికి ఇవ్వని భూముల్లో మల్లె తోటలు

అమరావతి సుస్థిర రాజధానీ నగర అభివృద్ధి ప్రాజెక్ట్ (సస్టైనబుల్ కాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్) కోసం సింగపూర్‌కు చెందిన నిర్మాణ సంస్థల కన్సార్టియం సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణం మూడు దశలకు కలిపి లక్ష ఎకరాల భూమి అవసరం పడుతుంది. ఇందులో రాజ్ భవన్ , శాసనసభ, హై కోర్టు, సచివాలయం, మౌలిక సదుపాయాలు (రహదారులు, ఇళ్ళ సముదాయాలు సహా), పరిశ్రమలు, ఐటి కంపెనీలు వంటివన్నీ ఏర్పాటు చేయబడతాయి. అందులో కొంత భూమి  రాష్ట్రం స్వాధీనం చేసుకున్న భూయజమానులకు కేటాయించబడుతుంది .

ఐతే, శివరామకృష్ణన్ కమిటీ ఆగస్టు 2014లో ఇచ్చిన నివేదిక కొత్త రాజధాని పరిపాలనా భవనాలకు 200 నుంచి  250 ఎకరాల భూమి సరిపోతుందని పేర్కొంది. ఇవే కాక మెగా రాజధాని నిర్మాణ ప్రక్రియకి బదులుగా  ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘వికేంద్రీకృత’ అభివృద్ధిని సిఫార్సు చేసింది. "ఇప్పటికే ఉన్న వ్యవసాయ వ్యవస్థలకు సాధ్యమైనంత భంగం కలిగించకుండా", ప్రజలకు, వారి నివాసాలకు కనీస పునరావాసం, స్థానిక పర్యావరణ పరిరక్షణ వంటివి జరిగేలా దృష్టిలో పెట్టుకొని, కేంద్ర ప్రభుత్వం మార్చి 2014లో కొత్త రాజధాని స్థలానికి ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి ఈ కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనట్టుంది.

2050 కల్లా 56.5 లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయని కూడా ఎపిసిఆర్‌డిఎ మాస్టర్ ప్లాన్ చెబుతోంది, కానీ ఎలా అనేది చెప్పలేదు. రాజధాని ప్రాజెక్ట్ వ్యయం రూ.50,000 కోట్ల పైనే ఉంటుందని అంచనా- ఎపిసిఆర్‌డిఎ కమిషనర్ శ్రీధర్ చెరుకూరిని నేను అడిగినప్పుడు ఈ విషయాన్నిఆయన ధృవీకరించారు. నిధులు ఇచ్చే వాళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు (ప్రభుత్వం అమ్మే బాండ్ల ద్వారా), సాధ్యమైతే ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు కూడా ఉన్నాయి.

కొత్త రాజధాని కోసం భూమి సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2015లో భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్ - ఎల్‌పిఎస్) తీసుకొచ్చింది. ఐతే ఎల్‌పిఎస్ 2013 నాటి భూసేకరణ, పునర్వ్యవస్థీకరణ, పునరావాస చట్టం (ఎల్ఎఆర్ఆర్)లో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు ద్వారా వాగ్దానం చేయబడిన రక్షణలను, తనిఖీలను, వాటితో పాటు  సామాజికంగా, పర్యావరణం మీద పడే  ప్రభావాల అంచనా, ప్రభావితమైన వారిలో కనీసం 70 శాతం మంది ఆమోదం, వంటివాటిని కూడా విస్మరించింది.

Crops being grown in Undavalli being grown in lands which are not given for pooling
PHOTO • Rahul Maganti
Lands given to LPS are lying barren without any agricultural activity
PHOTO • Rahul Maganti

ఎడమ: ఉద్దండరాయునిపాలెంలో సారవంతమైన పొలాలు- 2014 నవంబర్ నాటి ఫోటో. కుడి: భూసమీకరణ పథకం కోసం ఇచ్చిన భూముల్లో వ్యవసాయం ఆగిపోయి ఇప్పుడు భవనాలు వచ్చాయి

ఎల్‌పిఎస్ కేవలం భూయజమానుల సమ్మతి మాత్రమే తీసుకుని ఆ భూమిపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీల్లాంటి ఇతరులను మినహాయిస్తుంది. భూ యజమానులు ‘స్వచ్ఛందంగా’ తమ ప్లాట్లను రాష్ట్రానికి ఇచ్చేసి కొత్త రాజధానిలో ఒక ‘పునర్నిర్మించి అభివృద్ధి చెందిన’(నివాస, వాణిజ్య అంశాలతో కూడిన)  ప్లాట్‌ను పొందవచ్చు. మిగతా భూమిని ఎపిసిఆర్‌డిఎ రోడ్లు, ప్రభుత్వ భవనాలు, పరిశ్రమలు వగైరా నిర్మాణాల కోసం ఉంచుతుంది. ప్రభుత్వం కూడా భూ యజమానులకు కొత్త ప్లాట్లు ఇచ్చే దాకా పది సంవత్సరాల వరకు ప్రతీ సంవత్సరం ఎకరానికి రూ. 30,000-50,000 వరకూ పరిహారం (భూమి రకాన్ని బట్టి) ఇవ్వడానికి హామీ ఇచ్చింది.

“భూసమీకరణ కోసం మా అంతట మేము భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని రెవెన్యూ అధికారులు చెప్తూ వస్తున్నారు. భూ సేకరణ చట్టం కింద వచ్చేపరిహారం, భూసమీకరణ పథకం(ఎల్‌పిఎస్) కింద వచ్చే దాని కన్నా చాలా తక్కువ అనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు,” అని సాంబి రెడ్డి చెప్పారు.

మార్చి 2017లో వెయ్యి మందికి పైగా రైతులు, రాజధాని ప్రాజెక్టుకు నిధులు ఉపసంహరించుకోవాలని కోరుతూ  ప్రపంచ బ్యాంకుకు ఒక లేఖ రాశారు. ఎందుకంటే: తమ వ్యవసాయానికి, మత్స్యకారుల జీవనోపాధికి ముప్పుగా ఉంది; ఈ ప్రాంతపు సారవంతమైన వ్యవసాయ భూమిని, ఆహార భద్రతని నాశనం చేస్తుంది; వరదలు వచ్చే ఆస్కారం ఉన్న ప్రాంతంలో భారీ నిర్మాణ పనులు చేయడం వల్ల పర్యావరణం ఘోరంగా దెబ్బ తింటుంది కాబట్టి. తమ పేర్లను గోప్యంగా ఉంచమని ఈ రైతులు ప్రపంచ బ్యాంకుని కోరారు.

పెనుమాక నుంచి పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక రైతు నాతో ఇలా అన్నారు: “భూసమీకరణ పథకాన్ని ప్రతిఘటించినందుకు పోలీసులు మా మీద తప్పుడు కేసులు బనాయించారు. వందలాది మంది పోలీసు అధికారులను గ్రామంలోకి దింపి, మొత్తం 29 గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ నెలల తరబడి ఒక పోలీసు శిబిరాన్ని (ప్రభుత్వం) ఏర్పాటు చేసింది.” ఇది గ్రామస్తులను భయపెట్టడానికి ఉపయోగపడింది.

పెనుమాక నుంచే  పేరు చెప్పడానికి ఇష్టపడని మరో రైతు ఇలా చెప్పారు: “ ఊర్లో ఉన్న పంచాయితీ కార్యాలయాన్ని ఎపిసిఆర్‌డిఎ కార్యాలయంగా మార్చారు. ఇది డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న అధికారి పర్యవేక్షణలో ఉండింది.”

Crops being grown in Undavalli being grown in lands which have not given for pooling
PHOTO • Rahul Maganti
Fresh banana leaves just cut and being taken to the market
PHOTO • Rahul Maganti

ఎడమ: ఉండవల్లి గ్రామంలో ఇంకా భూసమీకరణ పథకంకు  అప్పగించని భూముల్లో తోటలు. ఈ డెల్టా ప్రాంతంలోని అనేక గ్రామాలలోని  భూమి సారవంతమైనది, బహుళ పంటలు తీసేది, బలమైన మార్కెట్ అనుసంధానం కలిగివున్నది

ప్రపంచ బ్యాంకు కోసం ఎపిసిఆర్‌డిఎ తయారుచేసిన నివేదిక ప్రకారం అక్టోబర్ 2017 వరకు ఇంకా 4,060 మంది భూ యజమానులు భూసమీకరణ పథకం కోసం తమ సమ్మతిని ఇవ్వాల్సి ఉంది. ఐతే, బలవంతం గానీ ఒత్తిడి చేయటం గానీ లేదనీ, జనవరి  2015 నుంచి రైతులు ‘స్వచ్ఛందంగా, సంతోషంగా’ భూములు ఇస్తున్నారని ఎపిసిఆర్‌డిఎ కమిషనర్ శ్రీధర్ చెరుకూరి చెప్పుకొచ్చారు.

29 గ్రామాలలో నుంచి, పెనుమాక, ఉండవల్లి గ్రామాల ప్రజలు భూసమీకరణ పథకాన్ని తీవ్రంగా ప్రతిఘటించి తమ భూముల్ని వదులుకోలేదు. చెన్నై-కొల్‌కతా రహదారికి సమీపాన ఉండడం వల్ల ఈ భూమి చాలా విలువైనది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇక్కడి చాలా మంది రైతులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు.

మిగతా 27 గ్రామాలకు చెందిన భూ యజమానులు ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళు తెలుగు దేశం పార్టీకి బలమైన మద్దతుదారులు, అమరావతి ప్రాజెక్ట్ ని సమర్థిస్తున్నారు. “మేం అభివృద్ధి చెందాలి. ఇంకా ఎన్నాళ్ళని ఊర్లలో ఉండాలి? విజయవాడ, గుంటూరు వాసుల్లాగా మేం కూడా అభివృద్ధి చెందాలి,” అని భూసమీకరణ కోసం తన భూమిని ఇచ్చేసిన ఉద్దండరాయునిపాలెంకి చెందిన గింజుపల్లి శంకర రావు అన్నారు. నదికి దూరంగా ఉన్న నీరుకొండ గ్రామానికి చెందిన మువ్వా చలపతి రావు, “నాకు నష్టాలు మాత్రమే వస్తున్నప్పుడు నేనెందుకు వ్యవసాయం చేయాలి?” అని అడుగుతున్నారు

కానీ ఈ 27 గ్రామాలలో కూడా  భూమి లేనివారిని ఎల్‌పీఎస్‌ నుంచి మినహాయించడంతో పాటు ప్రతిఘటన కూడా ఉంది. వెంకటపాలెం ఊరిలో ఎకరం కన్నా తక్కువ భూమి ఉన్న చిన్న రైతు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన బోయపాటి సుధారాణిని కలిశాను. ఫిబ్రవరి 2015 లో ఆమె ఇంటర్నెట్ లోని ఒక వీడియోలో ఇలా చెప్తూ కనిపించారు,”నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి టీడీపీకి తప్ప ఎవరికీ ఓటు వేయలేదు. ఇప్పుడు మా గొయ్యి మేమే తవ్వుకున్నట్టు అనిపిస్తుంది. నేను చంద్రబాబుని ఒకటే అడగాలనుకుంటున్నాను. ఆయన మాకు పదేళ్ల తర్వాత ప్లాట్లు ఇస్తే మేం ఇప్పుడు చచ్చి మళ్ళీ తర్వాత పుట్టాలా?” అయితే ఆ తర్వాత పోలీసు, రెవిన్యూ అధికారుల బృందం ఆమె ఇంటికి వెళ్లి (ఆమె భర్త, అత్తమామల్ని ఒత్తిడి చేసి) ఆమె తన మాటల్ని ఉపసంహరించుకునేలా, భూసమీకరణ పథకానికి ఒప్పుకునేలా చేశారు.

Foundation stone for plantation of trees across the roads in the capital city
PHOTO • Rahul Maganti
The main arterial road of Amaravati which connects Amaravati to Vijayawada is in construction
PHOTO • Rahul Maganti

ఎడమ: బహుళ పంటలు పండే వేలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత, ఒక ‘తోటలు పెంచే కార్యక్రమం’ కోసం వేసిన పునాది రాయి. కుడి: అమరావతిని విజయవాడకి కలిపే రోడ్డు నిర్మాణం

“భూ ఉపరితలానికి కేవలం 10-15 అడుగుల దిగువనే భూగర్భ జలాలు ఉన్నాయి. (సారవంతమైన కృష్ణ-గోదావరి డెల్టాలో) ఇది బహుళ పంటలు పండే భూమి, సంవత్సరంలో ఒక్క రోజు కూడా పొలాలు ఖాళీగా ఉండవు. సంవత్సరంలో 365 రోజులు ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది,”అని కృష్ణారెడ్డి అన్నారు, పెనుమాకలో ఆయనకి ఒక ఎకరం భూమి ఉంది, ఇంకో నాలుగు ఎకరాలు కౌలుకి తీసుకున్నారు. “సాధారణంగా నాకు ఒక ఎకరానికి సంవత్సరానికి రెండు లక్షల రూపాయల లాభం వస్తుంది. మహా అయితే మార్కెట్ ధరలు తక్కువ ఉన్నప్పుడు నాకు నష్టమూ రాదు, లాభమూ రాదు.”

చాలా కాలంగా శ్రీకాకుళం, రాజమండ్రి లాంటి దూర ప్రాంతాల నుంచి పెనుమాక, ఉండవల్లి, ఇంకా  ఈ 29 ఊళ్ళలోని  కొన్నిఊళ్ళకు వ్యవసాయ కూలీలు పని వెతుక్కుంటూ వస్తున్నారు. మగవాళ్లు రోజుకి రూ. 500-600, ఆడవాళ్లు రోజుకి రూ. 300-400 సంపాదించుకుంటారు, సంవత్సరం పొడవునా పని ఉంటుంది.“ ఇప్పుడు ఈ 29 గ్రామాలవాళ్ళకే పని దొరక్క దూరప్రాంత గ్రామాలకి పని వెతుక్కుంటూ వెళ్తున్నారు,” చెప్పారు కృష్ణ.

“మీరు ఏం పంటలు పండిస్తారు?” అని నేనతన్ని అడిగాను. ఠక్కుమని జవాబు వచ్చింది: “మీరు నాకు ఒక పంట పేరు చెప్పండి. వచ్చే సంవత్సరం నేను దాన్ని పండించి చూపిస్తాను, పంట కూడా బాగా పండుతుందని ఖచ్చితంగా చెప్పగలను. నేను మిమ్మల్ని తీసుకెళ్లి ఈ చుట్టుపక్కల పండే 120 రకరకాల పంటలు చూపించగలను.” కృష్ణ ప్రస్తుతం అరటి, మొక్కజొన్న పెంచుతున్నారు. అతని లాంటి రైతులకి ఆ ప్రాంతంలో ఉన్న బలమైన వ్యవసాయ-మార్కెట్ అనుసంధానాలు అదనపు బోనస్.

ఇటువంటి లాభదాయక వ్యవసాయ భూములను తీసుకున్న తర్వాత రాష్ట్రం ఎలాంటి ఉద్యోగాలు సృష్టిస్తుందో శివకి తెలియదు. “ఆ యాభై లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయ్? ఒకవేపు జీవనోపాధి అవకాశాలు తగ్గిపోతూవుంటే ఈ చెప్పేదంతా ఉత్త చెత్త. ఇక్కడ జరుగుతున్నది అభివృద్ధి మాటున రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇది ప్రజల రాజధాని కాదు. ఈ రాజధాని ధనికుల కోసం బహుళజాతి కార్పొరేట్ల కోసం, సూట్లు వేసుకునే వాళ్లకోసం.  అంతే తప్ప, మా లాంటి సామాన్య ప్రజల కోసం కాదు.”

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు:

New capital city, old mechanisms of division

వాగ్దానం చేసిన విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మాకు ఉద్యోగాలివ్వాలి

ఆకాశాన్నంటుతున్న భూముల ధరలు, చిన్నరైతులకు భారమవుతున్న వ్యవసాయం

రైతు కూలీల ఉపాధిని కాజేసిన రాజధాని

మహా రాజధాని నగరం, చాలీచాలని జీతాల వలసకూలీలు

అనువాదం: దీప్తి

Rahul Maganti

Rahul Maganti is an independent journalist and 2017 PARI Fellow based in Vijayawada, Andhra Pradesh.

Other stories by Rahul Maganti
Translator : Deepti

Deepti is a Social Activist. She likes to question.

Other stories by Deepti