"ప్రజలు మా మామగారిని అడుగుతారు, 'మీ ఇంటి నుండి ఒక అమ్మాయి బయటికి వెళ్లి డబ్బు సంపాదించబోతోందా?' అని. నేను ఈ పట్టణానికి చెందిన అమ్మాయిని కాను కాబట్టి నిబంధనలు నాకు మరింత కఠినంగా ఉంటాయి," అని ఫాతిమా బీబీ అన్నారు

తన నల్లని నిఖాబ్‌ని నేర్పుగా తీస్తూ ఫాతిమా, దానిని ముందు తలుపు దగ్గర ఉన్న ఒక మేకుకు వేలాడదీసి, ఇంకా మాట్లాడుతూనే తన ఇంటిలోకి ప్రవేశించారు. "నేను చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు, నా గమ్యం వంటగదే అవుతుందనుకునేదాన్ని - వంట చేయడం, ఇంటిని నిర్వహించడం - ఇలా" అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. “నేను ఏదైనా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇంటినుంచి బయటికి వెళ్లి నా జీవితంలో ఏదో ఒకటి సాధించేందుకు మా కుటుంబం నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. నేను ముస్లిమ్ యువతినే కావచ్చు, కానీ నేను చేయలేనిది ఏమీ లేదు,” అని ఉద్వేగంగా చెప్పారు, ఆ 28 ఏళ్ల యువతి. ఆమె తెల్లటి దుపట్టాపై ఉన్న వెండి మెరుపుల చెమ్కీ బిళ్ళలు మధ్యాహ్నం వెలుగులో మెరిసిపోతున్నాయి.

ఫాతిమా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (గతంలో అలహాబాద్) జిల్లాలోని మాహెవా పట్టణంలో నివసిస్తున్నారు. ఇక్కడి జీవన గమనం అక్కడికి సమీపంలోనే నెమ్మదిగా ప్రవహించే యమునా నదీ ప్రవాహానికి అద్దం పడుతుంది. దేనికీ తొణకని ఆమె, నేడు నైపుణ్యం కలిగిన కళాకారిణి, కళా వ్యవస్థాపకురాలు. రెల్లు గడ్డిని పోలివుండే సర్పత్ గడ్డి ఆకులైన మూంజ్ తో వివిధ రకాల గృహోపకరణాల శ్రేణిని రూపొందించి విక్రయిస్తున్నారు.

చిన్న వయస్సులో, ఫాతిమాకు తానేం కాబోతోందో ఎప్పుడూ తెలియలేదు. కానీ మహమ్మద్ షకీల్‌తో వివాహం ఆమెను మాహెవాకు, అనుభవజ్ఞురాలైన మూంజ్ కళాకారిణి అయిన ఆమె అత్తగారు అయేషా బేగం ఇంటికి తీసుకువచ్చింది.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ : ఒక మూంజ్ బుట్టకు పై మూత నేస్తోన్న అయేషా బేగం . ఆమె ఎండిన గడ్డితో బుట్టలు , డబ్బాలు , కోస్టర్ లు , ఆభరణాలు , అలంకార వస్తువులు వంటి అనేక రకాల ఉత్పత్తులను రూపొందిస్తారు . కుడి : రకరకాల బుట్టల శ్రేణితో ఆయేషా కోడలు , ఫాతిమా బీబీ . ఈ బుట్టలను దుకాణాలలోనూ, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌లలోనూ విక్రయిస్తారు

యువ వధువుగా ఆమె, ఆయేషా నేర్పుకలిగిన చేతుల్లో మూంజ్ ఎలా మచ్చిక అయి, ఉత్పత్తుల శ్రేణిగా ఎలా రూపొందించబడుతోందో ఆసక్తిగా చూసేది: అన్ని ఆకారాల్లో, అన్ని పరిమాణాల్లో మూతలున్న, మూతలు లేని బుట్టలు; కోస్టర్లు; ట్రేలు; పెన్ స్టాండులు; సంచులు; చెత్తబుట్టలు; చిన్న ఉయ్యాలలు, ట్రాక్టర్ల వంటి మరిన్ని అలంకార వస్తువులు. ఈ ఉత్పత్తుల అమ్మకం, ఇంటిలోని మహిళలు తగినవిధంగా ఉపయోగించుకునేలా ఒక స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

"పిపిరాసాలోని మా ఇంట్లో మా అమ్మ కూడా అలా చేయడం ( మూంజ్ ఉత్పత్తులను తయారు చేయడం) నేను చూశాను" అని ఫాతిమా చెప్పారు. కొద్దికాలంలోనే ఫాతిమా కూడా ఆ కళలో పట్టుసాధించారు. “నేను ఇంట్లో పని చేసుకునే గృహిణిని. కానీ నాకు ఇంకా ఏదైనా చేయాలనే గొప్ప కోరిక ఉంది. ఇప్పుడు (ఈ పనితో) నేను నెలకు దాదాపు 7,000 రూపాయలు సంపాదించగలను” అని తొమ్మిదేళ్ల ఆఫియా, ఐదేళ్ల ఆలియాన్‌లకు తల్లి అయిన ఫాతిమా చెప్పారు.

ఆమె మూంజ్ కళాకృతులను తయారు చేయకుండా ఉన్న సమయంలో ఫాతిమా ఆ కళ గురించి వివిధ మార్గాల్లో ప్రచారం చేయడంలో బిజీగా ఉంటారు: మూంజ్ ఉత్పత్తులను సేకరించడం, మార్కెటింగ్ చేయడం, కొత్త కొనుగోలుదారులను కనిపెట్టడం, శిక్షణా వర్క్‌షాప్‌లను నిర్వహించడం, ఆ కళకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించడానికి ప్రయత్నించడం. ఆమె తన స్వంత మహిళా స్వయం సహాయక బృందాన్ని (SHG) కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఆమె 'ఏంజెల్' అని పేరు పెట్టారు.  తోటి మహిళలను తమ వెంట నడిపించగలిగే బలమైన, దయగల మహిళల గురించి విన్న కథల నుండి పొందిన ప్రేరణతో ఆ పేరు పెట్టారు. "మహిళలు తమ తోటి మహిళలతో సంతోషంగా ఉండే కథలను, చలనచిత్రాలను నేను ఆనందిస్తాను. పోటీపడటం లేదు" అని ఆమె వివరిస్తారు.

రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడంతో సహా ఆమెకు లభించిన గుర్తింపు, గౌరవం చాలా ఆనందోత్సాహాలనిస్తాయి. “ఇంతకుముందు నా భర్త (మోటార్ మెకానిక్) నా రాకపోకల గురించి ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు నాకు లభిస్తున్న గుర్తింపును చూసి అతను నా గురించి గర్వపడుతున్నారు. గత రెండు సంవత్సరాలలో, నేను వారంలో రెండు రోజులు మాత్రమే ఇంట్లో ఉన్నాను,” అన్నారామె, తన స్వాతంత్ర్యానునుభూతిని పంచుకుంటూ. తన స్వయం సహాయక బృంద (SHG) సభ్యులను, కొనుగోలుదారులను కలవడం, ఇతరులకు శిక్షణ ఇవ్వడం, తన పిల్లలను చూసుకోవడంలోనే ఆమె సమయమంతా గడిచిపోతుంది.

మాహెవా గ్రామ ఔత్సాహిక మహిళలు మూంజ్‌ను ప్రోత్సహించే చర్యను హృదయపూర్వకంగా స్వాగతించారు, అలాగే వారి ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు

వీడియో చూడండి : ప్రయాగ్ రాజ్ లో గడ్డి మరింత పచ్చగా ఉంటుంది

అయినప్పటికీ వాగుడు ఆగడం లేదు. “నేను శిక్షణా సమావేశాలకు హాజరైనప్పుడు. అందరం కలిసి ఫోటో తీసుకు న్నాం; జనం వచ్చి మా అత్తగారితో, 'ఆమెను చూడు, మగవారితో కలిసి ఫోటో తీయించుకుంటోంది!' అనేవారు. అయితే అటువంటి మాటలేవీ నన్నాపలేకపోయాయి,” అని ఉత్తరప్రదేశ్‌లోని ఆ చిన్న పట్టణంలో ఇరుకైన సామాజిక నిబంధనల బంధనాలూ బాణాలూ తనని నిరుత్సాహపరచడాన్ని ఇష్టపడని ఆమె చెప్పారు.

ఉత్తర ప్రదేశ్‌లోని మాహెవా పట్టి పశ్చిమ్ ఉపర్‌హార్, 6,408 మంది జనాభా(2011 జనాభా లెక్కల ప్రకారం) కలిగిన పట్టణం. అయితే స్థానికులు ఇప్పటికీ దీనిని 'మాహెవా గ్రామం'గానే చెప్తారు. ఇది కర్చనా తహసీల్‌ లో, సంగమ్ - యమునా, గంగా నదుల సంగమం - నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ముఖ్యమైన హిందూ తీర్థయాత్రా స్థలాలలో ఇది ఒకటి .

మాహేవా ప్రజల జీవితాలకూ, వారి జీవనోపాధికీ సంబంధించి యమునా నది ఒక ప్రధానమైన అనుసంధానం. ఇక్కడి హస్తకళాకారులైన స్త్రీలు తాటి ఆకులతో అల్లిన చిన్న బుట్టలలో పూలు, ఇతర పూజా సామగ్రి నింపి సంగమ్ వద్ద యాత్రికులకు సరఫరా చేస్తారు. పురుషులు ప్రయాగ్‌రాజ్ నగరంలో మెకానిక్‌లుగా, డ్రైవర్‌లుగా పనిచేయడానికి వెళతారు; లేదంటే దగ్గరలోనే చిన్న దుకాణాలను నడపడమో, తినుబండారాల దుకాణాలలో పనిచేయడమో చేస్తారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రయాగ్‌రాజ్ జిల్లా జనాభాలో (2011 జనాభా లెక్కల ప్రకారం) ముస్లిమ్ జనాభా 13 శాతం ఉండగా, మాహెవాలో ముస్లిమ్ జనాభా కేవలం ఒక శాతం కంటే కొంచం ఎక్కువ గా ఉంది అయినప్పటికీ ఈ కళ పునరుజ్జీవనానికి నాయకత్వం వహిస్తున్నది ప్రధానంగా, దాదాపుగా ఫాతిమా, ఆయేషా వంటి ముస్లిమ్ మహిళలే. "మేము మహిళలందరికీ శిక్షణ ఇస్తున్నాము. కానీ చివరికొచ్చేసరికి, దాదాపు ఒకే సామాజికవర్గానికి చెందిన మహిళలే ఈ కళను అభ్యాసం చేస్తున్నారు. ఇతర వర్గాలకు చెందినవారు పనిని పూర్తిగా నేర్చుకునేందుకు తిరిగి రారు. బహుశా వారు ఇతర పనులతో బిజీగా ఉంటుండవచ్చు,” అని ఫాతిమా చెప్పారు.

*****

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ : వారి టెర్రస్ పై ఉన్న గది బయట ఫాతిమా , ఆయేషా . గదిలో ఎండిన గడ్డిని నిల్వ చేస్తారు . కుడి : తాజాగా కత్తిరించిన మూంజ్ ను మీగడ రంగులోకి వచ్చే వరకు ఒక వారం పాటు ఎండలో ఎండబెట్టాలి . తర్వాత దానిని ఎండిన కాసా - ఇది మూంజ్ ను బంధించడానికి ఉపయోగించే సన్నని రెల్లు - తో కట్టలుగా కడతారు

మాహెవాలోని తన ఇంటి టెర్రస్‌పై ఉన్న స్టోర్‌రూమ్‌ తలుపులు తెరిచారు ఫాతిమా. ఆ గదిలో వాడకుండా పడేసిన ఇంటి సామానులున్నాయి. వాటిపైన దండలుగా చుట్టిన విలువైన ఎండిన మూంజ్ గడ్డిని ఉంచారు. “చలి కాలంలో (నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు) మాత్రమే మాకు మూంజ్ ‌ గడ్డి దొరుకుతుంది. మేము పచ్చి గడ్డిని పేలికలుగా ముక్కలు చేసి, ఎండబెట్టి, ఇక్కడ నిల్వ చేస్తాము. ఈ గది ఇంటి అంతట్లోకీ అత్యంత పొడిగా ఉండే గాలి చొరబడని ప్రదేశం. వర్షం, గాలి గడ్డి రంగును పసుపు రంగులోకి మారుస్తాయి" అని ఆమె చెప్పారు.

గడ్డి పసుపు రంగులోకి మారిందంటే, అది చాలా పెళుసుగా ఉంటుందనీ, రంగులు అద్దటానికి పనికిరాదనీ అర్థం. లేత మీగడ రంగులో ఉండే మూంజ్ గడ్డికి కళాకారులు తమకు కావలసిన రంగును వేయగలుగుతారు. అందుకోసం, తాజాగా కత్తిరించిన మూంజ్ ‌ను కట్టలుగా కట్టి, ఒక వారం పాటు ఆరుబయట, ఎండగా ఉండి గాలి లేని రోజులలో జాగ్రత్తగా ఎండబెట్టాలి

ఫాతిమా అత్తగారైన అయేషా బేగం కూడా సరుకు నిల్వ ఎంత ఉందో చూసేందుకు పైకి ఎక్కారు. ఇప్పుడు 50ల వయసులో ఉన్న, అమిత నైపుణ్యం కలిగిన కళాకారిణి అయిన అయేషా, కొద్ది నడక దూరంలో ఉన్న యమున ఒడ్డుకు వెళ్లి, ఎంత అవసరమైతే అంత ఎక్కువ గడ్డిని కోసుకొచ్చుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా విపరీతమైన అభివృద్ధి, పట్టణం వ్యాప్తిచెందడం వంటివాటి మూలంగా, ఏ అడ్డంకులూ లేకుండా ఈ అడవి గడ్డి యథేచ్ఛగా పెరిగే నదీతీర ప్రాంతం కుంచించుకుపోయింది.

“ఇప్పుడు, యమునా తీరంలో ప్రయాణించే మల్లాహ్‌లు (పడవలు నడిపేవారు) మాకు మూంజ్ ని తీసుకొచ్చి, ఒక గత్తా (మోపు)ను 300-400 రూపాయలకు అమ్ముతున్నారు. (ఒక గత్తా దాదాపు 2-3 కిలోల బరువుంటుంది),” అని మేము క్రింద, ఆమె పనిచేసుకునే వసారాలోకి దిగుతున్నప్పుడు, ఆయేషా చెప్పారు. ఒక గత్తా మూంజ్ ‌తో సుమారుగా రెండు 12 x 12 అంగుళాల పరిమాణమున్న బుట్టలను తయారు చేయగలరనుకోవచ్చు. అవి మొత్తం రూ. 1,500లకు అమ్ముడవుతాయి. ఈ పరిమాణంలోని బుట్టలను సాధారణంగా మొక్కలను పెంచడానికి లేదా బట్టలు నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.

7 నుండి 12 అడుగుల ఎత్తు వరకూ పెరిగే సరపత్ గడ్డి, మూంజ్ కళలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. సహాయక పాత్రే కానీ మరో ముఖ్యమైన పాత్రను పోషించే గడ్డి- దళసరిగా ఉండే మూంజ్ ‌ను కట్టడానికి ఉపయోగించే కాసా అని పిలిచే సన్నని రెల్లు. పూర్తిగా తయారైన ఉత్పత్తిలో ఈ కాసా చాలా తక్కువగా కనిపిస్తుంది. చేతికి అందినంత గడ్డిని కట్టలుగా కట్టి, కట్ట ఒకటికి రూ. 5-10లకు అమ్ముతుండే ఈ కాసా గడ్డి నది ఒడ్డున పుష్కలంగా దొరుకుతుంది.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ : సిరాహి అనే పదునైన సూదితో పిడిని నేస్తోన్న ఆయేషా బేగం . కుడి : ఆకారాన్ని తీసుకొచ్చేందుకు మందపాటి మూంజ్ పరకలను సన్నని కాసా చుట్టూ చుట్టారు

తమ ఇంటి ముంగటి వసారాలో కూర్చుని, ఆయేషా తిరిగి పనిని మొదలుపెట్టారు. ఆమె బుట్టల మూతలపై ఉండే పిడులను (గుబ్బలు) తయారుచేస్తున్నారు. కేవలం ఒక జత కత్తెరలతో, పదునైన సూదితో ఆమె చక్కగా గడ్డి ఆకులను ముక్కలు చేస్తూ, లాగుతూ, నెట్టుతూ, బిగిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు గట్టిగా ఉన్నవాటిని మరింత మృదువుగా చేయడానికి ఒక బకెట్‌లో ఉన్న నీటిలో ముంచుతున్నారు.

"నేను నా అత్తగారిని చూస్తూ [ఈ పనిని] ప్రారంభించాను. 30 ఏళ్ల క్రితం నేనొక యువ వధువుగా ఈ ఇంటికి వచ్చినప్పుడు తయారుచేసిన మొదటి వస్తువు, రోటీ కా డబ్బా (రొట్టెలను పెట్టుకునే డబ్బా) ” అని అయేషా చెప్పారు. ఒకసారి ఆమె జన్మాష్టమి (కృష్ణుడు పుట్టినరోజును జరుపుకునే పండుగ) నాడు చిన్నికృష్ణుడి విగ్రహాన్ని వేలాడదీయడానికి ఒక చిన్న ఊయలను కూడా చేశారు.

లోతైన గాయపు గీతలతో ఉన్న తన చేతులను చూపిస్తూ, "సన్నటి కత్తిలా ఉన్నా, చాలా బలంగా ఉండే ఈ గడ్డితో పనిచేయడం వల్ల మా వేళ్లు కోసుకుపోతాయి" అని చెప్పారు. మొదటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆమె ఇలా జతచేస్తారు, “(ఆ రోజుల్లో) మొత్తం ఇంటిల్లిపాదీ - మహిళలు, పిల్లలు - కలిసి మూంజ్ ఉత్పత్తులను తయారుచేసేవారు. పురుషులు వాటిని మార్కెట్లో విక్రయించేవారు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు మహిళలు కలిసి పనిచేస్తే, మేము రోజుకు దాదాపు 30 రూపాయలు సంపాదించగలిగేవాళ్ళం. అది మా ఇళ్లను నడపడానికి సరిపోయేది.

దాదాపు ఒక దశాబ్దం క్రితం, మూంజ్ ‌కి డిమాండ్ పడిపోయింది. ఈ కళను అభ్యాసం చేసే మహిళల సంఖ్య పడిపోవడంతో కొన్ని ఉత్పత్తులు మాత్రమే అమ్మకానికి ఉండేవి. ఇంతలో ఊహించని రూపంలో సహాయం వచ్చింది. 2013లో, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తన ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP) పథకాన్ని ప్రారంభించింది. ప్రయాగ్‌రాజ్ జిల్లా ప్రత్యేక ఉత్పత్తిగా మూంజ్ ఎంపికయింది. దీని చరిత్ర కనీసం ఏడు దశాబ్దాల నాటిది.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ : 50 వయసులో ఉన్న ఆయేషా బేగం మూంజ్ కళలో అనుభవజ్ఞురాలు . ' నేను మా అత్తగారిని చూస్తూ దీనిని ప్రారంభించాను . 30 ఏళ్ల క్రితం నేను తయారుచేసిన మొదటి వస్తువు , ఒక రోటీల పెట్టె .' కుడి : ఇటీవల ఆయేషా చేసిన కొన్ని డబ్బాలు , బుట్టలు

"ఒడిఒపి స్థాయి ( మూంజ్ ఉత్పత్తుల) డిమాండ్‌నూ అమ్మకాలనూ పెంచింది. చాలామంది కళాకారులు తిరిగి ఈ కళవైపుకు వస్తున్నారు. కొత్త వ్యక్తులు కూడా (క్రాఫ్ట్)లో చేరుతున్నారు" అని ప్రయాగ్‌రాజ్ జిల్లా పరిశ్రమల సహాయ సంచాలకులు అజయ్ చౌరాసియా చెప్పారు. ఒడిఒపి పథకం ప్రయోజనాలను హస్తకళాకారిణులకు అందజేసే రాష్ట్ర సంస్థ అయిన జిల్లా ఉద్యోగ్ కేంద్రకు కూడా ఆయన అధిపతిగా ఉన్నారు. "మేము దీన్ని చేయడానికి ముందుకు వచ్చే మహిళలకు శిక్షణ ఇస్తున్నాము, కిట్‌లను పంపిణీ చేస్తున్నాము. ఏటా 400 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం" అని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా, దేశీయ స్థాయిలో కూడా క్రమం తప్పకుండా మేళాలు, ప్రదర్శన(ఫెయిర్‌)లను నిర్వహించడం ద్వారా  ఉద్యోగ్ కేంద్ర ఈ కళకు మద్దతు ఇస్తుంది.

మాహెవా గ్రామ ఔత్సాహిక మహిళలు మూంజ్ ‌ను ప్రోత్సహించే చర్యను హృదయపూర్వకంగా స్వాగతించారు; అలాగే తమ ఆదాయాన్ని పెంపు చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. తమకు ఇప్పుడు వాట్సాప్‌లో ఆర్డర్లు వస్తున్నాయనీ, పనినీ సంపాదననూ కూడా మహిళలకు సమానంగా పంచుతున్నామనీ ఫాతిమా చెప్పారు.

ఒడిఒపి పథకం కూడా నిధులను వారి ఇంటి వద్దకే తీసుకువచ్చింది. “ఈ పథకం మాకు రుణాలు అందేలా చేస్తుంది. నా స్వయం సహాయక సంఘంలోని చాలామంది పని ప్రారంభించేందుకు 10,000 నుండి 40,000 రూపాయల వరకూ అప్పు తీసుకున్నారు.” అని ఫాతిమా చెప్పారు.ఈ పథకం మొత్తం అప్పు మీద 25 శాతం సబ్సిడీని అందిస్తుంది. అంటే, అప్పు మొత్తంలో 25 శాతం మాఫీ చేయబడుతుంది. మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లోపు తిరిగి చెల్లిస్తే, వడ్డీ ఉండదు. ఆ తర్వాత చెల్లిస్తే సంవత్సరానికి ఐదు శాతం వడ్డీ ఉంటుంది.

ఈ పథకం ఇతర ప్రాంతాల నుండి కూడా మహిళలను ఆకర్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఆయేషా వివాహిత కుమార్తె నస్రీన్ అక్కడికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫూల్‌పుర్ తహసీల్ లోని అందావా గ్రామంలో నివసిస్తున్నారు. “ఇక్కడ [అందావాలో] టైల్స్ వేసే ముందు వర్షపు నీరు లోపలికి రాకుండా ఉండేందుకు మాత్రమే పైకప్పులుగా ఈ గడ్డిని ఉపయోగిస్తారు” అని విద్య, మనస్తత్వశాస్త్రాలలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్న ఈ 26 ఏళ్ల యువతి చెప్పారు. మూంజ్ పని యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని తన ఇంటిలో చూసిన ఆమె, అందావాలో ఆ కళను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.

PHOTO • Priti David
PHOTO • Priti David

అయేషా బేగం , ఫాతిమా బీబీల పొరుగింటి అయేషా బేగం ( ఆమెదీ అదే పేరు ) తాను తయారుచేసే ప్రతి మూంజ్ ఉత్పత్తికి రూ . 150-200 సంపాదిస్తున్నారు . ' ఊరికే కూర్చునే బదులు , నేను డబ్బు సంపాదిస్తున్నాను , నాకు కాలక్షేపమూ అవుతోంది'

ఇరవై ఏళ్ల క్రితం రోటీలు ఉంచే మూంజ్ బుట్ట ఖరీదు రూ. 20. నేడు అదే బుట్ట ఖరీదు రూ. 150 లేదా అంతకంటే ఎక్కువ. ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, ఇది గౌరవప్రదమైన సంపాదనగానే పరిగణించబడుతుంది. అందుకే 60 ఏళ్ల వయస్సులో కూడా, ఫాతిమా పొరుగింటివారైన అయేషా బేగంకు ఎక్కువసేపు పని చేస్తే ఇబ్బందిని కలిగించే కళ్ళలా కాకుండా, ఆమె చూపు ఈ కళ పట్ల మసకబారలేదు. “నేను చేసే వస్తువుకు దాదాపు 150-200 రూపాయలు సంపాదించగలను. ఊరికే కూర్చోకుండా ఈ పనిచేసి డబ్బు సంపాదిస్తూ కాలక్షేపం చేస్తున్నాను” అని ఆమె చెప్పారు. ఆమె తన ఇంటి ముందున్న వసారాలో నేలపై పరచివున్న చాప మీద కూర్చొని ఉన్నారు. వెనుక ఉన్న గోడకు ఆనుకుని కూర్చొని ఉన్న ఆమె చేతి వేళ్లు లోపలివైపుకూ బయటివైపుకూ కదులుతూ ఒక బుట్ట కోసం మూతను తయారుచేస్తున్నాయి.

“ఇదయ్యాక ఆమె తన వెన్ను నొప్పి గురించి ఫిర్యాదు చేస్తుంది,” అంటూ ఆమె మాటలు వింటున్న ఆమె భర్త ఎత్తిపొడిచారు. ఈ పనిని మగవాళ్ళు చేస్తారా, అని మేము అతనిని అడిగినప్పుడు, రిటైర్డ్ టీ కొట్టు యజమాని అయిన మహ్మద్ మతీన్ నవ్వారు. "కొంతమంది మగవాళ్ళు చేయగలరు కానీ నేను చేయలేను," అని అతను చెప్పారు.

మధ్యాహ్న సమయం ముగియబోతోందనగా, ఫాతిమా తల్లి ఆస్మా బేగం పూర్తి చేసిన వస్తువులను తీసుకొని తన కూతురి ఇంటికి వచ్చారు. మరుసటి రోజున ప్రయాగ్‌రాజ్‌లోని సర్క్యూట్ హౌస్‌లో జరిగే ఒక చిన్న ప్రదర్శనలో ప్రదర్శించి, అమ్మడం కోసం ఫాతిమా వాటిని తీసుకువెళతారు. ఆస్మా తాను చేసిన పనిని చూపించేందుకు, చక్కని పనితనం నిండిన మూత ఉన్నబుట్టను తీసుకున్నారు. “వేడి వంటకాలను ఉంచేందు కోసం ఒక చక్కటి కోస్టర్‌ను తయారుచేయడానికి మూడు రోజుల వరకు పట్టవచ్చు. మీరు దాన్ని నెమ్మదిగానే చేయాలి, లేదంటే గడ్డి చిరిగిపోతుంది,” అని ఆమె వివరించారు. ఈ చేతిపని చేసేవారు మరింత మృదువుగా, సన్నగా ఉండే వస్తువును తయారుచేయడానికి అతి సన్నని గడ్డిపరకలను ఉపయోగిస్తారు. ఇది తయారుచేయడానికి ఎక్కువ సమయం పడుతుంది, అందువలన అధిక ధరనూ డిమాండ్ చేస్తుంది.

50ల ప్రారంభ వయసులో ఉన్న ఆస్మా మంచి గుర్తింపుపొందిన హస్తకళాకారిణి. మాహెవా నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిపిరాసాలోని తన ఇంటిలో ఈమె, ఇటీవలే 90 మంది మహిళలకు మూంజ్ కళలో శిక్షణ ఇచ్చారు. ఆమె విద్యార్థుల వయస్సు 14 నుండి 50 సంవత్సరాల వరకు ఉంటుంది. “ఇది మంచి పని. ఎవరైనా నేర్చుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, జీవితంలో ముందుకు సాగవచ్చు,” అని ఆమె చెప్పారు. “నేను చేయగలిగినంత కాలం ఈ పని చేస్తాను. నా కూతురు ఫాతిమా చేస్తున్న పని పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను." అన్నారామె.

PHOTO • Priti David
PHOTO • Priti David

ఎడమ : ఫాతిమా తల్లి , ఆస్మా బేగం ( ఎడమవైపు , ఆకుపచ్చ దుపట్టాలో ). మూంజ్ కళలో మహిళలకు శిక్షణ ఇచ్చే నిపుణురాలు . ' ఇలా చేయడం ద్వారా ఎవరైనా నేర్చుకోవచ్చు , డబ్బు సంపాదించవచ్చు , జీవితంలో ముందుకు సాగవచ్చు .' కుడి : తాను తయారు చేసిన వస్తువులలో ఒకటైన మూత ఉన్న రంగుల బుట్టతో ఆస్మా

ఆస్మా 4వ తరగతి వరకు చదువుకున్నారు. దాదాపు రెండు ఎకరాల భూమి ఉన్న రైతు అయిన ఫాతిమా తండ్రితో ఆమెకు 18 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది. శిక్షకురాలిగా ఆస్మా,  జిల్లా ఉద్యోగ కేంద్రం నుండి నెలకు రూ 5,000 సంపాదిస్తున్నారు. ఆరు నెలల ఈ శిక్షణా సమావేశాలకు హాజరయ్యే బాలికలకు నెలకు రూ. 3,000 ఇస్తారు. “ఈ అమ్మాయిలు మామూలుగానైతే ఖాళీగా ఉండేవారు. ఇప్పుడు వారు ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. కొందరు ఆ డబ్బును ముందు చదువుల కోసం ఉపయోగిస్తారు,” అని ఆమె చెప్పారు.

మూంజ్ కళాకారుల కోసం ఒక మ్యూజియంను, వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయటం కోసం ప్రణాళికలు ఉన్నాయి. “మేం మ్యూజియం కోసం ఎదురు చూస్తున్నాం, తద్వారా సందర్శకులు మేము చేసే పనిని చూసి అభినందిస్తారు. అత్యంత నైపుణ్యంతో రూపొందించబడిన ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉంటాయి. మీరు వాటి తయారీ ప్రక్రియను కూడా చూడగలుగుతారు,” అని ఫాతిమా చెప్పారు. ఈ మ్యూజియంకు అనుబంధంగా ఉండే వర్క్‌షాప్ మరింత మంది మహిళలు ముందుకు వచ్చేలా ప్రోత్సహిస్తుంది. గతేడాది చౌరాసియా చెప్పినదాని ప్రకారం, ఈ మ్యూజియం ఉండే క్రాఫ్ట్ విలేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయించింది. "ఇది ప్రారంభమైంది కానీ, పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది," అని ఆయన చెప్పారు.

“వర్క్‌షాప్‌లో, కొందరు అల్లిక పని మాత్రమే చేస్తారు, మరికొందరు రంగుల పని మాత్రమే చేస్తారు - పనులు విభజించబడతాయి. మూంజ్ కళాకారిణులమైన మనమందరం కలిసి కూర్చుని పని చేస్తే బాగుంటుంది,” అని తన భవిష్యత్తును దృఢమైన గడ్డితో గట్టిగా అల్లుకున్న ఫాతిమా అన్నారు.

పనిలో ఉదారంగా సహాయం చేసినందుకు ప్రయాగ్ రాజ్ లోని సామ్ హిగ్గిన్ బోట్టం యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ , టెక్నాలజీ అండ్ సైన్సెస్ (SHUATS) లో పనిచేస్తున్న ప్రొ . జహనారా , ప్రొఫెసర్ ఆరిఫ్ బ్రాడ్ వేలకు రిపోర్టర్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు .

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Reporter : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Editor : Sangeeta Menon

Sangeeta Menon is a Mumbai-based writer, editor and communications consultant.

Other stories by Sangeeta Menon
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli