ఈ కధ PARI  వారి వాతావరణ మార్పుల మీద రాసిన కథనాల వరస లోనిది. ఈ కధ 2019 లో వాతావరణ వార్తా  కధనాల విభాగంలో రామ్ నాథ్ గోయంకా అవార్డు సాధించింది.

“సాయింత్రం నాలుగయితే మమ్మల్ని వెచ్చగా ఉంచుకునేందుకు నిప్పు రాజేయాల్సిందే,” అన్నారు కేరళలోని వేయనాడ్ కొండ ప్రాంత జిల్లా లో తన పొలం పనిలో ప్రయాసలు పడుతున్న అగస్టీన్ వడకిల్. “కానీ అది 30 ఏళ్ళనాటి మాట. వేయనాడ్  మునిపటిలా చల్లగా, పొగమంచుతో లేదు.” అప్పట్లో మార్చ్ నెల తొలిరోజుల్లో గరిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉంటే  ఉష్ణోగ్రత ఇప్పుడు అదే సమయంలో చాలా సులభంగా 30 డిగ్రీలు దాటుతోంది.

పైగా వడకిల్ జీవితకాలంలోనే వేడిగా ఉండే రోజులు రెట్టింపు కంటే ఎక్కువ అయ్యాయి. 1960, ఆయన పుట్టిన సంవత్సరంలో “వేయనాడ్ ప్రాంతంలో సంవత్సరానికి  29 రోజులు మాత్రమే కనీసం  32డిగ్రీలకు (సెల్సియస్) వెళ్ళటానికి  పట్టేది” అని ఈ జూలై లో న్యూయార్క్ టైమ్స్ వారి వాతావరణ మార్పుల మరియు ప్రపంచ తాపనం  గురించి  సంభాషించే వారి లెక్కల  చెపుతున్నాయి.  “కానీ ఇప్పుడు వేయనాడ్ ప్రాంతంలో 52 రోజుల పాటు సగటున  32 డిగ్రీలు లేదా అంత కంటే ఎక్కువ గాను ఉంటోంది.”

మారుతున్న వాతావరణ క్రమాల వల్ల వచ్చే  అధిక వేడిని  తట్టుకోలేని, సున్నితమైన   మిరియాలు, కమలాల చెట్లు, ఒకప్పుడు ఈ దక్కన్ పీఠభూమి అంచున, పడమటి కనుమలలోని ఈ జిల్లాలో పుష్కలంగా ఉండేవని వడకిల్ చెప్పారు.

వడకిల్, ఆయన భార్య వల్సాకి  మనాథవాడై తాలూకాలో ఉన్న చెరుకొత్తూర్ గ్రామంలో  నాలుగు ఎకరాల భూమి ఉంది. ఈయన కుటుంబం ఇంచుమించు 80 సంవత్సరాల క్రితం అనూహ్యంగా వృద్ధి చెందుతున్న వ్యాపార పంటలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు కొట్టాయం వదిలి వేయనాడ్ కి వచ్చారు.

కానీ, కొంత కాలం గడిచిన తరువాత ఈ వృద్ధి ఒక్కసారిగా చితికిపోయినట్టుగా ఉంది. “వర్షాలు అస్థిరంగా ఉంటే, క్రితం సంవత్సరం లాగానే మేము పండించే కాఫీ (ఆర్గానిక్ రోబస్టా) నాశనమే,” అన్నారు  వడకిల్. “కాఫీ లాభదాయకమైనదే, కానీ దాని పెరుగుదలకి వాతావరణమే పెద్ద సమస్య. వేడి, అస్థిర వర్షపాతం కాఫీని ధ్వంశం చేస్తాయి,” అని చెప్పారు వాల్స. (రోబస్టా) కాఫీ పంటకి అనుకూలమైన ఉష్ణోగ్రత 23-28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి అని ఈ రంగంలో  పనిచేస్తున్న వారు చెప్పారు.

PHOTO • Noel Benno ,  Vishaka George

పై వరస: వేయనాడ్ లో కాఫీ పంట కి మొదటి వర్షం యొక్క అవసరం ఫిబ్రవరి చివరలో లేదా మార్చ్ మొదలు, ఆ తరువాత ఒక వారం రోజులకు పూత మొదలవుతుంది. క్రింది వరస: వర్షం లేకపోటం లేదా అకాలవర్షం పూతని ధ్వంసం చేస్తుంది. (ఎడమ)ధ్వంసమయిన పూత, (కుడి) రోబస్టా కాఫీ గింజలు

వేయనాడ్ కాఫీ లన్నింటిలోకి రోబస్టా కుటుంబం (ఇది  ఒక ఉష్ణ మండల సతతహరిత పొద) ఎక్కువ ధృడంగా ఉంటుంది. దీనిని  డిసెంబర్ నుండి మార్చ్ చివర వరకు సాగు చేస్తారు.  ఈ కాఫీ మొక్కకి మొదటి వర్షం ఫిబ్రవరి చివరిలో లేదా మార్చ్ మొదట్లో పడాలి. ఒక వారం తరవాత పూత మొదలవుతుంది. మొదటి జల్లుల తరువాత ఒక వారం రోజుల వరకు వర్షం రాకుండా ఉండటం చాలా ప్రధానం. ఒక వేళ వర్షం పడితే సున్నితమైన పూత నాశనం అయిపోతుంది. రెండవ జల్లు కాఫీ పళ్ళు లేదా ‘చెర్రీలు’ ఎదగటం మొదలైన ఒక వారం తరువాత అవసరమవుతుంది. ఒకసారి పూత పూర్తిగా విచ్చుకుని, చెట్టు నుంచి రాలి పడ్డ తరువాత చెర్రీలోని గింజలు  పక్వానికి రావటం మొదలవుతుంది.

“సరిగ్గా సమయానికి పడే వానలు ఖచ్చితంగా 85 శాతం దిగుబడి ఇస్తాయి,” అని వడకిల్ చెప్పారు. మేము మార్చ్ మొదట్లో ఆయన్ని కలసినప్పుడు ఇటువంటి ఫలితం రావాలని ఆశించారు, ఇలా జరుగుతుందా జరగదా అని ఆదుర్దా పడ్డారు. ఆశించినట్టుగా జరగలేదు.

మార్చ్ మొదట్లోనే, ఈ సమయం కేరళ లో తీవ్రమైన వేసవి మొదలు, అయినా  ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు వెళ్లిపోయాయి. “ఈ సంవత్సరం రెండవ జల్లులు ( రండమాత మాఝా ) చాలా త్వరగా వచ్చేశాయి, అంతా నాశనం అయిపొయింది,” అని వడకిల్ మార్చ్ చివర్లో మాతో చెప్పారు.

వడకిల్ తన రెండు ఎకరాల్లో  ఈ పంట  వేయడంతో ఈ సంవత్సరం 70,000 రూపాయల నష్టంగా మారింది.  ఇక్కడి రైతుల నుండి వేయనాడ్ సామాజిక  సేవ సంస్థ( WSSS) కాఫీ కొంటుంది, వీరు ప్రాసెస్ చేయని సేంద్రీయ కాఫీ గింజలు కిలోకు 88రూపాయిలు,  సేంద్రీయ కాని కాఫీ కిలోకు 65 రూపాయిలు చొప్పున కొంటారు.

వేయనాడ్ లో 2017-2018 లో 55,525 టన్నుల కాఫీ ఉత్పత్తి కాగా ఈ సంవత్సరం దానిలో 40 శాతం క్షణించింది అని  WSSS సంచాలకులు ఫాదర్ జాన్ చూరపుఝాయీల్  నాకు ఫోన్ లో చెప్పారు. ఇంతవరకు అధికారిక లెక్కలు బయటకు రాలేదు. “ఉత్పత్తిలోని  ఈ తగ్గుదలకి  ప్రధాన కారణం   వాతావరణ మార్పులు. ఇది వేయనాడ్ లో కాఫీ పెరగటానికి అతి పెద్ద ప్రమాదంగా తయారైంది,” అని ఫాదర్ జాన్ అన్నారు. వివిధ సంవత్సరాలలో  దిగుబడుల్లో  విపరీత వైరుధ్యాలకి కారణం - కొన్నిసార్లు అధిక వర్షమైతే మరికొన్ని సార్లు సరిపడా వర్షం పడకపోవడం అని ఈ జిల్లాలోని రైతులు అన్నారు. .

PHOTO • Vishaka George
PHOTO • Noel Benno

అగస్టీన్ వడకిల్, ఆయన భార్య వల్సా కాఫీ, దానితోపాటు రబ్బరు, మిరియాలు, అరటి, వరి, వక్కలు పండిస్తారు (ఎడమ) పెరుగుతున్న వేడి, కాఫీ ఇంకా ఇతర పంటల్ని ప్రభావితం చేస్తున్నాయి (కుడి)

వర్షపాతంలో హెచ్చుతగ్గులు పొలాలకి  నీటికొరత కలగచేస్తున్నాయి. “వేయనాడ్ రైతులలో కేవలం 10 శాతానికి  మాత్రమే కరువు లేదా అస్థిర వర్షపాత పరిస్థితులలో కూడా పని చేసుకోవడానికి అవసరమైన సాగునీటి వసతులైన  బోరు బావులు, పంపులు ఉన్నాయి,” అని ఫాదర్ జాన్ చెప్పారు.

ఆ తక్కువ మంది అదృష్టవంతులలో వడకిల్ లేరు. అతని సాగు నీటి పంపు 2018 ఆగస్టులో వేయనాడ్ని, కేరళలోని కొన్ని ప్రాంతాలని ధ్వంసం చేసిన  వరదల్లో చెడిపోయింది. దానిని బాగు చేయటానికి 15,000 రూపాయిలు ఖర్చు అవుతాయి, ఈ కష్టకాలంలో ఆయనకి అది చాలా పెద్ద మొత్తం.

వడకిల్, వల్సా  ఆ మిగిలిన రెండు ఎకరాలలో రబ్బరు, మిరియాలు, అరటిపళ్ళు, వరి, వక్కలు పండిస్తారు. కానీ, పెరిగిపోతున్న వేడి ఈ అన్ని పంటల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. “15 సంవత్సరాల క్రితం మేము బతకటానికి మిరియాల సాగు సరిపోయేవి. కానీ, (అప్పటి నుండి) ధృతవాట్టం (త్వరగా వాడిపోటం)వంటి జబ్బులతో  ఈ జిల్లాలో ఎకరాలకి ఎకరాలు ధ్వంసం అయ్యాయి.”  మిరియాలు ఏడాది పొడవునా పండే పంట కాబట్టి రైతుల నష్టాలు కూడా  సర్వనాశనకరంగా ఉన్నాయి.

“కాలం గడుస్తున్న కొద్దీ వ్యవసాయం  అభిరుచిగా తప్ప వృత్తిలా  చేయలేని మతిలేని పనిగా తయారయింది. నాకు భూమి ఉంది, కానీ నా పరిస్థితి చూడండి, నువ్వు  ఈ రోజుల్లో  చేయగలిగినది కేవలం కొద్దిగా ఎక్కువ మిరపకాయలు నూరటమే, మాకొచ్చే ఆదాయానికి అన్నంతో కలిపి అదొక్కటే తినగలం ,” అని అన్నారు వడకిల్, నవ్వుతూ.

“15 సంవత్సరాల క్రితం నుండి ఇది మొదలైంది. ఎందుకని కాలావస్ధ ఈ విధంగా మారిపోతోంది?” అని వాపోయారు. ఆసక్తి కలిగించే విషయమేంటంటే మలయాళంలో కాలావస్ధ అంటే శీతోష్ణస్థితి, ఉష్ణోగ్రత లేదా వాతావరణం అని కాదు.

విచారకరమైన విషయం ఏమిటంటే, దశాబ్దాలుగా రైతులు అనుసరిస్తున్న వ్యవసాయ నమూనాలలోనే కొంతవరకు సమాధానం ఉంది.

PHOTO • Vishaka George
PHOTO • Noel Benno

వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు మనాథవాడై లోని ఈ కాఫీ ఎస్టేట్ కి  (ఎడమ) ఇతర పెద్ద ఎస్టేట్ ల వలె కృత్రిమ చెరువులు తవ్వించి, పుంపు సెట్లు పెట్టుకోటం వంటివి చేయగలిగే  స్తొమత ఉంది. కానీ వడకిల్ (కుడి) వంటి చిన్న కమతాలు గలవారు పూర్తిగా వర్షం మీద, చాలీచాలని బావుల మీద ఆధారపడతారు

“వ్యవసాయ భూమిలోని  ప్రతీ ముక్కలో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఒకే పంట పద్దతికి భిన్నంగా ఎక్కువ పంటలు కలిపి పండించటం ఆరోగ్యకరమని మేము చెపుతాము” అన్నారు సుమ టి. ఆర్.  ఈమె వేయనాడ్ లో ఎమ్.స్. స్వామినాథన్ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్త. 10 సంవత్సరాలకు పైగా భూమి వాడకం, మార్పులు అన్న విషయాలపై పని చేస్తున్నారు. ఒకే పంట పద్దతి చీడలు, తెగుళ్లను త్వరగా వ్యాప్తి చేస్తుంది. దాంతో రసాయన పురుగుమందులు, ఎరువులతో వీటిని బాగుచేసుకోవలసి వస్తుంది. ఇవి భూగర్భ జలాల్లో లేదా గాలిలో కలసి కాలుష్యం కలిగిస్తాయి.  ఇలానే జరుగుతూ పొతే  తీవ్రమైన పర్యావరణ హాని సంభవిస్తుంది.

ఇది బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించిన  అటవీనిర్మూలనతో  మొదలైంది, అన్నారు సుమ. “వాళ్ళు కలప కోసం అడవులు నరికి,  ఎన్నో ఎత్తైన పర్వతాలను వలస తోటలుగా మార్చారు.” ఈ వాతావరణ మార్పులు కూడా, “పెద్ద ఎత్తున జరిగిన వలసల (1940 నుండి ఈ జిల్లాకి రావడం మొదలైంది) వల్ల  మన భూమి ఎలా మారింది” అనే విషయంతో కూడా  సంబంధం ఉంటుంది. దీనికి ముందు వేయనాడ్ రైతులు పోడు వ్యవసాయం చేసేవారు” అని సుమ అన్నారు.

ఆ దశాబ్దాలలో ఇక్కడి తడి ప్రాంతాల ముఖ్యమైన పంట వరి. కాఫీ కాదు, మిరియాలు కావు. ‘ వేయనాడ్ ’ అన్న మాట ‘ వాయల్ నాడు ’ నుండి వచ్చింది.  ‘ వాయల్ నాడు ’ అంటే  వరి చేల నేల అని అర్ధం. ఈ చేలు ఇక్కడి ప్రాంతానికి - కేరళకు - వాతావరణం మరియు పర్యావరణ వ్యవస్థలకు  చాలా ముఖ్యం.   కానీ ఇక్కడ 1960లో వరి క్రింద ఉన్న ప్రాంతం ఇంచుమించు 40,000 హెక్టార్లు ఉండగా, ఈ రోజున అది 8,000హెక్టార్లకు పడిపోయింది. 2017-18 ప్రభుత్వ డేటా ప్రకారం, ఈ జిల్లాలో మొత్తం సాగులో ఉన్న భూమిలో, 5 శాతం కన్నా తక్కువ భాగంలో వరి పండిస్తున్నారు. ప్రస్తుతం  వేయనాడ్ లో ఇంచుమించు  68,000హెక్టార్లు కాఫీ తోటలతో నిండిపోయింది. అది కేరళలో సాగు చేసే మొత్తం కాఫీలో 79 శాతం ఉంది. ఇది 1960, అంటే వడకిల్ పుట్టిన సంవత్సరంలో,  మొత్తం దేశంలో పండిన రోబస్టా పంట కన్నా 36 శాతం ఎక్కువ.

“వ్యాపార పంటల కోసం కొండలమీద చెట్లు నరకకుండా ఆ  కొండలపై రైతులు  రాగులు వంటివి పండించేవారు” అన్నారు సుమ.  అప్పుడు వ్యవసాయ భూములు పర్యావరణ వ్యవస్థని భరించగలిగేవి. కానీ పెరుగుతున్న వలసల వల్ల తిండి పంటల కన్నా  వ్యాపార పంటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి”, అని చెప్పారు. 1990లలో వచ్చిన ప్రపంచీకరణ వల్ల ప్రజలు పూర్తిగా మిరియాల వంటి వ్యాపార పంటల మీద ఆధారపడడం మొదలైంది.

వాతావరణంలో మార్పులు వేయనాడ్ లోని కాఫీ పంటకి అతి పెద్ద ప్రమాదమయి ఇక్కడి  కాఫీ ఉత్పత్తి తగ్గుదలకి కారణం అయింది

వీడియో చూడండి: ‘వ్యవసాయం  అభిరుచి అయితే తప్ప చేయలేని మతిలేని పనిగా తయారయింది’

“ఈ రోజున రైతులు వరి మీద కిలోగ్రాముకు 12 రూపాయిలు, కాఫీ మీద 67రూపాయిలు సంపాదిస్తున్నారు. కానీ కిలో మిరియాలకి 360 - 365 రూపాయిలు వస్తాయి,” అన్నారు ఒకప్పుడు WSSS లో ప్రాజెక్టు మేనేజర్,  అలానే ఒకప్పుడు మనాథవాడై లో సేంద్రీయ వ్యవసాయ రైతు అయిన  ఇ. జె. జోస్. ఈ పంటల ధరల  మధ్య తేడా అతి ఎక్కువగా ఉన్నందు వల్ల పెద్ద సంఖ్యలో రైతులు వరి సాగు పూర్తిగా వదిలేసి మిరియాలు లేదా కాఫీ వైపుకు మరలుతున్నారు. “ఇప్పుడు ఏదైతే ఎక్కువ లాభాలు ఇస్తుందో దానినే అందరూ పండిస్తారు, ఏది అవసరమో దానిని కాదు. ఏ పంటయితే వర్షం వచ్చినప్పుడు నీళ్ళని పీల్చుకుని భూగర్భ జలాల్ని పునరిద్ధరిస్తుందో అటువంటి వరిని కూడా మనం పోగొట్టుకుంటున్నాం.”

రాష్ట్రంలోని చాలా వరిపొలాలు లాభదాయకమైన రియల్ ఎస్టేటు స్థలాలుగా మారిపోటంతో వరి పండించటంలో నైపుణ్యం కలిగిన రైతుల పనిదినాలు తగ్గిపోయాయి.

“ఈ మార్పులన్నీ వేయనాడ్ భూమి మీద నిరంతర ప్రభావం చూపుతూనే ఉన్నాయి,” అన్నారు సుమ. “ఒకే పంట విధానం వల్ల నేల పాడయిపోయింది. పెరుగుతన్న జనాభా(జనాభా లెక్కల ప్రకారం1931 వరకు 100,000 కంటే తక్కువ మంది ఉండగా, 2011జనాభా లెక్కల ప్రకారం 817,420కు చేరింది), దానితో పాటు వచ్చే భూవిభజన వలన వేయనాడ్ రోజురోజుకీ వేడెక్కిపోతోంది అంటే ఆశ్చర్య పడనక్కరలేదు.”

మారుతున్న వ్యవసాయ పద్ధతులు,  ఉష్ణోగ్రతలు పెరగడం - ఈ రెండు చాలా దగ్గరగా ముడిపడి ఉన్నాయని జోస్ కూడా నమ్ముతాడు. “మారుతున్న వ్యవసాయ పద్ధతులు వర్షపాతంలో మార్పులను ప్రభావితం చేశాయి,” అని అన్నారు.

దగ్గరలో ఉన్న తావినహళ్ పంచాయితీలో, తన 12 ఎకరాల పొలంలో మాకు అన్నీ చూపుతూ, 70 ఏళ్ళ ఎమ్. జె. జార్జ్ ఇలా అన్నారు. “ఒకప్పుడు ఈ పొలాల్లో మిరియాలు ఎంత దట్టంగా  ఉండేవంటే ఈ చెట్ల గుండా వెలుతురు  రావటంమే  కష్టంగా ఉండేది. గడిచిన కొన్ని సంవత్సరాలలో టన్నుల కొద్దీ మిరియాలు నష్టపోయాము. మారుతున్న వాతావరణ పరిస్థితులు ధృతవాట్టం (త్వరగా వాడిపోటం)లాంటి జబ్బులు కలుగచేస్తున్నాయి.”

ఫీటోఫ్ థోరా అనే ఫంగస్ వల్ల  వచ్చే క్విక్ విల్ట్(త్వరగా వాడిపోవడం) ఈ జిల్లాలో వేలాది మంది బ్రతుకుతెరువులు తినేసింది. ఇది అధిక తేమ ఉండే పరిస్థితుల్లో వృద్ధి చెందుతుంది. “ఇది వేయనాడ్ లో పది సంవత్సరాలుగా పెరుగుతున్న స్థితి,” అని జోస్ అన్నారు. “ఇప్పుడు వేళ తప్పి పడుతున్న వర్షాలు, పెరిగిపోయిన రసాయన ఎరువుల వాడకం కూడా ఈ తెగుళ్లు వృద్ధి చెందటానికి,  క్రమంగా వీటితో పోరాదెందుకు సహాయం చేసే మంచి సూక్ష్మక్రిములయిన త్రికోడెర్మా వంటివి చంపేస్తున్నాయి.”

PHOTO • Noel Benno ,  Vishaka George

పై వరసలో ఎడమ: ఒకప్పుడు మా వర్షపాతానికే మేము ప్రసిద్ది" అన్నారు జార్జ్. పై వరసలో కుడి: “ఈ సంవత్సరం అతి తక్కువ కాఫీ ఉత్పత్తి అయింది,” అన్నారు సుభద్రా బాలకృష్ణన్. క్రింది వరసలో ఎడమ:ఇది తీవ్రస్థాయిలో బ్రిటిష్ వాళ్ళ ప్రారంభించిన  అటవీనిర్మూలనతో  మొదలైంది అన్నారు శాస్త్రజ్ఞురాలు సుమ టి.ఆర్. క్రింది వరసలో కుడి: “ఇప్పుడు ఏదైతే ఎక్కువ లాభాలు ఇస్తుందో దానినే అందరూ పండిస్తారు, ఏది అవసరమో దానిని కాదు.” అన్నారు ఇ.జె .జోస్

"వేయనాడ్ లో ఇంతకు మునుపు చల్లని వాతావరణం ఉండేది, కానీ ఇప్పుడు అలాలేదు. గడచిన 15 సంవత్సరాలలో అన్ని రుతువుల్లోే నూ వర్షపాతం  నిలకడగా తగ్గుకుంటూ వచ్చింది. ఒకప్పుడు మా వర్షపాతానికే మేము ప్రసిద్ది…" అన్నారు జార్జ్.

వేయనాడ్ లో 2019 లో జూన్ 1 నుండి జూలై 28 మధ్య వర్షపాతం  54 శాతం, అది ఆ కాలపు  కనీస సగటు కంటే తక్కువ అని తిరువనంతపురంలోని భారత వాతావరణ శాఖ తెలియచేసింది.

సాధారణంగా వేయనాడ్ లో అధిక వర్షపాతం ఉండే ప్రాంతాల్లో కొన్నిసార్లు 4,000 మిల్లీ మీటర్ల వర్షం నమోదవుతుంది. కానీ ఈమధ్య జిల్లా సగటు వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఇది 2014 లో 3, 260 మి. మీ. కాగా తరవాత రెండు సంవత్సరాలు 2,283 మి.మీ అయింది.  మళ్ళీ 1,328 మి.మీ. తో ఆకస్మిక తరుగుదల కనబడుతోంది. మళ్ళీ 2017 లో 2,215 మి.మీ., 2018 లో కేరళ వరదలతో 3,832 మి.మీ.ల అధిక వర్షపాతం నమోదైంది.

“ఇటీవలి దశాబ్దాలలో సంవత్సరాంతర వర్షపాతంలోని వ్యత్యాసాలలో మార్పులు వస్తున్నాయి, ముఖ్యంగా 1980, 90లలో అది మరీ పెరిగింది," అని త్రిసూర్ లోని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి  వాతావరణ మార్పులు బోధన, పరిశోధనా సంస్థ  యొక్క  వైజ్ఞానిక అధికారి డా. గోపకుమార్ చొలయిల్ అన్నారు. “కేరళ అంతటా  వర్షాకాలం, వర్షాకాలం తరువాత కాలాలలో  తీవ్ర  వర్షపాతం కురిసే సందర్భాలు పెరిగాయి. వేయనాడ్ ఈ  ధోరణికి  మినహాయింపు కాదు.”

నిజానికి ఒకరకంగా ఇది వడకిల్, జార్జ్, ఇంకా మిగతా రైతుల అభిప్రాయాలను ధృవీకరిస్తోంది. వాళ్ళు ‘తగ్గుదల’ గురించి బాధపడినా - దీర్ఘకాలిక సగటులు తగ్గుదలను సూచిస్తున్నాయి - తగ్గుదల అంటే వాళ్ళ ఉద్దేశ్యం అవసరమైన రోజుల్లో, కాలాల్లో అవసరమైన దాని కంటే, ఊహించిన దానికంటే  తక్కువ వర్షం కురవడం. వర్ష విస్తరణ, (అంటే వర్షం కురిసిన రోజుల సంఖ్య) తగ్గింది, కానీ వర్ష తీవ్రత పెరిగింది.  వేయనాడ్లో ఆగస్టు-సెప్టెంబర్ లలో ఇంకా కుండపోత గా వర్షాలు కురుస్తున్నాయి, కానీ ఇక్కడ రుతుపవనాలు ప్రధానంగా జూలై నెలలోనే వీస్తాయి. (ఈ జిల్లా ఒకటి రెండు ఇతర జిల్లాలలో జులై 29 న ‘భారీ  వర్షం’  నుండి అతి భారీ వర్షం కురుస్తుందని ఐ ఎమ్ డి ‘కాషాయరంగు హెచ్చరిక’ జారీ చేసింది)

PHOTO • Vishaka George
PHOTO • Vishaka George

వేయనాడ్ లోని వడకిల్ యొక్క కొబ్బరి, అరటి తోటలు అస్థిర వాతావరణం వల్ల నెమ్మదిగా  దెబ్బతింటున్నాయి

“వ్యవసాయ పంటల క్రమాల్లో మార్పులు, అడవి ఆచ్చాదన తగ్గిపోటం, భూమి వాడకం పద్ధతులు… ఇంకా ఇలాంటి ఎన్నో ఇతర కారణాలు పర్యావరణ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపాయి,” అన్నారు డా. చోలయిల్

“క్రిందటేడు వరదలకి నా కాఫీ పంట మొత్తం నాశనం అయిపొయింది. ఈ సంవత్సరం వేయనాడ్ అంతటా అతి తక్కువ కాఫీ ఉత్పత్తి అయింది,” అని మనాథవాడై లో అందరూ ఇష్టంగా ‘టీచర్’ అని పిలిచే సుభద్ర అన్నారు. సుభద్రా బాలకృష్ణన్ 75 ఏళ్ళ రైతు, ఈమె  ఎడవక పంచాయతీ లోని  తమ 25 ఎకరాల కుటుంబ భూమిలో వ్యవసాయం చూసుకుంటూ కాఫీ, వరి, కొబ్బరి మొదలైన పంటలు పండిస్తారు. “వేయనాడ్ (కాఫీ) రైతుల్లో చాలామంది పశువుల మీద(ఆదాయం కోసం) ఆధారపడుతున్నారు.”

మేము కలసిన వ్యవసాయదారులు ‘వాతావరణ మార్పులు’ అన్న మాట వాడి ఉండక పోవచ్చు, కానీ వారందరూ దీని ప్రభావాల గురించి ఆందోళన పడుతున్నారు.

మా చివరి మజిలీ ఆడెన్ వ్యాలీ. ఇది 80 ఎకరాల సాగు తోట. ఇది సుల్తాన్ బధేరీ తాలూకాలో పూతడి పంచాయితీలో ఉంది. అక్కడ  40 సంవత్సరాలుగా వ్యవసాయ కూలీ గా ఉన్న గిరిజన గోపిని కలిశాము. తన సగం రోజు  పని ముగించుకుని  మాతో మాటల్లో ఇలా చెప్పారు, “ఇప్పుడు రాత్రుళ్ళు విపరీతమైన చలిగా ఉంటోంది, పగలు విపరీతమైన వేడి. ఎవరికి తెలుసు ఇక్కడ ఏం జరుగుతోందో,” భోజనానికి వెళ్ళబోతూ, తనలో తను గొణుక్కుంటున్నట్టుగా “దేవుళ్ళే ఇది చేసి ఉండాలి. లేకపోతే ఇదంతా ఎలా అర్ధం చేసుకోవాలి?”

కవర్ ఫోటో: విశాఖ జార్జ్

ఈ కధ  చేయటానికి పరిశోధకులు నోయెల్ బెన్నోవెచ్చించిన సమయానికి, ఉదారమైన సహాయానికి  రచయిత  కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే రికార్డు చేయాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం: కె. పుష్ప వల్లి

Reporter : Vishaka George

Vishaka George is Senior Editor at PARI. She reports on livelihoods and environmental issues. Vishaka heads PARI's Social Media functions and works in the Education team to take PARI's stories into the classroom and get students to document issues around them.

Other stories by Vishaka George

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : K. Pushpa Valli

K. Pushpa Valli is a Lecturer based in Nagaram, East Godavari district.

Other stories by K. Pushpa Valli