ఫిబ్రవరి 18, 2024న, మధ్యాహ్నం 3 గంటల సమయంలో, మధ్యాహ్న సూర్యుని వేడిమి కింద, నగరం రెండవ ప్రైడ్ పాదయాత్రను జరుపుకోవడానికి సుమారు 400 మంది రంగురంగుల దుస్తులు ధరించిన సహభాగులు సబర్ నుండి మైసూరు టౌన్ హాల్‌కు కవాతు చేశారు.
“నేనిక్కడ [ఈ మార్చ్‌లో] ఉన్నందుకు గర్వపడుతున్నాను. మైసూరు మారిపోయింది," అని ఈ నగరంలోనే పెరిగిన షేక్‌జారా చెప్పారు. "నేను గత 5-6 సంవత్సరాలుగా క్రాస్ వస్త్రధారణ చేస్తున్నాను, కానీ ప్రజలు నన్ను 'అబ్బాయి అమ్మాయిల దుస్తులను ఎందుకు ధరించాడు?' అంటూ విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు చాలావరకూ మమ్మల్ని ఒప్పుకుంటున్నారు. నేనెలా ఉన్నానో అందుకు నేను గర్వపడుతున్నాను,” అని ప్రస్తుతం బెంగళూరులోని కాల్ సెంటర్లో పనిచేస్తున్న 24 ఏళ్ళ షేక్‌జారా చెప్పారు. షేక్‌జారా వలెనే అనేకమంది కర్ణాటక, గోవా, తమిళనాడులలోని ఇతర ప్రాంతాల నుండి తమ మద్దతును తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు.
ఎల్లమ్మ దేవత (రేణుక అని కూడా అంటారు) బంగారు విగ్రహం ఈ వేడుకలో విశిష్ట ఆకర్షణ. డప్పులు కొట్టేవారు, నృత్యకారులు తమ చుట్టూ ఉండగా, సుమారు 10 కిలోగ్రాముల బరువున్న ఈ విగ్రహాన్ని ఈ ఉత్సవంలో పాల్గొంటున్నవారు తమ తలలపై మోసుకెళ్ళారు.


ఎడమ: సకీనా (ఎడమ), కునాల్ (కుడి)తో కలిసి ప్రైడ్ పాదయాత్ర వేడుకను జరుపుకుంటోన్న షేక్‌జారా (మధ్య). 'నేనిక్కడ [మార్చ్‌లో] ఉన్నందుకు గర్వపడుతున్నాను. మైసూరు మారిపోయింది' అని షేక్‌జారా చెప్పారు. కుడి: ఫిబ్రవరి 18, 2024న జరిగిన పాదయాత్రలో పాల్గొన్న గరగ్కు చెందిన విద్యార్థి ఆర్. తిప్పేశ్

దాదాపు 10 కిలోల బరువున్న ఎల్లమ్మ దేవత బంగారు ప్రతిమను తమ తలపై మోసుకెళ్తోన్న పాదయాత్రలో పాల్గొంటున్నవారు
ట్రాన్స్ సముదాయంతో కలిసి పనిచేసే నమ్మ ప్రైడ్, సెవెన్ రెయిన్బోస్ మద్దతుతో ఈ పాదయాత్ర నిర్వహించారు. "ఈ సంవత్సరంలో ఇది మా రెండవ పాదయాత్ర. మేం ఒక్క రోజులోనే దీనికి పోలీసు అనుమతి పొందాం [అయితే] గత సంవత్సరం మాకు అనుమతి పొందటానికి రెండు వారాలు పట్టింది," అని సముదాయంలో అందరూ గౌరవంగా ప్రణతి అమ్మ గా పిలిచే ప్రణతి చెప్పారు. ఆమె సెవెన్ రెయిన్బోస్ వ్యవస్థాపకురాలు; జెండర్, లైంగికత సమస్యలపై భారతదేశ వ్యాప్తంగా 37 సంవత్సరాలుగా పనిచేశారు.
"పోలీసులతో మెరుగ్గా ఎలా వ్యవహరించాలో మేం నేర్చుకుంటున్నాం. మైసూరులో మమ్మల్ని అంగీకరించనివారు, మేం లేకుండా పోవాలనుకునేవారు ఇంకా ఉన్నారు. కానీ మేం దీన్ని [ప్రైడ్ పాదయాత్ర] ప్రతి ఏటా మరింత పెద్ద ఎత్తున, మరింత వైవిధ్యంతో చేయాలనుకుంటున్నాం," అన్నారామె.
ఒక కిలోమీటరు పొడవునా సాగిన ఈ పాదయాత్ర నగరంలోని ఒకానొక రద్దీగా ఉండే మార్కెట్ గుండా సాగింది. స్థానిక పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలో చురుగ్గా వ్యవహరించి ఈ వేడుకను సరళంగా సాగిపోయాలా చూశారు. "ఈ సముదాయాన్ని మేం గౌరవిస్తాం. ఎలాంటి చెడూ జరగకుండా ఉండేందుకు మేం దారి పొడవునా వీరితో కలిసి నడిచాం. మేం వీరికి [ట్రాన్స్‌జెండర్] మా మద్దతునిస్తాం," అన్నారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ విజయేంద్ర సింగ్
"భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ మహిళలు సంక్లిష్టమైన పరిస్థితులలో ఉన్నారు. మాంత్రిక శక్తుల పట్ల ఉన్న అపోహల కారణంగా వారికి కొంత సాంస్కృతిక రక్షణ దొరుకుతున్నప్పటికీ, వారు కూడా వివక్షకూ వేధింపులకూ గురవుతారు," క్వీర్ పురుషునిగా గుర్తింపు ఉన్న మానసిక ఆరోగ్య నిపుణుడు దీపక్ ధనంజయ అన్నారు. "స్థానిక సముదాయం ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఒక రకమైన ఆలోచనా విధానాన్ని మార్చటమనేది ఒక్క రాత్రిలో జరిగేది కాదు కానీ హింసకు తావు లేకుండా జరుగుతోన్న ఈ కవాతులను, ముఖ్యంగా చిన్న నగరాల్లో, చూసినప్పుడు నాకు ఆశ కలుగుతోంది,” అని ఆయన చెప్పారు.
ప్రైడ్ పాదయాత్రకు హాజరైన ప్రియాంక్ ఆశా సుకానంద్ (31), “నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు వివక్షనూ వేధింపులనూ ఎదుర్కొన్నాను. నా హక్కులను స్థిరపరచుకోవడానికి, వాటిని నొక్కి చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను పాల్గొనే ప్రతి ప్రైడ్ పాదయాత్ర, నేనూ నా పరిస్థితిలోనే ఉన్న ఇతరులూ పడిన అన్ని కష్టాలను గుర్తుచేస్తుంది. అందుకే నేను వారి కోసం కూడా ఈ పాదయాత్రను చేస్తున్నాను," అని బెంగుళూరుకు చెందిన ఈ విశిష్ట విద్యావేత్త, చెఫ్ అన్నారు. “మేం మైసూరు LGBT కమ్యూనిటీ నిజమైన బలాన్ని చూశాం, ఇది మాకు చాలా భరోసానిచ్చింది."

'నేను బెంగళూరు నుండి వచ్చాను. ఎందుకంటే నన్ను నేను ఎక్కడ, ఎప్పుడు చూపించగలిగితే అక్కడికి అప్పుడు రావటం ముఖ్యమని నేను భావిస్తున్నాను. నేను కూడా ఆనందించాను,' ట్రాన్స్‌జెండర్ జెండాను ఊపుతూ అంటోన్న నందిని

స్థానిక పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించటంలో చాలా చురుగ్గా వ్యవహరించారు. ఈ సముదాయాన్ని మేం గౌరవిస్తాం. ఎలాంటి చెడూ జరగకుండా ఉండేందుకు మేం దారి పొడవునా వీరితో కలిసి నడిచాం. మేం వీరికి [ట్రాన్స్‌జెండర్] మా మద్దతునిస్తాం," అన్నారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ విజయేంద్ర సింగ్

నమ్మ ప్రైడ్, సెవన్ రెయిన్బోస్ నిర్వహించిన ఈ పాదయాత్రలోకి అందరికీ - సముదాయానికీ, వారి స్నేహితులకూ కూడా - ప్రవేశముంది

నగరానికి చెందిన ఆటో డ్రైవర్ అజర్ (ఎడమ), క్వీర్ పురుషుడిగా గుర్తింపు ఉన్న మానసిక ఆరోగ్య నిపుణుడు దీపక్ ధనంజయ. 'నేను ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు,' అన్నారు అజర్

ఎడమ నుండి కుడికి: ప్రియాంక్, దీపక్, జమీల్, ఆదిల్ పాషా, అక్రమ్ జాన్. జమీల్, ఆదిల్ పాషా, అక్రమ్‌లు స్థానికంగా బట్టల దుకాణాలను నడుపుతారు. 'నిజానికి మేం వాళ్ళను (ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు) అర్థంచేసుకోలేం, కానీ వారిని మేం అసహ్యించుకోం. వారికి ఖచ్చితంగా హక్కులు ఉండి తీరాలి’

ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ, యెల్లమ్మ దేవత (రేణుక అని కూడా అంటారు) విగ్రహం

సబర్ నుంచి మైసూరు టౌన్ హాలు వరకూ సాగిన ఈ పాదయాత్రలో అందరూ రంగురంగుల దుస్తులు ధరించి పాల్గొన్నారు

ప్రదర్శనలో నృత్యం చేస్తోన్న బెంగళూరుకు చెందిన మనోజ్ పూజారి

నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాలలో ఒక కిలోమీటరు మేర ఈ పాదయాత్ర సాగింది

పాదయాత్రలో పాల్గొన్నవారు

టౌన్ హాలు వైపుకు కదులుతోన్న జనం

తన దుస్తులను తానే కుట్టుకున్న బేగమ్ సోనీ, ఆ దుస్తులకున్న రెక్కలు క్వీర్గా ఉండటంలోని స్వేచ్ఛకు ప్రతీక అని చెప్పారు

ప్రైడ్ పతాకం

జనంతో కలిసి కవాతు చేసిన డప్పు వాయిద్య బృందం. 'మా సముదాయంలో నా సొంత సోదరితో సహా ట్రాన్స్‌జెండర్ అక్కలు చాలామంది ఉన్నారు. వారు కూడా మా సముదాయంలో భాగమే కాబట్టి వారికి మేం అండగా ఉంటాం' అంటారు నందీశ్ ఆర్

ఈ పాదయాత్ర మైసూరు టౌన్ హాలు వద్ద ముగిసింది
అనువాదం: సుధామయి సత్తెనపల్లి