గ్రామీణ భారతదేశం అన్న విషయం మీద బోధిస్తున్నది PARI అయినపుడు, ఆ విద్య వాస్తవికంగాను, సులభగ్రాహ్యంగాను యింకా, చాలాకాలం పాటు నిలిచిపోయేదిగానూ ఉంటుందని మేము గమనించాము.

ఆయుష్ మంగళ్ మా దగ్గర ఇంటర్న్ గా పనిచేసినప్పటి తన అనుభవాన్నే తీసుకోండి. PARI తో తన సమయాన్ని గ్రామీణ ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీలకు ఆరోగ్యసేవలు అందుబాటులో లేకపోవడానికి, ఝో లా చాప్ వైద్యులకి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకున్నాడు. "ప్రభుత్వానికి, ప్రైవేటుకి అలాగే పట్టా ఉన్న వైద్యునికి, పట్టా లేని వైద్యునికి మధ్య గల సంక్లిష్టమైన సంబంధాన్ని గమనించాను. ఏ ప్రభుత్వ విధానమైనా దీనిని పరిష్కరించేదిగా ఉండాలి" అంటాడు ఛత్తీస్‌గఢ్ లోని జాంజ్‌గిర్ చంపా జిల్లాకు చెందిన ఈ విద్యార్థి. అప్పటికి అతను ఆర్థికశాస్త్రంలో పి.జి. చేస్తున్నాడు.

తమ పాఠ్యపుస్తకాల్లో కనబడనటువంటి అట్టడుగు వర్గాల ప్రజల గురించి యువత మరింతగా తెలుసుకుంటోంది. జర్నలిజం చదువుతోన్న శుభశ్రీ మహాపాత్ర, ఒడిశాలోని కొరాపుట్ లో ఉండే గౌరా లాంటి అంగవైకల్యం ఉన్నవారికి రాష్ట్రప్రభుత్వం అందించే సహాయం పొందడం ఎంత కష్టంగా ఉందో వివరిస్తూ, తన నివేదికలో యిలా ప్రశ్నిస్తారు: "ఏ పాలనాలోపం వల్ల గౌరా యింతటి శారీరక, మానసిక ఒత్తిడికి గురికావలసి వస్తోంది?".

పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా విద్యా విభాగమైన PARI ఎడ్యుకేషన్, సెప్టెంబరు 2022 లో తన అయిదవ ఏట అడుగు పెడుతున్నది. ఇన్ని సంవత్సరాలలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు, సామాజిక మార్పు కోసం పని చేస్తున్న సంస్థల్లో పనిచేసే యువత, అలాగే పాఠశాలల్లో చదువుకుంటోన్న విద్యార్థులు చాలామంది సాధారణ ప్రజలకున్న వైవిద్యభరితమైన నైపుణ్యాల గురించి, వారి జ్ఞానం గురించి లోతైన అవగాహన పొందారు. ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లో ధన్ ఝూమర్స్ గురించి డాక్యుమెంట్ చేసిన ప్రజ్వల్ ఠాకూర్ అనే ఒక ఉన్నతపాఠశాల విద్యార్థి యిలా అంటాడు: "పండుగలలో రైతుల పాత్ర గురించి అలాగే వరిపంట ప్రాధాన్యత గురించి నేను మరింత తెలుసుకున్నాను.  PARI ఎడ్యుకేషన్ తో కలిసి పనిచేయడం వల్ల నేను జీవిస్తున్న సమాజం పట్ల నాకొక కొత్త దృష్టి ఏర్పడింది".

వీడియో చూడండి: 'PARI ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?'

వందకుపైగా ప్రదేశాలలో తమ తమ పాఠశాలల, విశ్వవిద్యాలయాల ప్రాజెక్టుల ద్వారా వీరు, ఢిల్లీలో జరిగిన రైతుల నిరసనలు, దేశవ్యాప్తంగా అట్టడగు ప్రజల మీద కోవిడ్-19 ప్రభావం, వలస కార్మికుల జీవితాల్లోని సవాళ్లు వంటి యిటీవలి సంఘటనలలో పాలుపంచుకొంటున్నారు.

జర్నలిజం చదువుతోన్న ఆదర్శ్ బి ప్రదీప్, కొచ్చిలో కాలువగట్టున నివసిస్తోన్న కొన్ని కుటుంబాలు తమ ఇళ్లలోకి వరదనీరు రావడంతో ఎత్తైన ప్రదేశానికి వెళ్ళడాన్ని చూశాడు. వాళ్లు అలా తమ ఇళ్లను వదిలి వెళ్ళాల్సిరావడానికి గల కారణాలను ప్రధానంగా పేర్కొంటూ అతడొక కథనం రాశాడు. అతనంటాడు, "PARI తో కలిసి పనిచేయడం నాకెన్నో విషయాలు నేర్పింది. ప్రభుత్వ ఆధారాలలో నమ్మదగిన సమాచారం కోసం వెదకడం దగ్గర్నుంచి, సూక్ష్మాతిసూక్ష్మమైన విషయాలను పట్టించుకోవడం వరకు ఎన్నో నేర్పింది. యిది నాకొక మంచి అనుభవం. నేను పరిశోధిస్తున్న సమూహానికి నన్ను మరింత దగ్గర చేసింది" అని.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోన్న అట్టడుగు వర్గాల ప్రజలకు సంబంధించిన వివిధ విషయాల గురించి విద్యార్థులు తమ మాతృభాషల్లోనే రాస్తున్నారు. హిందీ, ఒడియా యింకా బంగ్లా భాషల్లో రాసిన కథనాలను మేము స్వీకరించి ప్రచురించడం జరిగింది. బీహార్ లోని గయ జిల్లాకు చెందిన సింపల్ కుమారిని, PARI నిర్వహించిన ఒక వర్క్‌షాప్, మోరా అనే మహిళ గురించి హిందీలో ఒక కథనం రాసేలా చేసింది. మోరా, హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాకు చెందిన ఒక స్ఫూర్తిదాయకమైన దళిత మహిళ. ఈమె ఒక రైతు, ఒక వార్డు కౌన్సిలరు యింకా యిప్పుడు ఒక ఆశా కార్యకర్త కూడా.

PHOTO • Antara Raman

మారుమూల గ్రామీణ ప్రాంతాలలు,  పట్టణ సంస్థలు- ఈ రెండింటినుండి యువకులు దేశవ్యాప్తంగా 63 కంటే ఎక్కువ స్థానాల నుండి మా కోసం నివేదిస్తున్నారు, డాక్యుమెంట్ చేస్తున్నారు

PARI ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ లో యువత పంపించిన రెండు వందలకు పైగా కథనాలను ప్రచురించాము. ఈ కథనాలలో వారు, మమూలుగా ప్రసారమాధ్యమాలు విస్మరించే సాధారణ ప్రజల జీవితాల గురించి రాయడంతో పాటు, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, లింగపరమైన న్యాయం వంటి అనేక అంశాలను స్పృశించారు.

"ప్రజల సమస్యలు వ్యక్తిగతమైనవో లేదా విడిగా ఉండేవో కాదని, మిగిలిన సమాజంతో ఇవి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయని నేను తెలుసుకున్నాను. ఒక వ్యక్తి తన గ్రామాన్ని వదిలి పనికోసం నగరానికి వలసపోవడమన్నది అతనికొక్కడికే కాక ఆ సమూహానికి, రాష్ట్రానికి యింకా దేశం మొత్తానికి సంబంధిన విషయం అని తెలుసుకున్నాను" అంటాడు ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి. యితడు ఢిల్లీలోని ఒక చిన్న ఫాక్టరీలో పనిచేసే వలస కార్మికుని లోకం గురించి పరిశోధించాడు.

పరిశీలిస్తూ, పరిశోధిస్తూ, పాలుపంచుకుంటూ యింకా యితరుల పట్ల సహానుభూతిని కలిగిఉంటూ నేర్చుకోవడమన్నది సమాజం గురించి మన అవగాహనను పెంచుతుంది. PARI ఎడ్యుకేషన్ అనేది ఒక జీవితానికి సరిపడా విద్య. తమ విద్యార్థులతో మమేకమయ్యే వారే ఉత్తమ గురువులు. PARI చేస్తున్నది సరిగ్గా అదే - యువ భారతీయుల్ని గ్రామీణ భారతదేశంతో మమేకం చేయడం.

PARI ఎడ్యుకేషన్ టీమ్‌ను [email protected] నందు సంప్రదించవచ్చు.

కవర్ ఫోటో : బినైఫర్ భరూచా

అనువాదం: కె. నవీన్ కుమార్

PARI Education Team

We bring stories of rural India and marginalised people into mainstream education’s curriculum. We also work with young people who want to report and document issues around them, guiding and training them in journalistic storytelling. We do this with short courses, sessions and workshops as well as designing curriculums that give students a better understanding of the everyday lives of everyday people.

Other stories by PARI Education Team
Translator : K. Naveen Kumar

K. Naveen Kumar is working as a Sericulture Officer in Anantapur, Andhra Pradesh. He is an aspiring poet and Telugu translator.

Other stories by K. Naveen Kumar