" పట్టా (టైటిల్) వున్న భూయజమానుల కంటే మాకెందుకు వేరుగా పరిహారం ఇస్తున్నారు?" అని 55 ఏళ్ల దళిత రైతు తురక బాబూరావు అడుగుతున్నారు. గుంటూరు జిల్లాలో 4800 మంది నివసించే రాయపూడి గ్రామంలో ఆయనకు ఎకరానికి కొంచెం తక్కువగా భూమి వుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త 'ప్రపంచ స్థాయి' రాజధాని నగరం అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇచ్చే పరిహారం గురించి ఆయన మాట్లాడుతున్నారు. "వాస్తవానికి పట్టా భూముల కంటే మా భూములే ఎక్కువ సారవంతమయినవి. ఎందుకంటే అవి కృష్ణానదిని ఆనుకుని ఉంటాయి." అని ఆయన అన్నారు.

రాయపూడిలో దాదాపు 800 మంది రైతులతో ఏర్పడిన అసైన్డ్ భూమి సాగుదారుల సంక్షేమ సమితి (అసైన్డ్ ల్యాండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్)లో బాబూరావు సభ్యుడు. ఈ సంఘం సభ్యులలో ఎక్కువ మంది షెడ్యూలు కులాలు లేదా ఇతర వెనకబడిన కులాలకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ భూసంస్కరణల (సీలింగ్స్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్స్) చట్టం 1973 ప్రకారం రాష్ట్రంలో భూములను పంచినప్పుడు రాయపూడిలో కృష్ణా నది ఒడ్డున, లేదా ఆ నదికి చెందిన లంకల్లో 2000 ఎకరాల (ఇది రైతుల సొంత అంచనా) భూమిని ఈ సాగుదారులకు ప్రభుత్వం 'అసైన్' చేసింది. ఈ భూములు పొందినవారిలో ఎక్కువ మంది దళితులు లేదా ఒబిసి సామాజిక వర్గానికి చెందినవారు.

"మేము ఈ భూమిని మూడు తరాలుగా, అంటే దేశానికీ స్వాతంత్య్రం రాక ముందునుంచి, సాగుచేస్తున్నాము. ఇందిరాగాంధీ అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఈ భూమి మీద మాకు హక్కు కల్పించారు." అన్నారు బాబూరావు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదలాయింపుల నిషేధం) చట్టం 1977 ప్రకారం, వ్యక్తులుగా ఈ అసైన్డ్ భూములను అమ్మడానికి గాని, కొనడానికి గాని వీలులేదు. కేవలం ఒక కుటుంబసభ్యుడి నుంచి ఇంకొక కుటుంబ సభ్యుడికి బదిలీ మాత్రమే చెయ్యొచ్చు.

అయితే, ప్రభుత్వం తన ‘గ్రీన్‌ఫీల్డ్’ రాజధాని నిర్మాణంలో మొదటి దశ కోసం 33,000 ఎకరాలను సేకరిస్తోంది. వీటిలో దాదాపు 10,000 ఎకరాలు అసైన్డ్ భూములని స్థానిక కార్యకర్తల అంచనా.  మిగిలినవి అగ్రవర్ణాలైన కమ్మ, కాపు, రెడ్డి రైతులు సాగుచేస్తున్న పట్టా భూములు.

Turaka Baburao
PHOTO • Rahul Maganti

ప్రభుత్వం సేకరిస్తున్న 10 వేల ఎకరాల ‘అసైన్డ్’ భూమి గురించి రాయపూడి గ్రామానికి చెందిన తురక బాబూరావు మాట్లాడుతూ, ‘దేశానికి స్వాతంత్య్రం రాకముందునుంచే, మూడు తరాలుగా మేం ఈ భూమిని సాగు చేసుకుంటున్నాం.' అన్నారు

భూసేకరణ, పునరావాసంలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం ( Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act - ఎల్ఎఆర్ఆర్)ను 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించగా, కొత్త రాజధాని కోసం భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పిఎస్)ని రూపొందించింది. సామాజిక, పర్యావరణ ప్రభావ అంచనా, ప్రభావితమైన వారిలో కనీసం 70 శాతం మంది సమ్మతిని పొందటం, ఇంకా పునరుద్ధరణ, పునరావాస ప్యాకేజీల వంటి- ఎల్ఎఆర్ఆర్ ద్వారా నిర్దేశించిన రక్షణలనూ, తనిఖీలనూ ఎల్‌పిఎస్ విస్మరిస్తుంది. జనవరి 2015లో అమలులోకి వచ్చిన ఎల్‌పిఎస్, భూయజమానుల సమ్మతిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ భూమిపై ఆధారపడిన వ్యవసాయ కూలీల వంటి ఇతరులను పట్టించుకోదు. భూయజమానులు తమ ప్లాట్లను రాష్ట్రానికి ‘స్వచ్ఛందంగా’ ఇవ్వవచ్చు. అందుకు ప్రతిఫలంగా, ద్రవ్య పరిహారానికి బదులుగా కొత్త రాజధానిలో ‘పునర్నిర్మించి, అభివృద్ధి చేసిన ప్లాట్’ను పొందవచ్చు.

ఫిబ్రవరి 17, 2016న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ఒక ఉత్తర్వును జారీ చేసింది: 'స్వచ్ఛందంగా' ఇచ్చిన ప్రతి ఎకరం పట్టా భూమికి పరిహారంగా ఆ భూ యజమానికి కొత్త రాజధానిలో 1,000 చదరపు గజాల నివాస స్థలం, ఏదైనా దుకాణమో వ్యాపారమో నడుపుకునేందుకు 450 గజాల వాణిజ్య స్థలం ఇస్తారు. ల్యాండ్ పూలింగ్ అథారిటీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అధికార సంస్థ (ఎపిసిఆర్‌డిఎ-APCRDA) మిగిలిన భూమిని రహదారులు, పబ్లిక్ భవనాలు, పరిశ్రమలు, ఇంకా ఇతర పౌర సౌకర్యాల నిర్మాణానికి వినియోగిస్తుంది.

ఎకరా అసైన్డ్ భూమికి, 800 చదరపు గజాల నివాసస్థలం 250 గజాల వాణిజ్య స్థలం పరిహారంగా ఎపిసిఆర్‌డిఎ నిర్ణయించింది. కృష్ణానది లంకల్లో వుండే భూమికి ఇంకా తక్కువగా- 500 గజాలు నివాస స్థలం, 100 గజాలు వాణిజ్య స్థలం పరిహారంగా నిర్ణయించారు.

PHOTO • Sri Lakshmi Anumolu
Field of maize. The fertile fields of Uddandarayunipalem, Lingayapalem and Venkatapalem villages in November 2014, before the whole land pooling exercise for the capital region has started.
PHOTO • Sri Lakshmi Anumolu

రాజధాని కోసం 'ల్యాండ్ పూలింగ్' మొదలవ్వక ముందు, 2014లో కృష్ణానది ఉత్తరపు ఒడ్డున సారవంతమైన 'అసైన్డ్' భూములలో పండిన పంటలు

అయితే, ఎక్కువమంది పట్టా దారులు ఈ రకమైన వేరు వేరు పరిహారాలు ఇవ్వడం సరైనదే అని భావిన్నారు. "మేం ఈ పట్టా భూములను కష్టపడి దున్ని, సాగుభూమిగా చేసుకున్నాం. వాళ్ళు (అసైన్డ్ భూయజమానులు) పేదలు కాబట్టి ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిని పొందారు. మా ఇద్దరినీ ఒకే రకంగా ఎలా చూస్తారు?" అని పేరు చెప్పడానికి ఇష్టపడని రాయపూడికి చెందిన ఒక కమ్మ రైతు అన్నారు.

రాయపూడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఉద్దండరాయునిపాలెంలో పట్టా భూమిని కలిగివున్న అనుమోలు గాంధీ, ఒక పర్యావరణ కార్యకర్త. కృష్ణ ఒడ్డున ఉన్న చిత్తడి నేలలపై మెగా-రాజధాని పర్యావరణ ప్రభావాన్ని ఆయన ఎత్తిచూపారు. ఆయన ఇలా అంటారు: “పట్టా భూముల యజమానులు తమ భూములను పూలింగ్ కోసం ఇచ్చేలా ఒప్పించేందుకు (ముఖ్యమంత్రి చంద్రబాబు) నాయుడు చేసిన వ్యూహాత్మక పన్నాగమే పరిహారంలో ఉన్న ఈ వ్యత్యాసం. పరిహారం ఇద్దరికీ ఒకేలా ఉంటే, పట్టా భూ యజమానులు తమ భూములను ఎప్పటికీ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే వాళ్లలో చాలామంది అసైన్డ్ భూములను ప్రభుత్వం పేదలకు పారేసిన బిచ్చంగా భావిస్తారు."

అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో బలవంతపు భూసేకరణ ద్వారా నిర్వాసితులైన వ్యక్తులకు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది రవి కుమార్, ఇలా అన్నారు: “ఒక్కో భూమికి ఒక్కో రకమైన పరిహారం ఇచ్చే ఈ ప్రభుత్వ ఉత్తర్వు న్యాయస్థానంలో నిలబడదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. 2004లో చేవెళ్ల డివిజన్, హైదరాబాద్ భూసేకరణ అధికారి వర్సెస్ మేకల పాండు అనే కేసులో అసైన్డ్ భూములకు, పట్టా భూములకు ఒకే రకమైన పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది."

ఇలాంటి కోర్టు తీర్పులు, ఎల్ఎఆర్ఆర్ చట్టంతో పాటు, 2016 జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవిన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వు (జి.ఒ. నెం. 259)లో అసైన్డ్ భూములున్నవారికి పట్టా భూ యజమానులతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది. అంతే కాదు, “ఒక ప్రాజెక్ట్ కోసమో, ప్రజా ప్రయోజనం కోసమో, లేదా ప్రభుత్వ శాఖ లేదా కార్పొరేషన్‌కు ఇవ్వడం కోసమో అసైన్డ్ భూములు అవసరమైనప్పుడు, పట్టా (భూములు) నిబంధనల ప్రకామే ఆ భూములు తిరిగి తీసుకోబడతాయి.” అని కూడా ఆ చట్టం చెబుతోంది.

Thokala Pulla Rao
PHOTO • Rahul Maganti
PHOTO • Rahul Maganti

ఎడమ: పరిహారం రాదేమో అన్న ఆందోళనలో తోకల పుల్లారావు. ఈయన సారవంతమైన తన భూమిని రూ.6 లక్షలకు అమ్ముకున్నారు. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్ విలువ ఎకరాకు 5 కోట్లుగా ఉంది. కుడి: పట్టాదారు పాస్ పుస్తకం చూపిస్తున్న పులి చిన్న లాజరస్

రాయపూడి గ్రామానికి చెందిన బాబూరావుతో సహా దాదాపు 4,000 మంది పట్టా , అసైన్డ్ భూముల యజమానులు ఎల్‌పిఎస్‌ను ప్రతిఘటించి రాష్ట్రానికి తమ భూములను ఇవ్వడానికి నిరాకరించారు. సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌కు రాశారు. అప్పుడిక విధిలేక, ప్రభుత్వం ఎల్ఎఆర్ఆర్ చట్టం సహాయాన్ని తీసుకుంది. దాంతో రైతులు - వేర్వేరు  గ్రామాల నుండి వివిధ గ్రూపులుగా - ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ఎల్ఎఆర్ఆర్ కింద కూడా భూ సేకరణపై జూన్ 2017 నుండి స్టే ఉత్తర్వులు పొందారు.

కృష్ణానదికి ఉత్తర తీరాన, కృష్ణానది లంకల్లోనూ ఉన్న రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లోని అసైన్డ్ భూములు భవిష్యత్తులో వచ్చే నదీతీర రాష్ట్ర రాజధానికి చాలా ముఖ్యమైనవి. సింగపూర్‌కు చెందిన నిర్మాణ సంస్థల కన్సార్టియం రూపొందించిన అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ‘సీడ్ క్యాపిటల్’ను ప్రతిపాదించారు. సీడ్ క్యాపిటల్ అంటే, ఈ 1,600 ఎకరాల్లో పారిశ్రామిక మండలం, వారసత్వ, పర్యాటక కేంద్రాలతో కూడిన ముందుగా అభివృద్ధి చేయాల్సిన ప్రధాన ప్రాంతం. వాటర్ పార్కులు, అడ్వెంచర్ పార్కులు, థీమ్ పార్కులు, నదీ తీరం వెంబడి గోల్ఫ్ కోర్సుల గురించి కూడా  ఈ మాస్టర్ ప్లాన్ మాట్లాడుతుంది.

వివిధ వార్తా కథనాల ప్రకారం, కొత్త రాజధాని డిజైన్‌లో, నిర్మాణంలో పాలుపంచుకున్న కంపెనీలు తమ వ్యాపారాల స్థాపన కోసం 6000 నుంచి 10000 ఎకరాల భూమిని పొందబోతున్నాయి. ఆ కంపెనీలకు, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పదం వివరాలు ప్రజలకు తెలియజేయలేదు కాబట్టి ఆ కంపెనీలు ఎన్ని ఎకరాలు పొందబోతున్నాయో ఖచ్చితమైన లెక్క తెలియదు.

బాబూరావు స్నేహితుడు, రైతు, అసైన్డ్ భూమి సాగుదారుల సంక్షేమ సంఘ సభ్యుడు కూడా అయిన 60 ఏళ్ల తోకల పుల్లారావుకి 0.77 ఎకరాల అసైన్డ్ భూమి ఉండేది. 2016లో ఆ సారవంతమైన భూమిని రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు దగ్గర దగ్గర 6 లక్షల రూపాయలకు (అసైన్డ్ భూముల అమ్మకం చెల్లకపోయినా) అమ్మేశారు. ఆ భూమికి ఇప్పటి మార్కెట్ విలువ దాదాపు ఎకరానికి 5 కోట్ల రూపాయలుంటుందని అంచనా.

A signboard showing the directions to the yet to be constructed Ambedkar Smriti Vanam
PHOTO • Rahul Maganti

ఎడమ: భూసేకరణను నిరసిస్తూ ఆందోళనకు దిగిన రాజకీయ పార్టీలు, కార్యకర్తలు. కుడి: ప్రతిపాదిత అంబేద్కర్ స్మారక చిహ్నం, ఉద్యానవనం గురించి తెలియజేసే సైన్ బోర్డు

"ప్రభుత్వం ఎంతసేపూ ఈ భూములు ప్రభుత్వానివి ఎప్పుడైనా తీసేసుకోవచ్చు అని చెప్తూ ఉండటంతో నాకు పరిహారం రాదని భయపడ్డాను. రెవెన్యూ అధికారులు కూడా ఇవి ప్రభుత్వం ఇచ్చిన భూములు కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా తీసేసుకోవచ్చు అనే చెప్పారు," అన్నారు పుల్లారావు. "మాకు చట్టం గురించి ఏమి తెలియదు. వాళ్ళు చెప్పింది నిజమే అనుకున్నాం." భూ యజమానుల భయాన్ని బ్రోకర్లు సొమ్ముచేసుకున్నారు. రైతుల, స్థానిక పత్రికల ప్రకారం ఎక్కువమంది బ్రోకర్లు, పరిపాలనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల బినామీలు. కొన్నిసార్లు ఈ బ్రోకర్లే రాజకీయ నాయకులుగా కూడా ఉన్నారు.

జాతీయ ప్రజా ఉద్యమాల సమాఖ్య (ఎన్ఎపిఎం) తరఫున 2014 డిసెంబర్‌లో వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ ప్రకారం, 2014 నవంబర్‌లో 3500 ఎకరాల అసైన్డ్ భూముల లావాదేవీలు జరిగాయి. ఒక్క నెలలోనే రూ. 4000 కోట్లు చేతులు మారాయి. రెవిన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఈ విషయంలో ఒక్కటిగా పనిచేశారని ఈ కమిటీ రిపోర్ట్ చెప్తోంది.

అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత, అది ఒక ఘెట్టో నగరం (పేదలు, తక్కువ జాతివాళ్ళు మిగిలినవాళ్ళతో కలవకుండా ఉంచే నాజీ పద్దతి) అవుతుందని పుల్లారావు అనుకుంటున్నారు. "కుల ప్రాతిపదికన వివక్ష కొత్త రాజధానిలో కూడా వుండబోతోంది. అసైన్డ్ భూ యజమానులందరికీ ఒకే దగ్గర, పట్టా భూయజమానులందరికీ మరో దగ్గర స్థలాలు ఇస్తున్నారు. ఇది కులాల మధ్య స్పష్టమైన హద్దులతో వుండే పాత గ్రామాన్నే, తిరిగి సృష్టిస్తుంది." అంటారు పుల్లారావు.

నూతన రాజధాని నగరంలో 125 అడుగుల ఎత్తైన డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఏప్రిల్ 14, 2017న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేశారు. విగ్రహం వుండే ఈ 20 ఎకరాల ప్రదేశాన్ని అంబేద్కర్ స్మృతివనం అంటారు. వార్త కథనాల ప్రకారం ఈ విగ్రహానికి, దాని చుట్టూ ఏర్పాటు చేసే ఉద్యానవనం నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించారు. ఈ అమరావతి నగరం, 2వ శతాబ్దపు దక్కన్ ప్రాంత శాతవాహన రాజ్య రాజధాని అయిన అమరావతి స్పూర్తితో నిర్మాణమవుతుందని శంఖుస్థాపన సమయంలో ముఖ్యమంత్రి అన్నారు.

కానీ, "మీరు అంబేద్కర్ ఆదర్శాలను పాటించనప్పుడు, దళితులను పేదలను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నప్పుడు, అంబేద్కర్‌కు విగ్రహాలు పార్కులు కట్టడం వల్ల ఏమిటి ఉపయోగం?" అనేది బాబూరావు ప్రశ్న.

ముఖచిత్రం: శ్రీలక్ష్మి అనుమోలు

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు:

'ఇది ప్రజల రాజధాని కాదు'

వాగ్దానం చేసిన విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం మాకు ఉద్యోగాలివ్వాలి

ఆకాశాన్నంటుతున్న భూముల ధరలు, చిన్నరైతులకు భారమవుతున్న వ్యవసాయం

రైతు కూలీల ఉపాధిని కాజేసిన రాజధాని

మహా రాజధాని నగరం, చాలీచాలని జీతాల వలసకూలీలు

అనువాదం: వి. రాహుల్జీ

Rahul Maganti

راہل مگنتی آندھرا پردیش کے وجیہ واڑہ میں مقیم ایک آزاد صحافی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Rahul Maganti
Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

کے ذریعہ دیگر اسٹوریز Rahulji Vittapu