"తుఫాను తీవ్రత తగ్గిపోయింది. ఇక మమ్మల్ని వెళ్ళిపొమ్మంటున్నారు," కాళిదాస్‌పూర్ గ్రామానికి చెందిన ఆమినా బీబీ, మే నెల చివర్లో నాతో అన్న మాటలివి. " కానీ మేం ఎక్కడికి వెళ్ళాలి?"

ఆ తుఫానుకు ఒక రోజు ముందు, ఆంఫాన్ తుఫాను పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న ఆమినా గ్రామానికి 150 కిలోమీటర్ల దూరంలో తీరాన్ని తాకింది. స్థానిక అధికారులు చాలా గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి  సహాయక శిబిరాలకు తరలించారు. మే నెల 19వ తారీఖున ఆమినా వాళ్ళ కుటుంబాన్నికూడా పక్క గ్రామంలోని తాత్కాలిక నివాసాల్లోకి తరలించారు.

సుందరవనాలలో గోసాబా బ్లాక్‌లో 5800 మంది జనాభా వుండే వాళ్ళ గ్రామంలో ఆమినా మట్టి ఇంటిని ఆమె సామానులతో సహా తుఫాను తుడిచిపెట్టేసింది. 48 ఏళ్ల ఆమినా, ఆవిడ భర్త 56 ఏళ్ల మొహమ్మద్ రంజాన్ మొల్లా, 2 నుంచి 16 ఏళ్ళ వయసున్న వాళ్ళ  ఆరుగురు పిల్లలు ఎలాగో బతికి బట్టకట్టారు.

తుఫాను రావడానికి కేవలం రెండు వారాల ముందే మొహమ్మద్ మొల్లా గ్రామానికి తిరిగి వచ్చారు. 56 ఏళ్ల అతను మహారాష్ట్రలోని పూనాలో, ఒక మాల్‌లో క్లీనర్‌గా నెలకు పదివేల జీతానికి పనిచేసేవారు. ఈసారి అతను గ్రామంలోనే వుండి దగ్గలోని మొల్లా ఖలీ బజార్‌లో టీ దుకాణం తెరవాలనుకుంటున్నారు.

తన ఇంటి పనులు పూర్తిచేసుకున్నాక దగ్గరలోని గోమర్ నదిలో ఆమినా చేపలు, పీతలు పట్టి ఎంతో కొంత సంపాదించేవారు. ఆవిడ పట్టిన కొద్ది చేపలను బజార్‌లో అమ్మేవారు. "అయితే, కనీసం రోజుకు 100 రూపాయలు కూడా సంపాదించేదాన్ని కాదు." అని నాతో అన్నారామె.

వారి పెద్ద కొడుకు రకీబ్ అలీ 2018లో బడికి వెళ్లడం మానేశాడు. అప్పుడతని వయసు 14 ఏళ్ళు. "నాన్న పంపించే డబ్బుతో మేము బతకడం అసాధ్యం. అందుకే నేను పనికి వెళుతున్నాను" అన్నాడు  రకీబ్. కొల్‌కతాలో ఒక టైలర్ షాప్‌లో సహాయకుడిగా నెలకు 5000 రూపాయలు సంపాదించేవాడు. కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో ఆంఫన్ తుఫాను వచ్చినప్పుడు అతను ఇంటికి తిరిగి వచ్చాడు.

రెల్లు గడ్డి పైకప్పుతో వున్న వాళ్ళ మట్టి ఇల్లు గోమర్ నది ఒడ్డున వుంది. ఒక్కో తుఫాను వచ్చినప్పుడల్లా - సిద్ర్ (2007), ఐలా (2009), బుల్బుల్( 2019) - నది వాళ్ళ ఇంటికి మరింత దగ్గరగా చొచ్చుకువస్తోంది. చిన్నగా వాళ్ళు ఏడాదికొకసారి వరితో పాటు కొన్ని కూరగాయలు పండించుకునే మూడు బిఘాల (ఒక ఎకరం) భూమి మొత్తం మునిగిపోయింది. ఆంఫాన్ తుఫాను వచ్చే సమయానికి ఇక ముంచడానికి భూమి మిగల్లేదు.

PHOTO • Sovan Daniary

ధ్వంసమైన తన ఇంటి దగ్గర నిలబడి వున్న ఆమినా బీబీ , ఆమె ఏడేళ్ల కూతురు రేష్మా ఖాతున్

ఈ ఏడాది మే నెల 20న ఆంఫాన్ తుఫాను మరోసారి గ్రామంలోని ఇళ్లనూ పొలాలనూ ఉప్పు నీటితో ముంచెత్తడానికి ముందే, ఆమినా వాళ్ళ కుటుంబం మిగిలిన చాలామందిలాగానే చోటో మొల్లా ఖలీ గ్రామంలో బిద్యాధరి, గోమర్ నదుల కట్టల మీద తాత్కాలిక పునరావాసం పొందారు. రాష్ట్ర ప్రభుత్వం, కొన్ని స్థానిక స్వచ్ఛంద సంస్థలు వండిన ఆహరం, నీళ్ల ప్యాకెట్లు పంచారు. ఈ తాత్కాలిక గదులు కిక్కిరిసివుండేవి. కరెంటు లేదు. కోవిడ్ -19 సమయంలో భౌతిక దూరానికి అవకాశమే లేదు.

"ఎన్నాళ్లని వాళ్ళిక్కడ వుంటారు? ఒక నెలా, రెండు నెలలు - తర్వాత ( ఎక్కడికి వెళ్తారు)?"  సహాయక శిబిరంలో నీళ్లు, ఆహరం పంపిణీ చేస్తున్న సుందరవన్ నాగరిక్ మంచా అనే స్థానిక స్వచ్చంద సంస్థ కార్యదర్శి చందన్ మాయితీ అడిగారు. "మగవాళ్ళు - కుర్రవాళ్ళు కూడా - జీవనోపాధి వెతుక్కుంటూ వెళ్ళాలి. వెళ్లలేని వాళ్ళు చేపలు, పీతలు, తేనె మీదా, లేదంటే నదులు, అడవుల మీద ఆధారపడి బతకాలి".

గత రెండు దశాబ్దాలుగా సుందరవనాల ప్రజల ఎకరాలకొద్దీ పంటభూములు సముద్రపు అలలు, వరదలు, తుఫానుల ద్వారా వచ్చిన ఉప్పునీటి వలన పనికిరాకుండాపోయాయి. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ 2020లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, దాదాపు 85 శాతం మంది ఈ ప్రాంత వాసులు సంవత్సరానికి ఒకసారి వరిపంటను సాగుచేసారు. కానీ, లవణీయత భూ ఉత్పత్తి సామర్థ్యాన్నితగ్గించేసి, మంచినీటి గుంటలను ఎండిపొయ్యేట్టు చేయటంతో మంచినీటి చేపలు కూడా క్షీణించిపోయాయి. మళ్ళీ భూమి సాగుకు సిద్ధం అవ్వాలంటే సంవత్సరాలు పడుతుంది.

"పదీ పదహైదు రోజుల పాటు నీళ్లు పొలాల్లో నిలిచిపోతాయి." అన్నారు నాంఖానా బ్లాక్, మౌసుని ద్వీపంలోని బాలియారా గ్రామానికి చెందిన 52 ఏళ్ల అబూ జబయ్యర్ అలీ షా. "ఉప్పు వల్ల ఈ నేల మీద పంటలూ పండవు, చెరువుల్లో చేపలూ వుండవు."  అలీ షా ఒక రొయ్యల వ్యాపారి. దగ్గరలో ఉండే నదుల్లో గ్రామస్థులు పట్టే రొయ్యలను కొని, స్థానిక రొయ్యల అమ్మకందారులకు అమ్ముతుంటారు.

అతను, అతని కుటుంబం - భార్య 45 ఏళ్ల రుకైయా బీబీ, ఇంటిదగ్గరే వుండే ఇద్దరు పిల్లలు- అంతటికీ వాళ్ళ పెద్ద కొడుకు 24 ఏళ్ల సాహెబ్ అలీ షా పంపే డబ్బే ఆధారం. రుకైయా బీబీ ఇంటిపని చూసుకుంటూ కుదిరినప్పుడు ఎంబ్రాయిడరీ పని చేస్తూ కొంచెం సంపాదిస్తుంటారు. సాహెబ్ అలీ కేరళలో తాపీ మేస్త్రిగా పని చేస్తాడు. "వాడక్కడ ఇతరుల కోసం ఇళ్ళు కడుతుంటాడు, ఇక్కడేమో అతని స్వంత ఇల్లు వరదల్లో కొట్టుకుపోతుంది " అబూ జబయ్యర్ అన్నారు.

2014 - 2018 మధ్య కాలంలో, సుందరవనాల ప్రాంతం మొత్తం వలసలలో 64 శాతం స్థిరమైన వ్యవసాయం లేకపోవడం వల్ల కలిగిన ఆర్థిక కష్టాల వల్ల సంభవించాయని, యునైటెడ్ నేషన్స్ ఆహార, వ్యవసాయ సంస్థ వారి ప్రస్తుతం కొనసాగుతున్న పరిశోధన ప్రాజెక్ట్ అయిన, డెల్టా వల్నరబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్: మైగ్రేషన్ అండ్ అడాప్షన్ చేసిన అధ్యయనం తెలుపుతోంది. అదేవిధంగా, సుందరవనాల‌లోని 200 కుటుంబాలపై అవిజిత్ మిస్త్రీ (పశ్చిమ బెంగాల్‌, పురులియాలోని నిస్తారిణి మహిళా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్) చేసిన సర్వేలో దాదాపు మూడు వంతుల కుటుంబాలలో కనీసం ఒక సభ్యుడు ఇతర జిల్లాలకో లేక రాష్ట్రాలకో పనికోసం వలస వెళ్లినట్లు కనుగొన్నారు.

PHOTO • Sovan Daniary

దక్షిణ 24 పరగణాల జిల్లా, మౌసుని ద్వీపంలోని బలియారా గ్రామానికి చెందిన అబు జబయ్యర్ అలీ షా , రుకైయా బీబీ తమ ఇంటిని కోల్పోయారు . కేరళలో మేస్త్రీగా పనిచేస్తున్న ఆమె అన్నయ్య సాహెబ్ అలీ షా (19) అట్టముక్కలతో చేసి ఇచ్చిన బొమ్మ ఇంటితో , వారి కుమార్తె 14 ఏళ్ళ అస్మీనా ఖాతున్

ఈ ప్రాంతంలోని చాలామంది పిల్లలు వలసల కారణంగా తమ చదువు మానెయ్యాల్సి వచ్చిందని, గోసాబా బ్లాక్‌కు చెందిన కుమిర్‌మారి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పబిత్రా గాయెన్ అన్నారు. “నది నెమ్మదిగా మా ఇళ్ళనూ భూములనూ తినేస్తున్నట్లే, విద్యారంగం కూడా నెమ్మదిగా విద్యార్థులను కోల్పోతోంది" అని ఆమె అన్నారు.

"గత 3,4 ఏళ్లలో (2009లో వచ్చిన ఐలా తుఫాను తర్వాత) పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చింది," అని ఘోరామారా పంచాయితీ ప్రధాన్ సంజీబ్ సాగర్ అన్నారు. "వలసపోయిన చాలామంది వెనక్కు (సుందరవన ప్రాంతానికి) వచ్చేసి, వ్యవసాయం మొదలుపెట్టడమో, చెరువుల్లో చేపలు పెంచడమో, లేక చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టడమో చేసేవాళ్ళు. కానీ, మొదట బుల్బుల్ తుఫాను, ఆ తరువాత వచ్చిన ఆంఫాన్ తుఫాను మొత్తం నాశనం చేసేశాయి."

ప్రక్కనే ఉన్న ఉత్తర 24 పరగణాల జిల్లాలో, 56 ఏళ్ల నజ్రుల్ మొల్లా, అతని ఆరుగురు సభ్యుల కుటుంబం ఆంఫాన్ తుఫాను నుండి కొద్దిలో బయటపడింది. మట్టి, గడ్డితో కట్టిన వారి ఇల్లు తుఫానులో కొట్టుకుపోయింది. మొల్లా కూడా కేరళలో తాపీ మేస్త్రీగా పనిచేశారు. కోవిడ్ -19 లాక్‌డౌన్ కారణంగా ఆంఫాన్‌ తుఫానుకు ఒక నెల రోజుల ముందు మినాఖాన్ బ్లాక్‌లోని ఉచిల్‌దహ్ గ్రామానికి తిరిగి వచ్చారు.

తుఫాను వెలిసిన ఒక రోజు తరవాత, మే నెల 21 వ తేదీన, నజ్రుల్ ఇంటి పై కప్పుకోసం స్థానిక అధికారులు పంచిపెడుతున్నప్లాస్టిక్ కవర్లు తీసుకోవడం కోసం వెళ్ళారు. నజ్రుల్ వంతు వచ్చేసరికి ఆ కవర్లు అయిపోయాయి. "మేమిప్పుడు అడుక్కునే వాళ్ళకన్నా హీనం" అని నాతో అన్నారతను. "ఈసారి మాకు ఈద్ పండగ (మే 24 తేదీ) ఆకాశం కిందనే".

పాథర్‌ప్రతిమ బ్లాక్, గోపాలనగర్ ఉత్తర్ గ్రామంలో 46 ఏళ్ల ఛబి భుఁయ్యా విరిగిపోయిన తండ్రి ఫోటోఫ్రేమ్‌ ఒకదానిని పట్టుకొని వున్నారు . ఆమె తండ్రి శంకర్ సర్దార్ 2009లో వచ్చిన ఐలా తుఫానులో వారి గుడిసె కూలిపోవటం వలన చనిపోయారు. "ఈ తుఫాను (ఆంఫాన్) మా ఇంటిని మాత్రమే తీసుకుపోలేదు. నా నుంచి నా భర్తను కూడా వేరు చేసింది ( మొబైల్ నెట్వర్క్ ధ్వంసం అవడం వల్ల )" అని ఆమె అన్నారు.

చభి భర్త, శ్రీధామ్ భుఁయ్యా ఐలా తుఫాను తర్వాత తమిళనాడుకు వలస వెళ్ళారు. అక్కడొక హోటల్‌లో సర్వర్‌గా పనిచేసేవారు. హఠాత్తుగా విధించిన లాక్‌డౌన్ వల్ల అతను ఇంటికి రాలేకపొయ్యారు. "చివరిసారి మేము మాట్లాడుకున్నది రెండురోజుల క్రితం" అని ఛబి నాతో అన్నారు, మే నెలలో నేను ఆమెతో మాట్లాడినప్పుడు. "చాలా బాధలో వున్నానన్నాడు. అతని దగ్గర తిండీ, డబ్బూ  అయిపోయాయి".

గోపాల్‌నగర్ ఉత్తర్‌లో మృదంగభంగా (స్థానికంగా గోబొడియా అని పిలుస్తారు) నది వెంబడి కట్టపై నిలబడి ఉన్న గ్రామంలోని ఒక పెద్దాయన- 88 ఏళ్ల  సనాతన్ సర్దార్ ఇలా అన్నారు, “కొన్నేళ్ల క్రితం ఇక్కడకు (సుందరవనాలు) పక్షులు వలస వచ్చేవి. ఇప్పుడవి రావటం లేదు. మేమే వలస పోతున్నాం."

తాజా కలం: ఈ రిపోర్టర్ జూలై 23న ఆమినా బీబీని, ఆమె కుటుంబాన్ని మళ్లీ కలిసేటప్పటికి, వారు తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. నీరు తగ్గిపోయింది. వారు వెదురు, ప్లాస్టిక్ షీట్లతో తాత్కాలికంగా ఒక గుడిసెను నిర్మించుకున్నారు.లాక్‌డౌన్ కారణంగా రంజాన్‌కు పని లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు. సొంతంగా టీ కొట్టు పెట్టుకోడానికి ఆయన వద్ద డబ్బు లేదు.

నజ్రుల్ మొల్లా, అతని కుటుంబం, ఇతర గ్రామస్థులు కూడా ధ్వంసం అయిన తమ ఇళ్లను, జీవితాలను వీలయినంత బాగుచేసుకునే పనిలో వున్నారు .

PHOTO • Sovan Daniary

' ఎన్నాళ్లని మీ భూమి కోతకు గురవ్వడం, జీవనోపాధి కోల్పోవడం చూస్తూవుంటాం ?' అని ఘోరమారా ద్వీపంలోని చున్ పురి గ్రామానికి చెందిన 9 తరగతి విద్యార్థి అజ్గర్ అలీ షా (15) అడిగాడు . అతని గ్రామం మొత్తం తుఫానులో మునిగిపోయింది

PHOTO • Sovan Daniary

పుఇంజలి గ్రామం , తూస్‌ఖలీ-ఆమ్‌తలి ద్వీపం , గోసాబా బ్లాక్ : మే 20 వచ్చిన ఆం ఫాన్ తుఫాను తర్వాత ఎకరాలకొద్దీ సాగు భూమి నీటితో మునిగిపోయింది

PHOTO • Sovan Daniary

పాథర్ ప్రతిమ బ్లాక్ లోని గోపాల్ నగర్ ఉత్తర గ్రామంలో , విరిగిపోయిన తన తండ్రి శంకర్ సర్దార్ ఫోటో ఫ్రేమ్ పట్టుకుని నిల్చొన్న 46 ఏళ్ల ఛబీ భుఁయ్యా . 2009 లో వచ్చిన ఐలా తుఫానులో వారి గుడిసె కూలిపోవడంతో ఆమె తండ్రి మరణించారు

PHOTO • Sovan Daniary

నజ్రుల్ మొల్లా కేరళలో తాపీ మేస్త్రీగా పనిచేసేవారు. కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా ఆం ఫాన్ కు ఒక నెల రోజుల ముందు మినాఖాన్ బ్లాక్ లోని ఉచిల్‌దాహ్ గ్రామానికి తిరిగి వచ్చారు

PHOTO • Sovan Daniary

సువంకర్ భుఁయ్యా , 14, పూర్వ మేదినీపూర్ జిల్లాలోని చేపల చెరువుల దగ్గర నైట్ గార్డ్ గా పనిచేస్తున్నాడు . అతని తండ్రి బబ్లూ భుఁయ్యా (48) కేరళలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు

PHOTO • Sovan Daniary

ఘోరామారా ద్వీపంలోని చున్ పురి గ్రామానికి చెందిన 21 ఏళ్ల తహోమినా ఖాతున్ , సహాయ శిబిరంలో బొంత కుడుతోంది . అలలు ఎక్కువగా వుండే సమయంలో ఆమె మురిగంగ నదిలో రొయ్య పిల్లలను పట్టుకుని రోజుకి 100 రూపాయల కంటే తక్కువే సంపాదిస్తుంది . ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని మత్స్య పరిశ్రమలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు

PHOTO • Sovan Daniary

గోసాబా బ్లాక్ లోని రంగబెలియా గ్రామంలో , ఆంఫాన్ తుఫాను తర్వాత స్థానిక సంస్థ నుండి రేషన్, ఇతర వస్తువులను తెచ్చుకుంటున్న జమున జానా

Left: Women of Kalidaspur village, Chhoto Molla Khali island, Gosaba block, returning home after collecting relief items from a local organisation. Right: Children playing during the high tide in Baliara village on Mousuni island. Their fathers work as a migrant labourers in the paddy fields of Uttarakhand.
PHOTO • Sovan Daniary
Left: Women of Kalidaspur village, Chhoto Molla Khali island, Gosaba block, returning home after collecting relief items from a local organisation. Right: Children playing during the high tide in Baliara village on Mousuni island. Their fathers work as a migrant labourers in the paddy fields of Uttarakhand.
PHOTO • Sovan Daniary

ఎడమ : ఒక స్థానిక సంస్థ నుండి సహాయ సామాగ్రిని తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్న గోసాబా బ్లాక్ , ఛోటో మొల్లా ఖలీ ద్వీపంలోని , కాళిదాస్ పూర్ గ్రామ మహిళలు . కుడివైపు : మౌసుని ద్వీపంలోని బలియారా గ్రామంలో అలలు ఎక్కువగా వున్న సమయంలో ఆడుకుంటున్న పిల్లలు . వారి తండ్రులు ఉత్తరాఖండ్ లోని వరి పొలాల్లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు

PHOTO • Sovan Daniary

దక్షిణ 24 పరగణాల జిల్లా పాథర్ ప్రతిమ బ్లాక్ లోని గోపాల్ నగర్ ఉత్తర్ లో ఐలా బంద్ ‌( కట్ట ‌) వెంబడే తల్లులతో కలిసి తమ ఇళ్లకు తిరిగి వస్తున్న పిల్లలు . ఐలా తుఫాను తర్వాత సుందరవనాల ప్రాంతంలో నదుల వెంట అనేక కట్టలు నిర్మించబడ్డాయి . వీటిని స్థానికంగా ఐలా బంద్ లు అంటారు

PHOTO • Sovan Daniary

దక్షిణ 24 పరగణాల జిల్లా, కాక్ ద్వీప్ బ్లాక్, కాక్ ద్వీప్ ద్వీపానికి చెందిన 46 ఏళ్ల పూర్ణిమ మండల్ , తన పిల్లలలో ఒకరితో తన గడ్డి గుడిసె ముందు నిలబడి ఉన్నారు . ఆమె భర్త ప్రోవాస్ మండల్ (52) మహారాష్ట్రలోని నాసిక్ లో భవన నిర్మాణ కార్మికుడు . ఆమె ప్రతిరోజూ సమీపంలోని నదులలో చేపలు , పీతలను పడుతుంటారు

అనువాదం: వి. రాహుల్జీ

Sovan Daniary

Sovan Daniary works in the field of education in the Sundarbans. He is a photographer interested in covering education, climate change, and the relationship between the two, in the region.

Other stories by Sovan Daniary
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

Other stories by Rahulji Vittapu