నిశ విసురుకుంటూ నేల మీద కూర్చొని ఉన్నారు. వేడిగా ఉన్న ఆ జూన్ మాసపు అపరాహ్ణవేళ ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంది; పొగాకు, ఎండుటాకుల వాసన గాలిని బరువుగా చేస్తోంది. "నేను ఈ వారం చాలా కొద్ది బీడీలు మాత్రమే చేయగలిగాను," 17 కట్టలుగా చుట్టివున్న సుమారు 700 బీడీలను చూపుతూ అన్నారామె. "వీటి విలువ బహుశా రూ. 100 కంటే తక్కువే ఉండవచ్చు,” అని 32 ఏళ్ళ ఈ బీడీ తయారీదారు తన వారం రోజుల పని గురించి చెప్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఈ దామోహ్ జిల్లాలో వెయ్యి బీడీలకు రూ. 150 లభిస్తుంది.

ప్రతి బుధ, శుక్రవారాలు బీడీ తయారీదార్లు తాము చేసిన బీడీ లను తీసుకువస్తారు. అలాగే తర్వాతి చుట్టు బీడీ లను చుట్టడానికి అవసరమైన ముడిపదార్థాలను తీసుకుంటారు. అనేక కర్మాగారాలు దామోహ్ నగర శివార్లలోనే ఉన్నాయి. వాళ్ళు ఠేకేదార్ (కాంట్రాక్టర్లు)లను నియమించుకుంటారు; ఆ కాంట్రాక్టర్లు ఈ పనికోసం శ్రామికులను, ప్రధానంగా మహిళలను, ఏర్పాటుచేసుకుంటారు.

ముడిసరుకును ఇళ్ళకు తీసుకువెళ్ళిన మహిళలు, తమ ఇంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత, కత్తిరించిన పొగాకును తెందూ (తునికి) ఆకులతో చుట్టి, సన్నని దారాలతో చక్కగా బీడీ లను కట్టలుగా కట్టే పనిని ఆ వారమంతా చేస్తారు. ఆ విధంగా వారు సుమారుగా రూ. 10,000-20,000 ఉండే తమ సగటు నెలవారీ గృహ ఆదాయానికి, తమ వంతు ఆదాయాన్ని చేరుస్తారు. ఇది 8-10 మంది సభ్యులున్న కుటుంబాలను పోషించాలి. వీరిలో చాలామంది మహిళలు వ్యవసాయ కూలీలు, లేదా చిన్న కమతాలను కలిగివున్నవారు.

"ఎండిన తెందూ ఆకులను వాటి ఈనెలు పైకి తేలేవరకూ నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని ఒక ఫర్మా (ఇనుప రేకు) ఉపయోగించి చిన్న దీర్ఘచతురస్రాకారపు ముక్కలుగా కత్తిరించాలి. ఆకు లోపల జర్దా (వాసన పొగాకు) పెట్టి ఆకును బీడీ గా చుట్టాలి," వివరించారు నిశ. ప్రతి బీడీ ని అవి వేరు వేరు కంపెనీలకు చెందినవిగా గుర్తించేందుకు వీలుగా రంగు దారంతో కట్టాలి. ఇలా కట్టడం బ్రాండ్ సూచికగా కూడా పనిచేస్తుంది.

వీటిని బీడీ 'కర్మాగారాని'కి విక్రయించడానికి తీసుకువస్తారు. ఆ కర్మాగారం తప్పనిసరిగా బీడీ తయారీ బ్రాండ్‌కు చెందిన సరుకుతయారీ, ప్యాకేజింగ్ యూనిట్, గిడ్డంగి అయివుంటుంది. వారు తాము తెచ్చినవాటిని తమని కర్మాగారానికి తీసుకువెళ్ళే, లేదా నేరుగా చెల్లించే కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. కర్మాగారంలో వాటిని క్రమబద్ధీకరించి, కాల్చి, కట్టలు కట్టి, నిల్వ చేస్తారు.

PHOTO • Priti David
PHOTO • Kuhuo Bajaj

ఛింద్వారా తదితర ప్రాంతాలకు చేరువగా ఉండే అనేక తెందూ అరణ్యాలు బీడీల ఉత్పత్తిలో కీలక భాగమైన తెందూ ఆకుల నిలయాలు. ఈ ఆకుల లోపల పొగాకు ఉంచి బీడీ చుడతారు. కుడి: ఇంటి పనులు చేసుకుంటూనే నిశ బీడీలు చుడతారు

ఇక్కడ బీడీలు చుట్టేవారు ఎక్కువగా ముస్లిమ్ సముదాయానికి చెందినవారు, కానీ దీనిని జీవనోపాధిగా తీసుకున్నవారిలో ఇతర సముదాయాలకు చెందినవారు కూడా ఉన్నారు.

దామోహ్‌లోని దాదాపు 25 కర్మాగారాలు మధ్యప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో 31 శాతం అటవీ విస్తీర్ణంలో ఉన్న అనేక తెందూ అడవులకు సమీపంలో ఉన్నాయి. సివనీ, మండ్లా, సీహోర్, రాయ్‌సేన్, సాగర్, జబల్‌పుర్, కట్నీ, ఛింద్వారాలు తెందూ ఆకులకు పుష్కలమైన వనరులు. బీడీ ల తయారీలో కీలక భాగమైన పొగాకును చుట్టడం కోసం ఈ ఆకులను ఉపయోగిస్తారు.

*****

ఆ వెచ్చని వేసవి మధ్యాహ్నం వేళ, ముదురు రంగుల సల్వార్ కమీజ్‌లు ధరించిన అర డజను మంది మహిళలు తమ బీడీ లను లెక్కపెట్టించుకోవడానికి వేచి ఉన్నారు. వారి మాటలు, ఠేకేదా ర్‌తో వారి వాదనల ధ్వనుల మధ్యలోంచి సమీపంలోని మసీదు నుంచి వస్తోన్న శుక్రవారం నమాజ్ శబ్దాన్ని మీరు వినవచ్చు. స్త్రీలు తమ తస్లా లలో (ఇనుప కడాయి వంటి పాత్రలు) వారం పాటు తాము చేసిన శ్రమ ఫలితాన్ని పెట్టుకొని ఉన్నారు.

అమీనా (అసలు పేరు కాదు) ఆ లెక్కపెట్టటం పట్ల సంతోషంగా లేదు: "ఇంకా చాలానే ( బీడీలు ) ఉన్నాయి, కానీ ఠేకేదార్ లెక్కపెట్టేటప్పుడు వాటిని పనికిరానివిగా తీసేశాడు," అందామె. ఈ మహిళలు తమను బీడీ మజ్దూర్ (కార్మికులు)లుగా ప్రస్తావించుకుంటారు. తాము పడుతున్న శ్రమతో పోలిస్తే 1000 బీడీ లకు రూ. 150 ధర ఇవ్వడం చాలా అన్యాయమని వారంటారు.

"ఈ పని బదులు నేను కుట్టుపని మొదలుపెడతాను. దానివలన ఇంతకంటే ఎక్కువే డబ్బులొస్తాయి," అంటారు దామోహ్‌కు చెందిన బీడీలు తయారుచేసే జాను. అయితే, 14 ఏళ్ళ బాలికగా తాను ఈ పనిని మొదలుపెట్టినపుడు, "నాకేమంత పెద్ద నైపుణ్యం కానీ, మరో అవకాశం కూడా లేవు," అన్నారామె.

PHOTO • Kuhuo Bajaj

వాసన పొగాకు జర్దా (ఎడమ), దీనిని తెందూ ఆకుల్లో చుట్టి బీడీలు (కుడి) తయారుచేస్తారు

గంటల తరబడి గూనిగా వంగి పనిచేయడం వల్ల కార్మికులకు తీవ్రమైన వెన్ను, మెడ సమస్యలతో పాటు చేతులు తిమ్మిరెక్కుతాయి. దాంతో మామూలు ఇంటి పనులను చేయటం కూడా కష్టమవుతుంది. మహిళలకు ఎలాంటి పరిహారం గానీ వైద్య సహాయం గానీ అందదు, ఫ్యాక్టరీ యజమానులు వారి కష్టాలను చిన్నచూపు చూస్తుంటారు: వారిలో ఒకరు ఈ విలేఖరితో మాట్లాడుతూ, "మహిళలు ఉత్తినే ఇంట్లో కూర్చుని బీడీలు కడుతుంటారు," వారికి వచ్చే పని సంబంధిత వ్యాధులను పూర్తిగా విస్మరిస్తూ అన్నారు.

"వారు వారానికి 500 రూపాయల వరకు సంపాదించుకోగలరు," అని అతను చెప్పాడు. ఇంటి ఖర్చులను గడుపుకోవడానికి ఇదొక మంచి 'డీల్' అని అతని ఆలోచన. అయితే ఆయన అంచనా వేసినట్టు వారానికి రూ. 500 రావాలంటే ఒక కార్మికుడు దాదాపు 4,000 బీడీలను తయారుచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వారు అన్ని బీడీలను చేయటానికి ఒక నెల సమయం పడుతోంది.

మేం మాట్లాడిన మహిళలందరూ తాము ఎదుర్కొంటోన్న శారీరక ఒత్తిడీ, గాయాల గురించీ చెప్పారు. ఎడతెగకుండా తడిగా ఉన్న ఆకులను చుడుతూ ఉండడం, నిరంతరం పొగాకుతో సంపర్కం చర్మ సమస్యలకు కూడా దారితీస్తోంది. " హాథ్ ఐసే కట్‌తే హై నిశాన్ తక్ పడ్ జాతే హై [నా చేతినిండా కోతలే, కొన్నిసార్లు అవి మచ్చలుగా మిగిలిపోతాయి కూడా]," పదేళ్ళ పాటు చేసిన పనివలన కాయలు కాచి, బొబ్బలెక్కిన తన చేతులను నాకు చూపిస్తూ అన్నారు ఒక మహిళ.

సీమ (అసలు పేరు కాదు) అనే మరో కార్మికురాలు, తడి ఆకులకు నిరంతరం తాకుతూ ఉండటం వలన వచ్చే ప్రభావం నుంచి బయటపడటానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు, “నిద్రపోయే ముందు నా చేతులకు బోరొలిన్ [ఉపశాంతినిచ్చే లేపనం] పూసుకుంటాను. లేదంటే పొగాకునూ, తడి ఆకులనూ తాకుతూ ఉండటం వలన నా చర్మం పైపొర లేచిపోతుంది.” ఈ 40 ఏళ్ళ మహిళ ఇంకా ఇలా అంటారు, "నేను పొగాకు తినను, కానీ దాని వాసనకే నాకు దగ్గు రావటం మొదలయింది." దాంతో సుమారు 12-13 సంవత్సరాల క్రితం ఆమె ఈ పనిని మానేసి నగరంలో ఇంటి పనిమనిషిగా పని చేయడం ప్రారంభించి, నెలకు రూ. 4,000 సంపాదిస్తున్నారు.

రజియా (అసలు పేరు కాదు), ఆమెకు గుర్తున్నప్పటికంటే ఎక్కువ కాలంగానే బీడీలు చుడుతున్నారు. ఆమె తెందూ ఆకులను తూకం వేస్తోన్న ఠేకేదార్‌ తో మందలిస్తున్నట్టుగా ఇలా అన్నారు: “మీరు మాకు ఎలాంటి ఆకులు ఇస్తున్నారు? వాటితో మేం మంచి బీడీలు ఎలా తయారుచేస్తాం? ఇప్పుడు తనిఖీ చేస్తున్నప్పుడేమో మీరు వాటన్నింటినీ పనికిరావని పక్కన పెట్టేస్తున్నారు."

PHOTO • Kuhuo Bajaj

ప్రతి బుధ, శుక్రవారాలలో ముడి పదార్థాలైన తెందూ ఆకులను, జర్దాను తీసుకువెళ్ళడానికి బీడీ కార్మికులు కర్మాగారానికి వస్తారు

రుతుపవనాల కాలం మరొక ఆందోళన కలిగించే అంశం. " జో వో బారిశ్ కే 4 మహినే లగ్తే థే, మానో పూరీ బీడీ కచ్రే మే చలీ జాతీ థీ [ఈ వానలు పడే నాలుగు నెలల కాలంలో, దాదాపు చేసిన బీడీ లన్నీ చెత్తలోకి పోతాయేమో అనిపిస్తుంది]." తడిగా ఉందే తెందూ ఆకులో చుట్టిన పొగాకు సరిగా ఆరక బూజు పట్టి మొత్తం కట్టను నాశనం చేస్తుంది. “[వర్షాకాలంలో] మా బట్టలే ఆరవు, కానీ ఆ బీడీ లను మాత్రం ఆరబెట్టాలి.” లేదంటే వారికి సంపాదన ఉండదు.

ఠేకేదార్ ఒక బీడీ ని పనికిరానిదని తిరగ్గొట్టినప్పుడు, దాన్ని తయారుచేయడానికి వెచ్చించిన సమయాన్ని కోల్పోవడమే కాకుండా, ఉపయోగించిన ముడి సరుకుల డబ్బును కూడా వారి సంపాదన నుండి మినహాయించుకుంటారు. “ ఖూబ్ ​​లంబీ లైన్ లగ్తీ థీ గిన్వాయీ కే దిన్. జైసే తైసే నంబర్ ఆతా థా, తో తబ్ ఆధా బీడీ తో నికాల్ దేతే థే [ బీడీల ను లెక్కపెట్టించుకోవడానికి చాలా పొడవైన క్యూ ఉంటుంది. చివరకు మా వంతు వచ్చినప్పుడు, ఠేకేదార్లు సగం బీడీల ను పనికిరానివని తిప్పికొట్టేవారు],” అంటూ జాను తమ వంతు కోసం వేచివున్నపుడు కలిగే ఆందోళనను గుర్తుచేసుకున్నారు.

బీడీ ల పొడవు, మందం, ఆకుల నాణ్యత, వాటిని చుట్టటంలో నాణ్యత వంటి అనేక ప్రమాణాల ఆధారంగా బీడీల ను తిప్పికొడతారు. "ఆకులు పెళుసుగా మారి, చుడుతున్నప్పుడు కొద్దిగా చిరిగిపోయినా, లేదా దారాన్ని వదులుగా బిగించినా, బీడీ లను తిప్పికొడతారు," అని అరవై ఏళ్ళు పైబడిన ఒక బీడీ మజ్దూర్ వివరించారు. అలా పనికిరావని తిప్పికొట్టిన బీడీ లను ఠేకేదార్లు తామే ఉంచుకుని తక్కువ ధరకు అమ్ముకుంటారని కార్మికులు చెబుతున్నారు. "కానీ అందుకు మాకు ఎటువంటి పారితోషికం లభించదు. అలాగని ఆ పనికిరావని తిప్పికొట్టిన బీడీలను కూడా మాకు తిరిగి ఇవ్వరు."

*****

బీడీ కార్మికుల సంక్షేమ నిధి చట్టం 1976 (The Beedi Workers Welfare Fund Act, 1976) కింద 1977లో కేంద్ర ప్రభుత్వం బీడీలు తయారుచేసే పనిలో ఉన్నవారందరికీ బీడీ కార్డుల ను తయారుచేయడం ప్రారంభించింది. బీడీ కార్డుల ముఖ్య ఉద్దేశ్యం కార్మికుల గుర్తింపు అయినప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత చికిత్స, ప్రసవ ప్రయోజనాలు, మరణించినవారి అంత్యక్రియల కోసం నగదు సహాయం, కంటి పరీక్షలు, కంటి అద్దాలు, పాఠశాలకు వెళ్ళే పిల్లలకు ఉపకారవేతనాలు, పాఠశాల యూనిఫామ్ గ్రాంట్లు మొదలైన అనేక ప్రభుత్వ పథకాలను పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. బీడీ, పొగచుట్టల తయారీ కార్మికుల (ఉపాధి నిబంధనలు) చట్టం, 1966 [The Beedi and Cigar Workers (conditions of Employment) Act, 1966] ఈ ప్రయోజనాలను పొందేందుకు వారికి ఉపయోగపడుతుంది. ఈ కార్డు ఉన్న బీడీ కార్మికులు నిర్దిష్ట డిస్పెన్సరీల నుండి ఉచితంగా లేదా రాయితీతో కూడిన మందులను పొందడానికి ఈ కార్డును ఎక్కువగా ఉపయోగిస్తారు.

" జ్యాదా కుఛ్ నహీఁ లేకిన్ బదన్ దర్ద్, బుఖార్ కీ దవాయి తో మిల్ జాతీ హై [పెద్దగా ఏం ఉండవు, కానీ కనీసం శరీర నొప్పులు, జ్వరానికి అవసరమైన సాధారణ మందులు దొరుకుతాయి]," అని దామోహ్‌కు చెందిన బీడీ కార్డున్న 30 ఏళ్ళ ఖుష్బూ రాజ్ చెప్పారు. ఆమె 11 సంవత్సరాలుగా తిరుగుతున్నారు, కానీ ఇటీవలే దామోహ్ నగరంలోని ఒక చిన్న గాజులమ్మే దుకాణంలో సేల్స్ అసిస్టెంట్‌గా పని చేయడానికి వెళ్ళిపోయారు.

PHOTO • Kuhuo Bajaj

బీడీ కార్డు కార్మికులకు గుర్తింపునిస్తుంది

కార్డు అనేక ప్రయోజనాలను వాగ్దానం చేస్తుంది, అయితే చాలామంది బీడీ కార్మికులు నిర్దిష్ట డిస్పెన్సరీల నుండి ఉచిత లేదా సబ్సిడీ మందులను పొందడానికి ఈ కార్డును ఉపయోగిస్తారు. దీనిని పొందే ప్రక్రియలో కూడా దోపిడీకి గురవుతున్నారు

కార్డును పొందాలంటే, "అధికారి ముందు మేం కొన్ని బీడీ లను చేసి చూపించాల్సి ఉంటుంది," అంటారు ఖుష్బూ. " సర్కారీ ఆఫీసర్ దేఖ్తే హై కి హంసే సహీ మేఁ బీడీ బనాతీ భీ హై, యా సిర్ఫ్ ఐసే హీ కార్డ్ బన్వా రహే హై [బీడీలు చేయటం మాకు నిజంగా తెలుసా, లేదా ఆ కార్డు ద్వారా ప్రయోజనాలు పొందటం కోసం కార్డు తీసుకుంటున్నామా అనేది ప్రభుత్వ అధికారి చూస్తారు]." అన్నారామె.

"మా కార్డును తయారు చేయించుకుంటే, వారు నిధులలో కోత పెడతారు," తన పాత గ్రామంలో కార్డున్న ఒక మహిళ, జరుగుతున్న అక్రమాల పట్ల వేలెత్తి చూపుతూ అన్నారు. యజమానులు కార్మికుల డబ్బులో కోతపెట్టి, దానిని నిధి కోసం ఉపయోగించారని ఆమె చెప్పారు. 1976 చట్టం కింద ప్రభుత్వం కూడా ఈ నిధికి సమానమైన మొత్తాన్ని అందిస్తుంది. అయితే, కార్మికులు ఇక్కడ పేర్కొన్న కొన్ని పథకాల కింద ఈ డబ్బును వెనక్కి తీసుకోవటమో లేదా బీడీలు చేయడం పూర్తిగా మానేసిన తర్వాత మొత్తం డిపాజిట్‌ను తిరిగి పొందటమో చేయవచ్చు.

రెండు నెలల క్రితం బీడీలు చేయడం మానేసినప్పుడు ఖుష్బూకు ఫండ్ డబ్బులు రూ. 3,000 వచ్చింది. కొంతమంది కార్మికులకు ఈ ఫండ్ పద్ధతి లాభదాయకంగా కనిపిస్తోంది, కానీ చాలామందికి, వారి శ్రమకు రావలసిన తక్షణ వేతనాలు తక్కువగా లభిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతోపాటు, భవిష్యత్తులో ఫండ్ డబ్బు వారికి తిరిగి వస్తుందనే హామీ కూడా లేదు.

బీడీ కార్డు లాభదాయకంగా అనిపించినప్పటికీ, దానిని తయారుచేసే ప్రక్రియపై పర్యవేక్షణ లేకపోవడంతో, కొంతమందిపై దోపిడీకి కూడా దారితీస్తోంది. స్థానిక కేంద్రంలో బీడీ కార్డు కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సాహబ్ (అధికారి) లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటనను గురించి వారిలో ఒకరు వివరించారు. “అతను తన చూపును నాపైనే నిలిపి, నన్ను మరుసటి రోజు రమ్మని అడిగాడు. మరుసటి రోజు అక్కడికి వెళ్ళేటపుడు నేను నా తమ్ముడిని కూడా వెంట తీసుకెళ్ళాను. నీ తమ్ముడిని ఎందుకు తీసుకువచ్చావని అతను నన్ను అడిగాడు, నేను ఒంటరిగా రావాలని సూచించాడు,” అని ఆమె చెప్పారు.

ఆమె కార్డును తయారుచేయడానికి నిరాకరించడంతో, అతను ఆమెను వేధించడం, ఆమె వైపు కన్నార్పకుండా చూడటం చేస్తూనే ఉన్నాడు. “మరో రోజు, నేను ఆ ప్రాంతం గుండా వెళుతుండగా, అతను నన్ను చూసి పిలవడం మొదలెట్టాడు, రచ్చ చేశాడు,” అని ఆమె చెప్పారు. "నేను అవివేకినని అనుకోవద్దు, మీ మురికి ఉద్దేశంతో జతకలవడానికి నేనిక్కడకు రాలేదు. మీరిలాగే దీన్ని కొనసాగిస్తే, నేను మిమ్మల్ని బదిలీ చేయిస్తాను," అంటూ ఆ సంఘటనను వివరిస్తున్నప్పుడు ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి, ఆమె స్వరం హెచ్చింది. " బహుత్ హిమ్మత్ లగీ థీ తబ్ [దీంతో చాలా ధైర్యం వచ్చింది]," అని ఆమె చెప్పారు, "బదిలీ అవ్వకముందు అతను ఇద్దరు ముగ్గురు ఇతర మహిళలతో కూడా అదే పని చేశాడు."

*****

PHOTO • Kuhuo Bajaj
PHOTO • Kuhuo Bajaj

ఎడమ: కట్టలు కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్న చుట్టిన బీడీలు. కుడి: బీడీలను చుట్టటంలో తమ అనుభవాలను గురించి మాట్లాడుతోన్న పూర్వ బీడీ కార్మికులు అనిత (ఎడమ), జైన్‌వతి (కుడి)

తమ వస్తువులను విక్రయించడానికి కలిసి వచ్చిన మహిళలు, తమ వంతు కోసం ఎదురుచూస్తూ తమ వీపు నొప్పులను, బాధపెట్టే చేతులను గురించి మరచిపోయి హాస్యాలాడుకుంటారు, నవ్వుతారు. రెండు వారాలకోసారి జరిగే సమావేశాలు కూడా వారికి సమాజపు చైతన్యాన్ని కలిగిస్తాయి.

“ఈ సమావేశాలలో ఉండే వేళాకోళాలు, మాట్లాడటం...ఇదంతా నాకు మంచి అనుభూతిని కలిగిస్తుంది, సంతోషంగా ఉంటుంది. నేను ఇంటి విషయాల నుంచి బయటకు రాగలను,” అని కొందరు మహిళలు ఈ విలేఖరితో అన్నారు.

కబుర్లతో నిండిన గాలి సందడి చేస్తోంది – తాజా కుటుంబ డ్రామా గురించి ముచ్చట్లు, వారి పిల్లలు, లేదా మనవరాళ్ళ చేష్టల గురించి, ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు నిజమైన చింతలను వారు పంచుకుంటారు. తన తల్లి పొద్దున్నే పశువులకు పాలు పితుకుతున్నప్పుడు అల్లరి చేస్తోన్న తన నాలుగేళ్ళ మనవడిని తమ ఆవు కాలితో తన్నిన సంఘటనను సీమ వివరిస్తున్నారు; పొరుగువారి కుమార్తె వివాహానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌తో మరి కొంతమంది ముచ్చట్లు సాగుతున్నాయి.

కానీ వారు తమ ఇళ్ళకు బయలుదేరినప్పుడు, చాలా పరిమితంగా వచ్చిన ఆదాయంతో ఇంటిని ఎలా నడపాలా అనే ఆందోళన తిరిగివచ్చి, ఆ సంతోషకరమైన శబ్దాలు సద్దుమణుగుతాయి. మహిళలు తమ చాలీచాలని సంపాదనతో వెనుదిరిగి వెళుతున్నప్పుడు, వారు చేసే వ్యాపారం వారు పడిన శ్రమకు, వారి ఆరోగ్యానికి అన్యాయం చేసినట్టుగా కనిపిస్తుంది.

సీమా తాను అనుభవించే నొప్పులనూ సమస్యలనూ గుర్తుచేసుకున్నారు: “వీపు, చేతులు, భుజాలు... అన్నీ చాలా బాధించేవి. మీరు చూస్తోన్న ఈ వేళ్ళు బీడీలు చుట్టడం వల్ల సన్నబడిపోయి కాయలుకాచేవి."

వారి కష్టాలు, ఆందోళనలు ఎలా ఉన్నప్పటికీ, మధ్యప్రదేశ్‌లోని బీడీ తయారీదారులు చాలా తక్కువ వేతనాలతోనే తమను తాము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు చెప్పినట్లు, “ అబ్ క్యా కరేఁ, సబ్‌కీ అప్నీ మజ్బూరీ హోతీ హై [ఎవరేం చేయగలరు, ప్రతి ఒక్కరికి వారి స్వంత అనివార్యతలు ఉంటాయి].”

ఈ కథనంలో కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Student Reporter : Kuhuo Bajaj

Kuhuo Bajaj is an undergraduate student of Economics, Finance and International Relations at Ashoka University. She is keen to cover stories on rural India.

Other stories by Kuhuo Bajaj
Editor : PARI Desk

PARI Desk is the nerve centre of our editorial work. The team works with reporters, researchers, photographers, filmmakers and translators located across the country. The Desk supports and manages the production and publication of text, video, audio and research reports published by PARI.

Other stories by PARI Desk
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli