ఒక తెల్లవారుజామున, అమ్రోహా నుండి ఢిల్లీ వెళ్ళేందుకు కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్ రైలెక్కిన అయినుల్ దిగులుగా కూర్చున్నారు. “నేను చాలా భయపడ్డాను. మా ఉరి నుండి దూరంగా, బంబైకి వెళ్తున్నాను అన్న ఆలోచన పదే పదే నన్ను వెంటాడింది. అక్కడివాళ్ళు నాతో ఎలా ప్రవర్తిస్తారు? నేనెలా బ్రతకగలను?” ఈ ఆందోళన ఆ రాత్రంతా జనరల్ లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణం చేసిన 17 ఏళ్ల అయినుల్‌ను నిద్రపోనీయలేదు.

అదే రైలులో ఆమె మామగారైన ఆలిమ్ కూడా ప్రయాణించారు. ఢిల్లీలో మరో రైలు ఎక్కి, వాళ్ళు ముంబై బాంద్రా టెర్మినస్‌లో దిగారు.  ఆ తరువాత, మాహిమ్ లోని నయీ బస్తీ స్లమ్ కాలనీలో ఉన్న ఒక ఇంట్లో అయినుల్‌ని దిగబెట్టి, అతను మఖ్దూమ్ అలీ మాహిమి దర్గా బయట భిక్షాటన కొనసాగించడానికి వెళ్ళిపోయారు.

మూడేళ్ల తర్వాత, అయినుల్ షేక్ కూడా కొంతకాలం భిక్షాటన చేయాల్సి వచ్చింది. అలా వచ్చిన డబ్బు, ఏదో గుర్తుతెలియని వ్యాధితో సెంట్రల్ ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్ లో చేర్చిన తన 18 నెలల కొడుకు చికిత్సకు ఎంతగానో పనికొచ్చాయి. “నాకు అప్పుడు ఎవరూ (మెడికల్ బిల్లుల కోసం) ఋణం ఇవ్వలేదు. ఆ డబ్బు తిరిగి చెల్లించలేమని కాబోలు,” అని ఆమె వాపోయారు.

ముంబై వచ్చేటప్పుడు, రైలు ప్రయాణంలో ఆమెలో నెలకొన్న భయాందోళనలన్నీ ఒక విధంగా నిజమయ్యాయని చెప్పొచ్చు!

ఆ రోజు ట్రైన్ లో, ఒక బట్టల సంచిని మాత్రమే అయినుల్ తన వెంట తెచ్చుకున్నారు. మెట్టినింటికి తీసుకెళ్లేందుకు, పెళ్ళికి ముందే ఒక్కొక్కటిగా ఆమె కొన్న పాత్రలన్నీ అమ్మకానికిపోయాయి. చిన్నతనం నుండే ఆవిడ వేరేవాళ్ళ ఇళ్లలో గిన్నెలు తోముతూ, ఇల్లు శుభ్రం చేస్తూ, పొలాల్లో కూలిపని చేస్తూ చాలా కష్టపడ్డారు. “పని చేసినందుకు నాకు అన్నం పెట్టేవారు లేదా కొద్దిగా డబ్బులిచ్చేవారు. సంపాదించిందంతా పెట్టెల్లో దాచుకుంటూ నా పెళ్ళికి డబ్బులు పోగేశాను. అలా కర్తే కర్తే (చేస్తూ చేస్తూ) నేను ఓ రూ.5,000 వరకు ఆదా చేశాను. కుదిరినప్పుడల్లా వంట సామాన్ల షాపులకెళ్ళి, ఇత్తడి బాటీ లు (ఒక రకమైన కుక్కర్), థాలీ లు (కంచాలు), గరిటెలు, రాగి డేగ్చీ (గిన్నె) కొన్నాను.”

A woman and her son and daughter
PHOTO • Sharmila Joshi

చిన్న కొడుకు జునైద్, కూతురు మెహజబీన్‌తో అయినుల్ షేక్; ఆమె పెద్ద కొడుకు మహమ్మద్ ఫోటో తీయించుకోవడానికి ఇష్టపడలేదు

వివాహం చేసుకుని, అమ్రోహాలోని అదే మొహల్లా లో (వీధి) ఉంటున్న తన భర్త జమీల్ ఇంటికి వెళ్ళిన తరువాత, అతను తన తాగుడు కోసం ఆ సామాన్లన్నిటినీ అమ్మేశాడు. బాంద్రా టెర్మినస్‌లో రైలు దిగిన పదేళ్ళ తరువాత కూడా, జమీల్ తరచూ ఆమెను రక్తాలు కారేలా కొట్టేవాడు. ముంబైకి వచ్చినవెంటనే అయినుల్‌కు గృహ హింస మొదలైంది; సరిగ్గా ఎప్పుటి నుండి అన్నది మాత్రం తనకు గుర్తు లేదు. “నేను మా అమ్మకు ఫోన్ చేసి బాధ పడినప్పుడు, నువ్వు ఇంక అక్కడే ఉండి ఇవన్నీ భరించాలని నాకు నచ్చజెప్పింది!”

ఆ అమ్మిన పాత్రలతో పాటు, ఉత్తర్ ప్రదేశ్ జ్యోతిబాఫూలే నగర్ జిల్లాలో, అమ్రోహా (అప్పటి) గ్రామీణ శివార్లలోని బత్వాల్ మొహల్లా లో ఉంటున్న తన కుటుంబాన్ని – తల్లి, ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నలు – కూడా అయినుల్ వదిలి రావాల్సి వచ్చింది. క్షురకుడైన ఆమె తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. “మేము సల్మానీ జాత్ (వర్గం)కు చెందినవాళ్ళం. సంప్రదాయకంగా, మా వర్గంలో మగవాళ్ళు క్షురకులు. అబ్బా (తండ్రి) ఒక ఛప్పర్ (గుడిసె)లో కూర్చొని గడ్డం గీసి, జుట్టు కత్తిరించి కొంచెం కొంచెంగా డబ్బులు సంపాదించేవారు. మేము కటిక పేదవాళ్ళం. మా ఆరుగురు పిల్లల కడుపు నింపడానికి అమ్మీ (అమ్మ) అప్పుడప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఇచ్చేది; లేదా, మా ఆకలిని అణచివేయడానికి ఒక బెల్లం ముక్క ఇచ్చేది. మాకు సరైన బట్టలు కూడా ఉండేవి కాదు. ఎప్పుడూ సరిపోలని చెప్పులు – ఒకటి నీలం, మరొకటి నలుపు రంగులో ఉండి, పిన్నీసులతో కలిపికుట్టుకున్నవి – వేసుకునేవాళ్ళం,” అని ధారావి సరిహద్దుల్లో తగరం-ఆస్బెస్టాస్ రేకులతో కట్టిన ఒంటి గది మెజ్జనైన్ (ఎత్తు తక్కువ పైకప్పు కలిగినది) ఇంట్లో, నేలపై కూర్చొని తన కథ చెప్పసాగారు అయినుల్.

ఆరుగురి పిల్లల్లో చిన్నదైన అయినుల్ బడికి వెళ్ళలేదు. వీలైనంత త్వరగా, ఆ తోబుట్టువులందరూ పనికి వెళ్ళడం మొదలుపెట్టారు; ఒక సోదరుడు గ్యారేజీలో సహాయకుడిగా చేరితే, ఇద్దరు రిక్షా నడిపేవారు. అయినుల్ తల్లి, పెద్దక్క (తరువాత ఇద్దరికీ క్షయవ్యాధి వచ్చింది) ఇంట్లోనే బీడీలు చుట్టేవారు. అలా 1,000 బీడీలకు గాను ఏజెంట్ రూ.50 ఇచ్చేవాడు. అయినుల్, తన మరో అక్కతో పాటు సమీపంలో ఉన్న జోయా గ్రామంలోని పొలాల్లో కూలీ పనికి వెళ్ళేవారు. సాధారణంగా ధాన్యం రూపంలో వారికి కూలీ దక్కేది. ఆ విధంగా వాళ్ళందరూ నెలవారీ ఖర్చులు, ఆహారం సమకూర్చుకోవటంలో తమ వంతు కష్టం చేసేవాళ్ళు. “ఆ రోజుల్లో నేను అంత పని చేసినా, చీకూచింతా ఉండేది కాదు. హాయిగా విశ్రాంతి తీసుకోగలిగేదాన్ని, మనసారా నవ్వగలిగేదాన్ని,” అని ఆమె గుర్తు చేసుకున్నారు.

కాలక్రమేణా, వర్క్ షెడ్ స్థానంలో ఒక విశాలమైన ఇంటిని నిర్మించగలిగే స్థాయికి చేరుకుంది షేక్ కుటుంబం. ఆమె తల్లి ఒక స్థానిక సంస్థ చేపట్టిన పథకం కింద మంత్రసానిగా శిక్షణ పొంది, డబ్బు వెనకేయడం మొదలుపెట్టారు. కానీ, అయినుల్‌కు దాదాపు 13 ఏళ్ల వయసున్నప్పుడు (ప్రస్తుతం ముప్పయ్యోవడిలో ఉన్న అయినుల్‌కు జ్ఞాపకశక్తి బాగానే ఉన్నా, వయసు-సంవత్సరాల విషయంలో మాత్రం ఆమె తడబడుతూ ఉంటారు), తరచుగా అనారోగ్యం పాలయ్యే ఆమె తండ్రి, రెండేళ్లకు పైగా పక్షవాతంతో మంచాన పడ్డారు. అతని అనారోగ్యం ఆ కుటుంబాన్ని మళ్లీ పేదరికంలోకి నెట్టింది. “మేము తీవ్రంగా ప్రయత్నించాము; మా మొహల్లా లో ఉండే వాళ్ళు కూడా సహాయం చేశారు కానీ, ఆయనను బ్రతికించుకోలేక పోయాము,” అని ఆవిడ కంట నీరు పెట్టుకున్నారు. అయినుల్ పదిహేనో ఏట, తన తండ్రిని కోల్పోయారు. ఆమెకు 16 ఏళ్లు వచ్చేసరికి, ఆమె సోదరులు ఆమె వివాహానికి ఏర్పాట్లు చేశారు.

పెళ్ళైన కొంతకాలం వరకు అయినుల్ తన మెట్టినింట్లోనే ఉన్నారు. ఆమె మామగారైన ఆలిమ్, కొన్ని నెలలు ముంబైలో భిక్షాటన చేసి, ఆ వచ్చిన డబ్బులతో మిగతా నెలలు అమ్రోహాలో బ్రతికేవారు. ఆమె అత్తగారు కొన్నేళ్ల క్రితమే మరణించగా, మరిది బత్వాల్ మొహల్లా లో క్షురకుడుగా పని చేస్తున్నారు. పెళ్ళైన ఏడాది తర్వాత, ఆలిమ్ ఆమెను ముంబైకి తీసుకొచ్చారు.

A road in Dharavi, a slum in Mumbai

అయినుల్ నివసించే ఒంటి గది ఇల్లున్న వీధి

జమీల్ చిన్నా చితకా పనులు చేసేవాడు – ధారావిలో రీసైక్లింగ్ (వ్యర్థాలను పనికొచ్చే వస్తువులుగా మార్చే) రంగంలో కూలీగా రోజుకు రూ.150-200 వచ్చేవి; అలాగే, ఉత్తర్ ప్రదేశ్‌కు బియ్యం, గోధుమలు తరలించే ట్రక్కులలో సహాయకుడిగా పని చేసేవాడు. అప్పుడప్పుడు వారికి ఆలిమ్ కొంత డబ్బు పంపిస్తుండేవారు. అతనికి జూదం వంటి వ్యసనాలున్నా కూడా, తమకు ఆర్ధికంగా సహాయం చేస్తుండేవాడని అయినుల్ తెలియజేశారు.

ముంబైకి వచ్చిన తరువాత, కొంతకాలం అయినుల్ ఎక్కడా పని చేయలేదు. “ దర్గా దగ్గర అడుక్కోవడానికి నన్ను వెళ్ళనివ్వమని నా భర్తను అడిగాను. కనీసం వేరే ఇళ్ళల్లో పనులు చేయడానికైనా వెళ్ళనివ్వమన్నాను. కానీ, అతను ససేమిరా అన్నాడు. అతను నాకు రోజూ రూ.30 ఇచ్చేవాడు. అందులోనే అన్నీ సమకూర్చుకోవాల్సి వచ్చేది. కొన్నిసార్లు, మా మీద దయతో, ఇరుగు-పొరుగువారు ఏదైనా మిగిలిపోయినవి ఇచ్చేవారు.” అయితే, తమ మొదటి సంతానం అనారోగ్యం పాలైనప్పుడు, జమీల్ పెట్టిన ఆంక్షలను ధిక్కరించి, ఆమె దర్గా లో పని వెతుక్కున్నారు.

ఎనిమిదేళ్ల క్రితం ఆలిమ్ చనిపోయాక, ఆమెకి గడ్డు రోజులు మొదలయ్యాయి. “ఎప్పుడూ నన్ను హింసించే జమీల్ ఇంకా క్రూరంగా మారిపోయాడు. నన్ను బాగా కొట్టేవాడు. దుర్భాషలాడేవాడు. ఒకసారి, మాహిమ్ లోని రైలు పట్టాల పైకి నన్ను తోసి, చచ్చిపోమని తిట్టాడు,” అని బాధపడుతూ, తన పాత గాయాన్నొకదాన్ని నాకు చూపించారు అయినుల్ – జమీల్ తనను పట్టాల పైకి తోసినప్పుడు, ఆమె మోకాలు చిట్లిపోయింది. “అతను నన్ను చేతితో, కర్రలతో, చిమ్టా (పట్టకారు)తో, ఏది దొరికితే దానితో కొట్టేవాడు. నేనేం చేయగలను? అన్నీ భరించేదాన్ని!”

ఇదంతా కొనసాగుతుండగానే, అయినుల్‌కు ముగ్గురు పిల్లలు పుట్టారు – కొడుకులు మహమ్మద్, జునైద్‌లకు ఇప్పుడు 15, 9 ఏళ్ళైతే, కూతురు మహజబీన్‌కు 11. “నా భర్తను వదిలేసి పొమ్మని తెలిసినవాళ్ళందరూ నాకు సలహా ఇచ్చారు కానీ, నా పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఆ పని చేస్తే మా బిరాదరి (కులం)లో నా పిల్లల పెళ్ళికి ఎవరూ ఒప్పుకోరు.”

కొంతకాలం క్రితం, దర్గా లో పరిచయమైన ఒక మహిళ ఇంట్లో, నెలకు రూ. 600 లకు పని చేయడానికి అయినుల్ ఒప్పుకున్నారు. ఆ తరువాత ఆమె వరుసగా ఎన్నో ఉద్యోగాలు – ‘వాడి లైన్’ లేదా క్యాటరింగ్ పనిలో భాగంగా, పెళ్ళిళ్ళలో అంట్లు కడిగే పని; శివారు ప్రాంతమైన జోగేశ్వరిలోని ఒక ఇంటిలో నర్సుగా - చేశారు.

ఇన్ని సంవత్సరాల్లో, ఆమె తన భర్త, పిల్లలతో కలిసి ఎన్నోసార్లు ఫుట్‌పాత్‌లపైన పడుకున్నారు; మాహిమ్-ధారావిలోని చిన్న చిన్న అద్దె గదుల్లో, ఒక్కోసారి రోడ్లపై కూడా నివసించారు. ధారావిలో ఒక గదిని అద్దెకు తీసుకోవాలంటే, కనీసం రూ.5,000 ధరావతు (డిపాజిట్) గా చెల్లించాలి. కానీ, అయినుల్ దగ్గర ఆ కొంచెం డబ్బు కూడా ఎప్పుడూ ఉండేది కాదు. “కానీ నెమ్మదిగా నేను మనుషులకు బాగా పరిచయమయ్యాను, డిపాజిట్ లేకుండా గదిని అద్దెకు తీసుకోగలిగాను. కానీ, ఎన్నో గదులు (అద్దె కట్టలేక) ఖాళీ చేయాల్సి వచ్చింది. దాంతో మళ్ళీ వీధుల్లో బ్రతికాము. ఇంకో గదిని వెతుక్కొని, చేరి, మళ్ళీ ఖాళీ చేసి...”

A woman crouching on the floor of her house
PHOTO • Sharmila Joshi

తన ఇంట్లో అయినుల్; ఇప్పుడు ఆమె కొంత స్థిరత్వాన్ని సంపాదించున్నారు

గత కొన్నేళ్లుగా, అయినుల్ తన కుటుంబంతో కలిసి మాహిమ్-ధారావిలో అద్దెకు తీసుకున్న చిన్న గదులలో, కొన్నిసార్లు వీధుల్లో నివసించారు. 'నేను ఎన్నో గదులు (అద్దె కట్టలేక) ఖాళీ చేయాల్సి వచ్చింది. దాంతో మళ్ళీ వీధుల్లో బ్రతికాము. ఇంకో గదిని వెతుక్కొని, చేరి, మళ్ళీ ఖాళీ చేసి...'

జనవరి 2012 లో, ఆమె బస్తీ లో మంటలు చెలరేగాయి. “అది తెల్లవారుజామున 3 గంటల సమయం.  అందరూ నిద్రపోతున్నారు. మేము పైకప్పుల పైకి ఎక్కి పరిగెత్తాము.” ఆ అగ్నిప్రమాదం తర్వాత, ఆమె తన భర్త, పిల్లలతో కలిసి ఎనిమిది నెలల పాటు మాహిమ్-సాయన్ వంతెనపై ఉన్న పేవ్‌మెంట్‌పై నివసించారు. “అయితే వర్షాకాలం చాలా కష్టమనిపించేది. వానలు కురిసినప్పుడల్లా, నేను నా పిల్లలను తీసుకొని సమీపంలోని భాంగార్ (పాత సామాన్ల) దుకాణం దగ్గర ఆశ్రయం పొందేదాన్ని.”

అగ్నిప్రమాదానికి గురైన ప్రజలకు స్థానిక సంస్థలు, నాయకులు వీలైనంత సహాయం చేశారు. అందరిలాగే అయినుల్‌కు కూడా ఆహార ధాన్యాలు, పాత్రలు, బకెట్లు, స్టవ్, చాపలు ఇచ్చారు. ఆ తరువాత, దాదాపు రెండేళ్ల క్రితం, తన స్నేహితులు, పరిచయస్తుల సహాయంతో, వంతెనపై ప్రస్తుతం నివాసం ఉంటున్న గదికి మారారు. ఇంతకు ముందులా గాలాడని ఇళ్లలా కాకుండా, ఈ గదికి ఒక పెద్ద కిటికీ ఉంది, కొంత చల్లటి గాలి వస్తుంది. “మాకు ఇదొక డాబా ఇల్లులా అనిపిస్తోంది,” అని అయినుల్ నాకు గర్వంగా చెప్పారు.

మార్చి 2015 లో, అయినుల్‌కు రీసైక్లింగ్, ఇతర సమస్యలపై పనిచేసే ఒక స్థానిక ఎన్జీఓలో వేస్ట్ పేపర్ సార్టర్ గా (చిత్తు కాగితాలను వేరుచేసే) ఉద్యోగం దొరికింది. ఇక్కడ ఆమెకు నెల నెలా స్థిరంగా రూ.6,000 జీతం వస్తోంది; ఇది ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచింది. జీతంలో రూ.3,500 అద్దెకు పోగా, ప్రతి నెలా సుమారు రూ.1,000 ఆహార ధాన్యాలు, పిండి, కూరగాయలకు ఖర్చవుతున్నాయి – వాళ్ళ రేషన్ కార్డు అగ్నిప్రమాదంలో కాలిపోయాక, మళ్ళీ ఇంకొకటి తీసుకోలేదు. మిగిలిన ఆదాయంలో విద్యుత్తు, ఇతర ఖర్చులు దాటిపోతున్నాయి. “నా పిల్లలు ఇప్పుడు కడుపు నిండా తింటుంటే, నాకు చాలా ఆనందంగా ఉంది,” అని చెబుతూ ఆవిడ భావోద్వేగానికి గురయ్యారు.

ఆ కుటుంబం దగ్గర్లో ఉన్న పబ్లిక్ టాయిలెట్ బ్లాక్ ని ఉపయోగిస్తుంది. కమ్యూనిటీ కుళాయిలో నీళ్లు వాడుకున్నందుకు నెలకు రూ.200 (స్థానిక మహిళాధికారికి) చెల్లించాలి; ప్రతిరోజూ సాయంత్రం 7-8 గంటలకు, బకెట్లు, డబ్బాలు , సీసాలలో నీళ్లు నింపి పెట్టుకుంటారు అయినుల్. ఆమె పెద్ద కొడుకు మహమ్మద్ వాటిని నింపి, ఇంట్లో పెట్టడంలో సహాయం చేస్తాడు. నేను వాళ్ళ ఇంటికెళ్ళినపుడు, అయినుల్ కూతురు మహజబీన్ తన 6వ తరగతి పాఠ్య పుస్తకాలతో చాలా బిజీగా కనిపించింది. సిగ్గు పడుతూ, నవ్వుతూ కనబడ్డ ఆమె చిన్న కొడుకు జునైద్ 2వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళు తమ ఇంటి దగ్గర్లో ఉన్న మున్సిపల్ పాఠశాలలో చదువుతున్నారు.

A woman standing on a ladder amidst hutments in Dharavi, a slum in Mumbai
PHOTO • Sharmila Joshi
The view from a hutment room in Dharavi
PHOTO • Sharmila Joshi

అయినుల్ ఇంటికి వెళ్ళాలంటే, ఆమె వెనకాల ఉన్న ఈ రెండు నిచ్చెనలను ఎక్కాలి; కుడివైపు: ఆమె కిటికీ నుండి ‘ బంబై’ ఇలా కనబడుతుంది

మహమ్మద్ 5వ తరగతి తర్వాత చదువు మానేశాడు. అప్పుడప్పుడు వెల్డింగ్ పనిలో సహాయకుడిగా పనిచేస్తూ, రోజుకు రూ.100 వరకు సంపాదిస్తాడు; కొన్నిసార్లు తన పొరుగునున్నవారికి పుస్తకాలు చేరవేసే పని చేసి, కొద్దిగా సంపాదిస్తాడు. అతని ఆశయాలు చాలా చిన్నవి – తన పక్కింటివాళ్లలా పేవ్‌మెంట్ పై సొంత పుస్తకాల దుకాణాన్ని పెట్టాలని, లేదా మేనమామలా మెకానిక్‌ అవ్వాలని. “నా బిరాదరి లో మగవాళ్లలా నేనూ మంగలి అవ్వాలనుకున్నాను, కానీ నేనింకా ఆ పని నేర్చుకోవాలి. అందుకే, ప్రస్తుతానికి ఏదో ఒక పని చేసి సంపాదిస్తూ, మా అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటున్నాను,” అని మహమ్మద్ తెలిపాడు.

ఇప్పుడు, తన తండ్రి అయినుల్‌ను కొట్టాలనుకున్నప్పుడు మహమ్మద్ అడ్డుపడుతున్నాడు. దాంతో, జమీల్ ఆమెపై అరవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. కొన్నేళ్లుగా తాను ఎదుర్కొన్న గృహ హింస, చేసిన కష్టమైన పనులు, ఆకలి అయినుల్‌‌ ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి – ఆమెకు తరచుగా రక్తహీనత, రక్తపోటు సమస్యలు, తలనొప్పి వస్తున్నాయి.

ఇన్నేళ్ళలో, అయినుల్‌ కొన్నిసార్లు మాత్రమే బత్వాల్ మొహల్లా కు వెళ్ళగలిగారు. ఒకసారి, క్షయవ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు వెళ్ళి, ఆమె మరణించే వరకూ అక్కడే ఉన్నారు. “అప్పుడప్పుడు అమ్మీ నాకు కొంత డబ్బు పంపేది, నాకు సహాయం చేయడానికి చాలా ప్రయత్నించింది… మా అమ్మీ ” అని తన తల్లిని గుర్తు చేస్తుకుని ఆవిడ బాధపడ్డారు. ఇప్పటికీ ఆమె కొన్ని సంవత్సరాలకు ఒకసారి తన స్వగ్రామాన్ని సందర్శిస్తారు. ప్రస్తుతం తన మేనకోడలి పెళ్ళి కోసం అమ్రోహాకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు.

“మా ఊరిలో నా కోసం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని నా కోరిక. నేను నా గడ్డపైనే చనిపోవాలని కోరుకుంటున్నాను. నా మనసు బంబైలో లేదు… ఈ నగరం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది… నా గాఁవ్ (గ్రామం)లో ఉండేటప్పుడు, ఆకలితో అలమటిస్తున్నా, మేము ఎలాగోలా బ్రతికేవాళ్ళం. నా జ్ఞాపకాలన్నీ మా ఉరి చుట్టే తిరుగుతున్నాయి; నా బాల్యమంతా అక్కడే గడిచింది మరి. నేను అక్కడ మనస్ఫూర్తిగా నవ్వగలిగేదాన్ని!”

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi