ఇంకా పూర్తికాని మట్టి దార్లు ఎన్నో కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయి.ఈ దారుల వెంట సౌరాలోని ఆసుపత్రికి చేసే ప్రయాణం ఒక నిరంతర పోరాటం. కొడుకు మొహసిన్ వైద్యం కోసం ముబీనా, అర్షీద్ హుస్సేన్ అఖూన్‌లు కనీసం నెలకొకసారి ఆసుపత్రికి వెళ్ళాల్సివస్తుంటుంది. దాదాపు తొమ్మిదేళ్ళ వయసున్న పిల్లవాడిని అర్షీద్ తన చేతుల్లో ఎత్తుకుని, మురుగు నీరు, కరిగే మంచు పొంగి పారే రఖ్-ఎ-అర్థ్ పునరావాస కాలనీ వీధుల గుండా మోసుకుపోతారు.

సాధారణంగా ఒక రెండు-మూడు కిలోమీటర్లు నడిచాక వారికి ఏదో ఒక ఆటో దొరుకుతుంది. ఆ ఆటో వాళ్ళని అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో, ఉత్తర శ్రీనగర్‌లొని సౌరా ప్రాంతంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ మెడికల్ సైన్సెస్ వరకూ చేరుస్తుంది. అందుకు వారికి రూ. 500 ఖర్చవుతుంది. కొన్నిసార్లు- ప్రత్యేకించి క్రిందటి సంవత్సరం లాక్‌డౌన్ల సమయంలో - కుటుంబమంతా ఆసుపత్రి వరకూ మొత్తం దూరం నడవవలసి వచ్చేది. “అందుకు ఒక రోజంతా పడుతుంది,” అన్నారు ముబీనా.

ఇంచుమించు తొమ్మిది సంవత్సరాల క్రితం ముబీనా, అర్షీద్‌ల ప్రపంచమే మారిపోయింది. 2012లో పుట్టిన కొన్ని రోజులకే మొహసిన్‌కు జ్వరం, పచ్చకామెర్లు వచ్చి, శరీరంలో బిలిరుబిన్ స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. అప్పటినుంచి వరుసగా వైద్యులకు చూపించడం మొదలుపెట్టారు. శ్రీనగర్‌లోని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జి.బి. పంత్ పిల్లల ఆసుపత్రిలో రెండు నెలలు గడిపాడు మొహసిన్. చివరికి, ఆ పసివాడు ‘అపసవ్యత’తో ఉన్నాడని వాళ్ళకి తేల్చిచెప్పారు.

“బాబు పరిస్థితి మెరుగుపడకపోయేసరికి, మేమొక ప్రైవేటు వైద్యుణ్ణి సంప్రదించాం. పిల్లవాడి మెదడు పూర్తిగా దెబ్బతిందని, ఇంకెప్పటికీ వాడు కూర్చోలేడనీ మాట్లాడలేడనీ, ఆ వైద్యుడు మాకు చెప్పారు." అని 30యవవడిలో ఉన్న ముబీనా ఆ రోజులను జ్ఞాపకం చేసుకున్నారు.

మొహసిన్‌కు సెరిబ్రల్ పాల్సీ (మెదడుకు వచ్చే పక్షవాతం) అని చివరకు నిర్ధారించారు. అప్పటినుండి కొడుకుకూ, అతని ఆరోగ్యానికీ అవసరమైన సేవలు చేస్తూనే ముబీనా తన సమయాన్నంతా గడుపుతున్నారు. “పిల్లాడి మూత్రాన్ని శుభ్రం చేసి, మంచం కడిగి, బట్టలుతికి, కూర్చోబెట్టాలి. రోజంతా పిల్లాడు నా ఒళ్ళోనే ఉంటాడు.” అని ఆమె చెప్పుకొచ్చారు.

'When his condition didn’t improve, we took him to a private doctor who told us that his brain is completely damaged and he will never be able to sit or walk'
PHOTO • Kanika Gupta
'When his condition didn’t improve, we took him to a private doctor who told us that his brain is completely damaged and he will never be able to sit or walk'
PHOTO • Kanika Gupta

'పిల్లాడి పరిస్థితి మెరుగుపడకపోయేసరికి మేమొక ప్రైవేటు వైద్యుణ్ణి సంప్రదించాం. పిల్లాడి మెదడు పూర్తిగా దెబ్బతిందనీ, ఇంకెప్పటికీ కూర్చోలేడు, మాట్లాడలేడని ఆ వైద్యుడు మాకు చెప్పారు'

కానీ పగిలిన గోడలు, పూర్తికాని పైకప్పులు గల ఖాళీ భవనాల ఈ రఖ్-ఎ-అర్థ్ పునరావాస కాలనీకి రాకముందు, అంటే 2019 వరకు, అఖూన్ కుటుంబ పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావు.

అప్పట్లో వీళ్ళు డల్ సరస్సు వద్దనున్న మీర్ బెహరీ ప్రాంతంలో నివసించేవారు. అక్కడ ముబీనాకి ఉపాధి, ఆదాయం ఉండేవి. “నెలలో 10 నుంచి 15 రోజులు డల్ సరస్సు దగ్గర గడ్డి కోసేదాన్ని,” అని ఆమె చెప్పారు. ఆ గడ్డితో ఆమె ౘాపలు తయారుచేసి సంతలో ఒక్కొక్కటీ రూ. 50 చొప్పున అమ్మేవారు. అలాగే నెలకి 15 నుంచి 20 రోజులు సరస్సులోని కలువ పూలు ఏరే పనికి వెళ్ళి, నాలుగు గంటల పనికి రూ. 300 సంపాదించేవారు. పొలం పనులు దొరికే కాలంలో అర్షీద్ నెలలో 20 నుంచి 25 రోజులు రైతు కూలీగా పని చేసి, రోజుకి రూ. 1000 దాకా సంపాదించేవారు. అలాగే, రోజుకి కనీసం రూ. 500ల లాభానికి మండీ లో కూరగాయలు అమ్మేవారు.

అప్పుడు ఆ కుటుంబం నెలవారీ ఆదాయం సమృద్ధిగా ఉండటంతో రోజులు బాగానే గడిచేవి. అంతేగాక మొహసిన్‌ని తీసుకెళ్ళవలసిన ఆసుపత్రులు, చూపించవలసిన వైద్యులు, అందరూ మీర్ బెహరీకి చేరువగా ఉండేవారు.

“కానీ మొహసిన్ పుట్టాక నేను పనిలోకి వెళ్ళడం మానేశాను,” అన్నారు ముబీనా. “నేను ఎంతసేపూ నా కొడుకుతోనే ఉంటాననీ, ఇంటి పనుల్లో ఆమెకి సహాయం చేయడానికి నేను తీరికచేసుకోవడంలేదనీ, అప్పుడు మా అత్తగారు అనేవారు. మమ్మల్నక్కడ (మీర్ బెహరీలో) ఉంచుకుని ప్రయోజనం ఏమిటి?”

అందువలన ముబీనా, అర్షీద్‌లను ఇంటినుంచి బయటకి వెళ్ళిపోమని చెప్పేశారు. దాంతో వారు అక్కడికి దగ్గరలోనే డబ్బా రేకులతో ఒక పాక వేసుకున్నారు. కానీ సెప్టెంబర్ 2014లో వచ్చిన వరదల్లో ఆ బలహీనమైన గుడిసె కూలిపోయింది. కొంత కాలం బంధువుల దగ్గర ఉండి, మళ్ళీ వేరే చోటకు మారారు. ఇలా మారిన ప్రతిసారీ తాత్కాలికమైన పాకల్లోనే వారు నివాసం ఏర్పరచుకునేవారు.

కానీ ఎన్ని ఇళ్ళు మారినా, మొహసిన్‌కి తరచూ చేయవలసిన చికిత్సకి, వేయవలసిన మందులకి అవసరమైన వైద్యులు, ఆసుపత్రులు, అందుబాటులోనే ఉండేవి.

The family sitting in the sun outside Arshid’s parents’ home in Rakh-e-Arth, Srinagar
PHOTO • Kanika Gupta
The family sitting in the sun outside Arshid’s parents’ home in Rakh-e-Arth, Srinagar
PHOTO • Kanika Gupta

శ్రీనగర్‌లోని రఖ్-ఎ-అర్థ్‌లో అర్షీద్ తల్లితండ్రులకు చెందిన ఇంటి బయట ఎండలో కూర్చుని ఉన్న కుటుంబ సభ్యులు

కానీ 2017లో, జమ్మూ-కాశ్మీర్ సరస్సులు మరియు జలమార్గాల అభివృద్ధి సంస్థ (LAWDA), డల్ సరస్సు ప్రాంతంలో ‘పునరావాస’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అర్షీద్ తండ్రి, డెబ్భైల వయస్సులో ఉన్న గులామ్ రసూల్ అఖూన్ సరస్సులోని ద్వీపాలలో సేద్యం చేస్తుంటారు. డల్ సరస్సుకి ఇంచుమించు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేమినా ప్రాంతంలో, రఖ్-ఎ-అర్థ్ అనే కొత్త పునరావాస కాలనీలో, దాదాపు 2000 చదరపు అడుగుల స్థలంలో ఇంటిని నిర్మించుకోవడానికి లక్ష రూపాయలు ఇస్తామన్న అధికారుల ప్రతిపాదనకు అర్షీద్ తండ్రి ఒప్పుకున్నారు.

“మా నాన్నగారు, తాను వెళ్ళిపోతున్నాననీ, నాకు ఇష్టమైతే తనతో రావచ్చు, లేదా అక్కడే ఉండిపోవచ్చుననీ నాతో అన్నారు. ఆ సమయానికి మాకు ఇంకొక కొడుకు కూడా పుట్టాడు – అలీ 2014లో పుట్టాడు. ఆయనతో వెళ్ళడానికి నేను అంగీకరించాను. ఆయన తన ఇంటి వెనకాతల (రఖ్-ఎ-అర్థ్‌లో) మాకు కాస్త జాగా ఇచ్చారు. మేం అక్కడే మా నలుగురి కోసం ఒక చిన్న గుడిసెను కట్టుకున్నాం,” అన్నారు అర్షీద్.

ఇది 2019లో జరిగింది. రహదార్లు, సరైన రవాణా వ్యవస్థ, బడులు, ఆసుపత్రులు, ఉద్యోగ అవకాశాలు వంటివి ఏమీ లేని ఈ మారుమూల కాలనీకి తరలి వెళ్ళిన 1000 కుటుంబాలలో అఖూన్ కుటుంబం కూడా ఒకటి. ఇక్కడ నీరు, విద్యుత్తు వంటి సదుపాయాలు మాత్రమే లభిస్తాయి. “ఇంత వరకు (మూడింటిలో) మొదటి సముదాయాన్ని, 4600 స్థలాలను అభివృద్ధి చేశాం. 2280 కుటుంబాలకు స్థలాలు కేటాయించామ”ని అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు తుఫైల్ మట్టూ అన్నారు.

దినసరి భత్యం వచ్చే పని ఏదైనా వెతుక్కోవడం కోసం రఖ్-ఎ-అర్థ్‌కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కూలీల నాకాకి అర్షీద్ వెళతారు. “చాలా మంది ఇక్కడకి పొద్దున్నే 7 గంటలకే వచ్చి, పని దొరుకుతుందేమోనని మిట్టమధ్యాహ్నం వరకు కాచుకుని ఉంటారు. మాములుగా నాకు నిర్మాణ స్థలాల్లో రాళ్ళు మోసే పని దొరుకుతుంది.” కానీ ఈ పని మహా అయితే నెలకి 12 నుంచి 15 రోజులుండి, రోజుకి రూ. 500 మాత్రమే సంపాదించి పెడుతుంది. డల్ సరస్సు దగ్గర ఉన్నప్పటి కంటే అతని సంపాదన బాగా పడిపోయింది.

పని దొరకనప్పుడు, ఆదా చేసుకున్న డబ్బుతో సంసారాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తామని అర్షీద్ అన్నారు. “కానీ మా దగ్గర డబ్బులు లేనప్పుడు, మొహసిన్‌ని చికిత్స కోసం తీసుకెళ్ళలేం.”

Rakh-e-Arth has just one sub-health centre that can only handle basic healthcare functions; for emergencies people have to travel to the urban primary health centre at Pantha Chowk, 15 kilometres away. Or, like the Akhoon family, they have to go to the hospital in Soura
PHOTO • Kanika Gupta
Rakh-e-Arth has just one sub-health centre that can only handle basic healthcare functions; for emergencies people have to travel to the urban primary health centre at Pantha Chowk, 15 kilometres away. Or, like the Akhoon family, they have to go to the hospital in Soura
PHOTO • Kanika Gupta

రఖ్-ఎ-అర్థ్‌లో కేవలం ఒక ఆరోగ్య ఉపకేంద్రం మాత్రమే ఉంది. అది కూడా కనీస ఆరోగ్య అవసరాలనే తీర్చగలదు; అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని పంథా చౌక్‌లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రయాణమవ్వాలి. లేదా, అఖూన్ కుటుంబం లాగా, సౌరాలోని ఆసుపత్రికి వెళ్ళాలి

రఖ్-ఎ-అర్థ్‌లో కేవలం ఒకే ఆరోగ్య ఉపకేంద్రం ఉంది. మధుమేహం, రక్తపోటు వంటి అంటువ్యాధులు కానటువంటి వ్యాధులను నిర్ధారించే పరీక్షలు, పిల్లలకు రోగనిరోధక ప్రక్రియలు, గర్భిణీ స్త్రీలకు ప్రసూతి పరీక్షలు వంటి సేవలు మాత్రమే ఇక్కడ అందించగలరని, శ్రీనగర్‌లోని బటమాలూ మండలం జోనల్ ఆరోగ్య అధికారి డా. సమీనా జాన్ అన్నారు. ఈ పునరావాస కాలనీ బటమాలూ మండలంలోనే ఉన్నది.

రఖ్-ఎ-అర్థ్‌లో ఒక ఆరోగ్య కేంద్రాన్నీ, ఒక ఆసుపత్రినీ నిర్మిస్తున్నారు. “భవనం పూర్తయిపోయింది. త్వరలోనే సేవలు మొదలవుతాయి,” అని అభివృద్ధి సంస్థ అధికారి తుఫైల్ మట్టూ అన్నారు. “ప్రస్తుతానికి ఆరోగ్య ఉపకేంద్రంలో ఒక చిన్న వైద్య చికిత్సా కేంద్రం మాత్రమే నడుస్తూ ఉంది. రోజూ ఒక వైద్యుడు వచ్చి కొన్ని గంటలపాటు రోగులను చూస్తుంటారు.” అందువలన, అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, 15 కిలోమీటర్ల దూరంలోని పంథా చౌక్‌లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రయాణమవ్వాలి. లేదా, అఖూన్ కుటుంబం లాగా సౌరాలోని ఆసుపత్రికి వెళ్ళాలి.

ఈ కాలనీకి వచ్చిన తరువాత ముబీనా ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఆమె గుండెదడతో బాధపడుతున్నారు. “మా పిల్లవాడికి ఒంట్లో బాగుండకపోవడంతో నాకు కూడా ఎన్నో సమస్యలు వచ్చిపడ్డాయి,” అన్నారామె. “పిల్లాడి చేతులు, కాళ్ళు, మెదడు, ఏమీ పనిచేయవు. పొద్దున్నించి సాయంత్రం వరకు తనని నా ఒళ్లోనే కూర్చోబెట్టుకుంటాను. రాత్రి అయ్యేసరికి నా ఒళ్ళంతా నొప్పులే. పిల్లాడి గురించి చింతిస్తూ, తనని జాగ్రత్తగా చూసుకుంటూ, నేనే జబ్బుపడ్డాను. వైద్యుడి దగ్గరకి వెళితే, చికిత్స తీసుకోమని, ఇంకొన్ని పరీక్షలు చేయించుకోమనీ చెప్తారు. నా వైద్యం కోసం ఖర్చు పెట్టడానికి నాకు పదిరూపాయల ఆదాయం కూడా లేదు.”

ఆమె కొడుకుకి మామూలుగా వాడే మందుల ధర ఒక్కోసారికి రూ. 700. అవి పది రోజుల్లో అయిపోతాయి. తరచుగా వచ్చే జ్వరాలు, పుళ్ళు, దద్దుర్ల సంగతి చూడడానికి దాదాపు ప్రతి నెలా పిల్లవాడిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అసలు జమ్మూ-కాశ్మీర్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అర్షీద్‌కు అందించిన కార్మికుల కార్డు ప్రకారం, అర్షీద్‌తో పాటు అతనిపై ఆధారపడినవారు కూడా, ఏడాదికి ఒక లక్ష రూపాయల దాకా ఆరోగ్య ప్రయోజనాలు పొందడానికి అర్హులు. అంటే, ఈ చికిత్సలన్నీ వారికి ఉచితంగా దక్కివుండాలి. కాని ఆ కార్డు చెల్లాలంటే అర్షీద్ కొద్దిపాటి వార్షిక రుసుం కట్టాల్సివుంటుంది. అలాగే కార్డు పునరుద్ధరణ చేసే సమయానికి 90 రోజుల ఉపాధి ఉన్నట్టు ఒక ధృవపత్రం కూడా చూపించాలి. అర్షీద్ ఇవన్నీ క్రమం తప్పకుండా చేయలేకపోయారు.

Left: Younger son Ali says, 'My father doesn’t have money, how can I go to school?' Right: The family's tin home behind Arshid's father’s house
PHOTO • Kanika Gupta
Left: Younger son Ali says, 'My father doesn’t have money, how can I go to school?' Right: The family's tin home behind Arshid's father’s house
PHOTO • Kanika Gupta

ఎడమ: 'మా నాన్న దగ్గర డబ్బులు లేవు, నేను బడికెలా వెళ్ళాలి?’ అంటున్న చిన్న కొడుకు అలీ. కుడి: అర్షీద్ తండ్రి ఇంటి వెనుక, ఈ కుటుంబం నివాసముంటున్న డబ్బారేకుల పైకప్పు ఉన్న గుడిసె

“మొహసిన్ మిగతా పిల్లలలాగా నడవడం, బడికి వెళ్ళడం, ఆడుకోవడం వంటి సాధారణమైన పనులు చేయలేడు,” అన్నారు జి.బి. పంత్‌ ఆసుపత్రికి చెందిన డా. ముదాసిర్ రాథర్. అంటువ్యాధులు, మూర్ఛలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే చికిత్స చేయడం, కండరాలు బిగుసుకుపోతే ఫిజియోథెరపీ చేయడం వంటి సహాయం మాత్రమే వైద్యులు అందించగలరు. “సెరిబ్రల్ పాల్సీ నాడీ సంబంధిత వ్యాధి. దీనికి చికిత్స లేద”ని వివరించారు శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పిల్లల వైద్యులైన డా. అసియా అంజుమ్. “పుట్టగానే వచ్చే పచ్చకామెర్లకు వెంటనే చికిత్స చేయకపోవడం ఈ జబ్బుకి దారి తీయవచ్చు. మెదడు పాడవడం, కండరాలు బిగుసుకుపోవడం, కదలికలకు సంబంధించిన రోగాలు, మానసిక మాంద్యత– వీటన్నిటికీ ఇది కారణం కావచ్చు."

పని దొరకక కిందామీదా పడుతూ, వైద్యుల చుట్టూ తిరుగుతూ, మొహిసిన్‌ని, చిన్న కొడుకు అలీని చూసుకోవడానికే ముబీనా, అర్షీద్‌లు చాలా మటుకు తమ సమయాన్నీ, డబ్బునీ కేటాయిస్తారు. ఏడేళ్ల వయసున్న అలీ అలిగినట్టుగా ఇలా అంటాడు, “అమ్మ బయ్యా (అన్నయ్య)నే ఎప్పుడూ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. నన్నెప్పుడూ అలా కూర్చోబెట్టుకోదు.” అన్నయ్యతో బంధాన్ని పెంచుకోవడం అతనికి కష్టమవుతోంది. ఎందుకంటే “తను నాతో మాట్లాడడు, ఆడుకోడు. నేనేమో చిన్నవాడిని కాబట్టి తనకే సహాయం చేయలేను.”

అలీ బడికి వెళ్ళడు. “మా నాన్న దగ్గర డబ్బులు లేవు, నేను బడికెట్లా వెళ్ళాలి?” అని అడుగుతాడు. అదీగాక, రఖ్-ఎ-అర్థ్‌లో అసలు బడులే లేవు. అభివృద్ధి సంస్థ అధికారులు కడతామని మాటిచ్చిన బడి కూడా ఇంకా పూర్తికాలేదు. కాస్త దగ్గరగా ఉన్న బడి అంటే బేమినాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలే. అది కూడా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది, పైగా ఆ బడి పెద్ద పిల్లలకు మాత్రమే.

“రఖ్-ఎ-అర్థ్‌కి వచ్చిన ఆరు నెలల లోపే మేమిక్కడ ఎక్కువ కాలం బతకలేమని మాకు అర్థమైపోయింది,” అన్నారు ముబీనా. “ఇక్కడ పరిస్థితి అస్సలు బాగాలేదు. మొహసిన్‌ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఇక్కడ రవాణా వ్యవస్థ కూడా సరిగా లేదు. ఇక దానికోసం కూడా డబ్బులు లేనప్పుడు, మేం పెద్ద సమస్యనే ఎదుర్కోవలసివస్తుంది.”

“ఇక్కడ చేయడానికి పని లేదు,” అన్నారు అర్షీద్. “మేమేం చేయం? నేను పనికోసం వెతుకుతాను, లేదా అప్పు చేస్తాను. మాకింక వేరే మార్గం లేదు.”

అనువాదం: అఖిల పింగళి

Kanika Gupta

Kanika Gupta is a freelance journalist and photographer from New Delhi.

Other stories by Kanika Gupta
Translator : Akhila Pingali

Akhila Pingali is a freelance translator and writer from Visakhapatnam.

Other stories by Akhila Pingali