“మద్య నిషేధం ఎక్కడ ఉంది?” ఘాటుగా ప్రశ్నిస్తున్న గౌరి పర్మార్ స్వరంలో వ్యంగ్యం కూడా ప్రస్ఫుటమవుతోంది.

“ఇది కేవలం వంచన, లేదా నా ఊరు బహుశా గుజరాత్‌లో లేనట్టుంది! మా గ్రామంలోని పురుషులు చాలా సంవత్సరాలుగా తాగుతున్నారు,” అని ఆవిడ అన్నారు. ఆమె నివసించే రోజిద్ గ్రామం గుజరాత్‌లోని బోటాద్ జిల్లాలో ఉంది.

భారతదేశంలో, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న మూడు రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. ఇక్కడ ప్రజలు మద్యం కొనుగోలు చేయడం లేదా సేవించడం నిషేధం. దాన్ని తయారుచేసినా లేదా అమ్మినా, గుజరాత్ నిషేధ (సవరణ) చట్టం-2017 ప్రకారం, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

కానీ 30 ఏళ్ళ క్రితం, వధువుగా రోజిద్‌కు వచ్చినప్పటి నుండి, ఆ నియమాన్ని ఉల్లంఘించడం చూశారు 50 ఏళ్ళ గౌరి. స్థానికంగా మద్యం తయారు చేసి, వినియోగదారులకు పాలిథిన్ కవర్లలో విక్రయించడాన్ని ఆమె చూశారు.

కల్తీ మద్యం తయారు చేయడం వల్ల కలిగే ప్రమాదాలు చాలా విస్తృతమైనవీ, ప్రాణాంతకమైనవీ కూడా. కల్తీ మద్యం తయారు చేసేటప్పుడు, సదరు ప్రక్రియను వేగవంతం చేయడానికి కొన్నిసార్లు విషపూరిత పదార్థాలను ఉపయోగిస్తారు వ్యాపారస్తులు. “వారు లిక్విడ్ శానిటైజర్, యూరియా, మిథనాల్‌లను కలుపుతారు,” గౌరి వివరించారు.

జులై 2022లో, గుజరాత్‌లో నకిలీ మద్యం తాగి 42 మంది చనిపోయారు; అహ్మదాబాద్, భావ్‌నగర్, బోటాద్ జిల్లాల్లో దాదాపు 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. మరణించిన వారిలో, బోటాద్ లోని బర్వాలా తాలూకా రోజిద్ గ్రామానికి చెందిన వారు 11 మంది ఉన్నారు.

Gauri Parmar lost her son, Vasram, to methanol-poisoned alcohol that killed 42 people in Gujarat in July 2022
PHOTO • Parth M.N.

జులై 2022లో, మిథనాల్ కలిపిన విషపూరిత మద్యం తాగడం వల్ల గుజరాత్‌లో చనిపోయిన 42 మందిలో, గౌరి పర్మార్ కుమారుడు వాస్‌రామ్ కూడా ఉన్నారు

“వారిలో నా కొడుకు వాస్‌రామ్ కూడా ఒకడు,” గౌరి తెలిపారు. వాస్‌రామ్(30), ఆ కుటుంబానికి ఉన్న ఏకైక ఆధారం. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు – 4, 2 ఏళ్ళు – ఉన్నారు. ఆ కుటుంబం గుజరాత్‌లోని షెడ్యూల్డ్ కులమైన వాల్మీకి సముదాయానికి చెందినది.

జులై 25, 2022 ఉదయం ఏం జరిగిందో గౌరికి గుర్తుంది. వాస్‌రామ్‌కి అసౌకర్యంగా ఉంది; ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించింది. కుటుంబ సభ్యులు అతన్ని బర్వాలాలోని ఒక ప్రైవేట్ క్లినిక్‌కి తీసుకెళ్ళారు. అక్కడ అతనికి అవసరమైన చికిత్స అందించడానికి తగిన సౌకర్యాలు లేవని డాక్టర్ చెప్పారు. దాంతో వాస్‌రామ్‌ను బర్వాలాలోని సాముదాయక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. “అక్కడ వైద్యులు అతనికి ఇంజెక్షన్ ఇచ్చి, కాసేపు సెలైన్ డ్రిప్ పెట్టారు. కానీ మధ్యాహ్నం 12:30 గంటలకు, అతన్ని బోటాద్ లోని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళమని వారు చెప్పా రు," అని  ఆమె గుర్తు చేసుకున్నారు.

జిల్లా ఆసుపత్రి 45 నిమిషాల దూరంలో ఉంది. ప్రయాణంలో ఉన్నంతసేపూ వాస్‌రామ్ ఛాతీలో నొప్పిగా ఉందని చెప్తూనేవున్నారు. “ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందన్నాడతను. వాంతులు కూడా చేసుకున్నాడు,” గౌరి తెలిపారు.

బోటాద్ జిల్లా ఆసుపత్రిలోని వైద్యులు ఎక్కడ ఏం పొరపాటు జరిగిందో ఆమెకు చెప్పలేదు. ఎలాంటి సమాచారాన్నీ ఇవ్వలేదనీ, ఏమైందని వారిని అడిగితే తనను వార్డు వదిలి వెళ్ళిపొమ్మన్నారనీ ఆవిడ వాపోయారు.

డాక్టర్లు తన కొడుకు ఛాతీని పంప్ చేయడాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు గౌరి. మద్యం అతన్ని ఆ స్థితికి తీసుకువచ్చిందని ఆమెకు తెలుసు. కానీ అది ఏ మేరకు అతనికి నష్టం కలిగిస్తుందో మాత్రం ఆమెకు తెలియదు. “ఏం జరిగిందని నేను వారిని అడుగుతూనే ఉన్నాను. కానీ వారు నాకు ఏ సమాధానం ఇవ్వలేదు. మీ కొడుకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, అది చెడ్డ వార్త అయినా సరే, అసలు సమస్య ఏంటనేది డాక్టర్లు మీతో చెప్పాలనే కోరుకుంటారు కదా,” ఆమె అన్నారు.

రోగుల పట్ల, వారి బంధువుల పట్ల – ముఖ్యంగా పేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తుల పట్ల – వైద్యుల నిర్లక్ష్య వైఖరి అసాధారణమేమీ కాదు. “ఏదేమైనప్పటికీ, పేదలను మాత్రం ఎవరూ పట్టించుకోరు,” గౌరి అన్నారు.

రోగికి, లేదా వారి ప్రతినిధికి “అనారోగ్య స్వభావం, అనారోగ్య కారణాలకు సంబంధించిన సమాచారాన్ని” పొందే హక్కు ఉందని చార్టర్ ఆఫ్ పేషెంట్స్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ (ఆగస్టు 2021లో నేషనల్ కౌన్సిల్ ఫర్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఆమోదించింది) చెబుతోంది. సామాజిక మూలాల (ఆర్థిక స్థితి లేదా కులం వంటివి) ఆధారంగా, చికిత్సలో ఎలాంటి వివక్ష ఉండకూడదని కూడా ఆ అధికారపత్రం చెబుతోంది..

Gauri in her hut in Rojid village of Botad district. From her village alone, 11 people died in the hooch tragedy last year
PHOTO • Parth M.N.

బోటాద్ జిల్లా రోజిద్ గ్రామంలో ఉన్న తన గుడిసెలో గౌరి. ఒక్క ఆమె గ్రామంలోనే, గతేడాది కల్తీ మద్యం తాగి 11 మంది చనిపోయారు

గౌరిని వార్డు నుండి బయటకు వెళ్ళమని చెప్పిన కొన్ని గంటల తరువాత, జిల్లా ఆసుపత్రి వైద్యులు వాస్‌రామ్‌ను బోటాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళమని – అతని కుటుంబానికి ఏ విషయం చెప్పకుండానే - చెప్పారు. అక్కడికి తరలించిన తరువాత, సాయంత్రం 6:30 గంటలకు వాస్‌రామ్ మృతి చెందారు.

“మద్యపాన నిషేధం అనేది ఒక తమాషా. గుజరాత్‌లో అందరూ తాగుతారు. కానీ పేదలు మాత్రమే దాని వల్ల చనిపోతారు,” గౌరి అన్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా గుజరాత్‌లో కల్తీ మద్యం ఒక తీవ్ర ప్రజారోగ్య సమస్యగా ఉంది. విషపూరితమైన మద్యం తాగి, కొన్ని సంవత్సరాలుగా వందలమంది చనిపోయారు. జులై 2009లో, అహ్మదాబాద్ జిల్లాలో నకిలీ మద్యం వల్ల 150 మంది మరణించిన దుర్ఘటన అత్యంత దారుణమైనది. అలాగే, రెండు దశాబ్దాల క్రితం, మార్చి 1989లో, వడోదర జిల్లాలో 135 మంది మరణించారు. 1977లో, అహ్మదాబాద్‌లో, మొదటిసారిగా సామూహిక మరణాలు సంభవించాయి – నగరంలోని సారంగపూర్ దౌలత్‌ఖానా ప్రాంతంలో 101 మంది మరణించారు. ప్రతీ దుర్ఘటనలో, అధిక గాఢత కలిగిన మిథైల్ ఆల్కహాల్ (మిథనాల్)ను మద్యంలో వినియోగించారని గుర్తించారు.

మద్యం తయారీకి నిర్దిష్టమైన ప్రమాణాలంటూ ఏమీ లేవు. దేశీయ మద్యాన్ని సాధారణంగా బెల్లపు మడ్డి(మొలాసెస్)ని లేదా మొక్కల సారాలను పులియబెట్టడం (fermentation) ద్వారా, లేదా బట్టీలో మరగబెట్టడం (distillation) ద్వారా తయారుచేస్తారు. కానీ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, పారిశ్రామిక ఇథైల్ ఆల్కహాల్‌ని (ఇది హ్యాండ్ శానిటైజర్‌లలో కూడా ఉంటుంది), అత్యంత విషపూరితమైన మిథనాల్‌ను కూడా కల్తీ మద్యం వ్యాపారులు వినియోగిస్తుంటారు.

మనకి కనిపించేది గోరంతే కానీ కనిపించనిది కొండంత ఉందని పరిశీలకులు అంటున్నారు.

అక్రమ మద్యం చెలామణి అనేది పోలీసుల, రాజకీయ నాయకుల (కల్తీ మద్యం వ్యాపారులతో పాటు) ప్రమేయంతో జరిగే వ్యాపారమని అహ్మదాబాద్‌లోని సీనియర్ సామాజిక శాస్త్రవేత్త ఘనశ్యామ్ షా చెప్పారు.

కల్తీ మద్యం చావుల గురించి పరిశోధించడానికి, నిరోధించడానికి ప్రభుత్వం వరుసగా అనేక విచారణ కమిషన్‌లను ఏర్పాటుచేసింది. వీటిలో న్యాయమూర్తి కె.ఎం. మెహతా అధ్యక్షతన ఏర్పాటు చేసిన లఠ్ఠా(నాటుసారా) విచారణ కమిషన్ కూడా ఉంది. 2009 సంఘటన తరువాత, మద్యపాన నిషేధ విధానం ఎంత అసమర్థంగా అమలవుతుండోననే విషయాన్ని ఇది బట్టబయలు చేసింది.

Alcohol poisoning has been a public health problem in Gujarat for more than four decades. Consumption of toxic alcohol has killed hundreds over the years. The worst of the hooch tragedies took place in July 2009
PHOTO • Parth M.N.

నాలుగు దశాబ్దాలకు పైగా గుజరాత్‌లో నకిలీ మద్యం ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతూ వస్తోంది. విషపూరితమైన ఈ మద్యం గత కొన్ని సంవత్సరాలుగా వందల మందిని బలి తీసుకుంది. 2009 జూలైలో అత్యంత దారుణమైన నాటుసారా విషాదం జరిగింది

గుజరాత్‌లో, ఆరోగ్య కారణాల దృష్ట్యా మాత్రమే మద్యం సేవించడాన్ని అనుమతిస్తారు, అది కూడా వైద్యుడు సూచించినట్లయితేనే. అయితే, రాష్ట్రం బయట నుంచి వచ్చే సందర్శకులకు మద్యం అందుబాటులో ఉంటుంది. వారు అధీకృత దుకాణాలలో మద్యం కొనుగోలు చేయడానికి తాత్కాలిక అనుమతిని పొందవచ్చు.

“మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలవారికి నిర్ణయించిన ధరల మేరకు మద్యం అందుబాటులో ఉంటుంది. పేదలు ఆ ధరలను భరించలేరు కాబట్టి, గ్రామాలలో తయారుచేసే చౌక మద్యం కోసం వెళతారు,” అని షా వివరించారు.

కల్తీ మద్యం వినియోగదారుడిని వెంటనే చంపకపోయినా కంటిచూపును దెబ్బతీస్తుందనీ, మూర్ఛలు వచ్చేలా చేస్తుందనీ, మెదడుకీ కాలేయానికీ శాశ్వత నష్టం కలిగించవచ్చనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అయితే, ఈ ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి గుజరాత్‌లో ఇంకా తగినన్ని ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను కల్పించలేదు.

ముందుగా, జిల్లా ఆసుపత్రుల్లో – గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల కోసం నడిపే అత్యవసర సంరక్షణా కేంద్రాలు – తగినన్ని పడకలు లేవు. దేశంలోని జిల్లా ఆసుపత్రుల పనితీరుపై సమర్పించిన నీతి ఆయోగ్-2021 నివేదిక ప్రకారం, గుజరాత్‌లో ప్రతి లక్ష జనాభాకు సగటున 19 పడకలు ఉన్నాయి. ఇది జాతీయ సగటు 24 కంటే కూడా తక్కువ.

జిల్లా, ఉప-జిల్లా ఆసుపత్రుల్లో, వైద్యుల కొరత ఉంది. గ్రామీణ గుజరాత్‌లో మొత్తం 74 మంది వైద్యులు ఉన్నారు. రూరల్ హెల్త్ స్టాటిస్టిక్స్ (2020-21) ప్రకారం, అవసరమైన 799 మంది వైద్యులకు గాను 588 మంది మాత్రమే ఉన్నారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 333 సాముదాయక ఆరోగ్య కేంద్రాలలో (సిఎచ్‌సిలు), 1,197 స్పెషలిస్ట్ డాక్టర్ల – అంటే సర్జన్లు, ప్రసూతి వైద్యులు-గైనకాలజిస్టులు, వైద్యులు, పిల్లల వైద్యులు – కొరత ఉంది.

Karan Veergama in his home in Rojid. He is yet to come to terms with losing his father, Bhupadbhai
PHOTO • Parth M.N.
Karan Veergama in his home in Rojid. He is yet to come to terms with losing his father, Bhupadbhai
PHOTO • Parth M.N.

రోజిద్‌లోని తన ఇంట్లో కరణ్ వీర్‌గామా. తన తండ్రి భూపద్‌భాయ్‌ని కోల్పోయిన అతను ఇంకా ఆ దుఃఖం నుండి తేరుకోలేదు

రోజువారీ కూలీగానూ, వ్యవసాయ కూలీగానూ పనిచేసే కరణ్ వీర్‌గామా అనే 24 ఏళ్ళ యువకుడు జులై 26, 2022న భావ్‌నగర్‌లోని సర్ టీ. పౌర ఆసుపత్రికి తన తండ్రిని తీసుకెళ్ళినప్పుడు, అధిక పనిభారంతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది అతనికి కనిపించారు. “ఆసుపత్రి చాలా రద్దీగా ఉంది. మాకు ఎక్కడికి వెళ్ళాలో అర్థంకాలేదు. సిబ్బంది తీరికలేకుండా ఉండడంతో ఏం చేయాలో ఎవరికీ తెలియలేదు,” అని ఆయన అన్నారు.

2009లో జరిగిన కల్తీ మద్యం మరణాలు ప్రారంభమైన తొలి గంటల్లో విషాదాన్ని ఎదుర్కోవడానికి శాఖకు ఎటువంటి అత్యవసర సంసిద్ధత లేదని లఠ్ఠా కమీషన్ ఆఫ్ ఎంక్వైరీ నివేదిక పేర్కొంది. విషపూరిత మిథనాల్ వినియోగం విషయంలో చికిత్సకు సంబంధించిన ఎలాంటి ప్రోటోకాల్ లేకపోవడాన్ని కూడా కమిషన్ ఎత్తి చూపింది.

కరణ్ తండ్రి భూపద్‌భాయ్(45), ఒక వ్యవసాయ కూలీ. రోజిద్‌లో, కల్తీ మద్యం తాగి ఆసుపత్రి పాలైన చాలా మందిలో ఆయన కూడా ఒకరు. ఆ ఉదయం 6 గంటల సమయంలో అతనికి అసౌకర్యంగా అనిపించి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు.

కరణ్ అతన్ని బర్వాలా సాముదాయక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లినప్పుడు, అక్కడి సిబ్బంది భూపద్‌భాయ్ ఆరోగ్య పరిస్థితిని పరీక్ష చేయకుండానే వెంటనే భావ్‌నగర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళమని సూచించారు. ఏదో ఒక బ్యాచ్ మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వారికి తెలుసు. “అక్కడ సమస్య ఏమిటో వారికి తెలుసు. అందుకే సమయం వృధా చేయకుండా, సిఎచ్‌సి సిబ్బంది మమ్మల్ని భావ్‌నగర్‌కు వెళ్ళమని చెప్పారు. సౌకర్యాలపరంగా చూసినట్లయితే, అదే మాకున్న ఉత్తమ ఎంపిక,” అని కరణ్ చెప్పాడు..

కానీ 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఆసుపత్రికి వెళ్ళడానికి రెండు గంటలు ప్రయాణం చేయాలి. “రోజిద్ నుండి భావ్‌నగర్ వెళ్ళే రహదారి ఏమంత గొప్పగా ఉండదు. అందుకే రెండు గంటలు పడుతుంది,” ఆ ప్రాంతంలో 108 అంబులెన్స్ నడిపే పరేశ్ దులేరా వివరించారు.

తాను భూపద్‌భాయ్‌ని తీసుకురావడానికి వెళ్ళినపుడు, స్ట్రెచర్ అవసరం పడలేదని దులేరా గుర్తుచేసుకున్నారు. “అతను ఎలాంటి సహాయం లేకుండానే అంబులెన్స్ లోపలికి అడుగు పెట్టాడు.”

పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్య నమూనాలో పనిచేసే ఆ అంబులెన్స్ సర్వీస్, అత్యవసర సమయంలో రోగుల సంరక్షణ కోసం కొన్ని సేవలు కూడా అందిస్తుంది. ఒక సహాయక నర్సు, ఒక సాధారణ నర్సు అందులో మంత్రసానులుగా పని చేస్తారు. వాహనంలో ఆక్సిజన్ సిలిండర్, సెలైన్ సీసాలు, ఇంజెక్షన్లు కూడా ఉంటాయని దులేరా తెలిపారు.

‘I need to know how or why his [Bhupadbhai's] health deteriorated so rapidly,’ says Karan
PHOTO • Parth M.N.

‘అతని (భూపద్‌భాయ్) ఆరోగ్యం ఇంత వేగంగా ఎలా, ఎందుకు క్షీణించిందో నేను తెలుసుకోవాలి,’ కరణ్ అన్నాడు

ఆసుపత్రిలో గందరగోళం మధ్య, భూపద్‌భాయ్‌ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. “సిబ్బంది అతన్ని లోపలికి తీసుకువెళ్ళారు కానీ అక్కడున్న రద్దీ కారణంగా మేం ఏ ప్రశ్నలూ అడగలేకపోయాం. ఒక గంట తరువాత, అతను మరణించాడని మాకు చెప్పారు. మేం నమ్మలేకపోయాం,” అంబులెన్స్‌లోకి ప్రవేశించినప్పుడు తన తండ్రి బాగానే ఉన్నాడని పదేపదే చెప్పాడు కిరణ్.

“అతను వెళ్ళిపోయాడని నాకు తెలుసు. అయితే, అతని ఆరోగ్యం అంతలా ఎలా, ఎందుకు క్షీణించిందో నేను తెలుసుకోవాలి. మాకు (కుటుంబానికి) కొంత వివరణ కావాలి. ఈ బాధ నుండి విముక్తి కావాలి,” అన్నాడు కిరణ్. తన తండ్రి మరణానికి గల కారణం ఏంటో అతనికి ఎవరూ వివరించలేదు.

భూపద్‌భాయ్ చనిపోయి రెండు నెలలైనా, ఇంకా ఆ కుటుంబ సభ్యులకు పోస్టుమార్టమ్ నివేదిక అందలేదు.

జూలై 27, 2022 నాటికి పోలీసులు మిథనాల్‌ను సంపాదించడం మొదలుకొని, నకిలీ మద్యాన్ని తయారు చేయడం, దానిని అమ్మడం వరకూ చేసిన ఆరోపణలతో 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జులై 29న , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కల్తీ మద్య వ్యాపారులపై పోలీసులు దాడులు చేపట్టారు. దాదాపు 2,400 మందిని అరెస్టు చేసి, రూ.1.5 కోట్ల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల ఈ చర్య ప్రభావం బోటాద్‌లో మరోలా కనిపించడం మొదలైంది. గతంలో రూ.20కి అమ్మిన ఇంట్లో తయారుచేసిన మద్యం ప్యాకెట్‌ను ఇప్పుడు రూ.100కి అమ్ముతున్నారు.

పార్ధ్ ఎం.ఎన్., ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి లభించే స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర హక్కులపై నివేదికలు రాస్తారు. ఈ నివేదికలోని విషయాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఎలాంటి సంపాదకీయ ఆంక్షలు పెట్టలేదు.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Vinutha Mallya

Vinutha Mallya is a journalist and editor. She was formerly Editorial Chief at People's Archive of Rural India.

Other stories by Vinutha Mallya
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi