మనోహర్ ఎలవర్తి ఏప్రిల్ 19, 2024న బెంగళూరులోని అతిపెద్ద మురికివాడ అయిన దేవర జీవనహళ్ళిలో క్వీర్ సముదాయపు హక్కులపై అవగాహన పెంచే కార్యక్రమానికి అన్నీ సిద్ధంచేసుకున్నారు. జెండర్, లైంగిక మైనారిటీల హక్కుల బృందమైన సంగమ వ్యవస్థాపకుల్లో ఎలవర్తి కూడా ఒకరు. అతను LGBTQIA+ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్‌సెక్స్, అసెక్సువల్, “+” అంటే సంక్షిప్త రూపంలో గుర్తించలేని అన్ని ఇతర ఐడెంటిటీలను సూచిస్తుంది) సమస్యలతో పాటు పెరుగుతున్న జీవన వ్యయాలు, నిరుద్యోగం, లౌకికవాదం వంటి సామాజిక సమస్యల గురించి కూడా అక్కడ నివాసముండేవారితో చర్చించాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ చర్చకు నాయకత్వం వహించడానికి అతను జెండర్ అండ్ సెక్సువల్ మైనారిటీస్ ఫర్ సెక్యులర్ అండ్ కాన్‌స్టిట్యూషనల్ డెమోక్రసీ (GSM) సభ్యులతో జట్టుకట్టారు.

యాదృచ్ఛికంగా, భారతదేశం తన 2024 సార్వత్రిక ఎన్నికలను ప్రారంభించిన మొదటి రోజు కూడా ఇదే. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఎన్నికలు జరగడానికి ఒక వారం ముందు.

ఎలవర్తి ప్రచారాన్ని ప్రారంభించగానే, కాషాయ కండువాలు, పార్టీ చిహ్నాలు ధరించిన భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన 10 మంది వ్యక్తులు, డిజె హళ్ళిగా ప్రసిద్ధి చెందిన దేవర జీవన్‌హళ్ళిలోని ఇరుకైన సందులలో అతనిని, నన్ను (ఈ ప్రచారాన్ని కవర్ చేస్తోన్న విలేఖరి) చుట్టుముట్టారు. ఇక్కడ ఎక్కువమంది ఓటర్లు గ్రామీణ ప్రాంతాలనుంచి వలసవచ్చినవారు, వారిలో చాలామంది ముస్లిమ్ సముదాయానికి చెందినవారు.

"నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌వి మాత్రమే!" ఒక బిజెపి సభ్యుడు అరిచాడు. జిఎస్ఎమ్ ప్రచార ప్రణాళికలను నిరసిస్తూ, చుట్టూ గుమిగూడిన వ్యక్తుల నుండి నిరసన హోరెత్తేలా అతని అరుపు ప్రేరేపించింది. జిఎస్ఎమ్ కరపత్రాలను ఝుళిపిస్తూ, “ఇవి చట్టవిరుద్ధం!" అంటూ బిజెపి వ్యక్తులు ప్రకటించారు.

PHOTO • Sweta Daga
PHOTO • Sweta Daga

ఎడమ: స్థానిక బిజెపి పార్టీ కార్యాలయ ఉపాధ్యక్షుడు మణిమారన్ రాజు (ఎడమ), జెండర్, లైంగిక మైనారిటీల హక్కుల బృందమైన సంగమ వ్యవస్థాపకులైన మనోహర్ ఎలవర్తి (కుడి). కుడి: ఇతర జిఎస్ఎమ్ కార్యకర్తలను పిలవడానికి ప్రయత్నిస్తోన్న మనోహర్ (నీలిరంగు చొక్కా వేసుకుని, గడ్డంతో ఉన్న వ్యక్తి) వైపు చూస్తోన్న మణిమారన్ రాజు (ఎరుపు, తెలుపు గళ్ళచొక్కా వేసుకున్న వ్యక్తి) నాయకత్వంలోని బిజెపి పార్టీ కార్యకర్తలు

అధికార పార్టీని విమర్శించే కరపత్రాలను ఏ పౌర సామాజిక బృందం అయినా చట్టబద్ధంగా పంపిణీ చేయవచ్చు. అయితే ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీకి సంబంధించిన విమర్శనాత్మక విషయాలను ప్రచారం చేయడం నిషేధమని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి .

దీంతో ఆందోళన చేస్తోన్న పార్టీ సభ్యులకు మనోహర్‌ వివరించేందుకు ప్రయత్నించారు. ఇంతలో ఉన్నట్టుండి వారి దృష్టి నా వైపుకు మళ్ళింది. వాళ్ళు నా కెమెరాను ఆపేయమని డిమాండ్ చేస్తూ, నేనక్కడ ఎందుకున్నానో ప్రశ్నించడం ప్రారంభించారు.

నేనొక జర్నలిస్టునని తెలిశాక, వాళ్ళు నా పట్ల తమ దూకుడును తగ్గించారు. అది మనోహర్, నేను మిగిలిన వాలంటీర్లను కలవడానికి ముందుకు నడిచేందుకు వీలు కల్పించింది. ఆ గుంపులోనే ఉన్న స్థానిక బిజెపి పార్టీ కార్యాలయం ఉపాధ్యక్షుడైన మణిమారన్ రాజు, మా పనిని కొనసాగించనివ్వాలని నిర్ణయించుకున్నాడు.

కానీ ఆ అస్థిర పరిస్థితి ఇంతలోనే మారిపోయింది. కొద్దిసేపటికే పార్టీ కార్యకర్తల సంఖ్య రెండింతలై మమ్మల్ని చుట్టుముట్టింది. ఎన్నికల అధికారులు, పోలీసులతో కూడిన ఒక అధికారిక వాహనం కూడా ప్రత్యక్షమైంది.

కొద్ది నిముషాలలోనే, ఇంకా ప్రచార కార్యక్రమమేమీ ప్రారంభం కాకముందే, మనోహర్, జిఎస్ఎమ్ వాలంటీర్లు, నన్ను - మా అందరినీ దేవర జీవనహళ్ళి పోలీస్ స్టేషన్‌కు రావాలని అడిగారు.

PHOTO • Sweta Daga

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యుడు, ఎన్నికల సంఘం అధికారి ఎమ్. ఎస్. ఉమేశ్ (పసుపు చొక్కా)తో మనోహర్. బిజెపి పార్టీ కార్యకర్తలు, ఎన్నికల సంఘంలోని ఇతర సభ్యులు, జిఎస్ఎమ్ వాలంటీర్లు చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తున్న పోలీసు అధికారులు కూడా అక్కడ ఉన్నారు

*****

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి పార్టీ 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉంది, ఇప్పుడు 2024లో కూడా మూడవసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ ప్రాంతం ఉత్తర బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఇక్కడ బిజెపి నుంచి శోభా కరంద్లాజె, కాంగ్రెస్ నుండి ప్రొఫెసర్ ఎమ్.వి. రాజీవ్ గౌడ పోటీలో ఉన్నారు.

జిఎస్ఎమ్ కరపత్రాలలో పెరిగిపోతున్న గ్యాస్ సిలిండర్ల ధరలు, యువతలో నిరుద్యోగం, గత 10 సంవత్సరాలలో దేశం చూసిన మత అసహనం తీవ్ర పెరుగుదలపై విమర్శలు ఉన్నాయి.

“మతం, కులం, భాష పేరుతో మనల్ని విభజిస్తూ దాని ప్రతినిధులు నిరంతరం ప్రసంగాలు చేస్తున్నారు.శాంతి, సామరస్యాల నిలయమైన మన భూమి కర్ణాటకలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి వారిని అనుమతించగలమా(?)" అని ఆ కరపత్రం అడుగుతుంది.

"ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడినప్పుడు, కేవలం ఒక సముదాయాన్ని రక్షించడంలో మనకు ఒక విషయం కనిపించదు, కానీ ప్రజాస్వామ్యం అనే పెద్ద ఆలోచనను మనం రక్షించుకోవాలి," అని మనోహర్ చెప్పారు. “జిఎస్ఎమ్‌కి కాంగ్రెస్ ఉత్తమమైన పార్టీ అని మేం భావించడం లేదు, కానీ ప్రస్తుత పాలన మన రాజ్యాంగం, లౌకికవాదం, ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు. ప్రజాస్వామ్యాన్ని కోల్పోతే, మొత్తం అట్టడుగు వర్గాలన్నీ నష్టపోతాయి,” అని ఆ మురికివాడలోని ఇరుకైన సందుల గుండా మేం నడుస్తూ వెళుతున్నప్పుడు ఆయన చెప్పారు.

"ఎన్నికల సమయంలో LGBTQIA+ ప్రజలు ఇంత పెద్ద కూటమిగా కలిసి రావడం కర్ణాటక చరిత్రలో ఇదే మొదటిసారి," అని క్వీర్ విద్యావంతుదు సిద్ధార్థ్ గణేశ్ చెప్పారు. జిఎస్ఎమ్‌లో కోలార్, బెంగళూరు నగర ప్రాంతం, బెంగళూరు గ్రామీణ ప్రాంతం, చిక్కబళ్ళాపూర్, రామనగర్, తుమకూరు, చిత్రదుర్గ, విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూర్, యాదగిరి, కలబురగి, బీదర్, బీజాపూర్, బెళగావి, ధార్వాడ్‌, గదగ్, షిమోగా, చిక్కమగళూరు, హాసన్, చామరాజ్‌నగర్ వంటి వివిధ కర్ణాటక జిల్లాలకు చెందిన క్వీర్ సముదాయం, మిత్రపక్షాలు సభ్యులుగా ఉన్నారు.

"ప్రచార ప్రయత్నాలను సమన్వయం చేయడానికి క్వీర్ కమ్యూనిటీ జిఎస్ఎమ్ గొడుగు కిందకు కలిసి రావడం అన్ని అల్పసంఖ్యాక వర్గాలకు మరింత న్యాయమైన, సమానమైన సమాజాన్ని సాధించే దిశగా ఒక పెద్ద ముందడుగు," అని విశాల జిఎస్ఎమ్ సభ్యులలో ఒకటైన సెక్సువల్ మైనారిటీ, సెక్స్ వర్కర్స్ రైట్స్ కూటమి (CSMR)లో భాగమైన సిద్ధార్థ్ చెప్పారు.

*****

PHOTO • Sweta Daga
PHOTO • Sweta Daga

ఎడమ: మనోహర్‌ను చుట్టుముట్టిన బిజెపి కార్యకర్తలు. కుడి: మనోహర్ (నీలి రంగు చొక్కా, బ్యాక్‌పాక్ తగిలించుకున్నవారు)తో మాట్లాడుతోన్న పోలీసు అధికారి సయ్యద్ మునియాజ్, ఎన్నికల కమిషన్ అధికారి ఎమ్.ఎస్. ఉమేశ్ (పసుపు రంగు చొక్కా)

దూకుడుగా ఉన్న పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టివున్న మా కార్యకర్తల బృందాన్ని ఉద్దేశించి ఎన్నికల సంఘం అధికారి సయ్యద్ మునియాజ్ మాట్లాడుతూ, "ఒక చట్టం ఉల్లంఘించబడింది," అన్నారు. ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లో భాగమైన మునియాజ్ బిజెపి చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు. మేం ఆ ఫిర్యాదును చూస్తామని అడిగినప్పుడు, అది కేవలం మౌఖిక ఫిర్యాదు మాత్రమే అని ఆయన చెప్పారు.

"వాలంటీర్లపై నమోదైన ఫిర్యాదు ఏమిటి?" అని నేను అడిగాను. "వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది," అని మునియాజ్ కరపత్రాల పంపిణీని ప్రస్తావిస్తూ చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కట్టుబడి ఉండటమే ఉత్తమమని వాలంటీర్లు నిర్ణయించారు.

మేం స్టేషన్‌కి వెళుతుండగా, కాషాయ కండువాలు ధరించిన కొంతమంది ఆ ఇరుకైన సందుల్లో మోటర్‌బైక్‌లపై దాదాపుగా మమ్మల్ని రాసుకుంటూ దూసుకొచ్చి, “మీరు చావాలి”, “పాకిస్తాన్‌కి వెళ్ళిపొండి”, “మీరసలు భారతీయులే కాదు" అంటూ వెళ్ళారు.

స్టేషన్‌లో మరో 20 మంది మా కోసం ఎదురు చూస్తున్నారు. జిఎస్ఎమ్ వాలంటీర్లతో పాటు నేను కూడా లోపలికి వెళ్ళినప్పుడు, వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. అంతా పార్టీ కార్యకర్తలే అయిన ఆ వ్యక్తులు నా ఫోన్‌ను, కెమెరాను లాక్కుంటామని బెదిరించారు. కొంతమంది నా వైపుకు కదిలారు, కానీ మరికొందరు వారిని అడ్డుకున్నారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ వాలంటీర్లతో మాట్లాడుతున్నప్పుడు నన్ను గది నుండి బయటకు పంపించేయమని వాళ్ళు కోరారు.

దాదాపు అరగంటపాటు ఆ స్టేషన్‌లో నిర్బంధించిన తర్వాత, ఆ బృందాన్ని విడిచిపెట్టారు. లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు లేదు. చట్టబద్ధత ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలకు అవకాశం ఇవ్వకుండా జిఎస్ఎమ్ వాలంటీర్‌లను స్టేషన్‌ను నుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు. ఆ రోజు కూడా వారిని ప్రచారం చేయనివ్వలేదు.

PHOTO • Sweta Daga
PHOTO • Sweta Daga

ఎడమ: అంతకుముందు బైక్‌పై అరుస్తూ వచ్చి జిఎస్ఎమ్ వాలంటీర్లను ఎగతాళి చేసిన ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతోన్న మునియాజ్. కుడి: జిఎస్ఎమ్ వాలంటీర్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతోన్న మునియాజ్

PHOTO • Sweta Daga
PHOTO • Sweta Daga

ఎడమ: జిఎస్ఎమ్ వాలంటీర్ల కోసం పోలీస్ స్టేషన్‌ వద్ద ఎదురుచూస్తోన్న బిజెపి కార్యకర్తలు. కుడి: తమ కరపత్రాలు, చేయాలనుకున్న ప్రచారం చట్టబద్ధమైనవని పోలీసులతో చెప్తోన్న జిఎస్ఎమ్ వాలంటీర్లు

"శతాబ్దాల తరబడి రాజ్యం ద్వారా నేరంగా పరిగణించబడిన తరువాత, ఇది రాజ్య నిర్లక్ష్యం, ఉదాసీనత, హింసను రద్దు చేసే దిశగా చేసే ఉద్యమం. ఇక్కడి క్వీర్ సముదాయం రాజకీయాల్లో క్వీర్ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోంది," అని బెంగళూరులో క్వీర్ ఆచరణతత్త్వాన్ని అధ్యయనం చేస్తోన్న విద్యావంతుడైన సిద్ధార్థ్ చెప్పారు.

నేను అనుకున్న కథనాన్నయితే చేయలేకపోయాను, కానీ ఈ సంఘటన చెప్పడం అనేది చాలా ముఖ్యం.

"నేనేం చెప్పగలను?" తన సహచరుడి ప్రవర్తన గురించి అడిగినప్పుడు బిజెపికి చెందిన మణిమారన్ రాజు అన్నాడు. “నాకేం చెప్పాలో తెలియడంలేదు. ఇది ముగిసిన వెంటనే నేను వారితో మాట్లాడతాను. వారట్లా ప్రవర్తించి ఉండకూడదు (కెమెరాను లాకోవడానికి ప్రయత్నించటం)."

ఎన్నికల ప్రక్రియ ముగియటానికి ఒక నెల కంటే తక్కువ సమయం మిగిలి ఉన్న ఈ రోజున, దేశవ్యాప్తంగా జోక్యం చేసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు అనేకసార్లు పిలుపులు రావడమే కాకుండా, ఓటింగ్ ప్రక్రియలో అనేకమంది పౌరులు వేధింపులను, బెదిరింపులను ఎదుర్కొన్నారు.

వాలంటీర్లు, నేను భౌతిక దాడికి గురికాకుండా క్షేమంగా వెళ్ళిపోయాం, కానీ ఒక ప్రశ్న మిగిలే ఉంది: వారి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం కోసం ఇంకా ఎంతమంది వ్యక్తులు జడిపించబడ్డారో?

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Sweta Daga

Sweta Daga is a Bengaluru-based writer and photographer, and a 2015 PARI fellow. She works across multimedia platforms and writes on climate change, gender and social inequality.

Other stories by Sweta Daga
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli