"ఈ వృత్తి మాయమైపోతే, ఇంకో రాష్ట్రానికి వలసపోవటం తప్ప నాకు మరో మార్గం లేదు," ఒక బుట్ట మొదలు చుట్టూ సన్నని వెదురు బద్దెలను తిప్పుతూ అన్నది, దరాంగ్ జిల్లాలోని నా-మట్టీ గ్రామానికి చెందిన వెదురు బుట్టలు అల్లే మాజెదా బేగమ్.

దినసరి కూలీ, ఒంటరి తల్లి అయిన ఈ పాతికేళ్ళ హస్తకళాకారిణి పదేళ్ళ వయసున్న తన కొడుకునూ, అనారోగ్యంతో ఉండే తల్లినీ పోషించుకుంటున్నారు. "నేను ఒక్కరోజులో 40 ఖసాలు (బుట్టలు) అల్లగలను, కానీ ప్రస్తుతం 20 మాత్రమే అల్లుతున్నాను," స్థానిక మియా మాండలికంలో మాట్లాడుతూ అన్నదామె. మాజెదా అల్లే ప్రతి 20 బుట్టలకు ఆమెకు రూ. 160 వస్తాయి. ఇది రాష్ట్ర షెడ్యూల్డ్ ఉద్యోగానికి కనీస వేతనమైన రూ. 241.92 కంటే చాలా తక్కువ ( 2016 సంవత్సరానికి కనీస వేతనాల చట్టం, 1948పై నివేదిక )

వెదురు ధరలు పెరిగిపోవటంతో పాటు స్థానిక కూరగాయల మండీ లలో వెదురు బుట్టలకు గిరాకీ తగ్గిపోవటం, వెదురు బుట్టలను అమ్మితే వచ్చే ప్రతిఫలంపై ప్రభావం చూపుతున్నాయి. అస్సామ్ అంతటిలోకీ అతి పెద్ద మండీల లో రెండు మండీలు దరాంగ్‌లోనే ఉన్నాయి: మొత్తం ఈశాన్య రాష్ట్రాలతో పాటు దూరాన ఉన్న దిల్లీకి కూడా వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే బేసిమరి, బాలుగాఁవ్ మండీలు .

బలవంతంగా వలస వెళ్ళాల్సిరావడం గురించి మాజెదా భయాలు నిజమైనవే: దాదాపు 80 నుండి 100 కుటుంబాలు "మెరుగైన పని" కోసం ఇప్పటికే వెళ్ళిపోయాయని 39 ఏళ్ళ హనీఫ్ అలీ స్థానిక మదర్సా సమీపంలో ఉన్న వార్డ్ A చుట్టూ ప్రాంతాన్ని మాకు చూపిస్తూ చెప్పారు. ఒకప్పుడు దాదాపు 150 కుటుంబాలు వెదురు పనిలో నిమగ్నమై ఉండేవి. కానీ ఇప్పుడు, ఆ హస్తకళాకారులంతా కాఫీ తోటలలో పనిచేయడానికి కేరళ, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళడంతో చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: అస్సామ్‌లోని దరాంగ్ జిల్లా, నా-మట్టీ గ్రామానికి చెందిన మాజెదా బేగమ్. వెదురు బుట్టలు అల్లే ఈమె, రోజుకు 40 బుట్టలు అల్లగలదు, కానీ గిరాకీ తగ్గిపోతుండటంతో ప్రస్తుతం అందులో సగం మాత్రమే అల్లుతోంది. కుడి: వెదురు బుట్టలు అల్లటంలో మొదట చేసే టోలి అల్లకాన్ని చూపిస్తోన్న హనీఫ్ అలీ

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: తమ కుటుంబానికి చెందిన వెదురు బుట్టల వ్యాపారాన్ని నడిపించే సిరాజ్ అలీ. ప్లాస్టిక్ గోనె సంచులే తమ బుట్టలకు గిరాకీ తగ్గటానికి కారణమని ఆయన చెప్పారు. కుడి: తమ పిల్లలిద్దరూ గ్రామంలోని బడిలో చదువుకుంటుండటంతో, జమీలా ఖాతూన్ వలస వెళ్ళలేకపోతున్నారు

కోవిడ్-19 లాక్‌డౌన్ అప్పటినుంచి అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. "ఇంతకుముందు మేం వారానికి 400-500 వరకూ ఖసాల ను అమ్మేవాళ్ళం, కానీ ఇప్పుడు కేవలం 100-150 వరకూ మాత్రమే అమ్మగలుగుతున్నాం," సిరాజ్ అలీ చెప్పాడు. 28 ఏళ్ళ వయసున్న సిరాజ్ తన కుటుంబానికి చెందిన వెదురుబుట్టల వ్యాపారాన్ని నడుపుతున్నాడు. "కోవిడ్ సమయంలో కూరగాయల వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్యాక్ చేసి నిలవ ఉంచడానికి ప్లాస్టిక్ ట్రేలనూ, గోనెసంచులనూ వాడటం మొదలెట్టారు. ఆ సమయంలో మేం మా తుక్రీ లను (చిన్న వెదురు బుట్టలు) అమ్మలేకపోయాం," అన్నాడతను.

సిరాజ్ ఐదుగురు సభ్యులున్న తన కుటుంబంతో కలిసి వార్డ్ A లో నివాసముంటాడు. "మేమంతా పనిచేస్తున్నా కూడా వారానికి రూ. 3000-4000 వరకూ మాత్రమే సంపాదిస్తున్నాం," చెప్పాడతను. "పనివాళ్ళకు జీతాలివ్వడానికీ, వెదురును సేకరించటానికి అయ్యే ఖర్చులు పోను, మా కుటుంబ సంపాదన రోజుకు రూ. 250-300కు పడిపోతుంది." దీని ఫలితంగా, అతని ఉమ్మడి కుటుంబంలోని అనేకమంది సభ్యులు కాఫీ తోటల్లో పనిచేసేందుకు కర్ణాటకకు వలసవెళ్ళారు. "పరిస్థితులు ఇలాగే కొనసాగితే, నేను కూడా అలా వెళ్ళిపోవాల్సిందే," అన్నాడు సిరాజ్.

కానీ అందరూ అలా వెళ్ళిపోలేరు. "నా పిల్లలిద్దరూ ఇక్కడే బడిలో చదువుకుంటున్నారు, అందువలన నేను కేరళ వలసపోలేను," తన ఇంటిలో కూర్చొని ఉన్న మరో వెదురు బుట్టల అల్లికదారు, 35 ఏళ్ళ జమీలా ఖాతున్ అన్నారు. ఆ గ్రామంలోని చాలా ఇళ్ళల్లో మాదిరిగానే ఆమె ఇంటికి కూడా మరుగు దొడ్డి కానీ, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కానీ లేవు. "మాకు ప్రైవేట్ బడులకు పంపగలిగే స్తోమత లేదు. మేం వలసపోతే, పిల్లల చదువులు పాడవుతాయి," నా-మాట్టీలో నివాసముంటోన్న జమీలా అన్నారు.

ఈ గ్రామంలోని వెదురు బుట్టలు అల్లేవారిలో చాలామంది ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ ప్రాంతం నుంచి వలస వచ్చినవారి వారసులు. వారు వలసపాలన కాలంలో బెంగాల్ విభజన జరుగక ముందే తమ ఇళ్ళను వదిలి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. 'మియా' అనే పదానికి అక్షరాలా 'పెద్దమనిషి' అని అర్థం. కానీ అస్సామ్ జాతి జాతీయవాదులు బంగ్లా భాషను మాట్లాడే సముదాయాన్ని రాష్ట్రంలో "చట్టవిరుద్ధమైన స్థిరనివాసులు"గా వర్ణించడానికి తరచుగా ఈ పదాన్ని అవమానకరమైన పద్ధతిలో ఉపయోగిస్తారు.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: నా-మాట్టీ గ్రామం మియా సముదాయానికి చెందిన వెదురు బుట్టలు అల్లేవారికి నెలవు. కుడి: మియారుద్దీన్ చిన్న వయసు నుంచే బుట్టలను అల్లుతున్నాడు. వెదురు బుట్టలు అమ్మటంద్వారా ఆయన ఐదుగురు సభ్యులున్న తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

అడుగు భాగం (ఎడమ) బుట్ట పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. ఒకసారి అడుగు భాగాన్ని అల్లిన తర్వాత, మహిళలు సన్నని వెదురు బద్దలతో దానిగుండా చుట్టూ అల్లుతారు (కుడి)

గువాహటీకి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉండే నా-మాట్టీ గ్రామం దరాంగ్ జిల్లా అంతటిలోకీ వెదురు కళాకృతుల తయారీ కేంద్రంగా ఉంది. స్థానికంగా ఖస అని పిలిచే సంప్రదాయక వెదురు బుట్టల అల్లికకు పేరెన్నికగన్నది. బురదగా ఉండే రోడ్లు, సన్నని సందులు రెండు సమూహాలకు చెందిన దాదాపు 50 కుటుంబాలు ఉండే చోటుకు దారి తీస్తాయి. బెంగాలీ మాట్లాడే ఈ ముస్లిములు ఇక్కడ వెదురుతో కప్పిన, లేదా చీనారేకు గోడలతో దగ్గర దగ్గరగా ఉన్న ఇళ్ళలో ఉంటారు. కొన్ని కాంక్రీట్ ఇళ్ళు కూడా ఉన్న ఈ ప్రదేశమంతా తాంగ్‌నీ నది వరద మైదానాలలో ఉంది.

ఖసపట్టి అనే పేరున్న ఈ ప్రాంతానికి 'వెదురు బుట్టల ఆవాసాలు' అని అర్థం. ఇక్కడి ఇళ్ళన్నీ కుప్పలు తెప్పలుగా ఉన్న వెదురు బుట్టలతో నిండివుంటాయి. "నేను పుట్టక ముందు నుండి, మా ప్రాంతానికి చెందిన ప్రజలు లాల్‌పూల్, బేసిమరి, బాలుగాఁవ్ మండీల లోని రోజువారీ, వారపు కూరగాయల మార్కెట్‌లకు వెదురు బుట్టలను సరఫరా చేస్తున్నారు," అని తన ఇంటి వెలుపల ఉన్న సపోరి (ఇసుక తిన్నె)పై కూర్చొని అల్లుతున్న 30 ఏళ్ళ ముర్షిదా బేగమ్ చెప్పారు.

మూడు తరాల హనీఫ్ అలీ కుటుంబం ఈ వ్యాపారంలో ఉంది. " ఖసపట్టి అంటే చాలు, మీరు మాట్లాడుతున్నది ఈ గ్రామం గురించేనని జనానికి తెలిసిపోతుంది. ఇక్కడ అందరూ ఈ వృత్తిలోనే లేనప్పటికీ, మొదటి తరం ఖస అల్లికదారులు తమ పనిని మొదలుపెట్టింది మాత్రం ఇక్కడే."

ఈ వృత్తిని నిలిపి ఉంచేందుకు ప్రభుత్వ సహాయం కోసం గ్రామంలోని వెదురు పని చేసేవారితో ఒక గుర్తింపు పొందిన స్వయం సహాయక బృందాన్ని (ఎస్ఎచ్‌జి) ఏర్పాటు చేయాలని హనీఫ్ ప్రయత్నిస్తున్నారు. "ప్రభుత్వం మాకు ఒక కార్యశాలను నెలకొల్పేందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తే ఈ వృత్తి బతికిపోతుంది," అని ఆయన ఆశిస్తున్నాడు.

తమకు భూమి లేకపోవటం వలన, వ్యవసాయం చేయటం తెలియకపోవటం చేత తామీ వృత్తిని చేపట్టినట్టు ప్రధానంగా ఈ వృత్తిలో ఉన్న ముస్లిమ్ సముదాయంవారు చెప్తున్నారు. "ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడివున్న ఈ ప్రాంతంలోని కూరగాయల గొలుసుకట్టు వ్యాపారంలో ఈ వెదురు బుట్టలు ఒక విడదీయరాని భాగం," అని వార్డు Aకి చెందిన సామాజిక కార్యకర్త, బుట్టలు అల్లే 61 ఏళ్ళ అబ్దుల్ జలీల్ అన్నారు.

“స్థానికులకు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకుపోయేందుకు, రవాణా కోసం కూరగాయలను ప్యాక్ చేసేందుకు వ్యాపారులకు ఈ టుక్రీలు అవసరం. అందుకనే మేం కొన్ని తరాలుగా ఈ బుట్టలను తయారుచేస్తున్నాం," అని వివరించారాయన.


PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: ముర్షిదా బేగమ్ ప్రాంతానికి చెందిన అనేక కుటుంబాలు కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలకు వలసపోయారు. కుడి: బుట్టలల్లే, సామాజిక కార్యకర్త కూడా అయిన అబ్దుల్ జలీల్, 'మేం మా రక్తాన్నీ చెమటనూ ఓడ్చి ఈ పని చేస్తాం, కానీ మాకు సరైన ధర రాదు,' అంటారు

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎడమ: రెండు దశాబ్దాలకు పైగా బుట్టలల్లేవారికి వెదురును సరఫరా చేస్తోన్న మున్సేర్ అలీ. కుడి: అమ్మకాలు తగ్గిపోవటంతో అల్లినవారి ఇంటి వద్ద కుప్పపడివున్న బుట్టలు

వెదురు బుట్టల ధరలు పెరిగిపోవడానికి ముడిసరుకు కొనుగోలుకు అవుతోన్న అధిక ఖర్చులు కూడా కారణమని కార్మికులు చెబుతున్నారు. సపోరి క్లస్టర్‌కు చెందిన 43 ఏళ్ళ వెదురు హస్తకళాకారుడు అఫాజ్ ఉద్దీన్ మాట్లాడుతూ, 50 రూపాయలు ఖరీదు చేసే ఒక్కో బుట్టకు వారికి వెదురు, దారం, అల్లిక కార్మికులకు చెల్లించడం, స్థానిక రవాణా ఖర్చులన్నీ కలిపి దాదాపు రూ. 40 ఖర్చవుతుందని అన్నారు.

మున్సేర్ అలీ గత రెండు దశాబ్దాలుగా వివిధ ప్రాంతాల నుంచి వెదురును సేకరించి బెసిమరి బజార్‌లో అమ్ముతున్నారు. రవాణా చేయటం ఒక ప్రధానమైన అడ్డంకి అని ఈ 43 ఏళ్ళ వ్యక్తి చెప్తున్నారు. వాహనంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు నింపితే, మోటారు వాహనాల (సవరణ) చట్టం, 2019 ప్రకారం రూ. 20,000, ప్రతి అదనపు టన్ను బరువుకూ రూ. 2,000 జరిమానాగా విధిస్తున్నారని ఆయన తెలిపారు.

అస్సామ్ హస్తకళా విధానం ( 2022 ) అయితే, వెదురును అందచేసే బాధ్యత రాష్ట్ర వెదురు మిషన్, అటవీ శాఖకు చెందిన ఇతర ఏజెన్సీలదీ, పంచాయతీలదేనని స్పష్టంగా నిర్దేశిస్తోంది.

ధరలు పెరిగిపోవటంతో, తన కీలకమైన కొనుగోలుదారులైన వెదురు బుట్టల తయారీదారులను మున్సేర్ అలీ పోగొట్టుకున్నారు. "వాళ్ళు ఒక్కో వెదురు బొంగును రూ. 130-150కి కొనాల్సి ఉంటుంది. వారి ఉత్పత్తిని రూ. 100కు అమ్మేటప్పుడు అంత ఎక్కువ పెట్టి కొనడంలో అర్థం ఏముంది?" అంటారాయన.

*****

విస్తృతమైన ఖసల తయారీ ప్రక్రియ వెదురును సేకరించడంతో మొదలవుతుందని అబ్దుల్ జలీల్ చెప్పారు. “సుమారు 20, 30 సంవత్సరాల క్రితం, వెదురు సేకరించడానికి మేం దరాంగ్‌లోని గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. కానీ ఇక్కడ వెదురు తోటలు తగ్గిపోవడంతో, వ్యాపారులు కర్బీ అంగ్లాంగ్, లఖింపూర్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల నుండి, లేదా అరుణాచల్ ప్రదేశ్, ఇతర కొండ ప్రాంతాల నుండి సరఫరా చేయడం ప్రారంభించారు.

చూడండి: అస్సామ్‌లో కనుమరుగైపోతోన్న వెదురు బుట్టల అల్లికదారులు

నా-మాట్టీ గ్రామంలోని అనేక కుటుంబాలు వెదురు వస్తువులను తయారుచేసేవారు. ఈ వృత్తికళాకారులంతా కాఫీ తోటలలో పనిచేసేందుకు కేరళ, కర్ణాటక వంటి చోట్లకు వెళ్ళిపోవటంతో ఇప్పుడా ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి

వెదురు చెట్టును ఇంటికి తీసుకువచ్చిన తర్వాత, కుటుంబంలోని పురుషులు బుట్టకు అడుగు భాగం అల్లడానికి వెదురు చెట్టు దిగువ భాగం నుండి 3.5 అడుగుల నుండి 4.5 అడుగుల వరకు వివిధ పరిమాణాల బిటీల ను (బద్దెలు) కత్తిరిస్తారు. ఎనిమిది, 12 లేదా 16 అడుగుల పొడవున్న బద్దెలను కలుపుతూ తంతువులను తయారు చేయడానికి వెదురు చెట్టు మధ్య భాగం నుండి కత్తిరిస్తారు. బుట్ట పైభాగాన్ని పూర్తి చేయడానికి అవసరమైన బద్దెలను తయారుచేయడానికి వెదురు చెట్టు ఎగువ భాగాన్ని ఉపయోగిస్తారు.

బుట్ట టోలీ ని (బేస్ లేదా అడుగుభాగాన్ని) చేయడానికి సాపేక్షంగా మందంగా ఉండే బద్దెలను ఉపయోగిస్తారు. “బుట్ట పరిమాణాన్ని టోలీ నిర్దేశిస్తుంది. అడుగు భాగం తయారైన తర్వాత, మహిళలూ పిల్లలూ మధ్య నుండి ఎటుపడితే అటు వంగే సన్నని బద్దెలను మెలితిప్పుతూ బుట్ట పై భాగాన్ని అల్లుతారు. ఈ బద్దెలను పెస్నీ బెటీ అంటారు,” అని జలీల్ వివరించారు.

"అల్లిక ప్రక్రియ చివరిలో, బుట్ట పైభాగాన గట్టి బలమైన బద్దెలతో రెండు మూడు చుట్లు అల్లుతారు. దీన్ని మేం పెస్నీ అంటాం. బుట్టను పూర్తి చేయడానికి, అడుగు భాగం నుండి మిగిలిన బద్దెల చివరలను విరిచి, అల్లిన వెదురు వరుసలలోకి చొప్పిస్తారు. మేం ఈ ప్రక్రియను మురి భంగా అని పిలుస్తాం,” అని ఆయన చెప్పారు.

ఈ ప్రక్రియ మొత్తాన్ని చేతులతోనే చేస్తామని ముర్షిదా చెప్పారు. "వెదురును కావలిసిన పరిమాణంలో నరికేందుకు మేం ఒక కోతరంపాన్ని ఉపయోగిస్తాం. వెదురు కొమ్మలను చెక్కేసేందుకు ఒక కురైల్ (గొడ్డలి) గానీ, దావ్ (పెద్ద కత్తి) గానీ వాడతాం. వెదురు దారాల కోసం చాలా పదునైన కత్తులను వాడతాం. బుట్టల పై అంచులను కలిపివుంచేందుకు, మేం మిగిలిపోయిన టొలీర్ బెతీ చివరలను పెస్నీ బెతీ లోపలికి చొప్పించటానికి బటాలి (ఉలి) వంటి సాధనాన్ని వాడతాం."

ఒక్కో బుట్టను అల్లటానికి, మురి భంగా, టొలీ భంగా లను అల్లే సమయాన్ని మినహాయిస్తే, 20 నుంచి 25 నిముషాల సమయం పడుతుంది. వారపు సంతకు ముందు రోజున, సాధ్యమైనన్ని ఎక్కువ బుట్టలు అల్లడానికి మహిళలు రాత్రంతా పనిచేస్తారు. ఈ శ్రమ వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావాన్ని వేస్తుంది.

"మాకు వెన్ను నొప్పి వస్తుంది, చేతులు కాయలు కాస్తాయి, ఒకోసారి సూదిగా ఉన్న వెదురు మొనలు చేతులకు గుచ్చుకుంటాయి," అంటారు ముర్షిదా. "కొన్నిసార్లు సూదుల్లాగా ఉండే వెదురు ముక్కలు మా చర్మంలోకి గుచ్చుకుపోయి తీవ్రమైన నొప్పి కలుగుతుంది. వారపు సంతలకు ముందు రోజు మేం రాత్రి బాగా పొద్దుపోయేవరకూ బుట్టలు అల్లుతూనే ఉంటాం. కానీ ఆ మరుసటి రోజు నొప్పుల వల్ల నిద్రపోలేం."

ఈ కథనానికి మృణాళినీ ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు ఉంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Mahibul Hoque

Mahibul Hoque is a multimedia journalist and researcher based in Assam. He is a PARI-MMF fellow for 2023.

Other stories by Mahibul Hoque
Editor : Shaoni Sarkar

Shaoni Sarkar is a freelance journalist based in Kolkata.

Other stories by Shaoni Sarkar
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli