ఖుమా థియెక్‌కి మణిపుర్‌లోని చురాచాంద్‌పుర్ జిల్లాలోని లాంగ్జా అనే తన గ్రామానికి తిరిగి వెళ్లాలనే ఆలోచనే ప్రస్తుతం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. 64 ఏళ్ళ ఈ రైతు గత 30 ఏళ్ళుగా లాంగ్జాలోనే నివాసం ఉంటున్నారు. ఈ గ్రామం ఆయనకు ఎంతో ఆత్మీయమైనదీ, మాలిమి అయినదీ కూడా. అతను తన కుమారుడైన డేవిడ్‌ను పెంచిందీ, మధ్యాహ్న భోజనం డబ్బా కట్టి అతన్ని బడికి పంపిందీ, వరిపొలాల్లో అతనితో కలిసి పనిచేసిందీ ఇక్కడే. అతను మొదటిసారి తాత అయ్యింది కూడా ఇక్కడే. ఖుమాకు లాంగ్జాయే ప్రపంచం; ఆయన చాలా సంతుష్టితో ఉండే ప్రపంచం.

ఇందంతా జులై 2, 2023 వరకే…

ఆ రోజు ఆయన జీవితకాల జ్ఞాపకాలను హింసాత్మకంగా తుడిచిపెట్టింది, ఖుమా తన మనసు నుండి తీసేయలేని గాయాలను మిగిల్చింది. అతనికి నిద్రలోనూ మెలకువలోనూ కుదురుగా ఉండనివ్వని దృశ్యమది. ఆది లాంగ్జా ప్రవేశ ద్వారం వద్ద వెదురు కంచెపై ఉంచిన అతని కొడుకు మొండెం నుంచి వేరుచేసిన తల దృశ్యం.

ఖుమా సొంత రాష్ట్రం, భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని మణిపుర్, మే 3, 2023 నుండి జాతి ఘర్షణల్లో చిక్కుకుంది. ఈ ఏడాది మార్చి చివరలో, మణిపుర్‌లోని హైకోర్టు ఆధిపత్య మైతేయీ సముదాయానికి "ఆదివాసీ హోదా"ని ఇచ్చింది. ఈ హోదా వారికి ఆర్థిక ప్రయోజనాలను, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పిస్తుంది. కుకీ తెగలు ఎక్కువగా ఉండే కొండ ప్రాంతాలలో భూమిని కొనుగోలు చేసేందుకు కూడా వీలు కల్పిస్తుంది. అయితే ఆ తర్వాత ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఈ నిర్ణయం ఇప్పటికే జనాభాలో 53 శాతంగా ఉన్న మైతేయీలకు రాష్ట్రంపై మరింత ఆధిపత్యాన్ని ఇస్తుందని రాష్ట్ర జనాభాలో 28 శాతంగా ఉన్న కుకీ సముదాయం నమ్ముతోంది.

Khuma Theik at his brother’s house, after his own home in the Kuki village of Langza was attacked and his son violently killed
PHOTO • Parth M.N.

అల్లరిమూకలు కుకీ గ్రామమైన లాంగ్జాలోని తన సొంత ఇంటిపై దాడి చేసి, తన కొడుకును హింసాత్మకంగా చంపివేసిన తర్వాత, సోదరుడి ఇంట్లో ఉంటోన్న ఖుమా థియెక్

కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కుకీ వర్గానికి చెందిన కొందరు మే 3వ తేదీన చురాచాంద్‌పుర్ జిల్లాలో ఒక ర్యాలీ నిర్వహించారు.

ఆ నిరసన ప్రదర్శన తర్వాత, వలసవాద బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కుకీలు చేసిన తిరుగుబాటుకు గుర్తుగా చురాచాంద్‌పుర్‌లో 1917లో ఏర్పాటు చేసిన ఆంగ్లో-కుకీ యుద్ధ స్మారక ద్వారాన్ని మైతేయీలు తగలబెట్టారు. ఈ ఘటన నాలుగు రోజుల్లో 60 మంది ప్రాణాలు తీసిన అల్లర్లకు కారణమైంది.

ఇది అనాగరిక హత్యలు, శిరచ్ఛేదనలు, సామూహిక అత్యాచారాలు, గృహ, గ్రామ దహనాలతో రాష్ట్రం మొత్తం వ్యాపించిన హింస, కల్లోలాలకు ప్రారంభం. ఇప్పటి వరకూ సుమారు 190 మంది ఈ హింసాకాండలో మృతి చెందారు. 60 వేలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో అత్యధికులు కుకీలు. ఈ అంతర్యుద్ధంలో మైతేయీ మిలిటెంట్లకు రాష్ట్రపోలీసులు సహకరించారని కుకీలు ఆరోపిస్తున్నారు.

రెండు వర్గాల మధ్య పరస్పర విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల ఒకప్పటి పొరుగువారినే శత్రువులుగా భావించి, తమ తమ గ్రామాలకు సొంత రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Barricades put up by paramilitary forces along the borders of Imphal and Churachandpur, Manipur
PHOTO • Parth M.N.

ఇంఫాల్, చురాచాంద్‌పుర్, మణిపుర్ సరిహద్దుల్లో పారామిలటరీ బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లు

A home (left) and a shop (right) burned to the ground near the border of Imphal and Churachandpur, Manipur
PHOTO • Parth M.N.
A home (left) and a shop (right) burned to the ground near the border of Imphal and Churachandpur, Manipur
PHOTO • Parth M.N.

మణిపుర్‌లోని ఇంఫాల్, చురాచాంద్‌పుర్ సరిహద్దు వద్ద పూర్తిగా కాలి బూడిదైన ఒక ఇల్లు (ఎడమ), ఒక దుకాణం (కుడి)

జూలై 2 తెల్లవారుజామున, కుకీ గ్రామమైన లాంగ్జాకు కాపలాగా ఉన్నవారిలో ఖుమా కుమారుడైన 33 ఏళ్ళ డేవిడ్ కూడా ఒకరు. సాయుధ మైతేయీ గుంపు హఠాత్తుగా వారిపై దాడి చేసింది. లాంగ్జా గ్రామం కుకీల ఆధిపత్యం ఉన్న చురాచాంద్‌పుర్ జిల్లాకు, మైతేయీలు ఆధిపత్యంలో ఉన్న ఇంఫాల్ లోయకు సరిహద్దులో ఉండటంవల్ల ఇది కల్లోల ప్రాంతంగా మారింది.

ఆ దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి స్థానికులకు ఎక్కువ సమయం లేదని గ్రహించిన డేవిడ్ వెనక్కి పరిగెత్తి, తాను సాయుధులను నిలువరించే ప్రయత్నం చేస్తాననీ, ఈలోపు ప్రజలను తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపొమ్మనీ చెప్పారు. "మేం చేతపట్టుకోగలిగినవి పట్టుకొని, మా తెగలు ఎక్కువగా నివసించే కొండల్లోని లోతట్టుప్రాంతాలకు పరుగుపెట్టాం,” అని ఖుమా చెప్పారు. "డేవిడ్ వద్ద స్కూటర్ ఉండటం వల్ల త్వరలోనే దారిలో మాతో కలుస్తానని మాట ఇచ్చాడు."

డేవిడ్, అతనితోటి ఇతర గార్డులు అతని కుటుంబం తప్పించుకోవడానికి తగినంత సమయాన్ని ఇవ్వగలిగారు, కానీ తమను తాము కాపాడుకోలేకపోయారు. డేవిడ్ తన స్కూటర్‌పై ఎక్కేలోపే అతడిని వెంబడించి, తల నరికి చంపేశారు. అతని శరీరాన్ని ముక్కలుగా నరికి కాల్చేశారు.

"ఆ రోజు నుంచి నాకు తీవ్ర ఆఘాతం తగిలినట్లయింది," అని ఖుమా చెప్పారు. ఇప్పుడాయన చురాచాంద్‌పుర్ జిల్లాలోని లోతట్టు కొండప్రాంతంలో తన సోదరుడితో కలిసి నివసిస్తున్నారు. “నేను తరచూ అర్ధరాత్రివేళల్లో భయంతో వణుకుతూ నిద్రలేస్తాను. నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నా కొడుకు తెగిన తలను పట్టుకుని ఒక వ్యక్తి నడుస్తున్న ఫోటో ఒకటి ఉంది. నేను ఆ దృశ్యాన్ని నా జ్ఞాపకాల నుంచి తుడిచేయలేకపోతున్నాను."

The charred remains of vehicles set on fire near the Churachandpur-Imphal border
PHOTO • Parth M.N.
The charred remains of vehicles set on fire near the Churachandpur-Imphal border
PHOTO • Parth M.N.

చురాచాంద్‌పుర్-ఇంఫాల్ సరిహద్దు సమీపంలో నిప్పంటించిన వాహనాలు

Boishi at a relief camp in Churachandpur where she has taken shelter along with four of her children aged 3 to 12, after her village of Hao Khong Ching in the district of Kangpokpi came under attack
PHOTO • Parth M.N.

వాల్ ఆఫ్ రిమెంబరెన్స్ అనేది చురాచాంద్‌పుర్‌లో సంఘర్షణలో మరణించిన తమ ప్రియమైనవారిని స్మరించుకోవడానికి కుకీలు ఏర్పాటుచేసిన స్మారక చిహ్నం. మృతదేహాలను స్వాధీనం చేసుకోవడానికి, అంత్యక్రియలు నిర్వహించడానికి ఇంఫాల్‌లోని ఆసుపత్రులకు వెళ్ళే వీలు తమకు లేదని సూచించడానికి ఖాళీ శవపేటికలను ఉంచారు

మణిపుర్ అంతటా నిరాశ్రయులైన ఖుమా లాంటివారు వేలాదిమంది ఉన్నారు. వారు ఒకప్పుడు తమ ఇంటిగా పిలుచుకున్న ప్రాంతాన్ని వారిప్పుడు గుర్తించలేరు. వనరుల కొరత, బాధాకరమైన జ్ఞాపకాలతో వారు పోరాడుతున్నారు. అంతర్యుద్ధ బాధితులు ఉదారులైన బంధువుల వద్ద ఆశ్రయం పొందడమో, లేదా స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందడమో చేస్తున్నారు.

మే నెల 3వ తేదీన కాంగ్‌పక్‌పి జిల్లాలోని హావు ఖాంగ్ చింగ్ గ్రామం దాడికి గురైన తర్వాత, ఆ గ్రామానికి చెందిన 35 ఏళ్ళ బొయ్షి థాంగ్, 3 నుండి 12 సంవత్సరాల వయస్సు గల తన నలుగురు పిల్లలతో సహా చురాచాంద్‌పుర్ జిల్లా, లామ్‌కా తహసీల్‌ లోని లింగ్సిఫాయీ గ్రామంలోని సహాయక శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. "మైతేయీ గుంపులు సమీపంలోని మూడు గ్రామాలను తగలబెట్టాక, మా గ్రామం వైపు వస్తున్నారని మాకు తెలిసింది. ఎక్కువ సమయం లేకపోవడంతో, ముందు మహిళలనూ పిల్లలనూ గ్రామం వదిలి వెళ్ళమని చెప్పారు," అని ఆమె తెలిపారు.

ఆమె భర్త 34 ఏళ్ళ లాల్ టిన్ థాంగ్, గ్రామంలోని ఇతర పురుషులతో పాటు ఉండిపోగా, బొయ్షి లోతట్టు అడవుల్లోని ఒక నాగా గ్రామంలోకి తప్పించుకు వచ్చారు. నాగా తెగవారు ఆమెకు, ఆమె పిల్లలకు ఆశ్రయం కల్పించారు. ఆమె తన భర్తకోసం ఎదురుచూస్తూ అక్కడే వేచి ఉన్నారు.

నాగా సముదాయానికికి చెందిన ఒక వ్యక్తి లాల్ టిన్ థాంగ్ క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి లింగ్సిఫాయీ గ్రామానికి వెళ్ళేందుకు ముందుకొచ్చారు. కానీ అతను, కీడును శంకిస్తోన్న బొయ్షి అనుమానాన్ని ధృవీకరించే వార్తతో తిరిగి వచ్చారు. బొయ్షి థాంగ్ భర్తను పట్టుకుని చిత్రహింసలు పెట్టి సజీవ దహనం చేశారు. "నా భర్త మరణానికి దుఃఖించే సమయం కూడా నాకు దొరకలేదు." అని బొయ్షి చెప్పారు. “నేను నా పిల్లలను సురక్షితంగా ఉంచడంలో మునిగిపోయాను. మరుసటి రోజు ఉదయం, నాగాలు నన్ను ఒక కుకీ గ్రామం వద్ద దింపారు, అక్కడి నుండి నేను చురాచాంద్‌పుర్‌కు వచ్చాను. నేను ఎప్పటికైనా ఇంటికి తిరిగి వెళతానని అనిపించడంలేదు. మా జీవనోపాధి కంటే మా ప్రాణాలు ముఖ్యం.”

బొయ్షికి, ఆమె భర్తకు గ్రామంలో ఐదు ఎకరాల వరి పొలం ఉంది, దీనిపై ఆధారపడి వారు జీవనం సాగించేవారు. కానీ ఇప్పుడామె అక్కడకు తిరిగి వెళ్ళడాన్ని ఊహించలేకపోతున్నారు. చుట్టుపక్కల మైతేయీలు ఎవరూ లేకపోవడం వలన ప్రస్తుతం చురాచాంద్‌పుర్ కుకీలకు సురక్షితమైన ప్రదేశంగా ఉంది. అప్పటివరకూ తన జీవితమంతా మైతేయీ గ్రామాల సమీపంలోనే గడిపిన బొయ్షి ఈ రోజు వారితో కలవడానికి భయపడుతున్నారు. "మా గ్రామం చుట్టూ చాలా మైతేయీ గ్రామాలున్నాయి," అన్నారామె. “వారు బజార్లు నడిపేవారు, మేం వారిదగ్గర కొనుగోలుచేసేవారం. అది ఒక స్నేహపూర్వక సంబంధం.”

Boishi at a relief camp in Churachandpur where she has taken shelter along with four of her children aged 3 to 12, after her village of Hao Khong Ching in the district of Kangpokpi came under attack
PHOTO • Parth M.N.

కాంగ్‌పక్‌పి జిల్లాలోని తన గ్రామమైన హావు ఖాంగ్ చింగ్ దాడికి గురైన తర్వాత, 3 నుండి 12 సంవత్సరాల వయస్సు గల తన నలుగురు పిల్లలతో సహా చురాచాంద్‌పుర్‌లోని సహాయక శిబిరంలో ఆశ్రయం పొందుతోన్న బొయ్షి

కానీ ప్రస్తుతం మణిపుర్‌లో ఈ రెండు వర్గాల మధ్య పరస్పర విశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నది. రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఇంఫాల్ లోయలో మైతేయీలు, లోయ చుట్టు ఉన్న జిల్లాల్లో కుకీలు నివసిస్తున్నారు. ఒకరి భూ భాగంలోకి మరొకరు ప్రవేశించడం చావుతో సమానం. ఇంఫాల్‌లోని కుకీ ప్రాంతాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి. కుకీల ఆధిపత్యం ఉన్న జిల్లాల్లో మైతేయీలను కొండల నుండి తరిమేశారు.

ఇంఫాల్‌లోని మైతేయీ సహాయ శిబిరంలో ఉంటోన్న 50 ఏళ్ళ హేమాబతీ మొయ్‌రాంగ్‌థెమ్, తాను నివసించే మొరేహ్ పట్టణంపై కుకీలు దాడి చేసినప్పుడు, పక్షవాతంతో ఉన్న తన సోదరుడితో కలిసి తానెలా తప్పించుకున్నారో గుర్తుచేసుకున్నారు. "నా ఒంటి గది ఇంటిని కూడా తగులబెట్టారు," అని ఆమె చెప్పారు. “నా మేనల్లుడు పోలీసులకు ఫోన్ చేశాడు. మమ్మల్ని తగులబెట్టి చంపకముందే పోలీసులు వస్తారని ఆశపడ్డాం."

భారత మయన్మార్ సరిహద్దులో ఉండే మొరేహ్ పట్టణాన్ని కుకీ గుంపు చుట్టుముట్టింది. తన సోదరుడు కదలలేని స్థితిలో ఉండటం వల్ల హేమ అతనితో కలిసి పారిపోలేకపోయారు. "అతను నన్ను వెళ్ళిపొమ్మని చెప్పాడు, కానీ నేనలా చేసివుంటే నన్ను నేను క్షమించుకోలేకపోయేదాన్ని," అని ఆమె చెప్పారు.

హేమ భర్త ప్రమాదంలో చనిపోయిన తర్వాత పదేళ్ళుగా ఆ ముగ్గురూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. మిగిలినవారి ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఒకరిని త్యాగం చేయడమనే ప్రశ్నే లేదు. ఏది జరిగినా అది ముగ్గురూ కలిసే అనుభవిస్తారు.

పోలీసులు వచ్చాక హేమ, ఆమె మేనల్లుడు కాలిపోతున్న తమ ఇంటి నుంచి ఆమె సోదరుడిని ఎత్తుకుని పోలీసు కారువద్దకు తీసుకువచ్చారు. పోలీసులు వారు ముగ్గురినీ అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్‌లో సురక్షితంగా దింపారు. "నేను అప్పటి నుండి ఈ సహాయ శిబిరంలో ఉంటున్నాను," అని హేమ చెప్పారు. "నా మేనల్లుడు, సోదరుడు మా బంధువులొకరితో ఉంటున్నారు."

Hema is now at a relief camp in Imphal. She escaped with her paralysed brother when her town, Moreh  was attacked by a Kuki mob
PHOTO • Parth M.N.

ప్రస్తుతం ఇంఫాల్‌లోని సహాయక శిబిరంలో ఉన్న హేమ. కుకీ గుంపులు ఆమె నివాసముండే పట్టణమైన మొరేహ్‌పై దాడిచేసినప్పుడు ఆమె పక్షవాతానికి గురైన తన సోదరుడితో కలిసి అక్కడి నుండి తప్పించుకున్నారు

మొరేహ్ పట్టణంలో కిరాణా దుకాణాన్ని నడుపుతుండే హేమ ఇప్పుడు తన మనుగడ కోసం ఇతరుల దాతృత్వంపై ఆధారపడాల్సి వచ్చింది. ఆమె మరో 20 మంది అపరిచితులతో కలిసి ఒక డోర్మెటరీ వంటి గదిలో నిద్రించాల్సివస్తోంది. ఒక సామూహిక వంటశాల నుంచి వచ్చిన ఆహారాన్ని తింటూ, ఎవరో దానం చేసిన దుస్తులను ధరించాల్సివస్తోంది. "ఇదేమీ గొప్పగా అనిపించడం లేదు," అని ఆమె చెప్పారు. “నా భర్త చనిపోయిన తర్వాత కూడా నేను స్వత్రంత్రంగా బతికాను. నన్నూ, నా సోదరుడినీ పోషించుకున్నాను. ఇప్పుడిలా ఇక్కడ ఎంత కాలం ఉండాలో తెలియడం లేదు," అన్నారు హేమ.

మణిపుర్ అంతటా ప్రజలు తమ ఇళ్ళనూ, జీవనోపాధినీ, తమ ప్రియమైనవారినీ కోల్పోవడాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు.

ఖుమాకు తన ప్రియమైనవారిని కోల్పోవడం కొత్తేమీ కాకపోయినా, డేవిడ్ మరణాన్ని అగీకరించడం ఆయనకు అంత సులువైన విషయమేమీ కాదు. 30 ఏళ్ళ క్రితం ఆయన రెండేళ్ళ కుమార్తె కలరాతో చనిపోయింది. ఆయన భార్య 25 ఏళ్ళ క్రితం క్యాన్సర్‌తో మరణించారు. కానీ డేవిడ్ మరణం చాలా పెద్ద శూన్యాన్నే మిగిల్చింది - ఆయనకు మిగిలిందంతా ఆ యువకుడు మాత్రమే.

ఖుమా డేవిడ్‌ను ఒక్కచేతిమీద పెంచారు. అతని బడిలో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాలకు హాజరయ్యారు. డేవిడ్ ఉన్నత పాఠశాల చదువును ముగించాక ఏ కళాశాలలో చేరాలో అతనికి సలహా ఇచ్చారు. తాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని డేవిడ్ మొదటగా తండ్రితో చెప్పినప్పుడు ఆయన డేవిడ్‌తోనే ఉన్నారు.

ఇన్నేళ్ళూ ఒకరికి ఒకరుగా బ్రతికిన వారి కుటుంబం మళ్ళీ పెరగటం ప్రారంభమైంది. డేవిడ్‌కు మూడేళ్ళ క్రితం పెళ్ళయింది. ఏడాది తర్వాత ఓ బిడ్డ పుట్టాడు. కుటుంబ పెద్దగా తన మనవడితో ఆడుకుంటాననీ, బిడ్డను పెంచడంలో కుటుంబానికి సహాయంగా ఉంటాననీ ఆయన ఊహించుకున్నారు. కానీ కుటుంబం మళ్ళీ విడిపోయింది. డేవిడ్ భార్య తన బిడ్డతోనూ తల్లితోనూ కలిసి మరొక గ్రామంలో ఉంటున్నారు. ఖుమా తన సోదరుడితో ఉంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఉన్నవల్లా జ్ఞాపకాలు - గుండెల్లో పదిలంగా దాచుకోవాలనుకుంటున్నవి కొన్ని, వదిలించుకోవాలనుకుంటున్నవి మరికొన్ని.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli