ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ‌ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.

సంతకు పోదాం, సంతకు ...

ఆ వెదుర్లు వాటిని అక్కడికి తెచ్చిన మహిళల కంటే మూడింతలు ఎత్తుగా ఉన్నాయి. ఝార్ఖండ్‌లోని గొడ్డాలో జరిగే వారపు సంత కు ( హాట్ - గ్రామీణ ప్రాంతపు బజారు) ప్రతి మహిళా ఒకటో రెండో వెదుర్లను అమ్మకానికి తెస్తుంటారు. వెదుర్లను భుజమ్మీదనో తలపైనో మోస్తూ 12 కిలోమీటర్లు నడిచి సంతకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ సంతకు రావడానికి ముందు వీరంతా, సహజంగానే, అడవిలో వెదుర్లను నరుకుతూ గంటలతరబడి గడిపివుంటారు.

ఇంత ప్రయత్నమూ చేసి ఆ రోజు ముగిసేసరికి 20రూ.లు సంపాదించగలిగితే వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. గొడ్డాలోనే ఉన్న ఇంకో సంత కు వెళ్తున్నవాళ్ళలో కొందరు ఇంతకన్నా తక్కువే సంపాదిస్తారు. తలలమీద ఇంతెత్తున ఆకుల కట్టలను మోసుకొస్తూ ఉన్న ఆ మహిళలు ఆ ఆకుల్ని వారే సేకరించి వాటిని విస్తళ్ళుగా కలిపి కుట్టారు. ఆ ఆకులతో వాళ్ళు అద్భుతమైన వాడి పడేసే విస్తళ్ళను తయారుచేస్తారు. టీ దుకాణాలవాళ్ళు, హోటళ్ళవాళ్ళు, క్యాంటీన్లవాళ్ళు ఈ ఆకులను వందల లెక్కన కొంటారు. దాంతో ఈ మహిళలకు 15-20 రూ.లు వస్తుండవచ్చు. ఈసారి రైల్వే స్టేషన్‌లో ఈ ‘ఆకు పళ్ళేలలో’ తింటున్నప్పుడు, ఇప్పుడు మీకు తెలుసు, అవి ఎక్కడినుంచి వచ్చాయో!

వీడియో చూడండి : ' ఎక్కడికైనా వెళ్లాలంటే కొండలపైకీ క్రిందికీ ఎక్కీ దిగుతూ మీరు 15-20 కిలోమీటర్లు నడుస్తారు '

ఈ స్త్రీలందరూ చాలా దూరాలు నడవాల్సి ఉంటుంది, ఇంట్లో కూడా వారికి అనేక బాధ్యతలు ఉన్నాయి. సంత రోజున చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ సంత ( హాట్ ) వారానికోసారి జరిగే కార్యక్రమం. కాబట్టి చిన్న ఉత్పత్తిదారులు లేదా విక్రేతలు ఈ సంతరోజు ఏమి సంపాదిస్తారో, రాబోయే ఏడు రోజులలో అది వారి కుటుంబాలను నిలబెట్టడానికి సహాయం చేయాలి. వాళ్ళు తరచూ ఇతర ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటారు. గ్రామం దాటీ దాటగానే వారు, తక్కువ ధరకు తమ ఉత్పత్తులను ఇచ్చేయమని వేధించే వడ్డీ వ్యాపారులను ఎదుర్కొంటారు. కొందరు ఈ వేధింపులకు లొంగిపోతారు కూడా.

ఇంకొంతమంది తమకు అప్పులిచ్చినవాళ్ళకే తమ ఉత్పత్తులను అమ్మాలనే షరతులకు ఒప్పుకుని ఉంటారు. ఆ వ్యాపారుల దుకాణాలముందు అలా పడిగాపులు పడుతూవుండే మహిళలని మనం తరచూ చూస్తుంటాం. ఒడిశాలోని రాయగడలో ఒక దుకాణం ముందు కూచొని ఉన్న ఈ ఆదివాసీ మహిళ, ఆ దుకాణం యజమాని కోసం ఎదురుచూడటం కూడా అలాంటిదే. బహుశా ఆమె చాలా గంటలుగా ఇక్కడ కూర్చుని ఉండవచ్చు. గ్రామ శివారులో, అదే ఆదివాసీ తండాకు చెందిన మరికొంతమంది మార్కెట్ వైపు వెళ్తున్నారు. వీరిలో చాలామంది ఆ వడ్డీవ్యాపారులకు డబ్బు అప్పుపడి ఉన్నందున, బేరమాడి తమ ఉత్పత్తులకు తగిన ధరని సాధించే శక్తి వారికి ఉండదు.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

లైంగిక వేధింపులతో సహా అన్ని చోట్లా ఈ మహిళా అమ్మకందారులు వేధింపులను ఎదుర్కొంటారు. ఇక్కడ, అది పోలీసులనుంచే కాదు, ఫారెస్ట్ గార్డుల నుంచి కూడా.

ఒరిస్సాలోని మల్కన్‌గిరిలో ఈ బోండా మహిళలకు ఈ సంతరోజున నిరాశే మిగిలింది. కానీ వారు నేర్పుగా ఆ బరువైన రేకు పెట్టెని బస్సు పైభాగానికి లాగుతారు. అయితే సమీప బస్టాప్ వారి గ్రామానికి చాలా దూరంలో ఉన్నందున, ఆ పెట్టెని వారు అంత దూరం తలపై మోసుకుంటూ నడవాల్సి ఉంటుంది.

జార్ఖండ్‌లోని పలామూలోని హాట్‌కు వెళుతున్న ఈ మహిళ తన కుమార్తెను, వెదురుబొంగులను, కొద్దిపాటి తన భోజనాన్ని కూడా మోసుకువెళుతోంది. ఆమె ఇంకో బిడ్డ కూడా ఆమె వెంటే ఉన్నాడు.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

దేశంలో చిన్న ఉత్పత్తిదారులు లేదా విక్రయదారులుగా పనిచేస్తున్న లక్షలాది మంది మహిళలు సంపాదించే ఆదాయం వ్యక్తిపరంగా చూస్తే చాలా చిన్నదే. ఎందుకంటే ఇది కష్టపడి న్యాయంగా సంపాదించినది. కానీ వారి కుటుంబాల మనుగడకు ఇదే కీలకమైనది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో, కేవలం పదమూడేళ్ల వయసున్న ఈ అమ్మాయి, కోడిమాంసాన్ని కోసి, గ్రామ మార్కెట్‌లో అమ్ముతోంది. ఆమె పక్కనున్న అమ్మాయి కూడా . అదే మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతోంది. ఇదే వయస్సులో ఉండే వీరి మగ బంధువులకు ఆ సమయంలో బడిలో ఉండగలిగే మంచి అవకాశం ఉంది. ఈ అమ్మాయిలు మాత్రం తమ ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించడమే కాకుండా, ఇంట్లో అనేక 'ఆడవారి పనులు' కూడా చేయవలసి ఉంటుంది.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli