మూడు రోజులు షాజహాన్పూర్ లోని నిరసన స్థలంలో కాలం గడిపిన హనుమంత్ గుంజాల్ మరపురాని జ్ఞాపకాలతో తన గ్రామానికి తిరిగి వెళ్తున్నాడు.
41 ఏళ్ల భిల్ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని చంద్వాడ్ గ్రామానికి చెందిన ఆదివాసి సాగుదారుడు. ఇతను డిసెంబర్ 25 న షాజహన్‌పూర్ చేరుకున్నాడు. “అక్కడి రైతులు మంచి ఆతిథ్యమిచ్చారు, నిజంగా మంచివారు” అని చెప్పాడు. “వంట కోసం మేము కొద్ది బియ్యాన్ని, పప్పుని వెంట తీసుకువెళ్ళాము. కానీ వాటిని వాడే అవసరమే రాలేదు. వారు మాకు బోల్డంత నెయ్యితో రుచికరమైన ఆహారాన్ని వడ్డించారు. మమ్మల్ని ఔదార్యంగా స్వాగతించారు. ” అన్నాడు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు డిసెంబర్ 21 న, ‘జాత’ అనే వాహనాల కాన్వాయ్, నాసిక్ నగరం నుండి ఢిల్లీకి బయలుదేరింది. 1,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని శివార్లకి చేరుకోవడానికి సుమారు 1,000 మంది రైతులకు ఐదు రోజులు పట్టింది. షాజహన్‌పూర్ వద్ద, అంటే ఢిల్లీకి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్-హర్యానా సరిహద్దులో జాత ఆగిపోయింది. జాతీయ రాజధాని చుట్టూ ఉన్న నిరసన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ పదివేల మంది రైతులు, ఎక్కువగా పంజాబ్ నుంచి, ఇంకా హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చిన రైతులు 26 నవంబర్ నాటి నుండి నిరసన చేపట్టారు.
ఈ చట్టాలు మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి. అదే నెల 20వ నాటికి చట్టాలుగా మారాయి. ఈ మూడు చట్టాలు - ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం , రైతుల ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020. ఈ చట్టాలు ఆర్టికల్ 32 ను అణదొక్కి ప్రతి భారతీయుడిని చట్ట సహాయం అందుకోకుండా నిలిపివేసేంతగా ప్రభావితం చేస్తాయని విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
ఢిల్లీ మరియు చుట్టుపక్కల ఉన్న నిరసన స్థలాల వద్ద చాలా మంది రైతులు చాలా పెద్ద భూములను కలిగి ఉన్నారు. వారిలో చాలామంది నాలుగు చక్రాల వాహనాలను నడుపుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల వరకు నిరసనలను కొనసాగించడానికి తమ వద్ద వనరులు ఉన్నాయని వారు చెప్పారు.
కానీ మహారాష్ట్రకు చెందిన రైతులలో చాలా మంది ఆదివాసీ వర్గాలకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది చిన్న భూములు, కొద్దిపాటి వనరులు మాత్రమే కలిగినవారు. వారు ఇక్కడికి రావడం అసాధారణమైన విషయం. అయితే, పాల్ఘర్ జిల్లాలోని విక్రమ్‌గడ్ తాలూకా నుండి వచ్చిన వార్లీ వర్గానికి చెందిన 45 ఏళ్ల రైతు సురేష్ వార్తా (పైన కవర్ ఫోటోలో)ఇలా అన్నారు, “ఉత్తర భారత దేశరాష్ట్రాల రైతులే కాక వేరే రాష్ట్రాల రైతులు కూడా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని మేము చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే ఈ చట్టాలు ధనిక రైతులనే కాదు పేద రైతులను కూడా ప్రభావితం చేస్తాయి. ”
ఈ మూడు కొత్త చట్టాల ద్వారా పెద్ద కార్పొరేట్‌లు రైతులపై, వారి వ్యవసాయం పై ఎక్కువ అధికారాన్ని పొందటంతో పాటు, రైతుల జీవనోపాధిపై అవి జరపగలిగే వినాశకరమైన ప్రభావాన్ని రైతులంతా చూడగలుగుతున్నారు. . అంతేగాక ఈ చట్టాలు సాగుదారునికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసిలు), రాష్ట్ర సేకరణ వంటి ఎన్నో సహకారాలను కూడా బలహీనపరుస్తాయి.
మహారాష్ట్ర రైతులు ఉత్తర భారతదేశం లోని తమ సహనిరసనకారుల అవసరాలను ఆలోచించి మందుల పెట్టెల తో సహా వారి సహకారాన్ని తీసుకువెళుతున్నారు. కానీ షాజహన్‌పూర్‌లో నిరసనకారులు సరిపడా వైద్య సామాగ్రి నిల్వ ఉంచుకున్నారు.
అహ్మద్‌నగర్ జిల్లాలోని సంగమ్నేర్ తాలూకాలోని షిందోడి గ్రామానికి చెందిన భిల్ ఆదివాసీ రైతు మధుర బర్డే (57) మాట్లాడుతూ “నేను ఇలాంటి నిరసనను ఎప్పుడూ చూడలేదు. వారు అన్ని ఏర్పాట్లు చేశారు. నిరసన స్థలానికి చేరుకున్న తరువాత, కాజు, బాదం, ఖీర్ వంటి ఎన్నింటి తోనో మాకు స్వాగతం పలికారు. ఈ వస్తువులను కొనడానికి ముందు మేము ఒకటి, రెండుసార్లు ఆలోచిస్తాము. వారు స్నానం చేయడానికి వేడి నీటిని అందించారు. మాకు మందపాటి దుప్పట్లు ఇచ్చారు. ఈ దుప్పట్లు మాకు చాలా అవసరం. ఎందుకంటే మా దుప్పట్లు బాగా చిరిగిపోయాయి.” అన్నారు.
మార్చి 2018 లో కిసాన్ లాంగ్ మార్చి లో పాల్గొన్న మధురతై, ఈ రెండు నిరసనలను పోల్చకుండా ఉండలేకపోతున్నానని చెప్పింది. "మేము మాతో తీసుకువెళ్ళిన ఆహార ధాన్యాలను ఎంత తక్కువగా ఉపయోగించామో నాకు గుర్తుంది" అని ఆమె చెప్పింది. “మేము ఏడు రోజులలో నాసిక్ నుండి ముంబైకి కాలినడకన వెళ్ళాము. మా సరఫరా ఎక్కువ కాలం ఉండేలా మేము చూసుకోవాలి. ఇక్కడ, నిరసనకారులకు ఆహారం ఇచ్చే నిరంతర లాంగర్లు ఉన్నాయి. మేము కోరుకున్నంత తినవచ్చు. ”
షాజహాన్పూర్ వద్ద వ్యవసాయ తరగతి శ్రేణులకి సంఘీభావం స్పష్టంగా ఉంది. కానీ సరిహద్దు నిరసనలలో బాగా ఆహారం బాగా నిల్వ ఉంచడం, అలానే నిరసన బలపడడం వెనుక అక్కడ లేనివారి మద్దతు కూడా ఎంతో ఉంది.
2018 లాంగ్ మార్చ్‌ను నిర్వహించిన వ్యవసాయ నాయకులలో ఒకరైన అజిత్ నవలే ఈ వ్యత్యాసాన్ని గమనించారు: “లాంగ్ మార్చ్ ఏడు రోజులు కొనసాగింది,” అని ఆయన చెప్పారు. "మేము మొదటి ఐదు రోజులు ఉన్న వనరులతోనే కష్టపడ్డాము. మేము ఆరో రోజు ముంబై శివార్లకు చేరుకున్న తరువాత, ఎందరో వ్యవసాయేరులు ఆహారం, నీరు, పండ్లు, బిస్కెట్లు, చెప్పులు మొదలైన వాటితో మావద్దకు చేరుకున్నారు. ”
అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్) తో అనుబంధంగా ఉన్న నవలే, షాజహన్‌పూర్ రైతుల కాన్వాయ్‌కు నాయకత్వం వహించిన వారిలో ఒకరు. “ఏదైనా నిరసన యొక్క స్థిరత్వం ఆ నిరసనను సమాజం సమర్ధిస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ చుట్టూ ఉన్న వ్యవసాయ నిరసనలతో అదే జరిగింది. ఇక పై ఇది రైతులకు మాత్రమే పరిమితం కాదు. సమాజం మొత్తం వారికి మద్దతు ఇస్తోంది. ”
షాజహాన్పూర్ వద్ద క్యాంపింగ్ చేసిన మొదటి రాత్రి, కొంతమంది ఆటోరిక్షా డ్రైవర్లు దుప్పట్లు, వెచ్చని బట్టలు, మంకీ క్యాప్స్ మరియు ఇతర వస్తువులను తీసుకొని నిరసన స్థలానికి దిగారు. "మహారాష్ట్ర నుండి రైతులు షాజహాన్పూర్ కు వస్తున్నారని తెలుసుకున్న ఢిల్లీ లోని సిక్కు సమాజం డబ్బును సమకూర్చుకుంది" అని ఆయన చెప్పారు. "వారే ఈ వస్తువులను కొని వాటిని పంపించారు."
ఇవన్నీ హనుమంత్ గుంజాల్ యొక్క చిరస్మరణీయ అనుభవానికి తోడ్పడ్డాయి. "మేము తిరిగి మా గ్రామానికి వచ్చాము. ఈ నిరసన గురించి చాలా సానుకూలంగా ఉన్నాము" అని ఆయన చెప్పారు.
అనువాదం - అపర్ణ తోట