ఆ ప్రాంతంలోని మిగిలిన చోట్ల 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం చల్లగా ఉంటుంది. మాకు కొంచెం దూరంలో మైనస్ 13 డిగ్రీల ఉష్ణొగ్రత ఉన్న ఒక చిన్న ప్రదేశం ఉంది. ఇది "భారతదేశపు మొట్టమొదటి మంచుగుమ్మటం (స్నోడోమ్)" - అది కూడా ఎండలతో మండిపోతోన్న విదర్భలో! దాని ఐస్‌ రింక్‌ను కరిగిపోకుండా ఉంచడానికి ఒక్క రోజుకు అయ్యే విద్యుత్ ఛార్జీలు రూ. 4,000.

నాగ్‌పూర్ (గ్రామీణ) జిల్లాలోని బజార్‌గాఁవ్ గ్రామ పంచాయితీలోని ఫన్ & ఫుడ్ విలేజ్ వాటర్ & అమ్యూజ్‌మెంట్ పార్కుకు స్వాగతం! ఆ భారీ వాణిజ్య సముదాయం కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటం సందర్శకులను పలకరిస్తుంటుంది. ఇంకా మీకోసం రోజువారీ డిస్కో, ఐస్ స్కేటింగ్, ఐస్ స్లైడింగ్, 'అనేక కాక్‌టెయిల్‌ నిల్వలున్న బార్' కూడా తప్పకుండా ఉంటాయి. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్క్ 18 రకాల వాటర్ స్లైడ్‌లను, గేమ్‌లను అందిస్తుంది. సమావేశాల నుండి కిట్టి పార్టీల వరకూ అనేక ఈవెంట్‌ల కోసం కూడా తన సేవలను అందిస్తుంది.

బజార్‌గాఁవ్ గ్రామం (జనాభా 3,000) భారీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. "నీటి కోసం రోజూ అనేకసార్లు తిరగాల్సి ఉంటుంది. మహిళలు నీటిని తీసుకురావడానికి ఒక్క రోజులో 15 కిలోమీటర్ల దూరాలు నడుస్తారు," అని సర్పంచ్ యమునాబాయి ఉయికే చెప్పారు. “ఈ గ్రామం మొత్తానికి ఒకే ఒక సర్కారీ (ప్రభుత్వం తవ్వించిన) బావి ఉంది. ఒక్కోసారి నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందుతుంది. కొన్నిసార్లు, పది రోజులకు ఒకసారి కూడా."

2004లో కరవు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బజార్‌గాఁవ్ గ్రామం ఉంది. ఇంతకు ముందెన్నడూ ఇంటువంటి గతిని ఈ గ్రామం ఎదుర్కోలేదు. గ్రామంలో మే నెల వరకు ఆరు గంటలపాటు - ఇంకా ఎక్కువ గంటలు కూడా - విద్యుత్ కోతలు కూడా ఉన్నాయి. ఈ విద్యుత్ కోతలు ఆరోగ్యంతో సహా రోజువారీ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి. పరీక్షలకు హాజరయ్యే పిల్లలకు చాలా నష్టం చేస్తాయి. వేసవి తాపం 47 డిగ్రీలకు చేరుకోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది.

గ్రామీణ జీవితంలోని ఈ ఉక్కు నియమాలన్నీ ఫన్ & ఫుడ్ విలేజ్‌లో వర్తించవు. ఈ ప్రైవేట్ ఒయాసిస్‌లో బజార్‌గాఁవ్ కలలో కూడా ఊహించనంత ఎక్కువ నీరు ఉంది. విద్యుత్ సరఫరాలో ఒక్క క్షణం కూడా విరామం ఉండదు. "మేం సగటున చెల్లిస్తాం," అని పార్క్ జనరల్ మేనేజర్ జస్జీత్ సింగ్ చెప్పారు, "నెలకు సుమారు రూ. 4 లక్షల విద్యుత్ బిల్లులు వస్తాయి."

The snowdome at the Fun & Food Village Water & Amusement Park in Bazargaon in Nagpur (Rural) district
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

ఎడమ: నాగపూర్ (గ్రామీణ) జిల్లా, బజార్‌గాఁవ్‌లో ఉన్న ఫన్ & ఫుడ్ విలేజ్ వాటర్ & అమ్యూజ్‌మెంట్ పార్క్‌లోని మంచు గుమ్మటం (స్నోడోమ్). కుడి: స్నోడోమ్ లోపల

పార్క్ వినియోగించే నెలవారీ విద్యుత్ బిల్లు ఒక్కటే యమునాబాయి గ్రామ పంచాయితీ వార్షిక ఆదాయానికి దాదాపు సమానం. ఈ పార్క్ కారణంగా గ్రామంలో విద్యుత్ సంక్షోభం కొద్దిగా తగ్గింది. రెండిటికీ ఒకే సబ్ స్టేషన్‌. పార్క్ ఎక్కువగా విద్యుత్‌ను వినియోగించే కాలం మేతో ప్రారంభమవుతుంది. దాంతో అప్పటి నుండి పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉంటాయి. గ్రామ పంచాయతీ ఆదాయానికి పార్క్ ద్వారా అందే సహకారం సంవత్సరానికి రూ. 50,000. ఇందులో సగం, ఒక్క రోజులో ఫన్ & ఫుడ్ విలేజ్ గేట్ వద్ద 700 మంది రోజువారీ సందర్శకుల నుండి సేకరించే రాబడి నుంచే వస్తుంది. పార్క్‌లో పనిచేస్తోన్న 110 మంది కార్మికులలో కేవలం డజను మంది మాత్రమే బజార్‌గాఁవ్‌కు చెందిన స్థానికులు.

నీటి కొరత ఉన్న విదర్భలో ఇటువంటి వాటర్ పార్కులు, వినోద కేంద్రాలు పెరుగుతున్నాయి. బుల్‌ఢాణాలోని శెగాఁవ్‌లో, ఒక ధార్మిక సంస్థ ఒక పెద్ద "మెడిటేషన్ సెంటర్ & ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్"ని నడుపుతోంది. దానిలో 30 ఎకరాల విస్తీర్ణంలో 'కృత్రిమ సరస్సు'ను నిర్వహించాలని చేసిన ప్రయత్నాలు ఈ వేసవి ఎండకి ఎండిపోయాయి. అయితే ఆ ప్రయత్నంలో చెప్పలేనంత మొత్తంలో నీరు వృథా అయింది. ఇక్కడ ప్రవేశ టిక్కెట్లను "విరాళాలు" అంటారు. యవత్మాల్‌లో, ఒక ప్రైవేట్ కంపెనీ ఒక పబ్లిక్ సరస్సును టూరిస్ట్ జాయింట్‌గా నడుపుతోంది. అమరావతిలో ఇటువంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రదేశాలు ఉన్నాయి (ఇప్పుడు ఎండిపోయాయి). నాగ్‌పూర్‌లోనూ, ఇంకా చుట్టుపక్కలా మరికొన్ని ఉన్నాయి

ఇది, గ్రామాలకు 15 రోజులకు ఒకసారి నీరు వచ్చే ప్రాంతంలో ఉంది. కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం వలన మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలను చూసింది కూడా ఇక్కడే. "దశాబ్దాలుగా విదర్భలో తాగునీరు లేదా నీటిపారుదల కోసం తలపెట్టిన ఏ పెద్ద ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు" అని నాగ్‌పూర్‌కు చెందిన జర్నలిస్ట్ జైదీప్ హార్దీకర్ చెప్పారు. అతను అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతం విషయాలను నివేదిస్తున్నారు

A religious trust runs a large Meditation Centre and Entertainment Park in Shegaon, Buldhana.  It tried to maintain a 30-acre artificial lake within its grounds. The water body soon ran dry but not before untold amounts of water were wasted on it
PHOTO • P. Sainath
A religious trust runs a large Meditation Centre and Entertainment Park in Shegaon, Buldhana.  It tried to maintain a 30-acre artificial lake within its grounds. The water body soon ran dry but not before untold amounts of water were wasted on it
PHOTO • P. Sainath

బుల్‌ఢాణాలోని శెగాఁవ్‌లో, ఒక ధార్మిక సంస్థ ఒక పెద్ద మెడిటేషన్ సెంటర్ & ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌ని నడుపుతోంది. దానిలో 30 ఎకరాల విస్తీర్ణంలో 'కృత్రిమ సరస్సు'ను నిర్వహించాలని ప్రయత్నాలు చేసింది. ఆ కృత్రిమ సరస్సు త్వరలోనే ఎండిపోయింది కానీ ఆ ప్రయత్నంలో చెప్పలేనంత మొత్తంలో నీరు వృథా అయింది

ఫన్ & ఫుడ్ విలేజ్ నీటిని సంరక్షిస్తుందని జస్జీత్ సింగ్  నొక్కిచెప్పారు. "మేం వాడిన నీటిని తిరిగి ఉపయోగించుకోవడానికి అధునాతన ఫిల్టర్ ప్లాంట్లను ఉపయోగిస్తాం." కానీ ఈ వేడిమిలో బాష్పీభవన స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. నీటిని కేవలం ఆటలకు మాత్రమే ఉపయోగించటంలేదు. అన్ని పార్కులు తమ తోటల నిర్వహణకు, పారిశుద్ధ్య నిర్వహణకు, వారి ఖాతాదారుల కోసం పెద్ద మొత్తంలో నీటిని వినియోగిస్తాయి.

"ఇది నీటినీ డబ్బునూ భారీగా వ్యర్థం చేయటం," అని బుల్‌ఢాణాలోని వినాయక్ గైక్వాడ్ చెప్పారు. ఆ జిల్లాలో ఆయన ఒక రైతు, కిసాన్ సభ నాయకుడు కూడా. ఈ ప్రక్రియలో, ప్రభుత్వ వనరులు తరచుగా ప్రైవేట్ లాభాలను పెంచడానికి ఉపయోగించబడటంపై గైక్వాడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "వారు అలా చేయటానికి మారుగా ప్రజల ప్రాథమిక నీటి అవసరాలను తీర్చాలి."

తిరిగి బజార్‌గాఁవ్‌కి వస్తే, ఈ పరిస్థితి సర్పంచ్ యమునాబాయి ఉయికీని కూడా ఆకట్టుకోలేదు. ఫన్ & ఫుడ్ విలేజ్ నుండి లేదా ఇతర పరిశ్రమల నుండి కాదు, ఇవి ఎక్కువ తీసుకున్నాయి కానీ తక్కువ ఇచ్చాయి. "ఇందులో మాకేముంది?" ఆమె తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆమె గ్రామానికి నాణ్యమైన ప్రభుత్వ నీటి ప్రాజెక్ట్ పొందాలంటే, పంచాయతీ దాని ఖర్చులో 10 శాతం భరించాలి. అంటే దాదాపు రూ. 4.5 లక్షలు. “మేం ఆ రూ. 45,000 ఎలా భరించగలం? మా పరిస్థితి ఏమిటి?" కాబట్టి దాన్ని ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అలా చేయటం నిర్మాణానికి దారితీయవచ్చు. కానీ ఇది చాలామంది పేదలు, భూమిలేని ప్రజలు ఉన్న గ్రామానికి దీర్ఘకాలంలో అధిక ఖర్చులకూ, ఆ ప్రాజెక్ట్ నిర్మాణంపై తక్కువ నియంత్రణ ఉండటానికీ దారితీస్తుంది.

మేం అక్కడినుండి వెనుదిరిగినప్పుడు పార్క్‌లోని కార్యాలయంలో గాంధీ చిత్రపటం నవ్వుతూనే ఉంది. గాంధీజీ పార్కింగ్‌కి ఎదురుగా ఉన్న 'మంచుగుమ్మటం'ని చూసి నవ్వుతూ ఉండాలి. అది "ఇతరులు సరళంగా జీవించేలా, సరళంగా జీవించండి" అని చెప్పిన వ్యక్తికి పట్టిన దురదృష్టంలా ఉంది.

ఈ వ్యాసాన్ని ఇంతకుముందు జూన్ 22, 2005న ది హిందూలో ప్రచురించారు. పి. సాయినాథ్ అప్పుడు ఆ వార్తాపత్రికకు గ్రామీణ వ్యవహారాల సంపాదకులుగా ఉన్నారు

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli