సిక్కింలో 300 హిమాలయన్ యాక్ లు ఆకలితో చనిపోయాయి '
'మంచులో ఇరుక్కుపోయి  300 యాక్ లు ఉత్తర సిక్కింలో ఆకలి చావుకు గురయ్యాయి’
మంచు కరిగి బయటపడ్డ సిక్కిం యాక్ విషాదం'

మే 12న ప్రచురితమైన ఈ వార్తాశీర్షికలు నన్ను కుదిపేశాయి. నేను ఫోటో జర్నలిస్టుగా హిమాలయాలకు ఎన్నోసార్లు వెళ్ళి వచ్చాను. ఇన్నిసార్లు చేసిన ప్రయాణంలో నేను నేర్చుకున్న ఒక్క విషయం ఏంటంటే అక్కడి సంచారజాతి పశువుల కాపరులు, ఆ పశువులను కాపాడుకునేందుకు ఎంత కష్టమైనా పడగలరు అని. ఈ పర్వతాలలోని విస్తారమైన ప్రాంతాలలో నివసించే పశువుల కాపరులకు యాక్ లు ప్రధాన జీవనాధారం. వీరు తమ పశువులతో పాటు ఋతువులకు అనుగుణంగా ప్రత్యేక పచ్చిక బయళ్ళ మధ్య ప్రయాణిస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎత్తైన ప్రాంతాలలో ఉన్న పచ్చిక బయళ్ళలో వారి పశువులను మేపి, చలికాలంలో కిందకి వస్తారు. చలికాలంలో ఆహారం సంపాదించుకోవడానికి వీరికి యాక్ లే ప్రధాన ఆధారం.

ఆ శీర్షికలకు అనుబంధంగా ఉన్న కొన్ని వ్యాసాలు యాక్ ల మృతికి గ్లోబల్ వార్మింగ్ కారణం అని వాదించాయి. అంత బలమైన జంతువులే దెబ్బ తింటున్నాయంటే వాటిపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న విషయం ఊహించలేనిది కాదు. అందుకే లడాఖ్ లోని హన్లే లోయకు తిరిగి వెళ్ళి అక్కడ నివసించే చంగ్పా కుటుంబాల, వారి యాక్ల పరిస్థితిని అర్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.

చంగ్పాలు, టిబెట్ పీఠభూమికి దక్షిణం వైపు భారతదేశంలో విస్తరించిన చంగ్తాంగ్ ప్రాంతానికి చెందినవారు. కాశ్మీర్ నూలు తయారు చేసిన మొట్టమొదటి వారిలో ఒకరైన వీరు, యాక్ లను కూడా పెంచుతారు. లేహ్ జిల్లా, న్యోమా  బ్లాక్ లోని హన్లే లోయలో దీకే , ఖర్లూగ్, మాక్, రాక్ ఇంకా యుల్పా వంటి ఎన్నో చంగ్పా పశుపాలక జాతులు నివాసం ఉంటాయి. వీరిలో బహుశా దీకే మరియు రాక్ లు  అత్యంత సమర్ధులైన యాక్ పోషకులు కావచ్చు.

“యాక్ లు విపరీతంగా చనిపోతున్నాయి,” అంటారు 35 ఏళ్ల ఝంపాల్ త్సెరింగ్. ఆయన హన్లేలో నివసించే నిపుణులైన దీకే పశుపోషకులలో  ఒకరు. “ఇక్కడి (పర్వతాలలోని ఎత్తైన ప్రాంతాల్లో) వాతావరణం ఊహించలేని విధంగా తయారైంది.” త్సెరింగ్ ను నేను హన్లేలోని ఇండియన్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీలో పనిచేసే సోనమ్ డోర్జీ సహాయంతో కలుసుకున్నాను. డోర్జీ, అదే లోయలోని ఖల్డో గ్రామంలో నివాసం ఉంటారు. త్సెరింగ్ ను మేము 14,000 అడుగుల ఎత్తులో ఉండే తక్ నక్ పో పచ్చిక బయళ్ళలోని ఆయన ఖుర్ లో (లాడాఖీ భాషలో ఆర్మీ టెంట్) కలుసుకున్నాము.

మే 2019లో సిక్కింలో జరిగిన విపత్తుకి మూడేళ్ల ముందు, నేపాల్ కేంద్రంగా పని చేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ వారు ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. అందులో భూటాన్, భారత్, నేపాల్ లో ఏటేటా తగ్గిపోతున్న యాక్ ల జనాభా గురించిన ప్రస్తావన ఉంది. ఆ పరిశోధకుల లెక్క ప్రకారం భారత్ లోని యాక్ ల సంఖ్య 1977లో 132,000 ఉంటే, 1997 నాటికి అది 51,000కు పడిపోయింది. అంటే కేవలం మూడు దశాబ్దాల కాలంలోనే యాక్ ల జనాభా 60 శాతం క్షీణించిపోయింది.

స్థానిక పశుసంరక్షణ మరియు డెయిరీ శాఖ వారి గణాంకాల ప్రకారం లేహ్ జిల్లాలోని యాక్ ల జనాభా 1991 లో 30,000 నుంచి 2010లో 13,000 కు పడిపోయింది. అంటే రెండు దశాబ్దాలలో 57 శాతం తగ్గింది. అధికారికంగా పైస్థాయిలో ఉపయోగించే గణాంకాలకి, ఈ స్థానిక గణాంకాలకి మధ్య కొద్దిగా వ్యత్యాసం ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం 2012 లో లేహ్ జిల్లాలోని యాక్ ల జనాభా 18,877గా నమోదయింది (ఈ లెక్క ప్రకారం అయినా సరే జనాభా 21 సంవత్సరాలలో 37 శాతం పడిపోయింది).

PHOTO • Ritayan Mukherjee

లడాఖ్ హన్లే లోయలోని ఎత్తైన పచ్చిక బయలులో పూర్తిగా పెరిగిన హిమాలయన్ యాక్. ఇవి కొన్ని వందల సంవత్సరాలుగా సంచార పశుపోషకులైన చంగ్పాలకు జీవనాధారంగా ఉన్నాయి.

దీకే లు  నివసించే ప్రాంతం చేరుకోవటం అంత సులభం కాదు. వారు తమ పశువులను మేపే పచ్చిక బయళ్ళు ఇతర పశుపోషకులు వినియోగించుకునే వాటికన్నా చాలా ఎత్తులో ఉంటాయి. పైపెచ్చు వారు టెంట్లు వేసుకునే కొన్ని చోట్లు భారత్-చైనా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉండటంతో అక్కడికి సాధారణ పౌరులు వెళ్ళడానికి అనుమతి లభించదు. అది వసంతకాలం కావడంతో సోనమ్ డోర్జీ సహాయంతో నేను వారి నివాస స్థలానికి చేరుకున్నాను.

“యాక్ లు అద్భుతమైన ప్రాణులు,” అంటారు ఝంపాల్ త్సెరింగ్. “యాక్ లు గడ్డకట్టే చలికి కూడా అలవాటు పడిపోయి ఉంటాయి. అవి మైనస్ 35 నుండి మైనస్ 40 డిగ్రీల చలిలో కూడా నిక్షేపంగా బ్రతకగలవు. కానీ ఉష్ణోగ్రతలు 12-13 డిగ్రీలకు చేరితేనే సమస్య. తీవ్రమైన చలికాలంలో, వాటి జీవక్రియ నెమ్మదిగా ఉండి, శరీరంలోని వేడిని కాపాడుతుంది. కానీ వాతావరణ మార్పుల వల్ల కలిగే ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల వల్ల యాక్ లు విపరీతంగా ఇబ్బంది పడతాయి.”

కాలా పరి (నల్లటి పర్వతం) వద్ద, దీకే నివాసాలకి 40 మిలోమీటర్ల దూరంలో మమ్మల్ని త్సిరింగ్ చోన్చుమ్ కలిశారు. ఆవిడ హన్లే లోయలో యాక్ యాజమానులైన అతికొద్ది మంది మహిళలలో ఒకరు. “ఇంతకు ముందు తో పోలిస్తే ఇప్పుడు వాతావరణం కొద్దిగా వేడిగా ఉండటం వల్ల, గొర్రెలు, పష్మీనా మేకలు, యాక్ ల ఒంటిపై బొచ్చు అంత దట్టంగా పెరగట్లేదు. అక్కడక్కడా చాలా పల్చగా ఉంటోంది, అంతే,” అంటారు ఆవిడ. “ఇప్పుడవి బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. యాక్ లు బలహీనంగా ఉండి,  తక్కువ పాలు ఇస్తే , మాకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. గత అయిదు సంవత్సరాలలో యాక్ ల ద్వారా మాకు వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది.” చోన్చుమ్, కాలానుగుణంగా తమ పశువులతో పాటు వేర్వేరు పచ్చిక బయళ్ళకు కదిలి వెళ్ళే రాక్ పశుపోషకుల జాతికి చెందినవారు. 2012 లో కొందరు స్వతంత్ర పరిశోధకులు వేసిన లెక్క ప్రకారం, ఇక్కడ ఒక సాధారణ పశుపోషకుల కుటుంబం యొక్క ఆదాయం ఇంచుమించుగా నెలకు 8,500 రూపాయలు.

చంగ్పా పశుసంరక్షకుల ఆదాయంలో యాక్ పాల వల్ల వచ్చే భాగం చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి యాక్ ల పోషణ వల్ల వచ్చే ఆదాయంలో దాదాపు 60 శాతం పాల ద్వారానే వస్తుంది. మిగిలిన భాగం, ఖులూ (యాక్ బొచ్చు) ఇంకా నూలు ద్వారా వస్తుంది. కాబట్టి, యాక్ ల సంఖ్య, పాల ఉత్పత్తిలో క్షీణతల వల్ల వీరి ఆదాయం దారుణంగా దెబ్బతింటోంది. ఈ మార్పులన్నీ యాక్ లకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

“ఇప్పుడు సమయానికి వర్షం కాని మంచు కాని కురవడం లేదు,” అంటారు త్సెరింగ్ చోన్చుమ్. “దాంతో పర్వతాలపైన గడ్డి సరిపడినంత దొరకట్లేదు. దీనివల్ల, ఇక్కడికి వచ్చే (పశువులను పోషించే) సంచారుల సంఖ్య కూడా తగ్గిపోయింది. నా లెక్క ప్రకారం, గడ్డి అందుబాటులో లేకపోవడం, దాని వల్ల కలుగుతున్న ఇబ్బందుల కారణంగా సంచారుల సంఖ్య 40 శాతం తగ్గిపోయింది. [ఇక్కడ మొత్తం అంతా కలిపి 290 సంచార పశుపోషకుల కుటుంబాలు ఉన్నట్టు అంచనా).

నా కొడుకు స్థానిక అబ్జర్వేటరీలో పని చేస్తాడు - అదొక్కటే నాకు కొంత ఉపశమనం కలిగించే విషయం. చంగ్పా కుటుంబాలలోని చాలా మంది యువత బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లేదా జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ ల రోడ్డు నిర్మాణ పథకాలలో కూలీలుగా పని చేస్తున్నారు.” చాలామంది ఉద్యోగాలు వెతుక్కుంటూ మరెక్కడికో వలస వెళ్ళిపోయారు.

స్థానిక అబ్జర్వేటరీలో పనిచేసే ఆ కొడుకే, నాకు ఈ ట్రిప్ లో సహాయపడ్డ సోనమ్ డోర్జీ. పర్వతాలలో ఈ మార్పులను సోనమ్ కూడా చాలా జాగ్రత్తగా గమనించాడు.

PHOTO • Ritayan Mukherjee

వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా చాలా చలిగా ఉండేది. తెలిసిన వారు కొందరు చెప్పిన ప్రకారం మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయేది.

“వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి,” అంటారు సోనమ్. “నాకు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ ప్రదేశం ఇంకా చాలా చల్లగా ఉండేది. నాకిప్పుడు 43 ఏళ్ళు, అంటే ఇది 30 సంవత్సరాల కిందటి మాట. నా అంతట నేనుగా ఎప్పుడూ ఉష్ణోగ్రత చూడలేదు కానీ కొంచెం తెలిసిన వాళ్ళు చెప్పేవాళు - ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ వరకూ వెళ్ళేదని. అంతటి చలిని తట్టుకోవటానికి ప్రజల బట్టలు కూడా అందుకు తగినట్టుగా ఉండాలి కదా. ఆ రోజుల్లో ఇవాళ్టి సింథటిక్ మెటీరీయల్ జాకెట్ ల లాంటివి ఏవీ లేవు. టోపీలు, దుస్తులు, వంటిపై వేసుకునేవి ఏవైనా పష్మీనా మేకల నూలు నుండే తయారు చేసేవారు. బూట్లు స్థానికంగా దొరికే బట్టతో చేసేవారు. వాటికి మోకాళ్ళ వరకు చిన్న చిన్న స్ట్రిప్స్ ఉండి కట్టుకోవడానికి వీలుగా ఉండేవి. బూట్ల లోపల కూడా పాదాల కింద ఉండేందుకు బాగా చదును చేయబడ్డ యాక్ చర్మాన్ని ఉంచేవారు. ఇప్పుడు అలాంటివి ఎక్కడా కనపడవు.”

పశ్చిమ హిమాలయ ప్రాంతంలోని లడాఖ్ మరియు లాహౌల్ & స్పితిలపై వాతావరణ మార్పుల ప్రభావం (Impacts of climate change in Ladakh and Lahaul & Spiti of the western Himalayan region) అనే పేరుతో పరిశోధకులు తుండుప్ ఆంగ్మో మరియు ఎస్. ఎన్. శర్మ 2016లో ఒక  పరిశోధనా పత్రం విడుదల చేశారు. అందులో వారు వేడెక్కుతున్న వాతావరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “వాతావరణ శాఖ (లేహ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్) వారి గణాంకాల ప్రకారం, గత 35 సంవత్సరాలుగా లేహ్ లో కనిష్ట ఉష్ణోగ్రత చలికాలంలో 1 డిగ్రీ సెల్సియస్, ఎండాకాలంలో 0.5 డిగ్రీ సెల్సియస్ పెరుగుతున్న ధోరణి కనిపిస్తుంది.  నవంబర్ నుండి మార్చి మధ్యలో కురిసే అవపాతంలో(precipitation) తగ్గుదల కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే మంచు కురవడం తగ్గిపోతోంది.”.

వారి అధ్యయనం ప్రకారం: “గత కొనేళ్ళుగా, లడాఖ్ ఇంకా లాహౌల్ & స్పితిలపై వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టతరం అవుతూ వస్తోంది. మంచు ఇంకా వర్షం కురిసే క్రమాలు మారిపోతున్నాయి; చిన్న చిన్న హిమానీనదాలు, శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉండాల్సిన ప్రాంతాలు కరిగి, నదులు/సెలయేళ్ళలోని నీటి ఒరవడిలో మార్పులు తెస్తున్నాయి, పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రత, తేమ కీటకాలు, తెగుళ్ళ వ్యాప్తికి ఉపయోగపడే పరిస్థితులను సృష్టిస్తున్నాయి.”

“ఈసారి మీరు ఎన్ని రెబోలని చూశారు?” అని ఝంపాల్ త్సెరింగ్ టెంట్ లో, ఆయన స్నేహితుడు సంగ్డా డోర్జీ మమ్మల్ని అడిగారు.

చంగ్పాలు, రెబో అనబడే టెంట్ లలో నివసిస్తారు. యాక్ నూలును దారంగా చేసి, ఆ దారాలను బట్టలుగా నేసి, చివరికి ఆ బట్టలను కుట్టి చంగ్పా కుటుంబాలు, తమ రెబోలను తయారు చేసుకుంటాయి. ఆ బట్ట వారిని తీవ్రమైన చలి నుండి, మంచు గాలుల నుండి కాపాడుతుంది.

చాలా కుటుంబాల వద్ద [ఇప్పుడు] రెబోలు లేవు,”అంటారు సంగ్డా. “కొత్త రెబో కుట్టుకోవడానికి నూలు ఉందా? గత కొన్నేళ్లలో యాక్ ల నుండి వచ్చే నూలు చాలా దారుణంగా తగ్గిపోయింది. రెబో లేదంటే సంచార జాతుల జీవనంలోని ఒక ముఖ్యమైన భాగం కనుమరుగు అయినట్టే. దానికి కారణం, వెచ్చబడుతున్న చలికాలమే.”

మే నెలలో, సిక్కింలో జరిగిన దారుణం కేవలం యాదృచ్ఛికమైనది కాదని నాకు అర్థం కావడం మొదలైంది. ఈ పశువుల కాపరులు వాతావరణ మార్పు వంటి పదాలు వాడకపోయినా దాని ప్రభావాన్ని మాత్రం చాలా స్పష్టంగా వివరించగలుగుతున్నారు. సోనమ్ డోర్జీ, త్సెరింగ్ చోన్చుమ్ ల మాటలు వింటే వారి ప్రాంతంలో జరుగుతున్న పెద్ద పెద్ద మార్పుల గురించి వారికి చాలా స్పష్టమైన అవగాహన ఉందని తెలుస్తుంది. ఆ మార్పులలో మనుషుల వల్ల జరుగుతున్నవి ఏంటివి అనే విషయంపై కూడా వారు అవగాహన కలిగి ఉన్నారు. బహుశా అందుకేనేమో ఎంతో అనుభవం ఉన్న 60 ఏళ్ల పశువుల కాపరి గుంబు తాషి నాకు ఈ మాట చెప్పారు: “పర్వతాలలోని వాతావరణం చాలా గమ్మత్తైనది. ఊహించలేనిది. మేము పొరపాటున పర్వతాల దేవుళ్ళకి కోపం తెప్పించినట్టున్నాం.”

PHOTO • Ritayan Mukherjee

ఈ ఎత్తైన పర్వతాలలోని విస్తారమైన ప్రాంతాలలో నివసించే చంగ్పా పశువుల కాపరులకు యాక్ లు ప్రధాన జీవనాధారం, ముఖ్యమైన ఆర్థిక వనరు, చలికాలంలో వారి ఆహారానికి మూలం

PHOTO • Ritayan Mukherjee

వాతావరణంలో వస్తున్న మార్పులు, ఎత్తైన పచ్చిక బయళ్ళలో మేసే చంగ్పాల యాక్ లు, పష్మీనా మేకలు, గొర్రెలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.

PHOTO • Ritayan Mukherjee

మారుతున్న పరిస్థితుల వల్ల చాలా చంగ్పా కుటుంబాలు, యాక్ నూలుతో చేసే సంప్రదాయ రెబోను వాడటం మానేశారు. దాని బదులు వారు లేహ్ టౌన్ లో దొరికే ఆర్మీ టెంట్ లను వాడుతున్నారు.

PHOTO • Ritayan Mukherjee

ఇప్పటికీ ఇక్కడివారు, యాక్ ల నుండి వచ్చే పదార్థాలతో చాలా ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇక్కడ యాక్ నూలుతో చేసిన కంబళి కప్పుకుని పడుకున్న చిట్టి డొన్చెన్ ను చూడచ్చు. తన తల్లి వారి పశువులను మేపడానికి బయటకి తీసుకువెళ్లింది.

PHOTO • Ritayan Mukherjee

చంగ్తాంగ్ పీఠభూమిపై నివసించే సంచార పశుపోషకుల తెగలకు యాక్ లు పాలు, మాంసం రూపంలో ముఖ్య ఆహార వనరు కూడా. మాంసం కోసం పశువులను చంపడం వారి ఆచారానికి విరుద్ధం. కానీ ఒకవేళ ఏదైనా యాక్ చనిపోతే మాత్రం ఆ ప్రాంతంలో తీవ్రమైన చలిని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులు దాన్ని మాంసాన్ని కొంత భుజిస్తారు.

PHOTO • Ritayan Mukherjee

చంగ్పా జాతిలో రక్వే తెగకు చెందిన గుంబు తాషికి దాదాపు 80 యాక్ లు ఉన్నాయి. ఆయన, మరికొందరు సంచార పశుపోషకులు, తమ సంప్రదాయ వృత్తిలోని ఇబ్బందుల గురించి చెప్తున్నారు.

PHOTO • Ritayan Mukherjee

దగ్గరలోని పచ్చిక బయలును చూపిస్తున్న గొన్పో డోన్డ్రుప్. అక్కడ గడ్డి పెరగడం ఆగిపోవడంతో ఆయన తన యాక్ లకు ఆహారం వెతుక్కుంటూ మరింత ఎత్తుకు ఎక్కి వెళ్ళాలి.

PHOTO • Ritayan Mukherjee

ఒక అనాథ యాక్ పిల్లను సాకుతున్న త్సిరింగ్ చోన్చుమ్. హన్లే లోయలో, యాక్ యాజమానులు అయిన అతికొద్ది మంది స్త్రీలలో ఆవిడ ఒకరు.

PHOTO • Ritayan Mukherjee

తగ్గిపోతున్న పచ్చిక బయళ్ళ కారణంగా సంచార పశుపోషకులు, గతంలో కంటే మరింత తరచుగా తమ స్థావరాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

PHOTO • Ritayan Mukherjee

చాలా కఠినమైన చలికాలంలో ఇక్కడ బ్రతకడం, మనుషులకైనా జంతువులకైనా చాలా కష్టం. ఇక్కడ, ఒక చంగ్పా పశువుల కాపరి, తన కుటుంబం కోసం మందులు తెచ్చుకోవడానికి లేహ్ టౌన్ కు వెళుతున్నారు.

PHOTO • Ritayan Mukherjee

హన్లే లోయలోని ఒక ఎత్తైన మైదానంలో నడుస్తున్న కర్మా రిన్చెన్. (కవర్ ఇమేజ్ లో నోర్లా డోన్డ్రుప్ తో ఉన్నారు) ఇక్కడి భూమి క్రమక్రమంగా పచ్చిక బయళ్ళను కోల్పోతూ వస్తోంది.

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే రికార్డు చేయాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా ?  అయితే [email protected] కు మెయిల్ చేసి [email protected] కు కాపీ పెట్టండి.

అనువాదం: సుజన్ ఎన్

Ritayan Mukherjee

Ritayan Mukherjee is a Kolkata-based photographer and a 2016 PARI Fellow. He is working on a long-term project that documents the lives of pastoral nomadic communities of the Tibetan Plateau.

Other stories by Ritayan Mukherjee
Translator : Sujan Nallapaneni

Sujan is a freelance journalist based in Guntur. He is a translation enthusiast.

Other stories by Sujan Nallapaneni