“మేము ఒక రహస్య మార్గంలో బయటికి తప్పించుకు వెళ్లాం. మరింకేం చేయగలం? కనీసం ఆ మెటీరియల్ మా వద్ద ఉంటే ఇంటి వద్ద కూర్చుని బుట్టలను అల్లి వాటిని సిద్ధం చేసే వాళ్లం,” అని తెలంగాణాలోని కంగల్ గ్రామానికి చెందిన బుట్టల అల్లిక కార్మికులు చెప్పారు. వాళ్లు ప్రయాణించిన రహస్య మార్గమేదో తెలుసా? పోలీసు బ్యారికేడ్లు గానీ, గ్రామ వాసులు ఏర్పరిచిన ముళ్ల కంచెలు గానీ లేనటువంటి ఒక దారి.

ఏప్రిల్ 4వ తేదీన, నెలిగుందరాశి రాములమ్మ అనే మహిళతో పాటు మరో నలుగురు మహిళలు, ఒక పురుషుడు కలిసి కంగల్ గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని వెల్లిదండుపాడు అనే తండాకు వెళ్లి ఈత చెట్ల ఆకులను సేకరించడానికి గాను, ఉదయం దాదాపు 9 గంటలకు ఆటో ఎక్కారు. వాటితో వాళ్లు బుట్టలను అల్లుతారు. సాధారణంగా ఈ ఆకులను ప్రభుత్వ భూమి నుండి సేకరిస్తారు, లేదా ఏదైనా వ్యవసాయ భూమి నుండి సేకరిస్తే, ఆ భూమిని సాగు చేసే రైతుకు కొన్ని బుట్టలను ప్రతిఫలంగా ఇస్తారు.

కంగల్‌లో బుట్టలను అల్లే కార్మికులు ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారు, వీరిని తెలంగాణాలో షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరిస్తారు. వీళ్ల బుట్టల అమ్మకానికి మార్చి నుండి మే వరకు గల కాలం ఎంతో ముఖ్యమైనది. ఆ ఆకులు ఎండేందుకు ఈ నెలల్లోని అధిక ఉష్ణోగ్రతలు దోహదపడతాయి.

సంవత్సరంలో మిగిలిన నెలల్లో వాళ్లు సాధారణంగా రైతు కూలీలుగా పని చేసి రోజుకు రూ. 200 సంపాదిస్తారు. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే పత్తి సాగు సీజన్‌లో కొందరు నెల రోజుల పాటు అడపాదడపా రోజుకు రూ. 700-800 వరకు సంపాదించగలుగుతారు. అయితే అది అందుబాటులో ఉన్న పనిని బట్టి ఉంటుంది.

బుట్టలను అమ్మడం ద్వారా వారికి వచ్చే ఆదాయానికి ఈ సంవత్సరం కొవిడ్-19 లాక్‌డౌన్ అడ్డుకట్ట వేసింది.. “డబ్బున్న వాళ్లు తృప్తిగా భోంచేస్తున్నారు. కానీ మా దగ్గర డబ్బు లేదు. అందుకే మేము [ఈత చెట్ల ఆకులను సేకరించేందుకు] వచ్చాం. లేకపోతే ఎందుకు వస్తాం?” అని దాదాపు 70 ఏళ్ల రాములమ్మ అడిగారు.

The baskets Ramulamma (left), Ramulu (right) and others make are mainly used at large gatherings like weddings to keep cooked rice and other edible items. From March 15, the Telangana government imposed a ban on such events
PHOTO • Harinath Rao Nagulavancha
The baskets Ramulamma (left), Ramulu (right) and others make are mainly used at large gatherings like weddings to keep cooked rice and other edible items. From March 15, the Telangana government imposed a ban on such events
PHOTO • Harinath Rao Nagulavancha

రాములమ్మ (ఎడమ), రాములు (కుడి) తయారు చేసే బుట్టలను పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో అన్నాన్ని లేదా ఇతర తినుబండారాలను నిల్వ చేసేందుకు వాడతారు. అయితే మార్చి 15 నుండి అటువంటి ఫంక్షన్లపై తెలంగాణా ప్రభుత్వం నిషేధం విధించింది

రాములమ్మ గ్రూపులో ఉన్న ఆరుగురూ కలిసి 2-3 రోజుల పాటు, రోజుకు 5-6 గంటల చొప్పున పని చేస్తే 30-35 బుట్టలను అల్లగలుగుతారు. సాధారణంగా కుటుంబ సభ్యులంతా కలిసి పని చేస్తారు, అలా పని చేసే గ్రూపులు కంగల్‌లోనే కనీసం 10 ఉన్నాయని రాములమ్మ అంచనా వేశారు. నల్గొండ జిల్లా కంగల్ మండలంలోని ఈ గ్రామ జనాభా 7 వేలు ఉండగా వారిలో దాదాపు 200 మంది ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు.

“ముందుగా ఆ ఆకుల మీద ఉండే ముళ్లను తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని నానబెట్టి, ఎండబెట్టి ఆ ఆకులను సన్నని, సులువుగా వంచగలిగేలా చింపుతాము. ఆ తర్వాత బుట్టలను [అలాగే ఇతర ఐటెమ్‌లను] అల్లుతాం,” అని రాములమ్మ వివరించారు. “ఇంత చేశాక కూడా, ఇప్పుడు [లాక్‌డౌన్ వల్ల] అమ్మడానికి వీలు కావడం లేదు.”

ప్రతి 7-10 రోజులకు ఒకసారి, హైదరాబాద్ నుండి ఒక వ్యాపారి వచ్చి బుట్టలను తీసుకువెళ్తారు. అల్లిక కార్మికులు ఒక్కో బుట్టను రూ. 50 చొప్పున అమ్మడం ద్వారా మార్చి నుండి మే వరకు రోజుకు రూ. 100-150 సంపాదిస్తారు. అయితే, “అమ్మితే మాత్రమే ఆ డబ్బు మా చేతికొస్తుంది” అని నెలిగుందరాశి సుమతి (28) చెప్పారు.

తెలంగాణాలో మార్చి 23వ తేదీన లాక్‌డౌన్ విధించిన తర్వాత, ఆ వ్యాపారి కంగల్ గ్రామానికి రావడం ఆపేశారు. లాక్‌డౌన్ ముందు ఉండే పరిస్థితిని వివరిస్తూ “వారానికొకసారి లేదా రెండు వారాలకొకసారి, అతను మా నుండి అలాగే [చుట్టుపక్కల గ్రామాలలోని] ఇతరుల నుండి ఒక లారీ నిండా బుట్టలను కొనుక్కెళ్లేవాడు,” అని నెలిగుందరాశి రాములు (40) చెప్పారు.

రాములు, ఇంకా ఇతరులు తయారు చేసే బుట్టలను పెళ్లిళ్ల వంటి ఫంక్షన్లలో అన్నం వార్చేందుకు లేదా వేయించిన తినుబండారాల నుండి నూనెను వేరు చేసేందుకు వాడతారు. అయితే మార్చి 15 నుండి అటువంటి ఫంక్షన్ల పై తెలంగాణా ప్రభుత్వం నిషేధం విధించింది.

మార్చి 25న వచ్చిన తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగకు ఒక వారం ముందు కొన్న బుట్టల స్టాక్ ఇంకా స్థానిక వ్యాపారుల వద్దే మిగిలిపోయింది. కాబట్టి ఒకవేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేసినా కూడా, ఫంక్షన్ హాల్స్‌తో పాటు ఇతర వేదికలను తిరిగి ప్రారంభిస్తేనే ఆ వ్యాపారి తిరిగి కంగల్ గ్రామానికి వస్తారు.

Clearing thorns from the silver date palm fronds: Neligundharashi Ramulamma (top left); Neligundharashi Yadamma (top right); Neligundharashi Sumathi  (bottom left), and Ramulu (bottom right)
PHOTO • Harinath Rao Nagulavancha

ఈత ఆకుల నుండి ముళ్లను వేరు చేస్తున్నారు: నెలిగుందరాశి రాములమ్మ (ఎగువ, ఎడమ), నెలిగుందరాశి యాదమ్మ (ఎగువ కుడి); నెలిగుందరాశి సుమతి (దిగువ ఎడమ) మరియు రాములు (దిగువ కుడి)

“[లాక్‌డౌన్ తర్వాత] మా బుట్టలన్నీ కొంటానని అతను మాకు [ఫోన్ ద్వారా] హామీ ఇచ్చాడు,” అని సుమతి చెప్పారు. ఈ బుట్టలు కాలం గడిచినా చెడిపోవు కాబట్టి అవి వృధా కావని ఆమెతో పాటు ఇతర అల్లిక కార్మికులు ఆశతో ఉన్నారు. అయితే, కంగల్‌లోని ప్రతి అల్లిక కార్మికుడి ఇంట్లో బుట్టలు పేరుకుపోతున్నాయి కాబట్టి ఏదో ఒక రోజు లాక్‌డౌన్‌ను ఎత్తేసినా, ఒక బుట్ట పలికే ధర ఎంతగా దిగజారుతుందో తెలియడం లేదు.

లాక్‌డౌన్ మొదలయ్యే ముందు, రాములు భార్య అయిన నెలిగుందరాశి యాదమ్మ, ఉగాదికి ఒక వారం ముందు ఆ వ్యాపారికి తాము అమ్మిన బుట్టల ద్వారా వచ్చిన ఆదాయంతో 10 రోజుల పాటు కిరాణా సరుకులను కొనిపెట్టుకున్నారు. బుట్టలను అల్లే కార్మికులు బియ్యం, కందిపప్పు, చక్కెర, ఖారం, నూనె వంటి వాటిని సాధారణంగా స్థానిక మార్కెట్ నుండి కొద్ది మొత్తాన్ని, కంగల్‌లోని రేషన్ షాపు నుండి కొద్ది మొత్తాన్ని కొనుక్కుంటారు. యాదమ్మను ఏప్రిల్ 4వ తేదీని కలిసినప్పుడు, మార్కెట్ నుండి కొన్న బియ్యం అయిపోవడంతో మునుపటి నెలకు చెందిన రేషన్ బియ్యాన్ని (కంట్రోల్ బియ్యాన్ని) వండుతూ ఉన్నారు. తెలంగాణాలో ఒక కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల రేషన్ బియ్యాన్ని కిలోకు రూ.1 చొప్పున పొందే అర్హత ఉంది. ఇక్కడ మార్కెట్‌లో అమ్ముడయ్యే బియ్యం కిలోకు దాదాపు రూ. 40 ధర పలుకుతుంది.

అయితే, కంగల్‌లోని రేషన్ షాపు నుండి తెచ్చుకున్న బియ్యం తినడానికి తగినది కాదనీ, వండితే జిగటగా మారి దుర్వాసన వస్తుందనీ లాక్‌డౌన్ విధించడానికి చాలా రోజుల ముందే యాదమ్మతో పాటు ఇతరులు గమనించారు. “చాలా కమ్మటి బియ్యం,” అని యాదమ్మ వెటకారంగా చెప్పారు. “తినడం, తిని చావడం, అంతే,” అని ఆవిడ నిట్టూర్చారు.

అయినప్పటికీ, అదే రేషన్ బియ్యాన్ని క్రమం తప్పకుండా ఇంటికి తెచ్చుకునే వాళ్లు. ఎందుకంటే క్రమంగా తెచ్చుకోకపోతే వాళ్ల రేషన్ కార్డులు చెల్లకుండా పోతాయనే భయం ఉండేది. ఆ బియ్యాన్నిపిండి చేసి, ఆ పిండితో రాత్రి పూట భోజనానికి తనకు, తన భర్తకు, ఇద్దరు పిల్లలకు రొట్టెలను వండుతారు. లాక్‌డౌన్‌కు ముందు, పొద్దున అలాగే మధ్యాహ్నపు పూట భోజనానికి, అధిక ధర ఉండే సన్న బియ్యాన్ని మార్కెట్ నుండి కొని దానిని కూరగాయలతో కలిపి వండేవారు. ఇలా సన్న బియ్యాన్ని, కూరగాయలను, ఇతర కిరాణా సరుకులను కొనాలంటే బుట్టల అల్లిక కార్మికుల ఆదాయం స్థిరంగా ఉండాలి. “ఈ చిన్న జాతికి ఈ కష్టాలు తప్పవు,” అని రాములమ్మ చెప్పారు.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పంపిణీ చేసే గోడౌన్ స్టాక్ నుండి ఆహార ధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ప్రజలకు పంపిణీ చేస్తుంది.  ఈ ఆహార ధాన్యాలలో పావురాల మలమూత్రాలు, పిచుకల ఈకలు, ఎలుకల మూత్రం, పురుగులు, నల్లులు లేదా పేడ పురుగులు ఉంటే వాటి నాణ్యత క్షీణిస్తుందని FCIకి చెందిన నాణ్యతా నియంత్రణా మ్యాన్యువల్ పేర్కొంటుంది. అందువల్ల, మిథైల్ బ్రోమైడ్ మరియు ఫాస్ఫీన్ వంటి రసాయనాలను క్రిమి సంహారకాలుగా ఆ ధాన్యాలపై వాడతారు, వాటికి చెడిపోయిన వెల్లుల్లి వంటి వాసన ఉంటుంది. ఈ కారణాల వల్లే కంగల్‌లోని రేషన్ షాపులో ప్రజలకు అందే బియ్యం నాణ్యత తక్కువగా ఉంటుంది. “మా పిల్లలు ఆ బియ్యం తినరు,” అని నెలిగుందరాశి వెంకటమ్మ అనే బుట్టల అల్లిక కార్మికురాలు చెప్పారు.

'Some are eating relief rice mixed with rice bought in the market', says Ramulu; while with unsold baskets piling, it is not clear if their prices will remain the same
PHOTO • Harinath Rao Nagulavancha
'Some are eating relief rice mixed with rice bought in the market', says Ramulu; while with unsold baskets piling, it is not clear if their prices will remain the same
PHOTO • Harinath Rao Nagulavancha

'కొందరు సహాయక బియ్యాన్ని, మార్కెట్‌లో కొన్న బియ్యాన్ని కలిపి తింటున్నారు',అని రాములు చెప్పారు; బుట్టల అమ్మకం నిలిచిపోయి అవి పేరుకుపోవడంతో, వాటి ధరలు ఎంతకు పడిపోతాయో తెలియడం లేదు'

తాత్కాలికంగా ఈ నాణ్యతా సమస్య కొద్దో గొప్పో పరిష్కారమైనట్టే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ కొవిడ్-19 సహాయక ప్యాకేజీలో భాగంగా రాములుకు, అతని కుటుంబానికి, అలాగే కంగల్‌లో నివసించే ఇతరులకు, ఒక్కో వ్యక్తికి 12 కిలోల చొప్పున బియ్యంతో పాటు ఒక కుటుంబానికి రూ. 1,500 చొప్పున అందాయి. ఇలా ఏప్రిల్, మే నెలల్లో నెలకొకసారి చొప్పున రెండుసార్లు అందాయి. రేషన్ బియ్యం కన్నా ఈ బియ్యం నాణ్యత మెరుగైనదని రాములు చెప్పారు. అయితే "[సహాయక ప్యాకేజీలో భాగంగా అందిన] బియ్యం అంతా మెరుగైన నాణ్యతతో లేదు. కొంత భాగం నాణ్యత బాగుంది, కొంత భాగం బాగా లేదు. ఈసారికి ఇదే తింటున్నాం. కొందరు ఈ సహాయక బియ్యాన్ని, మార్కెట్‌లో కొన్న బియ్యాన్ని కలిపి తింటున్నారు," అని మే 6వ తేదీన నాతో ఫోన్‌లో చెప్పారు.

ఏప్రిల్ 15వ తేదీన నేను రాములును కలిసినప్పుడు, కంగల్‌లో వరిని కొనుగోలు చేసే ఒక ప్రభుత్వ కేంద్రం వద్ద దినకూలీగా పనిలోకి చేరారు. ఇటువంటి పని సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో దొరుకుతుంది. కానీ ఇదే పనిని వెతుక్కుంటూ చాలా మంది వచ్చేవారు కాబట్టి అతనికి రోజు విడిచి రోజు మాత్రమే ఈ పని దొరికి రోజుకు రూ. 500 సంపాదించగలిగేవారు. వరి కొనుగోలు ప్రక్రియ మే నెల మూడో వారానికి పూర్తి అవుతుంది కాబట్టి, అడపాదడపా వచ్చే ఈ పని కూడా అప్పటికి ఆగిపోతుంది.

రాములమ్మ, యాదమ్మతో పాటు ఇతర మహిళలు కూడా అప్పుడప్పుడు రోజుకు రూ. 200-300 కూలీకి పని చేస్తూ వచ్చారు. “పత్తి పంట వ్యర్థాలను [పుల్లకు, కాడలు, అలాగే సాగు వల్ల వచ్చే ఇతర వ్యర్థాలను] సేకరించడానికి బయటికి వెళ్తున్నాం,” అని మే 12 నాటి ఉదయాన యాదమ్మ నాతో ఫోన్‌లో చెప్పారు.

ఆమెతో పాటు కంగల్‌లోని ఇతర కుటుంబాలకు రేషన్‌లోను, సహాయక ప్యాకేజీలలోను లభించే బియ్యం నాణ్యతపై, తమ బుట్టలు అమ్ముడుపోతాయా లేదా అనే దాంతో పాటు వ్యవసాయ కూలీ పని దొరుకుతుందా లేదా అనే వాటి ఆధారంగా రాబోయే నెలల్లో వాళ్ల ఆకలి తీరుతుందో లేదో చూడాలి.

మరోవైపు, హోం మంత్రిత్వ శాఖ మే 1వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వివాహాల వంటి ఫంక్షన్లకు 50 మంది వరకు అతిథులు హాజరు కావచ్చు. అదే జరిగితే బుట్టల మార్కెట్ తిరిగి పుంజుకుంటుంది. అయితే, ఇప్పటి వరకు, “అతని [బుట్టల వ్యాపారి] నుండి మాకు కాల్ ఏదీ రాలేదు. అందుకోసమే మేమంతా వేచి చూస్తున్నాం.”

"బుట్టలు కనీసం 5-6 నెలల దాకా చెడిపోవని అనుకుంటున్నాను,” అని రాములమ్మ చెప్పారు. “కానీ అతను [వ్యాపారి] మాకు కాల్ చేయలేదు. కరోనా ఇంకా అంతం కాలేదు."

అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి

Harinath Rao Nagulavancha

Harinath Rao Nagulavancha is a citrus farmer and an independent journalist based in Nalgonda, Telangana.

Other stories by Harinath Rao Nagulavancha
Translator : Sri Raghunath Joshi

Sri Raghunath Joshi obtained a Masters degree in Engineering but switched careers to pursue his love of Telugu language. Currently he works remotely as Telugu-Language Lead at a Localization firm based in Noida. He can be contacted at [email protected]

Other stories by Sri Raghunath Joshi