నేను అలంకారాలను రూపొందించడానికి షోలాపీఠ్ ( ఎస్కినామెనీ యాస్పైరా ఎల్ )ను ఉపయోగిస్తాను. ఇది వివిధ ఆకారాలుగా, ఆకృతులుగా కత్తిరించేందుకు వీలైన పదార్థం, తేలికైనది కూడా. మేం ఒడిశాలో దీనిని షోలాపీఠ్ కామ ( షోలాపీఠ్ పని) అని పిలుస్తాం.

నేను కంఠహారాలు (నెక్లెస్‌లు), దసరా కోసం బుటేదారి పని (ఎంబ్రాయిడరీ), పువ్వులు, ఇంకా ఇతర ప్రదర్శన వస్తువులను తయారు చేయగలను. అయితే ఒడిస్సీ నృత్య కళాకారిణులు వేదికపై ప్రదర్శన ఇచ్చేటప్పుడు ధరించే శిరోభూషణమైన టాహిఁయా తయారీదారుగా నాకు బాగా పేరొచ్చింది.

ప్లాస్టిక్ టాహిఁయాలు కూడా అందుబాటులో ఉంటాయి, కానీ అవి నర్తకి నెత్తిమీది చర్మానికి చికాకు కలిగిస్తాయి. అంచేత వారు వాటిని ఎక్కువసేపు ధరించడం కష్టమవుతుంది. అలాగే, ప్లాస్టిక్‌ను వివిధ ఆకృతులలో మలచడం కూడా సాధ్యం కాదు

టాహిఁయా తయారుచేసే నైపుణ్యం కలిగిన ఇతర కళాకారులు దీనిని తయారుచేయడం మానేశారు, కానీ నేను చేసే పనంటే నాకు చాలా ఇష్టం.

Left: Upendra working on a lioness carved from sholapith
PHOTO • Prakriti Panda
Equipment and tools used for making tahias
PHOTO • Prakriti Panda

ఎడమ: షోలాపీఠ్‌నుంచి మలచిన ఆడసింహపు బొమ్మపై పనిచేస్తోన్న ఉపేంద్ర. కుడి: టాహిఁయాలను తయారుచేసే పరికరాలు, సాధనాలు

Left: Rolled shola is uniformly cut to make flowers.
PHOTO • Prakriti Panda
Thin shola strips are used to make flowers
PHOTO • Prakriti Panda

ఎడమ: పూలు చేయడం కోసం చుట్టచుట్టిన షోలాను  అన్నివైపులా సమానంగా ఉండేలా కత్తిరిస్తారు. కుడి: పువ్వులను తయారుచేయడానికి సన్నని షోలా పీలికలను ఉపయోగిస్తారు

ప్రసిద్ధి చెందిన గొప్ప ఒడిస్సీ నృత్య కళాకారుడైన కేలూచరణ్ మహాపాత్ర స్నేహితుడైన కాశీ మహాపాత్ర, శాస్త్రీయ నృత్యకారిణులు తమ జుట్టులో ధరించే పువ్వుల స్థానంలో షోలాపీఠ్‌తో టాహిఁయాలను తయారుచేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. నేను ఆ ఆకృతుల మీద పనిచేశాను.

షోలాపీఠ్ కాకుండా, టాహిఁయా తయారుచేయడానికి మీకు బక్రమ్ (గట్టిగా ఉండే నూలుగుడ్డ) గుడ్డ, గేజ్ వైర్, ఫెవికాల్ జిగురు, నల్ల దారం, చునా (సున్నపురాయి), నల్ల కాగితం, ఆకుపచ్చ కాగితం అవసరం. టాహిఁయాను తయారుచేసే మొత్తం ప్రక్రియను ఒకే వ్యక్తి చేసేట్టయితే, అతను ఒక్క రోజులో రెండు కంటే ఎక్కువ టాహిఁయాలను పూర్తి చేయలేడు. కానీ మాకు టాహిఁయాలోని వివిధ భాగాలను తయారుచేసే వ్యక్తులు చాలామంది - కొన్నిసార్లు ఆరు నుండి ఏడు మంది వరకు కూడా – ఉన్నారు.

నాగ్‌కేసర్ (నాగకేసరాలు), సెబాతి (చామంతివంటి పువ్వు) టాహిఁయాల తయారీలో ఉపయోగించే రెండు ముఖ్యమైన పువ్వులు. ఇతర పూలతో పోల్చితే, సెబాతి పువ్వులు దాదాపు ఎనిమిది రోజుల పాటు తాజాగా ఉంటాయి, నాగ్‌కేసర్ పువ్వులు గరిష్టంగా 15 రోజులు ఉంటాయి - అందుకే ఈ పువ్వులను టాహిఁయాలను చేయడానికి మొదట్లో ఉపయోగించేవారు.

Upendra using sholapith flower buds to create the spokes for the crown worn by a Odissi dancer
PHOTO • Prakriti Panda
The second strip of sholapith being added to the crown
PHOTO • Prakriti Panda

ఎడమ: ఒడిస్సీ నర్తకి ధరించే కిరీటం కోసం షోలాపీఠ్‌తో తయారుచేసిన పూలమొగ్గలను ఉపయోగిస్తున్న ఉపేంద్ర . కుడి: కిరీటానికి జోడించిన షోలాపీఠ్‌తో చేసిన రెండవ వరుస అలంకారం

Zari wrapped around sholapith to make a pattern
PHOTO • Prakriti Panda
Zari wrapped around sholapith to make a pattern
PHOTO • Prakriti Panda

ఒక ఆకృతిని రూపొందించడం కోసం షోలాపీఠ్ చుట్టూ జరీని చుట్టారు

టాహిఁయా కిరీటం విభాగంలో విసనకర్రలా విస్తరించి ఉండేలా కనిపించేందుకు పూల మొగ్గలను ముఖ్యంగా మల్లె మొగ్గలను ఉపయోగిస్తారు. మొగ్గలు వికసించే ముందు తెల్లగా ఉంటాయి కాబట్టి టాహిఁయాను చేసేటప్పుడు దానిని తెల్లగా ఉండేలా చూస్తారు.

ఒక ఆకృతిని రూపొందించడానికి కొన్ని మొగ్గల మొనల పైభాగంలో నొక్కుతారు. ఈ సున్నితమైన పనిని సాధారణంగా మహిళలే చేస్తారు

పూరీలో జగన్నాథుడిని పూజించే ఉద్దేశ్యంతో ఈ షోలాపీఠ్ కళ ప్రారంభమైనట్లు చెబుతారు. ఇప్పుడు దీనిని స్థానిక కళాకృతులను ప్రదర్శించాలనుకునే హోటల్‌లు, ఈవెంట్‌లలో కూడా ఉపయోగిస్తున్నారు

మేం పని ప్రారంభించేందుకు నిర్దిష్టమైన సమయం గానీ షిఫ్ట్‌లు గానీ లేవు; మేం ఉదయం ఆరు గంటలకు, ఏడు గంటలకు లేదా నాలుగు గంటలకు కూడా లేచి, ఆ రోజంతా, మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంట వరకూ లేదా రెండు గంటల వరకూ పనిని కొనసాగిస్తూపోవచ్చు. ఒక కార్మికుడు ఒక్క టాహిఁయాను చేసినందుకు రూ.1,500 నుండి రూ. 2,000 వరకూ సంపాదించవచ్చు.

Shola flowers of six different varieties
PHOTO • Prakriti Panda
Upendra showing a peacock made from sholapith , usually used for decoration in Puri hotels
PHOTO • Prakriti Panda

ఎడమ : ఆరు రకాల షోలా పువ్వులు . కుడి : సాధారణంగా పూరీ హోటళ్ళలో అలంకరణ కోసం ఉపయోగించే షోలాపీఠ్ తో చేసిన నెమలిని చూపుతున్న ఉపేంద్ర

ఒడిశాలోని సంబల్‌పూర్‌లో శరత్‌ మొహంతి దగ్గర శిక్షణ పొందుతున్నప్పుడు 1996లో నేను అవార్డు అందుకున్నాను.

“కళాకార్‌ జమా కాహారి సంపత్తి నుహె. కళా హి ఎపరి సంపత్తి, నిజె నిజ కథా కుహె.” [కళాకారులు ఎవరి సొత్తూ కాదు. కళే ఒక సొత్తు. అది తన సంగతి తానే చెప్పుకుంటుంది.]”

“నా సంపద నా 37 ఏళ్ల కళా నైపుణ్యం. నా కుటుంబం ఆకలితో పడకవేయకపోవడానికి అదే కారణం," అని ఉపేంద్ర కుమార్ పురోహిత్ చెప్పారు.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Student Reporter : Anushka Ray

Anushka Ray is an undergraduate student at XIM University, Bhubaneshwar.

Other stories by Anushka Ray
Editors : Aditi Chandrasekhar

Aditi Chandrasekhar is a journalist and former Senior Content Editor at People’s Archive of Rural India. She was a core member of the PARI Education team and worked closely with students to publish their work on PARI.

Other stories by Aditi Chandrasekhar
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli