న్యాయమూర్తి: …మీరెందుకు పనిచేయలేదో సమాధానం చెప్పండి?
బ్రాడ్స్కీ: నేను పనిచేశాను. నేను పద్యాలు రాశాను.

న్యాయమూర్తి: బ్రాడ్స్కీ, ఉద్యోగాల మధ్య వచ్చిన విరామాల్లో మీరు ఎందుకు పనిచేయలేదో న్యాయస్థానానికి వివరిస్తే మంచిది.
బ్రాడ్స్కీ: నేను పద్యాలు రాశాను, నేను పనిచేశాను.

1964లో జరిగిన రెండు సుదీర్ఘ విచారణలలో రష్యాకు చెందిన 23 ఏళ్ళ యువకవి యోసిఫ్ (జోసెఫ్) అలెక్సాంద్రోవిచ్ బ్రాడ్‌స్కీ, తన దేశానికీ, భవిష్యత్తు తరాలకూ తన కవిత్వం ఎంతగా ఉపకరిస్తుందో సమర్థించుకుంటూ చేసిన వాదనల వివరాలను జర్నలిస్ట్ ఫ్రీదా విగ్దొరోవా ఎంతో శ్రద్ధతో రికార్డు చేశారు. అయితే ఆ వాదనలను ఒప్పుకోని న్యాయమూర్తి, బ్రాడ్‌స్కీని హానికరమైన సామాజిక పరాన్నజీవిగా పరిగణిస్తూ ఐదు సంవత్సరాల అంతర్గత బహిష్కరణనూ, కఠినమైన శ్రమనూ శిక్షగా విధించారు.

మనం ఇప్పుడు వీడ్కోలు పలుకుతోన్న ఈ సంవత్సరంలో, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మరిన్ని కవితలను ప్రచురించింది, మరింతమంది గాయకులను వెలుగులోకి తెచ్చింది, జానపద గీతాల కొత్త ఆర్కైవ్‌ను ప్రారంభించింది, ఇప్పటికే ఉన్న దానికి మరిన్ని పాటలను జోడించింది.

అయితే, కవిత్వానికి మనం ఎందుకంత ప్రాముఖ్యాన్నిస్తున్నాం? అది నిజంగా ‘పనే’నా? లేదా అది బ్రాడ్స్కీని వేధింపులకు గురిచేసినవారు చెప్పినట్టు సామాజిక పరాన్నజీవనమా?

కవి చేసే 'పని' మాన్యతను, ఔచిత్యాన్ని, విలువను ప్రశ్నించడం అనేది తత్వవేత్తలకూ, రాజకీయ నాయకులకూ కూడా అనాదిగా వస్తోన్న ఒక స్థిరమైన అలవాటుగా మిగిలిపోయింది. అకడమిక్ ప్రపంచంలో, దాని వెలుపల కూడా చాలామంది కవిత్వాన్ని వేగంగానూ సులువుగానూ పక్కకు నెట్టివేస్తారు; మరింత శాస్త్రీయమైన, రుజువులపై ఆధారపడి తెలుసుకునే ఇతర మార్గాలకు అనుకూలంగా కవిత్వాన్ని వేరుచేస్తారు. అలాంటి సమయంలో గ్రామీణ జర్నలిజపు సజీవ భాండాగారంలో కవిత్వం, సంగీతం, పాటలపై ప్రవర్ధమానమవుతోన్న విభాగాలను కలిగి ఉండటం చాలా విశిష్టమైన విషయం.

PARI అన్ని రకాల సృజనాత్మక వ్యక్తీకరణలను స్వీకరిస్తుంది- అవి మనకు భిన్నమైన కథలను చెప్పగలవనే కాదు, అవి నూతన కథన పద్ధతులను పరిచయం చేస్తున్నందువలన, గ్రామీణ భారతదేశంలోని ప్రజల అనుభవాలనూ జీవితాలనూ డాక్యుమెంట్ చేస్తున్నందువలన కూడా. వ్యక్తిగత అనుభవాలు, సామూహిక జ్ఞాపకశక్తితో కూడిన సృజనాత్మక కల్పనలో చరిత్ర, జర్నలిజాలకు ఆవల మానవ జ్ఞానాన్ని చేరుకోవడానికి మరొక మార్గాన్ని మనం ఇక్కడ కనుగొన్నాం. ఇంకా ప్రజల జీవితాలలో పెనవేసుకుపోయిన మన కాలపు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రక్రియలను డాక్యుమెంట్ చేయడానికి, ఆర్కైవ్ చేయడానికి ఇది మరో మార్గం కూడా.

ఈ సంవత్సరం PARI పంచమహాలీ భీలీ, ఆంగ్లం, హిందీ, బంగ్లా భాషల్లో కవిత్వాన్ని ప్రచురించింది. ఒక వ్యక్తిని ఒక విస్తారమైన అనుభవంలో నిలిపి ఉంచడంలో ఈ కవితలు మన కాలపు దృష్టాంతాలు. కొందరు గ్రామాన్ని విడచిన ఒక ఆదివాసీ కవి లో రాసినట్లుగా వ్యక్తిగత అనుభవాలలో అంతర్లీనంగా ఉండే ఉద్రిక్తతలను, సందిగ్ధతలను బయటికి తెచ్చారు. కొందరు దారపు అల్లికల జీవితాలు, భాషలు లో లాగా భాషల పితృస్వామ్య స్వభావంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, అందునుంచే ప్రతిఘటనకు తాజా అవకాశాలను సృష్టించారు. మరికొందరు అన్నదాత, సర్కార్ బహదూర్‌ లో లాగా నిరంకుశుల అబద్ధాలను బహిర్గతం చేశారు. మరికొందరు ఒక పుస్తకం, ముగ్గురు ఇరుగుపొరుగుల కథ లో లాగా ఎలాంటి భయం లేకుండా చారిత్రక, సామూహిక సత్యం గురించి మాట్లాడారు.

రాయడం అనేది ఒక రాజకీయ చర్య. The Grindmill Songs Project లోని పాటలు విన్నప్పుడు, ఒక పద్యాన్ని, పాటను, ఓవి ని అల్లడమనేది ఒప్పుదల, సోదరీత్వం, ప్రతిఘటనల సామూహిక చర్య అని గ్రహిస్తారు. ఈ పాటలు ఒకరి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గంగా, ఎప్పటికీ ఒక ప్రవాహంగా ఉన్న కాలం, సంస్కృతి, భావాల వంటివాటిని భాషలో పునశ్చరణ చేసే విధంగా ఉన్నాయి. గ్రామీణ మహారాష్ట్ర, కర్ణాటకల నుండి 3,000 మందికి పైగా మహిళలు తమ తక్షణ ప్రపంచం గురించి విభిన్న ఇతివృత్తాలపై పాడిన పాటలను చేర్చడం ద్వారా 1,00,000 జానపద పాటలతో వర్ధిల్లుతోన్న తన సేకరణకు PARI ఈ సంవత్సరం మరిన్ని ఆకర్షణీయమైన అంశాలను జోడించింది.

కచ్చ్ జానపద పాటల ఒక కొత్త మల్టీమీడియా భాండాగారమైన Songs of the rann చేర్పుతో PARI వైవిధ్యం ఈ సంవత్సరం మరింత పెరిగింది. కచ్ మహిళా వికాస్ సంగఠన్ (కెఎమ్‌విఎస్) సహకారంతో ప్రారంభమై, పెరుగుతోన్న ఈ సేకరణ ప్రేమ, ప్రగాఢవాంఛ, కోల్పోవటం, వివాహం, భక్తి, మాతృభూమి, లింగ అవగాహన, ప్రజాస్వామ్య హక్కుల ఇతివృత్తాలపై పాటలను సేకరించి సంరక్షిస్తుంది. ఈ సంగీత భాండాగారం అది ఏ నేల నుంచి వచ్చిందో ఆ భూమిలాగే వైవిధ్యమైనది. ఈ ఆర్కైవ్‌లో 341 పాటల గొప్ప సేకరణ ఉంటుంది. గుజరాత్‌కు చెందిన 305 మంది తట్టువాద్యకారులు, గాయకులు, జంత్రవాద్యకారులతో కూడిన అనధికారిక సముదాయం అనేక రకాల సంగీత రూపాలను ప్రదర్శిస్తూ, ఒకప్పుడు కచ్ఛ్‌లో వర్ధిల్లిన మౌఖిక సంప్రదాయాలకు ఇక్కడ PARIలో జీవం పోస్తోంది.

కవిత్వం అనేది ఉన్నత వర్గాల, ఉన్నత విద్యావంతుల సంరక్షణలోనిదనీ, లేదంటే వాక్చాతుర్యం, భాషా వర్ధమానానికి సంబంధించిన అంశం అనే తప్పుడు భావనను PARI కవిత్వం సవాలు చేసింది. కవిత్వానికీ, జానపద పాటలకూ మధ్య వివక్ష చూపకుండా, ఈ వైవిధ్య భరితమైన సంప్రదాయానికి నిజమైన సంరక్షకులు, నిర్మాతలు అయిన అన్ని తరగతుల, కులాల, లింగాలకు చెందిన సాధారణ ప్రజలను మనం గుర్తించాం. సామాన్య ప్రజల బాధలు, పోరాటాలతో పాటు సమానత్వం గురించి, అంబేద్కర్ గురించి పాడే Kadubai Kharat , సాహిర్ దాదూ సాల్వే వంటి వ్యక్తులు ప్రజాదరణ పొందిన రాజకీయాలను కవిత్వం చేస్తారు. శాంతిపూర్‌లోని లొంకాపారాకు చెందిన సుకుమార్ బిశ్వాస్ అనే కొబ్బరికాయలు అమ్ముకొనే సామాన్యుడు, ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడిన చక్కటి పాటలు పాడతారు. 1971 నాటి బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత భారతదేశంలో నివసించిన అనుభవం ఆయన్నలా మలచిందనటంలో సందేహం లేదు. పశ్చిమ బెంగాల్‌లోని పీర్రా గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు లక్ష్మీకాంత మహతో 97 ఏళ్ళ వయసులో కూడా ప్రతిధ్వనించే గాత్రమున్న గాయకుడు. భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటాన్ని సంగీతం, పాటలు ఎంత ఆశతోనూ, ఉత్సాహంతోనూ నింపాయో ఆయన చూపిస్తారు.

కవితలు లేదా పాటలు పదాలలో మాత్రమే రాస్తారని ఎవరు చెప్పారు? చాలా భిన్నమైన రకానికి చెందిన గీతలు మేం PARIలో ప్రచురించిన అనేక కథనాలకు రంగులనూ దృక్పథాన్నీ జోడించాయి. అనేకమంది కళాకారులు, తమ తమ ప్రత్యేక శైలితో, ఉత్తేజపరిచే కథనాలను సృష్టించారు. అవి ఇప్పుడు ప్రచురించిన ప్రతి కథనంలోనూ అంతర్భాగంగా మారాయి.

PARIలో కథనాలకు బొమ్మలు కొత్త కాదు. ఒక కథనాన్ని విప్పిచెప్పేందుకు బొమ్మలను ఉపయోగించిన కథనాలను మేం ప్రచురించాం. కొన్నిసార్లు పిల్లలు తప్పిపోయినప్పుడు... వంటి కథనాలలో నైతిక కారణాల వలన మేం బొమ్మలను ఉపయోగించాం. ఒక కథనంలో స్వయంగా చిత్రకారిణి అయిన ఆ కథా రచయిత, కథ కు కొత్త శక్తినీ అర్థాన్నీ అందించేందుకు ఛాయాచిత్రాలకు బదులుగా చిత్రాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. అయితే, కళాకారులు తమ గీతలను PARIలోని కవి లేదా గాయకుడి పంక్తులకు జోడించినప్పుడు వారు ఆ పుటలో అప్పటికే ఉన్న సుసంపన్నమైన జలతారు అల్లికపనికి కొత్త చాయల అర్థాన్ని తీసుకువస్తారు.

రండి, ఇక్కడకు వచ్చి ఈ అందమైన జలతారు వస్త్రాన్ని తయారుచేసిన పడుగు పేకల అల్లికను అనుభూతి చెందండి.

ఈ కథనం కోసం చిత్రాలను సవరించడంలో సహాయం చేసినందుకు రికిన్‌కు ఈ బృందం ధన్యవాదాలు తెలియజేస్తోంది

మేం చేసే పని మీకు ఆసక్తి కలిగిస్తే, మీరు PARIకి సహకరించాలనుకుంటే, దయచేసి [email protected]కు మాకు రాయండి. మాతో కలిసి పనిచేయడానికి ఫ్రీలాన్సర్లు, స్వతంత్ర రచయితలు, రిపోర్టర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, చిత్ర నిర్మాతలు, అనువాదకులు, సంపాదకులు, ఇలస్ట్రేటర్‌లు, పరిశోధకులను మేం స్వాగతిస్తున్నాం.

PARI లాభాపేక్ష లేనిది. మా బహుభాషా ఆన్‌లైన్ జర్నల్‌ను, ఆర్కైవ్‌ను అభిమానించే వ్యక్తుల నుండి వచ్చే విరాళాలపై మేం ఆధారపడతాం. మీరు PARIకి సహకరించాలనుకుంటే, దయచేసి DONATE పై క్లిక్ చేయండి

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Joshua Bodhinetra

Joshua Bodhinetra is the Content Manager of PARIBhasha, the Indian languages programme at People's Archive of Rural India (PARI). He has an MPhil in Comparative Literature from Jadavpur University, Kolkata and is a multilingual poet, translator, art critic and social activist.

Other stories by Joshua Bodhinetra
Archana Shukla

Archana Shukla is a Content Editor at the People’s Archive of Rural India and works in the publishing team.

Other stories by Archana Shukla
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli