రామ్ అవతార్ కుశ్వాహా అహర్వానీలోకి ప్రవేశించగానే, ఆ బురద రోడ్డుపై విన్యాసాలను సాగించడానికి తన మోటార్ సైకిల్ వేగాన్ని తగ్గిస్తారు. ఎగుడుదిగుడుగా ఉండే ఆ పల్లె నడిబొడ్డుకు చేరగానే తన 150సిసి బైక్ ఇంజిన్‌ను ఆపేస్తారు.

ఒక్క ఐదు నిముషాలు గడిచేసరికే తప్పటడుగులవాళ్ళు, బడికి వెళ్తుండే పిల్లలు, టీనేజర్లు ఆయన చుట్టూ గుమిగూడటం మొదలుపెడతారు. ఈ సహరియా ఆదివాసీ పిల్లల బృందం తమలో తాము కబుర్లాడుకుంటూ, చిల్లర పైసలనూ, పది రూపాయల నోట్లనూ చేతుల్లో పట్టుకొని ఓపిగ్గా ఎదురుచూస్తుంటారు. వాళ్ళు వేయించిన నూడుల్స్, కూరగాయలతో తయారుచేసే ఒక ప్లేట్ చౌ మీన్‌ను కొనుక్కునేందుకు వేచివున్నారు.

ఇప్పుడు చక్కగా మర్యాదగా ప్రవర్తిస్తూన్న తన ఆకలిగొన్న ఖాతాదారులు కాసేపట్లో ప్రశాంతతను కోల్పోతారని ఎరిగివున్న మోటార్ బైక్ వ్యాపారి త్వరత్వరగా తాను తెచ్చిన సామగ్రిని బయటకు తీయటం మొదలెట్టారు. అవి ఏమంత ఎక్కువేమీ లేవు - అతను రెండు ప్లాస్టిక్ సీసాలను బయటకు తీశారు. "ఒకటి ఎర్ర సాస్ (చిల్లీ), రెండోది నల్లనిది (సోయా సాస్)," అని ఆయన వివరించారు. ఒక క్యాబేజీ, తొక్క ఒలిచిన ఉల్లిపాయ, పచ్చరంగు బుట్ట మిరపకాయ (క్యాప్సికమ్), ఉడికించిన నూడుల్స్- మిగిలిన వస్తువులు. "నేను నాక్కావాల్సిన సరుకులన్నీ విజయ్‌పుర్‌లో(పట్టణం) కొంటాను."

సాయంత్రం ఆరు గంటలు కావొస్తోంది, రామ్ అవతార్ ఈ రోజు సందర్శించిన నాలుగవ గ్రామమిది. తాను మామూలుగా వెళ్ళే పల్లెల, ఊర్ల పేర్లను - లడర్, పాండ్రి, ఖజూరి, కలాన్, శిల్పారా, పరొండ్ - అంటూ అయన వరసగా వల్లించారు. ఈ ఊర్లన్నీ విజయ్‌పుర్ తెహసిల్‌ లోని గోపాల్‌పురా గ్రామానికి ఆనుకొని ఉన్న సుతైపుర అనే పల్లె చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వ్యాసార్ధంలో ఉంటాయి. ఇది కాకుండా ఈ పల్లెల్లోనూ గ్రామాలలోనూ అందుబాటులో ఉండే చిరుతిండ్లు- ప్యాకెట్లలో లభించే చిప్సు, బిస్కత్తులూ మాత్రమే.

ఆదివాసులు ఎక్కువగావుండే 500 మంది జనాభా నివసించే ఈ అహర్వానీ అనే పల్లెకు ఆయన వారంలో కనీసం రెండుమూడుసార్లు వస్తారు. ఆహర్వానీ కొత్తగా ఏర్పడిన గ్రామం. ఇక్కడ నివసిస్తున్నవారంతా వారు ఉండే ప్రదేశాలను సింహాలకు రెండవ స్థిరనివాసంగా మార్చేందుకు 1999లో కూనో నేషనల్ పార్క్ నుండి పంపించివేసినవారు. చదవండి: కూనో: చిరుతల కోసం ఆదివాసుల స్థానభ్రంశం .సింహాలైతే రాలేదు కానీ, 2022 సెప్టెంబర్‌లో ఆఫ్రికా నుండి వచ్చిన చిరుతపులులను మాత్రం ఇక్కడకు తరలించారు.

Left: Ram Avatar making and selling vegetable noodles in Aharwani, a village in Sheopur district of Madhya Pradesh.
PHOTO • Priti David
Right: Aharwani resident and former school teacher, Kedar Adivasi's family were also moved out of Kuno National Park to make way for lions in 1999
PHOTO • Priti David

ఎడమ: మధ్యప్రదేశ్, శివ్‌పుర్ జిల్లాలోని అహర్వానీ గ్రామంలో కూరగాయల నూడుల్స్‌ను తయారుచేసి అమ్ముతోన్న రామ్ అవతార్. కుడి: అహర్వానీలో నివాసముండే మునుపటి పాఠశాల ఉపాధ్యాయుడు కేదార్ ఆదివాసీ కుటుంబం కూడా 1999లో సింహాలకు ఆవాసాన్ని కల్పించేందుకు కూనో నేషనల్ పార్క్ నుంచి బయటకు పంపించివేసినవారే

అక్కడ చుట్టూ నిల్చున్నవారిలో చాలమంది పిల్లలు తాము అహర్వానీలోనే ఉన్న స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్తామని చెప్పరు. కానీ పిల్లలు బడిలో చేరటమైతే చేరారు కానీ వారు నేర్చుకునేది పెద్దగా ఏమీ లేదని కేదార్ ఆదివాసీ అనే గ్రామవాసి చెప్పాడు. "ఉపాధ్యాయులు బడికి సక్రమంగా రారు, వచ్చినా వాళ్ళు చెప్పేదేమీ ఉండదు."

నిర్వాసిత సముదాయాలకు చెందిన పిల్లలకు అగరా గ్రామంలో ఆదర్శిలా శిక్షా సమితి అనే లాభాపేక్ష లేని సంస్థ నడుపుతోన్న పాఠశాలలో 23 ఏళ్ళ కేదార్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. "ఇక్కడ మాధ్యమిక పాఠశాలలో చదివి బయటకొచ్చిన విద్యార్థులు, ఇతర పాఠశాలలలో ముందుకు పోలేకపోతున్నారు. ఎందుకంటే, వీరికి చదవటం రాయటం వంటి కనీస విద్య కూడా కరవయింది," 2022లో PARIతో మాట్లాడుతూ అన్నాడు కేదార్.

సహరియా ఆదివాసులు మధ్యప్రదేశ్‌లో ప్రత్యేకించి దుర్బలమైన ఆదివాసీ సమూహం (పివిటిజి - Particularly Vulnerable Tribal Group) అనీ, వీరిలో అక్షరాస్యత రేటు 42 శాతం అనీ 2013లోని భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగల గణాంక ప్రొఫైల్ అనే ఈ నివేదిక పేర్కొంది.

అక్కడ చేరినవారు అస్థిమితంగా మారుతుండటంతో రామ్ అవతార్ మాతో మాటలు చాలించి తన వంటపై దృష్టిపెట్టారు. ఆయన ఒక కిరోసిన్ స్టవ్‌ను వెలిగించి, దానికే బిగించి ఉన్న ఒక 20 అంగుళాల వెడల్పున్న పెనం మీద సీసా నుంచి కొంత నూనెను పోశారు. కిందనున్న పెట్టెలోంచి నూడుల్స్‌ను బయటకు తీసి, పెనంలో ఉన్న వేడి నూనెలో వేసి వాటిని ఎగరేయటం (టాస్ చేయటం) మొదలుపెట్టారు.

ఆయన బైక్‌కున్న సీటు ఉల్లిపాయలనూ క్యాబేజీనీ తరగటానికి సౌకర్యంగా ఉంది. ఉల్లి ముక్కలను ఆ పెనంలోకి వేయటంతోనే వాటి కమ్మని పరిమళం గాలిని నింపేసింది.

The motorcycle carries all the supplies and a small stove which is fired up to fry the noodles and vegetables. A couple of sauce bottles, onions, cabbage and the odd carrot are used
PHOTO • Priti David
The motorcycle carries all the supplies and a small stove which is fired up to fry the noodles and vegetables. A couple of sauce bottles, onions, cabbage and the odd carrot are used
PHOTO • Priti David

మోటారుసైకిల్ అవసరమైన మొత్తం సామాగ్రితో పాటు, నూడుల్స్‌నీ కూరగాయలనూ వేయించడానికి చిన్న స్టవ్‌ను కూడా పట్టుకొస్తుంది. సాస్ సీసాల జంట, ఉల్లిపాయలు, క్యాబేజీ, అరుదుగా క్యారెట్‌ను కూడా ఉపయోగిస్తారు

రామ్ అవతార్ ఒక యూట్యూబ్ వంటవాడు. ఒకప్పుడు కూరగాయల వ్యాపారి, కానీ "అది చాలా నెమ్మదైన వ్యాపారం. చౌ మీన్ తయారు చేయటమెలాగో నా ఫోన్‌లో ఒక వీడియోను చూశాక ఒక ప్రయత్నం చేద్దామనిపించింది." అన్నారు. ఇది జరిగింది 2019లో. అప్పటినుంచీ ఆయన ఈ వ్యాపారాన్ని ఆపలేదు.

PARI అతన్ని 2022లో కలిసినప్పుడు, ఒక గిన్నెడు చౌ మీన్‌ను రూ 10కి అమ్ముతున్నారతను. "ఒక్క రోజులో నేను రూ. 700-800 విలువైన చౌ మీన్ అమ్మగలను." అందులోంచి తనకు రూ. 200-300 ఆదాయంగా వస్తుందని ఆయన అంచనా. 700 గ్రాముల నూడుల్స్ ప్యాకెట్ రూ. 35కు వస్తుంది. అటువంటి ప్యాకెట్లు రోజుకు ఐదింటిని ఆయన వాడతారు; మిగిలిన పెద్ద ఖర్చులు స్టవ్ కోసం వాడే కిరోసిన్, వంటకు వాడే నూనె, ఆయన బైక్‌కు పెట్రోల్

"మాకు మూడు బిఘాల భూమి ఉంది, కానీ దాని ద్వారా మాకు వచ్చే ఆదాయం దాదాపు ఏమీ ఉండదు," అన్నారతను. ఆయన తన సోదరులతో కలిసి ఆ పొలంలో వ్యవసాయప్పనులు చేస్తుంటారు. వారు గోధుమ, బజ్రా (సజ్జలు), ఆవాలను తమ స్వంత వాడకానికి పండిస్తారు. రామ్‌కు రీనాతో పెళ్ళయింది. వారికి పదేళ్ళ లోపు వయసున్న నలుగురు పిల్లలు - ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి - ఉన్నారు.

రామ్ అవతార్ ఏడేళ్ళ క్రితం తన టివిఎస్ మోటార్ సైకిల్‌ను కొన్నారు. నాలుగేళ్ళ తర్వాత, 2019లో ఆయన దానికి సరుకులు నింపిన సంచులు తగిలించి, దాన్నొక మొబైల్ వంటగదిగా మార్చారు. ఈరోజున ఆయన రోజుకు 100 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణం చేస్తూ, తాను తయారుచేసిన ఆహారాన్ని ఎక్కువగా తన పసి ఖాతాదారులకు అమ్ముతుంటారు. "నాకు ఈ పని చేయటం ఇష్టం. నాకు చేతనైనంత కాలం నేను ఇదే పని చేస్తాను."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Editor : Vishaka George

Vishaka George is Senior Editor at PARI. She reports on livelihoods and environmental issues. Vishaka heads PARI's Social Media functions and works in the Education team to take PARI's stories into the classroom and get students to document issues around them.

Other stories by Vishaka George
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli