“కొంటున్న కొద్దీ అప్పుల్లో మునిగిపోతున్నాము.” అన్నది 40 ఏళ్ళ రైతు, కునారి సబారి, తన సాయెరా ఆదివాసీలు నివసించే  ఖైరా గ్రామంలో మాతో సంభాషిస్తూ.

" గోబరఖాతచాసా, హలాచాసా [ఆవు పేడ, నాగలితో వ్యవసాయం], ఇది మాది, కానీ ఇప్పుడు ఎవరూ ఆ వ్యవసాయం చేయడం లేదు," అని ఆమె చెప్పింది. “ఇప్పుడు మేము ప్రతిదానికీ మార్కెట్‌కి పరిగెత్తుతున్నాము. విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల కోసం. ఇంతకు ముందులా కాకుండా మేము తినేది కూడా కొనాల్సిందే.”

ఒడిశాలోని రాయగడ జిల్లాలో పర్యావరణపరంగా సున్నితంగా ఉండే ఎత్తైన ప్రాంతాలలో వేళ్లూనుకుంటున్న పత్తి సాగు పై ఆధారపడటాన్ని గురించే కునారి చెబుతుంది. ఈ సాగు పధ్ధతితో అక్కడి గొప్ప జీవవైవిధ్యం, రైతుల కష్టాలు, ఆహార భద్రతకు సంబంధించిన లోతైన చిక్కులు ముడిపడి ఉన్నాయి (చూడండి: ఒడిషాలో వాతావరణ సంక్షోభ విత్తనాలను నాటడం ). మేము రాయగడలోని గుణుపూర్ బ్లాక్ మైదానానికి ఆగ్నేయంలో దిగినప్పుడు ఇది స్పష్టంగా కనిపించింది. ఇక్కడికే  పత్తి మొదట వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రదేశంలోని పొలాలలో కంటికి కనిపించేంత మేరకు పత్తి పంట మాత్రమే ఉంది. కాని ఇక్కడ లోతైన బాధ కూడా ఉంది.

‘‘10-12 ఏళ్ల క్రితం పత్తి సాగు మొదలుపెట్టాం. మాకు వేరే మార్గం లేదు కాబట్టి మేము ఇప్పుటికీ పత్తిని చేస్తూనే ఉన్నాము.” అని గుణుపూర్ బ్లాక్‌లోని ఖైరాలో చాలామంది మాకు చెప్పారు. ఈ ప్రాంతంలోని ఎందరో రైతులు, పెట్టుబడి పెట్టిన పత్తి వైపు మొగ్గు చూపడంతో, తమ సొంత విత్తనాలను, బహుళ పంటల సాంప్రదాయ పద్ధతులను క్రమంగా కోల్పోయామని వారు చెప్పారు.

"మాకు మా స్వంత పంటలు, మా స్వంత వ్యవసాయం ఉండేవి," అన్నాడు యువ రైతు,  ఖేత్రా సబరా. “ఆంధ్రా వాళ్ళు వచ్చి పత్తి పండించమని చెప్పారు, అన్నీ నేర్పించారు.” ఇక్కడ ఉన్న మరొక రైతు సంతోష్ కుమార్ దండసేన, గ్రామస్తులను, లాభం పొందే అవకాశమే కప్పా లేదా పత్తి వైపు ఆకర్షించిందని తెలిపారు. “మొదట్లో సంతోషపడ్డాము, డబ్బు సంపాదించాము. కానీ ఇప్పుడు ఈ రకమైన వ్యవసాయం కష్టాన్ని, నష్టాన్ని మాత్రమే ఇస్తోంది,”అని అతను చెప్పాడు. "మేము నాశనం అయ్యాము, కానీ సాహుకార్లు [అప్పులిచ్చేవారు] సంతోషంగా ఉన్నారు."

మేము మాట్లాడుతుండగా ముదురు ఆకుపచ్చ జాన్ డీర్ ట్రాక్టర్లు గ్రామ రహదారిపైకి దూసుకెళ్లాయి. స్థానిక దేవాలయం గోడలపై ఒడియాలో బిటి పత్తిని ప్రచారం చేస్తూ అతికించిన  విత్తన కంపెనీ పోస్టర్లు ఉన్నాయి. ఆ పంటకు సేద్యం, విత్తే పరికరాలు గ్రామ కూడలి చుట్టూ ఉన్నాయి.

PHOTO • Chitrangada Choudhury

ఎగువ ఎడమవైపు: గుణుపూర్ బ్లాక్‌లో, కనుచూపు మేర GM పత్తి పంటలు విస్తరించి ఉన్నాయి. కుడి ఎగువ: ఖైరా గ్రామంలో, రైతులు 10-15 సంవత్సరాల క్రితం పత్తికి మారినప్పటి నుండి చాలా అప్పుల్లో ఉన్నారని, పత్తి నాటకపోతే వడ్డీ వ్యాపారుల నుండి మళ్లీ రుణం పొందలేమని చెప్పారు. దిగువ వరుస: పత్తి గింజల కోసం ఒడియాలో ప్రకటనలు చెట్లకు వ్రేలాడదీయబడ్డాయి. గ్రామంలోని ఆలయ గోడలపై పత్తి విత్తనాలను ప్రచారం చేసే పోస్టర్లు అంటించి ఉన్నాయి

"చాలా మంది పత్తి రైతులు అప్పులపాలయ్యారు, ఎందుకంటే విత్తనం కొనడానికి పంట వేయడానికి ఖర్చులు పెరుగుతున్నాయి, అయితే ఉత్పత్తుల విక్రయ ధర హెచ్చుతగ్గులకు గురవుతుంది; మధ్యవర్తులు లాభాన్ని తీసుకుంటారు,” అని ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వాతావరణ పరిరక్షకుడు దేబల్ దేబ్ వివరించారు. "రాయగడలో, చాలా మంది రైతులు మార్కెట్ ధరలో [తమ ఉత్పత్తులకు] 20 శాతం మాత్రమే పొందుతారు."

పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో పత్తిని ఎందుకు కొనసాగించాలి? "మేము సాహుకార్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయాము," అని సబర చెప్పింది. "మేము పత్తి నాటకపోతే, అతను మాకు అప్పు ఇవ్వడు." అన్నాడు దండసేనుడు, “పత్తి సాగుచేస్తే గాని అప్పు దొరకదు."

దేబ్ సహోద్యోగి దేబ్దులాల్ భట్టాచార్య మాట్లాడుతూ, "రైతులు తాము పండిస్తున్న ఈ పంటను అర్థం చేసుకోలేరు. “వారు అడుగడుగునా మార్కెట్‌పై ఆధారపడి ఉంటారు... విత్తనాలు నాటడం నుండి పంట వరకు, వారు స్వంతగా నిర్ణయాలు తీసుకోలేరు [అయితే]... కానీ వారికి భూమి ఉంది. ఇప్పుడు మనం వారిని రైతులు అని పిలవాలా లేక వారి స్వంత పొలాల్లో పనిచేసే కూలీలు అని పిలవాలా?"

ఎక్కువ మంది పత్తి వేయడం వలన వినాశకరమైన ప్రభావం ఉంటుంది అని చెబుతూ డెబ్, అతని సహచరులు, స్థానిక జీవవైవిధ్యంతో పాటు , ఈ ప్రకృతిలో పనిచేసి దీనిని కాపాడే ఇక్కడి ప్రజల జ్ఞానం క్షీణించడం గురించి కూడా చెప్పారు. పై రెండూ వాతావరణ మార్పుల అనిశ్చల ప్రభావాన్ని తట్టుకోగలవు .

"వాతావరణ మార్పు స్థానిక వాతావరణంలో మార్పులను కూడా హఠాత్తుగా తెస్తోంది," అని డెబ్ చెప్పారు. చాలా కాలంగా కరువు, విపరీతంగా పడే అకాల వర్షాలు, తరచుగా వచ్చే కరువులను ఒడిషా రైతులు ఇప్పటికే బాగా అనుభవిస్తున్నారు. ఆనువంశిక రకాలను భర్తీ చేస్తున్న పత్తి, ఆధునిక రకాలైన వరి, కూరగాయలు, "స్థానిక పర్యావరణ పరిస్థితులలో ఆకస్మిక మార్పులను తట్టుకుని నిలబడలేవు.” దీని అర్థం పంట మొక్కల మనుగడ, పరాగసంపర్కం, ఉత్పాదకత తగ్గి, చివరకు, ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతుంది.

ఈ ప్రాంతంలో వర్షపాతం డేటా, రైతుల ఖాతాలు- ఇవన్నీ పెరుగుతున్న అస్థిర వాతావరణాన్ని సూచిస్తుంది. 2014-18 కాలంలో జిల్లాకు సగటు వార్షిక వర్షపాతం 1,385 మి.మీ. ఇది 1996 నుండి 2000 వరకు, ఈ ఐదేళ్లలో కురిసిన సగటు వర్షపాతం 1,034 మి.మీ కంటే 34 శాతం ఎక్కువ (చూడండి: భారత వాతావరణ శాఖ కేంద్ర పర్యావరణ, అటవీ - వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ యొక్క డేటా). అలాగే, 2019లో , భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం, “ఒడిషాలో భారీ నుండి విపరీతమైన వర్షం, పొడిగా ఉండే రోజులు పెరుగుతున్నాయి, కొద్దిగా లేక మధ్యస్తంగా పడే వర్షాలు, తడిగా ఉండే రోజులు తగ్గిపోతున్నాయి.”

PHOTO • Chitrangada Choudhury
PHOTO • Chitrangada Choudhury
PHOTO • Chitrangada Choudhury

కునుజి కులుసిక (మధ్యలో) వంటి రైతులు, బిటి పత్తి, దానికి సంబంధించిన వ్యవసాయ రసాయనాలు తమ దేశీయ విత్తన రకాలపై (ఎడమవైపు) పొలంలో(కుడి) నేలపై, ఇతర జీవులపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన చెందుతున్నారు

"గత మూడు సంవత్సరాలుగా... వర్షాలు ఆలస్యంగా వస్తున్నాయి," అని పొరుగునే ఉన్న కోరాపుట్ జిల్లాలో రైతుగానే కాక కార్యకర్తగా కూడా పనిచేస్తున్న శరణ్య నాయక్ మాకు చెప్పారు. "ప్రారంభ ఋతుపవన కాలంలో తక్కువ వర్షపాతం నమోదైంది, ఆ తర్వాత మధ్య కాలంలో తీవ్ర వర్షపాతం ఉంది, ఆపై కాలం ముగిసే సమయానికి భారీ వర్షపాతం ఉంది". దీనర్థం విత్తనాలు నాటడం ఆలస్యం అవుతుంది, విపరీతమైన వర్షాలు పడ్డాయంటే పంటకు కీలకమైన మధ్య కాలంలో ఎండలు ఉండవు, పైగా చివరిలో పడే భారీ వర్షాలు పంటను దెబ్బతీస్తాయి.

ఈ ప్రాంతంలో ఆహారం, వ్యవసాయంపై పనిచేసే NGO లివింగ్ ఫామ్స్ నుండి దేబ్జీత్ సారంగి ఇలా చెబుతున్నారు: “ఈ ప్రాంతంలో వర్షాకాలం జూన్ మధ్య నుండి అక్టోబర్ వరకు కొనసాగుతుంది. అయితే, గత కొన్నేళ్లుగా ఇది స్థిరంగా లేదు.” సారంగి, నాయక్ ఇద్దరూ దేశీయ ఆహార పంటలకు ప్రాధాన్యతనిస్తూ, ఈ మార్పులను ఎదుర్కోవడానికి పత్తి కంటే బాగా,  ఒడిషా యొక్క బహుళ-పంటల వ్యవస్థలు పనిచేస్తాయని వాదించారు. "బహుళ పంటలు పండించే రైతులు ఇటువంటి అస్థిర వాతావరణ విధానాలను తట్టుకోగలరని మా అనుభవం" అని సారంగి చెప్పారు. "బిటి పత్తి అనే ఒక్క పంట ద్వారా మార్కెట్‌తో అనుసంధానించబడిన రైతులు టైమ్ బాంబ్ మీద కూర్చున్నారు."

*****

అనేక మంది రైతులు, వారు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నప్పటికీ,  కొత్త GM మోనోకల్చర్ డిస్పెన్సేషన్ వలన ఆహార భద్రతకు సాగు స్వయంప్రతిపత్తికి వచ్చే ప్రమాదాలను పసిగట్టారు. కానీ చాలా మంది, ముఖ్యంగా మహిళా రైతులు, తమ సాంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టకూడదని పట్టుబట్టారు. నియమగిరి నేపధ్యంలో కెరండిగూడ గ్రామంలో, ఈ సంవత్సరం పత్తి సాగు చేయకుండా తన కుమారుడు సురేంద్రను నిలువరిస్తున్న కొంధ్ ఆదివాసీ మహిళ కునూజి కులుసికను మేము చూశాము.

ఆమె పర్వత ప్రాంతంలో పాదరక్షలు కూడా లేకుండా కష్టపడి పోడు వ్యవసాయం చేసింది. ఆమె, జాకెట్టు లేకుండా, మోకాళ్ల వరకు ఉన్న చీరలో, జుట్టును వెనక్కి ఒక పక్కగా లాగి వేసిన ముడిలో,ఆమెను 'వెనుకబాటు' నుండి పైకి తీసుకువస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, NGOల ప్రకటనలలో కునుజీ ఆదివాసీ మహిళకు ప్రతీక లాగ కనిపిస్తుంది. అయినప్పటికీ, డెబ్ సూచించినట్లుగా, కునుజీ వంటి వ్యక్తుల జ్ఞానం,  నైపుణ్యాలు క్షీణించడం - వాతావరణ మార్పులతో పోరాడుతున్న ప్రపంచానికి వినాశకరం.

"మేము మా [సొంత] పంటలను ఒక సంవత్సరం పాటు వదిలివేస్తే, విత్తనాలను ఎలా తిరిగి పొందగలము? వాటిని కోల్పోయే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాము. గత సంవత్సరం, సురేంద్ర మేము మక్క [మొక్కజొన్న] వేసే చోట కొంత పత్తిని పండించాడు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నాటడానికి సొంతంగా మొక్కజొన్న విత్తనాలు లేకుండా పోతాం.” అని కునుజీ, పత్తికి మారడానికి ఎందుకు భయపడుతుందో వివరించింది.

'మేము మా [సొంత] పంటలను ఒక సంవత్సరం పాటు వదిలివేస్తే,’ పత్తికి మారడానికి ఆమె ఎందుకు భయపడిందో వివరిస్తూ, 'మేము విత్తనాలను ఎలా తిరిగి పొందగలము? వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది'

వీడియో చూడండి: ‘పత్తి విత్తనాలు నా కోసమైతే కాదు’ అని కోండ్ రైతు కునుజి కులుసిక చెబుతూ, ఆమె దేశీయ ఆహార పంటల శ్రేణిని మాకు చూపుతుంది

మేము వంశపారంపర్య విత్తనాలను ప్రస్తావించినప్పుడు కునుజీ స్పష్టంగా ఉద్వేగానికి లోనయింది. ఆమె తన ఇంటికి పరుగెత్తి, వారి కుటుంబం పండించిన, వెదురు బుట్టలు, ప్లాస్టిక్ జాడిలు లేదా గుడ్డ సంచులలో నిల్వ చేసిన,  వివిధ రకాల పంటలను తీసుకుని వచ్చింది. మొదటిది: రెండు రకాల కంది కాయలు, "భూమి యొక్క వాలును బట్టి నాటాలి." ఇంకోటి: ఎగువ ప్రాంతాల్లో సాగుచేయగల వరి, ఆవాలు, మూంగ్ లేదా పెసలు, బిరి లేదా మినుములు, రెండు రకాల బీన్స్. ఆ తరవాత: రెండు రకాల రాగులు, మొక్కజొన్న, గడ్డి నువ్వులవిత్తనాలు. చివరగా: చియా గింజల మూట (అటవీ ఆహారం). "వర్షం పడుతున్నప్పుడు, ఇంట్లోనే ఉండవలసి వస్తే వీటిని వేపుకుని తింటాము," అని ఆమె చెప్పింది.  మా కోసం కూడా ఒక పిడికెడు వేయించింది.

"ఇక్కడ ఉన్న కోండ్‌లు, ఇతర తెగల వ్యవసాయ-పర్యావరణ జ్ఞానం అద్వితీయంగా ఉంది, కుటుంబాలు ఒకే స్థలంలో సంవత్సరానికి 70-80 పంటలు పండించగలిగాయి - తృణధాన్యాలు, పప్పులు, వేర్లు, దుంపలు, మినుములు" అని లివింగ్ ఫామ్స్‌కు చెందిన ప్రదీప్ పాత్ర చెప్పారు. . "ఇది ఇప్పటికీ కొన్ని చెక్కలలో జరుగుతోంది, అయితే మొత్తం మీద, పత్తి వచ్చి గత 20 ఏళ్లలో ఇలా వ్యాప్తి చెందడం, ఈ విత్తన వైవిధ్యానికి వినాశకరమైనదని నిరూపించబడింది."

రసాయనాల ప్రభావాలకు కునుజీ కూడా భయపడతుంది. పత్తి సాగుకు ఇవి చాలా అవసరం, అయితే ఆదివాసీ కుటుంబాలు తమ సాంప్రదాయ పంటల కోసం వీటిని ఎప్పుడూ ఉపయోగించరు. “ఆ పురుగుమందులు, ఆ ఎరువులు అన్నీ - సురేంద్ర పత్తి [మొక్కల] మీద వేస్తాడు. అది మన మట్టిని పాడు చేయదా? మట్టిలో ఉన్నవాటిని చంపలేదా? నేను నా కళ్లతో నా పక్కనే ఉన్న పొలంలో చూశాను - వారు మాండియా [రాగులు] నాటడానికి మళ్ళీ ప్రయత్నించినప్పుడు, బాగా రాలేదు, మొత్తం కుంగిపోయింది.”

హెర్బిసైడ్లను తట్టుకోగల పత్తి విత్తనాలు భారతదేశంలో అనుమతించబడవు, కానీ " క్యాన్సర్ కారకం కాగల " హెర్బిసైడ్ అయిన గ్లైఫోసేట్, సంబంధిత రసాయనాలతో పాటు రాయగడలో దావానలంలా వ్యాపిస్తోంది. "హెర్బిసైడ్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల అనేక కంచె మొక్కలు, గడ్డితో సహా సహచర వృక్షజాలం పొలాల్లో కనిపించకుండా పోయింది. దీని వలన ‘పంట కాని మొక్కల’పై ఆధారపడిన సీతాకోకచిలుకలు, మాత్ లు క్షీణిస్తున్నాయి.

“ఈ ప్రాంతపు [ఇంకా  దాని జీవవైవిధ్యం] పర్యావరణ జ్ఞానం భయంకరంగా క్షీణించింది. ఎక్కువ మంది రైతులు, ఇలా ఒకే పంటకు తమ సాంప్రదాయిక బహుళ-పంటలు, అగ్రోఫారెస్ట్రీ విధానాలను వదులుకుంటున్నారు. ఈ పంటలు అధిక మొత్తంలో పురుగుమందులు వాడాలి.  పత్తి రైతులు కూడా కలుపు మందులను వాడుతున్నారు. వాటిలో చాలా వరకు... ఏవి కీటకాలో, ఏవి తెగుళ్ళో, ఈ రెండు కానివి ఏమిటో  ఎవరికీ సరిగ్గా అని తెలియదు. కాబట్టి అవి అన్ని పురుగులనూ తొలగించడానికి మందులను పిచికారీ చేస్తారు.”

శరణ్య నాయక్ పత్తికి మారడంతో, “ప్రతి కీటకం, పక్షి, జంతువును ఒకేలా, అంటే - పంటకు శత్రువులా చూస్తారు. వ్యవసాయంలో-విచక్షణారహిత రసాయన వినియోగానికి ఇది సరైన సాక్ష్యం."

ప్రజలు దాని దుష్ఫలితాలను చూస్తున్నారని, అయినా ఇంకా పత్తినే సాగుచేస్తున్నారని కునుజీ గుర్తించింది. "వారు ఒకేసారి ఇంత డబ్బు చూస్తారు," ఆమె తన చేతులు చాచి చెప్పింది. "దాని  ఆకర్షణకు లోబడతారు."

PHOTO • Chitrangada Choudhury

బిటి కాటన్ ఏక పంట (పై వరుస), దాని అనుబంధ వ్యవసాయ రసాయనాలు (దిగువ వరుస) రాయగడ గుండా విస్తరిస్తున్నాయి, ఈ ప్రాంతం యొక్క గొప్ప జీవవైవిధ్యానికి ఇది కోలుకోలేని ముప్పు

"విత్తనాలు పంచుకోవడం, మార్చుకోవడం; పొలంలో పని కోసం పశువులను, కూలీలను వంతులవారీగా వాడుకోవడం వంటి సామాజిక పద్ధతులు, పత్తి సాంప్రదాయిక పంటలను విస్మరించడంతో క్షీణించబడుతున్నాయి" అని పాత్రా చెప్పారు. "ఇప్పుడు రైతులు వడ్డీ వ్యాపారుల వైపు, పత్తి వ్యాపారుల వైపే చూస్తున్నారు."

జిల్లాలోని ఒక వ్యవసాయ అధికారి (పేరు చెప్పడానికి ఇష్టపడని), పాత్రాతో ఏకీభవించారు. 1990వ దశకంలో, రాష్ట్రమే ఇక్కడి గ్రామాల్లో పత్తిని ప్రవేశపెట్టి ప్రోత్సహించిందని ఆయన అంగీకరించారు. ఆ తరవాత వెంటనే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రైవేట్ సీడ్ మరియు అగ్రి-కెమికల్ ఇన్‌పుట్ డీలర్ల దూకుడుగా ముందుకు వచ్చింది. ప్రభుత్వం ఆందోళన చెందుతుండగా, నకిలీ, అక్రమ విత్తనాల విపరీతంగా రావడం, పెరుగుతున్న వ్యవసాయ రసాయనాల వినియోగ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయకపోవడం అధికారి అంగీకరించారు. “పత్తి ఇప్పుడు తలనొప్పిగా మారింది,” అని ఆయన అన్నారు.

అయినప్పటికీ, డబ్బుతో కూడిన ఎర శక్తివంతమైనది, ముఖ్యంగా యువ రైతులకు. వారి పిల్లలకు ఆంగ్ల విద్య, స్మార్ట్‌ఫోన్‌లు, మోటర్‌బైక్‌లు కావాలి. వారి తల్లిదండ్రుల వ్యవసాయ మార్గాల పట్ల అసహనం పెరిగి, పత్తి కోసం ఆ మాత్రం ధైర్యం చేయడమే సరైనది అని వారికి అనిపిస్తోంది. ఒక సంవత్సరం మార్కెట్లు పతనమైతే, తర్వాతి కాలంలో అవి పెరగవచ్చు.

అయితే జీవావరణ శాస్త్రం అంత తేలికగా క్షమించదు.

“ప్రజలు ఆసుపత్రిలో చేరడం పెరిగింది.  వ్యాధులలో నమోదుకాని రకాలు పెరిగాయి. వివిధ రకాల నరాల, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది,” అని డెబ్ చెప్పారు. "ఇవి జిల్లాలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్న ఆర్గానోఫాస్ఫేట్ పురుగుమందులు, గ్లైఫోసేట్ హెర్బిసైడ్‌లను వాడడం వలన వచ్చాయని నా అనుమానం."

54 ఏళ్ల క్రిస్టియన్ హాస్పిటల్, బిస్సమ్‌కటక్‌లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ జాన్ ఊమెన్, సరైన పరిశోధనలు లేనప్పుడు ఇటువంటి కారణ సంబంధాలు ఏర్పడటం కష్టమని చెప్పారు. “రాష్ట్రం దృష్టి ఇప్పటికీ మలేరియా వంటి అంటువ్యాధులపై ఉంది. కానీ ఇక్కడ గిరిజనుల్లో గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నిజానికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల సంఖ్య చాలా పెద్దగా ఉంది.”

"ఈ ప్రాంతంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించాయి, ఇది ఒక అద్భుతమైన వ్యాపారం.  ఇంతటి స్కేల్‌లో కిడ్నీ ఫెయిల్యూర్‌ అవడానికి కారణం ఏమిటో మనం పరిశోధించాలి.” వందల సంవత్సరాలుగా తమను తాము నిలబెట్టుకున్న సంఘాలు నాశనం అవుతున్నాయని ఊమెన్ ఆందోళన వ్యక్తం చేశారు.

*****

ఆ వారం తరవాత, నియమగిరి పర్వతాలలో, ఒక వెచ్చని ఉదయం, ఓబీ నాగ్ అనే మధ్య వయస్కుడైన కొండ్ ఆదివాసీ రైతు ఒక లోహపు కుండలో ఒక లీటర్ గ్లైసెల్ బాటిల్‌తో గ్లైఫోసేట్ ద్రవంతో తన భూమి వైపు నడుస్తున్నాడు. ఈ గ్లైఫోసేట్ మహారాష్ట్రకు చెందిన ఎక్సెల్ క్రాప్ కేర్ లిమిటెడ్ ద్వారా తయారు చేయబడింది.

నాగ్ తన మొండి వీపుపై చేతితో పనిచేసే నీలిరంగు స్ప్రేయర్‌ని మోస్తున్నాడు. అతను తన పొలం పక్కన ఉన్న ఒక చిన్న కొండ ప్రవాహం దగ్గర ఆగి, తన భారాన్ని దించాడు. కుండను ఉపయోగించి, అతను నీటిని స్ప్రేయర్‌లో నింపాడు. అప్పుడు అతను "దుకాణదారు సూచనల ప్రకారం" గ్లైఫోసేట్ యొక్క రెండు గుళికలను జోడించాడు. అతను దానిని తీవ్రంగా కుదిపి, మళ్లీ స్ప్రేయర్‌పై కట్టి, తన పొలంలో మొక్కలపై చల్లడం ప్రారంభించాడు. "ఇవన్నీ మూడు రోజుల్లో చనిపోతాయి, పత్తి నాటడానికి పొలం సిద్ధంగా ఉంటుంది" అని అతను చెప్పాడు.

PHOTO • Chitrangada Choudhury

జూలై ఉదయం, నియమగిరి పర్వతాలలో, బట్టలు లేని శరీరంతో ఉన్న ఓబీ నాగ్, గ్లైఫోసేట్, హెర్బిసైడ్ ఇంకా సంభావ్య క్యాన్సర్ కారకం బాటిల్‌ను తెరుస్తాడు. అతను దానిని తన పొలంలో ప్రవహించే నీటి ప్రవాహంతో కరిగించి, భూమిపై పిచికారీ చేస్తాడు, బిటి పత్తి (ఎడమ, మధ్య) విత్తడానికి సిద్ధం చేస్తాడు. మూడు రోజుల తరువాత, భూమిపై చాలా మొక్కలు వాడిపోయాయి (కుడివైపు)

ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ భాషల్లో గ్లైఫోసేట్ బాటిల్‌పై హెచ్చరికలు ఉన్నాయి: ఆహార పదార్థాలు, ఖాళీ ఆహార పదార్థాల కంటైనర్లు, ఇంకా జంతువుల ఆహారానికి దూరంగా ఉంచండి; నోరు, కళ్ళు, చర్మంతో సంబంధాన్ని నివారించండి; పిచికారీ చేసే సమయాల్లో పొగమంచును పీల్చడం మానుకోండి. గాలి వెళ్లే దిశలో పిచికారీ చేయండి; పిచికారీ చేసిన తర్వాత కలుషితమైన బట్టలను  శరీర భాగాలను పూర్తిగా కడగండి; మిక్సింగ్, పిచికారీ చేసేటప్పుడు పూర్తిగా రక్షణ ఇచ్చే దుస్తులను ధరించండి.

నడుమును చుట్టుకుని ఉన్న చిన్న వస్త్రాన్ని మినహాయించి నాగ్ ఇంకేమి ధరించలేదు. అతను పిచికారీ చేస్తున్నప్పుడు, తుంపరలు అతని కాళ్ళపై పడ్డాయి, గాలి మా పైకి, అతని పొలం మధ్యలో ఉన్న చెట్టు మీదకి, ప్రక్కనే ఉన్న పొలాల మీదకు ఈ కలుపు సంహారక పొగను తీసుకువెళ్లింది. అలాగే అతని పొలం ద్వారా ప్రవాహంలోకి చేరి ఇతర పొలాలకు కూడా చేరుతుంది, అంతేగాక చుట్టూ ఉన్న దాదాపు 10 ఇళ్ళ వారి చేతి పంపులకు కూడా చేరుతుంది.

మూడు రోజుల తర్వాత మేము మళ్లీ నాగ్ పొలం వద్దకు వచ్చాము, అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఆవులను మేపుతున్నాడు. అతను స్ప్రే చేసిన గ్లైఫోసేట్ ఈ ఆవులను నాశనం చేయగలదా అని మేము నాగ్‌ని అడిగాము, అతను నమ్మకంగా ఇలా అన్నాడు: “లేదు, మూడు రోజులైంది. నేను స్ప్రే చేసిన రోజున వాటిని మేపినట్లయితే, అవి జబ్బు పడి చనిపోయేవి. ”

పశువులను తీసుకెళ్లకుండా ఉండేందుకు ఏయే పొలాలలో తాజాగా గ్లైఫోసేట్‌ను పిచికారీ చేశారో అతనికి ఎలా తెలుసు అని మేము ఆ అబ్బాయిని అడిగాము. అతను భుజాలు ఎగురవేస్తూ , "రైతులు కలుపు సంహారకాలు పిచికారీ చేశారో లేదో మాకు చెబుతారు," అన్నాడు. పొరుగు గ్రామంలో ఇటీవలే పిచికారీ చేసిన పొలం వద్ద జంతువులు మేయడంతో కొన్ని పశువులు చనిపోయాయని ఆ బాలుడి తండ్రి మాకు చెప్పాడు.

ఇంతలో నాగ్ పొలంలో చాలా వరకు గడ్డి వాడిపోయి, పత్తి నాటేందుకు సిద్ధమైంది.

ముఖచిత్రం: రాయగడలోని గుణుపూర్ బ్లాక్‌లోని సౌరా ఆదివాసీ కౌలు రైతు మోహిని సబర మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం వరకు తాము ఆహార పంటలు పండించామని, ఇప్పుడు బిటి పత్తి మాత్రమే పండిస్తున్నామని చెప్పారు. (ఫోటో: చిత్రాంగద చౌదరి)

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected]కి ఈమెయిల్ చేసి అందులో [email protected]కి కాపీ చేయండి.

అనువాదం: అపర్ణ తోట

Reporting : Aniket Aga

Aniket Aga is an anthropologist. He teaches Environmental Studies at Ashoka University, Sonipat.

Other stories by Aniket Aga
Reporting : Chitrangada Choudhury

Chitrangada Choudhury is an independent journalist.

Other stories by Chitrangada Choudhury

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota