"మీ నంబరు గాంధీ డైరీలో దొరికింది. ఆయన హైవే మీద కారు ఢీకొని చనిపోయారు," రాజకీయ కార్యకర్త, రేషన్ షాపు యజమాని  బి. కృష్ణయ్య ఆదివారం, డిసెంబర్ 9వ తేదీ రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఫోన్ చేసి నాతో చెప్పారు.

నవంబరు 24వ తేదీన చివరిసారిగా నేను గంగప్ప లేక 'గాంధీ'ని బెంగళూరు-హైదరాబాదు హైవేపై నడుస్తూ వెళ్తుండగా కలిశాను. అది సుమారుగా ఉదయం 10:30 ప్రాంతం. అతను గాంధీ వేషంలో తన దినచర్య మొదలుపెట్టటానికి అనంతపూర్ పట్టణానికి వెళ్తున్నారు.  అనంతపురం నుంచి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలోని రాప్తాడు గ్రామంలో గల రోడ్డు ప్రక్క భోజనశాలలో అతడు నివసించేవాడు. “సుమారుగా రెండు నెలల  క్రితం ఒక ముసలతనికి ఉండటానికి ఏదైనా చోటు కావాలని ఎవరో చెబితే నేను అతనిని ఇక్కడ ఉండనిచ్చాను. అప్పుడప్పుడు భోజనం కూడా పెట్టేవాడిని," భోజనశాల యజమాని  వెంకటరామిరెడ్డి తెలిపారు. నాకు ఫోన్ చేసిన కృష్ణయ్య తరచుగా ఇక్కడ టీ తాగేవారు,  అప్పుడప్పుడు గంగప్పతో మాట్లాడుతుండేవారు.

మే, 2017లో నేను PARI కొరకు గంగప్ప గురించి ఒక కథనాన్ని రాశాను. అతనికి అప్పుడు 83 సంవత్సరాలు. 70 ఏళ్ళు వ్యవసాయ కూలీగా పనిచేసిన గంగప్ప ఆ తరువాత మహాత్మునిలా రూపాంతరం చెందారు. గాంధీ వేషధారణలో పశ్చిమ ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురం పట్టణంలో బహిరంగ ప్రదేశాలలో నిలబడి యాచించేవారు. వ్యవసాయ కూలీగా కంటే ఈ విధంగా భిక్షాటన చేయటం వలన అతను ఎక్కువ ఆర్జించేవారు.

2016లో గంగప్ప పొలాల్లో కూలీ పని చేస్తూ స్పృహ కోల్పోయినప్పటి నుంచి ఆ పనిని చాలించారు. తరువాత తాళ్లు అల్లే పని చేసినా వృద్ధాప్యం వలన వచ్చే ఇబ్బందుల వల్ల అంతగా సంపాదించలేకపోయారు. అప్పుడే అతడు గాంధీలా వేషం దాల్చాలనుకున్నారు.

మామూలుగా దొరికే సామాగ్రితోనే సొంతంగా తానే మేకప్ వేసుకునేవారు. పది రూపాయల పాండ్స్ పౌడర్ డబ్బాతో తనను తాను మహాత్మునిలా ‘మెరిసేటట్లు’ చేసుకునేవారు. రోడ్డు ప్రక్క దొరికే చవకబారు కళ్లద్దాలు అతనికి గాంధీగారి కళ్ళజోడు అయింది. స్థానిక మార్కెట్లో దొరికే పది రూపాయల పేము కర్ర అతని చేతి కర్ర అయింది. ఎక్కడో దొరికిన ఒక మోటార్ బైక్ రియర్ వ్యూ అద్దాన్ని అతను మేకప్, వస్త్రాలు సరిచూసుకోవడానికి వాడేవారు .

M. Anjanamma and family
PHOTO • Rahul M.

ఎడమ:  2017 లో నేను అతన్ని కలిసినప్పుడు పౌడరు రాసుకుని ‘గాంధీ’లా సిద్దమవుతున్న గంగప్ప. కుడి:  తన ఊరిలో అతని భార్య అంజనమ్మ (ఎడమ నుంచి మూడవ వ్యక్తి)

ఇలా 2016 ఆగస్టు నుండి ప్రతిరోజు గంగప్ప గాంధీలా రూపాంతరం చెంది అనంతపురం వీధులలో నిలబడేవారు, లేదా చుట్టుప్రక్కల ఊళ్ళలో జరిగే తిరునాళ్లకు , సంతలకు నడుచుకుంటూ వెళ్లేవారు. అక్కడ రోజుకు రూ. 150 నుండి 600 దాకా సంపాదించేవారు. "ఈమధ్య నేను ఒక్కరోజులోనే పరస (గ్రామంలో జరిగే పశువుల సంత)లో రూ. 1000 సంపాదించాను," అతను గొప్పగా నాతో చెప్పుకున్నారు.

గాంధీ లాంటి బక్క పలుచటి వ్యక్తి ఒక మహా సామ్రాజ్యాన్నిగడగడలాడించి కూలదోయడం  అనే విషయం చిన్నతనం నుండే తనలో స్ఫూర్తిని నింపిందని గంగప్ప చెప్పారు. నిరంతర పర్యటన, ఓర్పు గాంధీ అవ్వటానికి ముఖ్య లక్షణాలని అతను నమ్మారు. నిరంతరం ప్రయాణిస్తూ ఉండటం,  కొత్త వ్యక్తులను కలుసుకోవడం వలన తనను జీవితాంతం వెంటాడిన దళిత (మాదిగ) కులానికి చెందిన వాడిననే వాస్తవాన్ని గంగప్ప తప్పించుకోజూశారు.

గంగప్పను నేను మొదటిసారి కలిసినప్పుడు అతడు రాత్రిపూట అనంతపురంలోని ఒక గుడిలో నిద్రించేవారు . అందుమూలాన తన కులం గురించి నా కథనంలో ప్రస్తావించవద్దని, తాను దళిత జాతికి చెందిన వాడినని ఎవరితోనూ చెప్పలేదని ఆయన తెలిపారు. తాను గాంధీ వేషం కట్టినప్పుడు కూడా మతపరమైన చిహ్నాలు - జంధ్యం , కుంకుమ బొట్టు లాంటివి ‘పురోహితుని’లా కనపడేందుకు వాడేవారు.

వేషధారణ ఏమైనప్పటికీ గంగప్ప కులం, పేదరికం అతనిని వెంటాడుతూనే ఉన్నాయి. అతని నుండి విడిపోయిన అతడి భార్య అంజనమ్మను నేను 2017లో ఆమె గ్రామంలో కలసి ఆమెనూ, ఆమె కుటుంబ సభ్యులనూ ఒక ఫోటో తీసినప్పుడు, వారి ఇంటి వద్ద ఆడుకునే పిల్లలలో ఒక కుర్రాడు 'దళితుల'తో పాటు ఫోటో తీయించుకోవటానికి ఇష్టపడలేదు.

ఆదివారం కృష్ణయ్య ఫోన్ చేసినప్పుడు నా కథనం కోసం నోట్ బుక్ లో రాసుకున్న వివరాలు, గంగప్ప కుటుంబాన్ని తీసిన ఫోటో అతనికి పంపించాను. అంజనమ్మ ఖచ్చితమైన చిరునామా నేను ఇవ్వలేని కారణంగా కృష్ణయ్య గంగప్ప ఊర్లోని ఇంటిని అతని కులం ఆధారంగా గుర్తుపట్టవచ్చని సూచించారు. (గ్రామాలలో కులం ఆధారంగా హద్దులు పెట్టి ఉండే ప్రాంతాలను ఉద్దేశించి), 'గోరంట్లలో కులం ఆధారంగా అతని ఇంటిని కనుక్కోవచ్చేమో. మీకు ఎప్పుడైనా అతడిది ఏ కులమో చెప్పాడా?" అని అడిగారు.

కృష్ణయ్య బంధువు ఒకతనికి అనంతపురం నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని గోరంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలుసును. అంజనమ్మ అక్కడ తన చిన్న కుమార్తెతో కలిసి ఉంటున్నారు. వారి మరొక కుమార్తె (ఇద్దరిలో పెద్దది) పది సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. గోరంట్లలోని ఓ కానిస్టేబుల్ అంజనమ్మకు ఆమె భర్త మరణ వార్తను తెలియపరిచాడు. డిసెంబర్ 10వ తారీఖు సోమవారం మధ్యాహ్నం ఆమె గంగప్ప మృతదేహాన్ని తనతో తీసు కువెళ్ళారు.

బలహీనుడైన ఆ  వృద్ధుడిని ఢీకొన్న కారును ఎవరూ గుర్తుపట్టలేదు.

అనువాదం: నీరజ పార్థసారథి

Rahul M.

Rahul M. is an independent journalist based in Andhra Pradesh, and a 2017 PARI Fellow.

Other stories by Rahul M.
Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Neeraja Parthasarathy

Neeraja Parthasarathy is a teacher, translator and eclectic reader in both English and Telugu.

Other stories by Neeraja Parthasarathy