“మా దీవి ఒక పెద్ద పగడపు దిబ్బపై ఉందని నాకు నా చిన్నప్పుడు చెప్పారు. ఆ పగడం అంతా లోపల ఉండి, దీవిని జాగ్రత్తగా పట్టి ఉంచుతుంది. ఇంకా మా చుట్టూ ఉన్న ఉప్పునీటి మడుగు ఏమో మమ్మల్ని సముద్రం నుండి కాపాడుతుంది,” అంటారు బిట్రా దీవిపై నివసించే 60 ఏళ్ల మత్స్యకారుడు,  బి. హైదర్.

“నా చిన్నతనంలో, సముద్రంలో పోటు తక్కువగా ఉన్నప్పుడు పగడాలు చూడగలిగేవాళ్ళం,” అంటారు బిట్రా దీవిపైనే నివసించే మరొక 60 ఏళ్ల మత్స్యకారుడు, అబ్దుల్ ఖాదర్. “భలే అందంగా ఉండేవిలే. ఇప్పుడు అవేవీ లేవు. కానీ పెద్ద పెద్ద అలలను ఆపాలంటే పగడం వల్లే అవుతుంది.”

లక్షద్వీప్ ద్వీపసమూహంలోని ద్వీపాలలో ఎన్నో కథలకు, ఊహలకు, జీవితాలకు, జీవనాలకు, జీవావరణ వ్యవస్థలకు మూలమైన ఆ పగడం, బ్లీచింగ్ అనే ప్రక్రియ ద్వారా నెమ్మదిగా కనుమరుగైపోతోంది. ఇటువంటి ఎన్నో మార్పులను, అక్కడి మత్స్యకారులు కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్నారు.

“ఇందులో ఏముంది. ప్రకృతి మారిపోయింది,” అని మునియమిన్ కె. కె. వివరిస్తారు. 61 సంవత్సరాల మునియమిన్, తనకు 22 ఏళ్ళు ఉన్నప్పటి నుండి, అగట్టి ద్వీపంలో చేపలు పడుతున్నారు. “ఆ రోజుల్లో ఋతుపవనాలు సమయానికి వచ్చేవి [జూన్ లో], కానీ ఇప్పుడవి ఎప్పుడు వచ్చేది చెప్పగలిగే అవకాశమే లేకుండా పోయింది. మాకు దొరికే చేపలు కూడా తగ్గిపోయాయి. సముద్రం లోపలికి పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా, తీరం అంచునే చేపల గుంపులు ఉండేవి. కానీ ఇప్పుడు, చేపలు వెతుక్కుంటూ రోజులు, కొన్ని సార్లు వారాల తరబడి ఇల్లు వదిలేసి సముద్రంలో ఉండాల్సిన పరిస్థితి.”

భారత్ లోని అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ ద్వీపసమూహంలో భాగాలయిన బిట్రా, అగట్టి దీవులు, మొత్తం ద్వీపసముదాయంలోకెల్లా నిష్ణాతులైన మత్స్యకారులకు నివాసాలు. వీటి మధ్య పడవలో ప్రయాణించడానికి, ఏడు గంటల సమయం పడుతుంది. లక్షద్వీప్ పేరులో లక్ష ద్వీపాలున్నా, నిజానికి మన కాలంలో అక్కడ 36 దీవులు మాత్రమే ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం, అంతా కలిపి, 32 చదరపు కిలోమీటర్లు. ఈ ద్వీపసమూహం కిందకు వచ్చే సముద్రం మాత్రం, 4 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అమూల్యమైన సముద్రజీవులు, వనరులను కలిగి ఉంది.

మొత్తం ఒకే జిల్లాగా ఉండే ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రతి ఏడుగురిలో ఒకరు, జీవనం కోసం చేపలు పట్టుకుంటారు. అంటే [2011 జనగణన ప్రకారం] మొత్తం 64,500 జనాభాలో 9,000 మంది మత్స్యకారులే.

PHOTO • Sweta Daga

బిట్రాతో సహా, లక్షద్వీప్ భారతదేశంలోని ఏకైక పగడపు దీవుల సముదాయం. ‘నా చిన్నతనంలో, సముద్రపు పోటు తక్కువగా ఉన్నప్పుడు పగడాలు [ఫోర్ గ్రౌండ్, కింద కుడిప్రక్క]  చూడగలిగేవాళ్ళం,’ అంటారు బిట్రాపై నివసించే మత్స్యకారుడు, అబ్దుల్ ఖాదర్ (కింద, ఎడమ ప్రక్క). ‘ఇప్పుడు అవి పెద్దగా మిగల్లేదు’

ఋతుపవనాల రాకను బట్టి తమ క్యాలెండర్లను సెట్ చేసుకునేవాళ్ళమని దీవుల్లోని పెద్దవాళ్ళు చెప్తారు. కానీ “ఇప్పుడు సముద్రంలో ఏ సమయంలోనైనా అలజడి కలగొచ్చు. అప్పట్లో ఇలా ఉండేది కాదు,” అంటారు 70 ఏళ్ల యు. పి. కోయా. ఆయనకు మత్స్యకారునిగా ఇక్కడ 4 దశాబ్దాల అనుభవం ఉంది. “నేను అయిదో తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా, మినికోయ్ [అక్కడికి దాదాపు 300 కిమీల దూరం] నుంచి ఎవరో వచ్చి మాకు పోల్ అండ్ లైన్ ఫిషింగ్ నేర్పారు. అప్పటి నుండి లక్షద్వీప్ లో దాదాపు అందరం అదే విధానంలో చేపలు పట్టుకుంటున్నాం – ఎందుకంటే వలలు వాడితే అవి పగడాలలో చిక్కుకుని, వాటిని పగలగొట్టేస్తాయి. పక్షులు, మా కంపాస్ ల సాయం వల్ల మాకింకా చేపలు దొరుకుతున్నాయి.”

పోల్ అండ్ లైన్ ఫిషింగ్ లో భాగంగా మత్స్యకారులు, వారి పడవలపైన ప్రత్యేకంగా కట్టిన బల్లలపై నిలబడతారు. వారి కర్రలకి/పోల్స్ కి మరీ ఎక్కువ పొడవు కాని లైన్/దారం కట్టి, ఆ దారానికి చివర్లో, బాగా గట్టిగా ఉండే హుక్ ఒకదాన్ని జత చేస్తారు. ఇందుకోసం సాధారణంగా ఫైబర్ గ్లాస్ తో చేసిన హుక్ లను వాడతారు. పర్యావరణపరంగా సుస్థిరమైన ఈ పద్ధతిని ఇక్కడ నీటి ఉపరితలానికి దగ్గరలో ఉండే టూనా చేపల గుంపులను పట్టుకోవడానికి ఉపయోగిస్తారు. అగట్టి ఇంకా మిగిలిన లక్షద్వీప్ దీవులలో, కొబ్బరి ఇంకా చేప - ముఖ్యంగా టునాలు - భోజనాలలో అత్యవసరాలు.

ఈ ద్వీపసమూహంలో ప్రజలు నివసించే 12 దీవులలోకి, బిట్రా అతి చిన్నది కావడమే కాక అన్నిటికీ చాలా దూరంగా, మారుమూల ఉంటుంది. దాని వైశాల్యం, 0.105 చదరపు కిమీలు, లేదా సుమారుగా 10 హెక్టార్లు. అందమైన తెల్ల ఇసుక తీరాలు, కొబ్బరి చెట్లు, నిండి ఉండే ఈ దీవి చుట్టూ, సముద్రపు నీరు ఆకాశనీలం, టర్కోయిస్, ఆక్వా మరీన్ ఇంకా సీ గ్రీన్ వంటి నాలుగు అద్భుతమైన రంగుల్లో చాలా అందంగా ఉంటుంది. అక్కడికి పర్యాటకులకు అనుమతి లేదు; ఆ దీవిపై అడుగుపెట్టాక మాత్రం, ఎక్కడికైనా నడిచే వెళ్ళాలి. బిట్రా దీవిపై కార్లు, మోటర్ బైకులు అసలు ఉండవు, సైకిళ్ళు కూడా చాలా తక్కువ. 2011 జనగణన ప్రకారం, అక్కడి నివాసితుల సంఖ్య, 271.

కానీ అక్కడ 47 చదరపు కిమీల వైశాల్యం ఉండే పెద్ద ఉప్పునీటి మడుగు ఉంది. ఈ మడుగు, మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలోకెల్లా అతి పెద్దది. లక్షద్వీప్ ద్వీపసమూహంలోని నివాస ప్రాంతాలన్నీ నిజానికి పగడపు దిబ్బలు కావడం మూలంగా అక్కడి మట్టి కూడా చాలా భాగం పగడాల నుంచి వచ్చినదే.

ప్రాణం కలిగిన జీవులైన పగడాలు, దిబ్బలుగా ఉండి, ఈ దీవుల దగ్గర ఉండే సముద్రపు జీవాలకు, ముఖ్యంగా చేపలకు అనువైన జీవావరణ వ్యవస్థను అందిస్తాయి. పగడపు దిబ్బలు, ఇక్కడి దీవులను సముద్రపు పోటు నుండి కాపాడడమే కాక, సముద్రపు నీరు, ఇక్కడి పరిమితమైన మంచినీటిలో కలవకుండా ఆపే సహజమైన హద్దుగా కూడా నిలబడతాయి.

విచాక్షణారహితమైన చేపల వేట, ప్రత్యేకించి పెద్ద పెద్ద పడవలు, వలలతో చేసే బాటమ్ ట్రాలింగ్, ఇక్కడి మత్స్యకారులు, ఎరగా ఉపయోగించే చేపలను తగ్గించడంతో పాటు, దిబ్బలకు, వాటిపై ఆధారపడి ఉన్న జీవవైవిధ్యానికి, హాని కలిగిస్తుంది.

వీడియో చూడండి: ఎరచేపలను పట్టుకోవడానికి బోటులో వెళుతున్నారు.

పగడపు దిబ్బలు, టూనా చేపలను పట్టుకోవడానికి ఎరగా ఉపయోగించే చేపలకు, ఇంకా ఎన్నో రకాల ఉప్పునీటి మడుగు చేపలకు నివాసం. 2012లో యు.ఎన్.డి.పి వారు ప్రచురించిన లక్షద్వీప్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రకారం, మొత్తం భారతదేశ వ్యాపితంగా పట్టే చేపలలో 25% ఈ అమూల్యమైన దిబ్బలు, దాని చుట్టూ ఉన్న సముద్రం నుండే వస్తాయి. అన్ని చేపలు, ముఖ్యంగా టూనాలను పట్టుకోవాలంటే, ఎరగా ఉపయోగించే చేపలు చాలా అవసరం.

“మేము ఎర చేపలను పట్టుకోవాలంటే, అవి గుడ్లు పెట్టడం పూర్తయ్యే వరకు ఆగేవాళ్ళం. కానీ ఇప్పుడు, వాటిని ఎప్పుడు పడితే అప్పుడు పట్టేస్తున్నారు,” అంటారు 53 ఏళ్ల అబ్దుల్ రెహమాన్. ఆయన 30 సంవత్సరాలుగా జిల్లా కేంద్రమైన కవరత్తిలో చేపలు పడుతున్నారు. బిట్రా నుండి కవరత్తికి 122 కిమీల దూరం. “బోట్ల సంఖ్య పెరిగిపోయింది, కానీ మాకు దొరికే వేట మాత్రం తగ్గిపోయింది.” విచాక్షణారహితమైన చేపల వేట, ప్రత్యేకించి పెద్ద పెద్ద పడవలు, వలలతో చేసే బాటమ్ ట్రాలింగ్, ఇక్కడి మత్స్యకారులు, ఎరగా ఉపయోగించే చేపలను తగ్గించడంతో పాటు, పగడపు దిబ్బలకు, వాటిపై ఆధారపడి ఉన్న జీవవైవిధ్యానికి, హాని కలిగిస్తుంది.

ఇది సమస్యలో ఒక భాగం మాత్రమే.

ఎల్ నినో వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, సముద్రపు ఉష్ణోగ్రతలను పెంచి, పగడపు దిబ్బలలో విపరీతమైన ‘కోరల్ బ్లీచింగ్’కు కారణమవుతాయి. ఈ బ్లీచింగ్ వల్ల పగడాలు, వాటి రంగు, ప్రాణంతో పాటు, దీవులను రక్షించే శక్తిని కూడా కోల్పోతాయి. 1998, 2010, 2016 లలో లక్షద్వీప్, మూడు ‘మాస్ కోరల్ బ్లీచింగ్’ ప్రక్రియలను చవిచూసింది. నేచర్ కన్సర్వేషన్ ఫౌండేషన్ (ఎన్ సి ఎఫ్), మైసూరు కేంద్రంగా లాభాపేక్ష లేకుండా పనిచేసే వన్యప్రాణి సంరక్షణ, పరిశోధనా సంస్థ. 2018లో వారు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, ఈ పగడపు దిబ్బలు ప్రమాదంలో ఉన్నాయి. లక్షద్వీప్ దీవులలో 1998లో 51.6 శాతంగా ఉన్న పగడపు దిబ్బల విస్తారం, 2017 నాటికి, అంటే 20 ఏళ్ల కాలంలోనే, 11 శాతానికి పడిపోయిందని ఈ అధ్యయనం తేల్చింది.

“మాకు నాలుగైదు సంవత్సరాల వయసున్నప్పుడు పగడాలను గుర్తించాం. మేము నీళ్ళలోకి వెళ్ళకముందే, అది తీరానికి కొట్టుకురావడం చూశాం. దాన్ని మేము ఇళ్ళు కట్టుకోవడానికి వాడుకుంటాం,” అని 37 ఏళ్ల బిట్రా మత్స్యకారుడు అబ్దుల్ కోయా చెప్పారు.

మరోపక్క కవరత్తిలో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసే డా. కె.కె. ఇద్రీస్ బాబు తరిగిపోతున్న పగడాల గురించి ఇలా అన్నారు: “పగడపు దిబ్బలకి, సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలకి మధ్య సంబంధం ఖచ్చితంగా ఉంది. 2016లో సముద్రపు ఉష్ణోగ్రతలు తరచుగా 31 డిగ్రీల సెల్సియస్ అంతకంటే ఎక్కువ నమోదు కావడం చూశాం!” అధ్యయనాల ప్రకారం, 2005లో ఈ దిబ్బలు, 28.92 డిగ్రీల ఉష్ణోగ్రతలు చవిచూశాయి. 1985 లో ఆ సంఖ్య 28.5 డిగ్రీల సెల్సియస్.    సముద్రమట్టానికి 1-2 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో లేని ఈ దీవులకి వాతావరణం వేడెక్కటం, సముద్రమట్టాలు పెరగడం చాలా తీవ్రమైన సమస్యలు.

PHOTO • Rohan Arthur, Nature Conservation Foundation, Mysuru

పైవరుస: ఎల్ నినో వంటి తీవ్రమైన వాతావరణ ఉత్పాతాలు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెంచి భయంకరమైన కోరల్ బ్లీచింగ్ కి కారణమవుతాయి. దానివల్ల ఈ పగడాలలో రంగు, జీవం పోయి, ద్వీపాలను కాపాడే శక్తిని కోల్పోతాయి. కింది వరుస: 2014 లో తీసిన పవోనా క్లావుస్ పగడాల చిత్రాలు, పగడపు దిబ్బలలో నివసించే చేపలకు ఆలవాలమైన ఒక పొటాటో ప్యాచ్ జీవావరణ వ్యవస్థ. కానీ 2016 ఎల్ నినో ఉత్పాతం సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగి, ఈ పగడాలలో ఉండే పాలిప్ లు, వాటితో సహజీవనం చేసే ఆల్గేలను విసర్జించి తెల్లగా మారిపోయాయి.

కవరత్తిలోకెల్లా అతి పెద్దదైన పడవ పొడవు 53 అడుగులు. దాని యజమాని అయిన 45 ఏళ్ల నిజాముద్దీన్ కె. కూడా ఈ మార్పులను గమనించారు. క్రమంగా సాంప్రదాయిక పరిజ్ఞానం కనుమరుగు అయిపోవడం కూడా వారి సమస్యలను తీవ్రతరం చేస్తోందని ఆయన అభిప్రాయం: “మా నాన్న చేపలు పట్టేవారు. వాళ్ళ తరానికి చేపలు ఎక్కడ ఉంటాయో ఖచ్చితంగా తెలిసేది, వాళ్ళ దగ్గర ఆ సమాచారం ఉండేది. మా తరానికి ఆ జ్ఞానం అందుబాటులో లేకుండా పోయింది. మాకు ఎఫ్ఏడీలు [ఫిష్ అగ్రిగేటింగ్ డివైసెస్] లేకుండా చేపలు పట్టగలిగే పరిస్థితి లేదు. టూనా చేపలు దొరక్కపోతే ఉప్పునీటి మడుగు చేపల మీద పడతాం.” ఎఫ్ఏడీ అనే మాట వినడానికి హైటెక్ గా ఉన్నా, అవి దుంగలు, తెప్పల వంటి సాధారణ పనిముట్లే. అవి నీటిలోని చేపలను ఆకర్షించి, ఆ చేపలన్నింటిని ఒక చోటికి చేరుస్తాయి.

“కానీ ప్రస్తుతం నా ఆందోళన ఈ పగడపు దిబ్బల జీవవైవిధ్యం గురించి కాదు, ఇక్కడి ప్రజలకు వాటితో ఉన్న అవసరం,” అంటారు మెరైన్ బయాలజిస్టు డా. రోహన్ ఆర్థర్. ఆయన 20 సంవత్సరాలుగా లక్షద్వీప్ పై పరిశోధనలు జరుపుతున్నారు. “ఇక్కడి ప్రజల మనుగడ ఈ పగడపు దిబ్బలపైనే ఆధారపడి ఉంది. ఈ దిబ్బలలో కేవలం పగడాలు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన జీవావరణ వ్యవస్థ ఉంది. దీన్ని ఒక అడవిలా ఊహించుకోండి - అడవి అంటే చెట్లే కాదు కదా!”

డా. ఆర్థర్, ఎన్ సి ఎఫ్ వారి సముద్రం మరియు తీరాల ప్రోగ్రామ్ కు ఆధ్వర్యం వహిస్తారు. “లక్షద్వీప్ పగడపు దిబ్బలు వాటికి వచ్చిన కష్టాలను ఇప్పటివరకు చాలా మొండిగా తట్టుకోగలిగాయి. కానీ ప్రస్తుతం అవి పునరుత్పత్తి అవుతున్న వేగం, వాతావరణ మార్పుల వల్ల సంభవించే ఉత్పాతాలను తట్టుకోగలిగే పరిస్థితి లేదు. అతిగా చేపలు పట్టడం వంటి మానవజనిత ఒత్తిళ్ళను లెక్కలోకి తీసుకుంతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుంది,” అని డా. ఆర్థర్ కవరత్తిలో మాతో అన్నారు.

వాతావరణ ఉత్పాతాలు, ప్రక్రియల వల్ల  కోరల్ బ్లీచింగ్ వంటి విపత్తులతో పాటు చాలా ఇబ్బందులు వస్తాయి. తుఫాన్లు – 2015 లో మేఘ్, 2017 ఓక్చి  కూడా లక్షద్వీప్ కు తీరని నష్టాన్ని మిగిల్చాయి. మత్స్య శాఖ గణాంకాల ప్రకారం సముద్రంలో చేపల లభ్యత కూడా చాలా తీవ్రంగా పడిపోయింది. 2016 లో మొత్తం అన్ని టూనా రకాలు కలిపి 24,000 టన్నుల చేపలు పడితే, ఆ సంఖ్య 2017 కల్లా 14,000 టన్నులకి పడిపోయింది – ఒక్క సంవత్సరంలో 40 శాతం తగ్గుదల. అలాగే ఆ సంఖ్య 2019 లో కిందటి యేటి 24,000 టన్నుల నుంచి 19,500 టన్నులకి పడిపోయింది. అక్కడి మత్స్యకారులు చెప్పినదాన్ని బట్టి ఎక్కువ వేట దొరికే సంవత్సరాలు కూడా ఉంటాయి. కానీ మొత్తం చేపలు పట్టే ప్రక్రియలో ఒక క్రమం లేకుండా, అనిశ్చితితో కూడుకున్న విషయంగా మారిపోయింది.

పైపెచ్చు, గత దశాబ్ద కాలంలో దిబ్బలలో ఉండే చేపలకు ప్రపంచవ్యాపితంగా డిమాండ్ పెరిగిపోయింది. దాంతో ఇక్కడి మత్స్యకారులు ప్రత్యేకంగా గ్రూపర్ చేపలు, లేదా ఇక్కడ చెమ్మమ్ లుగా పిలవబడే మాంసాహార చేపలను వెతికే పనిలో పడ్డారు.

PHOTO • Sweta Daga

ఎడమ: ‘పడవల సంఖ్య పెరిగిపోయింది, దొరికే చేపలు తగ్గిపోయాయి,” అని కవరత్తి దీవిలోని మత్స్యకారులు అంటారు; వారు పట్టుకున్న టూనా చేపలను దించుతున్న దృశ్యం. కుడి: బిట్రా దీవిపై తన వేటను ఆరబెడుతున్న అబ్దుల్ కోయా.

39-ఏళ్ల ఉమ్మర్ ఎస్. ది అగట్టి ద్వీపం. 15 సంవత్సరాలుగా చేపలు పట్టడం, పడవలు తయారు చేయడం చేస్తున్న ఆయన, తను గ్రూపర చేపలను ఎందుకు వేటాడతారో చెప్పారు. “ఇంతకు ముందు ఉప్పునీటి మడుగు దగ్గరే చాలా టూనా చేపలు తిరిగేవి. కానీ ఇప్పుడు వాటి కోసం 40-45 మైళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక వేరే దీవులకి వెళ్ళాలంటే రెండు వారాలు పడుతుంది. అందుకని నేను ఒకేసారి చెమ్మమ్ లను పట్టుకుంటున్నాను. వాటికి మార్కెట్ ఉంది. కానీ వాటిని పట్టుకోవడం కష్టమే. ఒక చేపను పట్టుకోవడానికి ఒక గంట వరకు ఎదురు చూడాల్సి రావచ్చు.”

రుచా కర్కరే ఈ రంగంలో అధ్యయనం చేస్తున్నారు. “పగడపు దిబ్బలు పాడైపోతూ ఉండడంతో, గ్రూపర్ చేపల సంఖ్య ఏటికేడు పడిపోతోంది. వేట దొరికే విషయంలో అనిశ్చితి, వాతావరణ మార్పుల వంటి ఇబ్బందులను ఎదుర్కొనే క్రమంలో ఇక్కడి మత్స్యకారులు దిబ్బలలో ఉండే చేపలను పట్టుకుంటూ ఉండడంతో, వాటి సంఖ్య మరింత తగ్గిపోతోంది. ప్రతి నెల, ఆ చేపల సంతానోత్పత్తి జరిగే అయిదు రోజులు, వాటిని పట్టుకోవడానికి వెళ్ళొద్దని వారికి సలహా ఇచ్చాం,” అని ఆవిడ మాతో బిట్రాలో అన్నారు.

బిట్రాలోని మత్స్యకారులు ఆ అయిదు రోజుల్లో వేటకు వెళ్ళడం విరమించుకున్నారు కానీ మిగిలిన వారు అందుకు సుముఖంగా లేరు.

“పిల్లలు కొంతమంది కిల్టాన్ దీవి నుంచి వచ్చి రాత్రిపూట బిట్రా దగ్గర చేపలు పడుతుంటారు,” అని అబ్దుల్ కోయా తన ఎండిన చేపలను వేరు చేస్తూ మాతో అన్నారు. “దాన్ని ఆపాలి...ఇది చాలా తరచుగా జరుగుతుంటుంది. దాంతో ఇక్కడి ఎర చేపలు, టూనాలు, దిబ్బలలో ఉండే చేపలు అన్నీ తగ్గిపోతున్నాయి.”

“ఇంకా దేశంలో వేరే ప్రాంతాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద పడవలు, పెద్ద పెద్ద వలలతో వస్తున్నాయి,” బిట్రా పంచాయితీ ఛైర్ పర్సన్ కూడా అయిన బి. హైదర్ అంటారు. “మా దగ్గర ఉన్న చిన్న పడవలతో మేము వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాము.”

ఇదిలా ఉంటే, వాతావరణం, వాతావరణ ఉత్పాతాలు మరింత అనూహ్యంగా మారుతున్నాయి. “నా వయసు నలభై దాటే సమయానికి నా జీవితంలో నేను రెండే తుఫాన్లను చూశాను,” అంటారు హైదర్. “కానీ గత కొన్నేళ్ళలో చాలా తరచుగా తుఫాన్లు రావడం, అవి మా పడగడపు దిబ్బలను నాశనం చేయడాన్ని గమనించాం.”

PHOTO • Sweta Daga

ఎడమ: ‘ఎర చేపలు వాటి గుడ్లు పెట్టాకే మేము వాటిని పట్టుకునే ప్రయత్నం చేసేవాళ్లం, కానీ ఇప్పుడు వాటిని ఎప్పుడంటే అప్పుడు పట్టేస్తున్నారు,” అని కవరత్తికి చెందిన మత్స్యకారుడు అబ్దుల్ రెహమాన్ అంటారు. కుడి: కావరత్తిలోనే అతి పెద్ద పడవకు యజమాని అయిన నిజాముద్దీన్ కె. కూడా అక్కడ వస్తున్న మార్పులను గమనించారు.

కవరత్తిలో అబ్దుల్ రెహమాన్ తుఫాన్ల ప్రభావం గురించి మాట్లాడుతూ, “ఇంతకుముందు స్కిప్ జాక్ టూనాలు పగడపు దిబ్బల దగ్గరలో ఉండేవి. కానీ ఓక్చి తర్వాత అంతా మారిపోయింది. 1990లలో, మేము సముద్రంలో 3-4 గంటలకు మించి ఉండాల్సి వచ్చేది కాదు. మా దగ్గర మెకనైజ్డ్ పరికరాలు ఏవీ ఉండేవి కాదు, కానీ చేపల లభ్యత చాలా బాగా ఉండడంతో మా పని చాలా త్వరగా అయిపోయేది. ఇప్పుడు మేము ఒక రోజు మొత్తం, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువసేపు సముద్రంలో ఉండాల్సిన పరిస్థితి. దిబ్బలలోని చేపలు పట్టుకోవాలని మాకు కూడా ఉండదు, కానీ టూనాలు దొరక్కపోతే, కొన్నిసార్లు అక్కడికి కూడా వెళ్తాం,” అని అన్నారు.

“పడవల సంఖ్య – ఇప్పుడున్నవి మరింత పెద్దవి కూడా – పెరిగిపోయింది. కానీ వేట లభ్యత తగ్గిపోయింది, మేము వేటాడటానికి అవసరమయ్యే ఖర్చులు పెరిగిపోయాయి,” అంటారు రెహమాన్.

మత్స్యకారుల ఆదాయం అంత సులభంగా అంచనా వేయలేం. అది నెలనెలా మారుతూ ఉంటుంది, అంటారు డా. ఆర్థర్. “వారిలో చాలామందికి వేరే ఉద్యోగాలు కూడా ఉంటాయి, దాంతో చేపల వేట ద్వారా వచ్చే ఆదాయాన్ని విడదీసి అంచనా వేయడం కష్టం అవుతుంది.” కానీ ఖచ్చితంగా వారి ఆదాయాలు, “గత దశాబ్దకాలంలో భారీ హెచ్చుతగ్గులను చవిచూశాయి.”

“లక్షద్వీప్, ఒకేసారి రెండు రకాల భారీ మార్పులకు గురవుతోంది. ఒక పక్క వాతావరణ మార్పు పగడపు దిబ్బలను నాశనం చేస్తుండడంతో అక్కడ ఉండే చేపల సంఖ్య తగ్గిపోతోంది. దాంతో మరోపక్క మత్స్యకారులు, వారి జీవనోపాధికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. కానీ ఈ దీవులకు బ్రైట్ స్పాట్ లు గా మారగలిగే అవకాశం ఉంది. ఇక్కడి సముద్ర జీవాల జీవావరణ వ్యవస్థలను కాపాడుకోవడం ద్వారా పగడపు దిబ్బలను కాపాడుకోగలిగితే, ఈ దీవులను మరింత కాలం పరిరక్షించగలుగుతాం,” అని డా. ఆర్థర్ అంటారు.

* వేర్వేరు కారణాల వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ చేపలు ఉండే పగడపు దిబ్బలను బ్రైట్ స్పాట్ లంటారు.

మరోపక్క కవరత్తిలో నిజాముద్దీన్ కె. సణుగుతూ మాతో ఇలా అన్నారు: “ఇరవై ఏళ్ల క్రితం, చాలా చేపలు ఉండేవి, మా పని నాలుగైదు గంటల్లో పూర్తి అయిపోయేది. ఇప్పుడేమో ఒక పడవ నింపడానికి రోజులురోజులు పడుతుంది. ఋతుపవనాలు మారిపోయాయి, వర్షం ఎప్పుడు పడుతుందో చెప్పలేని పరిస్థితి. చేపలు పట్టే సీజన్ లో కూడా సముద్రం పోటెత్తుతోంది. జూన్ లో ఋతుపవనాలు వస్తాయని మా పడవలన్నింటినీ తీరానికి చేర్చే అలవాటు మాకు. అది చాలా కష్టమైన పని కూడా. ఇప్పుడేమో అవి రావడానికి ఇంకో నెల అదనంగా పడుతోంది! మాకేమో వాటిని తీరంలో ఉంచాలా, తీయాలా అన్న సందిగ్ధం, పడవలేమో అలా తీరంలోనే పడి ఉన్నాయి. మేం కూడా ఇలా పడి ఉన్నాం.”

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే రికార్డు చేయాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ? అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం: సుజన్ ఎన్

Reporter : Sweta Daga

Sweta Daga is a Bengaluru-based writer and photographer, and a 2015 PARI fellow. She works across multimedia platforms and writes on climate change, gender and social inequality.

Other stories by Sweta Daga

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Sujan Nallapaneni

Sujan is a freelance journalist based in Guntur. He is a translation enthusiast.

Other stories by Sujan Nallapaneni