బుధూరామ్ చిందా భయంతో వణికిపోతున్నారు. ఆయనకు కేవలం కొన్ని గజాల దూరంలో మెరుస్తోన్న వెన్నెల వెలుగులో నల్లని పెద్ద పెద్ద ఆకారాలు నిల్చొనివున్నాయి. కఠఫార్ గ్రామానికి చెందిన అరవయ్యేళ్ళ వయసున్న ఈ భుంజియా ఆదివాసీ రైతు సగం తెరచి ఉన్న తన ఇంటి తలుపు ఖాళీ గుండా తొంగిచూస్తున్నారు.

ఒడిశాలోని సునాబేడా వన్యప్రాణుల అభయారణ్యంలోని అంతర్భాగంలోనూ, తటస్థ ప్రాంతాల్లోనూ ఉన్న 52 మానవ నివాసాలలో ఒకదానిలో నివసించే ఈ రైతుకు ఈ పెద్ద క్షీరదాలను చూడటం అసాధారణమేమీ కాదు.

అయినాగానీ, "అవి నన్నూ, నా కచ్చా ఇంటినీ నిముషాలలో తొక్కిపారెయ్యగలవు అనేది తల్చుకొని నేను వణిపోయాను," అన్నారాయన. కాసేపయ్యాక ఆయన ఇంటివెనుక పెరటిలోకి వెళ్ళి, తులసి మొక్క ముందర నిల్చున్నారు. "నేను లక్ష్మీదేవినీ, ఆ పెద్ద క్షీరదాలను కూడా ప్రార్థించాను. ఆ ఏనుగుల గుంపు నన్ను చూసే ఉంటుంది."

బుధూరామ్ భార్య, 55 ఏళ్ళ సులక్ష్మి చిందా కూడా ఏనుగుల ఘీంకారాలను విన్నారు. ఆమె అక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామంలోని తమ ఇంటిలో తన కుమారులతోనూ, వారి కుటుంబాలతోనూ కలిసివున్నారు.

సుమారు ఒక గంట సమయం గడిచాక, ఆ దళసరి చర్మపు జంతువులు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాయి

డిసెంబర్ 2020లో జరిగిన ఈ సంఘటనను తలచుకొన్న ఈ రైతు తన ప్రార్థనలు సాయంచేశాయని భావించారు.

డిసెంబర్ 2022లో ఈ ఏనుగులు తమ దారిని మార్చుకున్నప్పుడు బుధూరామ్ మాత్రమే కాకుండా, నువాపారా జిల్లాలోని 30 ఆదివాసీ గ్రామాలలో నివాసముండే ప్రజలంతా తేలికగా ఊపిరితీసుకున్నారు.

PHOTO • Ajit Panda
PHOTO • Ajit Panda

ఒడిశాలోని సునాబేడా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఉన్న కఠఫార్ గ్రామంలో బుధూరామ్, సులక్ష్మి తమ కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఇల్లు

సులక్ష్మి, బుధూరామ్‌లకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. ఈ కుటుంబం మొత్తం 10 ఎకరాల భూమిని సాగుచేస్తూ వ్యవసాయంలోనే ఉన్నారు. వారి పెద్దకొడుకులిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొని తమ భార్యాపిల్లలతో కఠఫార్ గ్రామంలోనే నివాసముంటున్నారు; పదేళ్ళ క్రితం బుధూరామ్, సులక్ష్మి తమ పొలానికి దగ్గరలో ఉన్న ఇంటికి మారిపోయారు.

ఆహారం కోసం వెదుకుతూ ఏనుగులు తిరుగుతున్నది అక్కడే.

మరుసటి రోజు ఉదయం బుధూరామ్ తన వరి పొలానికి జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు వెళ్ళగా, అర ఎకరం పొలంలోని పైరు ధ్వంసమైనట్లుగా గుర్తించారు. ఇది ఖముండా (కాలానుగుణంగా ప్రవహించే నీటివనరుకు గట్లు కట్టి సాగుభూమిగా మార్చిన నేల). ప్రతి సంవత్సరం దాదాపు 20 బస్తాల (దాదాపు ఒక టన్ను) వరి దిగుబడినిచ్చే అతని ప్రధాన భూభాగాలలో ఈ చెక్క కూడా ఒకటి. "నేను ఐదు నెలల విలువైన వరిని పోగొట్టుకున్నాను," అన్నారతను. "నేను ఎవరికని ఫిర్యాదు చేయటం?"

అక్కడే ఒక మెలికె ఉంది: బుధూరామ్ తన సొంత భూమి అనుకుంటూ, సులక్ష్మితో కలిసి సాగుచేస్తున్న భూమి నిజానికి అతని పేరు మీద లేదు. అతనితో సహా, 600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అభయారణ్యంలోని తటస్థ, అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలలో భూమిని సాగుచేస్తున్న అనేకమంది రైతులకు వారి పేరు మీద భూమి రికార్డులు లేవు; వారు కౌలు కూడా చెల్లించడం లేదు. "నేను సాగుచేస్తున్న భూమిలో ఎక్కువ భాగం వన్యప్రాణి విభాగానికి చెందినది. నాకు అటవీ హక్కుల చట్టం [ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మరియు ఇతర సంప్రదాయ అటవీ నివాసుల ( అటవీ గుర్తింపు ) హక్కుల చట్టం ] పట్టా (అధికారిక భూమి దస్తావేజు) కేటాయించలేదు,” అని ఆయన ఎత్తి చూపారు.

బుధూరామ్, సులక్ష్మిలు భుంజియా సముదాయానికి చెందినవారు. ఇదే సముదాయానికి చెందిన మరో 30 కుటుంబాలు కూడా అతని గ్రామమైన కఠఫార్‌లో ఉన్నాయి (2011 జనాభా లెక్కలు). ఇక్కడ గోండు, పహారియా ఆదివాసీ సముదాయాలు కూడా నివసిస్తున్నాయి. వీరి గ్రామం ఒడిశాలోని నువాపారా జిల్లాలోని బోడెన్ బ్లాక్‌లో ఉంది. ఇది పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి దగ్గరగా, సునాబెడా పీఠభూమికి దక్షిణపు అంచున ఉంది.

ఏనుగులు అడవిని దాటేటప్పుడు వెళ్లే దారి ఇదే.

PHOTO • Ajit Panda
PHOTO • Ajit Panda

ఎడమ: తమ పొలాల పక్కనే ఉన్న ఇంటిలో బుధూరాం, అతని భార్య సులక్ష్మి (కుడి)

పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖవారి 2008-2009 వార్షిక నివేదికలో, నాలుగు కొత్త టైగర్ రిజర్వ్‌లలో ఒకదానిగా సునాబేడాను గుర్తించారు. ఇందులో పులులతో పాటు, చిరుతపులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, అడవి పందులు, అడవి దున్నలు, అడవి కుక్కలు కూడా ఉన్నాయి.

వన్యప్రాణి విభాగం అధికారులు కఠఫార్‌తో సహా సునాబెడా, పటదరహా పీఠభూమి ప్రాంతాలలోని వివిధ గ్రామాలను సందర్శించి అనేక అనధికారిక సమావేశాలు నిర్వహించి, లోతట్టు ప్రాంతంలో నివసించే గ్రామస్థులను పునరావాసానికి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2022లో, డేకున్‌పానీ, గతిబేడా అనే రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి అంగీకరించారు.

అలా ఖాళీ చేయడానికి సిద్ధంగా లేనివారు ఈ అల్లరి ఏనుగులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

ఒడిశాలో 1976 ఏనుగులు ఉన్నాయని 2016-17 వన్యప్రాణుల గణన తెలుపుతోంది. ఆ రాష్ట్రంలో దాదాపు 34 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణం వాటికి రసవత్తరమైన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. సునాబేడా అభయారణ్యంలోని వెదురు గమనించదగినదని మాయాధర్ సరాఫ్ పేర్కొన్నారు. "అవి వెదురు పుష్కలంగా ఉన్న సునాబేడా-పటదరహా పీఠభూమి గుండా వెళతాయి," అంటోన్న మాజీ వన్యజీవుల సంరక్షకుడైన మాయాధర్, "అవి పశ్చిమాన ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోకి వెళ్ళిపోయే ముందు నువాపారాలోకి ప్రవేశించి, ఆ జిల్లా లోపల దాదాపు 150 కి.మీ.ల మేర తిరుగుతాయి" అని జోడించారు.

ఒక్కసారి పొట్ట నిండిన తర్వాత, ఏనుగుల గుంపు దాదాపు ఒక నెల తర్వాత ఎక్కువతక్కువగా అదే మార్గంలో ప్రయాణించి బలాంగీర్‌కు తిరిగి వెళ్తాయి.

ఈ ఏడాదికి రెండుసార్లు అవి చేసే ప్రయాణాలు వాటిని నేరుగా బుధూరామ్ వంటి భుంజియా, గోండు, పహారియా ఆదివాసీ రైతులు సునాబేడా అభయారణ్యం లోపల, ప్రక్కనే ఉన్న చిన్న చిన్న భూములలో వర్షాధార సాగును చేసే దారులగుండా తీసుకుపోతాయి. ఒడిశాలోని ఆదివాసులలో భూమి యాజమాన్యం గురించి వచ్చిన ఒక నివేదికలో, "ఒడిశాలో సర్వే చేసిన ఆదివాసీ కుటుంబాలలో 14.5 శాతం మంది భూమి లేనివారిగా, 69.7 శాతం మంది అతి కొద్ది భూమి ఉన్న రైతులుగా నమోదయింది," అని స్టేటస్ ఆఫ్ ఆదివాసీ లైవ్‌లీహుడ్స్ రిపోర్ట్ 2021 పేర్కొంది.

PHOTO • Ajit Panda
PHOTO • Ajit Panda

బుధూరామ్, సులక్ష్మిలు తమ ఇంటి ముందుభాగంలో (ఎడమ) కూరగాయలనూ, పెరటివైపున (కుడి) అరటినీ పండిస్తారు

కోమ్నా శ్రేణి సహాయక అటవీశాఖాధికారి శిబప్రసాద్ ఖమారీ మాట్లాడుతూ, ఈ దళసరి చర్మం కలిగిన జంతువులు సంవత్సరానికి రెండుసార్లు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తాయని - మొదటి ఋతుపవనాల (జూలై) కాలంలో ఒకసారి, డిసెంబర్‌లో మరోసారి - చెప్పారు. ఈ అభయారణ్యంలో గస్తీ తిరుగుతుండే ఈయన వాటి ఉనికి గురించి ప్రత్యక్షంగా తెలుసుకుంటుంటారు. తాము వెళ్తోన్న దారిలో ఈ జంతువులు వివిధ రకాల గడ్డితో పాటు వ్యవసాయ పంటలను, ప్రధానంగా ఖరీఫ్ వరికోసం, వెతుక్కుంటాయని ఆయన చెప్పారు. డిసెంబర్ 2020 నాటి సంఘటనలను గురించి ప్రస్తావిస్తూ, "ప్రతి సంవత్సరం ఏనుగులు వివిధ గ్రామాలలో పంటలను, ఇళ్ళను నాశనం చేస్తుంటాయి." అన్నారాయన.

కాబట్టి చేలో ఎదిగి ఉన్న పంటలను ఏనుగుల మందలకు కోల్పోయిన బుధూరామ్ అనుభవం అసాధారణమైనదేమీ కాదు.

ఏదైనా అడవి జంతువుల వల్ల రైతులు పంటలు నష్టపోయినప్పుడు వారికి వాణిజ్య పంటలైతే ఎకరాకు రూ. 12,000; వరి, తృణధాన్యాల వంటి పంటలకు రూ. 10,000 ఇస్తారని పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్), ఒడిశా ప్రధాన వన్యప్రాణి సంరక్షణ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. ఈ వెబ్‌సైట్ వన్యప్రాణి (రక్షణ) (ఒడిశా) నియమాలు 1974ను ఉటంకించింది.

కానీ భూ యాజమాన్యం గురించి ఎటువంటి రికార్డు లేకపోవడంతో, బుధూరామ్ ఈ నష్టపరిహారాన్ని హక్కుగా కోరడానికి లేదు.

"నేను నా పూర్వీకుల నుండి (భూమిని) వారసత్వంగా పొందాను. కానీ అటవీ సంరక్షణ చట్టం 1980 , ప్రకారం ప్రతిదీ సర్కార్ (ప్రభుత్వం)కు చెందినదే," అని బుధూరామ్ ఎత్తి చూపారు. "వన్యప్రాణి విభాగం మా కదలికలపై ఆంక్షలు విధిస్తోంది. అలాగే మా భూమినీ, వ్యవసాయాన్నీ అభివృద్ధి చేసుకోవాలనే మా ప్రయత్నాలపై కూడా ఆంక్షలు విధించింది," అన్నారాయన.

అతనిక్కడ అడవిలో నివసించే ప్రజలకు స్థిరమైన ఆదాయ వనరైన కెందూ ఆకుల సేకరణను గురించి సూచిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం (ఎఫ్ఆర్ఎ) 2006 ప్రకారం, "యాజమాన్య హక్కు, అటవీ సంపదను సేకరించుకునే సౌలభ్యం, చిన్నపాటి అటవీ ఉత్పత్తులను ఉపయోగించుకోవడం, అమ్ముకోవడం వంటివాటికి" అనుమతి ఉంది. అయితే, ఈ హక్కును నిరాకరిస్తున్నారని ఈ అటవీ నివాసి చెప్పారు.

మహువా (ఇప్ప లేదా విప్ప) పువ్వులు, పండ్లు, చార్ , హరిదా , ఆన్లా (ఉసిరి) వంటి అటవీ ఉత్పత్తులకు వారి గ్రామానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడెన్‌లోని మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో బుధూరామ్ ఎప్పుడంటే అప్పుడు ఆ మార్కెట్‌కి వెళ్లలేరు. వ్యాపారులు అటవీ ఉత్పత్తుల కోసం గ్రామస్థులకు ముందస్తుగానే డబ్బులు చెల్లిస్తారు. అయితే బుధూరామ్ స్వయంగా బజారుకు వెళ్ళి అమ్ముకుంటే వచ్చే ధరం కంటే ఇది తక్కువ. "కానీ మరో దారి లేదు," అని ఆయన చెప్పారు.

*****

PHOTO • Ajit Panda
PHOTO • Ajit Panda

ఎడమ : కోళ్ళు పొడుచుకు తినకుండా కాపాడేందుకు దోమతెరతో కప్పివున్న మిరప మొక్కలు . కుడి : బుధూరామ్‌కు , అతని కుటుంబానికి 50 పశువులు , కొన్ని మేకలు ఉన్నాయి

పొలానికి దగ్గరగా ఉన్న వారి ఇంటి ముందు ఉన్న ఆట్ (ఎత్తు ప్రదేశం)లో, బుధూరామ్, సులక్ష్మిలు మొక్కజొన్న, వంకాయ, మిరప, తక్కువ కాలంలో పండించే వరి వంటివే కాక, కులోఠ్ (ఉలవలు), అరహర్ (కందులు) వంటి కాయ ధాన్యాలను కూడా పండిస్తారు. మధ్యస్థాయి, లోతట్టు ప్రాంతాలలో (స్థానికంగా బహల్ అని పిలుస్తారు) వారు మధ్యస్థ, దీర్ఘకాలిక రకాలైన వరిని పండిస్తారు.

ఖరీఫ్ పంట కాలంలో, సులక్ష్మి పటదరహా అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న తమ పొలాల్లో కలుపు తీయడం, మొక్కల సంరక్షణ, పచ్చి ఆకులను, దుంపలను సేకరించడం వంటి పనులు చేస్తారు. “మూడేళ్ళ క్రితం నా పెద్ద కొడుకు పెళ్లి అయినప్పటి నుండి నేను వంట పని చేయటం మానేశాను. ఇప్పుడు నా కోడలు ఆ బాధ్యత తీసుకుంది,” అని ఆమె చెప్పారు.

ఈ కుటుంబానికి మూడు జతల ఎద్దులతో పాటు ఒక జత బర్రెలతో సహా దాదాపు 50 పశువులున్నాయి. ఎద్దులు భూమిని దున్నటంలో సహాయం చేస్తాయి- పొలం పనులు చేయటం కోసం వీరివద్ద ఎటువంటి యంత్ర సామగ్రి లేదు.

బుధూరామ్ ఆవులకు పాలు తీశాక మేకలను, గొర్రెలను మేపుకు రావడానికి వెళ్తారు. ఇంటిలో తినడం కోసం వాళ్ళు కొన్ని మేకలను కూడా పెంచుకుంటున్నారు. గత రెండేళ్లలో అడవి జంతువుల వలన ఆ కుటుంబం తొమ్మిది మేకలను పోగొట్టుకున్నప్పటికీ, మేకల పెంపకాన్ని మాత్రం వాళ్ళు వదులుకోవాలనుకోవడం లేదు.

గత ఖరీఫ్ పంట కాలంలో బుధూరామ్ ఐదెకరాల భూమిలో వరి సాగు చేశారు. మిగిలిన భూమిలో అతను రెండు రకాల బీన్స్, మూంగ్ (పెసలు), బీరి (మినుములు), కులోఠ్ (ఉలవలు), వేరుశెనగ, మిరప, మొక్కజొన్న, అరటి వంటి ఇతర పంటలను పండించే ప్రయత్నం చేశారు. "గత సంవత్సరం నాకు మూంగ్ పంట ఒక్క గింజైనా రాలేదు. తీవ్రమైన చలి కారణంగా ఆ పంట పండలేదు కానీ ఇతర కాయధాన్యాలు బాగా పండి ఆ లోటును తీర్చాయి," అని అతను చెప్పారు.

"మాకు సుమారు రెండు టన్నుల వరి, ఇంటి వాడకానికి సరిపోయేటన్ని పప్పులు, తృణధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు పండుతాయి," అని సులక్ష్మి చెప్పారు. తాము ఎలాంటి రసాయనిక ఎరువులు లేదా పురుగుమందులు వాడడం లేదని; పశువుల పేడ, మూత్రం, పంటలో మిగిలిన చెత్తవంటివి సరిపోతాయని ఈ దంపతులు చెప్పారు. "మనకు సమస్యలు ఉన్నాయనో, లేదా తిండి కొరత ఉందనో చెబితే అది భూమిని నిందించినట్లు అవుతుంది," అని బుధూరామ్ అన్నారు. "మీరు దానిలో భాగం కాకపోతే నేల తల్లి మీకు ఆహారాన్నెలా అందిస్తుంది?" అంటారు సులక్ష్మి.

నాట్లు వేయటం, కలుపు తీయడం, పంట కోయడం వంటి పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నప్పుడు, మొత్తం కుటుంబ సభ్యులంతా ఇతరుల భూముల్లో కూడా పని చేస్తారు; ఏ పని చేసినా ఎక్కువగా ధాన్యం రూపంలోనే చెల్లింపులు జరుగుతాయి.

PHOTO • Ajit Panda

2020లో ఏనుగులు ధ్వంసం చేసిన వరి పొలాలు. ఆ తర్వాతి సంవత్సరమైన 2021లో, ఎలాంటి సాగు చేయకుండానే వరి మొలకెత్తింది. 'ఏనుగులు పంటను నాశనం చేస్తున్నప్పుడు గింజలన్నీ నేల రాలిపోవడం చూశాను. అవి తిరిగి మొలకెత్తుతాయని నాకు కచ్చితంగా తెలుసు,' బుధూరామ్ చెప్పారు

ఏనుగులు పొలంలో ఉన్న పంటను నాశనం చేసిన సంవత్సరం తర్వాతి సంవత్సరమైన 2021లో తాను భూమిని సాగుచేయలేదని బుధూరామ్ చెప్పారు. అతని నిర్ణయం సంతోషకరమైన ముగింపునే ఇచ్చింది: "ఏనుగులు తొక్కడం వల్ల విత్తనాలు నేలమీద పడిపోవడాన్ని నేను చూశాను. అవి మొలకెత్తుతాయని నాకు ఖచ్చితంగా తెలుసు,” అని అతను చెప్పారు. “ఋతుపవనాల మొదటి వాన పడినప్పుడు విత్తనాలు మొలకెత్తాయి, నేను వాటిని జాగ్రత్తగా చూసుకున్నాను. నాకు ఎలాంటి (డబ్బు) పెట్టుబడి లేకుండా 20 బస్తాల (ఒక టన్ను) ధాన్యం వచ్చింది.

“మా జీవితాలు ప్రకృతి నుండి ఎలా విడదీయరానివిగా పెనవేసుకుని ఉన్నాయో ఈ సర్కార్‌ కి అర్థంకావడం లేదు. ఈ నేల, ఈ నీరు, ఈ చెట్లు, జంతువులు, పక్షులు, కీటకాలు - అవన్నీ తమ మనుగడ సాగించుకోవడంలో ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి." అంటారు ఈ ఆదివాసీ రైతు.

*****

ఈ ప్రాంతంలో ఉన్న మరో సమస్య ఏనుగుల సంచారం. విద్యుత్ తీగలను ఏనుగులు తరచుగా కిందకు వంచేస్తుండటంతో జిల్లాలోని కొమ్నా, బోడెన్ బ్లాక్‌లలోని గ్రామాల్లో, మళ్ళీ వాటిని సరిచేసే వరకు, విద్యుత్‌ సరఫరా ఉండటం లేదు.

2021లో 30 ఏనుగుల గుంపు ఒడిశాలోని గంధమర్దన్ అటవీ ప్రాంతం నుంచి సీతానది అభయారణ్యం మీదుగా పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లింది. అటవీ శాఖ గుర్తించిన దాని ప్రకారం, వాటి మార్గం ఈశాన్య దిశలో బలాంగీర్ జిల్లా మీదుగా నువాపారా జిల్లాలోని ఖోలీ గ్రామం వైపు ఉంది. ఆ ఏనుగులలో రెండు డిసెంబర్ 2022లో అదే మార్గంలో తిరిగి వచ్చాయి.

తమ వార్షిక ప్రయాణంలో భాగంగా సునాబేడా పంచాయతీకి చెందిన 30 గ్రామాలలోకి ప్రవేశించాలనే ఊగిసలాటేమీ లేకుండా, నేరుగా సునాబేడా వన్యప్రాణుల అభయారణ్యంలోకి ప్రవేశించి అదే దారిలో వెళ్లిపోయాయి.

అందరూ తేలికగా ఊపిరిపీల్చుకున్నారు

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Ajit Panda

Ajit Panda is based in Khariar town, Odisha. He is the Nuapada district correspondent of the Bhubaneswar edition of 'The Pioneer’. He writes for various publications on sustainable agriculture, land and forest rights of Adivasis, folk songs and festivals.

Other stories by Ajit Panda
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli