మొట్టమొదటిసారి మన్వరా బేవా బకెట్ ( బీడీ చుట్టడానికి కావాల్సిన ముడిసరుకు పెట్టుకునే తట్ట) ఖాళీగా వుంది. కర్మాగారం మూతపడిపోయింది. మున్షీ (గ్రామాల్లో ఇళ్లకు ముడి సరుకు ఇచ్చి, బీడీలు తీసుకువెళ్లే కాంట్రాక్టర్) 20 రోజులుగా కనపడ్డంలేదు. కుటుంబానికి తిండి పెట్టడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు.   దేశంలో ఎక్కడో ఒక ప్రాంతంలో కొందరు 'నల్లదానికి' వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమే తన ఈ దుస్థితికి కారణం అని తనకు తెలుసని మన్వారా అన్నారు.

45 ఏళ్ల మన్వారా గత 17 ఏళ్లుగా బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషిస్తున్నారు. 1000 బీడీలు చుట్టినందుకు 126 రూపాయలు వస్తాయి. తన భర్త చనిపోయాక ఆమె ఈ పని మొదలుపెట్టారు. వాళ్లకు భూమి లేదు. ఇద్దరు కొడుకులు వున్నారు. ఆమె భర్త చనిపొయ్యేనాటికి చిన్న కొడుక్కి ఆరు నెలలు మాత్రమే. వయసులో వున్నప్పుడు ఆమె రోజుకి 2000 బీడీల వరకూ చుట్టేవారు. ఇప్పుడు 500 బీడీలు మాత్రమే చెయ్యగలుగుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ లెక్కల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఇంటి నుంచి పనిచేసే బీడీ కార్మికులలో మహిళలు 70 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారు. "ఇక్కడ బీడీలు తయారు చేయడం రాకపోతే అమ్మాయిలకు సరైన భర్త దొరకడం కూడా కష్టమే," అని మనిరుల్ హక్ అనే మున్షీ అన్నారు. అతను పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ జిల్లా జంగిపూర్ సబ్ డివిజన్‌లోని ఒక బీడీలు తయారుచేసే కర్మాగారంలో కాంట్రాక్టర్.

PHOTO • Arunava Patra

ఎడమ: కెందు ఆకులు, ఔరంగాబాద్, జంగిపూర్. కాంట్రాక్టర్ కార్మికులకు పొగాకు ఇస్తాడు. వాళ్ళు దాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి కెందు ఆకులో చుట్టి బీడీలుగా తయారుచేస్తారు. కుడి: మామూలుగా అయితే, ఔరంగాబాద్‌లోని ఈ పెరడు, అక్కడికి దగ్గరలోని ఇళ్ళలో నివసించే 50-60 మంది పనివాళ్ళతో నిండి ఉండేది; ఇప్పుడిక్కడ చాలా కొద్దిమందే వున్నారు

పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ గుర్తింపుపొందిన 90 ప్రధాన బ్రాండ్ల బీడీ తయారీ సంస్థల్లో 20 లక్షల మంది (మొత్తంగా కర్మాగారాలలోనూ, ఇంటినుంచీ పనిచేసేవారు) పనిచేస్తుంటారని అంచనా . జంగిపూర్ బీడీ తయారీకి గుండెకాయ లాంటిది. స్థానిక సిఐటియు (సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) కార్యాలయంవారు చెప్పినదాని ప్రకారం, ఈ ఒక్క సబ్ డివిజన్‌లోనే 18 పెద్ద కర్మాగారాలు, 50 చిన్న కర్మాగారాల్లో కలిపి మొత్తం 10 లక్షల మంది పనిచేస్తారు. ఈ మొత్తం కార్మికుల్లో 90 శాతం మంది ఇంటినుంచి పనిచేస్తారు.

నవంబర్ 8న జరిగిన పెద్దనోట్ల రద్దు తర్వాత ఇదంతా ఒక్కసారిగా మారిపోయింది. ప్రధాన బీడీ తయారీ కర్మాగారాలన్నీ తమ దుకాణం మూసేశాయి. వాటిలో పనిచేసే కార్మికులలో సగం మందికి పనిలేదు, డబ్బు లేదు, ఇంట్లో తినడానికి తిండి లేదు. ఎంతో కొంత పని వున్నవాళ్లకి కూడా ఆర్డర్లు తగ్గిపోయాయి, వారం వారం చెల్లించే డబ్బులు ఆగిపోయాయి. ఉదాహరణకి, ఇక్కడి అతిపెద్ద బీడీ బ్రాండ్ అయిన పతాకా బీడీ , రాష్ట్ర కార్మిక శాఖ సహాయ మంత్రి జాకిర్ హుస్సేన్‌కు చెందిన శివ బీడీ కర్మాగారం నోట్ల రద్దుతో  ఒక్క వారంలోనే మూతపడ్డాయి.

PHOTO • Arunava Patra

ఎడమ: బీడీ పొట్లాల మీద అతికించే చీటీలు కట్టలుగా గోదాములలో పడివున్నాయి. కుడి: ముర్షిదాబాద్‌లోని జహంగీర్ బీడీ కర్మాగారంలో బీడీలను వేరుచేసి, తూకం వేసే చోటు. సాధారణంగా కర్మాగారంలో సందడిగా వుండే చోటు ఇదే

ఇంకా పనిచేస్తున్న కొన్ని కర్మాగారాలు కూడా నగదు కొరత కారణంగా మూసేయాలని ఆలోచిస్తున్నాయి. ఇక్కడ అన్ని చెల్లింపులు నగదు రూపంలోనే జరుగుతాయి. "నేను మున్షీల ద్వారా వారానికి 1-1.5 కోటి రూపాయలు కార్మికులకు చెల్లించాలి. బ్యాంకులేమో కరెంట్ అకౌంట్ నుంచి రోజుకి కేవలం 50,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నాయి - ఒకోసారి అదికూడా నమ్మకం లేదు." అని జంగిపూర్, ఔరంగాబాద్‌లోని జహంగీర్ బీడీ కర్మాగారం యజమాని ఈమాని బిశ్వాస్ అన్నారు. "నేను వ్యాపారాన్ని ఎలా నడిపించాలి? ఎలాగో నెట్టుకొస్తున్నా... కానీ, ఇలా నగదు లేకుండా కర్మాగారాన్ని నడపడం అసాధ్యం. నేను కూడా కొద్దీ రోజుల్లోనే దీన్ని మూసెయ్యాల్సి వస్తుంది."

PHOTO • Arunava Patra

'మేమింకా మా కర్మాగారాన్ని మూసెయ్యలేదు. కానీ దాదాపుగా ఇక్కడ పనేమీ జరగటంలేదు. దీన్ని త్వరలోనే మూసేస్తాం', ముర్షిదాబాద్, సూతీలోని జహంగీర్ బీడీ ఫ్యాక్టరీ యజమాని ఈమానీ బిశ్వాస్

ముర్షిదాబాద్ బీడీ కార్మికుల్లో ఇంటినుంచి పనిచేసేవారికి, వారు చుట్టిన ప్రతి 1000 బీడీల కు 126 రూపాయల చొప్పున, వారం వారం కూలి చెల్లిస్తారు. వాళ్ళు చేసిన పని గంటలను బట్టి ఒక్కొక్కరు  వారానికి 600 నుంచి 2000 రూపాయల వరకూ సంపాదిస్తారు. తగినంత ఉత్పత్తి జరగాలంటే, అన్ని కర్మాగారాల మున్షీలు కలిపి ప్రతి వారం 35 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లిస్తారని, ఔరంగాబాద్ బీడీ యజమానుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాజకుమార్ జైన్ అన్నారు.

.కొంతమంది ఈ దుస్థితిని సొమ్ముచేసుకుంటున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో జంగిపూర్, ధులియాన్, షంషేర్‌గంజ్‌లలో కొన్నిచోట్ల పనివాళ్లకు 1000 బీడీలు చుట్టినదానికి కేవలం 90 రూపాయలే ఇవ్వజూపుతున్నారు. ఇది ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కన్నా తక్కువ.

కేవలం బీడీల ఉత్పత్తి తగ్గిపోవడమే కాదు, అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. ఔరంగాబాద్ బీడీ యజమానుల అసోసియేషన్ అంచనా ప్రకారం, ముర్షిదాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన బీడీలు 50 శాతం తగ్గిపోయాయి. కర్మాగారాల గిడ్డంగులలో బీడీ లు నింపిన గోతాలు పేరుకుపోయాయి.

PHOTO • Arunava Patra

దేశంలోని ఇతర ప్రాంతాలకు అమ్మకాలు లేకపోవడం వల్ల, కర్మాగారపు గోదాములలో పేరుకుపోయిన బీడీ పెట్టెలు

అసంఘటిత రంగంలోనే అత్యంత బలహీనులైన ఈ కార్మికుల మీద నోట్ల రద్దు వినాశకర ప్రభావాన్ని చూపింది. "మా జీవితాలు కేవలం బీడీల మీదే ఆధారపడి వున్నాయి. జిల్లాలో ఈ ప్రాంతంలో నివసించే ఎక్కువభాగం కుటుంబాలకు ఇదే ఏకైక ఆదాయ వనరు. ఇక్కడి జనాలకు భూముల్లేవు. వ్యవసాయమంటే తెలియదు. ఇతర పరిశ్రమలు కూడా ఏమీ లేవు." అని జహంగీర్‌పూర్ బీడీ కర్మాగారంలో 30 ఏళ్లు పనిచేసిన మున్షీ , 68 ఏళ్ల ముహమ్మద్ సైఫుద్దీన్ అన్నారు. "మొదటి వారం, కార్మికులకు పాత 500, 1000 నోట్లు చెల్లించి ఉత్పత్తిని కొనసాగించగలిగాం. కానీ ఇప్పుడలా కుదరటంలేదు. మాకు కర్మాగారాల నుంచి ఆర్డర్‌లు కూడా రావటంలేదు. కాబట్టి పని లేదు; పనివాళ్లకు మూడు వారాలుగా జీతం కూడా లేదు. వాళ్ళు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు."

తాను పనిచేయడం మొదలుపెట్టినప్పటినుంచి మూడు దశాబ్దాలుగా ఎన్నడూ ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోలేదని సైఫుద్దీన్ అన్నారు. "మా కర్మాగారం ఇంకా మూతపడలేదు కానీ ఉత్పత్తి మాత్రం గణనీయంగా పడిపోయింది. వున్న కొద్ది ఆర్డర్లతో, ముడి సరుకుతో నేను గ్రామాలకు వెళ్ళినపుడు జనాలు నా వెంటపడుతున్నారు. దాదాపు ముట్టడించినంత పనవుతోంది. కుటుంబాన్ని పోషించడానికి ప్రతి ఒక్కరికీ పని కావాలి. కానీ, నేను సహాయం చేయలేని పరిస్థితిలో వున్నాను."

వీడియో చూడండి: పెద్దనోట్ల రద్దు ప్రభావం గురించి మాట్లాడుతున్న బీడీ కార్మికులూ, కాంట్రాక్టర్లూ

వారాల తరబడి పనీ, జీతాలూ లేకపోవడంతో ముర్షిదాబాద్‌లోని అధిక భాగం బీడీ కార్మికులు పతనం అంచుకు చేరారు. వాళ్లు పొదుపు చేసుకున్న డబ్బులు అయిపోతుండటంతో, తాహెరా బీబీ లాంటివాళ్ళు రోజుకు ఒక్క పూట భోజనంతో నెట్టుకొస్తున్నారు. ఆవిడ తన తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి, గత 50 ఏళ్లుగా బీడీలు చుడుతున్నారు. 58 ఏళ్ల ఆవిడ, చెన్నైలో వలస కార్మికునిగా పనిచేసి, కొన్నేళ్ళ క్రితం కాలికి దెబ్బతో ఇంటికి తిరిగొచ్చేసిన కొడుకును చూసుకుంటూవుంటారు. ఆమె కూతురికి ఇంకా పెళ్లి కాలేదు. బీడీలు చుట్టడమే ఆ కుటుంబానికి జీవనాధారం. తాహెరా రోజుకి 1000 నుంచి 1200 బీడీలు చుడతారు. అదేపనిగా పొగాకుతో పనిచేయడం వల్ల ఆమెకు క్షయ వ్యాధి సోకింది. "నేను జబ్బు మనిషినే. కానీ, బీడీలు లేకుంటే మాకు తిండి ఉండదు," అంటారామె. "నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను."

ఫోటోలు: అరుణవ పాత్రొ

అనువాదం: వి. రాహుల్జీ

Arunava Patra

Arunava Patra is a photographer based in Kolkata. He has worked as a content producer for various television channels, and is an occasional columnist for the Anandabazar Patrika. He has a degree in electrical engineering from Jadavpur University.

Other stories by Arunava Patra
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

Other stories by Rahulji Vittapu