“నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. అయినా బతుకు బండిని నడిపించాల్సిందే. చిన్నపాటి సంపాదన కోసం రోజూ చాలా దూరం ప్రయాణం చేస్తేనే కుటుంబానికి పూట గడుస్తుంది.” సెందిల్ కుమారికి 40 ఏళ్లు. చేపలు అమ్మేందుకు ఆమె రోజూ కనీసం 130 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. కోవిడ్-19 లాక్‌డౌన్లతో చేపలవేట ఆగిపోయిందని, దాంతో ఎన్నో కష్టాలు పడ్డామని ఆమె అంటారు. “నా అప్పులు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యే నా కూతురి కోసం ఓ స్మార్ట్‌ఫోన్ కూడా కొనలేకపోతున్నాను. ఈ భారం చాలా ఎక్కువగా ఉంది” అంటారు సెందిల్ కుమారి.

తమిళనాడులోని మయిలాడుతుఱై జిల్లాలోని వనగిరి ప్రధానంగా మత్స్యకారుల గ్రామం. ఈ ఊళ్లో సెందిల్ కుమారితో సహా దాదాపు 400 మంది మహిళలు చేపల అమ్మకమే వృత్తిగా జీవిస్తున్నారు. వేర్వేరు వయసుల ఈ మహిళలంతా మత్స్యకార మహిళల కోఆపరేటివ్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ సొసైటీలో మొత్తం 1,100 మంది సభ్యులున్నారు. ఇక్కడ చేపల అమ్మకం రకరకాలుగా ఉంటుంది. కొందరు గంపలు తలపైన ఎత్తుకొని గ్రామంలో వీధి వీధీ తిరుగుతూ చేపలు అమ్ముతారు. మరి కొందరు ఆటోల్లో, వ్యాన్లలో లేదా బస్సుల్లో సమీప గ్రామాలకు వెళ్లి అమ్ముతారు. మరి కొందరు బస్సుల్లో ఇతర జిల్లాలకు కూడా వెళ్లి అక్కడి మార్కెట్లలో చేపలమ్ముతారు.

సెందిల్ కుమారి లాగానే చాలా మంది మహిళలు తమ సంపాదనతోనే కుటుంబాలను నడుపుతారు. వాళ్లు నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే, కోవిడ్ మాత్రం వాళ్లను బాగా కుంగదీసింది. ఇంట్లో కనీస అవసరాలను తీర్చుకునేందుకు కూడా ప్రైవేటు వడ్డీవ్యాపారుల నుంచి, మైక్రోపైనాన్స్ కంపెనీల నుంచి అప్పులు తీసుకోవాల్సి వచ్చి, వారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వాటిని తీర్చలేని స్థితికి చేరుకున్నారు. ఒక అప్పు తీర్చాలంటే మరో చోట అప్పు చెయ్యాలి. అదీ విపరీతమైన వడ్డీ రేట్లకు. “నేను సమయానికి అప్పు తీర్చలేకపోతున్నా. దాంతో వడ్డీ మరింత పెరిగిపోతోంది” అన్నారు అముద అనే 43 ఏళ్ల మత్స్యకార మహిళ అన్నారు.

చేపలమ్మే మహిళలకు పెట్టుబడి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి సంబంధించి ప్రభుత్వ విధానం అంటూ ఏమీ లేదు. పురుషుల్లో నిరుద్యోగం పెరుగుతున్న కొద్దీ మరింత మంది మహిళలు, ఆఖరుకు మత్స్యకారేతర కుటుంబాల మహిళలు కూడా చేపలమ్మే పనిలోకి దిగుతున్నారు. చేపల ధరలు, రవాణా ఖర్చులు పెరగిపోవడంతో ఆదాయాలు తగ్గిపోయాయి. గతంలో రోజంతా చేపలమ్మితే రూ. 200-300 వచ్చేవి. కానీ ఇప్పుడు నూరు రూపాయలు రావడం కూడా కష్టమే. కొన్నిసార్లయితే నష్టపోతున్నారు కూడా.

జీవితం చాలా కష్టమైంది. అయినా వాళ్లు ప్రతిరోజూ ఈ పనిని కొనసాగిస్తునే ఉన్నారు. పొద్దున్నే లేచి హార్బరుకు వెళ్లడం, చేపలు కొనడం, అడుగడుగునా అవమానాలు భరించడం… అయినా తమ శక్తిమేరకు వీరు చేపలు అమ్ముతూనే ఉన్నారు.

వీడియో చూడండి: వనగిరిలో: ‘నేను చేపలు అమ్మేందుకు వెళ్లలేకపోయాను’

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Nitya Rao

Nitya Rao is Professor, Gender and Development, University of East Anglia, Norwich, UK. She has worked extensively as a researcher, teacher and advocate in the field of women’s rights, employment and education for over three decades.

Other stories by Nitya Rao
Alessandra Silver

Alessandra Silver is an Italian-born filmmaker based in Auroville, Puducherry, who has received several awards for her film production and photo reportage in Africa.

Other stories by Alessandra Silver
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli