జైపూర్ లోని ఉన్నత న్యాయస్థాన ప్రాంగణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కాని అక్కడి తోటలో ఉన్న ఒక వస్తువు మాత్రం రాజస్థాన్‌లో చాలామందిని కలవరపెడుతుంది. దేశం మొత్తంలో ‘చట్టం అందించే మను’ విగ్రహాన్ని గర్వంగా ప్రదర్శించే న్యాయస్థాన ప్రాంగణం బహుశా ఇదొక్కటే. ( కవర్ ఫోటో చూడండి )

మను అనే వ్యక్తి నిజంగా ఉండేవాడో లేదో అసలు రుజువే లేని పరిస్థితిలో, ఈ విగ్రహాన్ని కళాకారుడి ఊహే రూపొందించిందని చెప్పవచ్చు. కాని ఆ ఊహ ఒక హద్దు దాటి వెళ్ళలేకపోయిందని తెలుస్తుంది. ఇక్కడ మను సినిమాలలో పదే పదే కనిపించే ‘ఋషి’ ఆకారాన్ని ధరించాడు.

పురాణాలలో, ఈ పేరుగల అతను మనుస్మృతి ని రాసినట్టుంది. నిజానికి ఈ స్మృతులు శతాబ్దాల క్రితం బ్రాహ్మణులు సమాజం మీద విధించాలని చూసిన నిబంధనలు. ఈ నిబంధనలు విపరీతంగా కులతత్వమైనవి. ఎన్నో స్మృతులు ఉండేవి - ఇవి చాలామటుకు క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 1000 మధ్యలో రచించినవి. ఎందరో రచయితలు చాలా కాలం పాటు వీటిని సంగ్రహించారు. వీటిలో అన్నిటికన్నా ప్రాచుర్యం చెందినది మనుస్మృతి . ఒకే నేరానికి కులాన్ని బట్టి ప్రమాణాలను మార్చేయడంలోనే ఉంది దీని అసాధారణ తత్త్వం.

స్మృతి లో, తక్కువ కులాల వారి జీవితాలకు విలువ అంతంతమాత్రమే. ఉదాహరణకు “శూద్రుడిని హత్య చేసినందుకు చేసుకోవలసిన ప్రాయశ్చిత్తా”న్ని తీసుకోండి: వాళ్ళు చేయవలసింది “ఒక కప్ప, ఒక కుక్క, ఒక గుడ్లగూబ, లేదా ఒక కాకి”ని చంపిన మనిషి చేయవలసిన ప్రాయశ్చిత్తమే. “ఒక నీతిమంతుడైన శూద్రుడి”ని హత్య చేసినందుకు చేయవలసిన ప్రాయశ్చిత్తం మహా అయితే ఒక బ్రాహ్మణుడిని చంపినందుకు చేయవలసిన దాంట్లో పదహారో వంతు.

ఇది, చట్టం అందరికీ సమానమే, అన్న నియమం మీద ఆధారపడే వ్యవస్థ అనుసరించవలసినదైతే కాదు. వారి పీడనకు చిహ్నమైన ఆ విగ్రహం న్యాయస్థానంలో ఉండటం రాజస్థాన్‌లో దళితుల కోపానికి కారణమవుతోంది. ఇంకా ఉద్రేకపరచే విషయం ఏమిటంటే, భారతదేశ రాజ్యాంగ నిర్మాతకి ఈ ప్రాంగణంలో చోటు లేదు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వీధి చివరన వచ్చీపోయే వాహనాల ఎదుట నించుని ఉంటుంది. మను మాత్రం న్యాయస్థానానికి వచ్చేవాళ్ళందరి ఎదుట హుందాగా నించునివుంటాడు.

The statue of “Manu, the Law Giver” outside the High Court in Jaipur
PHOTO • P. Sainath
An Ambedkar statue stands at the street corner facing the traffic
PHOTO • P. Sainath

జైపూర్ ఉన్నత న్యాయస్థానం వద్ద: న్యాయస్థానానికి వచ్చే వాళ్ళందరి ఎదుట హుందాగా నించునివున్న మను (ఎడమ). వీధి చివర వచ్చీపోయే వాహనాల ఎదుట నించునివున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం (కుడి)

మను ఆశయాలను రాజస్థాన్ నెరవేరుస్తూనే ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి 60 గంటలకు సగటున ఒక దళిత మహిళ అత్యాచారానికి గురవుతోంది. ప్రతి తొమ్మిది రోజులకి ఒక దళితుడి హత్య జరుగుతోంది. ప్రతి 65 గంటలకి ఒక దళితుడు తీవ్రమైన గాయానికి గురవుతాడు. ప్రతి ఐదు రోజులకి ఒక దళిత కుటుంబం ఇంటి మీదా, ఆస్తి మీదా దాడిచేయటమో, లేదా ఇల్లు తగులబెట్టడమో జరుగుతోంది. పైగా, ప్రతి నాలుగు గంటలకి ‘ఇతర ఐ.పి.సి.’ (భారతీయ శిక్షాస్మృతి లేదా ఇండియన్ పీనల్ కోడ్) విభాగం కింద ఒక ఫిర్యాదు నమోదవుతుంది. అంటే హత్య, అత్యాచారం, గృహదహనం, తీవ్రమైన గాయం, వంటివి కాకుండా ఇతర దావాలన్నమాట.

నిందితులకు శిక్ష పడటం అరుదైన విషయం. దోషనిర్ధారణ రేటు 2 నుంచి 3 శాతం మధ్యన ఉంటుంది. ఇక దళితుల మీద జరిగిన చాలా అత్యాచారాలు అసలు న్యాయస్థానం వరకు కూడా రావు.

లెక్క లేనన్ని ఫిర్యాదులు మూతపడిపోయి  ఎఫ్.ఆర్‌ల. (తుది నివేదికలు లేదా ఫైనల్ రిపోర్ట్స్) తో పాటు కప్పబడిపోతాయి. నిజమైన, తీవ్రమైన దావాలను కూడా చాలాసార్లు వదిలేస్తారు.

“సమస్య పల్లెటూరిలోనే మొదలవుతుంది,” అన్నారు భన్వారీ దేవి. అజ్మేర్ జిల్లాలోని ఒక పల్లెటూరిలో ఆమె కూతురు అత్యాచారానికి గురైంది. “గ్రామస్థులు ఒక కుల పంచాయితీ నిర్వహిస్తారు. తమపై దాడిచేసినవారితో సంధిచేసుకోమని బాధితులను ఒత్తిడి చేస్తారు. ‘పోలీసుల దగ్గరకు వెళ్ళడం ఎందుకు? సమస్యను మనమే పరిష్కరించుకుందాం,’ అంటారు.”

ఆ పరిష్కారం సాధారణంగా ఎలా ఉంటుందంటే పీడించినవాళ్ళకు బాధితులు లొంగిపోతారు. భన్వారీని పోలీసుల దగ్గరకు వెళ్ళకుండా ఆపేసారు.

ఎలాగైనా, ఒక దళితుడు లేదా ఒక ఆదివాసీ పొలీసు స్టేషన్‌కు వెళ్ళడమే ఎన్నో ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. వాళ్ళు వెళ్ళడం జరిగిందే అనుకోండి, ఏమవుతుంది? భరత్‌పూర్ జిల్లాలోని కుమ్హేర్ గ్రామంలో, ఒక 20 గొంతులు ముక్తకంఠంతో బదులిచ్చాయి: “ప్రవేశ రుసుము రెండు వందల ఇరవై రూపాయలు. ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలంటే దీనికి ఇంకా ఎన్ని రెట్లో!”

ఒక అగ్రకులస్థుడు ఒక దళితుడిపై దాడి చేస్తే, ఫిర్యాదు నమోదు చేయకుండా పోలీసులు బాధితుడికి అడ్డుపడతారు. “‘ క్యా? బాప్ బేటే కో నహీ మార్తే హై, క్యా? భాయ్ భాయ్ కో నహీ మార్తే హై క్యా? (ఏంటి, తండ్రి అన్నాకా కొడుకుని కొట్టడా? అన్నాతమ్ముళ్ళు కొట్టుకోరా?) మరి జరిగినదాన్ని మరిచిపోయి ఫిర్యాదు వెనక్కి తీసుకోవచ్చుగా?’ అని మమ్మల్ని అడుగుతారు,” అన్నారు హరి రామ్.

రామ్ ఖిలాడీ నవ్వుతూ ఇలా అన్నారు, “ఇంకొక సమస్య కూడా ఉంది. పోలీసులు అవతలవాళ్ళ తరపు నుంచి కూడా డబ్బు తీసుకుంటారు. వాళ్ళు మాకన్నా ఎక్కువ ఇచ్చారంటే, ఇక మా పని అయిపోయినట్టే. మావాళ్ళు పేదవాళ్ళు. అంత డబ్బు పెట్టుకోలేరు.” అంటే, నిజానికి నువ్వు రూ. 2000 నుంచి రూ. 5000 దాకా డబ్బు కడతావు, పోగొట్టుకుంటావు.

తరువాత, విచారణ చేయడానికి వచ్చిన పోలీసు ఫిర్యాదు చేసినవారినే అరెస్టు చేయటంతో ముగిసిపోవచ్చు. ఒక దళితుడు ఒక అగ్రకులస్థుడి మీద ఫిర్యాదు చేసిన సందర్భంలో ఇలా జరగడానికే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా ఆ వచ్చిన పోలీసు పెద్ద కులానికి చెందినవాడైవుంటాడు.

“ఒకసారి అగ్రకులస్థులు నా మీద దాడి చేసినప్పుడు, డి.ఐ.జి. నా ఇంటి బైట ఒక పోలీసతన్ని పెట్టారు. ఆ హవల్దార్ రోజంతా చక్కగా యాదవుల ఇళ్ళల్లో తాగుతూ, తింటూ గడిపేవాడు. నాతో ఎలా వ్యవహరించాలో కూడా వాళ్ళకతను సలహాలు ఇచ్చేవాడు. ఇంకోసారి నా భర్తని చితక్కొట్టారు. నేను ఒక్కర్తినే స్టేషన్‌కి వెళ్ళాను. ఫిర్యాదు నమోదు చేయకుండా నన్ను బూతులు తిట్టారు: ‘ఆడదానివి (పైగా దళిత మహిళవి) అయ్యుండి, ఇక్కడికి నీ అంతట నువ్వు రావడానికి నీకు ఎంత ధైర్యం?’ అని ఆగ్రహించారు.” అన్నారు అజ్మేర్‌లో భన్వారీ.

మళ్ళీ కుమ్హేర్‌ విషయానికి వస్తే, చున్నీలాల్ జాతవ్ ఒక్క ముక్కలో చెప్పినట్టు: “ఒక్క పోలీసు కానిస్టేబుల్‌కి ఉన్నంత అధికారం అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులందరికీ కలిపినా కూడా లేదు.”

“ఆ కానిస్టేబుల్ చేతుల్లో మా జీవితాలున్నాయి. న్యాయమూర్తులు చట్టాన్ని తిరిగి రాయలేరు; వారు ఇరుపక్షాల నుంచి నేర్పరులైన న్యాయవాదుల వాదనలు వినవలసిందే. ఇక్కడ హవల్దార్ చక్కగా తన సొంత చట్టాలు రాసుకుంటాడు. అతను ఇంచుమించు ఏమైనా చేయగలడు." అన్నారు చున్నీలాల్

Chunni Lal Jatav on right, with friends in Kunher village. Three men sitting in a house
PHOTO • P. Sainath

కుమ్హేర్‌కు చెందిన చున్నీలాల్ జాతవ్ చతురతతో ఇలా అంటున్నారు: ‘ఒక్క పోలీసు కానిస్టేబుల్‌కి ఉన్నంత అధికారం అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులందరికీ కలిపి కూడా లేదు’

ఎంతో కష్టమ్మీద అసలు ఫిర్యాదు నమోదు చేయించినా, కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఇవి 'ప్రవేశ రుసుము' చెల్లించడం, ఇంకా ఇతర లంచాలు ఇవ్వడం కాకుండా వేరే సమస్యలు. కావాలనే సాక్షుల వాఙ్మూలాలు తీసుకోవడం ఆలస్యం చేస్తారు పోలీసులు. అంతేగాక, “వాళ్ళు కావాలనే కొంతమంది నిందితులని బంధించడంలో విఫలమవుతుంటారు,” అని భన్వారీ అన్నారు. వీళ్ళను ‘పరారీలో ఉన్నవాళ్ళు’గా ప్రకటిస్తారు, అంతే. ఆ తర్వాత, వాళ్ళు లేకుండా దావా ముందుకు సాగడం కష్టమని మనవి చేసుకుంటారు పోలీసులు.

చాలా పల్లెల్లో, ఈ “పరారీలో ఉన్నవాళ్ళు” చక్కగా స్వేచ్ఛగా తిరుగుతూ మాకు కనిపించిన సంఘటనలున్నాయి. ఇటువంటివి, అలాగే సాక్షుల వాఙ్మూలాలు తీసుకోవడంలో మందకొడితనం, దారుణమైన జాప్యానికి దారి తీస్తాయి.

అంతే కాకుండా, దీని వల్ల దళితులు వారిపై దాడి చేసినవాళ్ళ చేతుల్లోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో చిక్కుకుని, వారు వేసిన దావాపై వారే రాజీకి వచ్చే పరిస్థితుల్లో పడుతుంటారు. ధోల్‌పుర్ జిల్లా లోని నక్సోడాలో, అగ్రకులస్థులు రామేశ్వర్ జాతవ్‌పై ఒక వికృతమైన చిత్రహింసను రుద్దారు. అతని ముక్కుకు రంధ్రం పొడిచి, ఒక మీటర్ పొడుగు, 2 మిల్లీమీటర్ల మందం ఉన్న జనపనార దారాలు రెండిటిని తీసుకుని, అతని ముక్కు పుటాలలోకి ఒక ఉంగరంలా చుట్టి, దూర్చారు. దాన్ని పట్టుకుని అతన్ని ఆ ఊరంతా తిప్పుతూ ఊరేగించారు.

ఈ సంఘటన మీడియా కంట పడినప్పటికీ, సాక్షులందరూ - రామేశ్వర్ తండ్రి మంగిలాల్‌తో సహా - ప్రతికూల సాక్షులుగా మారిపోయారు. పైగా బాధితుడు కూడా నిందితులను నేరం నుంచి విముక్తులను చేశారు.

దీనికి కారణం? “మేం ఈ గ్రామంలో బతకాలి,” అన్నారు మంగిలాల్. “మమ్మల్ని ఎవరు కాపాడతారు? మేం భయంతో చస్తున్నాం.”

Mangi Lai Jatav and his wife in Naksoda village in Dholpur district
PHOTO • P. Sainath

నక్సోడా గ్రామంలో ఒక దళితుడిపై జరిగిన అత్యాచారం దావాలో, బాధితుడి తండ్రి మంగిలాల్ (కుడి)తో సహా సాక్షులందరూ ప్రతికూలంగా మారారు. ‘మేం ఈ గ్రామంలో బతకాలి. మమ్మల్ని ఎవరు కాపాడతారు?’ అన్నారు మంగిలాల్

“ఏ అఘాయిత్యానికి చెందిన దావా అయినా సరే, చాలా త్వరగా ప్రక్రియలో పెట్టాలి. ఆరు నెలలకు మించి ఆలస్యమైతే, దోషనిర్ధారణ జరగడానికి అవకాశాలు చాలా తక్కువ. గ్రామంలో సాక్షులకు హడలు పుట్టిస్తారు. దాంతో వాళ్ళు ప్రతికూలంగా మారిపోతారు,” అని స్వయానా దళితుడైన సీనియర్ వకీలు బన్వర్ బాగ్రి, జైపూర్ న్యాయస్థానం వద్ద నాతో చెప్పారు.

సాక్షికి రక్షణనివ్వడం అనే కార్యక్రమం లాంటిది ఏమీ ఉండదు. పైగా, ఇలాంటి ఆలస్యాల వల్ల అప్పటికే పాక్షిక దృష్టితో ఉన్న సాక్ష్యాలను ఇంకా మతలబు చేయడానికి గ్రామంలోని అగ్ర కులంవాళ్ళు ప్రాంతీయ పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుంటారు.

ఒకవేళ దావా ముందుకి కదిలినా, న్యాయవాదుల సమస్య ఒకటి ఉంటుంది. “ఈ వకీళ్ళు అందరూ ప్రమాదకరమైనవాళ్ళే,” అన్నారు చున్నీ లాల్ జాతవ్. “చివరికి నీకు శత్రువుతో బేరసారాలు కుదుర్చుకున్న వకీలు దొరకొచ్చు. అతను లంచానికి అమ్ముడుపోయాడంటే, ఇక నీ పని అయిపోయినట్టే.”

ఖర్చులు నిజంగా పెద్ద సమస్యే. “న్యాయ సహాయ పథకం ఒకటి ఉంది గాని, అది చాలా సంక్లిష్టమైనది,” అన్నారు జైపూర్ ఉన్నత న్యాయస్థానంలో ఉన్న కొద్దిమంది దళితులలో ఒకరైన న్యాయవాది, చేతన్ బైర్వా. “ఆ పథకాలకు వార్షిక ఆదాయం వంటి వివరాలు అవసరం. రోజువారీ లేదా కాలానుగుణమైన కూలీ అందుకునే చాలామంది దళితులకు ఇది అర్థంచేసుకోవడం కష్టం. ఇంక వారికున్న హక్కుల పట్ల వారికి అవగాహన లేకపోవడం వల్ల, చాలామందికి ఆ సహాయ నిధి గురించి తెలియనుకూడా తెలియదు.”

న్యాయ రంగంలో దళితులకు తక్కువ ప్రాతినిధ్యం ఉండడం కూడా ఒక అడ్డంకి. జైపూర్ న్యాయస్థానంలో ఉన్న 1200 మంది న్యాయవాదులలో ఎనిమిదిమంది మాత్రమే దళితులు. ఉదయపూర్‌లో అయితే 450 మందిలో వీరి సంఖ్య తొమ్మిది. గంగానగర్‌లో ఉన్న 435 మందిలో ఆరుగురు. ఇంతకంటే ఉన్నత స్థాయిలలో ఈ ప్రాతినిధ్యం పరిస్థితి ఇంకా దీనంగా ఉంటుంది. ఉన్నత న్యాయస్థానంలో షెడ్యూల్ కులాలకు చెందిన న్యాయమూర్తులే లేరు.

రాజస్థాన్‌లో ఉన్న న్యాయ అధికారులు లేదా మున్సిఫ్‌ లలో దళితులున్నారు. కాని కుమ్హేర్‌కు చెందిన చున్నీలాల్ చెప్పేదాని ప్రకారం వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. “మరీ తక్కువమంది ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా ఎవరి దృష్టినీ ఆకట్టుకోకూడదనే కాకుండా, అసలు ఎవరి కంటా పడకూడదని కూడా అనుకుంటారు.”

దావా న్యాయస్థానం చేరినప్పుడు, అక్కడ పేష్కార్ (కోర్టు గుమాస్తా) ఈ సంగతి చూసుకోవాలి. “అతని చేయి తడపకపోతే, తేదీల విషయంలో మీరు నరకం అనుభవిస్తారు,” అని పలు చోట్ల నాతో చెప్పారు. ఏదేమైనా, “ఈ వ్యవస్థ మొత్తానికే భూస్వామ్య వ్యవస్థ. అందువల్లనే, పేష్కార్‌ కి కూడా అతని వాటా అతనికి ఇచ్చేసేయాలి. ఇక్కడి అనేక న్యాయాధికారుల కార్యాలయాలలో, అధికారులంతా పేష్కార్ డబ్బుతో ఏర్పాటు చేసిన భోజనం చేయడానికి కూర్చుంటారు. ఈ మధ్యే దీని గురించి రాసిన విలేఖరులకు ఈ విషయాన్ని కూడా బైటపెట్టాను,” అన్నారు చున్నీలాల్.

ఇవన్నీ పోగా, అతి తక్కువగా ఉన్న దోషినిర్ధారణ రేటు ఒకటి. కాని ఇది ఇంతటితోనే ఆగదు.

జైపూర్ ఉన్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయవాది అయిన ప్రేమ్ కృష్ణ ఇలా చెప్పుకొచ్చారు: “మీకు మంచి తీర్పు రావచ్చు. ఆ తరువాత దాన్ని అమలుపరచే అధికారుల తీరు ఘోరంగా ఉన్నట్టు తెలుస్తుంది.” ప్రేమ్ కృష్ణ రాజస్థాన్‌లో పౌర హక్కుల సంఘం (పియుసిఎల్) అధ్యక్షుడు కూడా. “షెడ్యూల్ కులాల పరిస్థితి ఎలా ఉందంటే, ఆర్థిక స్థోమత లేకపోవడంతో పాటు ఒక రాజకీయ నిర్వహణ కూడా లేదు. చివరకు దళిత సర్పంచులు కూడా తమకు అర్థంకాని న్యాయ వ్యవస్థలో చిక్కుకుని ఉన్నారు.

Anju Phulwaria, the persecuted sarpanch, standing outside her house
PHOTO • P. Sainath

రాహోలిలో, పదవి నుంచి తాత్కాలికంగా తొలగించబడి, తన దావా కోసం పోరాడుతూ వేలకి వేలు ఖర్చు పెట్టి, ఆర్థికంగా ఎంతగానో నష్టాలపాలయిన దళిత సర్పంచ్ అంజు ఫుల్వారియా

టోంక్ జిల్లా రాహోలిలో, పదవి నుంచి తాత్కాలికంగా తొలగించబడిన దళిత సర్పంచ్ అంజు ఫుల్వారియా, తన దావా కోసం పోరాడుతూ వేలకి వేలు ఖర్చు పెట్టి, ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. “మా అమ్మాయిలను మంచి ప్రైవేట్ పాఠశాల నుంచి తీసేసి, ప్రభుత్వ పాఠశాలలో వేశాం.” దళితుల ఆస్తిని నాశనం చేయమని విద్యార్థులను ప్రేరేపించిన ఉపాధ్యాయులున్న పాఠశాల ఇదే.

నక్సోడాలో, మంగిలాల్ ఆ ముక్కుతాడు వేసిన దావాలో పోరాడుతూ రూ. 30,000కు పైగా ఖర్చుపెట్టారు. ఇప్పుడు దాన్ని గెలవలేక ఆయనా, బాధితుడైన ఆయన కొడుకూ చేతులెత్తేశారు. ఖర్చులు భరించడానికి ఆ కుటుంబం తమకున్న అంతంత మాత్రం భూమిలో మూడో వంతు భాగాన్ని అమ్మేసింది.

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రి అశోక్ గెహలోట్ ఈ పరిస్థితులను కొంతవరకైనా మార్చాలన్న ఆసక్తి కలిగివున్నట్టు కనిపిస్తున్నారు. అతని ప్రభుత్వం ‘ఎఫ్.ఆర్.’ (తుది నివేదికలు లేదా మూతపడిన దావాలు) ల యాదృచ్ఛిక అవలోకనం (random survey) చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది. కావాలని కప్పిపుచ్చిన దావాలు దొరికితే, “విచారణకు అడ్డుపడినందుకు బాధ్యులైనవారికి శిక్ష పడుతుంది,” అని జైపూర్‌లో ఆయన నాతో అన్నారు. సర్పంచ్ వంటి పంచాయతీ పదవుల నుంచి ‘బలహీన వర్గాలు అన్యాయంగా తొలగించబడకుండా ఉండేందుకు పంచాయతీ నియమాలలో మార్పులు తీసుకురావాల’ని గెహలోట్ ఉద్దేశం.

నిజానికి అంజు ఫుల్వారియా లాంటి చాలామంది సర్పంచ్‌లు భారతీయ జనతా పార్టీ పరిపాలనలో వేధింపులకు గురయ్యారు. ఆ ప్రక్రియని తిరగరాయడం వల్ల గెహలోట్ రాజకీయపరంగా లాభాన్నే పొందుతారు. కాని అతని ముందున్న పని బ్రహ్మాండమైనది, కఠినమైనది. వ్యవస్థ పట్ల విశ్వసనీయత ఎన్నడూ మరీ ఇంత తక్కువగా లేదు.

“చట్టానికి, న్యాయానికి సంబంధించిన ప్రక్రియల్లో మాకు ఏ మాత్రం నమ్మకం లేదు,” అని రామ్ ఖిలాడీ అన్నారు. “చట్టం పెద్ద మనుషుల కోసమేనని మాకు తెలుసు.”

ఎంతైనా ఇది రాజస్థాన్! ఇక్కడ మను తన విస్తారమైన నీడను న్యాయస్థానం లోపలికంటా పరచి చీకటిమయం చేస్తోంటే, అంబేద్కర్ వెలుపలివాడై ఉంటారు.

ఈ రెండు భాగాల కథనంలో సూచించిన 1991-96 కాలపు నేరాల సమాచారం, 1998లో రాజస్థాన్ ‘షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాతీయ సంఘం’ కోసం తయారుచేసిన నివేదిక నుంచి సేకరించడం జరిగింది. వీటిలో చాలా గణాంకాలు ఆ తరువాత మరింత దిగజారి ఉండవచ్చు.

ఈ రెండు-భాగాల కథనం మొదట జూన్ 11, 1999న ది హిందు పత్రికలో ప్రచురించబడింది. ఈ కథనం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చే మానవ హక్కుల జర్నలిజం గ్లోబల్ అవార్డుని, ఈ పురస్కారం ప్రారంభమైన సంవత్సరం (2000)లోనే గెలుచుకుంది.

అనువాదం: అఖిల పింగళి

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Akhila Pingali

Akhila Pingali is a freelance translator and writer from Visakhapatnam.

Other stories by Akhila Pingali