మునవ్వర్ ఖాన్, 65, పోలీసు స్టేషన్‌కు చేరుకున్నప్పుడు లోపలి నుండి తన కుమారుడి నిస్సహాయత నిండిన మొత్తుకోళ్ళు వినిపించాయి. దాదాపు 15 నిమిషాల తర్వాత అవి ఆగిపోయాయి. పోలీసులు తన కుమారుడిని కొట్టడం ఆపేశారని ఇజ్రాయెల్ ఖాన్ తండ్రి అయిన మునవ్వర్ ఆశించారు.

అంతకు ముందు అదే రోజు ఇజ్రాయెల్ ఒక మతపరమైన సమావేశంలో పాల్గొని, భోపాల్ నుండి అక్కడికి 200 కిలోమీటర్ల దూరాన ఉన్న గునాలోని తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. గునాలో అతను నిర్మాణ స్థలాల్లో రోజువారీ కూలీగా పనిచేస్తాడు.

అతను ఆ సాయంత్రం (నవంబర్ 21, 2022) గునా చేరుకున్నాడు, కానీ ఇంటికి రాలేదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో, గోకుల్ సింగ్ కా చక్ బస్తీలోని అతని ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో, నలుగురు పోలీసు అధికారులు ఇజ్రాయెల్ ప్రయాణిస్తున్న ఆటోరిక్షాను ఆపి, అతనిని తీసుకుపోయారు.

నిజానికి, పోలీసులు అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఫోన్‌లో తన అత్తగారితో మాట్లాడుతున్నాడని అతని అక్క బానో (32) చెప్పారు. "అతను పోలీసు కస్టడీలో ఉన్న విషయం మాకు ఆ విధంగానే తెలిసింది."

అతడిని సమీపంలోని కుశ్‌మౌదా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక్కడే అతని తండ్రి మునవ్వర్‌, పోలీసు అధికారులు తన కొడుకును నిర్దాక్షిణ్యంగా కొడుతుంటే, అతను నొప్పితో అరవడాన్ని విన్నది.

దాదాపు 45 నిమిషాల తర్వాత, మునవ్వర్ తన కొడుకు నిస్సహాయంగా అరచిన అరుపులు ఆగిపోయింది పోలీసులు కొట్టడం ఆపడం వల్ల కాదని, వాళ్ళు కొట్టడం వల్ల అతను చనిపోవడంతో అరుపులు ఆగిపోయాయని గ్రహించారు. పోస్ట్‌మార్టంలో ఇజ్రాయెల్ కార్డియోరెస్పిరేటరీ వైఫల్యం, తలకు గాయం కారణంగా మరణించినట్లు తేలింది.

ఆ తర్వాత, కొంతమంది ఒక జూదగాడిని రక్షించడానికి ప్రయత్నించి పోలీసులతో ఘర్షణకు దిగారని, వాళ్ళలో ఒకడైన 30 ఏళ్ళ ముస్లిమ్ కార్మికుడిని తాము అదుపులోకి తీసుకున్నామని, పోలీసులు చెప్పినట్టుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

కానీ అతని కుటుంబం దానిని ఒప్పుకోవడం లేదు: "అతను ముస్లిమ్ అయినందు వల్లే అతన్ని తీసుకువెళ్ళారు," అని ఇజ్రాయెల్ తల్లి మున్నీ బాయి చెప్పారు.

ఇజ్రాయెల్ పోలీసు కస్టడీలో మరణించాడన్న వాస్తవంలో వివాదమేమీ లేదు. అతను ఎలా చనిపోయాడన్నదే వివాదాస్పదం.

Munni Bai lost her son Israel when he was taken into police custody and beaten up; a few hours later he died due to the injuries. ' He was picked up because he was a Muslim', she says, sitting in their home in Guna district of Madhya Pradesh
PHOTO • Parth M.N.

పోలీసులు కస్టడీలోకి తీసుకుని కొట్టినందువల్ల మున్నీ బాయి తన కొడుకు ఇజ్రాయెల్‌ను కోల్పోయారు; కొన్ని గంటల తర్వాత అతను ఆ గాయాల కారణంగా మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలోని తమ ఇంట్లో కూర్చొనివున్న ఆమె, 'అతను ముస్లిమ్ కాబట్టే అతన్ని ఎత్తుకెళ్ళారు,' అని చెప్పారు

గునాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అశోక్ నగర్ వద్ద రైల్వే ట్రాక్‌పై పడిపోవడంతో గాయపడిన ఇజ్రాయెల్‌ పోలీసు స్టేషన్‌కు వచ్చాడనీ, పోలీసు కస్టడీలో మరణించాడనీ గునా పోలీసు సూపరింటెండెంట్ రాకేశ్ సాగర్ చెప్పారు. "దీనితో సంబంధం ఉన్న నలుగురు కానిస్టేబుళ్ళను ప్రస్తుతం సస్పెండ్ చేశాం," అని ఆయన చెప్పారు. “వాళ్ళపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించాం. కానీ వాళ్ళ తప్పేమీ లేదని తేలింది. తర్వాత ఏం చేయాలన్నది మా ప్రాసిక్యూషన్ డిపార్టుమెంట్ నిర్ణయిస్తుంది."

ఆ దురదృష్టకరమైన రాత్రి, ఇజ్రాయెల్‌ను కంటోన్మెంట్‌లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళినట్లు కుశ్‌మౌదా పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు మునవ్వర్‌కు చెప్పారు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ఆరోగ్యం క్షీణించిందని, దాంతో అతన్ని జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్ళామని చెప్పారు. "దీనిలో ఏదో మతలబు ఉందని మాకు అనిపించింది," అని బానో చెప్పారు. "మా నాన్న ఆసుపత్రికి వెళ్ళేటప్పటికే, ఇజ్రాయెల్ చనిపోయాడు. అతని శరీరమంతా గాయాలు ఉన్నాయి. అతన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేశారు.”

ఇజ్రాయెల్ తల్లి మున్నీబాయి ఆ బస్తీలో సామాన్యంగా ఉన్న తమ ఒంటి గది ఇంటిలో కూర్చుని ఈ సంభాషణను వింటూ, తన కన్నీళ్ళను దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మూడు, నాలుగు చిన్న కాంక్రీట్ గదులున్న ఆ ఇంటిలో వాళ్ళ ఇల్లు కూడా ఒకటి. ఆ గేటు ఉన్న ఇంటి ఆవరణ లోపల ఆ ఇంటిలో నివసించే వాళ్ళందరికీ కలిపి రెండు మరుగుదొడ్లు ఉన్నాయి.

చాలాసేపటి తర్వాత మున్నీ బాయికి నోరు పెగిలింది. మాట్లాడటానికి ప్రయత్నించిన ప్రతిసారీ, దుఃఖం కారణంగా ఆమె గొంతు పూడుకుపోయింది. కానీ ఆమె తన అభిప్రాయాన్ని ఎలాగైనా చెప్పి తీరాలనుకున్నారు. "ఈ రోజుల్లో ముస్లిమ్‌లను లక్ష్యంగా చేసుకోవడం చాలా సులభమైపోయింది," అని ఆమె అన్నారు. “ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, మేం ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయాం. మమ్మల్ని చంపేసినా ఎవరూ మాట్లాడే ధైర్యం చేయరు.”

ఏప్రిల్ 2020 నుండి మార్చి 2022 మధ్య భారతదేశంలో 4,484 కస్టడీ మరణాలు సంభవించాయని జూలై 2022లో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలిపింది - అంటే రెండేళ్ళలో రోజుకు ఆరు మరణాల కంటే ఎక్కువ.

ఈ కస్టడీ మరణాలు మధ్యప్రదేశ్‌లో 364 నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఈ రకమైన మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి.

Bano, Israels Khan's sister says his family is struggling as their main income from his daily wage work has ended with his death
PHOTO • Parth M.N.

సోదరుని కూలీ డబ్బు ద్వారా వచ్చే ముఖ్య ఆదాయం అతని మరణంతో ఆగిపోవడంతో, తమ కుటుంబం కష్టాలను ఎదుర్కొంటోందని ఇజ్రాయెల్ ఖాన్ సోదరి బానో చెప్పారు

"పోలీసు కస్టడీలో మరణించేవారిలో ఎక్కువ మంది అట్టడుగు వర్గాలు లేదా మైనారిటీలకు చెందినవారు," అని గునాకు చెందిన కార్యకర్త విష్ణు శర్మ చెప్పారు. "వారు ఆర్థికంగా చాలా కష్టాలలో ఉంటారు, వాళ్ళ కోసం పోరాడేందుకు ఏ సంస్థా లేదు. మనం వారిపట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నామంటే, అది నేరం."

ఇజ్రాయెల్ రోజువారీ వేతనం రూ. 350ను ఇంటికి తెచ్చేవాడు. నెలంతా మంచిగా పని దొరికితే అతను సుమారు రూ. 4,000-5,000 సంపాదించేవాడు. ఆ సంపాదనతోనే కుటుంబం జీవించేది. అతనికి భార్య రీనా(30), 12, 7, 6 సంవత్సరాల వయసున్న ముగ్గురు కుమార్తెలు, సంవత్సరం వయసున్న కొడుకు ఉన్నారు. “పోలీసులు తాము చేసే పనుల పర్యవసానాలను అర్థం చేసుకోవాలి. ఎలాంటి కారణం లేకుండా వారు మొత్తం కుటుంబాన్ని నాశనం చేశారు,” అన్నారు బానో.

సెప్టెంబర్ 2023 చివరి వారంలో నేను ఆ కుటుంబాన్ని సందర్శించినప్పుడు, రీనా తన పిల్లలతో కలిసి గునా నగర శివార్లలో నివసించే తన తల్లిదండ్రుల వద్ద ఉంది. "ఆమె ఇక్కడికీ అక్కడికీ తిరుగుతూ ఉంటుంది," చెప్పారు బానో. “ఆమె చాలా బాధను అనుభవిస్తోంది. మేం ఆమెకు వీలైనంత సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఆమె ఇక్కడికి ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, పోవచ్చు. ఇదీ ఆమె ఇల్లే. అదీ ఆమె ఇల్లే."

రీనా కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రమే. వాళ్ళు ఆమెను, ఆమె కుటుంబాన్ని పోషించలేరు. తండ్రి మరణించినప్పటి నుండి రీనా కుమార్తెలు పాఠశాలకు వెళ్ళడంలేదు. "మేం ఇకపై పాఠశాల యూనిఫామ్, బ్యాగులు, నోట్‌బుక్‌లకు డబ్బు చెల్లించలేం" అని పిల్లల మేనత్త బానో చెప్పారు. “పిల్లలు నిరాశలో ఉన్నారు, ముఖ్యంగా 12 సంవత్సరాల వయసున్న మెహెక్. తను ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేది, కానీ ఇప్పుడసలు నోరు విప్పడం లేదు."

1997 నుండి భారతదేశం హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి కూటమి లో సభ్యదేశంగా ఉంది. కానీ దానికి వ్యతిరేకంగా చట్టం చేయడంలో మాత్రం విఫలమైంది. ఏప్రిల్ 2010లో, అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చిత్రహింసల నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది, అయితే అది ఇంతవరకూ చట్టరూపం దాల్చలేదు. కస్టడీలో విచారణలో ఉన్నవారిని హింసించడం భారతదేశంలో ఒక ఆనవాయితీగా మారింది. దీని వల్ల ముస్లిమ్‌లు, దళితులు, ఆదివాసీల వంటి అట్టడుగు వర్గాలకు చెందినవారు ఎక్కువగా బాధపడుతున్నారు.

Intaaz Bai, Israel’s grandmother in front of their home in Gokul Singh Ka Chak, a basti in Guna district
PHOTO • Parth M.N.

గునా జిల్లా, గోకుల్ సింగ్ కా చక్‌ బస్తీలోని తమ ఇంటి ముందు ఇజ్రాయెల్ అమ్మమ్మ ఇంతాజ్ బాయి

ఉదాహరణకు ఖర్‌గోన్ జిల్లాలోని ఖైర్‌ కుండీ గ్రామానికి చెందిన ఒక చిన్న ఆదివాసీ రైతు, కూలీ అయిన బిసన్(35) విషయమే తీసుకుంటే, ఆగస్టు 2021లో రూ. 29,000 దొంగలించాడనే అనుమానంతో పోలీసులు అతన్ని పట్టుకుని దారుణంగా హింసించారు.

మూడు రోజుల తర్వాత, భిల్ ఆదివాసీ అయిన బిసన్‌ను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినప్పుడు అతను చాలా నొప్పితో ఉన్నాడని, వేరేవాళ్ళ సహాయం లేకుండా నిటారుగా నిలబడలేకపోయాడని ఆ కేసులో పోరాడుతున్న కార్యకర్తలు చెప్పారు. అయినా, అతన్ని పోలీసు కస్టడీకి తరలించారు. అయితే అతను గాయాలతో ఉన్నందున జైలు అధికారులు అతన్ని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు.

నాలుగు గంటల తర్వాత అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సివచ్చింది. అక్కడికి చేరుకునే లోపే అతను మృతి చెందాడని ప్రకటించారు. పోస్ట్ మార్టమ్ నివేదికలో, శరీరం నిండా ఉన్న గాయాలకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ అయిన కారణంగా కలిగిన సెప్టిసీమిక్ షాక్ వలన అతను మరణించినట్టు పేర్కొన్నారు.

బిసన్‌కు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు - వాళ్లలో చిన్నపిల్లాడి వయస్సు ఏడు సంవత్సరాలు.

రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ - జాగృత్ ఆదివాసీ దళిత్ సంఘటన్ (JADS) - బిసన్ కేసును చేపట్టి, మధ్యప్రదేశ్ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

“మీరు అతన్ని కేవలం రూ. 29,000 దొంగలించాడని చనిపోయేంత వరకు హింసిస్తారా?" అని జెఎడిఎస్‌ నేత మాధురీకృష్ణస్వామి ప్రశ్నించారు. “కేసును ఉపసంహరించుకోవాలని బిసన్ కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు, అయితే మేం దానిపై స్వంతంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఎన్‌హెచ్‌ఆర్‌సి నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు పాటించడంలేదు."

జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మార్గదర్శకాల ప్రకారం, “సంఘటన జరిగిన రెండు నెలల్లోపు పోస్టుమార్టం, వీడియోగ్రాఫ్, మెజిస్టీరియల్ విచారణ నివేదికతో సహా అన్ని నివేదికలను పంపాలి. కస్టడీ మరణానికి సంబంధించిన ప్రతి కేసులో, కమిషన్ నిర్దేశించిన విధంగా మేజిస్ట్రియల్ విచారణ కూడా జరగాలి; వీలైనంత త్వరగా, రెండు నెలల గడువులోపు, ఈ నివేదిక కూడా అందుబాటులో ఉండేలా దానిని పూర్తిచేయాలి.’’

ఇజ్రాయెల్ చనిపోయినప్పుడు, పోస్ట్ మార్టం నివేదికను వారికి ఇవ్వకుండానే అతన్ని ఖననం చేయాలని పోలీసులు అతని కుటుంబాన్ని ఒత్తిడి చేశారు. అప్పటి నుండి దాదాపు ఒక సంవత్సరం గడిచింది, కానీ అతని కుటుంబానికి ఇప్పటికీ మేజిస్ట్రియల్ విచారణ ఫలితం గురించి తెలియదు.

Munni Bai says, 'the atmosphere is such that we (Muslims) are reduced to second-class citizens. We can be killed and nobody will bother to speak up'
PHOTO • Parth M.N.

'ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మేం (ముస్లిమ్‌లు) రెండవ తరగతి పౌరులుగా మిగిలిపోయాం. మమ్మల్ని చంపినా, ఎవరూ మాట్లాడే ధైర్యం చేయరు,' అంటారు మున్నీ బాయి

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. ఇజ్రాయెల్ కుటుంబం తనను కలవడానికి ప్రయత్నించినప్పుడు ఆ జిల్లా కలెక్టర్ వాళ్ళను మొరటుగా వెళ్ళగొట్టారని బానో చెప్పారు. “అందరూ మా గురించి మర్చిపోయారు. న్యాయం జరుగుతుందనే ఆశను కూడా వదులుకున్నాం."

కుటుంబానికి ప్రధాన జీవనాధారం పోవడంతో, వృద్ధలైన తల్లిదండ్రులు తిరిగి పనిచేయాల్సి వచ్చింది.

మున్నీ బాయి పొరుగువాళ్ళ గేదెల పాలు పితికే పని చేస్తున్నారు. ఆమె తన చిన్న ఇంటి వరండాలోకి పశువులను తీసుకువచ్చి, ఒక్కొక్కటిగా వాటి పాలు పితుకుతారు. అన్నీ అయ్యాక, ఆమె పశువులను పాలతో సహా వాటి యజమానికి తిరిగి ఇస్తారు. దీనికి ఆమెకు రోజుకు రూ. 100 ఇస్తారు. "ఈ వయస్సులో నేను చేయగలిగింది ఇంతే," అని ఆమె చెప్పారు.

మునవ్వర్ వయసు అరవై పైబడింది. ఆయన బక్కగా, బలహీనంగా ఉండి, కీళ్ళనొప్పులతో బాధపడుతున్నా, మళ్ళీ కూలి పనికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన తాను పనిచేసే నిర్మాణ స్థలాల వద్ద ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడుతుంటారు, దాంతో చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటారు. ఆయన తన బస్తీ నుండి ఎక్కువ దూరం ప్రయాణించలేరు, అందుకని ఐదు లేదా 10 కి.మీ పరిధిలో పని కోసం వెతుక్కుంటారు, తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఆయనను చేరుకోవడానికి కుటుంబాని వీలుగా ఉంటుంది.

కుటుంబ పోషణకే కష్టంగా ఉండడంతో కేసును కొనసాగించడం వాళ్ళకు మరింత కష్టంగా మారింది. "లాయర్లు డబ్బు అడుగుతారు," అని బానో చెప్పారు. “మా తిండి జరుపుకోవడానికే మేం ఇబ్బంది పడుతున్నాం. లాయర్లకు ఎక్కడ నుండి తెచ్చి చెల్లిస్తాం? యహాఁ ఇన్సాఫ్ కే పైసే లగ్తే హై [భారతదేశంలో న్యాయం చాలా ఖరీదైనది].”

అనువాదం: రవికృష్ణ

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna