ఘారాపురీలోని తన ఇంటి సమీపంలో ఉన్న అడవికి కట్టెలు ఏరుకొచ్చేందుకు వెళ్లిన జయశ్రీ మాత్రేను ఏదో కాటు వేసింది. 43 ఏళ్ల వయసు, ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అయిన జయశ్రీ ఆ కాటును పట్టించుకోలేదు; బహుశా చిన్న కొమ్మేదో గుచ్చుకొని ఉండొచ్చు అనుకున్నారామె. 2020 జనవరిలోని ఆ తేలికపాటి శీతాకాలపు మధ్యాహ్నం, తాను సేకరించిన కట్టెలను తీసుకుని ఆమె ఇంటికి బయలుదేరారు.

కాసేపటి తర్వాత, తన ఇంటి గుమ్మంలో నిల్చొని ఒక బంధువుతో మాట్లాడుతున్న ఆమె ఉన్నట్టుండి నేలమీదకు కుప్పకూలిపోయారు. ఆవిడ ఉపవాసం ఉండటం వల్ల నీరసంతో పడిపోయివుంటుందని ఆమెకు దగ్గరలో ఉన్నవాళ్ళు అనుకొన్నారు..

"మా అమ్మ స్పృహతప్పి పడిపోయిందని నాకు చెప్పారు," అని జయశ్రీ పెద్ద కుమార్తె, 20 ఏళ్ల భావిక గుర్తుచేసుకుంది. ఆమె, ఆమె చెల్లెలు గౌరి(14) ఇంటికి దూరంగా, బంధువుల ఇంటిదగ్గర ఉన్నందున ఈ సంఘటనను చూడలేదు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు, బంధువులు చెప్పగా తెలుసుకున్నారు. కాసేపటి తర్వాత స్పృహ వచ్చిన జయశ్రీకి చేయి వణుకుతున్నట్లుగా వాళ్ళు భావికతో చెప్పారు. "ఏమి జరిగిందో ఏమో ఎవరికీ అర్థంకాలేదు," అంది భావిక.

ఘారాపురీ ద్వీపంలో తాను నిర్వహిస్తున్న ఫుడ్ షాప్‌లో ఉన్న జయశ్రీ భర్త, 53 ఏళ్ల మధుకర్ మాత్రేకి ఎవరో సమాచారం అందించారు. అరేబియా సముద్రంలో ఉన్న ఈ ద్వీపం ఇక్కడ ఉన్న ఎలిఫెంటా గుహల వల్లనే ప్రసిద్ధి చెందింది. ముంబై నగరానికి సమీపంలో, పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ఈ ప్రదేశం యునెస్కో(UNESCO) ద్వారా ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తించబడింది. ఇక్కడి రాతి వాస్తుశిల్పం క్రీ.శ. 6వ నుండి 8వ శతాబ్దం నాటిది. ఇది ప్రతి సంవత్సరం లక్షలాదిమంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ద్వీపంలో నివాసముండేవారు టోపీలు, సన్ గ్లాసులు, జ్ఞాపికలు(సువనీర్లు), తినుబండారాలు అమ్మడం వంటివి చేస్తూ ఆదాయం కోసం పర్యాటకంపై ఆధారపడతారు. కొంతమంది గుహలకు మార్గదర్శకులు(గైడ్లు)గా వ్యవహరిస్తారు.

ఇది పర్యాటక చిత్రపటంలో ప్రముఖంగా కనిపించినప్పటికీ, ఈ ద్వీపంలోని ఘారాపురీ గ్రామంలో ప్రజారోగ్య కేంద్రం వంటి ప్రాథమిక వైద్య సదుపాయాలు కూడా లేవు. రెండు సంవత్సరాల క్రితం ఒకటి ఏర్పాటు చేశారు కానీ దానిని ఎవరూ పట్టించుకోవడంలేదు. గ్రామంలోని 1,100 మంది జనాభా రాజ్‌బందర్, శేత్‌బందర్, మోరాబందర్ అనే మూడు కుగ్రామాల్లో నివసిస్తున్నారు. వైద్య సౌకర్యాలు లేకపోవడం వలన వారు వాటికోసం వెతుకుతూ పడవ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ ప్రయాణాలు మరింత ఖరీదైనవవటమే కాకుండా, వైద్య సంరక్షణలో జరిగే ఆలస్యం కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు.

PHOTO • Aakanksha
PHOTO • Aakanksha

ఎడమ : ఎలిఫెంటా గుహల వద్దకు వచ్చే పర్యాటకులకు , మరణించిన తన తల్లి జయశ్రీకి చెందిన దుకాణంలో నగలు , క్యూరియోలు ( అరుదైన పాతకాలం నాటి వస్తువులు ) విక్రయిస్తోన్న 14 ఏళ్ళ గౌరీ మాత్రే . కుడి : ఘారాపురీ గ్రామంలో రెండేళ్ల క్రితం నిర్మించిన ఆరోగ్య కేంద్రం . నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో ఖాళీగా పడివుంది

ఉరణ్ పట్టణానికి వెళ్ళే పడవను పట్టుకోవడానికి మధుకర్, జయశ్రీని హుటాహుటిన జెట్టీకి తరలించారు. కానీ వారు బయలుదేరేలోపే ఆమె మరణించారు. పాము కాటుకు గురైన సూచనగా, ఆమె ఆఖరి క్షణాల్లో నోటి నుండి నురగ వచ్చింది. ఆమె కుడి చేతి మధ్య వేలు చర్మంపై పాము కోరలు దిగివున్న గుర్తులను చుట్టుపక్కల ఉన్నవారు గుర్తించారు.

ఈ ప్రాంతంలో పాముకాటు, తేలు కుట్టడం, పురుగులు కుట్టడం వంటి బెడదలు ఎక్కువగా ఉంటాయని భావిక చెప్పింది. మహారాష్ట్రలోని రాయ్‌గర్(రాయ్‌గఢ్ అని కూడా పిలుస్తారు) జిల్లా, ఉరణ్ తాలూకాలో ఉన్న ఈ గ్రామంలో, ప్రథమ చికిత్స అందక, అటువంటి కాటుల వల్ల సంభవించిన ఇతర మరణాలను గురించి కూడా ప్రజలు వివరించారు.

గత దశాబ్దకాలంగా, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ద్వీపంలో మరణాలు సంభవించాయి. సకాలంలో వైద్య సహాయం లభించినట్లయితే, ఈ మరణాలు  నివారించబడేవి. వాస్తవానికి, గ్రామంలో మందుల దుకాణం లేదు. ద్వీపంలో నివాసముండేవారు ప్రధాన భూభాగానికి వెళ్ళినప్పుడు కొనుగోలు చేసిన వాటితోనే వాళ్ళు సరిపెట్టుకోవాలి. ఘారాపురీ నుండి ప్రయాణించడానికి ఉన్న ఏకైక సాధనం పడవ ప్రయాణం. ఉరణ్ తాలూకాలోని మోరా ఓడరేవుకు దక్షిణం వేపుకు వెళ్లే పడవలోగానీ, నవీ ముంబైకి తూర్పున ఉన్న నావా గ్రామానికి వెళ్లడంగానీ- ఈ రెండే మార్గాలు. రెండు ప్రయాణాలకు దాదాపు అరగంట సమయం పడుతుంది. ద్వీపానికి పశ్చిమాన ఉన్న దక్షిణ ముంబైలోని కొలాబాకు పడవలో వెళ్ళేందుకు ఒక గంట సమయం పడుతుంది.

“మా గ్రామంలో డాక్టర్‌నో, నర్సునో చూస్తామనే ప్రశ్నే లేదు. మేం గృహవైద్యాన్నిగానీ, ఇంట్లో ఉండే ఏదైనా మందునిగానీ ఉపయోగిస్తాం,” అని ఎలిఫెంటా గుహల వద్ద టూర్ గైడ్ అయిన దైవత్ పాటిల్ (33) చెప్పారు. అతని తల్లి వత్సలా పాటిల్, స్మారక చిహ్నం దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక దుకాణంలో టోపీలను అమ్ముతూ, నెలకు సుమారు రూ. 6,000 సంపాదించేవారు. మే 2021లో విజృంభించిన కరోనా రెండవ తరంగంలో, ఆమెలో కోవిడ్ -19 బారిన పడిన సంకేతాలు కనిపించాయి. నొప్పి తగ్గించే మందులను వేసుకుని, ఇంక బాగైపోతుందని ఆశించారు వత్సల. కొన్నిరోజులు గడిచినా, నొప్పి తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఆమె తన కొడుకుతో కలిసి పడవ ఎక్కారు. "పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నప్పుడు మాత్రమే మేం ద్వీపం నుంచి బయటకు వస్తాం" అని దైవత్ చెప్పారు.

PHOTO • Aakanksha
PHOTO • Aakanksha

ఎడమ: ఎలిఫెంటా గుహల సమీపంలోని తమ ఆహార పదార్థాలమ్మే దుకాణంలో భావిక, గౌరీ మాత్రేలు. 2021 ప్రారంభంలో వారి తల్లిదండ్రులు మరణించినప్పటి నుండి వారు దీనిని నిర్వహిస్తున్నారు. కుడి: వారి తల్లిదండ్రులు మధుకర్ (ఎడమ). జయశ్రీల ఫోటోలు

ఇంటి నుండి బయలుదేరిన ఒక గంట తర్వాత, వారు రాయఘర్‌లోని పన్వేల్ తాలూకా, గవ్‌హాణ్ గ్రామంలోని ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ రక్త పరీక్షలో ఆమెకు హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని తేలింది. వత్సల ఇంటికి తిరిగి వచ్చారు, కానీ మరుసటి రోజు ఆమె పరిస్థితి మరింతగా దిగజారి, వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ఈసారి కూదా ఆమెను అదే ఆసుపత్రికి తరలించవలసి వచ్చింది. ఆమె ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నట్లు ఒక పరీక్షలో వెల్లడైంది; చివరకు ఆమెకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. చికిత్స కోసం ఆమెను పన్వేల్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అక్కడ, 10 రోజుల తరువాత ఆమె మరణించారు. 'ఇది ఊపిరితిత్తుల వైఫల్యం అని డాక్టర్ చెప్పారు,' అని దైవత్ చెప్పారు.

స్థానికంగా వైద్య సదుపాయం ఉండి, సులభంగా మందులు దొరికే అవకాశం ఉండివుంటే వత్సల, జయశ్రీల విషయంలో ఫలితం మరోలా ఉండుండేది.

జయశ్రీ మరణించిన ఒక నెల రోజుల తర్వాత, వారి తండ్రి మధుకర్ కూడా మరణించడంతో భావిక, గౌరిలు అనాథలుగా మిగిలిపోయారు. తమ తండ్రి దుఃఖంతో హృదయం పగిలి చనిపోయారని ఈ అక్కచెల్లెళ్ళు చెబుతున్నారు. మధుకర్ మధుమేహానికి మందులు వాడుతున్నారు. ఒక తెల్లవారుజామున ఆయన ఇంటి బయట రక్తపు వాంతులు చేసుకుంటూండగా భావిక చూసింది. ఆయనను పడవపై మోరాకు, అక్కడినుండి నెరుల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చేందుకు ఈ కుటుంబం ఉదయం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. పడవలో మోరాకు, ఆ తరువాత రోడ్డు మార్గంలో నెరుల్‌కు వెళ్లడానికి ఒక గంట కంటే ఎక్కువ సమయమే పడుతుంది. 20 రోజుల తరువాత ఫిబ్రవరి 11, 2020న ఆయన మరణించారు.

మాత్రే కుటుంబం ఆగ్రీ కోలీ సామాజికవర్గానికి చెందినది. మహారాష్ట్రలో దీనిని ఇతర వెనుకబడిన తరగతిగా జాబితా చేశారు. అక్కచెల్లెళ్ళయిన భావిక, గౌరీలు మనుగడ కోసం తమ తల్లిదండ్రుల దుకాణాన్ని నడుపుతున్నారు.

*****

ఎలిఫెంటా గుహలను సందర్శించడానికి ఘారాపురీ జెట్టీలో దిగే పర్యాటకులు, పర్యాటక స్మారక చిహ్నాలనూ ఆహారాన్నీ విక్రయించే దుకాణాలను దాటుకుంటూ వస్తారు. అటువంటి ఒక దుకాణంలో పళ్ళేలలో పచ్చి మామిడికాయ ముక్కలు, దోసకాయలు, చాక్లెట్లు నింపి అమ్మే దుకాణంలో 40 ఏళ్ల శైలేశ్ మాత్రే పనిచేస్తున్నారు. నలుగురితో కూడిన తన కుటుంబంలో ఎవరికి వైద్య సహాయం అవసరమైనా అతను దుకాణంలో పనిని వదిలేసిపోవాలి. అప్పుడతను ఒక రోజు పనినీ, జీతాన్నీ కోల్పోతారు. ఈమధ్య అదే జరిగింది. సెప్టెంబర్ 2021లో, అతని తల్లి హీరాబాయి మాత్రే (55) తడిగా ఉన్న రాయిపై జారిపడటంతో ఆమె కాలు విరిగింది. నొప్పి తగ్గించే ఎటువంటి మందులూ అందుబాటులో లేక ఆమె రాత్రంతా బాధపడుతూనే ఉన్నారు. మరుసటి రోజు శైలేశ్ ఆమెను పడవలో ఉరణ్‌కు తీసుకెళ్లవలసివచ్చింది.

PHOTO • Aakanksha
PHOTO • Aakanksha

ఎడమ: ఎలిఫెంటా గుహలను సందర్శించడానికి పర్యాటకులు వచ్చే జెట్టీకి దగ్గర, తాను పనిచేసే పండ్ల దుకాణం వద్ద శైలేశ్ మాత్రే. కుడి: శైలేశ్ తల్లి హీరాబాయి మాత్రే. తడిగా ఉన్న బండపై జారిపడి ఆమె నొప్పితో బాధపడ్డారు. చికిత్స కోసం, మందుల కోసం నీటిని దాటి వెళ్ళేందుకు ఆమె మరుసటి రోజు వరకు వేచి ఉండాల్సి వచ్చింది

“(ఉరణ్‌లోని) ఆసుపత్రివారు నా కాలికి ఆపరేషన్ చేయడానికి రూ. 70,000 అడిగారు. మా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి (ఒక గంట దూరంలో ఉన్న) పన్వేల్‌కు వెళ్ళాం. అక్కడ కూడా మమ్మల్ని అంతే మొత్తం అడిగారు. చివరికి మేం (ముంబయిలోని) జె.జె. హాస్పిటల్‌కు చేరుకున్నాం. అక్కడ నాకు ఉచితంగా చికిత్స అందించారు. ఈ ప్లాస్టర్ అక్కడే ఇచ్చారు," అని హీరాబాయి చెప్పారు. ఎట్టకేలకు ఉచిత వైద్యం అంది, మందులకు మాత్రమే ఖర్చు చేసినప్పటికీ, ఆ కుటుంబానికి చికిత్సకూ, మందులకూ, ప్రయాణాలకూ కలిపి మొత్తం రూ. 10,000 ఖర్చయ్యాయి.

ఆ దీవిలో బ్యాంకు లేదు, ఎటిఎం కూడా లేదు. దాంతో శైలేశ్ బంధువుల వద్ద, స్నేహితుల వద్ద అప్పుచేయాల్సి వచ్చింది. కుటుంబంలో సంపాదించే ఏకైక సభ్యుడు అతనే. దుకాణంలో సహాయకుడిగా అతను చేసే ఉద్యోగానికి పెద్దగా జీతం ఉండదు. ఇంతకుముందే వైద్యం కోసం (కోవిడ్-19 చికిత్స కోసం) చేసిన రూ. 30,000 అప్పుతో ఆ కుటుంబం చితికిపోయింది.

ప్లాస్టర్‌లో ఉన్న కాలుతో, నడవలేని స్థితిలో ఉన్న హీరాబాయి ఆందోళన చెందుతున్నారు. "నేను ఈ ప్లాస్టర్‌ను చూస్తూ, పరీక్ష చేసి దీనిని తొలగించడానికి నేను తిరిగి ముంబైకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను," అని ఆమె చెప్పారు. " జంగల్ సమజ్ కర్ చోడ్ దియా హై (ఈ అడవిలో మమ్మల్నిలా వదిలేశారు)," అన్నారామె.

ఆమె మనోభావమే గ్రామంలో విస్తృతంగా వ్యాపించి ఉంది. ఇక్కడొక వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని 2017 నుండి ఉరణ్ జిల్లా పరిషత్‌కు అర్జీలు పెడుతున్న సర్పంచ్ బలిరామ్ ఠాకూర్ కూడా అదే మనోభావాన్ని పంచుకున్నారు: “మేం చివరకు 2020లో శేత్‌బందర్‌లో దాన్ని నిర్మించేలా చేశాం. కానీ అక్కడ ఉండేందుకు మాకింకా వైద్యులు దొరకలేదు,” అని ఆయన చెప్పారు. భారతదేశ ఆరోగ్య శ్రామికశక్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా 2018లో సంయుక్తంగా ప్రచురించిన నివేదిక ప్రకారం: మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ శాతం మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలోని వైద్య నిపుణులలో కేవలం 8.6 శాతం మంది మాత్రమే గ్రామాల్లో పనిచేస్తున్నారు.

ఒక ఆరోగ్య కార్యకర్తను నియమించాలని కూడా బలిరామ్ అడుగుతూనే ఉన్నారు. కానీ “ఎవరూ ఇక్కడ ఉండడానికి సిద్ధంగా లేరు. గ్రామంలోని మాకే కాదు, పర్యాటకులకు కూడా వైద్య సదుపాయాలు అవసరం. ట్రెక్కింగ్ చేస్తూ పడిపోయిన ఒక పర్యాటకుడ్ని ముంబైకి తరలించవలసి వచ్చింది." అన్నారు బలిరామ్

PHOTO • Aakanksha
PHOTO • Aakanksha

ఎడమ: గ్రామంలో ఒక ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని ఉరణ్ జిల్లా పరిషత్‌కు వినతిపత్రం ఇచ్చిన ఘారాపురీ సర్పంచ్ బలిరామ్ ఠాకూర్. 'కానీ ఇక్కడ ఉండడానికి మాకింకా వైద్యులు దొరకలేదు'. కుడి: ద్వీపంలో నివాసముండేవారు ఎక్కడికైనా వెళ్లాలంటే పడవల ద్వారా మాత్రమే వెళ్ళగలరు

ఘారాపురీ నివాసుల ఆరోగ్యం డాక్టర్ రాజారామ్ భోంస్లే చేతుల్లో ఉంది. ఈయన 2015 నుండి కొప్రోలి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిఎచ్‌సి)లో పనిచేస్తున్నారు. అతని సంరక్షణలో 55 గ్రామాలు ఉన్నాయి. అతని పిఎచ్‌సి నుండి ఘారాపురికి ప్రయాణించేందుకు (రోడ్డు, పడవ ద్వారా) గంటన్నర సమయం పడుతుంది. "మా నర్సులు నెలకు రెండుసార్లు అక్కడకు వెళ్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే దాని గురించి నాకు తెలియజేస్తారు," అని అతను చెప్పారు. తన పదవీకాలంలో ఎటువంటి వైద్య అత్యవసర పరిస్థితులు తన దృష్టికి రాలేదని ఆయన అన్నారు.

కొప్రోలి పిఎచ్‌సికి చెందిన నర్సులు ఘారాపురిలోని అంగన్‌వాడీ కేంద్రం, లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోగులను చూస్తారు. నర్సు, ఆరోగ్య సేవిక కూడా అయిన సారిక థాలే, 2016 నుండి ఈ గ్రామానికి (మరో 15 గ్రామాలకు కూడా) ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. పోలియో చుక్కలు వేయడానికి ఆమె నెలకు రెండుసార్లు గ్రామాలకు వెళ్లి కొత్తగా తల్లులైనవారిని కలుస్తుంటారు.

"వర్షాకాలంలో పోటెత్తిన అలల కారణంగా పడవలు నడవవు కాబట్టి ఇక్కడికి చేరుకోవడం కష్టమవుతుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు. ఘారాపురిలో నివసించడం తనకు ఆచరణ సాధ్యం కాదని ఆమె చెప్పారు. “నాకు (చిన్న) పిల్లలు ఉన్నారు. వాళ్ళెక్కడ చదువుకుంటారు? నేను నా పని కోసం ఇక్కడ నుండి ఇతర గ్రామాలకు ఎలా వెళ్ళగలను?"

ఘారాపురిలో నీరు, విద్యుత్ వంటి ఇతర సౌకర్యాలు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. 2018 వరకు, మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎంటిడిసి) అందించిన జనరేటర్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ మాత్రమే ఈ దీవికి అందుబాటులో ఉండేది; అవి కూడా సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ నడిచేవి. 2019లో నీటి లైన్లు వచ్చాయి. దీవిలో ఉన్న ఏకైక పాఠశాల మూతపడింది.

PHOTO • Aakanksha
PHOTO • Aakanksha

ఎడమ: దీవి నుండి ముంబైలోని ఒక ఆసుపత్రికి వెళ్తూ, మార్గమధ్యంలోనే ఊయలూగుతున్న పడవలో తన మొదటి బిడ్డను ప్రసవించిన సంగతిని సంధ్యా భోయిర్ గుర్తుచేసుకున్నారు. కుడి: ఏప్రిల్ 2022లో మూతపడిన ఘారాపురిలోని జిల్లా పరిషత్ పాఠశాల

సౌకర్యాల లేమి కారణంగా, గర్భవతులు తమ గడువు తేదీకి కొన్ని నెలల ముందుగానే గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. చాలామంది గర్భం దాల్చిన చివరి నెలల్లో దీవిని విడిచిపెట్టి, బంధువుల వద్దకు వెళ్ళడమో, లేదా ప్రధాన భూభాగంలో గదిని అద్దెకు తీసుకుని ఉండటమో చేస్తుంటారు. ఈ రెండు పనులూ అదనపు ఖర్చుతో కూడుకున్నవే. గర్భిణీ స్త్రీలకు అవసరమైన వైద్య సామాగ్రి, తాజా కూరగాయలు, పప్పుధాన్యాలు దొరకడం ప్రయాసతో కూడిన పని అని ఇక్కడే ఉండిపోయిన వాళ్ళు అంటుంటారు.

2020లోని లాక్‌డౌన్ సమయంలో, పడవలు నడవకపోవడంతో గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు వెళ్లలేకపోయారు. ఆ సంవత్సరం మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించి, అన్ని రకాల రవాణా వ్యవస్థలు నిలిచిపోయినప్పుడు, 26 ఏళ్ళ క్రాంతి ఘరాత్ మూడు నెలల గర్భిణి. ఆమె సాధారణ వైద్య పరీక్షలకు కూదా వెళ్లలేకపోయారు. కొన్నిసార్లు గర్భధారణకు సంబంధించిన అసౌకర్యం భరించరానిదిగా ఉండేదని ఆమె అన్నారు. "నా పరిస్థితిని వివరించడానికి నేను డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చింది," అప్పటి పరిస్థితి పట్ల కలిగిన నిరాశను వ్యక్తం చేస్తూ అన్నారామె.

ముంబైలోని ఆసుపత్రికి వెళ్తూ మార్గమధ్యంలోనే తన మొదటి బిడ్డను పడవలో ప్రసవించిన సంగతిని సంధ్యా భోయిర్ గుర్తుచేసుకున్నారు. ఇది 30 సంవత్సరాల క్రితం జరిగింది. స్థానిక దాయి (మంత్రసాని) ప్రసవం జరిపించి, శిశువును బయటకు తీసేందుకు కష్టపడుతోంది. "నేను పూర్తిగా దేవునికి వదిలేశాను," ఎగిరిపడుతున్న పడవలో బిడ్డను ప్రసవించిన జ్ఞాపకాన్ని తలచుకుని నవ్వుతూ చెప్పారామె. ఒక దశాబ్దం క్రితం గ్రామంలో ఇద్దరు దాయిలు ఉండేవారు. కాలక్రమేణా సంస్థాగత జననాలకు, ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు ప్రాధాన్యం పెరగడంతో వారి సేవల అవసరం గణనీయంగా పడిపోయింది.

PHOTO • Aakanksha
PHOTO • Aakanksha

ఎడమ: భర్తతో కలిసి నడుపుతున్న చిన్న దుకాణంలో తన బిడ్డ హియాన్ష్‌తో క్రాంతి ఘరాత్. కుడి: గ్రామస్థులు ప్రధాన భూభాగానికి వెళ్లడానికి పడవలు ఎక్కే జెట్టీ(రేవుకట్ట)

గ్రామంలో మందుల దుకాణం లేకపోవడంతో ఈ ద్వీపవాసులు ముందస్తు ప్రణాళికలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. "తిరిగి ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళగలమో తెలియదు కాబట్టి, మందులు కొన్ని రోజుల కోసం మాత్రమే రాసినప్పటికీ, నెలరోజులకు సరిపోయేలా మందులు కొనివుంచుకుంటాను," అని ఆమె అన్నారు. క్రాంతి, ఆమె భర్త సూరజ్ ఆగ్రీ కోలీ సామాజికవర్గానికి చెందినవారు. వారు ఘారాపురిలో ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. కోవిడ్-19 లాక్‌డౌన్‌లకు ముందు, వారు నెలకు దాదాపు రూ. 12,000 సంపాదించేవారు.

గర్భం దాల్చిన ఆరవ నెలలో క్రాంతి, ఉరణ్ తాలూకాలోని నవీన్ శేవా గ్రామంలో ఉన్న తన సోదరుడి ఇంటికి మకాం మార్చారు. “నేను బిమారీ (కోవిడ్-19) గురించి ఆందోళన చెందుతుండటం వలన ముందుగానే అక్కడికి వెళ్లలేదు. ఘారాపురిలో సురక్షితంగా ఉండొచ్చని నేను అనుకున్నాను. భాయ్ (నా సోదరుడు)పై భారం పడకూడదనుకున్నాను,” అని ఆమె చెప్పారు.

ఆమె తన సోదరుడి వద్దకు వెళ్ళినప్పుడు, సాధారణ ధర (రూ. 30) కంటే పది రెట్లు ఎక్కువగా రూ. 300 ఖర్చుపెట్టి పడవ ప్రయాణం చేశారు. కోవిడ్-19 కేసుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం ప్రమాదకరమని ఆందోళన పడిన ఆమె కుటుంబం ప్రైవేట్ ఆసుపత్రిని ఎంచుకుని, సిజేరియన్ శస్త్రచికిత్సకూ, మందులకూ దాదాపు రూ. 80,000 ఖర్చు చేశారు. "ఇది డాక్టర్ ఫీజులకు, పరీక్షలకు మందులకు ఖర్చయింది" అని క్రాంతి చెప్పారు. ఆమె, సూరజ్ తాము పొదుపు చేసుకున్న డబ్బును ఇందుకోసం ఉపయోగించారు.

గర్భవతుల, బాలింత తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వ ప్రసూతి ప్రయోజన పథకమైన ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పిఎంఎంవివై)కు క్రాంతి అర్హురాలు. ఆమెకు ప్రభుత్వం తరపున రూ. 5,000 రావాల్సి ఉంది. కానీ 2020లో దీని కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, క్రాంతి ఇంకా ఆ మొత్తాన్ని అందుకోలేదు. ఘారాపురి నివాసితుల పట్ల అధికారిక ఉదాసీనత ఆరోగ్య సంరక్షణలోని ఏ ఒక్క అంశానికో మాత్రమే పరిమితం కాదని ఈ సంఘటన రుజువు చేస్తోంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Aakanksha

Aakanksha is a reporter and photographer with the People’s Archive of Rural India. A Content Editor with the Education Team, she trains students in rural areas to document things around them.

Other stories by Aakanksha
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli