“ఇన్నేళ్ళబట్టీ నా ఫోటోలు తీస్తున్నావు కదా, వాటిని ఏం చేస్తారు?” విషాదంలో ఉన్న గోవిందమ్మ వేలు నన్ను ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చిలో కొడుకు సెల్లయ్య మరణించడం ఆమెను ఎంతగానో కలచివేసింది. “నాకు పూర్తిగా చూపు పోయింది. మిమ్మల్ని కూడా చూడలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నన్నూ, ముసిలిదైపోయిన నా తల్లినీ ఎవరు చూసుకుంటారు?”

తన చేతులపై ఉన్న కోతలనూ, గాయాలనూ నాకు చూపిస్తూ, ఆవిడ ఇలా అన్నారు: “ఇంటికి రూ.200 సంపాదించి తేవడానికి నేను చాలా కష్టపడతాను. వల విసిరి రొయ్యలు పట్టే వయసులో ఉన్నానా నేను? లేదు కదా; నేనాపని చేయలేను. నా చేతుల్తో మాత్రమే వాటిని పట్టుకోగలను.” చిన్నగా, బలహీనంగా, 70 ఏళ్ళ వయసుండే ఈ రొయ్యలు పట్టే ఆవిడ, తన వయసు 77 ఏళ్ళని నమ్ముతున్నారు. “అందరూ నాతో అలాగే చెప్తారు మరి." అన్నారావిడ. “ఇసుకను తవ్వి, రొయ్యలు పట్టేటప్పుడు చేతుల మీద లోతుగా కోతలుపడతాయి. చేతులు నీటి లోపల ఉంటాయికదా, రక్తం కారుతున్నా కూడా నాకు తెలియదు!”

2019లో బకింగ్‌హామ్ కాలువ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు, నేనామెను మొదటిసారి గమనించాను. ఉత్తర చెన్నై ప్రాంతమైన ఎన్నూర్ నుంచి పొరుగున ఉన్న తిరువళ్ళూర్ జిల్లా వరకు ప్రవహించే కొసస్థలైయారు నదికి సమాంతరంగా, ఈ కాలువ ప్రవహిస్తుంది. గ్రీబ్ పక్షిలా ఎంతో నేర్పుగా ఆమె తలవంచి కాలువలోకి దూకడం, నీటి అడుగున ఈత కొట్టడం నా దృష్టిని ఆకర్షించింది. నదీగర్భంలోని బరకగా ఉండే ఇసుక కణికెలలోకి వేగంగా తన చేతులను పోనిచ్చి, అక్కడున్న వారందరికంటే ముందుగా ఆవిడ రొయ్యలను పట్టుకున్నారు. తుంటి వరకూ ఉన్న నీటిలో నిలబడి, నడుముకు కట్టుకున్న తాటాకు బుట్టలోకి తాను పట్టుకున్న రొయ్యలను వేస్తున్నప్పుడు, ఆమె చర్మపు రంగు కాలువ నీళ్ళ రంగులో కలిసిపోయి, రెండింటికీ తేడా లేనట్లు కనిపించింది.

19వ శతాబ్దంలో నీటి రవాణా మార్గంగా నిర్మించబడిన బకింగ్‌హామ్ కాలువ, అలాగే ఎన్నూర్ గుండా ప్రవహించే కొసస్థలైయార్, అరణియార్ నదులు చెన్నై నగరవాసులకు జీవనాధారామైన నీటిని అందించే ముఖ్యమైన నీటి వనరులు.

PHOTO • M. Palani Kumar

ఉత్తర చెన్నై, ఎన్నూర్‌లోని కామరాజర్ ఓడరేవు వద్ద, తన బంధువు (ఎడమ వైపు)తో కలిసి కొసస్థలైయార్ నది నుండి బయటకు నడుచుకుంటూ వస్తున్న గోవిందమ్మ వేలు (కుడి వైపు). ఇక్కడ సరిపడా రొయ్యలు దొరక్కపోవడంతో వాళ్ళు, కొసస్థలైయార్ నదికి సమాంతరంగా ప్రవహించే బకింగ్‌హామ్ కాలువ వైపుకు వెళ్తున్నారు

PHOTO • M. Palani Kumar

తన ఇరులర్ సామాజికవర్గానికి చెందిన ఇతరులతో కలిసి కొసస్థలైయార్ నదిలో రొయ్యలు పడుతున్న గోవిందమ్మ (ఎడమ వైపు చివర). వాటిని పట్టుకోవడానికి వాళ్ళు 2-4 కిలోమీటర్ల మేర నది నీటిలో తిరుగాడాలి

ఎన్నూర్ దగ్గర వంపు తిరిగి, పులికాట్ సరస్సు పేరుతో ప్రసిద్ధి చెందిన పళవేర్‌కాడు సరస్సు వరకు ప్రవహించే కొసస్థలైయార్ నదీ తీర ప్రాంతం చుట్టూ మడ అడవులు ఆవరించి ఉంటాయి. ఇరవై ఏడు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న ఈ నదీ తీర ప్రాంతంలో నివసించే ప్రజలు ఇక్కడి నేలతో, నీటితో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఇక్కడ స్త్రీలూ పురుషులూ కూడా చేపలు పడుతుంటారు. అదే వారికి ప్రధాన జీవనాధారం. ఇక్కడ దొరికే వివిధ రకాల రొయ్యలకు చాలా మంచి ధర పలుకుతుంది.

మొదటిసారి నేను 2019లో గోవిందమ్మను కలిసినప్పుడు, “నాకు ఇద్దరు పిల్లలు. నా కొడుక్కి పదేళ్ళు, కూతురికి ఎనిమిదేళ్ళు వయసున్నప్పుడు నా భర్త చనిపోయాడు. ఇది జరిగి ఇప్పటికి 24 ఏళ్ళయింది. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళయింది. కొడుక్కి నలుగురు కూతుళ్ళు; కూతురికి ఇద్దరు ఆడపిల్లలు. ఇంతకన్నా ఒక మనిషికి ఏం కావాలి? మా ఇంటికి రా, మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు,” అని నన్ను ఆహ్వానిస్తూ, వెంటనే అక్కడికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే అత్తిపట్టు పుదునగర్ (అత్తిపట్టు న్యూ టౌన్) వైపుకు ఆమె నడక ప్రారంభించారు. అక్కడ ఆమె తాను పట్టుకున్న రొయ్యలను రోడ్డు పక్కన అమ్ముతుంటారు. కోవిడ్-19 లాక్‌డౌన్ల కారణంగా, ఆమెను మళ్ళీ కలవడానికి నాకు రెండేళ్ళు పట్టింది.

గోవిందమ్మ, తమిళనాడులో షెడ్యూల్డ్ తెగగా గుర్తించబడిన ఇరులర్ సామాజికవర్గానికి చెందినవారు. ఆమె ఇంతకుముందు చెన్నైలోని కామరాజర్ ఓడరేవు (గతంలో ఎన్నూర్ ఓడరేవు)కు దగ్గర్లో నివసించేవారు. ఆమె రొయ్యలు పట్టే కొసస్థలైయార్ నదికి సమీపంలోనే ఈ ఓడరేవు ఉంది. కానీ, 2004లో వచ్చిన సునామీ ఆమె గుడిసెను ధ్వంసం చేసింది. ఓ ఏడాది తర్వాత, అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరువళ్ళూర్ జిల్లాలోని అత్తిపట్టు పట్టణానికి ఆవిడ తన మకాం మార్చారు. సునామీ వల్ల ప్రభావితమైన ఇరులర్ తెగకు చెందిన చాలామంది ప్రజలకు ఇక్కడ అరుణోదయం నగర్, నేసా నగర్, మరియమ్మ నగర్ కాలనీలలో పునరావాసం కల్పించారు.

ప్రస్తుతం గోవిందమ్మ నివసిస్తున్న అరుణోదయం నగర్‌లో, సునామీ తర్వాత వరుసలు వరుసలుగా కట్టించిన ఇళ్ళన్నీ ఇప్పుడు రంగు వెలిసి కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ళ క్రితం మనవరాలికి పెళ్ళవడంతో, ఆమె కోసం తన ఇల్లు ఖాళీ చేసి, ఆ పక్కనే ఉన్న వేపచెట్టు కింద నివసిస్తున్నారావిడ.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: అరుణోదయం నగర్‌లోని తమ ఇంటి బయట గోవిందమ్మ (పచ్చ చీరలో), ఆమె తల్లి (కుడివైపు); కుడి: గోవిందమ్మ, ఆమె కొడుకు సెల్లయ్య (నీలం రంగు గళ్ళ లుంగీలో, మధ్యలో ఉన్నవారు), ఆమె మనవ సంతానం, బంధువులు. కుటుంబ కలహాల కారణంగా సెల్లయ్య, ఈ ఏడాది మార్చి నెలలో ఆత్మహత్య చేసుకున్నారు

ప్రతిరోజూ తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచిన వెంటనే, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తిపట్టు రైల్వే స్టేషన్‌కి గోవిందమ్మ నడిచి వెళ్తారు. అక్కడ రైలెక్కి, రెండు స్టేషన్ల తర్వాత ఉన్న అత్తిపట్టు పుదునగర్‌కు చేరుకుంటారు. అక్కడ నుండి ఏడు కిలోమీటర్లు నడిచి, కామరాజర్ ఓడరేవు దగ్గర్లో ఉండే మాతా (సెయింట్ మేరీస్) చర్చికి చేరుకుంటారు. కొన్నికొన్నిసార్లు అక్కడికి వెళ్ళేందుకు ఆమె షేర్ ఆటోరిక్షా ఎక్కుతారు. ఓడరేవు ప్రాంతంలో అక్కడక్కడా కనిపించే తాత్కాలికంగా నిర్మించిన చిన్న చిన్న గుడిసెల్లో ఇరులర్లు నివసిస్తుంటారు. వారు మనుగడ కోసం రొయ్యలు పట్టుకుని అమ్ముకుంటుంటారు. గోవిందమ్మ వాళ్ళతో కలిసి, త్వరత్వరగా నీళ్ళలోకి దిగి పని మొదలు పెడతారు.

కంటి చూపు తగ్గిపోతుండటం వల్ల, పని కోసం ప్రయాణం చేయడం ఆమెకి కష్టతరంగా మారింది. “రైలు, ఆటో ఎక్కేందుకు నాకు సహాయం కావాలి. మునుపటిలా చూడలేకపోతున్నా,” ఆమెకు ప్రయాణానికి రోజుకు కనీసం రూ.50 ఖర్చవుతాయి. “రొయ్యలు అమ్మి అతి కష్టం మీద రూ.200 సంపాదించే నేను, ప్రయాణానికే ఇంత ఖర్చు పెట్టవలసి వస్తే, ముందుముందు ఎలా బతకాలి?” అని ఆమె ప్రశ్నించారు. ఒక్కోసారి గోవిందమ్మ రోజుకు రూ.500 కూడా సంపాదిస్తారు. కానీ, ఎక్కువ రోజులు ఆమెకు రూ.100 మాత్రమే వస్తుంటుంది; కొన్నిసార్లు అసలు ఏమీ రావు కూడా!

పగటిపూట అలలు ఎక్కువగా ఉండే రోజుల్లో, రాత్రివేళ నీటి మట్టం తగ్గిన తర్వాత, తానెప్పుడూ రొయ్యలు పట్టే చోటుకు వెళ్తారు గోవిందమ్మ. ఆమె కంటి చూపు సరిగా లేనప్పటికీ, చీకట్లో కూడా చాలా సులభంగా రొయ్యలు పట్టుకుంటారావిడ. కానీ నీటి పాములు, ముఖ్యంగా ఇరుంగ్‌ కెళత్తి (బూడిదరంగు ఈల్ క్యాట్ ఫిష్), ఆమెను భయపెడతాయి. “నేను సరిగ్గా చూడలేను... నా పాదాలకు తగులుతున్నదేమిటో నాకు అర్థంకాదు... అది పామో లేక వలో?!” అన్నారామె.

“మనం దాని బారిన పడకుండా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ నల్ల చేప (బూడిదరంగు ఈల్ క్యాట్ ఫిష్) మన చేతి మీద కొట్టిందంటే, ఇంకో ఏడెనిమిది రోజుల వరకూ మనం లేవలేం,” అని గోవిందమ్మ వివరించారు. బూడిదరంగు ఈల్ క్యాట్ ఫిష్ (ప్లోటోసస్ కానియస్) ఛాతీభాగంలో ఉండే రెక్కలు విషపూరితంగా ఉంటాయి. పైగా చాలా తీవ్రమైన గాయాలు చేస్తాయి. “మందులు కూడా ఆ నొప్పిని తగ్గించలేవు. వయసు పిల్లలయితే అంత నొప్పిని భరించగలరు కానీ, నేనెలా తట్టుకోగలను, చెప్పు?”

PHOTO • M. Palani Kumar

బకింగ్‌హామ్ కాలువలో రొయ్యలు పట్టుకొని, వాటిని తాను నోటితో పట్టుకున్న బుట్టలో వేస్తున్న గోవిందమ్మ

PHOTO • M. Palani Kumar

గోవిందమ్మ చేతికైన కోతలు, గాయాలు. ‘ఇసుకను తవ్వి, రొయ్యలు పట్టుకోవడం వల్ల ఏర్పడిన లోతైన కోతలు’

ఎన్నూర్‌లోని థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాల నుండి వచ్చే బూడిదను, ఇతర వ్యర్థాలను విచక్షణారహితంగా పారవేయడం వల్ల నీటి కాలువలో ఏర్పడిన దిబ్బలు, గుంటలు ఆమె సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. “ అంద సంగది పారు (ఆ బురదను చూడు),” నేను ఫోటో తీయడానికి ఆ నీటిలోకి దిగినప్పుడు ఆవిడ చూపించారు. “ కాల ఎడుత్తు వచ్చు పోగ నమక్కు సత్తు పోయిడుదు (కాలు ఎత్తి మరో అడుగు వేసేలోపు నాకు సత్తువంతా పోతోంది)."

బకింగ్‌హామ్ కాలువ చుట్టూ వ్యాపించి ఉన్న ఎన్నూర్-మనాలి పారిశ్రామిక ప్రాంతంలో, కనీసం 34 ప్రమాదకరమైన భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో థర్మల్ పవర్ ప్లాంట్లు, పెట్రో-కెమికల్, ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి. మూడు పెద్ద నౌకాశ్రయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుండి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు నీటి వనరులన్నిటినీ కలుషితం చేసి, మత్స్య సంపదను మింగేస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ ఆరేడు రకాల రొయ్యలు దొరికితే, ప్రస్తుతం రెండుమూడు రకాలు మాత్రమే దొరుకుతున్నాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

కొన్నేళ్ళుగా తమకు దొరికే రొయ్యల సంఖ్య తగ్గిపోవడంతో గోవిందమ్మ ఆందోళన చెందుతున్నారు. “భారీ వర్షం పడినప్పుడు మాకు చాలా రొయ్యలు దొరికేవి. ఉదయం 10 గంటలకల్లా వాటిని పట్టుకొని, అమ్మడానికి వెళ్ళేవాళ్ళం. ఇంతకుముందు దొరికినన్ని రొయ్యలు ఇప్పుడు మాకు దొరకడం లేదు. మిగతా కాలాల్లో కిలో-అర కిలో రొయ్యలు పట్టుకోడానికి మేము మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేయాల్సివస్తోంది.” అందువల్ల రొయ్యలు దొరకడం ఆలస్యం కావడంతో అవి అమ్ముడుపోవటం కూడా ఆలస్యమవుతుంది.

చాలాసార్లు, రొయ్యలు అమ్మడానికి ఆమె రాత్రి 9-10 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. “నా దగ్గర కొనడానికి వచ్చేవాళ్ళు తక్కువ ధర కోసం బేరమాడతారు. నేనేం చేయాలి? వీటిని అమ్మడానికి మేం మండుటెండలో కూర్చోవాలి. కానీ జనాలు అది అర్థం చేసుకోరు. మీరూ చూస్తున్నారుగా, ఈ రెండు రొయ్యల కుప్పల్ని అమ్మడానికి ఎంత కష్టపడుతున్నామో!” గోవిందమ్మ వాపోయారు. సుమారు రూ. 100-150 ధర పలికే ఒక్కో కుప్పలో 20-25 రొయ్యలున్నాయి. “నాకు వేరే పని చేయడం తెలియదు. ఇదే నా జీవనాధారం.” అంటూ ఆమె నిట్టూర్చారు.

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: రొయ్యలు పట్టే పరికరాలు. ఇవే గోవిందమ్మకున్న ఏకైక జీవనాధారం; కుడి: తన పని ముగించుకొని, బకింగ్‌హామ్ కాలువ దగ్గర నీళ్ళు తాగడానికి కూర్చున్న గోవిందమ్మ

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: కామరాజర్ ఓడరేవు దగ్గర్లోని సెయింట్ మేరీస్ చర్చి వద్ద ఆటో కోసం వేచి చూస్తున్న గోవిందమ్మ; కుడి: అత్తిపట్టు పుదునగర్‌లోని తిరువొత్తియూర్ హైవే దగ్గర రొయ్యలు అమ్ముతున్న గోవిందమ్మ. దాదాపు 20-25 రొయ్యలుండే ఒక్కో కుప్ప రూ.100-150ల ధర పలుకుతుంది

రొయ్యలను మంచులో భద్రపరచరు గోవిందమ్మ. అవి తేమగా, తాజాగా ఉండడానికి వాటిపై ఇసుక పూస్తారావిడ. “జనాలు (కస్టమర్లు) ఇంటికి తీసుకెళ్ళి వండుకునే వరకు ఇవి తాజాగా ఉంటాయి. వండితే ఎంత రుచిగా ఉంటాయో తెలుసా?” ఆమె నన్ను ప్రశ్నించారు. “నేను పట్టిన రొయ్యలను అదే రోజు అమ్మాలి. అప్పుడే నేను కంజి (గంజి) తాగి నా మనవరాళ్ళకి ఏదైనా కొనగలను. లేదంటే నేను పస్తులుండాలి!”

చిన్న వయసులోనే రొయ్యలు పట్టుకునే ‘కళ’లో ప్రావీణ్యం సంపాదించారావిడ. “మా తల్లిదండ్రులు నన్ను చదువుకోడానికి బడికి పంపలేదు, రొయ్యలు పట్టడం నేర్పడానికి నదికి తీసుకెళ్ళారు,” గోవిందమ్మ గుర్తుచేసుకున్నారు. “నా జీవితమంతా నేను నీళ్లలోనే ఉన్నాను. ఈ నదే నాకు సర్వస్వం. ఇది లేకపోతే నాకు ఏదీ లేదన్నట్టే. నా భర్త చనిపోయాక పిల్లల్ని పోషించడానికి నేను ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలుసు. ఈ నదిలో రొయ్యలు పట్టుకోకపోతే, నేనసలు బతికుండేదాన్నే కాదు!”

గోవిందమ్మ తల్లి నదిలో పట్టిన రొయ్యలకు తోడు చిన్న చిన్న చేపల్ని కూడా కొని, వీటన్నిటినీ అమ్మి, గొవిందమ్మతో పాటు ఆమె తోబుట్టువులు నలుగురినీ పెంచుకొచ్చారు. గోవిందమ్మకు పదేళ్ళ వయసున్నప్పుడు తండ్రి చనిపోయాడు. “మా అమ్మ మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. తన జీవితమంతా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికే పనిచేసుకుంటూ బతికింది. ఇప్పుడామె వయసు నూరేళ్ళు దాటింది. ఈ సునామీ కాలనీలో ఉండేవాళ్ళందరూ ఆమెను ఈ కాలనీ మొత్తానికీ జీవించి ఉన్న పెద్దావిడగా పిలుస్తారు.”

గోవిందమ్మ పిల్లల జీవితాలు కూడా ఈ నదిపైనే ఆధారపడి ఉన్నాయి. “నా అల్లుడు మద్యానికి బానిస. అతను సరిగా కూడా పని చేయడు. రొయ్యలు పట్టుకొని, అమ్మి, ఇంట్లోవాళ్ళకి భోజనం సమకూర్చేది అతని తల్లే.”

PHOTO • M. Palani Kumar

కొసస్థలైయార్ నదిలో రొయ్యలు పట్టేందుకు సిద్ధమవుతున్న సెల్లయ్య. ఈ చిత్రం 2021లో తీసింది

PHOTO • M. Palani Kumar

తాను పట్టిన చేపలున్న వలతో సెల్లయ్య (ఎడమ వైపు); కొసస్థలైయార్ నది ఒడ్డున ఉన్న తాత్కాలిక గుడారం దగ్గర కుటుంబం కోసం భోజనం వండుతున్న అతని భార్య

గోవిందమ్మ కొడుకు సెల్లయ్య – మరణించేటప్పటికి అతనికి 45 ఏళ్ళు – కూడా తన కుటుంబాన్ని పోషించుకోడానికి రొయ్యల వేటకు వెళ్ళేవారు. 2021లో నేనతన్ని కలిసినప్పుడు, సెల్లయ్య ఇలా గుర్తు చేసుకున్నారు: “నా చిన్నతనంలో మా అమ్మానాన్నలు ఉదయం 5 గంటలకే ఇంటి నుండి నదికి బయలుదేరేవారు. మళ్ళీ రాత్రి 9-10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేవారు. నేను, నా చెల్లి ఆకలితో నిద్ర పోయేవాళ్ళం. మా అమ్మానాన్నలు ఇంటికి బియ్యం తెచ్చి, వండి, మమ్మల్ని నిద్ర లేపి తినిపించేవారు.”

సెల్లయ్య తనకు పదేళ్ళ వయసప్పుడు, చెఱకు ఫ్యాక్టరీలో పని చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌కు వలస వెళ్ళారు. “నేను అక్కడున్నప్పుడే, మా నాన్న రొయ్యలు పట్టుకొని ఇంటికి తిరిగి వస్తూ, ప్రమాదానికి గురై చనిపోయాడు. అప్పుడు నేనాయన ముఖాన్ని కూడా చూడలేకపోయాను. మా నాన్న చనిపోయాక, మా అమ్మే మాకు ప్రతిదీ సమకూర్చింది. ఆమె ఎక్కువ సమయం నదిలోనే గడిపేది.”

ఫ్యాక్టరీలో సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో, ఇంటికి తిరిగి వచ్చిన సెల్లయ్య తన తల్లితో సహా రొయ్యల వేటకు వెళ్ళేవారు. ఆమెలా కాకుండా, సెల్లయ్య, అతని భార్య రొయ్యల వేట కోసం వలలు ఉపయోగించేవారు. వీరికి నలుగురు ఆడపిల్లలు. “నా పెద్ద కూతురికి పెళ్ళి చేశాను. రెండో కూతురు డిగ్రీ (బిఎ ఇంగ్లీష్) చదువుతోంది; మిగిలిన ఇద్దరూ బడికి వెళ్తున్నారు. రొయ్యలు అమ్మితే వచ్చిన డబ్బును వాళ్ళ చదువుకే ఖర్చు పెడుతున్నాను. డిగ్రీ పూర్తయ్యాక, నా కూతురు న్యాయశాస్త్రం చదవాలనుకుంటోంది. నేనామెకు బాసటగా నిలవాలి." అని సెల్లయ్య చెప్పారు.

అయితే, అతని కోరిక నెరవేరనేలేదు. 2022 మార్చిలో, కుటుంబ కలహాల కారణంగా సెల్లయ్య ఆత్మహత్య చేసుకున్నారు. “నేను చాలా ముందే నా భర్తను కోల్పోయాను. ఇప్పుడేమో నా కొడుకు. నేను చనిపోయినప్పుడు నా చితికి నిప్పుపెట్టేవారెవరూ లేరిప్పుడు. నా కొడుకు నన్ను చూసుకున్నట్టు ఇప్పుడెవరు నన్ను చూసుకుంటారు?” హృదయం పగిలిన గోవిందమ్మ కన్నీరుమున్నీరయ్యారు.

PHOTO • M. Palani Kumar

సెల్లయ్య మరణానంతరం, అరుణోదయం నగర్‌లోని అతని ఇంట్లో, అతని చిత్రపటాన్ని చూసి దుఃఖపడుతున్న గోవిందమ్మ

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ: కొడుకు మృతితో కుప్పకూలిపోయిన గోవిందమ్మ. “నేను చాలా ముందే నా భర్తను కోల్పోయాను. ఇప్పుడేమో నా కొడుకు!”; కుడి: అరుణోదయం నగర్లోని తన ఇంటి ముందు రొయ్యల బుట్టతో గోవిందమ్మ. కుటుంబ పోషణ కోసం ఆమె ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు

ఈ తమిళ కథనాన్ని సందళిర్ ఎస్. ఆంగ్లంలోకి అనువదించారు. తమిళ కథనాన్ని ఎడిట్ చేయడంలో సహాయం చేసినందుకు PARI అనువాదాల సంపాదకులు (తమిళం) రాజసంగీతన్‌కు రిపోర్టర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

అనువాదం: వై క్రిష్ణ జ్యోతి

M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi