ఆమె భర్త అనాస్ షేక్ కి ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 10:30కి ఫోన్ కలవనప్పుడు రెహనా బీబీ అంతేమి ఆలోచించలేదు. వాళ్లిద్దరూ రెండు గంటల క్రితమే ఫోన్లో మాట్లాడుకున్నారు. "ఆయన అమ్మమ్మ ఇవాళ పొద్దునే చనిపోయింది," అన్నది రెహనా బీబీ. ఈ విషయం చెప్పడానికే ఆమె ఉదయం 9 గంటలకి ఫోన్ చేసింది.

బెంగాల్లోని మాల్ద్హా జిల్లాలోని భగబాన్పూర్లో ఆమె నివసించే గుడిసె బయట కూర్చొని "ఆయన ఎలాగో దినం సమయానికి రాలేకపోయేవాడు. అందుకే సమాధి చేసేటప్పుడు నన్ను వీడియో కాల్ చెయ్యమని అడిగాడు" అని అన్నది 33 ఏళ్ళ రెహనా. అనాస్ ఎక్కడో 1700 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్లోని గద్వాల్ పర్వతాలలో ఉన్నాడు. ఆమె రెండోసారి ఫోన్ చెసినపుడు, అతని ఫోన్ కలవలేదు.

ఈ రెండు ఫోన్ల మధ్యలో ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో విపతొచ్చిపడింది. నందాదేవి గ్లేషియర్ లో  ఒక భాగం విరిగిపడి అలకనంద, ధౌలి గంగా, రిషి గంగా నదులలో భారీ వరదకు దారితీసింది. ఈ వరదలలో నది ఒడ్డుపై ఉన్న ఇళ్లు కొట్టుకుపోయి, పరిసరాలలోని జల విద్యుత్ ప్లాంటులలో పనిచేసే కార్మికులను ముంచేసాయి.

వారిలో అనాస్ కూడా ఒకడు. కానీ ఈ విషయం రెహనాకి తెలియదు. తన భర్తకి ఫోన్ చెయ్యడానికి ఆమె మరి కొన్ని సార్లు ప్రయత్నించారు. ఎంతకీ ఫోన్ కలవక ఆమెలో కంగారు మొదలయింది. కొద్ధి క్షణాలలో ఆ కంగారు భయం, ఆ తరవాత  ఆందోళనగా మారింది. "నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను" అన్నది ఆమె కన్నీళ్ళని ఆపుకుంటూ. "నాకు ఏమి చెయ్యాలో కూడా తెలియలేదు".

Left: Rehna Bibi with a photo of her husband, Anas Shaikh, who's been missing since the Chamoli disaster. Right: Akram Shaikh works as a lineman in Kinnaur
PHOTO • Parth M.N.
Left: Rehna Bibi with a photo of her husband, Anas Shaikh, who's been missing since the Chamoli disaster. Right: Akram Shaikh works as a lineman in Kinnaur
PHOTO • Parth M.N.

ఎడమ: చమోలీ విపత్తు నుండి తప్పిపోయిన తన భర్త అనాస్ షేక్ ఫోటోతో రెహనా బీబీ. కుడి: షేక్ కిన్నౌర్‌లో లైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న అక్రమ్

చమోలి నుండి 700 కిలోమీటర్ల దూరంలో హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్‌లో , అనాస్ తమ్ముడు అక్రమ్, ఈ వార్తని టీవీలో చూశాడు. "వరదలు వచ్చిన ప్రాంతం మా అన్నయ్య ఉండే చోటు నుండి అంత దూరమేమి కాదు. ఇంక అంతా అయిపోయిందేమోనని చాలా భయపడ్డాను" అంటాడు అక్రమ్.

మరుసటి రోజు, 26 ఏళ్ళ అక్రమ్ తప్తి గ్రామం నుండి బస్ తీసుకొని రైని గ్రామంలో అనాస్ పనిచేసిన జలవిద్యుత్ ప్లాంట్ చేరుకున్నాడు. అతను చేరుకొనేసరికే నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బలగాలు బ్రతికున్నవారి కోసం ప్రాంతాన్ని పరికిస్తున్నారు. "మా అన్నయ్యతో పాటు పనిచేసిన ఒక వ్యక్తిని అక్కడ కలిశాను. వాళ్ల టీంలో 57 మందిలో అతనొక్కడే బ్రతికి బయటపడ్డాడు. మిగిలినవారంత వరదలలో కొట్టుకుపోయారు"

చమోలి నుండి అక్రమ్ రెహనకి ఫోన్ చేసాడు, కానీ ఆ చేదు వార్తని ఆమెకు చెప్పలేకపోయాడు. "అనాస్ ఆధార్ కార్డ్ అవసరమైంది, అందుకని రెహనాని అది పంపమని అడిగాను. ఆమెకు వెంటనే అంతా అర్ధమైంది" అన్నాడు అక్రమ్. "మా అన్నయ్య వివరాలు పోలీసులకి తెలియపరిచేందుకు. ఒకవేళ అతని మృతదేహం దొరికితే, ఈ వివరాలు అవసరమవుతాయి"

35 ఏళ్ళ అనాస్ రిషిగంగా జలవిద్యుత్ ప్లాంటులో హై-వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ పై లైన్ మాన్ గా పనిచేస్తూ నెలకు 22,000₹ సంపాదించేవాడు. మాల్ద్హా జిల్లాలో తన ఊరు కలియాచక్-III బ్లాకులో ఇతర పురుషులలాగా అనాస్ కూడా 20ఏళ్ళ వయసు నుంచే ఉపాధికై వలస వెళ్తున్నాడు. సంవత్సరంపాటు పనిచేసి, కేవలం కొన్ని రొజుల ఉండడానికి ఇంటికి తిరిగొచ్చేవాడు. అతను తప్పిపోయేనాటికి అతను ఊరు వెళ్లి సుమారు 13నెలలు అవుతుంది.

పవర్ ప్లాంటులో ఒక లైన్ మాన్ పని, విద్యుత్ టవర్లు సెట్ చేయడం, వైరింగ్ చెక్ చేయడం ఇంకా వాటిల్లో ఏమన్నా తప్పులుంటే వాటిని సరిదిద్దడం, అని చెప్తాడు అక్రమ్. 12వ తరగతి వరకు చదివిన అక్రమ్ కూడా లైన్ మాన్ గానే పనిచేస్తున్నాడు. తను కూడా 20ఏళ్ళ వయసునుంచే ఉపాధికై వలసవెళ్లడం మొదలుపెట్టాడు. "పని చేస్తూ చేస్తూ నేర్చుకున్నా" అంటాడు అక్రమ్. అతను కిన్నోర్ లోని జలవిద్యుత్ ప్లాంటులో పనిచేస్తూ నెలకి 18000₹ సంపాదిస్తున్నాడు.

Rehna wants to support her children's studies by taking up a job
PHOTO • Parth M.N.

తానొక ఉద్యోగాన్ని వెతుక్కుని తన పిల్లలను చదివించాలని అనుకుంటుంది రెహనా

ఎన్నో సంవత్సరాలుగా భాగబాన్పూర్ కు చెందిన పురుషులు ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్లోని జలవిద్యుత్ ప్రాజెక్టులలో పనిచేయడానికి వలస వెళ్తున్నారు. 53ఏళ్ళ అఖిముద్దిన్ లైన్ మాన్ గా పనిచేయడానికి 25ఏళ్ల క్రితం అక్కడికి తరలివెళ్లాడు. "నేను హిమాచల్ ప్రదేశ్లో పని మొదలుపెట్టినప్పుడు రోజుకు 2.50₹ వేతనం చెల్లించేవారు" అని అన్నాడు ఆయన. "మేము సంపాదించగలిగినంత సంపాదించి, ఖర్చులకు కొంచెం ఉంచుకొని మిగిలినదంతా ఊర్లో ఇల్లు నడపడానికి పంపిస్తాం". అప్పట్లో వలసవెళ్లిన అఖిముద్దీన్ మరియు అతని సహచరులు నేటి యువతకి మార్గదర్శకులుగా మారారు.

వాళ్ళు చేసే పని చాలా ప్రమాదకరమైనది. అక్రమ్ తన సహచరులలో ఎంతోమంది విద్యుత్ షాక్ వలన మరణించడం లేక గాయపడడం చూశాడు. "ఈ పని చెయ్యాలంటే భయమేస్తుంది. ఎటువంటి రక్షణ సామగ్రి కూడా అందించరు. అనాస్ కి జరిగినట్టు ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు (అనాస్ మృతదేహం నేటికి దొరకలేదు). కానీ మాకు వేరే దారి లేదు. బ్రతుకుతెరువు కోసం ఏదో విధంగా సంపాదించాలి. మాల్ద్హాలో అయితే పని దొరకదు. అక్కడి నుండి బయటకు వలస వెళ్లాల్సిందే.”

దేశంలో అత్యంత పేద జిల్లాలలో మాల్ద్హా ఒకటి. జిల్లాలోని గ్రామీణ జనాభాలో చాలా మంది భూములు లేనివారే. వారంతా రోజువారీ వేతనాల మీద ఆధారపడుతున్నారు" అన్నాడు శుభ్రో. ఈయన మాల్ద్హాకి చెందిన ఒక సీనియర్ పాత్రికేయుడు. "ఇక్కడ భూములు చిన్నవి. ఆ పై వరదల వలన ఈ భూములు తరచుగా మునిగిపోతాయి. ఇక్కడ వ్యవసాయం చేయడం రైతులకు, వ్యవసాయ కూలీలకు దాదాపు అసాధ్యం". జిల్లాలో పరిశ్రమలు కూడా లేవు. అందుకే జనం ఉపాధి కొరకై ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తారు, అన్నాడు శుభ్రో మిత్ర.

2007లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 'జిల్లా మానవ అభివృద్ధి రిపోర్ట్: మాల్ద్హా'ని ప్రచురించింది. ఈ రిపోర్టులో కార్మికులు ఇతర రాష్ట్రాలకు ఏ కారణాల వలన తరలివెళ్తున్నారో గమనించారు . దాని ప్రకారం, నీటి వనరులలో అసమానతలు, ప్రతికూలంగా ఉన్న వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు జిల్లాలోని వ్యవసాయ ఉపాధిని తీవ్రంగా దెబ్బతీశయి. ఆపై, ఈ ప్రదేశం నిదానంగా పట్టణీకరణ చెందడం, పరిశ్రమలు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కాలనుగుణత వలన వేతనాలు తగ్గిపోవాదం వంటి కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వలన చిన్నపాటి కార్మికులు ఉపాధికొరకు దూర ప్రాంతాలకు తరలివెళ్లాల్సొస్తుంది.

ఏప్రిల్ మొదటి వారంలో, కోవిడ్-19 కేసులు దేశమంతటా పెరుగుతున్నప్పటికి, 37ఏళ్ల నీరజ్ మొండాల్ తన బార్యాపిల్లలని వదిలి ఉపాధికోరకై ఢిల్లీకి తరలివెళ్లాడు. "మాస్క్ పెట్టుకొని పనిచెయ్యడమే" అంటాడు అతను. "లోక్డౌన్ పెట్టినప్పటినుంచి అసలు పనే దొరకట్లేదు. ఏదో ప్రభుత్వ సహాయంతో రోజులు గడిపేశాం, చేతిలో డబ్బులయితే లేవు. మాల్ద్హాలో ఎలాగో పని దొరకదు".

మాల్ద్హాలో మహా అయితే రోజుకి 200 రూపాయిలు సంపాదగించగలిగే నీరజ్, ఢిల్లీలో రోజుకి 500-550₹ వరకు సంపాదించగలుగుతాడు. "ఇలా అయితే ఎక్కువ పొదుపు చేసి ఇంటికి పంపొచ్చు" అంటాడతను. "ఇంట్లోవాళ్ల మీద బెంగగా ఉంటుంది. ఇష్టపూర్వకంగా ఎవరూ ఇల్లొదిలి వెళ్లరు".

Left: Niraj Mondol waiting to board the train to Delhi. Right: Gulnur Bibi says that her husband often doesn't find work in Maldah town
PHOTO • Parth M.N.
Left: Niraj Mondol waiting to board the train to Delhi. Right: Gulnur Bibi says that her husband often doesn't find work in Maldah town
PHOTO • Parth M.N.

ఎడమ: ఢిల్లీ రైలు ఎక్కడానికి నిరజ్ మొండోల్ ఎదురుచూస్తున్నాడు . కుడి: గుల్నూర్ బీబీ తన భర్తకు మాల్దా పట్టణంలో తరచుగా పని దొరకడం లేదని చెప్పింది

మరి కొన్ని రోజులలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు మొదలవ్వనున్నాయి, కానీ నీరజ్ ఎన్నికలలో పాల్గొలేకపోవడాన్ని అంతగా ఏమి పట్టించుకోటల్లేదు. "ఇక్కడేమి మారదు," అంటాడతను. "నాకు గుర్తున్నంతకాలం ఇక్కడి ప్రజలు వలస వెళ్తూనే ఉన్నారు. దానిని ఆపడానికి ఏం చేశారు? ఉపాధి అందించారా? మాల్ద్హాలో పనిచేసేవారు అతి కష్టం మీద జీవితం సాగిస్తున్నారు".

గుల్నుర్ బీబీ భర్తకి ఇది కొత్తేమి కాదు. 35ఏళ్ళ నిజ్మీల్ షేఖ్ వలస వెళ్లకుండా భాగబాన్పూర్లోనే ఉండిపోయిన అతి కొంతమందిలో ఒకడు. అతని కుటుంబానికి 5ఎకరాల భూముంది, కానీ నిజ్మీల్ 30 కిలోమీటర్ల దూరంలోని మాల్ద్హా టౌన్ లో బిల్డింగ్ నిర్మాణ సైటులలో పనిచేస్తున్నాడు. "అతను రోజుకి 200-250₹ వరకు సంపాదిస్తాడు" అంటారు 30ఏళ్ళ గుల్నుర్. "కానీ పని అరుదుగా దొరుకుతుంది. ఎన్నోసార్లు ఖాళీ చేతులతో ఇంటికి తిరిగొస్తాడు".

ఈ మధ్యన గుల్నుర్ కి ఆపరేషన్ చెయ్యడానికి 35,000 రూపాయిలు ఖర్చయ్యింది. "దాని కోసం మా స్థలంలో కొంత భాగం అమ్మేసాము" అంటారామె. "ఒక వేళ అత్యవసర పరిస్థితేమైనా వస్తే మా దగ్గర డబ్బులేలేవు. ఇక పిల్లల్ని ఎలా చదివిస్తాం?". వారికి 6 నుండి 16ఏళ్ల వయసులోపు, ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

అనాస్ తప్పిపోయేవరకు రెహనా వాళ్ల పిల్లల చదువులు గురించి దిగులుపడేది కాదు. అనాస్ పంపించే డబ్బులతో 16ఏళ్ల కూతురు నశ్రీబాను, 15ఏళ్ళ కొడుకు నసీబ్ ను బడికి పంపించగలిగేవారు. "అతని కోసం అసలేమి ఉంచుకునేవాడుకాదు" అంటారు రెహనా. "రోజు కూలితో మొదలుపెట్టి ఈ మధ్యనే పర్మనెంట్ ఉద్యోగం పొందాడు. అతన్ని చూసి మేమెంతో గర్వపడేవాళ్ళము."

చమోలిలో వరదలొచ్చి రెండు నెలలవుతుంది, కానీ అనాస్ లేకపోవడం రెహనాకు ఇంకా మింగుడుపడడం లేదు. తన కుటుంబానికి భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం దొరకలేదు. రెహనా ఊర్లో అంగన్వాడీగా లేక ఆరోగ్య సంరక్షణ కార్మికురాలిగా (health care worker) పని చెయ్యాలని ప్రయత్నిస్తోంది. "నా పిల్లల చదువులు దెబ్బతినకూడదు" అన్నది రెహనా. "దాని కోసం నేనేదైనా చేస్తాను".

అనువాదం: అవంత్

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Avanth

Avanth is pursuing his MA-PhD candidate in Economics at the Graduate Institute Geneva.

Other stories by Avanth