ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.

కాజల్‌లత బిశ్వాస్‌ను ఇప్పటికీ తుఫాను నాటి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. ఐలా తుఫాను సుందర్బన్స్‌ను తాకి పదేళ్ళు గడచిపోయినప్పటికీ ఆ 2009, మే 25నాటి తుఫాను ఆమెకు స్పష్టంగా గుర్తుంది.

అపరాహ్నం వేళ. "నదీ(కాళింది) జలాలు గ్రామంలోకి దూసుకొచ్చి ఇళ్ళన్నిటినీ ముంచెత్తాయి," అన్నది కాజల్‌లత. అప్పుడామె తన సొంత ఊరైన గోబిందకటి గ్రామానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉండే కుమిర్‌మరి గ్రామంలోని తన బంధువుల ఇంట్లో ఉన్నారు. "మేమంతా, దాదాపు 40-50 మందిమి ఒక పడవలో ఆశ్రయం పొందాము; అందులోనే ఒక పగలూ రాత్రీ ఉన్నాము. చెట్లు, పడవలు, పశువులు, ధాన్యం- ఇవన్నీ నీటిలో కొట్టుకుపోతుండటం చూశాము. రాత్రయ్యేసరికి మాకు ఏమీ కనిపించలేదు. చివరికి అగ్గిపుల్లలు కూడా నానిపోయాయి. ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు మాత్రమే మేం చూడగలిగేం."

తన ఇంటి బయట కూర్చొని, మధ్యాహ్న భోజనం కోసం చేపలను శుభ్రం చేస్తోన్న 48 యేళ్ళ వయసున్న కాజల్‌లత ఒక రైతు. ఆవిడ తన కథనాన్ని కొనసాగించింది, "ఆ రాత్రి ఎప్పటికీ మరచిపోలేనిది. తాగేందుకు ఒక్క బొట్టైనా మంచినీరు లేదు. ఎలాగో నేను ఒక ప్లాస్టిక్ సంచిలో కొన్ని వర్షపుచుక్కలను సేకరించగలిగాను. అవి దాహంతో ఉన్న నా ఇద్దరు కూతుళ్ళు, మేనకోడలి పెదవులను తడపటానికి ఉపయోగపడ్డాయి." ఈ జ్ఞాపకాలను చెపుతున్నప్పుడు ఆమె గొంతు వణికింది.

మరుసటి రోజు ఉదయం ఒక పడవలో ప్రయాణించి వారు తమ గ్రామాన్ని చేరుకున్నారు. అతికష్టమ్మీద వరదనీటిలో నడిచి తమ ఇంటిని చేరారు. "అప్పటికి 17 యేళ్ళ నా పెద్ద కూతురు తనుశ్రీ, నీటిమట్టం చాలా ఎత్తుగా ఉన్న ఒకచోట దాదాపు మునిగిపోయింది. అదృష్టవశాత్తూ ఆమె తన చేతికందిన పిన్ని చీరకొంగును పట్టుకోగలిగింది." ఇది చెబుతున్న కాజల్‌లత కళ్ళలో ఆనాటి భయం తిరిగి కనిపించింది.

2019 మే నెలలో ఫానీ తుఫాను రాకతో కాజల్‌ లతలో తిరిగి భయం నెలకొంది. ఎందుకంటే ఆవిడ చిన్న కూతురు, 25 యేళ్ళ అనుశ్రీ పెళ్ళి ఆ రోజుల్లోనే జరగబోతూవుంది.

Kajal Lata Biswas cutting fresh fish
PHOTO • Urvashi Sarkar
PHOTO • Urvashi Sarkar

ఎడమవైపు: గోబిందకటి గ్రామంలోని తన ఇంటి బయట చేపలను శుభ్రం చేస్తూ, తూఫానులు వచ్చినప్పటి భయాలను జ్ఞాపకం చేసుకుంటోన్న కాజల్‌లత బిశ్వాస్; కుడివైపు: ఆమె గ్రామంలో ధాన్యాన్ని ఈ గుడిసెలలోనే నిలవచేస్తారు

అనుశ్రీ పెళ్ళి మే 6వ తేదీగా నిర్ణయించబడింది. ఫనీ తూఫాన్ గురించి గ్రామ పంచాయతీ మైకులో చేసే హెచ్చరికలు, ప్రభుత్వంవారు రేడియోలో చేసే హెచ్చరికలు పెళ్ళికి కొన్ని రోజుల ముందునుండే ప్రారంభమయ్యాయి. "ఇహ మా పరిస్థితీ, భయాలూ ఎలా వుంటాయో ఊహించండి." అన్నది కాజల్‌లత. "మేం చేసుకున్న ఏర్పాట్లన్నిటినీ గాలీ వానా నాశనంచేసేస్తాయేమోనని చాలా భయపడ్డాం. పెళ్ళిరోజుకు కొన్ని రోజుల ముందు కొద్దిగా వర్షం పడింది. కానీ అదృష్టవశాత్తూ తుఫాను ప్రభావం మా వూరిపై అంతగా లేదు." అన్నదామె ఎంతో ఉపశమనం పొందినట్టుగా.

ఫానీ తుఫాను ఆంధ్రప్రదేశ్, ఒడిశా(ఈ తుఫానులో ఈ రాష్ట్రమే అత్యంత దారుణంగా దెబ్బతింది), పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలను తాకినట్లు భారత వాతావరణ శాఖ మే 2వ తేదీన హెచ్చరిక జారీ చేసింది. రజత్ జూబ్లీ గ్రామానికి చెందిన 80 ఏళ్ల రైతు, మాజీ ఉపాధ్యాయుడూ అయిన ప్రఫుల్ల మండల్, తన స్వరాన్ని పెంచి, ఫానీ గురించి మాట్లాడుతూ: “ఫానీ చాలా కొద్దిలో సుందర్‌బన్లను దాటిపోయింది. గాలులు ఈలలు వేశాయి. అది మా గ్రామాన్ని తాకి ఉంటే, మా ఇళ్ళూ భూమితో పాటు మేమూ నాశనం అయుండేవాళ్ళం..." అన్నారు.

సుందర్‌బన్స్‌ లో తుఫానులు సర్వసాధారణం అని మండల్, కాజల్ లతలిద్దరికీ బాగా తెలుసు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యొక్క విపత్తు యాజమాన్య, పౌర రక్షణ విభాగం దక్షిణ, ఉత్తర 24 పరగణాల జిల్లాలు రెండిటినీ తుఫానుల కారణంగా 'చాలా ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాలు'గా వర్గీకరించింది.

మండల్ గ్రామం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గోసాబా బ్లాక్‌లో ఉంది. కాజల్ లత గ్రామం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హింగల్‌గంజ్ బ్లాక్‌లో ఉంది. ఈ రెండు గ్రామాలూ పశ్చిమ బెంగాల్‌లోని భారతదేశానికి చెందిన సుందర్‌బన్లలో ఉన్న 19 బ్లాక్‌లలో - ఉత్తర 24 పరగణాలలో 6 బ్లాక్‌లు, దక్షిణ 24 పరగణాలలో 13 బ్లాక్‌లు – ఉన్నాయి.

భారత, బంగ్లాదేశ్‌లు అంతటా వ్యాపించి ఉన్న సుందర్బన్లు ఒక విస్తారమైన డెల్టా ప్రాంతం. బహుశా ప్రపంచంలోనే అతి పెద్ద మడ అడవులు - దాదాపు 10,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో - ఇక్కడ విస్తరించి ఉన్నాయి. "సుందర్బన్ల  ప్రాంతం ప్రపంచంలోని అత్యంత సంపన్న పర్యావరణ వ్యవస్థలలో ఒకటి..." అని ' బిల్డింగ్ రిజిలియన్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఆఫ్ సుందర్బన్స్ ' పేరిట 2014లో వచ్చిన ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. "రాయల్ బెంగాల్ టైగర్, ఉప్పునీటి మొసలి, భారతీయ కొండచిలువ, నదీ జలాలలో నివసించే అనేక జాతుల డాల్ఫిన్స్ వంటి అనేక నశించిపోతున్న జాతులతో సహా మొత్తం మడ అడవుల ప్రాంతం అసాధారణమైన జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని 10 శాతానికి పైగా క్షీరదాలు, 25 శాతం పక్షి జాతులకు నిలయం ఈ ప్రాంతం.”

దాదాపు 4,200 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న భారతీయ సుందర్బన్లలో దాదాపు 4.5 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది పేదరికంలో ఉన్నావారే. కష్టాలనూ, తీవ్రమైన వాతవరణాన్నీ ఎదుర్కొంటూ అతి సాధారణమైన జీవనోపాధి కోసం ఫొరాడుతున్నవారు.

ఐలా తుఫాను తర్వాత ఈ ప్రాంతం పెద్ద తుఫానులను చూడనప్పటికీ, ఇది తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రదేశంగా నిలిచిపోయింది. బెంగాల్ రాష్ట్రం 1891 నుండి 2004 వరకు 71 తుఫానులను ఎదుర్కొందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగం కోసం ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీవారు 2006లో తయారుచేసిన నివేదిక పేర్కొంది. ఆ కాలంలో, దక్షిణ 24 పరగణా జిల్లాలోని గోసాబా బ్లాక్ అత్యధికంగా ఆరు తీవ్రమైన తుఫానులతో పాటు మరో 19 తుఫానులను ఎదుర్కొంది.

PHOTO • Urvashi Sarkar

రజత్ జూబ్లీ గ్రామంలో, 80 ఏళ్ల ప్రఫుల్ల మండల్ అనేక తుఫానులను ఎదుర్కొన్నారు, కానీ ఆయన కుటుంబం ఇప్పుడు అస్థిరమైన వాతావరణ మార్పులతో పోరాడుతోంది

ప్రఫుల్ల, ఐలా కంటే ముందర వచ్చిన తుఫానులను కూడా గుర్తుతెచ్చుకుంటారు. “బలమైన, హింసాత్మకమైన గాలులతో నిండిన 1998 నాటి తుఫానును [స్వాతంత్య్రనంతర పశ్చిమ బెంగాల్ ఎదుర్కొన్న 'అత్యంత తీవ్రమైన తుఫాను'గా దీన్ని చెప్తారు. ఇది ఐలా కంటే కూడా బలమైన 'పెను తుఫాను'] నేను మరచిపోలేను. అంతకు ముందు 1988లో వచ్చిన తుఫాన్ కూడా నాకు గుర్తుంది,” అని ఆయన చెప్పారు.

కొల్‌కతాకు చెందిన ఓషనోగ్రాఫర్ డాక్టర్ అభిజిత్ మిత్ర, 2019లో ప్రచురించబడిన మాన్‌గ్రోవ్ ఫారెస్ట్స్ ఇన్ ఇండియా: ఎక్స్‌ప్లోరింగ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అనే తన పుస్తకంలో, లోగడ వచ్చిన తుఫానులను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, గత 10 సంవత్సరాలలో ఈ తుఫాను అల్పపీడనాలు (గంటకు 62-82 కిలోమీటర్ల పెనుతుఫాను పరిధి కంటే తక్కువ పరిమితిలో, గంటకు 31-60 కిలోమీటర్ల పరిధిలో సముద్రంలో ఏర్పడే ఉష్ణమండల వాతావరణ అలజడులు) 2.5 రెట్లు పెరిగాయని రాశారు. "ఇప్పుడు తరచుగా తుఫానులు వస్తున్నాయని దీని అర్థం," అని ఆయన చెప్పారు.

సుందర్‌బన్లతో పాటు బంగాళాఖాతంలో తుఫానుల తాకిడి పెరిగిందని అనేక ఇతర అధ్యయనాలు చూపిస్తున్నాయి. డైవర్సిటీ జర్నల్‌ లో 2015లో ప్రచురించబడిన ఒక అధ్యయనం, 1881 నుండి 2001 మధ్య ఈ పెరుగుదలను 26 శాతంగా చూపించింది. 1877 నుండి 2005 వరకు మే, అక్టోబర్, నవంబర్‌ నెలలలో బంగాళాఖాతంలో వచ్చిన తుఫానుల గురించి అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించి 2007లో చేసిన అధ్యయనాలు, గత 129 సంవత్సరాలలో, ఈ తీవ్రమైన తుఫాను నెలల్లో, పెనుతుఫానులు గణనీయంగా పెరుగుతున్న ధోరణులు నమోదు అయ్యాయి.

పాక్షికంగా, ఇది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు ( జర్నల్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్‌ లో ప్రచురించిన ఒక కథనం ఈ విషయాన్ని తెలియజేసింది). ఈ ఉష్ణోగ్రతలు భారతీయ సుందర్‌బన్లలో 1980 నుండి 2007 వరకు దశాబ్దానికి 0.5 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా గమనించిన ఉష్ణోగ్రతల రేటు - దశాబ్దానికి 0.06 డిగ్రీల సెల్సియస్‌ - కంటే ఇది ఎక్కువ.

దీని వల్ల చాలా దారుణమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి "సుందర్బన్లు  చివరిసారిగా 2009లో పెద్ద తుఫానును చవిచూశాయి," అని కొల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఓషనోగ్రాఫిక్ స్టడీస్ ప్రొఫెసర్ సుగతా హజ్రా చెప్పారు. "ఉత్తర బంగాళాఖాతంలో సంభవించిన తుఫానుల కారణంగా తరచూ వరదలు రావడం, కరకట్టలు తెగిపోవడం వలన ఈ ప్రాంతం నష్టపోయింది."

PHOTO • Urvashi Sarkar

అనేక ఇతర మార్పులతో పాటు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు,  సుందర్‌బన్లకు ప్రమాదభరితంగా తయారయ్యాయి

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, "సుందర్‌బన్లలో తుఫానులు, సముద్ర మట్టం పెరుగుదల నుండి రక్షణ వ్యవస్థలుగా కరకట్టలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. డెల్టా ప్రాంతం క్షీణించడం, సముద్ర మట్టం పెరుగుదల, వాతావరణ మార్పుల కారణంగా పెరిగిన తుఫాను తీవ్రత; 19వ శతాబ్దం నాటి 3,500 కిలోమీటర్ల కరకట్టల వ్యవస్థ క్షీణించడం- ప్రజలను, వారి పంటపొలాల ఉత్పాదకతను నాశనం చేస్తుంది..."

సుందర్‌బన్స్‌లోని సాగర్ ఐలాండ్ అబ్జర్వేటరీలో కొలిచిన ప్రకారం, 2002-2009కి సంబంధించి సగటు సముద్ర మట్టం, సంవత్సరానికి 12 మిమీ చొప్పున, లేదా 25 సంవత్సరాలకుగాను సంవత్సరానికి 8 మిమీ చొప్పున పెరిగిందని 2011 నాటి వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ పేపర్ చెబుతోంది.

వేడెక్కడం, దాని పర్యవసానంగా సముద్ర మట్టం పెరగడం కూడా మడ అడవులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ అడవులు తీర ప్రాంతాలను తుఫానుల నుంచి, భూమి కోతకు గురికాకుండా రక్షించడంలో సహాయపడతాయి. చేపలు, ఇతర జీవజాలాలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా పనిచేస్తాయి. బెంగాల్ పులులకు ఆవాసాలుగా కూడా ఉన్నాయి. జాదవ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఓషనోగ్రాఫిక్ స్టడీస్ 2010లో టెంపోరల్ చేంజ్ డిటెక్షన్ (2001–2008) స్టడీ ఆఫ్ సుందర్‌బన్స్ పేరుతో ప్రచురించిన అధ్యయనం పత్రం, సముద్ర మట్టం పెరుగుదల, తుఫానులు అటవీ విస్తీర్ణాన్ని తగ్గించడం ద్వారా సుందర్‌బన్ల మడ అడవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొంది.

రజత్ జూబ్లీ గ్రామానికి చెందిన మత్స్యకారుడు అర్జున్ మండల్‌కు సుందర్‌బన్లకు మడ అడవులు ఎంత ముఖ్యమైనవో బాగా తెలుసు. ఈయన సుందర్‌బన్స్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ అనే స్వచ్చంధ సంస్ధతో కలిసి పనిచేశారు. 2019, మే నెలలో ఆయన నాతో ఇలా అన్నారు: “వాతావరణ మార్పు గురించి అందరూ విన్నారు, కానీ అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తోంది? మనం దీని గురించి మరింత తెలుసుకోవాలి.”

జూన్ 29, 2019న పిర్‌ఖాలీ అడవిలో పీతలను పట్టుకుంటున్న అర్జున్‌ను పులి ఎత్తుకుపోయింది. సుందర్‌బన్లలో పులులు చాలాకాలంగా మనుషులపై దాడి చేస్తున్నాయి; సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో అటవీ భూమి క్షీణించిపోతూ, ఈ పులులను మానవ నివాస ప్రాంతాలకు చేరువ చేస్తుండటమే పెరిగిపోతున్న ఈ దాడులకు కొంతవరకూ కారణం.

తరచుగా వచ్చే తుఫానుల ద్వారా ఈ ప్రాంతం దెబ్బతినడంతో, నీటి లవణీయత స్థాయి కూడా పెరిగింది, ముఖ్యంగా గోసాబా ఉన్న మధ్య సుందర్‌బన్లలో. "... సముద్ర మట్టం పెరగడంతోపాటు డెల్టాకు మంచినీటి ప్రవాహం తగ్గడం వల్ల. లవణీయత గణనీయంగా పెరగి పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల  ప్రభావాన్ని చూపుతోంది." అని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది.

PHOTO • Urvashi Sarkar
PHOTO • Urvashi Sarkar

వ్యవసాయానికి , నేల లవణీయతను నియంత్రించడానికి కీలకమైన సుందర్‌బన్లలోని విస్తారమైన కట్టలు పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా క్రమంగా కోతకు గురవుతున్నాయి

డాక్టర్ మిత్ర సహ రచయితగా చేసిన పరిశోధనా పత్రం సుందర్‌బన్లను ‘హైపర్‌సలైన్’గా అభివర్ణించింది. “సుందర్బన్ల మధ్య భాగంలో సముద్ర మట్టాలు పెరగడం వల్ల నీటి లవణీయత పెరిగింది. ఇది వాతావరణ మార్పులతో స్పష్టంగా ముడిపడి ఉంది" అని డాక్టర్ మిత్రా చెప్పారు.

హిమాలయాల నుండి మధ్య, తూర్పు సుందర్బన్ల వరకు మంచినీటి ప్రవాహాన్ని బిద్యధారి నదిలోని ఇసుక మేట (Siltation) నిరోధిస్తుందని అని పరిశోధకులు గుర్తించారు. భూసేకరణ, సాగు, మురుగునీటి బురద, మత్స్య వ్యర్థాలను డంపింగ్ చేయడం- ఈ కారణాలు కొంతవరకు ఈ సిల్ట్‌టేషన్‌కు కారణమని పరిశోధకులు తెలిపారు. 1975లో ఫరక్కా బ్యారేజీ (పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో గంగా నదిపై) నిర్మించడం కూడా సెంట్రల్ సుందర్‌బన్లలో లవణీయత పెరగడానికి దోహదపడింది.

రజత్ జూబ్లీలోని మోండల్ కుటుంబానికి అధిక లవణీయత ప్రభావాలు తెలుసు - ఐలా తర్వాత మూడేళ్ల వరకు అమ్మడానికి వారికి బియ్యం లేదు. బియ్యం అమ్మగా వచ్చే వారి వార్షిక ఆదాయం, రూ. 10,000-12,000 తుడిచిపెట్టుకుపోయింది. "వరి సాగు పోవడంతో, తమిళనాడు, కర్నాటక, గుజరాత్ మహారాష్ట్రలకు పని కోసం మనుషులు వెళ్లిపోవడంతో గ్రామాలు ఖాళీ అయ్యాయి, అక్కడ వారు ఫ్యాక్టరీలలో నిర్మాణ ప్రదేశాలలో కూలీలుగా చేరారు" అని ప్రఫుల్ల గుర్తుచేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా, ఐలా 2 లక్షల హెక్టార్లకు పైగా పంటను, 6 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసింది.  1 మిలియన్ ఇళ్ళను నాశనం చేసింది. అంతేగాక దీనివలన 137 మంది చనిపోయారు. "నా గ్రామంలో నష్టపోని వారంటూ  ఎవరూ లేరు" అని ప్రఫుల్ల చెప్పారు. “నా ఇల్లు, పంటలు ధ్వంసమయ్యాయి. నా 14 మేకలను పోగొట్టుకున్నాను. మూడేళ్లు వరి సాగు చేయలేక పోయాను. ప్రతిదీ మొదటి నుండి పునర్నిర్మించవలసి వచ్చింది. అవి కష్టతరమైన సంవత్సరాలు. నేను బతకడం కోసం వడ్రంగి పనులు, కూలీ పనులు చేసేవాడిని.”

ఐలా తుఫాను తరవాత లవణీయత తీవ్రతరం కావడంతో, కాజల్ లత కుటుంబం కూడా వారి 23 బిఘాల (7.6 ఎకరాల) భూమిలో ఆరు బిగాలను అమ్మేయవలసి వచ్చింది. “మట్టి ఉప్పగా మారి రెండేళ్లుగా గడ్డి కూడా పెరగలేదు. వరి కూడా పండలేదు. నెమ్మదిగా, ఆవాలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు పొట్లకాయ వంటి కూరగాయలు మళ్ళీ పెరుగుతున్నాయి, అవి మేము వాడుకునేందుకు సరిపోతాయి, కానీ అమ్మడానికి సరిపోవు,” అని కాజల్ చెప్పింది. "మాకు షోల్ , మాగుర్ , రుయ్ వంటి రకరకాల చేపలున్న చెరువు కూడా ఉంది  మేము వీటిని అమ్మి సంవత్సరానికి 25,000-30,000 రూపాయిలు సంపాదించేవాళ్ళము. కానీ ఐలా తరవాత నీరు ఉప్పగా మారి చేపలు కూడా ఉండడం లేదు.”

PHOTO • Urvashi Sarkar
PHOTO • Ritayan Mukherjee

సుందర్బన్ల పర్యావరణ వ్యవస్థకు మడ అడవులు కీలకం, కానీ అవి కూడా నెమ్మదిగా తగ్గిపోతున్నాయి

నేల క్షీణించిపోవడం - అధిక లవణీయత, అధిక ఆల్కలీనిటీతో సహా - ఐలా కారణంగా ఉత్తర, దక్షిణ 24 పరగణాలో చాలా వరకు వరి పెరుగుదల పేలవంగా ఉందని, జర్నల్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ అండ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌ లో 2016 పేపర్‌ను పేర్కొంది. జర్నల్‌లోని ఒక అధ్యయనంలో వరిని మళ్లీ పండించడానికి, ఫాస్ఫేట్ ఇంకా  పొటాష్ ఆధారిత ఎరువులు సిఫార్సు చేసిన స్థాయిల కంటే ఎక్కువగా ఉపయోగించవలసి ఉంటుంది.

“ఐలా తరవాత ఎరువుల వాడకం పెరిగింది. అలా చేస్తే మాకు కావలసిన పంట చేతికి వస్తోంది.” అన్నాడు ప్రఫుల్ల కొడుకు, 48 ఏళ్ళ  ప్రబీర్ మోండాల్. “ఇది తినడానికి ఆరోగ్యకరం కాదు, కానీ తినవలసి వస్తోంది. మా చిన్నప్పుడు మేము తిన్న బియ్యం గుర్తుంది నాకు. అలా ఉన్న పళంగా తినేసేవాళ్ళము. ఇప్పుడు కూరగాయలతో  కలిపి తిన్నా గాని ఏదో తక్కువైనట్లే ఉంటుంది.”

అతని తండ్రికి 13 బిఘా ల (4.29 ఎకరాలు) భూమి ఉంది, ఇది బిఘా కు 8-9 బస్తాల బియ్యాన్ని ఇస్తుంది - ఒక బస్తా 60 కిలోలకు సమానం. "వరిని నాటడం, కోతకు, ఎత్తడానికి అయ్యే ఖర్చుతో పాటు ఎరువుల ఖర్చులు కూడా  ఉంటాయి. అంటే మేము ఖర్చు చేసిన దానికంటే కాస్త ఎక్కువ సంపాదిస్తున్నాము, కాబట్టి మా ఆదాయం కూడా బాగా తగ్గిపోయింది," అని ప్రబీర్ చెప్పారు.

ఐలా తుఫాను తర్వాత, సుందర్‌బన్స్ అంతటా వరి ఉత్పత్తి సగానికి పడిపోయింది- 1.6 హెక్టార్లకు 64-80 క్వింటాళ్ల నుండి 32-40 క్వింటాళ్లకు పడిపోయింది,  అని 2018లో ప్రచురించిన పరిశోధన పత్రం చెబుతోంది. వరి ఉత్పత్తి ఇప్పుడు ఐలా ముందు స్థాయికి స్థిరీకరించబడినప్పటికీ, ప్రబీర్, అతని కుటుంబం, ఇంకా అతని గ్రామంలోని వారు  జూన్ నుండి సెప్టెంబర్ వరకు పూర్తిగా వర్షపాతంపైనే ఆధారపడి ఉన్నామని చెప్పారు.

ఈ వర్షపాతం కూడా నమ్మరానిదిగా మారింది. "సముద్ర మట్టం వేగంగా పెరగడం, ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షాలు తగ్గడం- ఇవన్నీ దీర్ఘకాలంగా జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం" అని ప్రొఫెసర్ హజ్రా చెప్పారు.

ఉత్తర బంగాళాఖాతంలో (సుందర్బన్స్ ఉన్న ప్రదేశంలో) గత రెండు దశాబ్దాల్లో రోజుకు 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఎక్కువగా నమోదవుతోందని, కోల్‌కతాలోని స్కూల్ ఆఫ్ ఓషనోగ్రాఫిక్ స్టడీస్‌లో కొనసాగుతున్న పరిశోధనలు చెబుతున్నాయి. అదే సమయంలో, విత్తనాలు నాటే సీజన్‌లో, రుతుపవనాలు తరచుగా తగ్గుముఖం పడుతున్నాయని  ప్రొ. హజ్రా చెప్పారు. ఈ సంవత్సరం కూడా వర్షం - సెప్టెంబర్ 4 వరకు, దక్షిణ 24 పరగణాలలో దాదాపు 307 మిల్లీమీటర్లు, ఉత్తర 24 పరగణాలలో దాదాపు 157 మిమీ తక్కువగా ఉంది.

ఈ ఏడాదనే కాదు- సుందర్బన్లలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి కొన్నేళ్లుగా సాగుతోంది. దక్షిణ పరగానాలలో సాధారణ జూన్-సెప్టెంబర్ రుతుపవనాల వర్షం 1552. మిమి.  ఈ జిల్లాలోని రుతుపవనాల డేటా ప్రకారం 2012-17 వరకు ఆరేళ్లలో నాలుగేళ్ళు తక్కువ స్థాయిలో వర్షం కురిసింది . 2017 లో అన్నిటికన్నా తక్కువగా 1173. మిమి, 2012 లో 1130 మిమిగా రికార్డ్  అయింది.

PHOTO • Urvashi Sarkar

వరి ఎదుగుదల పూర్తిగా వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది. వర్షాలు లేకుంటే వరి పండదు'

ఉత్తర 24 పరాగనాలలో, దీనికి సరిగ్గా వ్యతిరేకంగా జరిగింది : విపరీతమైన వర్షాలు. సాధారణ జూన్ నుండి సెప్టెంబర్ దాకా కురిసే వర్షం 1172. మీ మీ. రుతుపవనాల డేటా ప్రకారం 2012-17 ఈ ఆరేళ్లలో నాలుగేళ్లు మామూలుకన్నా ఎక్కువ వర్షం పడిందని తెలుస్తోంది. వీటిలో 2015లో అత్యధిక వర్షం 1428 మిమి రికార్డు అయింది.

“అసలు ఇబ్బంది అకాల వర్షాల తోటే,” అన్నది కాజల్ లత. “ ఈ ఏడాది ఫిబ్రవరి లో, చాలా  వర్షాలు పడ్డాయి, ఇంచుమించు రుతుపవనాల సమయంలో పడినట్లే. ఇక్కడి పెద్దవాళ్లు కూడా ఇదివరకటి కాలంలో ఇటువంటి వర్షాలు పడడం ఎన్నడూ చూడలేదని చెబుతున్నారు.” ఆమె కుటుంబం ఆదాయం కోసం వారు వరి పంట పై ఆధారాపడతారు. వీరు జూన్, జులై లో నాట్లు వేసి, నవంబర్ డిసెంబర్ నాటికి పంటను అందుకుంటారు. “ఈ వరి పెరుగుదల అంతా వర్షం పైనే ఆధారపడి ఉంటుంది. వర్షాలు లేకపోతే వరి పెరిగదు.”

గత నాలుగయిదు సంవత్సరాల నుండి, తన గ్రామంలో వర్షాకాల నెలలతో పాటుగా నవంబర్-డిసెంబర్లలో వర్షాలు కురుస్తున్నాయని ఆమె చెప్పింది. ఈ నెలల్లో సాధారణంగా కొన్ని జల్లులు కురుస్తున్నాయి కాని వాటి తీవ్రత వరి పంటకు హాని కలిగిస్తుంది. “అవసరమైనప్పుడు వర్షం పడదు లేదా కాలానికి మించి వర్షాలు కురుస్తాయి. దీంతో పంట నాశనమవుతోంది. ప్రతి సంవత్సరం ఇక అధిక [అకాల] వర్షాలు ఉండవని ఆశపడతాము. కానీ భారీ వర్షాలు కురిసి పంట పూర్తిగా నాశనమవుతోంది. అందుకే అంటారు, ' ఆశయ్ మోరే చాసా ' ['ఆశ రైతును చంపుతుంది'].”

రజత్ జూబ్లీ గ్రామంలో, ప్రబీర్ మోండల్ కూడా ఆందోళన పడుతున్నాడు. “జూన్, జూలై వరకు, [నా గ్రామంలో] వర్షపాతం లేదు. కొన్ని వరి ఆకులు ఎండిపోయాయి. భగవంతుడి దయవలన, [ఆగస్టులో] వర్షం వచ్చింది. కానీ అది సరిపోతుందా? ఎక్కువ వర్షాలు కురిసి పంట నీటమునిగిపోతే?”

హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్‌గా (అతనికి ప్రత్యామ్నాయ వైద్యంలో BA డిగ్రీ ఉంది), తన రోగులు కూడా వేడి గురించి ఎక్కువగా ఫిర్యాదు చేస్తారని ప్రబీర్ చెప్పాడు. “చాలామంది ఇప్పుడు వడదెబ్బతో బాధపడుతున్నారు. వడదెబ్బ ఎప్పుడైనా ప్రాణాంతకం కావచ్చు, ”అని అతను వివరించాడు.

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత తో పాటు సుందర్‌బన్స్‌లో భూమి ఉష్ణోగ్రత కూడా పెరుగుతోంది. 1960లో, సంవత్సరంలో 180 రోజుల పాటు ఇక్కడ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉండేది. ఇప్పుడు 2017లో అటువంటి రోజుల సంఖ్య 188కి పెరిగింది, వాతావరణం మరియు గ్లోబల్ వార్మింగ్‌పై న్యూయార్క్ టైమ్స్ యొక్క ఇంటరాక్టివ్ పోర్టల్‌లో డేటాను చూడండి. ఇది శతాబ్దం చివరి నాటికి 213 నుండి 258 రోజులు కావచ్చు.

పెరుగుతున్న వేడి, తుఫానులు, స్థిరంగా కురవని వర్షాలు, లవణీయత, అంతరించిపోతున్న మడ అడవులు మరిన్నింటితో పదే పదే కలగలిసి, సుందర్బన్ల నివాసితులు దాదాపు అనిశ్చితిమైన స్థితిలోనే జీవిస్తున్నారు. అనేక తుఫానులు,  తుఫానులకు సాక్షి అయిన ప్రఫుల్ల మొండల్,  "తరువాత ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు?" అంటారు.

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Urvashi Sarkar is an independent journalist and a 2016 PARI Fellow.

Other stories by Urvashi Sarkar
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli