అశోక్ జాటవ్ అటువంటి ఒక నడుస్తున్న మృతుడు.

ఈ 45 ఏళ్ళ వ్యక్తి అందరిలాగే ప్రతి రోజూ ఉదయాన్నే నిద్ర లేస్తారు. మిగతా కూలీల్లాగే పనికి వెళ్ళి ఇతరుల పొలాల్లో కూలీ పని చేస్తారు. మిగతా పనివాళ్ళందరి మాదిరిగానే రోజుంతా పని చేసిన తర్వాత సాయంత్రం ఇంటికి తిరిగి వస్తారు. అతనికి, మిగిలిన వాళ్ళకు మధ్య ఒకే ఒక తేడా ఉంది: అధికారికంగా, అశోక్ మరణించారు.

జూలై 2023లో, ఖోర్‌గర్‌ నివాసి అశోక్ తనకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద వస్తున్న రూ. 6,000 గత రెండేళ్ళకు పైగా రావడంలేదని గుర్తించారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం, రైతులు ఈ పథకం కింద కనీస ఆదాయ మద్దతుగా సంవత్సరానికి రూ. 6,000 పొందడానికి అర్హులు.

మొదటి రెండు సంవత్సరాలు క్రమం తప్పకుండా డబ్బు జమ అయింది. తర్వాత అకస్మాత్తుగా అది ఆగిపోయింది. అది కేవలం వ్యవస్థలో వచ్చిన అవాంతరమై ఉంటుందని, మళ్ళీ పరిస్థితి చక్కబడుతుందని అతను భావించారు. అశోక్ అనుకున్నది నిజమే. అదొక చిన్న అవాంతరమే. కానీ అతను ఊహించినది మాత్రం కాదు.

చెల్లింపు ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవడానికి అతను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినప్పుడు, కంప్యూటర్ ముందున్న వ్యక్తి డేటాను చూసి, అశోక్ 2021లో కోవిడ్-19 సమయంలో మరణించాడని ప్రశాంతంగా తెలియజేశాడు. నవ్వాలో ఏడవాలో తెలియని అశోక్ ఇలా అన్నారు, “ ముఝే సమజ్ నహీ ఆయా ఇస్‌పే క్యా బోలూఁ (ఏం చెప్పాలో నాకు తెలీలేదు).”

Ashok Jatav, a farm labourer from Khorghar, Madhya Pradesh was falsely declared dead and stopped receiving the Pradhan Mantri Kisan Samman Nidhi . Multiple attempts at rectifying the error have all been futile
PHOTO • Parth M.N.

మధ్యప్రదేశ్‌లోని ఖోర్‌ఘర్‌కు చెందిన వ్యవసాయ కూలీ అశోక్ జాటవ్ చనిపోయినట్లు తప్పుగా ప్రకటించి, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ఆపేశారు. లోపాన్ని సరిదిద్దడానికి అనేకసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు

మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల జాబితాలోని జాటవ్ వర్గానికి చెందిన అశోక్ కూలి పనులు చేసి జీవనం సాగిస్తుంటారు. ఇతరుల వ్యవసాయ భూములలో పని చేసి, రోజుకు రూ. 350 సంపాదించే అశోక్‌కు సొంతానికి ఒక ఎకరం భూమి ఉంది. దానిలో అతను తన ఇంటి అవసరాల కోసం ఆహార పంటలు పండిస్తున్నారు. అతని భార్య లీల కూడా వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటారు.

శివ్‌పురి జిల్లాలోని తన గ్రామంలోని ఒక వ్యవసాయ భూమిలో సోయాచిక్కుళ్ళ కోతపని చేస్తోన్న అశోక్ పని మధ్యలో విరామం తీసుకుంటూ, "మేం పగలు సంపాదిస్తేనే రాత్రికి తింటాం," అన్నారు. “సంవత్సరానికి రూ.6,000 అంటే పెద్ద ఎక్కువేమీ కాకపోవచ్చు. కానీ మాకు అది ఎంత డబ్బైనా చాలా అవసరం. నాకు 15 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. అతను పాఠశాలలో చదువుకుంటున్నాడు, పెద్ద చదువులు చదవాలని వాడి ఆశ. ఇంకో ముఖ్యమైన సంగతి ఏంటంటే, నాకెంతమాత్రం చనిపోవాలని లేదు."

తన మరణ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని అశోక్ స్వయంగా శివ్‌పురి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత గ్రామంలో జరిగిన బహిరంగ విచారణలో, గ్రామ పంచాయతీకి వెళ్ళి తన సమస్యను లేవనెత్తారు కూడా. దాని వల్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆయన ఆశించారు. విచారణ తర్వాత పంచాయతీ అధికారులు అతన్ని కలుసుకొని, అతను బతికే ఉన్నాడని నిరూపించుకోవాలని కోరారు."నేను వాళ్ళ ఎదురుగా నిలబడివున్నాను. వాళ్ళకు అంతకంటే రుజువు ఏం కావాలి?" అన్నారు అశోక్ ఆశ్చర్యపోతూ.

ఈ అసాధారణమైన, బాధాకరమైన పరిస్థితిలో చిక్కుకున్నది అశోక్ ఒక్కరు మాత్రమే కాదు.

Ashok was asked by the officials to prove that he is alive. ‘I stood in front of them,' he says, bewildered , 'what more proof do they need?’
PHOTO • Parth M.N.

తాను బతికే ఉన్నాడని నిరూపించుకోవాలని అధికారులు అశోక్‌ను కోరారు. ‘నేను వాళ్ళ ఎదురుగా నిలబడివున్నాను. వాళ్ళకు అంతకంటే రుజువు ఏం కావాలి?' అన్నారు అశోక్ ఆశ్చర్యపోతూ

గ్రామ పంచాయతీకీ జిల్లాపరిషత్‌కూ మధ్య పనిచేసే స్థానిక సంస్థ అయిన బ్లాక్ పంచాయితీ సిఇఒ, కంప్యూటర్ ఆపరేటర్‌లు కలిసి 2019- 2022 సంవత్సరాల మధ్య ఒక భారీ మోసానికి పాల్పడ్డారు. వాళ్ళు శివ్‌పురి జిల్లాలోని 12-15 గ్రామాలకు చెందిన 26 మందిని కాగితాలపై చంపేశారు.

ముఖ్యమంత్రి సంబల్ యోజన ప్రకారం, ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 లక్షల పరిహారం అందిస్తుంది. ఆ మోసగాళ్ళు ఆ 26 మందికి చెందిన మొత్తాన్ని క్లెయిమ్ చేసి, రూ. 1 కోటికి పైగా డబ్బును తమ జేబుల్లో వేసుకున్నారు. పోలీసులు సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి, భారతీయ శిక్షాస్మృతి క్రింద మోసం, ఫోర్జరీకి సంబంధించిన 420, 467, 468, 409 సెక్షన్ల కింద వారి మీద అభియోగాలు మోపారు.

"మేం గగన్ వాజ్‌పేయి, రాజీవ్ మిశ్రా, శైలేంద్ర పర్మా, సాధనా చౌహాన్, లతా దూబేల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాం" అని శివ్‌పురి పోలీస్ స్టేషన్ పట్టణ ఇన్‌స్పెక్టర్ వినయ్ యాదవ్ చెప్పాడు. "మేం మరిన్ని ఆధారాల కోసం వెదుకుతున్నాం."

పేరు చెప్పడానికి ఇష్టపడని స్థానిక జర్నలిస్టులు, త్వరలో తేలబోయే పరిశోధనలో శివ్‌పురిలో మరింత మంది మరణించిన వ్యక్తుల పేర్లు వెల్లడి కావచ్చని భావిస్తున్నారు; న్యాయ విచారణ నిష్పక్షపాతంగా జరిగితే పెద్ద చేపలు బయట పడతాయని వారంటున్నారు.

ఈలోగా, చనిపోయినట్లు చెబుతున్నవారు తదుపరి పరిణామాలను ఎదుర్కొంటున్నారు.

Dataram Jatav, another victim of the scam, says, ‘when you declare me dead, I lose access to all credit systems available to me’. In December 2022, the farmer from Khorgar could not get a loan from the bank to buy a tractor
PHOTO • Parth M.N.

ఈ మోసానికి గురైన మరో బాధితుడు దాతారామ్ జాటవ్, 'నేను చనిపోయినట్లు ప్రకటిస్తే, నాకు అందుబాటులో ఉండే అన్ని రుణ వ్యవస్థలూ నాకు దూరమైనట్లే' అన్నారు. డిసెంబర్ 2022లో, ఖోర్‌ఘర్‌కు చెందిన ఈ రైతు ట్రాక్టర్ కొనడానికి బ్యాంకు నుంచి రుణాన్ని పొందలేకపోయారు

ఖోర్‌ఘర్‌లో ఐదెకరాల భూమి ఉన్న రైతు దాతారామ్ జాటవ్‌కు (45) అదే కారణంతో ట్రాక్టర్ రుణాన్ని తిరస్కరించారు. డిసెంబర్ 2022లో, ట్రాక్టర్‌ని కొనడానికి అతనికి డబ్బు అవసరమై బ్యాంకుకు వెళ్లారు - అది చాలా సులభంగా జరిగిపోయే ప్రక్రియ. లేదా అలా అని అతను అనుకున్నారు. "కానీ మరణిస్తే రుణం దొరకడం కష్టమని తెలిసింది," అంటూ దాతారామ్ నవ్వారు. "ఎందుకా అని నేను ఆశ్చర్యపోతున్నాను."

ఒక రైతుకు ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు, సబ్సిడీ రుణాలు జీవనరేఖ వంటివని దాతారామ్ వివరించారు. "నా పేరు మీద చాలా ఎక్కువ అప్పు ఉంది," అప్పు మొత్తం ఎంతో చెప్పకుండా అన్నారతను. “నేను మరణించినట్లు ప్రకటిస్తే, నాకు అందుబాటులో ఉన్న అన్ని రుణ వ్యవస్థలూ దూరమైనట్లే. నా వ్యవసాయ భూమిలో పంట వేయడానికి నాకు పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? నేను పంట రుణాల్ని ఎలా పొందాలి? ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లడం తప్ప నాకు వేరే మార్గం లేదు,” అని అతను చెప్పారు.

ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు లేదా అప్పులిచ్చే జలగలకు కాగితాలతో పని లేదు. నిజానికి, మీరు చనిపోయినా వాళ్ళు పట్టించుకోరు, కానీ వాళ్ళకు కావాల్సిందల్లా తమ అసలు మీద అధిక వడ్డీ రేట్లు మాత్రమే. ఇది నెలకు 4-8 శాతం వరకు ఉంటుంది. రైతులు ఒకసారి వీళ్ళ వద్ద అప్పు తీసుకుంటే, చాలా తరచుగా, కొన్నేళ్ళ పాటు వడ్డీని తిరిగి చెల్లిస్తూనే ఉంటారు. కానీ అసలు మొత్తం మాత్రం అలాగే ఉంటుంది. అందువల్ల, చిన్న రుణం కూడా వారి మెడ చుట్టూ పెద్ద గుదిబండగా మారుతుంది.

"నేను తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాను," అన్నారు దాతారామ్. "నాకు ఇద్దరు కొడుకులు. వాళ్ళల్లో ఒకరు బి.ఇడి., మరొకరు బిఎ చదువుతున్నారు. నేను వాళ్లకు చదువు చెప్పించాలనుకుంటున్నాను. కానీ ఈ మోసం కారణంగా, నేనొక తప్పుడు నిర్ణయం తీసుకోవలసి వచ్చింది, అది నా మొత్తం ఆర్థిక పరిస్థితిని తారుమారుచేసింది.’’

Left: Ramkumari with her grandchild in their house in Khorghar and (right) outside her home. Her son Hemant was a victim of the fraud. While they did not suffer financial losses, the rumour mills in the village claimed they had declared Hemant dead on purpose to receive the compensation. ' I was disturbed by this gossip,' says Ramkumari, 'I can’t even think of doing that to my own son'
PHOTO • Parth M.N.
Left: Ramkumari with her grandchild in their house in Khorghar and (right) outside her home. Her son Hemant was a victim of the fraud. While they did not suffer financial losses, the rumour mills in the village claimed they had declared Hemant dead on purpose to receive the compensation. ' I was disturbed by this gossip,' says Ramkumari, 'I can’t even think of doing that to my own son'
PHOTO • Parth M.N.

ఎడమ: ఖోర్‌ఘర్‌లోని తన ఇంట్లో మనవడితో రామ్‌కుమారి, తన ఇంటి బయట (కుడి). ఆమె కుమారుడు హేమంత్ ఈ మోసంలో ఒక పావుగా మారాడు. దీనితో వాళ్ళు ఆర్థికంగా నష్టపోకున్నా, పరిహారం కోసం వాళ్ళు ఉద్దేశపూర్వకంగా హేమంత్‌ చనిపోయినట్లు ప్రకటించారని గ్రామంలో పుకార్లు వ్యాపించాయి. 'ఈ పుకార్లతో నేను మనశ్శాంతిని కోల్పోయాను' అన్నారు రామ్‌కుమారి, 'నా స్వంత కొడుక్కు అలా కావాలని నేను కలలో కూడా అనుకోను'

45 ఏళ్ళ రామ్‌కుమారి రావత్‌ ఎదుర్కొన్న పరిణామాలు భిన్నమైనవి. మోసానికి గురైనవారిలో ఆమె కుమారుడు హేమంత్ (25) ఒకరు. అదృష్టవశాత్తూ, వారి 10 ఎకరాల వ్యవసాయ భూమి అతని తండ్రి పేరు మీద ఉండటంతో, ఆర్థికంగా ఎలాంటి పరిణామాలు జరగలేదు.

"కానీ ప్రజలు మా వెనుక మా గురించి మాట్లాడటం ప్రారంభించారు," ఖోర్‌ఘర్‌లోని తన ఇంటి వరండాలో మనవడిని ఊయలూపుతూ అన్నారు రామ్‌కుమారి. “రూ.4 లక్షల కోసం మేం మా కొడుకును ఉద్దేశపూర్వకంగా కాగితంపై హత్య చేశామని గ్రామంలో పుకార్లు వ్యాపించాయి. ఈ పుకారు వలన నేను చాలా కలతపడ్డాను. నా స్వంత కొడుకుకు అలా చేయాలనే ఊహ కూడా నాకెప్పుడూ రాలేదు,” అన్నారామె.

అలాంటి అసహ్యకరమైన పుకార్లను విని తట్టుకోవడానికి తనకు చాలా వారాలు పట్టిందని రామ్‌కుమారి చెప్పారు. ఆమె మానసిక ప్రశాంతత పూర్తిగా పటాపంచలైంది. "నాకు ఆందోళనగా, మనసంతా చికాకుగా ఉంటోంది," అన్నారు ఆమె. "మేం దీన్ని ఎలా సరిచేసి, ప్రజల నోళ్ళు ఎలా మూయించాలా అని నేను ఆలోచిస్తూనే ఉంటాను."

ఈ విషయాన్ని పరిశీలించాలని కోరుతూ సెప్టెంబరు మొదటి వారంలో రామ్‌కుమారి, హేమంత్‌లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక రాతపూర్వక దరఖాస్తును ఇచ్చారు. "నేను బతికే ఉన్నానని అతనితో చెప్పాను," అని హేమంత్ విషాదంగా నవ్వుతూ చెప్పాడు. "ఆ రకమైన దరఖాస్తుతో ఆ కార్యాలయంలోకి వెళ్ళడం వింతగా అనిపించింది. కానీ మేం చేయగలిగింది చేశాం. ఇంక మా చేతుల్లో ఏముంది? మేమేమీ తప్పు చేయలేదని మాకు తెలుసు. మా మనస్సాక్షి నిష్కల్మషంగా ఉంది,” అని అతను అన్నాడు.

అశోక్ కూడా తాను సజీవంగా ఉన్నానని నిరూపించుకునే పనిని వదిలేశారు. దినసరి కూలీగా పని వెతుక్కోవడం, కుటుంబానికి తిండి తెచ్చి పెట్టడమే అతని ప్రాధాన్యం. "ఇది పంట కాలం కాబట్టి క్రమం తప్పకుండా పని ఉంటుంది," అన్నారతను. "మిగతా సమయాల్లో పని ఎప్పుడో కానీ దొరకదు. కాబట్టి, నేను పని కోసం నగరానికి దగ్గరగా వెళ్ళాలి.’’

అతను వీలున్న ప్రతిసారీ వెళ్ళి అధికారులను కలుస్తుంటారు. ముఖ్యమంత్రి హెల్ప్ లైన్‌కు అనేకసార్లు కాల్ చేసినా ఫలితం లేకుండాపోయింది. కానీ అతను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తన రోజువారీ కూలీని పోగొట్టుకోలేరు. "అబ్ జబ్ వో ఠీక్ హోగా తబ్ హోగా [ఈ సమస్య పరిష్కారమైనప్పుడే పరిష్కారమౌతుంది]," అని అతను వ్యాకులతతో అన్నారు. అతను ఇప్పుడు గతంలో కంటే కష్టపడి పని చేస్తున్నారు. కానీ ఇప్పటికీ అతను చనిపోయిన వ్యక్తే!

అనువాదం: రవి కృష్ణ

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editors : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Editors : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna