లక్షిమాదేవికి తేదీ సరిగా గుర్తు లేదు కానీ, ఆ శీతాకాలపు రాత్రి మాత్రం స్పష్టంగా జ్ఞాపకం ఉంది. "గోధుమ పంట చీలమండల ఎత్తుకు పెరిగి ఉన్నప్పుడు, నా ఉమ్మనీరు కారుతూ, ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. అది డిసెంబర్ లేదా జనవరి (2018/19) అయి ఉండొచ్చు," అని ఆమె తెలిపారు.

వెంటనే లక్షిమాదేవి కుటుంబ సభ్యులు, ఆమెను బారాగాంవ్ బ్లాక్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీఎచ్సీ) తరలించేందుకు ఒక టెంపోను అద్దెకు తీసుకొచ్చారు. ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి జిల్లాలో, వారు నివసించే అశ్వరి గ్రామం నుండి ఆ పీఎచ్సీ దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. "మేము పీఎచ్సీకి చేరుకునే సమయానికి నాకు నొప్పులు ఎక్కువయ్యాయి," అని 30 ఏళ్ల లక్షిమా గుర్తు చేసుకున్నారు. ఆమె ముగ్గురు పిల్లలు – రేణు, రాజు, రేషమ్ ఇప్పుడు 5 నుండి 11 సంవత్సరాల వయసుకు వచ్చారు – ఆ రాత్రి వారు ఇంట్లోనే ఉండిపోయారు. "కానీ ఆస్పత్రి సిబ్బంది ఒకరు నన్ను చేర్చుకోడానికి నిరాకరించాడు. నేను గర్భవతిని కానని, అనారోగ్యం కారణంగా నా కడుపు ఉబ్బిందని అతను మాతో వాదనకు దిగాడు."

లక్షిమాదేవి అత్త హీరామణి ఎంత ప్రాధేయపడినా పీఎచ్సీ సిబ్బంది ఒప్పుకోకపోవడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో, అక్కడే పురుడు పోద్దామని ఆమె తన కుటుంబ సభ్యులతో అన్నారు. "కానీ ఆఖరి ప్రయత్నంగా, నన్ను వేరే చోటికి తీసుకెళ్లేందుకు, నా భర్త ఆటో కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పటికే నేను ప్రసవ నొప్పులు తట్టుకోలేక చాలా బలహీనంగా ఉండడంతో, ఆ ఆస్పత్రి బైటున్న ఒక చెట్టు కింద కూర్చున్నాను," అని లక్షిమా గుర్తు చేసుకున్నారు.

60 ఏళ్ల హీరామణి, లక్షిమా పక్కన కూర్చొని, ఆమె చేతిని నిమురుతూ, దీర్ఘ శ్వాస తీసుకోమని సలహా ఇస్తూ, పురుడు పోయడానికి ప్రయత్నం చేశారు. దాదాపు ఒక గంట తర్వాత, అర్ధరాత్రి సమయంలో, ఆమె ప్రసవించింది. అదీ గడ్డకట్టే చలిలో!

Lakshima with her infant son Amar, and daughters Resham (in red) and Renu. She remembers the pain of losing a child three years ago, when the staff of a primary health centre refused to admit her
PHOTO • Parth M.N.

తన పసి బిడ్డ అమర్, కూతుళ్లు రేషమ్ (ఎరుపు రంగులో), రేణుతో లక్షిమా. మూడేళ్ల క్రితం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రసవ వేదనతో ఉన్న తనను చేర్చుకోవడానికి నిరాకరించడంతో, బిడ్డను పోగొట్టుకున్నానని ఆమె ఇప్పటికీ బాధ పడుతుంటారు

కానీ ఆ బిడ్డ బ్రతకలేదు! బాగా అలిసిపోయిన లక్షిమాకి ఏం జరిగిందో తెలియలేదు. ప్రసవం అయిపోయాక, పీఎచ్సీ సిబ్బంది తనకు ఆస్పత్రిలో చికిత్స అందించి, మరుసటి రోజు డిశ్చార్జ్ చేసి పంపించారు. తనకు అవసరమైనప్పుడు వాళ్ళు ఆ శ్రద్ధ చూపించినట్లయితే, ఈ రోజు తన బిడ్డ బ్రతికుండేదని చెప్తూ ఆమె కన్నీళ్ళ పర్యంతం అయ్యారు.

లక్షిమాదేవి, ముసహర్‌ వర్గానికి చెందినవారు. ఉత్తర్ ప్రదేశ్లో అట్టడుగున ఉన్న పేద, దళిత సమూహాలలో ఒకటైన ముసహర్లు తీవ్రమైన సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారు. "మాలాంటి వ్యక్తులు ఆస్పత్రులకు వెళ్ళినప్పుడు, ఎప్పుడూ సరిగా చికిత్స చేయరు," అని ఆమె వాపోయారు.

ఆ రాత్రి ఆమెకు అందిన ‘చికిత్స’ ఆమెకు కొత్తేమీ కాదు; ఆమె ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి కూడా కాదు!

అశ్వరీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న దల్లీపుర్ లోని ముసహర్ బస్తీలో, 36 ఏళ్ల నిర్మల కూడా వివక్ష ఎలా ఉంటుందో వివరించారు: "మేము ఆస్పత్రికి వెళ్ళినప్పుడు, అక్కడి సిబ్బంది మమ్మల్ని చేర్చుకోడానికి ఇష్టపడరు. అందుకే అనవసరంగా డబ్బులడుగుతుంటారు. మమ్మల్ని ఆస్పత్రిలోకి ప్రవేశించకుండా నిరుత్సాహపరచడానికి చేయగలిగినదంతా చేస్తారు. ఒకవేళ మేము లోపలికి వెళ్తే, నేలపై కూర్చోమంటారు. కానీ, మిగతా వాళ్ళందరికీ కుర్చీలు తెచ్చి వేసి, చాలా గౌరవంగా మాట్లాడతారు."

ఈ కారణంగానే, ముసహర్ మహిళలు ఆస్పత్రికి వెళ్ళడానికి ఇష్టపడరు. మేము వారిని వెళ్ళమని బలవంతంగా ఒప్పించవలసి వస్తుంది. చాలామంది ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వడానికి ఇష్టపడతారని వారణాసికి చెందిన పీపుల్స్ విజిలెన్స్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ కార్యకర్త మంగ్లా రాజ్‌భర్, 42, తెలిపారు.

Mangla Rajbhar, an activist in Baragaon block, has been trying to convince Musahar women to seek medical help in hospitals
PHOTO • Parth M.N.

మంగ్లా రాజ్‌భర్ అనే సామాజిక కార్యకర్త, బారాగాంవ్ బ్లాక్‌లోని ముసహర్ మహిళలను ఆస్పత్రులలో వైద్య సహాయం తీసుకునేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు

NFHS-5 ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్లో 81 శాతం మంది షెడ్యూల్డ్ కులాల మహిళలు ఆరోగ్య కేంద్రంలో ప్రసవించడాన్ని ఎంచుకున్నారు – రాష్ట్ర గణాంకాల కంటే 2.4 శాతం తక్కువ. బహుశా నవజాత శిశు మరణాల రేటుకు ఇదే కారణం కావచ్చు; ఇది షెడ్యూల్డ్ కులాల్లో ఎక్కువగా ఉంది

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్లో 81 శాతం మంది షెడ్యూల్డ్ కులాల మహిళలు మాత్రమే ఆరోగ్య కేంద్రంలో ప్రసవించడాన్ని ఎంచుకున్నారు – రాష్ట్ర గణాంకాల కంటే 2.4 శాతం తక్కువ. బహుశా నవజాత శిశు మరణాల రేటుకు – పుట్టిన మొదటి 28 రోజులలో మరణాల సంఖ్య – ఇదొక కారణం కావచ్చు; మొత్తం రాష్ట్రంతో (35.7) పోల్చినప్పుడు, నవజాత శిశు మరణాల రేటు షెడ్యూల్డ్ కులాలలో (41.6) ఎక్కువగా ఉంది.

జనవరి 2022లో, బారాగాంవ్ బ్లాక్‌లోని ఏడు ముసహర్ బస్తీలలో, 64 ప్రసవాలలో 35 ఇళ్లలోనే జరిగాయని రాజ్‌భర్ నిర్వహించిన ఒక సర్వే కనుగొంది.

2020లో, లక్షిమా తన కొడుకు కిరణ్‌కు ఇంట్లోనే జన్మనిచ్చింది. "నేను ఇంతకు ముందు జరిగిన విషాదాన్ని ఇప్పటికీ మరచిపోలేదు. అక్కడికి (పీఎచ్సీ) తిరిగి వెళ్ళే ప్రశ్నే లేదు. ఆశా కార్యకర్తకు రూ.500 ఇస్తే, ఆమె నా ఇంటికే వచ్చి నాకు పురుడు పోసింది. ఆమె కూడా దళితురాలే!"

లక్షిమా లాగే, రాష్ట్రంలో చాలామంది ఆస్పత్రులలో లేదా ఆరోగ్య కేంద్రాలలో తరచూ వివక్షకు గురవుతున్నారు. రోగుల హక్కులపై నవంబర్ 2021 లో ఆక్స్‌ఫామ్ ఇండియా చేపట్టిన కొన్ని సర్వేలలో భాగంగా, ఉత్తర్ ప్రదేశ్లో 472 మందిని ప్రశ్నించినప్పుడు, అందులో 52.44 శాతం తమ ఆర్థిక స్థితి కారణంగా, 14.34 శాతం మంది మతం కారణంగా, 18.68 శాతం మంది కులం కారణంగా వివక్షకు గురవుతున్నారని తెలిసింది.

సహజంగా ఈ పక్షపాతాలు విస్తృత పర్యవసానాలకు దారి తీస్తాయి – ముఖ్యంగా, 20.7 శాతం మంది షెడ్యూల్డ్ కులాల ప్రజలు, 19.3 శాతం మంది ముస్లింలు (సెన్సస్ 2011 ప్రకారం) ఉన్న ఉత్తర్ ప్రదేశ్లో, వారి ఆరోగ్య సంరక్షణ హక్కులు నిర్ధారించే క్రమంలో!

అందుకే, ఈ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్నప్పుడు, చాలామంది కొరోనా వైరస్ పరీక్షలు చేయించుకోలేదు. 2021 లో ఆ మహమ్మారి రెండవ తరంగాన్ని గుర్తు చేసుకుంటూ, "గత సంవత్సరం, మా గ్రామంలో చాలామంది అస్వస్థతకు గురయ్యాం. కానీ, మేము మా ఇళ్లలోనే ఉండిపోయాం. అప్పటికే వైరస్ భయంతో మానసికంగా కుంగిపోతున్న మాకు, వాళ్ళు చేసే అవమానాలు అవసరమా," అని నిర్మల ప్రశ్నించారు.

Salimun at home in Amdhha Charanpur village. She says she has faced humiliating experiences while visiting health facilities
PHOTO • Parth M.N.

తాను ఆరోగ్య కేంద్రాలను సందర్శించినప్పుడు, చాలా అవమానాలను ఎదుర్కొన్నానని అమ్ధా చరణ్ పుర్ గ్రామంలోని తన ఇంటి ఆవరణలో కూర్చున్న సలీమున్ తెలిపారు

మార్చి 2021 లో, చందౌలీ జిల్లా అమ్ధా చరణ్‌పుర్ గ్రామంలో, 55 ఏళ్ల సలీమున్ అనారోగ్యానికి గురైనప్పుడు ఇంట్లోనే ఉండలేకపోయింది. "అది టైఫాయిడ్ అని తేలింది. కానీ నేను పరీక్షలు చేయించుకోడానికి వెళ్ళినప్పుడు, ఆ (పాథాలజీ) ల్యాబ్‌ అసిస్టెంట్ నాకు వీలైనంత దూరంగా నిలబడి, నా రక్తం తీసుకోడానికి ప్రయత్నించాడు. తన చేతులు చాచుతూ నన్ను దూరం పెట్టాడు. దాంతో నేను, తనలాంటి వాళ్ళని చాలామందిని చూశానని సమాధానమిచ్చాను."

ల్యాబ్ అసిస్టెంట్ ప్రవర్తనకు కారణం సలీమున్‌కి బాగా తెలుసు. మార్చి 2020 నాటి సంఘటనలను ప్రస్తావిస్తూ, "తబ్లిఘి జమాత్ సంఘటన దృష్ట్యా అతను అలా ప్రవర్తించాడు. ఎందుకంటే, నేను ముస్లింని కదా!" ఆ సమయంలో, ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో సమావేశమైన సభ్యులలో వందలాది మందికి కోవిడ్-19 రావడంతో, ఆ మత సమావేశం నిర్వహించబడిన మర్కజ్ భవనాన్నిఅక్కడి ప్రభుత్వం హాట్‌స్పాట్‌గా ప్రకటించింది. దీని తరువాత, వైరస్ వ్యాప్తికి ముస్లింలను నిందించే ఒక విషపూరిత ప్రచారం జోరందుకుంది. ఇది ఉత్తర్ ప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అనేక అవమానకరమైన అనుభవాలను మిగిల్చింది.

అటువంటి పక్షపాత వైఖరిని నిరోధించడానికి, 43 ఏళ్ల నీతూ సింగ్, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను విరివిగా సందర్శిస్తుంటారు. "నేను అక్కడక్కడే తిరుగుతుంటానని ఆస్పత్రి సిబ్బందికి తెలుసు కాబట్టి, రోగుల తరగతి, కులం లేదా మతంతో సంబంధం లేకుండా వారికి చికిత్స అందిస్తారు. లేకపోతే, ఇక్కడ వివక్ష రాజ్యమేలుతోంది," అని సహయోగ్ అనే ప్రభుత్వేతర సంస్థలో కార్యకర్తగా పనిచేస్తున్న సింగ్ వివరించారు. ఆమె అమ్ధా చరణ్‌పుర్ నౌగఢ్ బ్లాక్‌లో ఉండే మహిళల ఆరోగ్య సమస్యలపై అధ్యయనం చేస్తున్నారు.

ఇదే విషయంపై సలీమున్ మరో అనుభవాన్ని పంచుకున్నారు: "ఫిబ్రవరి 2021 లో, ఆమె 22 ఏళ్ల కోడలు షంసునీసా ప్రసవ సమయంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంది. రక్తస్రావం ఆగలేదు. ఆమె బలహీనంగా అయిపోయింది. దాంతో పీఎచ్సీలోని స్టాఫ్ నర్సు తనను నౌగఢ్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి (సీఎచ్సీ) తీసుకెళ్లమని సలహా ఇచ్చింది."

“నౌగఢ్ సీఎచ్సీలో నన్ను సహాయక నర్సు మంత్రసాని (ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫ్) పరీక్షిస్తుండగా ఒక కుట్టు విడిపోవడంతో, నేను నొప్పి భరించలేక అరిచాను. వెంటనే ఆమె నన్ను కొట్టడానికి చెయ్యి పైకెత్తింది. కానీ నా అత్తగారు ఆమెను అడ్డుకున్నారు," అని షంసునీసా గుర్తు చేసుకున్నారు.

ఆ హఠాత్ పరిణామంతో, సీహెచ్‌సీ సిబ్బంది షంసునీసాకు చికిత్స చేసేందుకు నిరాకరించి, వాళ్ళను మరో ఆస్పత్రికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోమని తేల్చి చెప్పారు. "మేము అక్కడి నుండి నౌగఢ్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే, వాళ్ళు మమ్మల్ని వారణాసికి వెళ్ళమన్నారు. దాంతో నేను చాలా ఆందోళనకు గురయ్యాను. నా కోడలికి రక్తస్రావం కొనసాగింది. ప్రసవం అయిన తర్వాత, ఒక రోజంతా ఆమెకు చికిత్స దొరకలేదు," అని సలీమున్ బాధపడ్డారు.

Neetu Singh, an activist in Naugarh block, says that discrimination is rampant in hospitals
PHOTO • Parth M.N.

ఆస్పత్రుల్లో వివక్ష రాజ్యమేలుతోందని నౌగఢ్ బ్లాక్‌లో ఒక ప్రభుత్వేతర సంస్థలో కార్యకర్తగా పనిచేస్తున్న నీతూ సింగ్ అన్నారు

'మేము పప్పు-కూరగాయలు లేదా అన్నం-రోటీ ఒకే రోజు వండుకోవడం మానేశాం. ఏదో ఒకటే వండుకుంటాం. ఇక్కడ అందరిదీ ఇదే పరిస్థితి. చాలామంది బ్రతకడానికి అప్పులు చేయాల్సి వచ్చింది,' అని సలీమున్ తెలిపారు

మరుసటి రోజు నౌగఢ్ లోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో షంసునీసాను అడ్మిట్ చేశారు. అక్కడ సిబ్బందిలో కొంతమంది ముస్లింలు తమకు భరోసా ఇచ్చి, తన కోడలికి మంచి చికిత్స అందించారని సలీమున్ తెలిపారు.

ఒక వారం తర్వాత, షంసునీసాను డిశ్చార్జ్ చేసినప్పుడు, ఆస్పత్రి బిల్లు రూ. 35,000 వచ్చింది. "మా మేకలు కొన్నింటిని రూ. 16,000 కు అమ్మేశాం. తొందరపడి అమ్మకపోయి ఉంటే, మాకు కనీసం రూ. 30,000 వచ్చేవేమో! నా కొడుకు ఫారూఖ్ దగ్గర కొంత నగదు ఉంది. ఆ డబ్బుతో మిగతా బిల్లు చెల్లించాం," అని సలీమున్ చెప్పారు.

షంసునీసా భర్త ఫారూఖ్, 25, పంజాబ్‌లో కూలీ పనిచేస్తున్నారు. అతని ముగ్గురు తమ్ముళ్లు కూడా కష్టపడి పని చేసి ఇంటికి డబ్బులు పంపుతున్నారు. "అతను (ఫారూఖ్) గుఫ్రాన్‌తో (పసి బిడ్డ) తగినంత సమయం గడపలేకపోయాడు. ఏం చేస్తాం మరి? ఇక్కడ పని దొరకడం లేదు," అని షంసునీసా బాధపడ్డారు.

"డబ్బు సంపాదించడానికి నా కొడుకులు వలస వెళ్ళారు," అని సలీమున్ చెప్పారు. నౌగఢ్‌లో టమోటాలు, మిర్చి పంటలు పందించినపుడు, ఫారూఖ్, అతని సోదరుల వంటి భూమిలేని కూలీలకు ఒక రోజు పనికి కేవలం రూ.100 ఇస్తారు. "దానితో పాటు, వారానికి రెండుసార్లు అర కిలో టమోటాలు లేదా మిరపకాయలు ఇస్తారు. అవి ఏ మూలకు వస్తాయి," అని సలీమున్ అడిగారు. అయితే పంజాబ్‌లో, ఫారూఖ్ ఒక రోజుకి రూ. 400 సంపాదిస్తారు; కానీ అతనికి వారంలో 3-4 రోజులు మాత్రమే పని ఉంటుంది. "కోవిడ్-19 వ్యాప్తి తర్వాత, మనుగడ సాగించడం కష్టమైపోయింది. తినడానికి సరిపడా తిండి లేని పరిస్థితి!"

అందుకే సలీమున్ కుటుంబం పప్పు, కూరగాయలు రెండింటినీ ఒకే రోజు వండుకోవటం లేదు. అన్నం, రోటీ కూడా అంతే. ఏదో ఒకటే వండుకుంటారు. ఇక్కడ అందరిదీ ఇదే పరిస్థితి. చాలామంది ప్రజలు బ్రతకడానికి అప్పులు చేయాల్సి వచ్చిందని ఆవిడ విచారించారు.

Salimun with Gufran, her grandson
PHOTO • Parth M.N.
Shamsunisa cooking in the house. She says her husband, Farooq, could not spend much time with the baby
PHOTO • Parth M.N.

ఎడమ వైపు: మనవడు గుఫ్రాన్‌తో సలీమున్; కుడి వైపు: ఇంట్లో వంట చేస్తున్న షంసునీసా. తన భర్త ఫారూఖ్ తమ బిడ్డతో ఎక్కువ సమయం గడపలేకపోయాడని బాధపడ్డారు

ఉత్తర్ ప్రదేశ్ లో తొమ్మిది జిల్లాల్లో ఉన్న అనేక గ్రామాలలో, కొరోనా మహమ్మారి వ్యాపించిన మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్ నుండి జూన్ 2020 వరకు) ప్రజల ఋణభారం 83 శాతానికి పెరిగింది.  అది 2020 జూలై-సెప్టెంబర్లో 87శాతంగా, అక్టోబర్-డిసెంబర్, 80 శాతంగా నమోదైందని గ్రాస్‌రూట్ సంస్థల సమిష్టి అయిన COLLECT చేసిన సర్వే ఒకటి తెలిపింది.

దుర్భరమైన ఈ పరిస్థితులను తట్టుకోవడం కోసం, డిసెంబర్ 2021 చివరి వారంలో, అంటే తన చిన్న బిడ్డ జన్మించిన 15 రోజుల తర్వాత, లక్షిమాదేవి ఇటుక బట్టీలో పనికి వెళ్ళడం మొదలుపెట్టింది. నవజాత శిశువును పడుకోబెట్టిన ఉయ్యాలను ఊపుతూ, "మా పరిస్థితిని చూసి, ఆహారం సమకూర్చుకోడానికి మా యజమాని అదనపు డబ్బులేమైనా ఇస్తారేమోనని నాకొక చిన్న ఆశ," అని ఆమె అన్నారు. లక్షిమా, ఆమె 32 ఏళ్ల భర్త సంజయ్ వారి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని దేవ్‌చంద్‌పుర్‌లో ఉన్న ఇటుక బట్టీలో పని చేసి, రోజుకు ఒక్కొక్కరు రూ.350 సంపాదిస్తున్నారు.

ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో, మంగ్లా రాజ్‌భర్ ఇంట్లో ప్రసవం వద్దని లక్షిమాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. "ఆమెను ఒప్పించిండం చాలా కష్టమైంది. అందుకు ఆమెను నిందించను. కానీ, చివరికి తను అంగీకరించింది," అని రాజ్‌భర్‌ చెప్పారు.

లక్షిమా, హీరామణి ఈసారి ఆరోగ్య కేంద్రానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. లక్షిమాను చేర్చుకోడానికి ఆస్పత్రి సిబ్బంది విముఖత వ్యక్తం చేయగానే, వాళ్ళు రాజ్‌భర్‌కు ఫోన్ చేస్తామని బెదిరించారు. దాంతో సిబ్బంది తలొంచక తప్పలేదు. మూడేళ్ల క్రితం తన బిడ్డను పోగొట్టుకున్న అదే పీఎచ్సీలో, డిసెంబర్ 2021లో, పండంటి బిడ్డకు లక్షిమా జన్మనిచ్చింది. చివరికి, ఆ కొన్ని మీటర్ల దూరమే ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి!

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని , PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది .

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi