అస్సామీ పండుగ రోఁగాలీ బిహుకు ముందు రోజుల్లో, మగ్గం కొయ్య చట్రాలను తాకుతోన్న తొక్కుడు మీటలు (treadles), నాడెల (shuttles) కటకట చప్పుడు ఈ పరిసరాల్లో వినబడుతుంటుంది.

నిశ్శబ్దంగా ఉన్న భెల్లాపర పరిసర ప్రాంతంలో, పట్నే దేవురీ తన చేనేత మగ్గంపై పనిలో తీరికలేకుండా ఉన్నారు. ఆమె బజ్‌రాజ్‌హర్‌ గ్రామంలోని తన ఇంట్లో ఎండి గామూసాలు నేస్తున్నారు. ఏప్రిల్ నెలలో జరుపుకునే అస్సామీ కొత్త సంవత్సరం, పంటల పండుగల సమయానికి అవి సిద్ధంగా ఉండాలి.

కానీ ఇవేవో మామూలు గామూసాలు కావు. 58 ఏళ్ళ ఈమె చాలా కష్టమైన పూల ఆకృతులను నేయటంలో ప్రసిద్ధి చెందారు. "బిహు కంటే ముందే 30 గామూసాలు పూర్తిచేయడానికి నా దగ్గర ఆర్డర్లు ఉన్నాయి. ఎందుకంటే జనం వాటిని తమ అతిథులకు కానుకగా ఇస్తారు," అన్నారామె. గామూసాలు - సుమారుగా ఒక మీటరున్నర పొడవుండేలా నేసిన వస్త్రాలు - అస్సామీ సంస్కృతిలో గొప్ప ప్రాముఖ్యాన్ని కలిగివున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో స్థానికుల నుండి వాటికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది, వాటి ఎర్రని దారాలు పండుగ శోభనిస్తాయి.

"వస్త్రం మీద పూలను నేయటమంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఒక పువ్వును చూసిన వెంటనే, నేను నేసే బట్టల మీద ఆ పువ్వు ఆకృతిని అచ్చుగుద్దినట్టు అలాగే నేయగలను. దాన్ని ఒక్కసారి అలా చూస్తే చాలు," సగర్వంగా నవ్వుతూ అన్నారు దేవురీ. అస్సామ్‌లో దేవురీ సముదాయం షెడ్యూల్డ్ తెగగా జాబితా అయివుంది.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

మగ్గంపై పనిచేస్తోన్న అస్సామ్‌లోని బజ్‌రాజ్‌హర్ గ్రామానికి చెందిన పట్నే దేవురీ. ఆమె ఈ మధ్యనే నేయటం పూర్తి చేసిన ఎరీ సాదర్ (కుడి)

అస్సామ్‌లోని మాజ్‌బాట్ సబ్-డివిజన్‌లో ఉన్న ఈ గ్రామానికి చెందిన నేతకారులు, రాష్ట్రం మొత్తమ్మీద ఉన్న 12.69 లక్షల చేనేత కుటుంబాలకు చెందిన 12 లక్షల మంది నేత కార్మికులలో భాగంగా ఉన్నారు - ఇది దేశంలోని ఏ రాష్ట్రం కంటే కూడా అత్యధికం . చేనేత ఉత్పత్తులను, ప్రత్యేకించి నాలుగు రకాలైన పట్టు - ఎరీ, మూగా, మల్బరీ, టస్సర్‌లను ఉత్పత్తి చేసే దేశంలోని అగ్ర రాష్ట్రాలలో అస్సామ్ కూడా ఉంది.

దేవురీ స్థానిక బోడో భాషలో ' ఎండి ' అని కూడా పిలిచే ఎరీ (నూలు, పట్టు)ని ఉపయోగిస్తారు. “నేను చిన్నతనంలో మా అమ్మ దగ్గర ఈ నేతను నేర్చుకున్నాను. సొంతంగా మగ్గాన్ని ఉపయోగించడం నేర్చుకున్నాక, నేనింక నేతపని మొదలుపెట్టాను. అప్పటి నుండి నేను ఈ పని చేస్తూనేవున్నాను,” అని ఈ నిపుణురాలైన నేతరి చెప్పారు. ఆమె గామూసాలు , ఫూలం గామూసాలు (రెండు వైపులా పూల డిజైన్లతో ఉండే అస్సామీ తువ్వాళ్ళు), మెఖెలా-సాదర్ (మహిళల సంప్రదాయ అస్సామీ దుస్తులు) ఎండి సాదర్ (పెద్ద శాలువా)లను నేయగలరు.

అమ్మకాలలో సహాయకారిగా ఉండేందుకు 1996లో ఆమె ఒక స్వయం సహాయక బృందాన్ని (ఎస్ఎచ్‌జి) ఏర్పాటుచేశారు. "మేం భెల్లపర ఖుద్రసంచయ్ (చిన్నమొత్తాల పొదుపు)ని స్థాపించిన తర్వాత, నేను నేసినవాటిని అమ్మడం మొదలుపెట్టాను," తన వ్యవస్థాపకతను గురించి గర్వపడుతూ చెప్పారామె.

కానీ నూలును సేకరించడమనేది మెరుగైన ఆదాయానికి నిజమైన అడ్డంకిగా దేవురీ వంటి నేతకారులు భావిస్తారు. నూలు కొనడానికి తన స్తోమతకు మించిన పెట్టుబడి అవసరమని ఆమె చెప్పారు. దాంతో ఆమె దుకాణదారులు లేదా విక్రేతల నుండి నూలును తీసుకుని, వారు చెప్పినవాటిని నేసేలాగా కమీషన్‌పై పని చేయడానికి ఇష్టపడతారు. “ గామూసాలు నేయడానికి నేను పడుగు పేకల కోసం కనీసం మూడు కిలోల నూలు కొనవలసి ఉంటుంది. కిలో ఎండి ఖరీదు రూ. 700. ఆ విధంగా నేను 2,100 ఖర్చు చేయలేను." వ్యాపారులు ఆమెకు 10 గామూసాలు , లేదా మూడు చీరలకు కలిపి నూలును ఇస్తారు. "నేనిప్పుడు వాటిపై పని చేస్తున్నాను, వీలైనంత త్వరగా పని పూర్తిచేస్తాను," అన్నారామె.

దేవురీ పొరుగువారైన మాధబి చహారియా మాట్లాడుతూ, నూలును నిల్వ చేసుకోలేనందున తన పని కూడా మందగిస్తుందని చెప్పారు. ఆమె కూడా తాను నేసే గామూసాల కోసం నూలును కొనడానికి ఇతరులపై ఆధారపడతారు. "నా భర్త దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నిసార్లు అతనికి పని దొరుకుతుంది, కొన్నిసార్లు దొరకదు. అటువంటి పరిస్థితుల్లో, నేను నూలును కొనలేను,” అని ఆమె PARIకి చెప్పారు.

తన సంప్రదాయక చేనేత మగ్గం గురించి మాట్లాడుతోన్న పట్నే దేవురీని చూడండి

అస్సామ్‌లో 12.69 లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయి, చేనేత ఉత్పత్తుల ఉత్పత్తిలో దేశంలోని అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా ఉంది

మాధబి, దేవురీల పరిస్థితి అసాధారణమేమీ కాదు; రాష్ట్రంలోని ఇంటినుండి పనిచేసే నేతకారులంతా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని దిబ్రూగఢ్ విశ్వవిద్యాలయం 2020 నాటి నివేదిక చెప్తోంది. వడ్డీలేని ఋణాల కోసం, మెరుగైన ఋణ సౌకర్యాల కోసం ఈ విశ్వవిద్యాలయం పనిచేస్తోంది. మహిళా నేతకారులలో బలమైన కార్మిక సంస్థలు లేకపోవటం ప్రభుత్వ పథకాలను, ఆరోగ్య భీమా, ఋణాలు, మార్కెట్ సంబంధాలను వారికి దూరంచేస్తోందని కూడా ఆ నివేదిక చెప్తోంది.

"నేను మూడు రోజుల్లో ఒక సాదర్‌ ను పూర్తిచేయగలను," చెప్పారు దేవురీ. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే గామూసా నేయడానికి ఒక పూర్తి రోజు పడుతుంది. నేసిన ప్రతి వస్త్రానికీ దేవురీకి రూ. 400 చెల్లిస్తారు. ఒక అస్సామీ మెఖెలా సాదర్ మార్కెట్ విలువ రూ. 5,000 నుంచి కొన్ని లక్షల వరకూ ఉంటుంది. కానీ దేవురీ వంటి నేతకారులు నెలకు రూ. 6,000 నుండి రూ. 8,000 వరకూ మాత్రమే సంపాదిస్తారు.

నేతపని ద్వారా వచ్చే ఆమె సంపాదన ఏడుగురున్న వారి కుటుంబం - ఆమె భర్త నబీన్ దేవురీ (66), ఇద్దరు పిల్లలు రజని (34), రూమీ (26), చనిపోయిన ఆమె పెద్దకొడుకు కుటుంబం - జీవనానికి చాలదు. అందువలన ఆమె స్థానిక ప్రాథమిక పాఠశాలలో వంటపని కూడా చేస్తారు.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

తాను నేసే సంప్రదాయ మగ్గంలోకి వెళ్ళే ఎరీ దారాలను బాబిన్‌లలోకి చుడుతోన్న పట్నే దేవురీ

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

పట్నే దేవురీ నైపుణ్యం బజ్‌రాజ్‌హర్ గ్రామంలోని ఇతర నేతకారులకు ఒక స్ఫూర్తి. పురుషుల కోసం ఎరీ తువాళ్ళను నేస్తోన్న మాధబి చహారియాను గమనిస్తోన్న దేవురీ

అస్సామ్‌లో దాదాపు మొత్తం [11.79 లక్షలు] నేతకారులంతా మహిళలే అనీ, వారు ఇంటిపనీ నేతపనినీ నిర్వహించటంతో పాటు దేవురీ వంటి కొంతమంది వేరే ఇతర ఉద్యోగాలు కూడా చేస్తారని, నాలుగవ అఖిల భారత చేనేత గణన (2019-2020) చెబుతోంది.

రోజులో పూర్తి చేయాల్సిన అనేక పనులతో దేవురీ రోజు త్వరగా, తెల్లవారుజామున 4 గంటలకు, ప్రారంభమవుతుంది. ఆమె మగ్గం ముందున్న బల్లపై కూర్చుంటారు. మగ్గం కాళ్ళు తుప్పుపట్టడంతో అది కదలకుండా ఉండేందుకు ఇటుకలపై ఉంచారు. “ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు పని చేసిన తర్వాత, నేను [వంట చేయడానికి] బడికి వెళ్తాను. మధ్యాహ్నం 2-3 గంటలకు తిరిగి వచ్చి, విశ్రాంతి తీసుకుంటాను. సాయంత్రం 4 గంటలకు మళ్ళీ పనిచేయటం ప్రారంభించి రాత్రి 10-11 గంటల వరకు కొనసాగిస్తాను," అని ఆమె చెప్పారు.

కానీ అది ఒక్క నేయడం మాత్రమే కాదు, దేవురీ అత్యంత శారీరక శ్రమతో కూడుకున్న నూలును సిద్ధం చేసేపని కూడా చేయాలి. “నూలును నానబెట్టి, గంజిలో ముంచి, ఎండి ని బలంగా ఉంచేందుకు దానిని ఆరబెట్టాలి. దారాలను పరచడానికి నేను రెండు చివర్లలో రెండు వెదురు బొంగులను ఉంచుతాను. దారం సిద్ధమైన తర్వాత, నేను వాటిని రా [పడుగు దండె]కు చుట్టేస్తాను. అప్పుడు పడుగు దండెను మగ్గం చివరి వరకు నెట్టాలి. ఆపైన చేతులను, కాళ్ళను కదిలిస్తూ నేతపని చేయాలి,” అని ఆమె వివరించారు.

దేవురీ ఉపయోగించే మగ్గాలు రెండూ సంప్రదాయకమైనవే. మూడు దశాబ్దాల క్రితం వాటిని కొన్నట్టు ఆమె చెప్పారు. ఆ మగ్గాలకు ఉన్న కొయ్య చట్రాలను రెండు పోకచెట్టు దుంగలపై నిలిపివుంచారు. పెడళ్ళు వెదురుతో చేసినవి. క్లిష్టమైన డిజైన్ల కోసం, సంప్రదాయ మగ్గాలను ఉపయోగించే వృద్ధ నేతకారులు కొబ్బరాకు మధ్యభాగంతో పాటు సన్నని వెదురు చీలికలను ఉపయోగిస్తారు. ఏదైనా డిజైన్ నేయాలంటే ఎంచుకున్న పొడవు దారాల నుంచి కొన్ని దారాలను చేతులతో తీసుకుంటారు. వస్త్రంలో నేసే రంగు దారాల కోసం, వారు తొక్కుడు మీటను నెట్టిన తర్వాత ప్రతిసారీ నిలువు దారాల గుండా సెరీ (సన్నని వెదురు ముక్క)ని పోనివ్వాలి. ఇది సమయం తీసుకునే ప్రక్రియ కావటంతో వారి పని నెమ్మదిగా సాగుతుంది.

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

సెరీ అనేవి దారాలను దిగువకూ, ఎగువకూ భాగాలుగా విభజించడానికి ఉపయోగించే సన్నని వెదురు బద్దలు. ఇది కదురును దారాల గుండా పోనిచ్చి డిజైన్లను రూపొందించడానికి ఉపయోగిస్తుంది. నూలులో రంగురంగుల దారాలను నేయడం కోసం, పట్నే దేవురీ సెరీని ఉపయోగించి విభజించిన విభాగాల ద్వారా రంగుల దారాలున్న కదురును తీసుకువెళ్తారు

PHOTO • Mahibul Hoque
PHOTO • Mahibul Hoque

ఎరీ సాదర్ (చుట్టుకునే ఎరీ వస్త్రం)ను నేస్తోన్న పట్నే దేవురీ (ఎడమ). ఆమె సాదర్ పైన నేసే క్లిష్టమైన ఆకృతులు స్థానికులలో చాలా ప్రాచుర్యం పొందాయి. తరు బారువా (కుడి) గత మూడేళ్ళుగా నేయటాన్ని దాదాపుగా మానేసినప్పటికీ, ఆమె ఇంట్లో ఇంకా అమ్ముడుపోని కొన్ని గామూసాలు ఉన్నాయి

మగ్గాలను మరింత అభివృద్ధి చేయాలనీ, మరింత సులభంగా నూలు అందుబాటులో ఉండేలా చేయాలని 2017-2018 నాటి అస్సామ్ ప్రభుత్వ చేనేత విధానం గుర్తించినప్పటికీ, ముందుకు పోయేందుకు తనకు ఆర్థిక ఆలంబన లేదని దేవురీ చెప్పారు. "చేనేత విభాగంతో నాకు సంబంధాలు లేవు. ఈ మగ్గాలు పాతవైపోయినప్పటికీ, ఆ విభాగం నుంచి నేనెటువంటి ప్రయోజనాలను అందుకోలేదు."

నేతపనిని జీవనోపాధిగా తీసుకోవటంలో విఫలమైన ఉదాల్‌గురి జిల్లా హాతీగఢ్ గ్రామానికి చెందిన తరు బారువా తన వృత్తిని వదిలేశారు. "నేయటంలో నేను చాలా ముందుండేదాన్ని. మెఖెలా సాదర్ , గామూసాల కోసం జనం నా దగ్గరకు వస్తుండేవారు. కానీ మర మగ్గాలతో పోటీ వలన, ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు చవకగా దొరుకుతుండటం వలన, నేనింక నేతపనిని మానేశాను," తన వదిలేసిన ఎరీ తోట పక్కనే నిలబడివున్న 51 ఏళ్ళ తరు బారువా చెప్పారు. ఇప్పుడా తోటలో పట్టుపురుగులు లేవు.

“ఇకపై చేనేత దుస్తులను ధరించే వ్యక్తులను నేను చూడలేను. ప్రజలు ఎక్కువగా మరమగ్గాలపై తయారైన చౌకగా దొరికే దుస్తులను ధరిస్తున్నారు. కానీ నేను ఇంట్లో నేసిన సహజమైన చేనేత బట్టలను మాత్రమే ధరిస్తాను, నేను జీవించి ఉన్నంత వరకు నేతపనిని కొనసాగిస్తాను,” అని అస్సామీ తువాళ్ళపై పూలను డిజైన్ చేయడంకోసం మాకు (నాడె)ను కదిలించటం కోసం పెడల్‌ను నెడుతూ చెప్పారు దేవురీ.

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (MMF) నుండి ఒక ఫెలోషిప్ మద్దతు ఉంది.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Mahibul Hoque

Mahibul Hoque is a multimedia journalist and researcher based in Assam. He is a PARI-MMF fellow for 2023.

Other stories by Mahibul Hoque
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli