సిద్దూ గావడే బడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు, తల్లితండ్రులు అతనికి 50 గొర్రెలను మేపమని ఇచ్చారు. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులలోని చాలామందికి లాగానే అతను కూడా తమ పూర్వీకుల వృత్తి అయిన గొర్రెలను కాయడాన్నే అనుసరించాలని అతని చిన్నతనంలోనే కుటుంబం భావించింది; ఆ విధంగా అతను ఎప్పటికీ బడికి వెళ్ళలేకపోయాడు. గావడే మహారాష్ట్రలో సంచార తెగగా గుర్తింపువున్న గొర్రెలను, మేకలను కాసే ధనగర్ సముదాయానికి చెందినవారు. వారు పశువులను మేపుతూ ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ సమయాన్నే తమ తమ ఇళ్ళ నుండి వందల కిలోమీటర్ల దూరాలలో గడుపుతుంటారు.

ఒక రోజు ఉత్తర కర్ణాటకలోని కారదగ గ్రామంలో ఉండే తన ఇంటికి వంద కిలోమీటర్ల దూరాన గొర్రెలను మేపుతుండగా, తనవంటి మరో గొర్రెల కాపరి దారంతో గుండ్రటి ఉచ్చులను తయారుచేయడాన్ని అతను చూశాడు. "నాకు అది అద్భుతంగా అనిపించింది." వృద్దుడైన ఆ ధనగర్ (గొర్రెల కాపరి) తెల్లటి నూలు దారాలను వాడి నేర్పుగా జాళీ (గుండ్రని సంచి)ని అల్లడాన్ని అయన గుర్తుతెచ్చుకున్నారు. సంచిని అల్లేకొద్దీ అది గోధుమ (వేరుశెనక్కాయల రంగు) రంగుకు మారుతూవచ్చింది.

అనుకోని ఆ పరిచయం ఆ అబ్బాయిని 74 ఏళ్ళకు పైగా తాను అనుసరించబోయే కళను నేర్చుకునే ప్రయాణానికి దారితీసింది.

జాళీ అనేది భుజానికి తగిలించుకునే ఒక సంచి. సుష్టమైన ఆకారంలో ఉండే ఈ సంచిని పత్తి దారాలను ఉపయోగించి చేతులతో అల్లుతారు. "దాదాపుగా ప్రతి ధనగర్ (గొర్రెలను మేపే) తన దూరప్రయాణానికి ఈ జాళీ ని తీసుకెళ్తారు," అంటారు సిద్దూ. "ఒక్కో సంచిలో కనీసం 10 భాకరీలు (జొన్న లేదా సజ్జ రొట్టెలు), ఒక జత దుస్తులు పడతాయి. చాలామంది ధనగర్లు తమలపాకులు, పొగాకు, చూనా (సున్నం) ని కూడా అందులో సర్దుకుంటారు."

జాళీ ని తయారుచేసేందుకు ఒక నిర్దిష్టమైన కొలత ఉంటుందనే వాస్తవం నుండి దాని తయారీకి నైపుణ్యం అవసరమవుతుంది. అయితే గొర్రెల కాపరులు అందుకు స్కేలును గానీ, వెర్నియర్ కాలిపర్స్‌ను గానీ ఉపయోగించరు. "అది అరచేతి పైన మరో నాలుగు వేళ్ళ పొడవు ఉండాలి," అంటారు సిద్దూ. ఆయన తయారుచేసే ఒక్కో జాళీ కనీసం పదేళ్ళ వరకు మన్నుతుంది. "అది వర్షంలో తడవకూడదు. అంతేకాక, ఎలుకలు దీన్ని కొరకటానికి ఇష్టపడతాయి కాబట్టి మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి."

Siddu Gavade, a Dhangar shepherd, learnt to weave jalis by watching another, older Dhangar. These days Siddu spends time farming; he quit the ancestral occupation of rearing sheep and goats a while ago
PHOTO • Sanket Jain
Siddu Gavade, a Dhangar shepherd, learnt to weave jalis by watching another, older Dhangar. These days Siddu spends time farming; he quit the ancestral occupation of rearing sheep and goats a while ago
PHOTO • Sanket Jain

ధనగర్ గొర్రెల కాపరి అయిన సిద్దూ గావడే, జాళీలను అల్లడాన్ని వృద్ధుడైన మరో ధనగర్ అల్లుతుండగా చూసి నేర్చుకున్నారు. ఈ మధ్యకాలంలో సిద్దూ వ్యవసాయం చేస్తూ గడుపుతున్నారు; ఆయన తన పూర్వీకుల వృత్తి అయిన గొర్రెల, మేకల పెంపకాన్ని కొంతకాలం క్రితం వదిలేశారు.

Siddu shows how he measures the jali using his palm and four fingers (left); he doesn't need a measure to get the dimensions right. A bag (right) that has been chewed by rodents
PHOTO • Sanket Jain
Siddu shows how he measures the jali using his palm and four fingers (left); he doesn't need a measure to get the dimensions right. A bag (right) that has been chewed by rodents
PHOTO • Sanket Jain

తన అరచేతినీ, నాలుగు వేళ్ళనూ ఉపయోగించి జాళీని ఎలా కొలుస్తారో చూపిస్తోన్న సిద్దూ (ఎడమ); కొలతలు సరిగా రావడానికి అతనికి కొలిచే సాధనాలు అవసరం లేదు. ఎలుకలు కొరికిన సంచి (కుడి)

ఈనాటికీ కారదగలో పత్తి దారంతో జాళీ తయారుచేయడం వచ్చిన రైతు సిద్దూ మాత్రమే. "కన్నడంలో దీనిని జాళగి అంటారు," అన్నారతను. కారదగ మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దుల్లోని బెళగావి జిల్లా చికోడి (చిక్కోడిగా కూడా పిలుస్తారు) తాలూకాకు దగ్గర్లో ఉంటుంది. 9000 మంది జనాభా ఉండే ఈ గ్రామంలో మరాఠీ, కన్నడ రెండు భాషలనూ మాట్లాడతారు.

చిన్నతనంలో సిద్దూ సుతి (నూలు దారం)ని తీసుకువచ్చే ట్రక్కుల కోసం ఎదురుచూస్తుండేవాడు. "గట్టిగా వీచే గాలులకు అటుగా వెళ్ళే ట్రక్కుల నుండి దారాలు పడిపోయేవి, నేను వాటిని ఏరుకునేవాడ్ని," అని ఆయన వివరించారు. ఆ దారాలతో ముడులు వేయటానికి ప్రయత్నిస్తూ ఆడుకునేవాడు. "నాకు ఈ కళను ఎవరూ నేర్పలేదు. ఒక మ్హాతార (వృద్ధ) ధనగర్‌ను చూసి నేర్చుకున్నాను."

మొదటి సంవత్సరంలో సిద్దూ దారాలను చుడుతూ, ముడులను వేయడానికి అదే పనిగా ప్రయత్నిస్తుండేవాడు. "చివరికి నా గొర్రెలతోనూ కుక్కతోనూ కలిసి వేల కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత ఈ క్లిష్టమైన కళను నేర్చుకున్నాను,” అని ఆయన చెప్పారు. "సమదూరమైన వృత్తాకార ఉచ్చులను వేస్తూ జాళీ పూర్తిగా తయారయ్యేవరకు ఆ ఆకారాన్ని నిలిపి ఉంచటం పైనే ఇక్కడ నైపుణ్యమంతా ఆధారపడి ఉంటుంది,” అని అల్లిక సూదులను వాడని ఈ హస్తకళాకారుడు చెప్పారు.

సన్నని దారంతో సరైన ముడులు రావు. అందుకని సిద్దూ చేసే మొదటి పని దారాన్ని మందంగా చేయడం. ఇలా చేయడానికి పెద్ద దారపు చుట్ట నుండి తీసిన దాదాపు 20 అడుగుల తెల్ల దారాన్ని వాడతారు. మరాఠీలో టకళీ లేదా భింగరీ గా పిలిచే సంప్రదాయక చెక్క పనిముట్టు చుట్టూ ఆయన ఈ దారాన్ని కడతారు. టకళీ ఒక పొడవైన చెక్క ఉపకరణం. 25 సెంటీమీటర్ల పొడవుతో, ఒకవైపు పుట్టగొడుగు ఆకారంలో వంపుతిరిగి, మరోవైపు సూటిగా ఉంటుంది.

తరువాత ఈ 50 సంవత్సరాల వయసున్న బాబుల్ (నల్లతుమ్మ చెక్క) టకళీ ని తన కుడి కాలు మీద పెట్టుకొని వేగంగా తిప్పుతారు. ఆ కదలికను ఆపకుండా, టకళీ ని ఎడమ చేతితో పైకి ఎత్తి పట్టుకుని దారాన్ని లాగడం మొదలుపెడతారు. "ఇది దారాన్ని మందంగా చేయడానికి వాడే సంప్రదాయక పద్ధతి," అని ఆయన చెప్పారు. 20 అడుగుల సన్నని దారాన్ని ఈ విధంగా చుట్టడానికి ఆయనకు సుమారుగా రెండు గంటల సమయం పడుతుంది.

సిద్దూ ఈ పద్ధతికి పరిమితమవ్వడానికి కారణం మందపాటి దారాన్ని కొనడం ఖర్చుతో కూడుకున్నదని ఆయన అంటారు. “ తీన్ పదరాచా కరావా లాగతోయ్ (దారాన్ని మూడు పోగులతో చేయాల్సి ఉంటుంది)." ఏమైనప్పటికీ, కాలికీ టకళీ కీ మధ్య కలిగే రాపిడి వల్ల గీచుకుపోవటం, వాపు కలుగుతాయి, “ మగ్ కాయ్ హోతయ్, దోన్ దివస్ ఆరామ్ కరాయ్‌చా (అయితే ఏమవుతుంది? ఒక రెండు రోజులు విశ్రాంతి తీసుకోవడమే)," నవ్వుతూ అంటారాయన.

Siddu uses cotton thread to make the jali . He wraps around 20 feet of thread around the wooden takli , which he rotates against his leg to effectively roll and thicken the thread. The repeated friction is abrasive and inflames the skin
PHOTO • Sanket Jain
Siddu uses cotton thread to make the jali . He wraps around 20 feet of thread around the wooden takli , which he rotates against his leg to effectively roll and thicken the thread. The repeated friction is abrasive and inflames the skin
PHOTO • Sanket Jain

జాళీ తయారీకి సిద్దూ పత్తి దారాన్ని వాడతారు. 20 అడుగుల దారాన్ని చెక్క టకళీకి చుట్టి, సరైన మందం గల దారాన్ని తయారుచేయడానికి తన కాలి మీద పేనుతారు. పదే పదే వొరుసుకుపోవడం వల్ల చర్మం గీచుకుపోయి వాపు వస్తుంది

There is a particular way to hold the takli and Siddu has mastered it over the years: 'In case it's not held properly, the thread doesn't become thick'
PHOTO • Sanket Jain

టకళీని పట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఒడుపు ఉంటుంది, సంవత్సరాలుగా సిద్దూ దానిలో ప్రావీణ్యం సంపాదించారు: 'ఒకవేళ సరిగ్గా పట్టుకోకపొతే దారం మందంగా అవదు’

టకళీ దొరకడం ఈమధ్య కష్టమైపోయిందంటారు సిద్దూ, "ఈ యువ వడ్రంగులకు దానిని తయారుచేయడం రాదు." 1970ల ప్రారంభంలో గ్రామ వడ్రంగి దగ్గర నుంచి ఎక్కువ ధర పెట్టి, 50 రూపాయలకు ఆయన టకళీ ని కొన్నారు - అప్పట్లో నాణ్యమైన కిలో బియ్యం కేవలం రూపాయికే దొరికేది.

జాళీ తయారీ కోసం ఆయన రెండు కిలోల పత్తి దారాన్ని కొంటారు. దారం సాంద్రతనూ, మందాన్నీ బట్టి అనేక అడుగుల దారాన్ని ఆయన చుడతారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని రెండాళ్ గ్రామంలో ఆయన పత్తి దారాన్ని కొనేవారు. "ఇప్పుడు దారం మా ఊరిలోనే, నాణ్యతను బట్టి కిలో 80-100 రూపాయలకు దొరుకుతోంది." అదే దారాన్ని 90ల చివరిలో తాను కిలోకి 20 రూపాయలు చెల్లించి, 2 కిలోలు కొనేవారని ఆయన గుర్తు చేసుకున్నారు.

జాళీలను తయారుచేసే కళ సంప్రదాయంగా మగవారి చేతులలోనే ఉండగా, చనిపోయిన తన భార్య మాయవ్వ తనకు దారాలను మందంగా చేసివ్వటంలో సహాయపడేదని ఆయన చెప్పారు. "తను చాలా నైపుణ్యమున్న కళాకారిణి,” అంటూ భార్యను గుర్తుచేసుకున్నారు సిద్దూ. మాయవ్వ 2016లో మూత్రపిండాల వైఫల్యంతో మృతి చెందారు. "ఆమెకు తప్పుగా చికిత్స చేశారు. ఆస్తమా చికిత్స కోసం మేం వెళ్ళాం, అందుకు ఇచ్చిన మందుల దుష్ప్రభావం ఎంత భాధాకరమైనదంటే, ఆమె మూత్రపిండం విఫలమైంది,” చెప్పారాయన.

చనిపోయిన తన భార్యతో సహా ఇక్కడి ఆడవాళ్ళు గొర్రెల బొచ్చు కత్తిరించటం, దాని నుండి ఉన్ని దారాలను తయారుచేయడంలో చాలా నైపుణ్యాన్ని సంపాదించారని సిద్దూ చెప్పారు. ధనగర్‌లు ఈ దారాలను గుంత మగ్గంపై - నేతకారులు తమ కాళ్ళతో పెడల్‌ను తొక్కుతూ నేసే మగ్గం. ఇది ఒక గుంతలో ఉంటుంది - ఘొంగడి (ఉన్ని దుప్పట్లు) నేసే సనగర్‌ లకు ఇస్తారు. అవసరాన్ని బట్టి, చేతిలో ఉన్న సమయాన్ని బట్టి సిద్దూ దారాలను మందంగా తయారుచేస్తారు. ఆ తరువాత అత్యంత కష్టమైన వేళ్ళతో అల్లే పనిని మొదలుపెడతారు. వేగంగా దారపు ఉచ్చులను ఒకదానితో ఒకటి కలిపి ఒక జారుముడి వేసి ముడులను కడతారు. ఒక సంచి కోసం సమానమైన దూరంలో ఉండేలా 25 నూలు ఉచ్చుల గొలుసును తయారుచేస్తారు.

PHOTO • Sanket Jain
Right: Every knot Siddu makes is equal in size. Even a slight error means the jali won't look as good.
PHOTO • Sanket Jain

ఎడమ: 50 ఏళ్ళ క్రితం బాబుల్ (నల్ల తుమ్మ) చెక్కతో తయారుచేసిన టకళీని కొనుగోలు చేసినప్పుడు, దాని ధర 50 కిలోల బియ్యంతో సమానంగా ఉండేది. ఈరోజు దీనిని తయారుచేసే వడ్రంగులెవ్వరూ లేరు. కుడి: సిద్దూ వేసే ప్రతి ముడి సమాన పరిమాణంలో ఉంటుంది. చిన్న తప్పు జరిగినా జాళీ అంత అందంగా కనిపించదు

"అన్నిటికన్నా కష్టమైన పని ఏదంటే అల్లిక మొదలుపెట్టటం, గుండ్రంగా ముడులు వేయడం.” గ్రామంలో ఇద్దరు ముగ్గురు ధనగర్‌లకు జాళీ తయారీ తెలిసినప్పటికీ, " జాళీ కి ఆధారంగా నిలబడే గుండ్రని అడుగు భాగాన్ని అల్లడానికి వాళ్ళు కష్టపడుతుంటారు. అందుకే వాళ్ళింక జాళీల ను అల్లటంలేదు," మాటలు జోడించారాయన.

ఆ గుండ్రని ఆకారాన్ని తయారుచేయడానికి సిద్దూ 14 గంటల వరకూ సమయం తీసుకుంటారు. "ఒకవేళ తప్పు చేస్తే, మొత్తం మరోసారి చేయాల్సి ఉంటుంది." రోజులో కనీసం మూడు గంటలు ఆ పని చేసే వీలు సిద్దూకు దొరికినట్లైతే, ఒక జాళీ తయారీకి కనీసం 20 రోజుల సమయం పడుతుంది. అయన 300 అడుగుల దారాన్ని, 60 గంటల్లో ప్రతి ముడిని సమానమైన కొలతల్లో వచ్చేటట్టు అల్లుతారు. ఇప్పుడు వ్యవసాయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతోన్న సిద్దూ, జాళీ తయారీకి సమయాన్ని కేటాయించుకుంటారు. గత ఏడు దశాబ్దాలుగా, చాలామంది ధనగర్‌ల కోసం, 6000 గంటలకు పైగా సమయాన్ని వెచ్చించి ఆయన 100 జాళీల వరకూ తయారుచేశారు.

సిద్దూను ప్రేమగా పట్‌కర్ మ్హాతార్ (తలపాగా చుట్టుకున్న వృద్ధుడు)గా కూడా పిలుస్తారు - అయన ప్రతి రోజూ తెల్లని పగడీ (తలపాగా)ని చుట్టుకుంటారు.

వయసు పైబడినప్పటికీ, మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా, పంఢర్‌పూర్‌లో జరిగే ప్రసిద్ధిచెందిన వారీ కోసం విఠోబా గుడికి 350 కిలోమీటర్ల దూరాన్ని సిద్దూ కాలినడనే వెళ్ళి వస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల నుండి భక్తులు ఆషాఢ (జూన్/జులై), కార్తీక (దీపావళి తరువాత, అక్టోబర్-నవంబర్) మాసాల్లో గుంపులుగా కాలినడకన ఇక్కడికి వస్తుంటారు. అభంగ్ అని పిలిచే ఆధ్యాత్మిక గీతాలను, తుకారామ్, జ్ఞానేశ్వర్, నామ్‌దేవ్ వంటివారి గీతాలను వారు పాడుతుంటారు.

"నేను వాహనంపై వెళ్ళను. విఠోబా ఆహే మాఝ్యాసోబత్. కహీహీ హోత్ నహీ (విఠోబా నాతోనే వున్నాడని, నాకు ఏమీ జరగదనీ నాకు తెలుసు)," అంటారు సిద్దూ. పంఢర్‌పూర్‌లోని విఠల్-రుక్మిణి గుడికి చేరుకోడానికి అతనికి 12 రోజులు పట్టింది; విశ్రాంతి కోసం ఆగినప్పుడు, ఉచ్చులు వేయడానికి పత్తి దారాన్ని తీస్తుంటారు.

మరణించిన సిద్దూ తండ్రి బాళూ కూడా జాళీలు తయారుచేస్తుండేవారు. ఇక జాళీ లను తయారుచేసే కళాకారులెవ్వరూ మిగలకపోవడంతో చాలామంది  ధనగర్లు బట్ట సంచులను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. "అల్లేందుకు పట్టే సమయాన్నీ వనరులనూ చూసుకుంటే, ఈ కళను కొనసాగించడం అంత గిట్టుబాటయ్యే పని కాదు," అంటారు సిద్దూ. అయన దారానికి రూ. 200 ఖర్చు చేస్తే, జాళీ ని రూ. 250-300కు అమ్ముతారు. " కహీహీ ఉపయోగ్ నహీ (దీనివల్ల ఉపయోగం లేదు)," అంటారాయన.

'The most difficult part is starting and making the loops in a circular form,' says Siddu. Making these loops requires a lot of patience and focus
PHOTO • Sanket Jain
'The most difficult part is starting and making the loops in a circular form,' says Siddu. Making these loops requires a lot of patience and focus
PHOTO • Sanket Jain

'అన్నిటికన్నా కష్టమైన భాగం అల్లిక మొదలుపెట్టి, గుండ్రని ఆకారంలో ఉచ్చులను అల్లడం,' అంటారు సిద్దూ. ఈ ఉచ్చులను వేయడానికి చాల సహనం, ఏకాగ్రత అవసరం

Left: After spending over seven decades mastering the art, Siddu is renowned for making symmetrical jalis and ensuring every loop and knot is of the same size.
PHOTO • Sanket Jain
Right: He shows the beginning stages of making a jali and the final object.
PHOTO • Sanket Jain

ఎడమ: ఈ కళలో నైపుణ్యం సాధించటానికి ఏడు దశాబ్దాలు గడిపిన తర్వాత, ప్రతి ఉచ్చు, ముడి సమానంగా ఉండేలా సౌష్టవమైన జాళీలను తయారుచేయడంలో సిద్దూ పేరుపొందారు. కుడి: జాళీ అల్లిక మొదటి దశల నుండి పూర్తిగా తయారైన జాళీని చూపిస్తోన్న సిద్దూ

అయనకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 50 ఏళ్ళు దాటిన మల్లప్ప, సుమారు 35 ఏళ్ళున్న కల్లప్ప. గొర్రెలను మేపడం మానేసిన ఈ ఇద్దరూ తమకున్న చెరో ఎకరం భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. 45 ఏళ్ళ బాళూ రైతు పని చేస్తూనే 50 గొర్రెలను మేపడానికి దూరప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అయన కూతురైన 30 ఏళ్ళ శాణా గృహిణి.

ఆయన కొడుకులెవ్వరూ ఈ నైపుణ్యాన్ని నేర్చుకోలేదు. " శికలీ బీ నాహీత్, త్యాఁనా జమత్ బీ నాహీ, ఆణి త్యాఁనీ డోస్క పణ్ ఘాత్లా నాహీ (వారు నేర్చుకోలేదు, ప్రయత్నించనూ లేదు, దాని మీద దృష్టిని కూడా పెట్టలేదు),” ఒక్క ఉదుటున అన్నారాయన. జనం చాలా జాగ్రత్తగా అతని పనిని చూస్తుంటారు, కానీ నేర్చుకోడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదని ఆయన చెప్పారు.

ఉచ్చు వేయడం చూడడానికి చాలా సులభంగా అనిపిస్తుంది కానీ అతి కష్టమైన సవాళ్ళతో కూడి ఉంటుంది, తరచుగా సిద్దూకు శారీరక ఒత్తిడిని కలిగిస్తుంటుంది. " హాతాలా ముంగ్యా యేతాత్ (సూదులతో పిన్నులతో గుచ్చుతున్నట్టుంటుంది)," అని చెప్పారు. అంతేకాక, ఈ పని వల్ల ఆయనకు నడుము నొప్పితో పాటు కళ్ళపై ఒత్తిడి కూడా పడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన రెండు కళ్ళకి కంటి శుక్లాల చికిత్స జరిగింది, ఇప్పుడాయన కళ్ళద్దాలను వాడుతున్నారు. పనిలో వేగం తగ్గినా, ఈ కళను సజీవంగా ఉంచాలన్న సంకల్పం మాత్రం ఆయనలో చెక్కుచెదరకుండా ఉంది.

గ్రాస్ అండ్ ఫోరేజ్ సైన్స్ జర్నల్‌లో భారతదేశ దాణా ఉత్పత్తి గురించి 2022 జనవరిలో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం లో పేర్కొన్నట్లుగా, భారతదేశంలో పచ్చి మేత కొరత తీవ్రంగా ఉంది. అంతే కాదు, ఇతర మేత పదార్థాలు, చివరకు ఎండు గడ్డి వంటి పంట అవశేషాలకు కూడా కొరత తీవ్రంగా ఉంది.

ఆయన గ్రామంలో ఇప్పుడు అతి కొద్దిమంది ధనగర్లు మాత్రమే మేకలనూ గొర్రెలనూ మేపుతుండటానికి గల కారణాల్లో మేత కొరత కూడా ఒకటి. "గత 5-7 సంవత్సరాల్లో, మేం చాలా గొర్రెల, మేకల మరణాలను చూశాం. రైతులు ప్రబలంగా వాడుతోన్న కలుపు మందులు, పురుగుమందుల వల్లే ఇలా జరిగింది,” చెప్పారాయన.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022-23లో కర్ణాటక రైతులు 1669 మెట్రిక్ టన్నుల రసాయనిక పురుగుమందులను వాడారు. ఇది  2018-19 సమయంలో వాడిన 1524 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ.

Left: Siddu's wife, the late Mayavva, had mastered the skill of shearing sheep and making woolen threads.
PHOTO • Sanket Jain
Right: Siddu spends time with his grandson in their house in Karadaga village, Belagavi.
PHOTO • Sanket Jain

ఎడమ: సిద్దూ భార్య, చనిపోయిన మాయవ్వ గొర్రెల బొచ్చును కత్తిరించడం, ఉన్ని దారాలను నేయడంలో చెయ్యితిరిగినవారు. కుడి: బెళగావిలోని కారదగ గ్రామంలో ఉన్న తన ఇంటిలో మనవడితో సమయం గడుపుతోన్న సిద్దూ

The shepherd proudly shows us the jali which took him about 60 hours to make.
PHOTO • Sanket Jain

తయారుచేయడానికి 60 గంటల సమయం పట్టిన జాళీని సగర్వంగా మాకు చూపిస్తోన్న గొర్రెల కాపరి

గొర్రెల పెంపకానికి ఖర్చు విపరీతంగా పెరిగిందని, ఇందులో కనిపించకుండా పెరుగుతున్నది వైద్యానికయ్యే ఖర్చు అని ఆయన అన్నారు. "గొర్రెలు, మేకలు పదే పదే జబ్బుపడుతుండడంతో ప్రతి సంవత్సరం పశువుల మందుల కోసం కనీసం 20,000 రూపాయలు ఖర్చు చేయాల్సివస్తోంది."

ప్రతి సంవత్సరం గొర్రెలకు ఆరు ఇంజెక్షన్లు (టీకాలు) ఇవ్వాలని కూడా ఆయన చెప్పారు. "గొర్రె బతికితేనే కొంతైనా డబ్బులు సంపాదించగలం." పైగా, ఆ ప్రాంతంలోని రైతులు ప్రతి అంగుళం భూమిలో చెరకును పండిస్తున్నారు. 2021-22లో భారతదేశం 500 మిలియన్ మెట్రిక్ టన్నుల చెరకును ఉత్పత్తి చేసి, ప్రపంచంలోనే అతి పెద్ద పంచదార ఉత్పత్తిదారుగాను, వినియోగదారుగాను నిలిచింది.

గొర్రెలను, మేకలను పెంచడాన్ని రెండు దశాబ్దాల క్రితమే మానేసిన సిద్దూ, తనకున్న 50కి పైగా పశువులను తన కొడుకులకు పంచిపెట్టారు. వర్షాకాలం ఆలస్యంగా రావటం వల్ల వ్యవసాయ చక్రం ఎలా దెబ్బతింటుందో కూడా ఆయన చెప్పారు. "ఈ సంవత్సరం, జూన్ నుండి జులై మధ్య వరకు నా మూడు ఎకరాల భూమి నీరు లేక ఖాళీగా ఉంది. నా పొరుగు రైతు సహాయం చేయటంతో, ఎలాగోలా వేరుశనగను పండించగలిగాను."

వడగాడ్పుల సంఖ్య పెరగడం, ఎడతెరపి లేని వర్షాల వల్ల వ్యవసాయం చేయడం సవాలుగా మారిందని ఆయన అన్నారు. "ఇంతకు మునుపు, తల్లితండ్రులు కొన్ని గొర్రెలను, మేకలను పిల్లలకు (భద్రత కోసం) ఇచ్చేవారు. ఇప్పుడు రోజులెంతగా మారాయంటే, ఉచితంగా ఇచ్చినా ఎవరూ వాటిని పెంచుకునేలా లేరు."

ఈ కథనం మృణాళిని ముఖేర్జీ ఫౌండేషన్ వారి సహకారంతో గ్రామీణ కళాకారుల పై సంకేత్ జైన్ చేస్తోన్న సిరీస్‌లో భాగం.

అనువాదం: మైత్రి సుధాకర్

Sanket Jain

Sanket Jain is a journalist based in Kolhapur, Maharashtra. He is a 2022 PARI Senior Fellow and a 2019 PARI Fellow.

Other stories by Sanket Jain
Editor : PARI Team
Photo Editor : Binaifer Bharucha

Binaifer Bharucha is a freelance photographer based in Mumbai, and Photo Editor at the People's Archive of Rural India.

Other stories by Binaifer Bharucha
Translator : Mythri Sudhakar

Mythri Sudhakar is currently pursuing her Masters in Psychology from the University of Delhi. She hails from Andhra Pradesh and is proud of her South Indian Dalit-Feminist Identity. She is an aspiring diplomat.

Other stories by Mythri Sudhakar