తెల్లటి మచ్చలున్న గోధుమ రంగు ఈకలు చిన్నగా పెరిగివున్న గడ్డిలో చెల్లాచెదురుగా పడివున్నాయి.

మసకబారుతున్న వెలుగులో నిశితంగా వెతుకుతూ, రాధేశ్యామ్ బిష్ణోయ్ ఆ ప్రాంతాన్ని కలియతిరుగుతున్నాడు. తాననుకుంటున్నది తప్పు కావాలని అతను ఆశిస్తున్నాడు. "ఈ ఈకలు పీకినట్లుగా అనిపించడం లేదు," అతను బిగ్గరగా అన్నాడు. తర్వాత ఫోన్ చేసి, “మీరు వస్తున్నారా? నాకు ఖచ్చితంగా అనిపిస్తోంది...” అంటూ ఆయన తాను మాట్లాడుతోన్న వ్యక్తికి చెప్పాడు.

మా తలపైన ఆకాశంలో ఏదో అపశకునంలాగా, 220-కిలోవోల్టుల హై టెన్షన్ (HT) వైర్లు ఝుమ్మంటూ ఎడతెగకుండా చిటపట శబ్దంచేస్తున్నాయి. చీకటి పడుతున్న సాయంత్రపు ఆకాశంలో ఈ తీగలు నల్లని చారల్లా కనిపిస్తున్నాయి.

సమాచారం (డేటా) సేకరించే వ్యక్తిగా తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ 27 ఏళ్ళ యువకుడు తన కెమెరాను బయటకు తీసి, నేరం జరిగిన ప్రదేశంలో క్లోజ్-అప్, మిడ్-షాట్ ఫోటోలను తీశాడు.

మరుసటి రోజు ఉదయాన్నే మేం తిరిగి ఆ ప్రదేశానికి వచ్చాం. ఇది జైసల్మేర్ జిల్లాలోని ఖేతోలాయీ సమీపంలోని గంగారామ్ కీ ఢాణీ అనే చిన్న పల్లె నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.

ఈసారి ఎటువంటి సందేహం లేదు. ఆ ఈకలు స్థానికంగా ప్రజలు గోడావణ్ అని పిలిచే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (జిఐబి- బట్టమేక పక్షి)కి చెందినవి.

Left: WII researcher, M.U. Mohibuddin and local naturalist, Radheshyam Bishnoi at the site on March 23, 2023 documenting the death of a Great Indian Bustard (GIB) after it collided with high tension power lines.
PHOTO • Urja
Right: Radheshyam (standing) and local Mangilal watch Dr. S. S. Rathode, WII veterinarian (wearing a cap) examine the feathers
PHOTO • Priti David

ఎడమ: మార్చి 23, 2023న హై టెన్షన్ విద్యుత్ లైన్లను ఢీకొని మరణించిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (జిఐబి) మరణాన్ని డాక్యుమెంట్ చేస్తున్న డబ్ల్యుఐఐ పరిశోధకుడు ఎం.యు. మొహిబుద్దీన్, స్థానిక ప్రకృతి ధర్మవాది రాధేశ్యామ్ బిష్ణోయ్. కుడి: ఈకలను పరిశీలిస్తున్న డబ్ల్యుఐఐ పశువైద్యుడు డాక్టర్ ఎస్. ఎస్.రాథోడ్ (టోపీ ధరించినవారు)ను గమనిస్తోన్న రాధేశ్యామ్ (నిలబడి ఉన్నవారు), స్థానికుడు మంగీలాల్

మార్చి 23, 2023 ఉదయం, వన్యప్రాణుల పశువైద్యుడైన డాక్టర్ శ్రవణ్ సింగ్ రాథోడ్ ఆ ప్రదేశంలో ఉన్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఆయన ఇలా చెప్పారు: “హై టెన్షన్ వైర్లను ఢీకొనడం వల్లనే మరణం సంభవించింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది మూడు రోజుల క్రితం, అంటే మార్చి 20 (2023)న జరిగినట్లుగా కనిపిస్తోంది.”

భారత వన్యప్రాణుల సంస్థ (డబ్ల్యుఐఐ)తో కలిసి పనిచేస్తున్న డాక్టర్ రాథోడ్, 2020 నుండి పరిశీలించిన బట్టమేక పక్షులలో ఇది నాలుగవది.  డబ్ల్యుఐఐ అనేది పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల (MoEFCC), రాష్ట్ర వన్యప్రాణి మంత్రిత్వ శాఖకు చెందిన సాంకేతిక విభాగం. “కళేబరాలన్నీ హై టెన్షన్ వైర్ల కిందే కనిపించాయి. ఆ వైర్లకూ, ఈ దురదృష్టకర మరణాలకూ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందనేది స్పష్టం,” అని ఆయన చెప్పారు.

చనిపోయిన పక్షి, వేగంగా అంతరించిపోయే ప్రమాదం లో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ( ఆర్డియాటిస్ నీగ్రైసెప్స్ ). గత ఐదు నెలల్లో హైటెన్షన్ వైర్లను ఢీకొని కిందపడి చనిపోయినవాటిల్లో ఇది రెండవది. జైసల్మేర్ జిల్లాలోని సాంక్రా బ్లాక్ సమీపంలోని ఢోలియా గ్రామానికి చెందిన రైతు రాధేశ్యామ్ మాట్లాడుతూ, “2017 (అతను లెక్కించడం ప్రారంభించిన సంవత్సరం) నుండి ఇది తొమ్మిదవ మరణం," అన్నాడు. గొప్ప ప్రకృతి ధర్మవాది అయిన ఈయన, ఈ పెద్ద పక్షి పైన ఒక కన్నేసి ఉంచుతాడు. "చాలా గోడావణ్ మరణాలు ఎచ్‌టి వైర్ల కిందనే జరిగాయి," అని అతను జోడించాడు.

బట్టమేక పక్షులు వన్యప్రాణుల (రక్షణ) చట్టం 1972 , షెడ్యూల్ 1 జాబితా కిందకు వస్తాయి. ఒకప్పుడు ఈ పక్షులు పాకిస్తాన్, భారతదేశాల్లోని గడ్డి భూముల్లో కనిపించేవి. ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో కేవలం 120-150 పక్షులు మాత్రమే ఉన్నాయి. మనదేశంలో వాటి జనాభా ఐదు రాష్ట్రాలలో విస్తరించి ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల కూడళ్ళలో దాదాపు 8-10 పక్షులు, గుజరాత్‌లో నాలుగు ఆడ పక్షులు కనిపిస్తున్నాయి.

ఈ పక్షులు అత్యధిక సంఖ్యలో జైసల్మేర్ జిల్లాలోనే ఉన్నాయి. పశ్చిమ రాజస్థాన్‌లోని గడ్డి భూముల్లోని వాటి సహజ ఆవాసాలలోనే ఈ పక్షులను పర్యవేక్షిస్తున్న వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డాక్టర్ సుమిత్ డూకియా, "ఇవి రెండు రకాలు ఉన్నాయి - ఒకతి పోక్రణ్ సమీపంలోనూ, మరొకటి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని డెజర్ట్ నేషనల్ పార్క్‌లోనూ ఉన్నాయి," చెప్పారు.

Today there are totally only around 120-150 Great Indian Bustards in the world and most live in Jaisalmer district
PHOTO • Radheshyam Bishnoi

నేడు ప్రపంచంలో దాదాపు 120-150 బట్టమేక పక్షులు మాత్రమే ఉన్నాయి, వీటిలో అత్యధికంగా జైసల్మేర్ జిల్లాలో నివసిస్తున్నాయి

'We have lost GIB in almost all areas. There has not been any significant habitat restoration and conservation initiative by the government,' says Dr. Sumit Dookia
PHOTO • Radheshyam Bishnoi

'ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోని బట్టమేక పక్షులను కోల్పోయాం. వాటి సహజ ఆవాసాలను పునరుద్ధరించడానికిగానీ, వాటి సంరక్షణ, పునరుత్పత్తి గురించిగానీ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదు,' అని డాక్టర్ సుమిత్ డూకియా చెప్పారు

“ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లోని బట్టమేక పక్షులను కోల్పోయాం. వాటి సహజ ఆవాసాలను పునరుద్ధరించడానికిగానీ, వాటి సంరక్షణ, పునరుత్పత్తి గురించిగానీ ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపడం లేదు," అని ఎకాలజీ, రూరల్ డెవలప్‌మెంట్ మరియు సస్టైనబిలిటీ (ఇఆర్‌డిఎస్) ఫౌండేషన్‌లో గౌరవ శాస్త్రీయ సలహాదారుగా ఉన్న డూకియా నిర్మొహమాటంగా చెప్పారు. బట్టమేక పక్షులను కాపాడటంలో సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి 2015 నుండి ఈ సంస్థ ఈ ప్రాంతంలో పనిచేస్తోంది..

“నా జీవితకాలంలోనే ఈ పక్షులు గుంపులుగా ఆకాశంలో ఎగరడాన్ని చూశాను. ప్రస్తుతం అప్పుడో పక్షి, ఇప్పుడో పక్షి చాలా అరుదుగా మాత్రమే ఎగురుతూ కనిపిస్తున్నాయి," అని సుమేర్ సింగ్ భాటి పేర్కొన్నారు. నలభైల వయసులో ఉన్న సుమేర్ సింగ్ స్థానిక పర్యావరణవేత్త, జైసల్మేర్ జిల్లాలోని దట్టమైన పొదలలో ఉండే బట్టమేక పక్షులనూ, వాటి ఆవాసాలనూ రక్షించడంతో చురుకుగా పనిచేస్తున్నారు.

ఈయన అక్కడికి ఒక గంట దూరంలో ఉన్న సమ బ్లాక్‌లోని సంవతా గ్రామంలో నివసిస్తున్నారు. కానీ గోడావణ్ మరణం అతన్నీ, పక్షి భవిష్యత్తు గురించి ఆందోళన చెందే ఇతర స్థానికులనూ, శాస్త్రవేత్తలనూ ఈ ప్రదేశానికి తరలివచ్చేలా కదిలించింది.

*****

రాసలా గ్రామం సమీపంలోని దేగరాయ్ మాతా మందిరం నుండి సుమారు 100 మీటర్ల దూరంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారుచేసిన గోడావణ్ నిలువెత్తు విగ్రహం ఉంది. ఇది హైవే నుండి కనిపిస్తుంటుంది- ఒక తాడుతో కట్టిన ఆవరణం లోపల వేదిక పైన ఒక్కటే ఉంటుంది.

స్థానికులు నిరసన సూచకంగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. "ఇది ఇక్కడ మరణించిన బట్టమేకపక్షి మొదటి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసింది," అని వాళ్ళు మాతో చెప్పారు. ఫలకం మీద హిందీలో ఇలా రాసి ఉంటుంది: 'దేగరాయ్ మాతా మందిరం సమీపంలో, 16 సెప్టెంబర్ 2020న, ఒక ఆడ గోడావణ్ హైటెన్షన్ లైన్లను ఢీకొట్టి మరణించింది. దాని జ్ఞాపకార్థం ఈ స్మారక చిహ్నం నిర్మించబడింది.'

Left: Radheshyam pointing at the high tension wires near Dholiya that caused the death of a GIB in 2019.
PHOTO • Urja
Right: Sumer Singh Bhati in his village Sanwata in Jaisalmer district
PHOTO • Urja

ఎడమ: 2019లో బట్టమేక పక్షి మరణానికి కారణమైన ఢోలియా సమీపంలోని హై టెన్షన్ వైర్లను చూపుతున్న రాధేశ్యామ్. కుడి: జైసల్మేర్ జిల్లాలోని స్వగ్రామమైన సంవతాలో సుమేర్ సింగ్ భాటి

Left: Posters of the godawan (bustard) are pasted alongwith those of gods in a Bishnoi home.
PHOTO • Urja
Right: The statue of a godawan installed by people of Degray
PHOTO • Urja

ఎడమ: బిష్ణోయ్ ఇంటిలో దేవుళ్ళ బొమ్మలతో పాటు అతికించివున్న గోడావణ్ (బస్టర్డ్) పోస్టర్. కుడి: దేగరాయ్‌లో స్థానికులు స్థాపించిన గోడావణ్ విగ్రహం

సుమేర్ సింగ్, రాధేశ్యామ్, జైసల్మేర్‌లోని ఇతర స్థానికులకు - గోడావణ్‌లు మరణించడం, అవి వాటి నివాసాలను కోల్పోవడం అంటే - పశుపోషక సముదాయాలు తమ పరిసరాలపై హక్కును కోల్పోవడం, తద్వారా తమ పశుపోషక జీవనాలనూ, జీవనోపాధినీ కోల్పోవడానికి ప్రతీకలు.

"ఈ 'అభివృద్ధి' పేరుతో మేం చాలా నష్టపోతున్నాం," అని సుమేర్ సింగ్ చెప్పారు. "మరి ఈ అభివృద్ధి ఎవరి కోసం?" అని ప్రశ్నించారు. ఆయన అలా అడగటంలో అర్థం ఉంది - అక్కడికి 100 మీటర్ల దూరంలో ఒక సోలార్ ఫామ్ ఉంది. పైనుండి విద్యుత్ లైన్లు వెళ్తాయి, కానీ అతని గ్రామానికి సరైన, నమ్మదగిన విద్యుత్ సరఫరా మాత్రం లేదు.

భారతదేశపు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గత 7.5 సంవత్సరాలలో 286 శాతం పెరిగిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత దశాబ్దంలో, ముఖ్యంగా గత 3-4 సంవత్సరాలలో, ఈ రాష్ట్రంలో వేలాది సౌర, పవన విద్యుత్ పునరుత్పాదక ఇంధన ప్లాంట్లను ప్రారంభించారు. వీటిలో అడానీ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ రాజస్థాన్ లిమిటెడ్ (ఎఆర్ఇపిఆర్ఎల్) జోధ్‌పూర్‌లోని భాదలాలో ఒక 500 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పార్కును, జైసల్మేర్‌లోని ఫతేహ్‌ఘఢ్‌లో 1,500 మెగావాట్ల సామర్థ్యం గల మరో సోలార్ పార్కును అభివృద్ధి చేస్తోంది. వారు ఏదైనా విద్యుత్ లైన్లను భూగర్భంలోకి మారుస్తున్నారా అని కంపెనీ నిర్వహిస్తున్న వెబ్‌సైట్ ద్వారా కంపెనీని అడిగితే, ఈ కథనం ప్రచురించిన సమయానికి వారి నుండి ఎటువంటి జవాబు రాలేదు.

రాష్ట్రంలోని సౌర, పవన క్షేత్రాల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును భారీ విద్యుత్ తీగల సహాయంతో జాతీయ గ్రిడ్‌కు పంపిస్తారు. అధిక విద్యుత్ అలలతో కూడిన ఈ తీగలు బట్టమేక పక్షులు, డేగలు, రాబందులు, వంటి పక్షి జాతులు ఎగిరే మార్గానికి అడ్డంగా నిర్మించివున్నాయి. పునరుత్పాదక శక్తికి సంబంధించిన ఈ ప్రాజెక్టులు బట్టమేక పక్షుల ఆవాసాలైన పోఖ్రణ్, రామ్‌గఢ్-జైసల్మేర్ గుండా వెళ్ళే గ్రీన్ కారిడార్‌కు దారితీస్తాయి.

Solar and wind energy  projects are taking up grasslands and commons here in Jaisalmer district of Rajasthan. For the local people, there is anger and despair at the lack of agency over their surroundings and the subsequent loss of pastoral lives and livelihoods
PHOTO • Radheshyam Bishnoi

ఈ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ఉండే గడ్డి భూములను, సాధారణ ప్రాంతాలను ఆక్రమించాయి. తమ పరిసరాల గురించి మాట్లాడే హక్కు తమకు లేకపోవడం పట్ల, తమ పశుపోషక జీవనాలనూ జీవనోపాధినీ కోల్పోవడం పట్ల స్థానికులు నిరాశతోనూ ఆగ్రహంతోనూ ఉన్నారు

జైసల్మేర్ కీలకమైన సెంట్రల్ ఆసియన్ ఫ్లైవే (సిఎఎఫ్)లో - ఆర్కిటిక్ నుండి మధ్య యూరప్, ఆసియా మీదుగా హిందూ మహాసముద్రం వరకు ఏటా పక్షులు వలస వెళ్ళే మార్గం - ఉంది. 182 వలస నీటిపక్షుల జాతికి చెందిన 279 పక్షి గుంపులు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయని కన్వెన్షన్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసిస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అంచనా వేసింది. వీటిలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఓరియంటల్ వైట్-బ్యాక్డ్ వల్చర్ ( జిప్స్ బెంగాలెన్సిస్ -వీపుపై తెల్లగా ఉండే ప్రాచ్యదేశాల రాబందు), లాంగ్-బిల్డ్ (పొడవాటి ముక్కున్న భారతదేశపు రాబందు- జిప్స్ ఇండికస్ ), స్టోలిజ్‌కాస్ బుష్‌చాట్ (గుండుములుపుగాడు - సాక్సికోలా మాక్రోరింఖస్ ), ఆకుపచ్చ మునియాలు ( ఎమండేవా ఫార్మోసా ), మాక్వీన్స్ లేదా హౌబారా బస్టర్డ్ ( క్లమిడాటిస్ మక్వీనియాయ్ ) వంటి పక్షులు ఉన్నాయి.

రాధేశ్యామ్ మంచి ఉత్సాహమున్న ఫోటోగ్రాఫర్. అతని లాంగ్ ఫోకస్ టెలి లెన్స్ కలవరపరిచే చిత్రాలను తీసింది. “సౌర ఫలకాలను సరస్సుగా భ్రమపడిన పెలికాన్లు రాత్రిపూట ఒక సౌర ఫలకాల మైదానంలో దిగడాన్ని నేను చూశాను. ఆ నిస్సహాయ పక్షుల సున్నితమైన కాళ్ళు ఆ గాజు ఫలకాల మీద జారిపోవడంతో అవి కోలుకోలేని విధంగా గాయపడతాయి.”

పవర్‌లైన్లు కేవలం బట్టమేక పక్షులను మాత్రమే కాకుండా, జైససల్మేర్‌లోని డెజర్ట్ నేషనల్ పార్క్ చుట్టుపక్కల 4,200 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో, ఏటా దాదాపు 84,000 పక్షులను చంపుతున్నాయని భారత వన్యప్రాణి సంస్థ, 2018లో చేసిన అధ్యయనం తెలిపింది. "ఇటువంటి (బట్టమేక పక్షుల వంటి పక్షుల) అధిక మరణాల రేటు పక్షి జాతుల వినాశనానికి, అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి."

ప్రమాదం కేవలం ఆకాశంలో మాత్రమే కాదు, భూమి మీద కూడా ఉంది. ఇక్కడ ప్రస్తావించిన గడ్డిభూములు, పవిత్ర ఉపవనాలు లేదా ఇక్కడ వాడుకగా పిలిచే ఓరణ్‌లు ఇప్పుడు 500 మీటర్ల ఎడంలో 200 మీటర్ల ఎత్తైన గాలి మరలతో నిండివున్నాయి. హెక్టార్లకు హెక్టార్లు కంచె వేసిన సోలార్ మైదానాలు ఉన్నాయి. ఒక్క కొమ్మను కూడా నరకరాదని స్థానికులు పట్టుబట్టే పవిత్ర ఉపవనాలలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజక్టుల ఏర్పాటు పాముపచ్చీసు ఆటలా సాగింది. పశుపోషకులకు ఈ గడ్డిమైదానాల్లో నేరుగా నడవటానికి వీలులేకుండా పోయింది. దీంతో వాళ్ళు గాలిమరలనూ, వాటికి సహాయకంగా ఉన్న మైక్రోగ్రిడ్లనూ చుట్టూ దాటుకుని వెళ్లాల్సి వస్తోంది.

Left: The remains of a dead griffon vulture in Bhadariya near a microgrid and windmill.
PHOTO • Urja
Left: The remains of a dead griffon vulture in Bhadariya near a microgrid and windmill.
PHOTO • Vikram Darji

ఎడమ: భాదరియాలోని ఒక మైక్రోగ్రిడ్, గాలిమరల సమీపంలో  చనిపోయిన గ్రిఫిన్ రాబందు అవశేషాలు. కుడి: రాధేశ్యామ్ గోడావణ్‌లను సురక్షితంగా ఉంచడం కోసం వాటిని గమనిస్తూ ఉంటాడు

"నేను ఉదయం బయలుదేరితే, సాయంత్రానికి మాత్రమే ఇంటికి చేరుకుంటాను," అంది ధనీ (ఆమె ఈ పేరు మాత్రమే ఉపయోగిస్తుంది). ఈ 25 ఏళ్ళ యువతి తన నాలుగు ఆవులకు, ఐదు మేకలకు గడ్డి తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాలి. "నేను నా పశువులను అడవిలోకి తీసుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు వైర్ల నుండి షాక్ తగులుతోంది." ధనీ భర్త బార్‌మేర్ పట్టణంలో చదువుకుంటున్నాడు. ఆమె వారి ఆరు బిఘాల (దాదాపు ఒక ఎకరం) భూమిని, 8, 5, 4 సంవత్సరాల వయస్సు గల వారి ముగ్గురు అబ్బాయిలను సంరక్షిస్తోంది.

"మేం మా ఎమ్మెల్యేనీ, జిల్లా కమీషనర్(డిసి)నీ ప్రశ్నించడానికి ప్రయత్నించాం, కానీ ఏమీ జరగలేదు," అని జైసల్మేర్‌లోని సమ బ్లాక్‌లో ఉన్న రాసలా గ్రామానికి చెందిన దేగరాయ్ గ్రామ ప్రధాన్ మురీద్ ఖాన్ చెప్పారు.

"మా పంచాయితీలో ఆరు నుండి ఏడు లైన్ల హైటెన్షన్ కేబుల్స్ ఉన్నాయి," అని ఆయన ఎత్తి చూపారు. “అవి మా ఓరణ్‌ల (పవిత్ర ఉపవనాలు) గుండా వెళ్తున్నాయి. మేం వారిని, ‘భాయ్ మీకు ఎవరు అనుమతి ఇచ్చారు’ అని అడిగినప్పుడు, ‘మాకు మీ అనుమతి అవసరం లేదు’ అని వారు సమాధానం చెప్పారు.".

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, మార్చి 27, 2023న, ఈ విషయంపై లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే బట్టమేక పక్షుల ఆవాసాలను దేశీయ ఉద్యానవనాలుగా ప్రకటిస్తామని చెప్పారు.

ఆ రెండు ఆవాసాలలో ఒకటి ఇప్పటికే దేశీయ ఉద్యానవనంగా గుర్తింపుపొందినది కాగా మరొకటి రక్షణ శాఖకు చెందిన భూమి. కానీ అవేవీ బట్టమేక పక్షులకు సురక్షితమైనవి కావు.

*****

ఏప్రిల్ 19, 2021న, ఒక రిట్ పిటిషన్‌కు ప్రతిస్పందనగా సుప్రీమ్ కోర్ట్ , “బట్టమేక పక్షులకు ప్రాధాన్యం, సంభావ్యత ఉన్న ప్రాంతాల్లో, పైన ఉన్న కేబుళ్ళను భూగర్భ విద్యుత్ లైన్లుగా మార్చడం సాధ్యమయ్యే చోట, ఆ పనిని చేపట్టి ఏడాది లోగా పూర్తి చేయాలి”అని రూలింగ్ ఇచ్చింది. అప్పటి వరకూ డైవర్టర్లను (కాంతిని ప్రతిఫలింపజేసి, పక్షులను హెచ్చరించే ప్లాస్టిక్ డిస్కులు) ఏర్పాటు చేయాలని చెప్పింది.

సర్వోన్నత న్యయస్థానం తీర్పు ప్రకారం రాజస్థాన్‌లో 104 కి.మీ.ల లైన్లు భూగర్భంలోకి వెళ్లాలి. 1,238 కి.మీ.ల లైన్లకు డైవర్టర్లను అమర్చాలి.

'Why is the government allowing such big-sized renewable energy parks in GIB habitat when transmission lines are killing birds,' asks wildlife biologist, Sumit Dookia
PHOTO • Urja
'Why is the government allowing such big-sized renewable energy parks in GIB habitat when transmission lines are killing birds,' asks wildlife biologist, Sumit Dookia
PHOTO • Urja

'ట్రాన్స్‌మిషన్ లైన్లు పక్షులను చంపేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంత పెద్ద పరిమాణంలో పునరుత్పాదక ఇంధన పార్కులను బట్టమేక పక్షుల ఆవాసాలలో ఎందుకు అనుమతిస్తోంది?' అని వన్యప్రాణి జీవశాస్త్రవేత్త సుమిత్ డూకియా ప్రశ్నిస్తున్నారు

రెండేళ్ళ తర్వాత - ఏప్రిల్ 2023లో - భూగర్భంలోకి లైన్లను పంపాలన్న సుప్రీమ్ కోర్టు తీర్పును పూర్తిగా విస్మరించారు. కేవలం ప్రధాన రహదారుల దగ్గర స్థానిక ప్రజలకు, మీడియాకు కనిపించే ప్రాంతంలో, కొన్ని కిలోమీటర్ల లైన్లకు మాత్రమే ప్లాస్టిక్ డైవర్టర్‌లను అతికించారు. "అందుబాటులో ఉన్న పరిశోధనల ప్రకారం, పక్షి డైవర్టర్లు చాలా వరకు మరణాల తాకిడిని తగ్గిస్తాయి. కాబట్టి సైద్ధాంతికంగా చూస్తే, ఈ మరణాన్ని నివారించవచ్చు,” అని వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డూకియా చెప్పారు.

స్థానిక బట్టమేక పక్షి, ఈ గ్రహం మీద వాటికున్న ఏకైక నివాసంలో ప్రమాదంలో పడింది. కానీ మనం ఒక విదేశీ జాతికి ఇల్లు కట్టడానికి తొందరపడ్డాం - ఆఫ్రికా చిరుతలను భారతదేశానికి తీసుకురావడానికి ఒక గొప్ప పంచవర్ష ప్రణాళికతో రూ. 224 కోట్లు వెచ్చించి. ప్రత్యేక విమానాలలో వాటిని తీసుకురావటానికి, సురక్షితమైన ఎన్‌క్లోజర్లు, హై-క్వాలిటీ కెమెరాలు, అబ్జర్వేషన్ వాచ్ టవర్లను నిర్మించడం వంటివాటికి ఈ డబ్బును ఖర్చు చేస్తోంది. తర్వాత పులి జనాభా పెరుగుతోంది, దానికోసం 2022కు గాను ఉదారంగా రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయింపు ఉంది.

*****

విహంగ జాతికి చెందిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ లేదా బట్టమేక పక్షి ఒక మీటర్ పొడవు, 5-10 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే బహిరంగ ప్రదేశాలలో పెడుతుంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అడవి కుక్కల జనాభా వల్ల ఈ గుడ్డు ప్రమాదంలో పడుతోంది. “పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ పక్షి జనాభాను పెంపొందించడానికి మార్గాలను కనుగొని, ఈ జాతికి కొంత (ఎవరూ ఆక్రమించ వీలులేని) ప్రాంతాన్ని వదిలివేయాలి,” అని బాంబే నేచురల్ హిస్టరీ సోసైటీ (బిఎన్ఎచ్ఎస్) కార్యక్రమ అధికారి నీలకంఠ్ బోధా చెప్పారు. ఈ ప్రాంతంలో బిఎన్ఎచ్ఎస్ ఒక ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది.

భూసంబంధ జాతికి చెందిన ఈ పక్షి నడవడానికి ఇష్టపడుతుంది. 4.5 అడుగుల విస్తృతితో విప్పారిన రెక్కలతో భారీ శరీరాన్ని మోసుకుంటూ ఎడారి ఆకాశంలో అది ఎగురుతున్నప్పుడు చూడటం ఒక మహత్తర దృశ్యం.

'The godawan doesn’t harm anyone. In fact, it eats small snakes, scorpions, small lizards and is beneficial for farmers,”' says Radheshyam
PHOTO • Radheshyam Bishnoi

'గోడావణ్ ఎవరికీ హాని చేయదు. నిజానికి అది చిన్న పాములను, తేళ్ళను, చిన్న బల్లులను తింటుంది, రైతులకు మేలు చేస్తుంది.' అంటారు రాధేశ్యామ్

Not only is the Great Indian Bustard at risk, but so are the scores of other birds that come through Jaisalmer which lies on the critical Central Asian Flyway (CAF) – the annual route taken by birds migrating from the Arctic to Indian Ocean
PHOTO • Radheshyam Bishnoi

ప్రమాదంలో పడుతున్నది బట్టమేక పక్షి ఒక్కటే కాదు, కీలకమైన సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే (సిఎ ఎఫ్)లో ఉన్న జైసల్మేర్ గుండా ఎగురుతూ వచ్చే అనేక ఇతర పక్షులు కూడా. ఆర్కిటిక్ నుండి హిందూ మహాసముద్రానికి ప్రతి ఏటా పక్షులు వలస వచ్చే మార్గమిది

శక్తిశాలి అయిన బట్టమేక పక్షికి తలకు రెండు పక్కలా కళ్ళుంటాయి. అది నేరుగా చూడలేదు కనుక, ముందువైపు నుంచి వచ్చే ప్రమాదాలను కనిపెట్టలేదు. కాబట్టి, అది నేరుగా ఎగురుతూ వచ్చి హై-టెన్షన్ వైర్‌ను ఢీకొనడం గానీ, లేదా చివరి నిమిషంలో పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నించి గానీ ఉంటుంది. అది ట్రెయిలర్ ట్రక్‌లాగా చిన్న మలుపులు తీసుకోలేదు. బట్టమేక పక్షి ఆకస్మికంగా దిశ మార్చుకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది. అది పక్కకు తిరిగినపుడు దాని రెక్కలో కొంత భాగం లేదా తల భాగం 30 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న వైర్లలోకి తటాలున దూసుకుపోతుంది. "ఒకవేళ వైర్లు తగిలి విద్యుత్ షాక్ వల్ల అది చనిపోకపోతే, అంత ఎత్తు నుంచి పడిపోయినందువల్ల కూడా దాని ప్రాణం పోతుంది," అని రాధేశ్యామ్ చెప్పాడు.

రెండేళ్ళ క్రితం, 2022లో రాజస్థాన్ గుండా మిడతల దండ్లు భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు, " గోడావణ్‌ ల ఉనికి కొన్ని పొలాలను రక్షించింది, ఎందుకంటే అవి వేలాది మిడతలను తిన్నాయి," అని రాధేశ్యామ్ గుర్తు చేసుకున్నాడు. “ గోడావణ్ ఎవరికీ హాని చేయదు. వాస్తవానికి అది చిన్న పాములను, తేళ్ళను, చిన్న బల్లులను తింటుంది, రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది,” అని ఆయన చెప్పాడు.

అతనికీ, అతని కుటుంబ సభ్యులకూ కలిపి 80 బిఘాల (సుమారు 8 ఎకరాలు) భూమి ఉంది. అందులో వారు గ్వార్ (గోరుచిక్కుడు), బాజరా (సజ్జలు) పండిస్తారు. కొన్నిసార్లు చలికాలంలో వర్షం పడితే మూడో పంట కూడా వేస్తారు. "కేవలం 150 బట్టమేక పక్షులు కాకుండా, వేల సంఖ్యలో ఉండివుంటే, ఊహించుకోండి, మిడతల దండయాత్ర వంటి తీవ్రమైన విపత్తులు తగ్గిపోతాయి కదా," అంటాడతను.

బట్టమేకపక్షిని సంరక్షించడానికి, దాని సహజ ఆవాసానికి ఎటువంటి ఆటంకం కలగకుండా సురక్షితంగా ఉంచడానికి సాపేక్షికంగా చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం. "మనం ఆ ప్రయత్నం చేయవచ్చు. ఇది చేయడం అంత పెద్ద విషయమేమీ కాదు. లైన్లను భూగర్భంలోకి పంపాలని, ఇకపై ఎలాంటి లైన్లకు అనుమతి ఇవ్వకూడదని కోర్టు ఆదేశం ఉండనే ఉంది” అన్నారు రాథోడ్. "ఇప్పుడు ప్రభుత్వం నిజంగా ఆ పనులన్నీ ఆపేసి, అంతా నాశనం కాకముందే ఆలోచించాలి."


ఈ కథనాన్ని రూపొందించడంలో ఉదారంగా సహాయం చేసిన బయోడైవర్సిటీ కొలాబరేటివ్ సభ్యుడు డాక్టర్ రవి చెల్లమ్‌కు రిపోర్టర్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

అనువాదం: పి. పావని

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Photographs : Urja

Urja is Senior Assistant Editor - Video at the People’s Archive of Rural India. A documentary filmmaker, she is interested in covering crafts, livelihoods and the environment. Urja also works with PARI's social media team.

Other stories by Urja
Photographs : Radheshyam Bishnoi

Radheshyam Bishnoi is a wildlife photographer and naturalist based in Dholiya, Pokaran tehsil of Rajasthan. He is involved in conservation efforts around tracking and anti-poaching for the Great Indian Bustard and other birds and animals found in the region.

Other stories by Radheshyam Bishnoi

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : P. Pavani

P. Pavani is an independent journalist and a short story writer

Other stories by P. Pavani