వేడి సబ్బునీటిలో నానబెట్టిన ఒక దుప్పటిని యువ తాలబ్ హుస్సేన్ లయబద్ధంగా తొక్కుతున్నాడు. ఆ తొక్కడం అతను నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది; అతని ముఖంలో పెద్ద చిరునవ్వు ఉంది. "మీరు పడిపోకుండా సమతుల్యతను కాపాడుకుంటూ నానబెట్టిన దుప్పటిపై నిలబడాలి, " అన్నాడు తాలబ్. మరొక వ్యక్తి దుప్పటి నానబెట్టివున భారీ ఘమేలా (పాత్ర) లోకి మరింత వేడి సబ్బు నీటిని పోస్తుండగా, దన్ను కోసం తాలబ్ తన ముందున్న చెట్టును పట్టుకున్నాడు.

జమ్మూలోని సాంబా జిల్లాలో ఉన్న ఆ చిన్న బకర్‌వాల్ సెటిల్‌మెంట్‌లో చీకటిగా ఉన్న ఒక శీతాకాలపు రాత్రి. అప్పటి అవసరం కోసం సమీపంలో ఏర్పాటుచేసిన కట్టెల పొయ్యి నుండి మాత్రమే కొద్దిగా వెలుతురు వస్తోంది. ఆ పొయ్యి మీద అప్పుడే నేయటం పూర్తిచేసిన ఉన్ని దుప్పట్లను ఉతకడం కోసం ఒక కుండలో నీళ్ళు కాగుతున్నాయి.

ఈ ఉన్ని దుప్పట్లను షెడ్యూల్డ్ జాతుల సముదాయానికి చెందినవారు తయారుచేస్తారు. వీరిలో మేఘ్, మీహ్‌ఘ్ సముదాయానికి చెందినవారు ఈ ఉన్ని పనితనానికి ప్రసిద్ధి చెందారు. దుప్పట్లు తయారైన తర్వాత, వాటిని బకర్‌వాల్ పురుషులు ఉతికి ఆరబెడతారు. దుప్పట్ల తయారీకి అవసరమైన దారాన్నీ నూలునూ సాధారణంగా బకర్‌వాల్ మహిళలు తయారుచేస్తారు; బకర్‌వాల్ కుటుంబాలు ఇంట్లోనే ఆ నూలుకు రంగులద్దుతారు.

Talab Hussain (left) stomping on a traditional woollen blanket in Samba district of Jammu
PHOTO • Ritayan Mukherjee
Bakarwal men (right) washing and drying the blankets.
PHOTO • Ritayan Mukherjee

ఉన్ని దుప్పట్లు తయారైన తర్వాత, వాటిని ఉతికి ఆరబెడుతోన్న బకర్‌వాల్ పురుషులు (ఎడమ). జమ్మూలోని సాంబా జిల్లాలో సంప్రదాయ ఉన్ని దుప్పటిని శుభ్రం చేయటంలో భాగంగా కాళ్ళతో తొక్కుతోన్న తాలబ్ హుసేన్ (కుడి)

ఖలీల్ ఖాన్ స్వస్థలం జమ్మూ జిల్లాలోని పర్గాల్తా గ్రామ సమీపంలోని ఒక సెటిల్‌మెంట్. ఈ పద్ధతిలో కంబళ్ (దుప్పటి)ను తయారుచేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, కష్టంతో కూడుకున్న పని అనీ, అయితే ఇది ఎక్కువకాలం మన్నుతుంది కాబట్టి ముందరికాలంలో చాలా చౌకగా తయారవుతుందనీ ఈ యువ బకర్‌వాల్ చెప్పాడు. మహ్మద్ కాలూ ఖన్నా చర్గల్ నుండి వచ్చారు, ఇది పర్గాల్తా నుండి ఎగువకు ఉన్న నదిలోని ఒక చిన్న సెటిల్‌మెంట్. తన చిన్న కొడుకు నిద్రిస్తున్న పాత ఉన్ని దుప్పటి వైపు చూపిస్తూ అతను, “ఇది చూశారా? (ఈ దుప్పటి) మానవుడున్నంత కాలం, లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా మన్నుతుంది. కానీ మార్కెట్‌లో కొనుగోలు చేసిన యాక్రిలిక్ ఉన్ని దుప్పట్లు కేవలం కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఉంటాయి.” అన్నారు. స్వచ్ఛమైన ఉన్ని దుప్పట్ల మాదిరిగా కాకుండా, పచిమ్‌ (యాక్రిలిక్ ఉన్నిని స్థానికంగా పిలిచే పేరు)తో చేసిన దుప్పట్లు తడిస్తే, ఆరడానికి రోజులు పడుతుందని ఆయన చెప్పారు. "చలికాలంలో యాక్రిలిక్ దుప్పట్లు వాడితే మా పాదాలు మంటపుడతాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి," అని గొర్రెల కాపరులైన ఖలీల్, కాలూ చెప్పారు.

*****

దుప్పట్లు మాత్రమే కాదు, వారి జంతువుల ఉన్ని నుండి కూడా నమ్‌దా లను - ఫెల్టింగ్ టెక్నిక్‌ (ఉన్నిని నేయకుండా దట్టించి చేసే పద్ధతి)ని ఉపయోగించి, రంగురంగుల పూల కుట్టుపనితో తయారుచేసే ముతక ఉన్ని రగ్గులు - కూడా తయారుచేస్తారు. చిన్న దుప్పట్లను, అంటే మెత్తని బొంతలుగా ఉపయోగించే తారూ ను కూడా తయారుచేస్తారు. వాటిని బహుమతులుగా ఇస్తుంటారు. వీటి పైన కూడా మహిళలే కుట్టుపూల పని చేస్తారు. ప్రతి కుటుంబమూ, తెగా కూడా వాటి స్వంత, ప్రత్యేక నమూనా ఆకృతులను కలిగి ఉంటుంది.

"నేను ఒక మెత్తని బొంతను చూసి అది ఏ కుటుంబం నుంచి వచ్చిందో చెప్పగలను," అని తాలబ్ హుస్సేన్ నివసించే సెటిల్‌మెంట్‌లోనే నివసిస్తున్న జరీనా బేగం చెప్పారు. ఒక దుప్పటి తయారు చేయడానికి దాదాపు 15 రోజులు పడుతుందని ఆమె అన్నారు.

“ఆ మూలన ఉన్న దుప్పట్లను చూడండి, అవి కుటుంబాలలో జరిగే పెళ్ళిళ్ళ కోసం. అవి ప్రత్యేకమైనవి. వారి వారి సామర్థ్యాన్ని బట్టి, వరుడి కుటుంబం 12-30, లేదా ఒకోసారి 50 దుప్పట్లను కూడా అందజేస్తుంది,” అని ఆ సముదాయంలో అందరికీ ఇష్టమైన అమ్మమ్మ వంటి జరీనా చెప్పారు. ఈ రోజుల్లో జనం వీటిని ఎక్కువ సంఖ్యలో ఇవ్వటంలేదు. అయినప్పటికీ, సంప్రదాయ పెళ్ళి కానుకగా ప్రతి వేడుకలోనూ దీనిని ఇవ్వడం తప్పనిసరి అని ఆమె చెప్పారు.

దుప్పట్లను అమిత విలువైన పెళ్ళి కానుకలుగా పరిగణిస్తున్నప్పటికీ, వాటి స్థానాన్ని నెమ్మదిగా ఎలక్ట్రిక్ ఉపకరణాలు, ఫర్నిచర్ వంటివి ఆక్రమించాయి.

Zareena Begum is a veteran weaver and lives in Bakarwal settlement Samba district
PHOTO • Ritayan Mukherjee
Zareena Begum is a veteran weaver and lives in Bakarwal settlement Samba district
PHOTO • Ritayan Mukherjee

సాంబా జిల్లాలోని ఒక బకర్‌వాల్ సెటిల్‌మెంట్‌లో నివాసముండే, నేతలో చిరకాల అనుభవమున్న జరీనా బేగం

Munabbar Ali (left) and Maruf Ali (right) showing the handicrafts items they have made with Bakarwal wool
PHOTO • Ritayan Mukherjee
Munabbar Ali (left) and Maruf Ali (right) showing the handicrafts items they have made with Bakarwal wool
PHOTO • Ritayan Mukherjee

బకర్‌వాల్ ఉన్నిని ఉపయోగించి తాము చేతితో తయారుచేసిన కళాకృతులను చూపిస్తోన్న మునబ్బర్ అలీ(ఎడమ), మారూఫ్ అలీ (కుడి)

మునబ్బర్, ఆయన భార్య మారూఫ్ దిగువ వాలులో ఉన్న బసోహ్‌లీ తెహసిల్‌లోని సెటిల్‌మెంట్‌కు ఒక అంచున నివసిస్తున్నారు. వెలసిపోయిన ఒక గుడారం కింద తమ కళాకృతులను ప్రదర్శిస్తూ మునబ్బర్ ఇలా అంటున్నారు, “ఈ అందమైన చేతి కుట్టుపనిని చూడండి! అయితే మాకిప్పుడు ఆదాయమేమీ లేదు."

వారి గుడారంలో, మా చుట్టూ వారు చేతితో తయారుచేసిన వస్తువులు చెల్లాచెదురుగా పడున్నాయి. వారు కశ్మీర్‌కు వలస వెళ్ళేటపుడు తమకున్న 40 నుండి 50 గొర్రెలు, మేకలతో పాటు తాము చేతితో తయారుచేసిన ఈ వస్తువులను కూడా తీసుకువెళ్తుంటారు. ఒక తారూ (బొంత), తలియారో , గుర్రం మెడ చుట్టూ కట్టే అనేక గంటలున్న గల్తాణి అనే పట్టెడ, చీకీ అనే కళ్ళెం - ఇలాంటి గుర్రానికి సంబంధించిన వస్తువులు కూడా ఉంటాయి. “ఇదంతా చాలా కష్టంతో కూడుకున్న పని- ఈ చేతి కుట్టుపని, పశువులు. (కానీ) మాకు ఎలాంటి గుర్తింపు లేదు. (మా పని గురించి) ఎవరికీ తెలియదు,” అని మునబ్బర్ అంటున్నారు.

*****

"ప్రస్తుతం మరలు (ఉన్నిని వడికేవి) ఉన్నవారిని కనుక్కోవడం కష్టం" అని మాజ్ ఖాన్ చెప్పారు. అరవై పైబడిన వయసులో ఉన్న ఖాన్, ఇప్పటికీ ఉన్నిని వడుకుతూనే ఉన్న కుటుంబానికి చెందినవారు. ఈ సముదాయానికి చెందిన చాలామంది చరఖా (చేతితో నూలును, ఉన్నిని వడికే యంత్రం) చచ్చిపోయిందనీ, వడకడం మానేశామనీ చెప్పారు.

ఫలితంగా పశుపోషకులు ఉన్ని అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. “ఒకప్పుడు కిలోగ్రాముకు కనీసం 120-220 (రూపాయలు) వచ్చేది, కానీ ఇప్పుడు మాకు ఏమీ రావటంలేదు. ఒక దశాబ్దం క్రితం మేక వెంట్రుకలకు కూడా మార్కెట్‌లో ధర ఉండేది; ఇప్పుడు గొర్రెల ఉన్నిని కొనేవారు కూడా లేరు,” అని కఠువా జిల్లాలోని బసోహ్‌లీ తెహసీల్‌ కు చెందిన బకర్‌వాల్, మహమ్మద్ తాలిబ్ చెప్పారు. ఉపయోగించని ఉన్ని వారి కొట్టుగదులలో ఉంటుంది, లేదంటే గొర్రెల ఉన్నిని కత్తిరించే స్థలంలోనైనా వదిలేస్తున్నారు. ఉన్నితో పనిచేసే కళాకారుల సంఖ్య కూడా తగ్గిపోయింది.

“ఈ రోజుల్లో బకర్వాల్‌లు ఎలాంటి ఉత్పత్తులను తయారుచేయడం లేదు. ఇది చోటా కామ్ (చిన్న, నీచమైన పని) అయిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా వాడుతోన్న కృత్రిమ ఉన్ని చాలా చౌకగా దొరుకుతుంది," అని గుజ్జర్-బకర్వాల్ సముదాయంతో చాలా సంవత్సరాలు పనిచేసిన కార్యకర్త, పరిశోధకుడు డాక్టర్ జావేద్ రాహీ చెప్పారు.

Left: Colours for the bankets are chosen by the Bakarwals but the weaving and stitching are done by a blanket maker.
PHOTO • Ovee Thorat
Right: Maaz Khan’s grandson Khalil shows the blanket that the family has made
PHOTO • Ovee Thorat

ఎడమ: దుప్పట్ల రంగులను బకర్‌వాలాలు ఎంపిక చేస్తారు, కానీ వాటిని నేయటం, కుట్టడం వంటి పనులను మాత్రం దుప్పట్లు తయారుచేసేవారు చేస్తారు. కుడి: తమ కుటుంబం తయారుచేసిన దుప్పటిని చూపిస్తోన్న మాజ్ ఖాన్ మనవడు ఖలీల్

Left: Goat hair rope is also made along with the woollen articles. It is useful for supporting tents and for tying horses and other livestock.
PHOTO • Ovee Thorat
Right: A taru that was made as a wedding gift some time ago
PHOTO • Ovee Thorat

ఎడమ: ఉన్నితో చేసే వస్తువులతో పాటు గొర్రె వెంట్రుకలతో తాళ్ళను కూడా తయారుచేస్తారు. ఈ తాళ్ళు గుడారాలను కట్టడానికీ, గుర్రాలను, ఇతర పశువులను కట్టడానికీ ఉపయోగపడతాయి. కుడి: కొంతకాలం క్రితం ఒక పెళ్ళి కానుకగా తయారుచేసిన తారూ

జమ్మూ, ఇంకా ఆ చుట్టుపక్కల పశువులు మేసే స్థలాలు చాలా తక్కువగా ఉన్నందున, ఉన్ని కోసం జంతువుల మందలను పెంచిపోషించడం ప్రస్తుతం సులభంగా ఏమీ లేదు. తమ జంతువులు మేయడానికి పచ్చికబయళ్ళను ఇచ్చినందుకు ఆ భూముల సొంతదారులకు కూడా వీరు డబ్బు చెల్లించాల్సివుంటుంది.

ఇటీవల సాంబా జిల్లాలోని గ్రామాల చుట్టూ ఉన్న చాలా ప్రాంతాలను ఆక్రమణ జాతికి చెందిన మొక్క, లేంటానా కామెరా (తలంబ్రాల మొక్క) ఆక్రమించేసింది. “మేమిక్కడ మా పశువులను మేపలేము. ప్రతిచోటా కలుపు మొక్కలు ఉన్నాయి,” అని బసోహ్‌లీ తెహసీల్‌ లోని ఒక చిన్న గ్రామంలో నివసించే మునబ్బర్ అలీ చెప్పారు.

అనేక పాత జాతుల జంతువులను రాజ్యం మార్చివేసింది. ప్రస్తుతం ఉన్న సంకరజాతి గొర్రెలు మైదానాల వేడిమిని ఎక్కువ కాలం తట్టుకోలేవనీ, పర్వత ప్రాంతపు దారులను దాటుకొని పోలేవనీ బకర్‌వాలాలు చెప్పారు. “మేం కశ్మీర్‌కు వలస వెళ్ళేటప్పుడు, చిన్న గట్టు ఉన్నా వాటికి దూకడం కష్టం కావడంతో అవి దారులలో ఆగిపోయేవి. పాత జాతికి చెందిన గొర్రెలు బాగా నడిచేవి,” అంటూ తాహిర్ రజా అనే గొర్రెల కాపరి మాతో చెప్పారు.

అడవుల పెంపకం ప్రాజెక్టులు లేదా పరిరక్షణ కార్యకలాపాలకు ప్రతిగా సాయుధ బలగాలకు లేదా అటవీ శాఖకు రాజ్యం ద్వారా మంజూరైన కంచెలు, మేత మేసే భూముల్లోకి పశువులు వెళ్ళడాన్ని పరిమితం చేస్తున్నాయి.

ఇది చదవండి: పచ్చిక బయళ్లకు కంచె వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బకర్‌వాల్ పశుపోషకులు

కంచెల గురించి ప్రభుత్వం ఉపయోగించే మాటలను ఉపయోగించి దీని గురించి సంగ్రహంగా చెప్పాలంటే, "(మాకు, మా జంతువులకు) ప్రతిచోటా దారులు మూసే ఉంటాయి."

సెంటర్ ఫర్ పాస్టొరాలిజం మంజూరు చేసిన ఇండిపెండెంట్ ట్రావెల్ గ్రాంట్ ద్వారా ఋతాయన్ ముఖర్జీ పాస్టోరల్ మరియు సంచార కమ్యూనిటీల గురించి నివేదిస్తున్నారు . నివేదికలోని కంటెంట్ పై కేంద్రం ఎటువంటి సంపాదకీయ నియంత్రణను పాటించలేదు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ritayan Mukherjee

Ritayan Mukherjee is a Kolkata-based photographer and a PARI Senior Fellow. He is working on a long-term project that documents the lives of pastoral and nomadic communities in India.

Other stories by Ritayan Mukherjee
Ovee Thorat

Ovee Thorat is an independent researcher with an interest in pastoralism and political ecology.

Other stories by Ovee Thorat
Editor : Punam Thakur

Punam Thakur is a Delhi-based freelance journalist with experience in reporting and editing.

Other stories by Punam Thakur
Photo Editor : Binaifer Bharucha

Binaifer Bharucha is a freelance photographer based in Mumbai, and Photo Editor at the People's Archive of Rural India.

Other stories by Binaifer Bharucha
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli