"డల్ వెలుపలి నుండి వచ్చిన కార్మికులు, తాము నీటిపై తేలియాడే తోటలలో పనిచేయాలని విన్నప్పుడు, మునిగిపోతామేమోనని ఆందోళన చెందుతారు!" మొహమ్మద్ మక్బూల్ మట్టూ  నవ్వుతూ అన్నారు.

శ్రీనగర్ నగరంలోని డల్ సరస్సు దగ్గర్లోని మోతీ మొహల్లా ఖుర్ద్ ప్రాంతపు ఈ 47 ఏళ్ల రైతు, తాను వారికి రోజుకు రూ.700 చెల్లిస్తానని చెప్పారు. కశ్మీర్ లోయలోని శ్రీనగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయ పనుల కోసం సాధారణంగా ప్రజలు చెల్లించే దాని కంటే ఇది రూ. 200 ఎక్కువ. ఇతరుల శ్రమకు ఇవ్వాల్సిన ఈ ఖర్చును తగ్గించుకోవడానికి, "మేము ఎంత పని వత్తిడిలో ఉన్నప్పటికీ, నేనూ నా భార్య తస్లీమా ప్రతిరోజూ [పనికి] వస్తాం" అని ఆయన చెప్పారు.

మొహహ్మద్ మక్బూల్ మట్టూ తన 7.5 ఎకరాల తేలియాడే తోటలకు వెళ్లేందుకు పడవను ఉపయోగిస్తారు. స్థానికంగా వీటిని డల్ కే గార్డెన్ అని పిలుస్తారు. అక్కడతను ఏడాది పొడవునా టర్నిప్‌లు, హాఖ్ (కాలర్డ్ గ్రీన్స్ - కాబేజీ, కాలీఫ్లవర్ వంటివాటి పువ్వుల చుట్టూ ఉండే ఆకుల వంటివి) వంటి వివిధ రకాల కూరగాయలను పండిస్తారు. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు –11°Cకు పడిపోయినప్పుడు కూడా ఆయన ఈ సాగు చేస్తారు. అప్పుడతను తన పడవను నడపడానికి మంచుతో నిండిన సరస్సు ఉపరితలాన్ని పగులగొట్టాల్సివుంటుంది. “ప్రస్తుతం ఈ వ్యాపారం వల్ల నాకు తగినంత డబ్బు రావడం లేదు. అయినా నేను చేయగలిగినది ఈ పని మాత్రమే కాబట్టి, ఇదే చేస్తాను,” అని అతను చెప్పారు.

18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ డల్- హౌస్‌బోట్‌లు, షికారా (పడవ) ప్రయాణాలు, పురాతన మేపల్ చెట్లతో కూడిన చార్ చినార్ ద్వీపం, సరస్సుకు సరిహద్దుగా ఉన్న మొఘల్ కాలం నాటి తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీనగర్ యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణ.

సుమారు 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సహజ చిత్తడి నేలలో భాగమైన ఈ సరస్సుపై తేలియాడే ఇళ్ళు, తేలియాడే తోటలు ఉన్నాయి. తేలియాడే తోటలు రెండు రకాలు: రాధ్ , డెంబ్ . రాధ్ అనేది రైతులు చేతులతో నేసి తయారుచేసిన తేలియాడే తోట. రెండు రకాల కలుపు మొక్కలను - పెచ్ ( టైఫా అంగుస్టాటా ), నర్గాసా ( ఫ్రాగ్మైట్స్ ఆస్ట్రేలిస్ ) - కలిపి నేస్తారు. ఈ నేసిన చాప లాంటి నిర్మాణం ఒక ఎకరంలో పదోవంతు నుండి మూడు రెట్లు పరిమాణం వరకూ ఉంటుంది. సాగు కోసం ఉపయోగించే ముందు దీన్ని 3-4 సంవత్సరాలు సరస్సుపై ఎండనిస్తారు. ఎండిన తర్వాత, ఈ చాపపై మట్టిని పొరలుగా వేస్తారు. అప్పుడది కూరగాయలు పండించడానికి అనుకూలంగా ఉంటుంది. రైతులు సరస్సులోని వివిధ ప్రాంతాలకు ఈ రాధ్ ను తరలిస్తారు.

డెంబ్ అనేది సరస్సు ఒడ్డున, అంచుల వెంట కనిపించే చిత్తడి నేల. ఇది కూడా తేలుతుంది కానీ అటూ ఇటూ మార్చడానికి కుదరదు.

PHOTO • Muzamil Bhat

మొహమ్మద్ మక్బూల్ మట్టూ , ఆయన భార్య తస్లీమా డల్ లోని మోతీ మొహల్లా ఖుర్ద్ లో ఉన్న తమ తేలియాడే తోటలో హాక్ ( కాలర్డ్ గ్రీన్స్ ) నాటుతున్నారు . సరస్సుపై అదే ప్రాంతంలో ఉన్న వారి ఇంటి నుండి ఇక్కడికి చేరుకోవడానికి వారికి అరగంట పడుతుంది . వారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ పని చేస్తారు

తన డెబ్బయ్యోవడిలో ఉన్న గులామ్ మొహమ్మద్ మట్టూ, డల్‌లో ఉండే మరో ప్రాంతమైన కురగ్‌లోని తన తేలియాడే తోటలో గత 55 సంవత్సరాలుగా కూరగాయలు పండిస్తున్నారు. అతను అక్కడికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతీ మొహల్లా ఖుర్ద్‌లో నివసిస్తున్నారు. “మేము మా తోటలకు స్థానిక ఎరువు అయిన హిల్ ను ఉపయోగిస్తాము. మేం దాన్ని సరస్సు నీటి నుండి సేకరించి 20-30 రోజులు ఎండలో ఆరబెడతాం. ఇది సహజమైనది, కూరగాయల రుచిని పెంచుతుంది,” అని ఆయన చెప్పారు..

డల్ సరస్సులోని దాదాపు 1,250 ఎకరాల నీరు, చిత్తడి నేలలు సాగులో ఉన్నాయని ఆయన అంచనా వేశారు. ఇవి శీతాకాలంలో టర్నిప్, ముల్లంగి, క్యారెట్, పాలకూరలు; వేసవిలో పుచ్చకాయ, టమోటా, దోసకాయ, గుమ్మడికాయల దిగుబడిని ఇస్తాయని ఆయన చెప్పారు.

"ఈ వ్యాపారం చనిపోతోంది, ఎందుకంటే నాలాంటి వృద్ధులు మాత్రమే దీన్ని చేస్తున్నారు," అని గులామ్ మొహమ్మద్ మట్టూ చెప్పారు. "తేలియాడే తోటలను సారవంతంగా ఉంచడానికి చాలా కృషి అవసరం - మనం నీటి స్థాయిని తనిఖీ చేయాలి, సరైన పరిమాణంలో హిల్ ను కలపాలి, ఆకలితో ఉన్న పక్షులనూ, ఇతర దాడిచేసే రైడర్‌లనూ తరిమికొట్టాలి."

వందలాది మంది రైతులు తమ తేలియాడే తోటల నుండి వచ్చిన పంటను డల్ లోని కరాపోరా ప్రాంతంలో ఉన్న తేలియాడే కూరగాయల మార్కెట్‌లో విక్రయిస్తారు. దీనిని స్థానికంగా ' గడ్డర్ ' అని పిలుస్తారు. సూర్యుని మొదటి కిరణాలు సరస్సు ఉపరితలాన్ని తాకినప్పుడు ఈ మార్కెట్ తెరుచుకుంటుంది. తాజా కూరగాయలతో నిండిన వందలాది పడవలు నిశ్చలంగా ఉన్న నీటిపై బారులుతీరి నిలిచివుంటాయి.

అబ్దుల్ హమీద్ ప్రతి రోజూ తెల్లవారుజామున 4 గంటలకు సరస్సు అవతలివైపున ఉన్న తన ఇంటి నుండి బయలుదేరతారు. ఆయన పడవ టర్నిప్, హాక్ , క్యారెట్ వంటి కూరగాయలతో నిండివుంటుంది. "నేను వాటిని గడ్డర్ వద్ద అమ్ముతాను. ప్రతిరోజూ 400-500 రూపాయలు సంపాదిస్తాను" అని 45 ఏళ్ల ఈ రైతు చెప్పారు.

ఒక శతాబ్దానికి పైగా ఈ మార్కెట్ శ్రీనగర్ నివాసితులకు అవసరమైన కూరగాయల వనరుగా ఉందని గులామ్ మొహమ్మద్ మట్టూ చెప్పారు. చాలా ఉత్పత్తులను సమీపంలోని శ్రీనగర్ నగరం నుండి పొద్దున్నే వచ్చివుండే హోల్‌సేల్ కొనుగోలుదారులకు విక్రయిస్తారు. బియ్యం, గోధుమలు వంటి తిండిగింజలు, సరస్సులో పండని బంగాళదుంపల వంటి కూరగాయల కోసం రైతులు తమ ఉత్పత్తులలో కొంత భాగాన్ని మార్పిడిచేసుకుంటారు.

PHOTO • Muzamil Bhat

మొహమ్మద్ అబ్బాస్ మట్టూ, అతని తండ్రి గులామ్ మొహమ్మద్ మట్టూలు ఈమధ్యనే నాటిన హాఖ్ తేమగా ఉండటంకోసం దానిపై నీటిని చిలకరిస్తున్నారు

నగరంలో కూరగాయలు అమ్మే పెద్ద వ్యాపారి షబీర్‌ అహ్మద్‌ రోజూ గడ్డర్ వద్దకు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌లో ప్రతిరోజూ 3 నుంచి 3.5 టన్నుల ఉత్పత్తుల వ్యాపారం జరుగుతుందని ఆయన చెప్పారు. “నేను ఉదయం 5 గంటలకల్లా నా ట్రక్కులో ఇక్కడికి వచ్చి సాగుదారుల నుండి 8-10 క్వింటాళ్ల (0.8 నుండి 1 టన్ను) తాజా కూరగాయలను తీసుకుంటాను. నేను వాటిని వీధి వ్యాపారులకు విక్రయిస్తాను. దానిలో కొంత భాగాన్ని మండికి కూడా సరఫరా చేస్తాను,” అని 35 ఏళ్ళ అహ్మద్ చెప్పారు. అతను డిమాండ్‌ను బట్టి రోజుకు రూ. 1,000-2,000 వరకూ సంపాదిస్తారు.

డల్‌లో పండే కూరగాయలు చాలా రుచిగా ఉంటాయని చాలామంది నమ్ముతారు. శ్రీనగర్‌లోని నవాకదల్ ప్రాంతంలో నివసించే 50 ఏళ్ల గృహిణి ఫిర్‌దౌసా ఇలా అంటున్నారు: “నాకు డల్‌లోని నాదుర్ [తామర కాడలు] అంటే ఇష్టం. ఇది ఇతర సరస్సులలో పెరిగే నాదుర్ నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది."

డిమాండ్ బాగా ఉన్నప్పటికీ, డల్‌లో జరిగే కూరగాయల వ్యాపారంపై ఆధారపడిన రైతులు, టోకు వ్యాపారులు తాము సమస్యలలో ఉన్నామని భయపడుతున్నారు

"ప్రభుత్వం రైతులను బెమీనా సమీపంలోని రఖ్-ఎ-ఆర్థ్‌కు తరలించినప్పటి నుండి సరస్సుపై కూరగాయల సాగు పడిపోయింది" అని శ్రీనగర్‌లోని రైనావారీ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల రైతు షబీర్ అహ్మద్ అన్నారు. ఈయన డల్‌పై వ్యవసాయం చేస్తున్నారు. డల్‌ను పరిరక్షించడానికి దీర్ఘకాలంగా సాగుతున్న వ్యూహంలో భాగంగా జమ్మూ, కశ్మీర్‌లోని లేక్స్ అండ్ వాటర్‌వేస్ డెవలప్‌మెంట్ అథారిటీ (LAWDA) డల్ నివాసితులకు 'పునరావాసం' కల్పించడానికి ముందుకు వచ్చింది.

2000వ దశకం చివరి నుండి, వెయ్యికి పైగా కుటుంబాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన రఖ్-ఎ-ఆర్థ్‌లోని గృహ సముదాయానికి తరలించారు. ఈ చిత్తడి నేల ప్రాంతం సరస్సు నుండి 20 కిలోమీటర్ల దూరంలో, ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతంలోని బడ్‌గామ్ జిల్లాలో ఉంది.

వృద్ధ రైతులు డల్‌పై వ్యవసాయాన్ని కొనసాగిస్తుండగా, యువ రైతులు మాత్రం రాబడి తక్కువగా వస్తుందంటూ ఇక్కడినించి వెళ్లిపోయారని షబీర్ అన్నారు.

“ఒకప్పుడు స్ఫటికంలా స్పష్టంగా ఉండే డల్ సరస్సు ఇప్పుడు కలుషితమైపోయింది. పాతికేళ్ళ క్రితం మేమిక్కడ ఇంకా ఎక్కువ కూరగాయల పంటను తీసేవాళ్ళం,” అని సరస్సుపై అర ఎకరం కంటే తక్కువ డెంబ్ తోటను కలిగి ఉన్న 52 ఏళ్ల రైతు గులామ్ మొహమ్మద్ చెప్పారు. తన భార్య, కొడుకు, కుమార్తెతో సహా నలుగురు సభ్యుల తన కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడుతున్నానని ఆయన చెప్పారు. "నేను రోజుకు 400-500 రూపాయలు సంపాదిస్తాను. అందులో నుంచే పాఠశాల ఫీజులు, ఆహారం, మందులు, మరెన్నో ఖర్చులను చూసుకోవాలి."

"[డల్] కాలుష్యానికి ప్రభుత్వం మమ్మల్ని నిందిస్తుంది. కానీ ఇప్పుడు అసలు నివాసితులలో సగం మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. మరి అందరూ ఇక్కడే నివసించిన ఆ రోజుల్లో సరస్సు ఎందుకంత శుభ్రంగా ఉండేది?” అని ఆయన అడుగుతారు.

PHOTO • Muzamil Bhat

సరస్సు నుండి హిల్(ఎరువు)ను వెలికితీస్తున్న రైతులు. ముందు దానిని ఎండబెట్టి, ఆ తర్వాత పంటలకు ఎరువుగా వాడతారు

PHOTO • Muzamil Bhat

డల్ లోని నగీన్ ప్రాంతం నుండి హిల్‌ను తీసుకువెళుతున్న రైతు

PHOTO • Muzamil Bhat

మోతీ మొహల్లా ఖుర్ద్ లోని తమ తేలియాడే తోటలలో హాఖ్‌ను నాటుతున్న రైతులు

PHOTO • Muzamil Bhat

సరస్సులోని తన డెంబ్ తోటలో పనిచేస్తున్న గులామ్ మొహమ్మద్ . ' పాతికేళ్ళ క్రితం మేం ఇంకా ఎక్కువ కూరగాయలను పండించేవాళ్ళం' అని అంటారాయన

PHOTO • Muzamil Bhat

మోతీ మొహల్లా ఖుర్ద్ లోని తన తోటలో టర్నిప్ లను నాటుతున్న ఒక మహిళా రైతు

PHOTO • Muzamil Bhat

నాజిర్ అహ్మద్ ( నలుపు రంగు దుస్తులు ), డల్ నుంచి వెళ్ళిపోయిన రైతుల్లో ఒకరు . ఆయనిప్పుడు సరస్సుకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనగర్ , లాల్ బజార్ ప్రాంతంలోని బోటా కదల్ లో నివసిస్తున్నారు

PHOTO • Muzamil Bhat

మోతీ మొహల్లా ఖుర్ద్ లోని తన తేలియాడే తోటలో పండించిన ఆకుకూరలను కోస్తున్న రైతు అబ్దుల్ మజీద్

PHOTO • Muzamil Bhat

డల్ సరస్సులోని తేలియాడే కూరగాయల మార్కెట్ , గడ్డర్ లో అమ్మేందుకు రైతులు తాము పండించిన పంటను పడవలలో తీసుకువస్తారు . అక్కడనుంచి అవి శ్రీనగర్ నగరంలోని మార్కెట్లకు చేరతాయి

PHOTO • Muzamil Bhat

గడ్డర్ లో కూరగాయల వ్యాపారులు ... ఇక్కడ కూరగాయల వ్యాపారం శీతాకాలమైతే ఉదయం 5 గంటల నుండి 7 గంటలవరకు ; వేసవికాలంలో అయితే ఉదయం 4 గంటల నుండి 6 గంటలవరకూ మాత్రమే జరుగుతుంది

PHOTO • Muzamil Bhat

రైతులు తమ కూరగాయలను నగరం నుంచి వచ్చిన వ్యాపారులకు అమ్ముతారు . వారు వాటిని మండీలోనూ , వీధి వ్యాపారులకూ అమ్ముతారు

PHOTO • Muzamil Bhat

ఒక శీతాకాలపు ఉదయం డల్ సరస్సుపై గడ్డర్ వద్ద తన కూరగాయలను అమ్ముతున్న మొహమ్మద్ మక్బూల్ మట్టూ

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Muzamil Bhat

Muzamil Bhat is a Srinagar-based freelance photojournalist and filmmaker, and was a PARI Fellow in 2022.

Other stories by Muzamil Bhat
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli