ఆమెకి 19 ఏళ్ళు, కానీ శివాని కుమారికి సమయం మించిపోతుందనిపిస్తుంది.

ఇప్పటికే ఆమె తనకు పెళ్లి చేయాలని ప్రయత్నించే తన కుటుంబాన్ని నాలుగేళ్లు నిలవరించగలిగింది. ఇక పైన అది సాగదనిపిస్తుంది. “నేను ఎంత కాలం ఆపగలనో నాకు తెలీదు, ఏదో ఒక రోజు నేను ఒప్పుకోవాలిసిందే,” అన్నది.

బీహార్, సమస్తిపూర్ జిల్లాలోని  గంగసారాలో అమ్మాయిలకు పదో తరగతి పూర్తి కాకుండానే, లేదా వారికి 17- 18 ఏళ్ల వయసు రాకమునుపే పెళ్లి చేసేస్తారు.

శివాని(పేరు మార్చబడింది) బీకామ్ వరకు ఎలాగోలా  చదువుని లాగగలిగింది. కాలేజీకి వెళ్లాలని ఎంతో కోరిక ఉన్నప్పటికీ ఇది ఇంత ఒంటరి ప్రయాణమని తనకి తెలీదు. “ఈ ఊరిలో ఉన్న నా స్నేహితురాళ్లందరికి పెళ్లయిపోయింది. నాతో పాటు చదువుకున్న ఆడపిల్లలందరూ వేరే ఊర్లకు వెళ్లిపోయారు.’ అన్నది ఆమె, తన పక్కింట్లో నన్ను కలిసినప్పుడు. వాళ్ళింట్లో కలవడానికి అసలు అవకాశం లేదు.

ఆమె వర్గంలో అమ్మాయిలకు, కాలేజ్ వరకు వెళ్లే అవకాశం అరుదుగా ఉంటుంది. శివాని ఒక మహాదళిత్ వర్గంలో భాగమైన రవిదాస్ కులానికి (చమార్ కులంలో ఉపకులం ) చెందినది. మహాదళిత్ - బీహార్ ప్రభుత్వం 2007లో 21 తీవ్రంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల వర్గాలకు ఇచ్చిన సామూహిక పదం.

ఆమె ఒంటరితనానికి తోడు ఆమెకి ఇంకా పెళ్లి కాలేదనే మాట ఆమె కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవారు, బంధువుల నుండి చాలా ఒత్తిడిని తెస్తోంది. “నేను సరిపోయేంత చదువుకున్నానని మా నాన్న అంటారు. కానీ నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది. నాకు అన్ని ఆశలు ఉండకూడదని ఆయన అభిప్రాయం. నేను చదువుకుంటూ పొతే నన్నెవరు పెళ్ళి చేసుకుంటారు, అని అడుగుతాడు.” అని ఆమె చెప్పింది. “మా వాళ్లలో అబ్బాయిలకి కూడా త్వరగా పెళ్లి అయిపోతుంది. కొన్నిసార్లు నేను చదువుని ఆపేయాలేమో అని ఆలోచిస్తాను. కాని ఇంత దూరం వచ్చాక నా కలను సాధించుకోవాలనే ఉంది.”

Shivani Kumari (left, with her mother, Meena Devi), says: 'Sometimes I wonder if I should give up...'
PHOTO • Amruta Byatnal
Shivani Kumari (left, with her mother, Meena Devi), says: 'Sometimes I wonder if I should give up...'
PHOTO • Antara Raman

శివాని కుమార్ (ఎడమ, ఆమె తల్లి మీనాదేవి), చెబుతుంది. ‘కొన్నిసార్లు నేనిక చదువు ఆపేయాలేమో అని ఆలోచిస్తాను…’

శివాని, తన ఊరికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్తిపూర్లోని KSR కాలేజీ కి వెళ్తుంది. ఆమె నడవాలి, ఆ తరవాత బస్సుని అందుకోవాలి, అక్కడనుంచి చివరికి ఒక ఆటోరిక్షా ని పట్టుకుని కాలేజీకి చేరాలి. కొన్నిసార్లు తన కాలేజీలో అబ్బాయిలు వారి బైక్ పైన తనని దింపుతామని చెప్పినా, అబ్బాయిల బైక్ మీద తాను ఎవరైనా చూస్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని  శివాని వద్దంటుంది. “ ఈ గ్రామం లో మనుషులు అసలు దయలేకుండా పుకార్లు రేపెడతారు. స్కూల్ లో ఇంకో అబ్బాయితో కలిసి చూసారని నా స్నేహితురాలికి పెళ్లి చేసేసారు. నాకు నా కాలేజీ డిగ్రీ అయ్యి, నేను పోలీస్ ఆఫీసర్ అయేలోపు అటువంటిది జరగకుండా చూసుకోవాలి.”

శివాని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేసి నెలకు 10,000 రూపాయల వరకు సంపాదిస్తారు. ఆమె తల్లి 42 ఏళ్ళ మీనా దేవి, ఆమె ఐదుగురు పిల్లలు- 13, 17 ఏళ్లున్న ఇద్దరు కొడుకులు, 10,15,19 ఏళ్లున్న ముగ్గురు కూతుర్ల గురించి ఆందోళన చెందుతూ ఉంటుంది.  “నాకు నా పిల్లల గురించి ఎప్పుడూ చింత ఉంటుంది. నా కూతుర్ల పెళ్లిళ్లకు కట్నం డబ్బులు కూడబెట్టాలి.” అని మీనా దేవి అన్నది. ఆమె ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలి కూడా  కోరుకుంటోంది. వారి ఇటుకల ఇంటి పై ఒక ఆస్బెస్టాస్  రేకు కప్పి ఉంది. ఇంట్లో ఒక్క పడక  గది మాత్రమే ఉంది. వారు, వారి ఇంటి పక్కనే ఉన్న ఇంకో మూడు కుటుంబాలు ఒకే టాయిలెట్ వాడుకుంటారు. “నా ఇంటికి రాబోయే కోడళ్లు కూడా ఇక్కడ సంతోషంగా ఉండాలని నా కోరిక.” అన్నది. వీటి మధ్య శివాని చదువుకు అంత ప్రాముఖ్యత లేదు. శివాని చదువుకోవాలనే పట్టుదల వలెనే ఆమె కాలేజీ వరకు వచ్చింది.

మీనాదేవి ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. కానీ శివాని కుటుంబం మొత్తంలో ఆమె మాత్రమే శివాని ఆశయాలకు తోడ్పాటుని ఇస్తుంది. “ఆమె  వేరే పోలీస్ వాళ్లని  చూసి వాళ్లలాగా అవాలనుకుంటుంది. తనని నేను ఎలా అపగలను?” ఆమె అడిగింది. “ఒక తల్లిగా నేను ఎంతో   గర్వపడతాను(ఆమె పోలీస్ అయితే). కానీ అందరూ ఆమెని ఏదో ఒకటి అంటారు. అప్పుడు బాధ అనిపిస్తుంది.”

కాని ఆ గ్రామంలో కొంతమంది అమ్మాయిలకు, మహిళలకు వారి కష్టం ఇలా మాటలు పడడంతో ఆగదు.

17 ఏళ్ళ నేహా కుమారి కుటుంబంలో, పెళ్లి చేసుకోనని నిరాకరిస్తే కొడతారు. “మా నాన్నకి  చాలా కోపం వస్తుంది. మా అమ్మని కొట్టడం మొదలుపెడతాడు. ఎప్పుడు ఒక కొత్త పెళ్లి సంబంధం వచ్చినా నేను వద్దని చెప్పగానే, ఇంతే జరుగుతుంది. మా అమ్మని చాలా ఇబ్బంది పెడుతున్నానని నాకు తెలుసు.” వాళ్ళ నాన్న మధ్యాహ్నాలు పడుకునే ముందు గది అవతల తన తోబుట్టువులతో కలిసి తాను ఉండే గదిలో నేహా నాతో మాట్లాడింది. ఆ గదిలో ఒక మూల నేహా చదువుకునే స్థలం ఉంది. ఆమె పుస్తకాలను ఎవరు ముట్టుకోవడానికి ధైర్యం చెయ్యరు, అని నవ్వుతూ చెప్పింది నేహా.

ఆమె తల్లి నైనా దేవి, నేహా చదువుకోసం ఆమె అలా దెబ్బలు తినడం పెద్ద కష్టం కాదని చెబుతుంది. ఆమె నేహా చదువు కోసం తన నగలు అమ్మాలని కూడా అనుకుంది. “ఆమెని  చదువుకోనీయక, బలవంతపెట్టి పెళ్ళిచేస్తే, విషం మింగి చనిపోతుంది. అలా ఎలా జరగనిస్తాను?”, అని అడిగింది. ఆమె భర్తకు 2017లో ఆక్సిడెంట్ అయి కాలు కోల్పోయాడు. ఇక ఆయన వ్యవసాయ కూలీగా పనిచేయడం కుదరదు. ముప్పైతొమ్మిదిదేళ్ళ నైనాదేవి సంపాదనతోనే కుటుంబం నడుస్తుంది. ఈ కుటుంబం కూడా మహాదళిత్ వర్గానికి చెందిన భుయ్య కులానికి చెందిన వారు. నైనా కూలి చేసి నెలకు సంపాదించే 5,000 రూపాయిలు ఆమె ఇల్లు నడపడానికి సరిపోవు, ఆమె బంధువులు కూడా చేతనైనంత సహాయం చేస్తారని చెప్పింది నైనా.

In Neha Kumari and Naina Devi's family, resistance to marriage brings a beating
PHOTO • Amruta Byatnal

నేహాకుమారి ఇంట్లో పెళ్లి చేసుకోనని నిరాకరిస్తే కొడతారు

ఆమె తల్లి నైనా దేవి, నేహా చదువుకోసం అలా దెబ్బలు తినడం పెద్ద కష్టం కాదని చెబుతుంది. ఆమె నేహా చదువు కోసం తన నగలు అమ్మాలని కూడా అనుకుంది. “ఆమెని  చదువుకోనీయక, బలవంతపెట్టి పెళ్ళిచేస్తే, విషం మింగి చనిపోతుంది. అలా ఎలా జరగనిస్తాను?”, అని అడిగింది

నేహా 12 వ తరగతి వరకు చదివింది. పాట్నాలో ఏదైనా ఆఫీసులో పని చేయాలని ఆమె కోరిక. “మా కుటుంబం ఎవరూ ఇప్పటిదాకా ఆఫీసులో పనిచేయలేదు, అలా పనిచేసే మొదటి వ్యక్తిని నేనే కావాలనుకుంటున్నాను.” అన్నది. ఆమె అక్కకి 17 ఏళ్లకే పెళ్లి అయిపొయింది, 22 ఏళ్ళు వచ్చేసరికి ఆమెకు ముగ్గురు పిల్లలు కలిగారు. ఆమె అన్నకి 19 ఏళ్ళు, తమ్ముడికి 15 ఏళ్ళు. “నాకు మా అక్కంటే ఇష్టమే కానీ, ఆమె లాంటి జీవితం నాకు వద్దు.” అన్నది నేహా.

సరరైరంజన్ తెహసిల్ లోని గంగసారా గ్రామంలో 6,868 మంది జనాభా ఉన్నారు(సెన్సస్ 2011)- నేహా చదివే ప్రభుత్వ పాఠశాల కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ పన్నెండు వరకు తరగతులు ఉన్నాయి. ఆమె తన తరగతిలో ఆరుగురు అమ్మాయిలు, పన్నెండు మంది అబ్బాయిలు మాత్రమే ఉన్నారని చెప్పింది. “ఎనిమిదో తరగతి తరవాత  బడిలో అమ్మాయిల సంఖ్య నెమ్మదిగా తగ్గిపోతుంది, కొన్నిసార్లు వారిని పనికి పంపించేస్తారు, కొన్నిసార్లు పెళ్ళి చేసేస్తారు.” అని చెప్పారు, నేహా స్కూల్ టీచర్ అనిల్ కుమార్.

బీహార్‌లో, 42.5 శాతం మంది బాలికలకు 18 ఏళ్లలోపు వివాహం జరుగుతోంది - అంటే దేశంలో చట్టబద్ధమైన వివాహ వయస్సు కంటే ముందే జరుగుతుంది ( బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ద్వారా తప్పనిసరిగా దీనిని పాటించాలి). ఈ సంఖ్య అఖిల భారత స్థాయి 26.8 శాతం కంటే చాలా ఎక్కువ అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( NFHS-4, 2015-16 ) పేర్కొంది. సమస్తిపూర్‌లో ఈ సంఖ్య మరింత పెరిగి 52.3 శాతానికి చేరుకుంది.

దీని వలన చాలా ఇబ్బందులు వస్తున్నాయి- అందులో  కొన్ని, శివాని నేహా వంటి వారి చదువును నిలిపివేయవలసి వచ్చే ప్రమాదం వంటివి. “గతకొన్నేళ్ళుగా బీహార్ లో సంతానోత్పత్తి తగ్గిపోయింది (NFHS 2019-20 నివేదిక  ప్రకారం, 2005-06 లో 4 ఉన్నది కాస్తా 2015-16లో 3.4 కి, 2015-16లో 3కి  పడిపోయింది). చిన్నవయసులో వివాహం జరిగిన అమ్మాయిలు మరింత పేదగా బలహీనంగా, ఆరోగ్య సేవలు అందుకునే అవకాశం లేకుండా అవుతారని మనకు తెలుసు,” అన్నారు పూర్ణిమ మీనన్. ఈమె ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లో సీనియర్ రీసెర్చ్ ఫెలో. ఈమె విద్యకు, చిన్నవయసులో జరిగే వివాహాలకు, మహిళలు ఆడపిల్లల ఆరోగ్యానికి మధ్యగల సంబంధాన్ని గురించి అధ్యయనం చేశారు.

ఒక  స్థితి నుండి మరో స్థితికి చేరేముందు కొంత సమయం ఇవ్వడం అవసరం అని అన్నారు. ఆమె ఉద్దేశం ఆడపిల్లలకు బడికి, పెళ్ళికి మధ్య, గర్భధారణలకు మధ్య కొంత సమయం ఇవ్వాలి. “అమ్మాయిల జీవితాలను మార్చే పెద్ద సంఘటనలు జరిగేముందు సమయం ఇవ్వవలసిన అవసరం చాలా ఉంది. ఇది మనం అమ్మాయిలు చిన్నవయసులో ఉండగానే మొదలుపెట్టాలి.” నగదు ఇచ్చే కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ చేయించుకున్నందుకు ప్రోత్సాహాకాలు ఇవ్వడం వంటివి  చేస్తే అమ్మాయిలు ఇటువంటి సమయాలను వాడుకుని వారి లక్ష్యాలను చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

“అమ్మాయిల పెళ్లి ఆలస్యమైతే ఆమెకు చదువుకోడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఎక్కువ అని మేము నమ్ముతాము,” అన్నది కిరణ్ కుమారి. ఈమె సమస్తిపూర్, సిరైరంజన్ తెహసిల్ లో  జవహర్ జ్యోతి బాల్  వికాస్ కేంద్ర అనే స్వచ్చంధ సంస్థలో ప్రోగ్రాం మేనేజర్ గా  పనిచేస్తున్నారు. కుమారి చిన్నవయసులో ఉన్న అమ్మాయిలకు జరగబోయిన ఎన్నో పెళ్లిళ్లని ఆపింది. అంతేగాక, ఎవరైనా అమ్మాయికి త్వరగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను ఒప్పిస్తుంది కూడా. “మా పని చిన్న వయసులో జరిగే పెళ్లిళ్లను ఆపడం మాత్రమే కాదు. వారు కోరుకున్న జీవితాన్ని  పొందడానికి వారిని చదువుకొనేలా ఉత్తేజపరుస్తూ ఉండడమే మా లక్ష్యం.”

Every time, Gauri had succeeded in convincing her parents to wait. But in May 2020, she wasn’t so lucky
PHOTO • Amruta Byatnal
Every time, Gauri had succeeded in convincing her parents to wait. But in May 2020, she wasn’t so lucky
PHOTO • Antara Raman

ప్రతిసారి గౌరీ తన తల్లిదండ్రులను తన పెళ్లిని వాయిదా వేయడానికి ఒప్పించగలిగింది. కాని  మే 2020లో ఆమెకు ఆ అదృష్టం లేకపోయింది

కానీ మార్చ్ 2020 లో మహారోగం  మొదలేనప్పుడు తల్లిదండ్రులను ఒప్పించడం కష్టమైంది, అన్నది కుమారి. “తల్లిదండ్రులు మాకు ఇలా చెప్పారు: ‘మేము మా ఆదాయాన్ని కోల్పోతున్నాము(ముందు ముందు సంపాదించగలమో లేదో కూడా తెలీదు), అమ్మాయిల  పెళ్లిళ్లు చేసి కనీసం ఒక బాధ్యతనైనా తగ్గించుకుందామనుకుంటున్నాము.’ అమ్మాయిలు బరువు కాదు, వారు మీకు సహాయంగా ఉంటారు అని వాళ్ళకి చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాం.”

కొంతకాలం వరకు, 16 ఏళ్ళ గౌరీ కుమారి, ఎలాగోలా ఆపగలిగింది. 9 నుండి  24 ఏళ్ళ మధ్య వయసులో నున్న ఏడుగురు తోబుట్టువులలో పెద్ద కూతురైన ఆమెకు, భుయ్య కులానికి చెందిన ఆమె తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఆమెకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు. ప్రతిసారి ఆమె వారిని ఒప్పించగలిగింది. కానీ మే 2020లో, ఆమెకు ఆ అదృష్టం లేకపోయింది

సమస్తిపూర్ లోని తన గ్రామమైన మహులై దామోదర్ బస్టాండ్ వద్ద ఉన్న బజారులోని జనసందోహాం మధ్య ఆమె, తన పెళ్ళికి దారి తీసిన విషయాన్ని గురించి నాతో చెప్పింది. “మొదట మా  అమ్మ నన్ను బెగుసరాయ్ లో ఉండే, అసలు చదువుకోని  వాడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంది. కానీ నేను నాలాగా చదువుకున్న వాడు కావాలనుకున్నాను. నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి, నా కాలేజిలోని సార్లను, మేడంలను ఇంటి పిలిపించి మాట్లాడిస్తే  అప్పుడు ఊరుకుంది మా అమ్మ.”

కానీ గౌరీ నిరాకరణ, పోలీసులను పిలుస్తానని చేసిన బెదిరింపులు ఎక్కువకాలం సాగలేదు. పోయిన ఏడాది మే లో, ఆమె కుటుంబం ఇంకా కాలేజీలో చదువుతున్న అబ్బాయితో ఆమెకు పెళ్లిచేసారు. దీనికి అతితక్కువ మంది హాజరయ్యారు. చివరికి ముంబైలోని హోల్సేల్ మార్కెట్ లో దినకూలీగా పనిచేసే ఆమె తండ్రి కూడా లాక్డౌన్ కారణంగా పెళ్లికి  రాలేకపోయాడు.

“నేను ఈ  పరిస్థితి లో ఉన్నందుకు బాధపడుతున్నాను. నేను నిజంగా బాగా చదువుకుని సమాజంలో  ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదగాలనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా, నా చదువుని ఆపాలనుకోవడం లేదు. నేను ఏదోక రోజు టీచర్ ని అవుతాను. అప్పుడు అమ్మయిలకు వారి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని చెబుతాను,” అన్నదామె.

పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లో భాగంగా, PARI మరియు కౌంటర్ మీడియా ట్రస్ట్ కలిసి గ్రామీణ భారతదేశంలో కౌమారదశలో ఉన్న బాలికలు మరియు యువతులపై దేశవ్యాప్త రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ను చేస్తున్నారు. సమాజంలో కీలకమైన పాత్రను పోషించే అట్టడుగు వర్గాల పరిస్థితులను అన్వేషించడానికి, సాధారణ ప్రజల గొంతులను, వారి అనుభవాలను వినిపించడానికి ఈ ప్రాజెక్టు కృషి చేస్తుంది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే  [email protected] కి మెయిల్ చేసి [email protected] కి కాపీ పెట్టండి.

అనువాదం: అపర్ణ తోట

Amruta Byatnal

امرتا بیاتنال نئی دہلی واقع ایک آزاد صحافی ہیں۔ ان کا کام صحت، جنس اور شہرت پر مرکوز ہے۔

کے ذریعہ دیگر اسٹوریز Amruta Byatnal
Illustration : Antara Raman

انترا رمن سماجی عمل اور اساطیری خیال آرائی میں دلچسپی رکھنے والی ایک خاکہ نگار اور ویب سائٹ ڈیزائنر ہیں۔ انہوں نے سرشٹی انسٹی ٹیوٹ آف آرٹ، ڈیزائن اینڈ ٹکنالوجی، بنگلورو سے گریجویشن کیا ہے اور ان کا ماننا ہے کہ کہانی اور خاکہ نگاری ایک دوسرے سے مربوط ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز Antara Raman
Editor and Series Editor : Sharmila Joshi

شرمیلا جوشی پیپلز آرکائیو آف رورل انڈیا کی سابق ایڈیٹوریل چیف ہیں، ساتھ ہی وہ ایک قلم کار، محقق اور عارضی ٹیچر بھی ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز شرمیلا جوشی
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

کے ذریعہ دیگر اسٹوریز Aparna Thota