శాంతీదేవి కోవిడ్-19 తో మరణించిందని నిరూపించడానికి మరణ ధృవీకరణ పత్రం కానీ, మరే ఇతర మార్గం కానీ లేదు! అయితే, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులు మాత్రం అది కోవిడ్ అనే నిర్ధారిస్తున్నాయి.

ఏప్రిల్ 2021 లో, కోవిడ్-19 రెండవ తరంగం దేశం అంతటా విజృంభిస్తున్నప్పుడు, నలభయ్యో పడిలో ఉన్న శాంతీదేవి అనారోగ్యానికి గురయ్యారు. ఒకదాని తర్వాత ఒకటి లక్షణాలు కనిపించాయి: మొదట దగ్గు, జలుబు; మరుసటి రోజు జ్వరం. "గ్రామంలో దాదాపు అందరూ ఒకే సమయంలో అనారోగ్యం పాలయ్యారు. దాంతో మేము తనను ఝోలా ఛాప్ డాక్టర్ (నాటు వైద్యుడు) దగ్గరికి తీసుకెళ్ళాం," అని ఆమె 65 ఏళ్ల అత్తగారు కళావతి దేవి చెప్పారు.

ఉత్తర ప్రదేశ్‌లోని దాదాపు ప్రతి గ్రామంలో ఝోలా ఛాప్ డాక్టర్లు లేదా నాటు వైద్యులు కనిపిస్తారు. ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో, నాటు వైద్యులు సులభంగా అందుబాటులో ఉండడం చేత, కొరోనా మహారోగం వ్యాపించినప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వారినే ఎక్కువగా ఆశ్రయించారు. "మమ్మల్ని (క్వారంటైన్) సెంటర్‌లో ఉంచుతారని భయపడి, మేమెవరం ఆస్పత్రికి వెళ్ళలేదు. ఆ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడాయి; పడకలు అందుబాటులో లేవు. అందుకే, మేము ఝోలా ఛాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం," అని వారణాసి జిల్లాలోని దల్లీపుర్ గ్రామంలో నివసించే కళావతి అన్నారు.

కానీ ఎలాంటి శిక్షణ, అర్హత లేని ఈ 'వైద్యులు' తీవ్ర అనారోగ్య సమస్యలకు సరైన చికిత్స అందించలేరు.

ఝోలా ఛాప్ వైద్యుణ్ణి సందర్శించిన మూడు రోజుల తర్వాత, శాంతీదేవికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. భయాందోళనలకు గురైన ఆమె భర్త మునీర్, కళావతి, ఇతర కుటుంబ సభ్యులు, శాంతిని వెంటనే వారణాసి పింద్రా బ్లాక్‌లో తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. "కానీ ఆ ఆస్పత్రి సిబ్బంది ఆమె (పరిస్థితి)ని చూసి, బ్రతకడం కష్టమని చెప్పారు. దాంతో తనను ఇంటికి తీసుకువచ్చి, ఝాడ్ - ఫూంక్ (తాంత్రిక వైద్యం) చేయించాం," అని చీపురుతో వ్యాధులను తరిమికొట్టే ఒక పురాతన, అశాస్త్రీయ పద్ధతి గురించి కళావతి ప్రస్తావించారు.

ఆ వైద్యం పని చేయలేదు; అదే రాత్రి శాంతి మరణించారు!

Kalavati with her great-grandchildren at home in Dallipur. Her daughter-in-law Shanti died of Covid-like symptoms in April 2021
PHOTO • Parth M.N.

దల్లీపుర్లోని తన ఇంట్లో తన మనవరాళ్లతో కళావతి; ఆమె కోడలు శాంతి ఏప్రిల్ 2021 లో కోవిడ్ లాంటి లక్షణాలతో మరణించారు

అక్టోబర్ 2021 లో, కోవిడ్-19 తో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్-గ్రేషియా (నష్టపరిహారం) ఇస్తానని ప్రకటించింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన దాదాపు నాలుగు నెలల తర్వాత, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది. ఇందులో భాగంగా, రూ.50,000 ఆర్థిక సహాయం పొందేందుకు అర్జీలు పెట్టుకోవడానికి కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. కానీ, కళావతి దేవి అర్జీ పెట్టలేదు. అసలు ఆమెకు ఆ ఉద్దేశ్యమే లేదు!

ఆ డబ్బుకు అర్జీ పెట్టుకోవాలంటే, శాంతి మరణానికి కోవిడ్-19 కారణమని పేర్కొంటూ మరణ ధృవీకరణ పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించాలి. మొదట్లో, వ్యాధి నిర్ధారణ అయిన 30 రోజుల్లోపు మరణం సంభవించి ఉండాలన్న నిబంధన ఉండేది. కానీ తర్వాత, 30 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకొని, డిశ్చార్జ్ అయిన తర్వాత గనుక ఒక వ్యక్తి మరణిస్తే, అది కోవిడ్ మరణంగా పరిగణించబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ఒకవేళ మరణ ధృవీకరణ పత్రంలో కోవిడ్ కారణమని పేర్కొనకపోతే, RT-PCR లేదా యాంటిజెన్ పరీక్ష లేదా ఇన్‌ఫెక్షన్‌ని నిరూపించే పరీక్షా ఫలితాలేవైనా సమర్పించవచ్చు. కానీ, శాంతీదేవి కుటుంబానికి ఇవేవీ సహాయం చేయలేవు.

మరణ ధృవీకరణ పత్రం లేదా కొరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షా ఫలితం లేదా ఆస్పత్రి డిశ్చార్జ్ పత్రం లేకుండా, ఎక్స్-గ్రేషియా పొందే ఆస్కారం శాంతి కుటుంబానికి లేదు.

ఏప్రిల్ నెలలో, ఆమె మృతదేహాన్ని దల్లీపుర్ సమీపంలో ఉన్న నదీ తీరంలో దహనం చేశారు. "మృతదేహాన్ని కాల్చడానికి తగినంత కలప దొరకలేదు. దహన సంస్కారాల కోసం అక్కడ ఎన్నో శవాలు బారులు తీరి ఉన్నాయి. మేము మా వంతు (శాంతిని దహనం చేయడానికి) కోసం వేచి ఉండి, అన్నీ ముగించుకున్నాక ఇంటికి తిరిగి వచ్చాము," అని శాంతి మామ లల్లుర్, 70, బాధపడ్డారు.

Lullur, Shanti's father-in-law, pumping water at the hand pump outside their home
PHOTO • Parth M.N.

తమ ఇంటి బైటున్న చేతిపంపు దగ్గర నీళ్లు పడుతున్న శాంతి మామగారు లల్లుర్

మార్చి 2020 చివరిలో, రెండవ తరంగం (ఏప్రిల్ నుండి జూలై 2021 వరకు) ప్రారంభమైనప్పటి నుండి, కోవిడ్-19 మహమ్మారి కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి. జూన్ 2020-జూలై 2021 లో 32 లక్షల మరణాలు, ఏప్రిల్-జూలై 2021 లో 27 లక్షల మరణాలు సంభవించాయని "సైన్స్" అనే విజ్ఞాన పత్రికలో ప్రచురించబడిన (జనవరి 2022) ఒక అధ్యయనం పేర్కొంది. భారతదేశం, కెనడా, ఇంకా అమెరికాకు సంబంధించిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. సెప్టెంబరు 2021 నాటికి, భారతదేశంలో  సంచిత కోవిడ్ మరణాలు, అధికారికంగా నివేదించబడిన దానికంటే 6-7 రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆ పరిశోధకులు తమ విశ్లేషణలలో తెలిపారు.

భారతదేశపు అధికారిక లెక్కలలో, కోవిడ్ మరణాలు గణనీయంగా తక్కువగా నమోదు చేయబడ్డాయని కూడా ఆ పరిశోధకుల బృందం తెలిపింది. కానీ, భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఖండించింది .

ఫిబ్రవరి 7, 2022 నాటికి, భారతదేశం యొక్క అధికారిక కోవిడ్ మరణాల సంఖ్య 5,04,062 (లేదా 0.5 మిలియన్లు). దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో అండర్‌కౌంటింగ్‌ (అసలు సంఖ్య కంటే తక్కువగా లెక్కించడం) నమోదవుతుండగా, ఉత్తర్ ప్రదేశ్లో ఇది గమనించదగ్గ స్థాయిలో ఉంది.

ఉత్తర్ ప్రదేశ్లోని 75 జిల్లాలలోని కోవిడ్-19 మరణాలు చూసినట్లైతే, 24 జిల్లాల్లో, అధికారిక సంఖ్య కంటే 43 రెట్లు ఎక్కువ నమోదయ్యాయని ఆర్టికల్-14.కామ్‌ లోని ఒక నివేదిక తెలిపింది. జూలై 1, 2020 నుండి మార్చి 31, 2021 వరకు నమోదైన మరణాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. ఈ అదనపు మరణాలన్నిటికీ కొరోనా వైరస్ కారణమని చెప్పకపోయినా, ఈ నివేదిక ప్రకారం, "సగటు సాధారణ మరణాలలో ఉన్న విస్తారమైన వ్యత్యాసం మరియు కొన్ని ప్రాంతాలలో నమోదైన అధిక మరణాలు, అధికారిక కోవిడ్-19 మరణాలుగా మార్చి 2021 చివరి నాటికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యపై (4,537) అనేక అనుమానాలు రేపుతున్నాయి. మే నెలలో బైటికొచ్చిన సామూహిక సమాధుల చిత్రాలు , గంగా నదిలో తేలియాడుతున్న మృతదేహాల గురించి వచ్చిన నివేదికలు కూడా లెక్కించబడని అనేక మరణాలను సూచించాయి."

అయితే, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం కోసం మార్గదర్శకాలను ప్రకటించినప్పుడు, రాష్ట్రంలో 22,898 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఆర్ధిక సహాయం అత్యంత అవసరమైన శాంతి లాంటి ఎన్నో కుటుంబాలను పాలకులు పట్టించుకోలేదు.

Shailesh Chaube (left) and his mother Asha. His father Shivpratap died of Covid-19 last April, and the cause of death was determined from his CT scans
PHOTO • Parth M.N.
Shailesh Chaube (left) and his mother Asha. His father Shivpratap died of Covid-19 last April, and the cause of death was determined from his CT scans
PHOTO • Parth M.N.

శైలేష్ చౌబే (ఎడమ వైపు), అతని తల్లి ఆశా; అతని తండ్రి శివప్రతాప్ గత ఏప్రిల్‌ నెలలో కోవిడ్-19 తో మరణించారు. అతని CT స్కాన్‌ల ద్వారా మరణానికి కారణం కనుగొనబడింది

అవసరమైన పత్రాలు లేకుండా ఏ కుటుంబమూ నష్టపరిహారం పొందలేదని ఉత్తర్ ప్రదేశ్ సమాచార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహ్గల్ PARIకి వివరించారు. "వేరే కారణాల వల్ల కూడా ప్రజలు చనిపోతుంటారు. కాబట్టి, ‘ఒక వ్యక్తిది కోవిడ్ మరణమా? కాదా?’ అన్న విషయం ధృవీకరించబడకుండా, మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయబడదు. అందుకే గ్రామీణ ప్రాంతాలలో కూడా పరీక్షలు జరుగుతున్నాయి."

కానీ అలా జరగలేదు! ఎందుకంటే, రెండవ కోవిడ్ వేవ్ సమయంలో ఉత్తర్ ప్రదేశ్లోని మారుమూల గ్రామాలలో కొరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఆలస్యంగా నిర్వహించబడ్డాయి. మే 2021 లో, కోవిడ్ నిర్ధారణ పరీక్షలను క్రమంగా తగ్గించినందుకు, రెండవ తరంగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయినందుకు రాష్ట్ర ప్రభుత్వంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నమూనా సేకరణలో తార్కిక కొరతను ఒక కారణంగా పేర్కొన్నప్పటికీ, అధికారుల ఆదేశాల మేరకే తాము కొరోనా నిర్ధారణ పరీక్షలను తక్కువ సంఖ్యలో నిర్వహించినట్లు ప్యాథాలజీ ల్యాబ్‌లు ఆరోపించాయి.

విచిత్రంగా, పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు కూడా పరీక్షా సౌకర్యాలు అందుబాటులో లేవు. గత ఏడాది ఏప్రిల్ 15 న, లక్షణాలు కనబడడంతో, వారణాసి నగరంలో నివసించే 63 ఏళ్ల శివప్రతాప్ చౌబే కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. అయితే, 11 రోజుల తర్వాత, శివప్రతాప్ నమూనాలను మళ్లీ సేకరించాలని సదరు ల్యాబ్ అతని కుటుంబాన్ని కోరింది.

కానీ ఇక్కడే ఒక సమస్య ఏర్పడింది: ఏప్రిల్ 19 న శివప్రతాప్ మరణించారు!

అనారోగ్యానికి గురైన మొదట్లో, శివప్రతాప్ ను, అతని ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. "ఆ ఆస్పత్రిలో పడకలు అందుబాటులో లేవు. దాని కోసం మేము కనీసం తొమ్మిది గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. కానీ, మాకు వెంటనే ఆక్సిజన్ బెడ్ అవసరమైంది," అని ఆ చేదు జ్ఞాపకాలను శివప్రతాప్ 32 ఏళ్ల కొడుకు శైలేష్ చౌబే నెమరు వేసుకున్నారు.

చివరికి, కొన్ని ఫోన్ కాల్స్ చేసిన తర్వాత, వారణాసికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాబత్పుర్ గ్రామంలో (పింద్రా బ్లాక్) ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్ దొరికింది. "కానీ రెండు రోజుల తర్వాత, అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన చనిపోయారు," అని శైలేష్ బాధపడ్డారు.

శివప్రతాప్ CT స్కాన్‌ల ఆధారంగా, అతనిది కోవిడ్ మరణమని ఆ ఆస్పత్రి ధృవీకరించింది. దాని ఆధారంగా నష్టపరిహారం పొందే అవకాశం ఉండడంతో, డిసెంబర్ 2021 చివరి వారంలో, ఎక్స్-గ్రేషియా కోసం దరఖాస్తును సమర్పించారు శైలేష్. తన తండ్రి చికిత్స కోసం చేసిన అప్పును చెల్లించడంలో ఆ డబ్బు సహాయపడుతుందని అతని ఆశ. "మేము రెండెసివీర్ ఇంజెక్షన్ ను బ్లాక్ మార్కెట్‌లో రూ.25,000 లకు కొనవలసి వచ్చింది. వైద్య పరీక్షలు, హాస్పిటల్ బెడ్, మందులకు కలిపి దాదాపు రూ.70,000 ఖర్చయ్యాయి. దిగువ మధ్యతరగతికి చెందిన మాకు, ప్రభుత్వం ఇచ్చే ఆ రూ.50,000 చాలా ముఖ్యమవుతుంది," అని బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న శైలేష్ అన్నారు.

Left: Lullur says his son gets  work only once a week these days.
PHOTO • Parth M.N.
Right: It would cost them to get Shanti's death certificate, explains Kalavati
PHOTO • Parth M.N.

ఎడమ వైపు: ఈ రోజుల్లో తన కుమారుడికి వారానికి ఒక రోజు మాత్రమే పని దొరుకుతోందని లల్లుర్ తెలిపారు. కుడి వైపు: శాంతి మరణ ధృవీకరణ పత్రం పొందాలంటే చాలా ఖర్చు అవుతుందని కళావతి అన్నారు

ముసహర్ వర్గానికి చెందిన శాంతి కుటుంబానికి కూడా ఆ మొత్తం చాలా గణనీయమైనది. పేద, అట్టడుగు వర్గాలలో ఒకరైన ముసహర్లు ఉత్తర్ ప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులం కిందకి వస్తారు. వాళ్లకి భూమి ఉండదు; కూలి పనే జీవనాధారం.

శాంతి భర్త 50 ఏళ్ల మునీర్, నిర్మాణ స్థలాల్లో కూలి పనిచేస్తూ రోజుకు రూ.300 సంపాదిస్తున్నారు. రూ.50,000 సంపాదించాలంటే, అతను 166 రోజులు (లేదా 23 వారాలు) కష్టపడవలసి ఉంటుంది. కొరోనా మహారోగం కారణంగా, వారానికి ఒక రోజు మాత్రమే పని దొరుకుతోంది. ఈ విధంగా అంత పెద్ద మొత్తాన్ని సంపాదించాలంటే, మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుందని మునీర్ తండ్రి లల్లుర్ వాపోయారు.

ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని హామీ ఇచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA), ఇప్పుడు మునీర్ లాంటి కూలీలకు తగినంత ఉపాధిని కల్పించలేకపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22), ఫిబ్రవరి 9 నాటికి, ఉత్తర్ ప్రదేశ్లో సుమారు 87.5 లక్షల కుటుంబాలు ఈ పథకం కింద పని కల్పించాలని కోరాయి. ఇప్పటివరకు 75.4 లక్షల కుటుంబాలకు ఉపాధి లభించింది; అయితే అందులో కేవలం 3,84,153 కుటుంబాలు మాత్రమే – అంటే 5 శాతం మాత్రమే– 100 రోజుల పనిని పూర్తి చేశాయి.

ఉపాధి ఎప్పుడూ క్రమం తప్పకుండా లేదా స్థిరంగా అందుబాటులో ఉండదని వారణాసిలో పీపుల్స్ విజిలెన్స్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ కు చెందిన 42 ఏళ్ల కార్యకర్తగా పనిచేస్తున్న మంగ్లా రాజ్‌భర్ చెప్పారు. "పని చాలా అరుదుగా, తాత్కాలికంగా దొరుకుతుంది; దానిని కార్మికులు దశలవారీగా పూర్తి చేయవలసి వస్తుంది. ఈ పథకం కింద స్థిరమైన పనిని అందించడానికి రాష్ట్రం దగ్గర ఎటువంటి ప్రణాళికా లేదు."

ప్రతిరోజూ ఉదయం శాంతి-మునీర్‌ల నలుగురు కొడుకులు – ఇరవయ్యో పడిలో ఉన్నారు – పని వెతుక్కోడానికి బయటకు వెళ్తారు. కానీ, వారు తరచుగా ఖాళీ చేతులతో తిరిగి ఇంటికి  వస్తున్నారని కళావతి చెప్పారు. "ఎవరికీ ఏ పనీ దొరకడం లేదు. కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుండి, మేము చాలా సార్లు పస్తులు ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్‌తో ఎలాగోలా బ్రతుకుతున్నాం కానీ, అది మాకు నెలంతా రాదు."

"శాంతి మరణ ధృవీకరణ పత్రం పొందడానికి మాకు రూ.200-300 వరకు ఖర్చు అవుతుంది. మా పరిస్థితిని వివరించడానికి మేము చాలా మందిని కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడెవరూ మాతో సరిగ్గా మాట్లాడరు," అని తమకున్న అవాంతరాలను కళావతి వివరించారు. "కానీ, ఆ నష్టపరిహారం మాకెంతో ఉపయోగపడి ఉండేది!"

పార్ధ్ ఎం.ఎన్., ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి లభించే స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా ప్రజారోగ్యం మరియు పౌర హక్కులపై నివేదికలు రాస్తారు. ఈ నివేదికలోని విషయాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఎలాంటి సంపాదకీయ ఆంక్షలు పెట్టలేదు.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi