ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.

"మీ ఊర్లో వానలు పడుతున్నాయా?" ఉత్తర గుజరాత్ లోని బనాస్‌కాంఠా జిల్లా నుంచి కారాభాయ్ అల్ అడిగారు. ఇది జూలై నెలాఖరులో జరుగుతున్న సంభాషణ. "ఇక్కడ అసలు వానలు లేవు. వానలు పడితే మా ఊరు వెళ్ళి పోతాము" అన్నారు ఫోన్లో. కానీ గొంతులో నమ్మకం ధ్వనించలేదు.

కారాభాయ్ ఫోన్లో మాట్లాడుతున్న అవతలి వ్యక్తి అక్కడికి తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణే నగరంలో ఉంటాడు. అతడు రైతేమీ కాదు. అతనికి వర్షాలు కురవడం కురవకపోవడం పెద్ద విషయం కాదు. అయితే కారాభాయ్‌ ఎంత ఆందోళనలో ఉన్నారంటే, ఈ సంగతులేవీ ఆయనకు పట్టటంలేదు. కారాభాయ్ ఆలోచన అంతా వర్షం గురించే. వానలు కురవడం కురవకపోవడం అతనికి, అతని కుటుంబానికి జీవన్మరణ సమస్య. పైగా ఈ సమస్య ప్రతియేడూ ఉండేదే.

75 ఏళ్ల ఈ పశుపోషకుడు పచ్చిక బయళ్లను వెతుక్కుంటూ ఇల్లు వదిలి ఈ సారి 12 నెలలు గడిచిపోయాయి. అతను అతనితోపాటు అతని కొడుకు కోడలు ఇద్దరు మనవలు, ఇంకా అతని తమ్ముడు, తమ్ముడి కుటుంబం ఉన్నాయి. మొత్తం 14 మంది. మూడు వందలలకు పైగా గొర్రెలు, మూడు ఒంటెలు, రాత్రి కాపలా కోసం ఒక కుక్క. కుక్క పేరు "విచియో". ఈ పన్నెండు నెలలు వాళ్ళు, వాళ్ళ జంతువులు కచ్, సురేంద్రనగర్, పాటణ్, బనాస్‌కాంఠా జిల్లాల్లో ఎనిమిది వందల కిలోమీటర్ల పైనే తిరిగారు.

కా రాభాయ్ ఆల్ కుటుంబం గుజరాత్‌లోని మూడు ప్రాంతాల మీదుగా ఏటా ప్రయాణించే 800 కిలోమీటర్ల మార్గం . ఆధారం : గూగుల్ మ్యాప్స్

కారాభాయ్ భార్య దోసీబాయి, బడికి వెళ్లే అతని చిన్ని మనవరాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్లది గుజరాత్ లో కచ్ ప్రాంతంలోని రాపర్ తాలూకాకు చెందిన జటవాడా గ్రామం. వాళ్లు రబరి కులానికి(ఆ జిల్లాలో OBCలు) చెందినవాళ్లు. ప్రతి సంవత్సరం ఎనిమిది నుంచి పది నెలలు తమ గొర్రెల కోసం పచ్చికబయళ్ళు వెతుక్కుంటూ వాళ్లు ఇల్లు వదిలి వలస వెళతారు. సాధారణంగా వీళ్ళు దీపావళి తర్వాత (అక్టోబర్ -నవంబర్ ) తిరిగి ఇళ్ళకు బయలుదేరి, వానాకాలం మొదలయ్యే సమయానికి ఇంటికి వస్తారు.

అంటే వీళ్లు వానాకాలం తప్ప మిగతా ఏడాది అంతా ఇల్లు వదిలి తిరుగుతూనే ఉంటారు. ఇంటికి వచ్చాక కూడా కుటుంబంలో ఎవరో ఒకరు జటవాడా పొలిమేరల్లోనే ఉంటూ గొర్రెలను చూసుకోవాలి. పశువులకు ఉండటానికీ, పచ్చిక మేయడానికీ తగినంత స్థలం గ్రామం లోపల ఉండదు.

మేము మొదటిసారి కారాభాయిని మార్చి నెల మొదట్లో కలిశాం. "మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేసేందుకు పటేలు ( గ్రామ పెద్ద) మిమ్మల్ని పంపాడనుకున్నా" అంటూ కారాభాయి మమ్మల్ని పలకరించారు. సురేంద్రనగర్ జిల్లా గవానా గ్రామంలో మేమతన్ని కలుసుకున్నాం. అహ్మదాబాద్ నుంచి ఈ గ్రామం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది

అతడలా అనుమానించడానికి అర్థం ఉంది. కరవు తీవ్రంగా ఉన్న రోజుల్లో పొలాల యజమానులు పశువుల కాపర్లని, వారి మందలనీ తమ పొలాల్లోంచి వెళ్లగొడతారు. పొలాల్లో ఉన్న ఆ కొద్ది గడ్డిని తమ పశువుల కోసం దాచుకోవాలనుకుంటారు

" ఈసారి దుష్‌కాల్ (కరవు) తీవ్రంగా ఉంది" అని కారాభాయ్ మాతో అన్నారు. " అందుకే అఖాడ్ (జూన్-జూలై) మాసంలోనే రాపర్‌ని విడిచి పెట్టాము. బొత్తిగా వానలు లేవు".అసలే మెట్ట ప్రాంతమైన వాళ్ళ సొంత జిల్లా నుంచి కరువు కారణంగా ఈసారి ముందుగానే వలస రావాల్సి వచ్చింది.

"వానాకాలం మొదలయ్యే వరకు మేం పశువులు మేపుకుంటూ తిరుగుతూనే వుంటాం. ఒకవేళ వానలు పడక పోతే మేము ఇంటికి వెళ్ళం. మాల్‌ధారీ ల బతుకులు ఇంతే" అన్నారు కారాభాయ్. మాల్ (పశువులు) ధారి (సంరక్షకుడు) అనే రెండు గుజరాతి పదాల నుండి మాల్‌ధారీ అనే పదం వచ్చింది.

"2018- 19 లో గుజరాత్‌లో వచ్చిన కరవు మహా తీవ్రమైనది. నీటి వసతి లేని, కొద్దిగా నీటి వసతి ఉన్న ప్రాంతాలను కూడా ఇది తీవ్రంగా ఇబ్బందులపాలు చేసింది. ఎంత తీవ్రంగా అంటే దాదాపు పాతికేళ్ళ క్రితమే వార్షిక వలసలు మానేసి, వారి గ్రామాలలో స్థిరపడిన పశుపోషకులు సైతం పచ్చికబయళ్ళ కోసం, మేత కోసం, బతుకు కోసం ఈ సంవత్సరం వలస పోవలసి వచ్చింది," అని నీతా పాండ్య మాతో చెప్పారు. ఆవిడ మాల్‌ధారీ రూరల్ యాక్షన్ గ్రూప్(MARAG) అనే సంస్థ వ్యవస్థాపకురాలు. లాభాపేక్ష లేని ఆ సంస్థ అహ్మదాబాద్ కేంద్రంగా 1994 నుంచి చురుకుగా పనిచేస్తోంది.

PHOTO • Namita Waikar
PHOTO • Namita Waikar

ఆల్ కుటుంబానికి చెందిన 300 గొర్రెలు ఒకప్పుడు జీరా ( జీలకర్ర) పొలంగా ఉన్న బంజరులో విశ్రమిస్తుండగా, కారాభాయ్ ( కుడి) తన గ్రామమైన జటవాడాలోని స్నేహితుడితో మాట్లాడి, అక్కడివారి యోగక్షేమాలు కనుక్కుంటున్నారు

మాల్‌ధారీ కుటుంబ నివాస ప్రాంతమైన కచ్ లో 2018 సంవత్సరంలో కేవలం 131 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కచ్ లో ‘సాధారణ’ వర్షపాతం సంవత్సరానికి 356 మిల్లీమీటర్లు. దశాబ్ద కాలంగా ఈ జిల్లాలో రుతుపవనాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. భారత వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 2014లో 291 మిల్లీమీటర్లు, 2016లో 294 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదయింది.2017లో మాత్రం బాగా పెరిగి 493 మిల్లీమీటర్లు నమోదయింది. అలాగే నాలుగు దశాబ్దాల క్రితం -1974-78 మధ్య - ఐదేళ్ల కాలంలో ఒక వినాశకరమైన సంవత్సరం (1974లో 88 మి.మీ.), వరుసగా నాలుగు సంవత్సరాలలో 'సాధారణ' సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

"దక్షిణాసియా నెట్‌వర్క్ ఆఫ్ డ్యామ్స్, రివర్స్ అండ్ పీపుల్" అనే సంస్థకు చెందిన హిమాంశు ఠక్కర్ 2018 లో ఒక రిపోర్ట్ తయారు చేశారు. దాని పేరు " గుజరాత్ లో జల విపత్తులకు కారణాలు దారితప్పిన ప్రాధాన్యాలే " (Gujarat’s water crisis rooted in years of misplaced priorities ). ఆ రిపోర్ట్ ప్రకారం, గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఏర్పడ్డ అన్ని ప్రభుత్వాలు నర్మదా డ్యామ్‌ను కచ్‌, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌లోని కరవు పీడిత ప్రాంతాలకు జీవనాడిగా ముందుకు తీసుకెళ్ళాయి. కానీ ఆచరణలో మాత్రం ఆ ప్రాంతాలకు అతి తక్కువ ప్రాధాన్యం లభిస్తోంది.మధ్య గుజరాత్‌లోని పట్టణ ప్రాంతాల, పరిశ్రమల, రైతుల అవసరాలను తీర్చిన తర్వాత మాత్రమే వారికి మిగిలిన నీరు లభిస్తోంది.

ఆధారం: ఐఎండి యొక్క కస్టమైజ్డ్ రెయిన్‌ఫాల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ అండ్ డౌన్ టు ఎర్త్ - ఎన్వి స్టాట్స్ ఇండియా-2018

“నర్మదా నది నీళ్లు ఈ ప్రాంత రైతులకు, పశుపోషకులకు దక్కాలి" అని హిమాంశు ఠక్కర్ మాతో ఫోన్లో మాట్లాడుతూ అన్నారు. "అలాగే బావుల పునరుద్ధరణ, చెక్ డ్యాములు కట్టడం వంటి గతంలో జరిగిన పనులు కూడా మళ్లీ మొదలుపెట్టాలి."

మాల్‌ధారీల కు సొంత భూములు ఉండవు. వాళ్ళు గ్రామ ఉమ్మడి పొలాల్లో, బీడు భూముల్లో పశువులను మేపుకుంటారు. ఎవరికైనా కొంచెం భూమి ఉంటే అందులో సజ్జలు లాంటి వర్షాధార పంటలు పండిస్తారు. దాంతో వారికి తిండీ, పశువులకు మేతా దొరుకుతాయి.

"మేమిక్కడికి వచ్చి రెండు రోజులయింది. ఇక్కడ (మాకోసం) పెద్దగా ఏమీ లేదు. ఈరోజు వెళ్ళిపోతున్నాం." జీలకర్ర పంట వేసిన పొలం వైపు చూపిస్తూ అన్నారు కారాభాయి. ఇక్కడ చాలా పొడిగానూ, చాలా వేడిగానూ ఉంది. అతని చిన్నతనంలో అంటే 1960 లలో సురేంద్రనగర్ జిల్లాలో ఏడాదిలో 225 రోజులు పాటు 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యేది. న్యూయార్క్ టైమ్స్ ఈ సంవత్సరం జూలైలో ఆన్‌లైన్‌లో ప్రచురించిన - వాతావరణం మరియు గ్లోబల్ వార్మింగ్‌పై ఇంటరాక్టివ్ సాధనం ద్వారా గణించబడిన - లెక్కల ప్రకారం, నేడు అటువంటి రోజుల సంఖ్య 274 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అంటే 59 సంవత్సరాలలో కనీసం 49 తీవ్రమైన వేడి రోజులు పెరిగినట్టు.

మేం పశువుల కాపరులను కలుసుకున్న సురేంద్రనగర్ జిల్లాలో 63 శాతం ప్రజలు వ్యవసాయం చేసుకునేవారే. మొత్తం గుజరాత్ ని చూస్తే అది 49.61 శాతం. పత్తి, జీలకర్ర, గోధుమ, పప్పు ధాన్యాలు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఆముదం ఇక్కడి ప్రధాన పంటలు. పంట కోతలు అయ్యాక మిగిలినది గొర్రెలకు మంచి పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది.

2012లో జరిగిన పశుగణన ప్రకారం గుజరాత్ లోని మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో కలిపి ఒక కోటి డెబ్బై లక్షల గొర్రెలున్నాయి. ఒక్క కచ్ లోనే ఐదు లక్షల డెబ్బై వేల గొర్రెలున్నాయి. అంటే  మొత్తం గొర్రెల్లో ఇది మూడోవంతు. MARAG లెక్కల ప్రకారం, కారాభాయి ప్రాంతం వాగడ్ లో రబరీ తెగకి చెందిన 200 కుటుంబాలు ఉన్నాయి. వీరందరి దగ్గర కలిపి దాదాపు 30 వేల గొర్రెలు ఉంటాయి. ఈ కుటుంబాలు ప్రతి సంవత్సరం గొర్రెలు మేపుకుంటూ ఎనిమిది వందల కిలోమీటర్లు తిరుగుతారు. అయితే తమ ఇంటికి రెండు వందల కిలో మీటర్ల వ్యాసార్థం లోనే వుంటారు.

ఈ గొర్రెల మందలు పంట కోతలు అయిపోయాక తమ పెంట, మూత్రంతో పొలాలకు ఎరువు ఇచ్చేవి. దానికి బదులుగా రైతులు ఈ పశువుల కాపరులకు సజ్జలు చక్కెర టీ పొడి ఇచ్చేవాళ్ళు. శతాబ్దాల పాటు సాగిన ఈ పరస్పర సహకార సంప్రదాయం వాతావరణం మాదిరే మారిపోతోంది.

'మీ ఊర్లో కోతలు అయిపోయాయా?' కారాభాయ్, గోవింద్ భర్‌వాడ్‌ని అడిగారు. 'మేము ఆ పొలాల్లో ఉండొచ్చా?'

"మీ ఊర్లో కోతలు అయిపోయాయా?" కారాభాయ్, గోవింద్ భర్‌వాడ్‌ని అడిగారు. గోవింద్ మాతోపాటు వచ్చాడు. "మేము ఆ పొలాల్లో ఉండొచ్చా?".

" రెండు రోజుల తర్వాత కోస్తారు" అన్నాడు గోవింద్. గోవింద్ MARAG సభ్యుడు. పాటణ్ జిల్లా సమీ తాలూకా దనోరా గ్రామవాసి. అతను కూడా వ్యవసాయ పశుపోషకుడు. "ఈసారికి మాల్‌ధారీలు మా పొలాల గుండా వెళ్ళవచ్చు, కానీ ఉండిపోకూడదు. నీళ్లకీ గడ్డికీ వచ్చిన తీవ్రమైన కొరత వల్ల గ్రామపంచాయతీ ఇలా తీర్మానించింది."

ఆవిధంగా పాటణ్ వైపు కారాభాయ్ కుటుంబం బయలుదేరింది. వాళ్లు వాళ్ల ఇల్లు చేరుకునే నాటికి గుజరాత్ లోని మూడు ముఖ్య ప్రాంతాలైన కచ్, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌లను చుట్టేసి వుంటారు..

ఇంతగా  మారిపోయిన వాతావరణ పరిస్థితుల్లో కూడా మారనిది వారి ఆతిథ్యం. వలసలో ఉన్నప్పుడు వారి తాత్కాలిక నివాసాలలో కూడా వారి అతిథి మర్యాదలకు లోటేమీ ఉండదు. కారాభాయ్ కోడలు హీరాబెన్ అల్ కుటుంబం కోసం ఒక దొంతర బాజరా రోటలా (సజ్జ రొట్టెలు), అందరి కోసం వేడి వేడి టీ తయారుచేశారు. "మీరు ఎంతవరకు చదువుకున్నారు?” అని అడిగితే, “నేను బడికే వెళ్ళలేదు." అంటూ అంట్ల గిన్నెలు కడగటం మొదలుపెట్టారు. కుటుంబంలోని పెద్ద మగవాళ్లు అక్కడే ఉన్నందువల్ల ఆమె లేచి నిలబడ్డప్పుడల్లా తన నల్లని చున్రీ (కొంగు)ని ముఖం మీదికి లాక్కుంటున్నారు. మళ్లీ పని చేస్తూ కింద కూర్చున్నప్పుడు వెనక్కి తీసేస్తున్నారు.

ఈ కుటుంబం దగ్గర ఉన్న గొర్రెలు "మార్వారీ" రకానివి. గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లో స్థానిక గొర్రెల జాతి అది. ఒక్కొక్కటి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల చొప్పున, వీరు సంవత్సరంలో 25 నుండి 30 గొర్రెలు అమ్ముతారు. గొర్రెల పాలు అమ్మడం ద్వారా కూడా కొంత సంపాదిస్తారు. కారాభాయ్ గొర్రెలమంద పెద్దగా పాలు ఇవ్వడం లేదు. ప్రతిరోజూ 25-30 గొర్రెలు, 9 -10 లీటర్ల పాలు ఇస్తాయని ఆయన చెప్పారు. స్థానికంగా ఉండే చిన్నపాలకేంద్రాలు లీటర్ పాలకి 30 రూపాయలు ఇస్తాయి. అమ్ముడుపోని పాలతో మజ్జిగచేసి, వచ్చిన వెన్న నుంచి నెయ్యి చేసుకుంటారు.

" ఘీ పేట్ మా ఛే !( నెయ్యి పొట్టలో ఉంది)" అన్నారు కారాభాయ్ పళ్లికిలిస్తూ! " ఈ వేడిలో నడిస్తే పాదాలు కాలిపోతాయి. నెయ్యి తింటే కొంచెం ఉపశమనంగా ఉంటుంది."

మరి గొర్రెల ఉన్ని అమ్మరా? "రెండేళ్ల క్రితం వరకు గొర్రెకు రెండు రూపాయల చొప్పున ఉన్ని కొనేవారు. ఇప్పుడు ఎవరూ కొనడం లేదు. గొర్రెల ఉన్ని మాకు బంగారంతో సమానం. కానీ వృథాగా పారేయాల్సి వస్తోంది".అన్నారు కారాభాయి విషాదంగా. అతనికి, అతని లాంటి లక్షలాది పశుపోషకులకు, భూమిలేని, కొద్దిగా భూమి ఉన్న సన్నకారు రైతులకి గొర్రెలు (మేకలు కూడా) పెద్ద సంపద. అవి వారి జీవనోపాధి కి కేంద్రకం వంటివి. ఇప్పుడు ఈ సంపద క్షీణించిపోతోంది.

PHOTO • Namita Waikar

13 ఏళ్ల ప్రభువాలా ప్రయాణానికి ఒంటెను సిద్ధం చేస్తుండగా వాళ్ళ నాన్న వాలాభాయ్ (కుడి వైపు) గొర్రెలను ఒక దగ్గరకు తోలుతున్నారు. కొద్దిసమయంలో ప్రభువాలా తల్లి హీరాబెన్ (దిగువ ఎడమవైపు) టీ తాగుతున్నారు. కారాభాయి ((కుడివైపు చివర)) కుటుంబ సభ్యులను తదుపరి సుదీర్ఘ ప్రయాణానికి సన్నద్ధం చేస్తున్నారు

2007- 2012 మధ్య గల ఐదేళ్లలో భారతదేశంలో గొర్రెల సంఖ్య 60 లక్షలు తగ్గిపోయింది. అంతకుముందు ఈ సంఖ్య 7.16 కోట్లు ఉండేది. ఇప్పుడది 6.51 కోట్లకు పడిపోయింది. అంటే తొమ్మిది శాతం తగ్గుదల. గుజరాత్‌లో కూడా దాదాపు మూడు లక్షలు తగ్గి ప్రస్తుతం 17 లక్షల జీవాలు మాత్రమే ఉన్నాయి.

కచ్ లో కూడా జీవాలు తగ్గిపోయాయి. కానీ మిగతా చోట్లతో పోలిస్తే కొంచెం మెరుగు. ఈ ఘనత పూర్తిగా మాల్‌ధారీల దే. ఇక్కడ 2007 తో పోలిస్తే 2012లో 4200 గొర్రెలు మాత్రమే తగ్గాయి.

2017 పశుగణన లెక్కలు రావడానికి ఇంకా ఆరు నెలలు పడుతుంది. కానీ కారాభాయి మాత్రం గొర్రెల సంతతి చాలా తగ్గిపోతోంది అంటున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి." నాకు 30 ఏళ్లు ఉన్నప్పుడు ఇక్కడ చాలా గడ్డీ చెట్లూ ఉండేవి. గొర్రెలు మేపుకోవడానికి ఏ ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు అడవులు చెట్లు నరికేస్తున్నారు గడ్డి భూములు తగ్గిపోయాయి. వేడిమి ఎక్కువ అయింది." మానవ తప్పిదాలే ఈ విపరీత వాతావరణ మార్పులకు కారణం అని వక్కాణించారు.

"కరవు రోజుల్లో మనలాగానే గొర్రెలు కూడా ఇబ్బందిపడతాయి. గడ్డి నేలలు తగ్గిపోవడం అంటే గడ్డి కోసం, పశుదాణా కోసం మరింత ఎక్కువ దూరం నడవడం. జనం ఎంతో కొంత డబ్బు సంపాదన కోసం గొర్రెలను అమ్మేస్తున్నారు. వాటి సంఖ్య తగ్గిపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు."

గడ్డి నేలలు, మేత మేసే ప్రదేశాలు తగ్గిపోవడం గురించి అతను చెప్పినది సరైనదే. అహ్మదాబాద్ నుంచి పనిచేసే ప్రత్యామ్నాయాల అభివృద్ధి కేంద్రానికి చెందిన ప్రొఫెసర్ ఇందిరా హీర్వే చెప్పిన దాని ప్రకారం గుజరాత్‌లో దాదాపు 4.5 శాతం భూమి గడ్డి నేల. ఇది రికార్డుల్లో వున్న లెక్క. అందులో చాలావరకు ఆక్రమణలకు గురై ఉంటుంది. కాబట్టి నిజమైన లెక్క ఏమిటో తెలియదు. మార్చి 2018 లో అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమిస్తూ, 33 జిల్లాలలో 4725 హెక్టార్ల గోచర్ భూమి(పశువులు మేసేందుకు వదిలిన భూమి) ఆక్రమణకు గురైందని చెప్పింది.ఈ సంఖ్య కూడా ప్రభుత్వం చాలా తగ్గించి చెబుతోందని కొందరు సభ్యులు గొడవ చేశారు.

2018లో రాష్ట్రంలోని 2,754 గ్రామాలకు పశువులు మేసేందుకు భూములు లేవని ప్రభుత్వమే అంగీకరించింది.

గుజరాత్ పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ (గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా పరిశ్రమలకు అప్పగించబడిన భూమిలో - ఇందులో కొంత రాష్ట్రం సేకరించిన భూమి - కూడా పెరుగుదల ఉంది. 1990- 2001 మధ్య ఒక్క సెజ్‌ల కోసమే 4620 హెక్టార్ల భూమిని ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చింది. 2001-2011 కాలం ముగిసే సమయానికి అది 21,308 హెక్టార్లకు పెరిగింది .

PHOTO • Namita Waikar
PHOTO • Namita Waikar

జటవాడాకు వెళ్లే దారిలో కారాభాయి  ( కుడి); గ్రామంలోని ఆల్ కుటుంబ గృహం ముందు భార్య దోసిబాయి ఆల్, పొరుగింటి రత్నభాయ్ ధగల్‌ తో కారాభాయి

సురేంద్రనగర్ లో మార్చినెల పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో, కారాభాయ్ తన జట్టు సభ్యులను తొందర పెడుతున్నారు, "మధ్యాహ్నం అవుతోంది ఇక కదలండి". వాళ్లు బయలుదేరారు. గొర్రెలు వాళ్లను అనుసరించాయి. కారాభాయి మనవడు పదమూడేళ్ళ ప్రభువాలా, పొలాల చుట్టూ ఉన్న పొదలను కొడుతూ అక్కడక్కడా తచ్చాడుతున్న గొర్రెలను అదిలిస్తూ తిరిగి మందలోకి కలుపుతున్నాడు. కారాభాయి బృందంలో అతనొక్కడే బడికి వెళ్ళింది. ఏడో తరగతి వరకూ చదివాడు.

కుటుంబంలోని ముగ్గురు ఆడవాళ్లు నులక మంచాలు, స్టీలు పాల క్యాన్లు, మిగతా వస్తువులు సర్దారు. ప్రభువాలా దూరంగా ఉన్న చెట్టుకు కట్టేసి ఉన్న ఒంటెను విప్పదీశాడు. తమ సంచార గృహాన్నీ, వంటగదినీ విప్పేసి, ఆ ఒంటె వీపుపై ఉంచేందుకు దానిని తల్లి హీరాబెన్ దగ్గరకు తీసుకొచ్చాడు..

అయిదు నెలల తర్వాత ఆగస్టులో మళ్లీ మేం కారాభాయిని రాపర్ తాలూకా లో రోడ్డుమీద కలిశాం. జటవాడా గ్రామంలో అతని ఇంటికి వెళ్ళాం. అతని భార్య 70 ఏళ్ల దోసీబాయ్ ఆల్, మా అందరికోసం టీ చేస్తూ, "పదేళ్ల క్రితం దాకా నేను కూడా వీళ్లతో పాటు ప్రయాణం చేసేదాన్ని. గొర్రెలు, మా పిల్లలు ఇవే మా సంపద. రెంటినీ బాగా చూసుకోవాలి. అదే నాకు కావాల్సింది." అన్నారు.

భయ్యాభాయ్ మక్వానా అనే పొరుగింటాయన కరవులు పదేపదే వస్తున్నాయంటూ గొణిగారు. "నీళ్లు లేకపోతే మేము ఇంటికి రాలేం. గడిచిన ఆరు సంవత్సరాల్లో నేను కేవలం రెండుసార్లే ఇంటికి వచ్చాను".

రత్నభాయ్ ధగల్ అనే మరో పొరుగింటాయన ఇంకొన్ని అవరోధాల గురించి చెప్పారు. "నేను రెండేళ్ల కరవు తర్వాత ఇంటికి వచ్చేసరికి మా గోచర్ భూమికి ప్రభుత్వం కంచె వేసేసింది. మేము రోజంతా తిరిగాం కానీ మా గొర్రెలకు ఎక్కడా సరైన చోటు, మేత దొరకలేదు. మేమేం చేయాలి, వాటికి ఏం పెట్టాలి? బతకడానికి పశువులను కాయడం మాత్రమే మాకు తెలిసింది".

"ఈ కరవుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది" పెరిగిపోతున్న అస్థిర వాతావరణం, వాతావరణ విధానాలతో విసిగిపోయిన కారాభాయ్ అన్నారు. “వాతావరణ మార్పులను తట్టుకోలేకపోతున్నాం. తాగడానికి తినడానికి జంతువులకు ఏమీ లేదు ఆఖరికి పక్షులకు కూడా  పస్తులే."

ఆగస్టులో కురుసిన వానలు వారికి కొంచెం ఊరటనిచ్చాయి. ఆల్ కుటుంబానికి ఉమ్మడిగా ఎనిమిది ఎకరాల వర్షాధార భూమి ఉంది. దానిలో వారు సజ్జలు విత్తారు.

పశువుల మేత, పశుపోషకుల వలస విధానాలను అనేక కారణాల కలయిక ప్రభావితం చేసింది. అనావృష్టి లేదా అతి తక్కువ వర్షపాతం, తరచుగా వచ్చే కరవులు, పచ్చిక భూములు క్షీణించిపోవడం, రాష్ట్రంలో వేగంగా పెరిగిపోతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవులు తగ్గిపోవడం, పశుదాణా, నీరు లభించడంలో కొరత- ఇవన్నీ కారణాలే. వాతావరణం, వాతావరణంలో జరిగే మార్పుల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని మాల్‌ధారీ ల ప్రత్యక్ష అనుభవం సూచిస్తోంది. అంతిమంగా, ఈ సమాజాల కదలికలు తీవ్రంగా ప్రభావితమై, శతాబ్దాలుగా వారు అనుసరిస్తున్న పద్ధతులను తిరిగి రూపొందించుకోవాల్సివస్తోంది.

" మా కష్టాలన్నీటి గురించి రాయండి" మేం బయలుదేరుతుంటే కారాభాయి అన్నారు. " చూద్దాం మీ రాతలు మా తలరాతల్నేమైనా మారుస్తాయేమో! లేకపోతే పైన దేవుడున్నాడు".

ఈ కథనాన్ని అందించడంలో సహాయపడ్డ అహ్మదాబాద్,భుజ్‌లలోని మాల్‌ధారీ రూరల్ యాక్షన్ గ్రూప్ ( MARAG) బృందానికి రచయిత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు .

వాతావరణ మార్పుల గురించి సాధారణ జనాల సజీవ అనుభవాల ద్వారా నివేదించే PARI చేస్తున్న పని UNDP సహకారంతో జరుగుతోంది .

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: వి. రాహుల్ జీ

نمیتا وائکر ایک مصنفہ، مترجم اور پاری کی منیجنگ ایڈیٹر ہیں۔ ان کا ناول، دی لانگ مارچ، ۲۰۱۸ میں شائع ہو چکا ہے۔

کے ذریعہ دیگر اسٹوریز نمیتا وائکر

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

کے ذریعہ دیگر اسٹوریز Rahulji Vittapu