ఇద్దరికీ 17 ఏళ్లు, ఇద్దరూ గర్భిణులు. వారిద్దరూ ఒకేసారి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు.  కళ్ళు దించుకు కూర్చోమని తల్లిదండ్రులు చెప్పిన మాటలను కొన్నిసార్లు మరచిపోతున్నారు. కాని తరువాత ఏమి జరగబోతోందో అని ఇద్దరూ భయపడుతున్నారు.

సలీమా పర్వీన్, అస్మా ఖాతున్ (పేర్లు మార్చబడ్డాయి) ఇద్దరూ గత సంవత్సరం 7వ తరగతి చదువుతూ ఉండేవారు, అయితే 2020 విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే గ్రామ పాఠశాల మూసివేయబడింది. లాక్‌డౌన్ కొనసాగుతున్నందున పాట్నా, ఢిల్లీ ముంబైలో పని కోసం వలస వెళ్లిన మగవారు మళ్ళీ తమ స్వస్థలమైన బీహార్‌లోని అరారియా జిల్లాలోని బంగాలీ తోలా అనే కుగ్రామానికి వచ్చారు. ఆ తరవాత పెళ్లి సంబంధాలు వెతుక్కునే గొడవలో పడిపోయారు.

కరోనా మే హుయీ షాదీ ,” అని ఇద్దరిలో ఎక్కువ మాట్లాడే అస్మా చెప్పింది. "కరోనా సమయంలో నేను పెళ్లి చేసుకున్నాను."

సలీమా నికాహ్ (వివాహ వేడుక) రెండు సంవత్సరాల క్రితం ఘనంగా జరిగింది, ఆమెకు 18 సంవత్సరాల వయస్సు వచ్చాక, ఆమె తన భర్తతో సహజీవనం చేయడం ప్రారంభింపజేయాలన్న ఆలోచనతో పెద్దవారంతా ఉన్నారు. ఆ తర్వాత లాక్‌డౌన్ వలన, టైలర్‌గా పనిచేస్తున్న ఆమె 20 ఏళ్ల భర్త, అతని కుటుంబం - వారు అదే కుగ్రామంలో నివసిస్తున్నారు - ఆమె అత్తగారింటికి రావాలని పట్టుబట్టారు. అది దాదాపు జూలై 2020లో జరిగింది. అతను పని లేకుండా రోజంతా ఇంట్లోనే ఉన్నాడు, మిగిలిన మగవారు కూడా ఇంట్లోనే ఉన్నారు - కాబట్టి అదనంగా పనిచేసే వారుంటే ఉపయోగం.

అస్మాకు అయితే,  ఈ మాత్రం సమయం కూడా లేకపోయింది. 2019 లో ఆమె 23 ఏళ్ల అక్క క్యాన్సర్‌తో మరణించింది. గత సంవత్సరం జూన్‌లో, ప్లంబర్ గా పనిచేస్తున్న ఆమె అక్క భర్త, అస్మాను వివాహం చేసుకోవాలని లాక్‌డౌన్ సమయంలో పట్టుబట్టాడు. ఈ వేడుక జూన్ 2020లో జరిగింది.

ఇద్దరు అమ్మాయిలకూ పిల్లలు ఎలా పుడతారో తెలియదు. "ఈ విషయాలు మా అమ్మ చెప్పలేదు," అని అస్మా తల్లి రుక్సానా చెప్పింది, అమ్మాయిలు మరికాస్త ముసిముసిగా నవ్వుతున్నారు. " లాజ్ కీ బాత్ హై [ఇది ఇబ్బందికరమైన విషయం]." వధువు భాభి , ఆమె సోదరుడి భార్య, ఇటువంటి  సమాచారం ఇవ్వగలదు అని  అందరూ భావిస్తారు, అయితే సలీమా, అస్మా ఇద్దరూ వదిన మరదళ్లు, మరొకరికి ఈ సలహాను ఇవ్వగల పరిజ్ఞానం ఇద్దరిలోనూ లేదు.

Health workers with display cards at a meeting of young mothers in a village in Purnia. Mostly though everyone agrees that the bride’s bhabhi is the correct source of information on such matters
PHOTO • Kavitha Iyer

పూర్నియాలోని ఒక గ్రామంలో యువ తల్లుల సమావేశంలో డిస్ప్లే కార్డులతో ఆరోగ్య కార్యకర్తలు. వధువు భాభి , ఆమె సోదరుడి భార్య, ఇటువంటి  సమాచారం ఇవ్వగలదు అని  అందరూ భావిస్తారు

రాణిగంజ్ బ్లాక్‌లోని బెల్వా పంచాయతీలో దాదాపు 40 కుటుంబాలు ఉన్న బంగాలీ తోలాకు చెందిన ఆశా కార్యకర్త (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త)గా అస్మా అత్త పనిచేస్తుంది - ఆమె ఈ అమ్మాయిలకు "త్వరలో" ప్రతిదీ వివరిస్తానని హామీ ఇచ్చింది.

లేదా అమ్మాయిలు జకియా పర్వీన్‌ని అడగవచ్చు, ఈ ఇద్దరు అమ్మాయిలకు కేవలం రెండేళ్లు సీనియర్, పైగా 25 రోజుల వయస్సు గల నిజాం ( పేర్లు మార్చబడ్డాయి )కి తల్లి. నిజాం కాటుక నిండిన రెప్పవేయని చూపుతో, చెంప మీద పెట్టిన నల్లటి దిష్టి చుక్కతో ఉంటాడు. జకియాకు ఇప్పుడు 19 ఏళ్లు, ఆమె చాలా చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ, కట్టుకున్న కాటన్ చీర మడతల మధ్య ఆమె మరింత బలహీనంగా, పాలిపోయినట్లు కనిపిస్తుంది . ఆమె ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు,16 సంవత్సరాల వయస్సులో ఆమె తన బంధువుని వివాహం చేసుకుంది.

ఆరోగ్య కార్యకర్తలు, పరిశోధకులు కూడా బీహార్‌లోని చాలామంది 'కోవిడ్ బాలవధువు'లు ఇప్పుడు గర్భం దాల్చి ఉన్నారని, తక్కువ స్థాయి పోషకాహారం, సమాచారంతో పోరాడుతున్నారని గమనించారు. అయితే, లాక్‌డౌన్‌ జరగక ముందే కౌమారదశలో ఉన్న బాలికలు గర్భం దాల్చడం, బీహార్‌లోని గ్రామాల్లో సర్వసాధారణం. "ఇది ఇక్కడ అసాధారణం కాదు, పెళ్లి అయిన వెంటనే యువతులు గర్భవతి అవుతారు, మొదటి సంవత్సరంలో బిడ్డను ప్రసవిస్తారు," అని బ్లాక్ హెల్త్ మేనేజర్ ప్రేరణ వర్మ చెప్పారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5, 2019-20) ప్రకారం, 15-19 సంవత్సరాల వయస్సు గల బాలికలలో 11 శాతం మంది ఇప్పటికే తల్లులుగా ఉన్నారని లేదా సర్వే సమయంలో గర్భంతో ఉన్నారని పేర్కొంది. భారతదేశంలో జరిగే మొత్తం బాల్య వివాహాలలో (18 ఏళ్లలోపు) బాలికలలో 11 శాతం, బాలులలో 8 శాతం (21 ఏళ్లలోపు) బీహార్‌లో జరుగుతున్నాయి.

బీహార్‌లో 2016లో జరిగిన మరో సర్వే కూడా ఇదే చూపిస్తోంది. ఆరోగ్యం మరియు అభివృద్ధి సమస్యలపై పనిచేసే లాభాపేక్ష లేని పాపులేషన్ కౌన్సిల్, 15-19 సంవత్సరాల వయస్సు గల బాలికలలో 7 శాతం మందికి 15 సంవత్సరాల కంటే ముందే వివాహం జరిగిందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో, 44 శాతం మంది 18-19 ఏళ్లు ఉన్న బాలికలకు, 18 ఏళ్లు నిండకముందే వివాహం జరిగింది.

ఇంతలో, బీహార్‌లోని చాలా మంది యువ వధువులకు, గత సంవత్సరం లాక్‌డౌన్ సమయంలో వివాహం జరిగి, వారి భర్తలు పని కోసం నగరాలకు తిరిగి వెళ్లిన తర్వాత, జీవిత భాగస్వామి తోడు లేకుండా తెలియని పరిసరాలలో నివసిస్తున్నారు.

Early marriage and pregnancies combine with poor nutrition and facilities in Bihar's villages, where many of the houses (left), don't have toilets or cooking gas. Nutrition training has become a key part of state policy on women’s health – an anganwadi worker in Jalalgarh block (right) displays a balanced meal’s components
PHOTO • Kavitha Iyer
Early marriage and pregnancies combine with poor nutrition and facilities in Bihar's villages, where many of the houses (left), don't have toilets or cooking gas. Nutrition training has become a key part of state policy on women’s health – an anganwadi worker in Jalalgarh block (right) displays a balanced meal’s components
PHOTO • Kavitha Iyer

చిన్న వయసులో వివాహాలు తద్వారా  గర్భాలతో పాటుగా, బీహార్‌లోని అనేక ఇళ్లలో (ఎడమవైపు) మరుగుదొడ్లు లేదా వంటగ్యాస్ లేవు. అంతేగాక గ్రామాలలో పోషకాహారలేమి,  సౌకర్యాలలేమి మిళితమై ఉంటాయి. మహిళల ఆరోగ్యంపై రాష్ట్ర విధానంలో పోషకాహార శిక్షణ కీలకంగా మారింది - జలల్‌ఘర్ బ్లాక్ (కుడి)లోని ఒక అంగన్‌వాడీ కార్యకర్త సమతుల్య భోజనంలో ఉండవలసిన పదార్ధాలను  ప్రదర్శిస్తున్నారు

ముంబైలోని జరీ ఎంబ్రాయిడరీ యూనిట్‌లో పనిచేస్తున్న జకియా భర్త ఈ జనవరిలో నిజాం పుట్టిన కొద్ది రోజులకే తిరిగి పనికి వెళ్లిపోయాడు. ఆమె ప్రసవానంతర పౌష్టికాహార సప్లిమెంట్లను తీసుకోవడం లేదు. అంతేగాక ప్రసవం తర్వాత నెలల తరబడి ప్రభుత్వం నిర్దేశించిన కాల్షియం, ఐరన్ ఇంకా సరఫరా కాలేదు, అయినప్పటికీ ఆమె అంగన్‌వాడీ నుండి గర్భధారణ సమయంలోని సప్లిమెంట్లను సరిగ్గానే తీసుకుంది.

" ఆలూ కా తర్కారీ ఔర్ చావల్ [వండిన బంగాళదుంపలు, అన్నం]," ఆమె తన రోజువారీ ఆహారాన్ని జాబితాను చెప్పింది. పప్పు లేదు, పండ్లు లేవు. తన బిడ్డ కామెర్లు వస్తాయనే ఆందోళనతో, జకియా కుటుంబం ఆమెను మాంసాహారం, గుడ్లూ తినకుండా నిషేధించింది. వారి ఇంటి వద్ద ఒక పాలిచ్చే ఆవు కట్టివేసి ఉంది. కానీ జకియాకు కొన్ని నెలల వరకు పాలు ఇవ్వరు. ఈ ఆహార పదార్థాల వలన కామెర్లు వస్తాయని వారు నమ్ముతారు.

16 సంవత్సరాల వయస్సులో జకియా వివాహం జరిగిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పుట్టిన నిజాం గురించి ఆమె కుటుంబం ప్రత్యేక జాగ్రత్తతో ఉంది. “మేము ఆమెను కేసరరా గ్రామంలోని బాబా వద్దకు తీసుకెళ్లవలసి వచ్చింది. అక్కడ మాకు బంధువులు ఉన్నారు. ఆమె తినడానికి అతను మాకు ఒక జడి [మూలిక] ఇచ్చాడు, ఆ తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఇది జంగ్లీ దావా [అడవి ఔషధ మొక్క)" అని గృహిణి  అయిన జాకియా తల్లి (ఆమె తండ్రి కూలీ) చెప్పారు. సకాలంలో రెండో సంతానం కలగకపోతే 50 కిలోమీటర్ల దూరంలోని కీసరరాకు తిరిగి తీసుకువెళతారా? "లేదు, రెండవ సంతానం అల్లాహ్ ఎప్పుడు కనికరిస్తే అప్పుడు కలుగుతాడు.” అన్నారు.

జకియాకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు, అందరికన్నా చిన్నదాని వయసు ఐదు సంవత్సరాలు. జకియాకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అతనికి దాదాపు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. అతను కూడా కూలీగా పనిచేస్తున్నాడు. చెల్లెళ్లు అందరూ బడికి, మదర్సాకి వెళ్తున్నారు. కుటుంబ పరిమిత ఆర్థిక పరిస్థితుల కారణంగా జకియా బడికి వెళ్లలేకపోయింది.

ప్రసవం తర్వాత పెరినియల్ కోతకు కోసం ఆమెకు కుట్లు అవసరమయ్యాయా? జకియా నవ్వింది. ఇది బాధిస్తుందా? ఆ అమ్మాయి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి, కానీ ఆమె మాట్లాడలేదు, బదులుగా చిన్ని నిజాం వైపు చూసింది.

A test for under-nourished mothers – the norm is that the centre of the upper arm must measure at least 21 cms. However, in Zakiya's family, worried that her baby could get jaundice, she is prohibited from consuming non-vegetarian food, eggs and milk
PHOTO • Kavitha Iyer

పోషకాహారలేమి గల తల్లులకు ఒక పరీక్ష - ఏమిటంటే ముంజేతి మధ్యనుండి కనీసం 21 సెం.మీ. పొడవు ఉండాలి. అయినా గాని, బిడ్డకు కామెర్లు వస్తాయని భయపడిన జకియా కుటుంబం, ఆమెను మాంసాహారం, గుడ్లు, పాలు తీసుకోకుండా నిషేధించింది

మరో ఇద్దరు గర్భిణీ బాలికలు ఆమె ప్రసవ సమయంలో ఏడ్చిందా అని అడగడంతో చుట్టూ గుమిగూడిన మహిళలు నవ్వారు. " బహుత్ రోయి [చాలా ఏడ్చాను]," అని జకియా స్పష్టంగా చెప్పింది, ఆమె ఇప్పటి వరకు మాట్లాడిన మాటలలో బిగ్గరగా మాట్లాడిన పదాలు ఇవే. మేమంతా పాక్షికంగా నిర్మించిన, కాస్త మెరుగైన ఇంటిలో, నేలపై కుప్పలుగా పడి ఉన్న సిమెంట్‌పై ప్లాస్టిక్ కుర్చీలు వేసుకుని వాటిపై కూర్చుని ఉన్నాము.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (2016లో వారి  గ్లోబల్ హెల్త్ ఎస్టిమేట్స్: కారణం వలన జరిగిన మరణాలు, వయస్సు, లింగం, దేశం, ప్రాంతం వారీగా మరణాలు, 2000-2016) ప్రపంచవ్యాప్తంగా, 10 నుండి 19 సంవత్సరాల వయస్సు గల యుక్తవయస్సులో ఉన్న తల్లులకు, 20-24 సంవత్సరాల వయస్సు గల స్త్రీల కంటే ఎక్కువగా ఎక్లాంప్సియా( ప్రసవానికి ముందు లేదా ప్రసవ సమయంలో లేదా ప్రసవానంతరం అధిక రక్తపోటు వలన వచ్చే మూర్ఛలు), పుయెపరేల్ (ప్రసవం తర్వాత ఆరు వారాల వ్యవధి) ఎండోమెట్రియోసిస్, ఇంకా  ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇవేగాక నవజాత శిశువులకు పుట్టినప్పుడు తక్కువ బరువు ఉండడం వంటి ఇంకా ఎన్నో తీవ్రమైన ప్రమాదాలున్నాయి.

అరారియా బ్లాక్ హెల్త్ మేనేజర్ ప్రేరణ వర్మకు  జకియా గురించి మరో ఆందోళన ఉంది. "మీ భర్త వద్దకు వెళ్లవద్దు," అని ఆమె ఆ టీనేజ్ తల్లికి సలహా ఇస్తుంది - చిన్నవయసులోని తల్లులకు పునరావృత గర్భాలు బీహార్ గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలకు తెలిసిన వాస్తవం.

ఇంతలో, ఒక నెల గర్భవతి అయిన సలీమా (ఫిబ్రవరిలో, నేను సందర్శించినప్పుడు), స్థానిక అంగన్‌వాడీలో గర్భసంరక్షణ కోసం నమోదు చేసుకోవలసి ఉంది. అస్మా ఆరు నెలల గర్భవతి, ఆమెకు చిన్న పొట్ట మాత్రమే ఉంది. ఆమె గర్భిణీ స్త్రీలందరికీ 180 రోజుల పాటు రాష్ట్రం అందించే ' తాకాతి కా దావా ' (బలానికి మందులు) అయిన కాల్షియం, ఐరన్ సప్లిమెంట్లను అందుకోవడం ప్రారంభించింది.

కానీ బీహార్‌లో కేవలం 9.3 శాతం మంది తల్లులు మాత్రమే తమ గర్భధారణ సమయంలో 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఐరన్, ఫోలిక్ యాసిడ్‌ను వినియోగించారని NFHS-5 పేర్కొంది. కేవలం 25.2 శాతం మంది తల్లులు గర్భిణులుగా ఉన్నప్పుడు నాలుగు సార్లు మాత్రమే ఆరోగ్య సదుపాయానికి వచ్చారు.

కాబోయే వరుడు తనను పెళ్లి చేసుకోవడానికి ఒక సంవత్సరం ఎందుకు వేచి ఉండలేకపోయాడో ఆమె తల్లి వివరిస్తున్నప్పుడు అస్మా భయంగా నవ్వుతుంది. “గ్రామంలో వేరే అబ్బాయితో ఆమె  పారిపోతుందని వరుడి కుటుంబం భావించింది. ఆమె పాఠశాలకు వెళుతోంది, పైగా గ్రామాలలో ఇటువంటి ఈ విషయాలు జరుగుతాయి" అని రుక్సానా చెప్పింది.

PHOTO • Priyanka Borar

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, (2019-20) 15-19 సంవత్సరాల వయస్సు గల బాలికలలో 11 శాతం మంది ఇప్పటికే తల్లులుగా ఉన్నారని లేదా సర్వే సమయంలో గర్భవతిగా ఉన్నారని పేర్కొంది

*****

2016 పాపులేషన్ కౌన్సిల్ సర్వే (‘ఉదయ’ అన్న శీర్షికతో ఉంది - కౌమారులను, యువకులను అర్థం చేసుకోవడం) ఈ చిన్న వయసులో పెళ్ళైన బాలికల భర్తలు, ఆ బాలికలపై జరిపే భావోద్వేగ, శారీరక,  లైంగిక హింసపై కూడా దృష్టి సారించారు: 15 నుండి 19 సంవత్సరాల వయస్సు గల వివాహిత బాలికలలో 27 శాతం మంది కనీసం ఒక్కసారైనా చెంపదెబ్బ కొట్టబడ్డారు, 37.4 శాతం మంది కనీసం ఒక్కసారైనా బలవంతపు సెక్స్‌లో పాల్గొనవలసి వచ్చింది. అలాగే, ఈ వయస్సులో ఉన్న వివాహిత బాలికలలో 24.7 శాతం మంది వివాహమైన వెంటనే పిల్లలను కనాలని కుటుంబ సభ్యుల ఒత్తిడిని ఎదుర్కొన్నారు. 24.3 శాతం మంది పిల్లలు పుట్టకపొతే తమను ‘ గొడ్రాలు’ అని పిలుస్తారని భయపడుతున్నారు.

పాట్నాలో ఉండి, 'సాక్షమా: ఇనిషియేటివ్ ఫర్ వాట్ వర్క్స్, బీహార్'లో పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న అనామిక ప్రియదర్శిని, హఠాత్తుగా వచ్చిన ఈ లాక్‌డౌన్, రాష్ట్రంలో బాల్య వివాహాలను పరిష్కరించే సవాలును మరింత తీవ్రతరం చేసిందని స్పష్టం చేశారు. "2016-17లో UNFPA-రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన బంధన్ టాడ్ యాప్‌లో బాల్య వివాహాల గురించి అనేక నివేదికలు, ఫిర్యాదులు ఉన్నాయి," అని ఆమె చెప్పింది. ఈ యాప్ వరకట్నం, ఇంకా లైంగిక నేరాల వంటి సమస్యల గురించి సమాచారాన్ని అందిస్తుంది. దీనిలో SOS బటన్‌ ఉంది, ఇది వినియోగదారుని సమీప పోలిస్ స్టేషన్ని సంప్రదించడానికి అనుమతిస్తుంది

జనవరి 2021లో, బాల్య వివాహాలపై వివరణాత్మక సర్వేను ప్లాన్ చేస్తున్న సక్షమా, 'ఎర్లీ మ్యారేజ్ ఇన్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బీహార్' పేరుతో ఎగ్జిటింగ్ స్కీమ్‌లను అంచనా వేస్తూ నివేదికను సిద్ధం చేసింది. ఆడపిల్లల విద్యను మెరుగుపరచడం, ఇంకా రాష్ట్రం అందించే ఇతర ప్రయోజనాలు, షరతులతో కూడిన నగదు బదిలీలు- ఇటువంటి చర్యల ద్వారా ఆడపిల్లల పెళ్లిని వాయిదా వేసే పథకాలు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయని అనామిక చెప్పింది. "ఈ కార్యక్రమాలలో కొన్ని ఖచ్చితంగా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు, అమ్మాయిలను బడిలో ఉంచడానికి నగదు పురస్కారం, లేదా సెకండరీ స్కూల్ లో నమోదు చేసుకున్న ఆడపిల్లలకి బైసికల్ స్కీం. ఒకవేళ  లబ్ధిదారులు 18 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా అది పర్వాలేదు,” అన్నదామె.

బాల్య వివాహాల నిరోధక చట్టం, 2006, ఎందుకు సరిగ్గా అమలు చేయబడటం లేదు అనేదానిపై ఆ నివేదిక ఇలా చెబుతోంది, “బీహార్‌లో బాల్య వివాహ చట్టాల చట్టపరమైన అమలు ప్రభావం గురించిన అధ్యయనాలు అందుబాటులో లేవు. అయితే, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ మరియు రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం రాజకీయ ప్రోత్సాహం, వ్యవస్థీకృత స్వార్థ సమూహాలు, నెట్‌వర్క్‌ల ప్రభావం కారణంగా పిసిఎంఎను అమలు చేయడానికి చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు కష్టపడుతున్నాయని తెలుసుకున్నారు.”

మరో మాటలో చెప్పాలంటే, రాజకీయంగా అనుసంధానించబడినా లేదా విశేషాధికారాలు ఉన్నా, విస్తృతంగా లభించే సామాజిక ఆమోదంతో, బాల్య వివాహాన్ని నిరోధించడం అంత సులభమేమి కాదు. అలాగే, ఈ పధ్ధతి సాంస్కృతిక లేదా మత విశ్వాసాలతో ముడిపడి ఉంది, ఇది రాష్ట్ర జోక్యాన్ని సున్నితమైన విషయంగా చేస్తుంది.

Many young women who are pregnant learn about childbirth from display cards such as these. But 19-year-old Manisha Kumari of Agatola village says she doesn’t have much information about contraception, and is relying mostly on fate to defer another pregnancy
PHOTO • Kavitha Iyer
Many young women who are pregnant learn about childbirth from display cards such as these. But 19-year-old Manisha Kumari of Agatola village says she doesn’t have much information about contraception, and is relying mostly on fate to defer another pregnancy
PHOTO • Kavitha Iyer

గర్భంతో ఉన్న చాలా మంది యువతులు ఇలాంటి డిస్ప్లే కార్డుల ద్వారా ప్రసవం గురించి తెలుసుకుంటారు. కానీ అగాటోలా గ్రామానికి చెందిన 19 ఏళ్ల మనీషా కుమారి మాట్లాడుతూ గర్భనిరోధకం గురించి తన వద్ద పెద్దగా సమాచారం లేదని, మరో గర్భాన్ని వాయిదా వేయడానికి విధిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నానని చెప్పింది

అరారియాకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో, పూర్నియా జిల్లాలోని పూర్నియా ఈస్ట్ బ్లాక్‌లో, అగాటోలా గ్రామానికి చెందిన మనీషా కుమారి తన తల్లి వరండాలోని నీడలో తన ఏడాది వయసున్న కొడుకుకు పాలు ఇస్తోంది.  ఆమె వయస్సు 19 ఏళ్ళు అని చెప్పింది. ఆమెకు గర్భనిరోధకం గురించి పెద్దగా సమాచారం లేదు, మరొక గర్భాన్ని వాయిదా వేయడానికి విధిపై ఎక్కువగా ఆధారపడుతోంది. 17ఏళ్ళ ఆమె చెల్లెలు మణిక, వివాహం చేసుకొమ్మనే కుటుంబ ఒత్తిడితో విలవిలలాడుతోంది. వారి తల్లి గృహిణి, తండ్రి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు.

"మా సార్ పెళ్లి చేసుకోవాలంటే, కనీస వయస్సు 18 సంవత్సరాలు అని చెప్పారు" అని మణిక చెప్పింది. మార్చి 2020లో విధించిన లాక్‌డౌన్ వలన ఆమె తన ఇంటికి తిరిగి వచ్చింది.  10వ తరగతి చదువుతున్న మాణిక, పూర్నియా సిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లోని తన టీచర్‌ మాటలని ప్రస్తావిస్తోంది. ఆమెను మళ్ళీ వెనక్కి పంపాలో వద్దో ఆ కుటుంబం ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ సంవత్సరం ఆ కుటుంబం భరించలేని కష్టాలను ఎదుర్కొన్నారు. ఆమె ఇంటికి రావడంతో, మణిక తన వివాహం ఖరారు అయ్యే అవకాశం ఉంది. "అందరూ పెళ్లి చేసుకో అంటున్నారు," అని ఆమె చెప్పింది.

పొరుగునే, దాదాపు 20-25 కుటుంబాల కుగ్రామమైన రామ్‌ఘాట్‌లో, 38 లేదా 39 సంవత్సరాల వయస్సులో ఉన్న బీబీ టాంజిలా ఎనిమిదేళ్ల అబ్బాయికి, రెండేళ్ల అమ్మాయికి అమ్మమ్మ అయింది. "ఒక అమ్మాయి 19 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకోకపోతే, ఆమెను బుధియా [వృద్ధురాలు]గా పరిగణిస్తారు, ఎవరూ ఆమెను వివాహం చేసుకోరు" అని టాంజిలా చెప్పింది. "మేము షేర్షాబాదీ ముస్లింలు, మేము మా మతపరమైన గ్రంథాలను చాలా కఠినంగా అనుసరిస్తాము," ఆమె చెప్పింది, వీరిలో గర్భనిరోధకం వాడడం నిషేధం, యుక్తవయస్సు వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మాయిలకు వివాహం చేస్తారు. టాంజిలాకు సుమారు 14 సంవత్సరాల వయస్సులో వధువు అయింది , మరో సంవత్సరానికి తల్లి కూడా అయింది. నాల్గవ బిడ్డ తర్వాత, ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎదురై స్టెరిలైజేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. "మాలో ఎవరికీ ఆపరేషన్ చేయించుకోవడం, చేయించుకోకపోవడం గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వీలు లేదు," అని ఆమె బీహార్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జనన నియంత్రణ పద్ధతి (NFHS-5), గర్భాశయ తొలగింపు, ట్యూబల్ లిగేషన్ల గురించి చెప్పింది. "మాకు 4-5 మంది పిల్లలు ఉన్నారని, ఇకపై వారిని చూసుకోలేమని ఎవరూ అనరు."

రామ్‌ఘాట్‌లోని షేర్షాబాడీ ముస్లింలకు స్వంతంగా వ్యవసాయ భూమి లేదు, మగవారు సమీపంలోని పూర్నియా నగరంలో కూలీలుగా రోజువారీ వేతనాలపై ఆధారపడతారు, మరికొందరు పాట్నా లేదా ఢిల్లీకి వలస వెళ్లిపోతారు, మరికొందరు వడ్రంగులు లేదా ప్లంబర్లుగా పని చేస్తున్నారు. వారి పేరు, పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలోని  షేర్ షా సూరి పేరు మీదుగా షేర్షాబాద్ అనే పట్టణం నుండి వచ్చింది,. వారు తమలో తాము బెంగాలీ మాట్లాడతారు, చాలా దగ్గరి సమూహాలుగా జీవిస్తారు. వీరిని ఎగతాళిగా బంగ్లాదేశీలు అని పిలుస్తారు.

Women of the Shershahbadi community in Ramghat village of Purnia
PHOTO • Kavitha Iyer

పూర్నియాలోని రామ్‌ఘాట్ గ్రామంలో షేర్షాబాదీ వర్గానికి చెందిన మహిళలు

గ్రామ ఆశ ఫెసిలిటేటర్ సునీతా దేవి, వీరిలో కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధకం పై ప్రభుత్వం నడుపుతున్న కార్యక్రమాలకు పెద్దగా స్పందించడం లేదని చెబుతుంది. ఇక్కడ విద్యా స్థాయిలు తక్కువగా ఉన్నాయి. బాల్య వివాహాలు సాధారణమైపోయేసరికి, గర్భనిరోధకం స్పష్టంగా నిషేధించబడుతుంది. లాక్డౌన్ సమయంలో మే 2020లో తన రెండవ అబ్బాయికి జన్మనిచ్చి ఇద్దరు పిల్లల తల్లి అయిన 19 ఏళ్ల సదియా (పేరు మార్చబడింది)ని ఆమె పరిచయం చేసింది. ఆమె ఇద్దరు పిల్లలు దాదాపు 13 నెలల తేడాతో జన్మించారు. సదియా భర్త సోదరి తన భర్త అనుమతితో ఇంజెక్షన్ ద్వారా గర్భనిరోధకం తీసుకోవడం ప్రారంభించింది - అతను ఆ గ్రామంలోనే జుట్టు కత్తిరించే పని చేస్తున్నాడు - ఈ నిర్ణయాలకు ASHA నివేదనల కన్నా వారి స్వంత ఆర్థిక కష్టాలే కారణం.

కాలం నెమ్మదిగా మారుతోందని టాంజిలా చెప్పింది. “వాస్తవానికి ప్రసవం చాలా బాధాకరమైనది, కానీ ఈ రోజుల్లో ఉన్న బాధ ఆ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో పోషకాహార స్థాయిలు తక్కువగా ఉండవచ్చు,” అని ఆమె చెప్పింది. రామ్‌ఘాట్‌లోని కొంతమంది మహిళలు గర్భనిరోధక మాత్రలు, లేదా ఇంజెక్షన్లు లేదా గర్భాశయంలోని పరికరాన్ని ఉపయోగించడం ప్రారంభించారని ఆమెకు తెలుసు. "గర్భధారణను ఆపడం తప్పు, కానీ ఈ రోజుల్లో ప్రజలకు మరో దారి లేదు, అనిపిస్తుంది."

తిరిగి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరారియాలోని బంగాలీ తోలాలో, అస్మా తాను పాఠశాలను విడిచిపెట్టనని ప్రకటించింది. ఆమె పెళ్లి చేసుకుని 75 కి.మీ దూరంలో ఉన్న కిషన్‌గంజ్ బ్లాక్‌కి వెళ్లినప్పుడు లాక్‌డౌన్ కారణంగా పాఠశాల మూసివేయబడింది. ఫిబ్రవరి 2021లో ఆరోగ్య సమస్య తీరాక, ఆమె బిడ్డను ప్రసవించిన తర్వాత, తన తల్లి దగ్గరే ఉండి, తన పాఠశాల అయిన కన్యా మధ్య విద్యాలయానికి నడిచి వెళ్లగలనని చెప్పింది. తన భర్త ఏమి అనుకోడు, అని కూడా చెప్పింది.

ఆరోగ్య సంఘటన గురించి విచారించిన రుక్సానా ఇలా సమాధానమిచ్చింది: “ఒక సాయంత్రం ఆమె అత్తవారింటి నుండి నాకు ఫోన్ వచ్చింది, ఆమెకు కొంత రక్తస్రావం అయింది. నేను బస్సు ఎక్కి కిషన్‌గంజ్‌కి పరుగెత్తాను, మేమంతా భయపడి ఏడ్చేశాము. ఆమె టాయిలెట్‌ని ఉపయోగించుకోవడానికి బయటకు వెళ్ళింది, మరి గాలిలో ఏదో ఒక చుడైల్ వచ్చి ఉండవచ్చు.” కాబోయే తల్లిని రక్షించడానికి ఒక పూజ కోసం ఒక బాబా ను పిలిపించారు. ఇంటికి తిరిగి వచ్చిన అస్మా తన కుటుంబ సభ్యులకు డాక్టర్‌ని కలవాలని ఉందని చెప్పింది. మరుసటి రోజు, వారు అస్మాను కిషన్ గంజ్ లోని ఒక ప్రైవేట్ క్లినిక్‌కి తీసుకెళ్లారు

స్పష్టంగా తెలియక పోయినా అస్మా తనకు అండగా ఉన్నవారిని గుర్తుచేసుకుని నవ్వుతుంది. "నేను, నా లోపల బిడ్డ ఆరోగ్యంతో ఉన్నామని తెలిస్తే చాలు," అని ఆమె చెప్పింది. ఆమెకు గర్భనిరోధకం గురించి తెలియదు, కానీ దాని గురించిన సంభాషణ ఆమెలో ఉత్సుకతను రేకెత్తించింది. ఆమె ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటోంది.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. అట్టడుగున  ఉన్నా ఎంతో కీలకమైన ఈ సమూహాల స్థితిగతులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected]కి ఈమెయిల్ చేసి అందులో [email protected]కి కాపీ చేయండి.

అనువాదం: అపర్ణ తోట

Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Editor and Series Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota