నవంబర్ 8న, ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటన చేయటానికి వారం రోజుల ముందు, తెలంగాణ, సిద్దిపేట జిల్లాలోని ధర్మారం గ్రామానికి చెందిన 42 ఏళ్ల వర్ద బాలయ్య అనే రైతు, తన పొలంలో ఒక ఎకరాన్ని అమ్మడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. సిద్దిపేట-రామాయంపేటలను కలిపే హైవేను ఆనుకొని ఉంది ఆయన పొలం.

అక్టోబర్‌లో కురిసిన అకాల వర్షాల వల్ల అతను వేసిన మొక్కజొన్న పంట నాశనమైంది. ఇంతలో వడ్డీ వ్యాపారుల నుంచి, ఆంధ్రాబ్యాంకు నుంచి ఆయన తీసుకున్న రూ. 8-10 లక్షల అప్పుపై వడ్డీలు పెరిగిపోయాయి. అప్పు తీర్చలేని పరిస్థితిలో, తన ఋణదాతలను ఎలా ఎదుర్కోవాలో తెలీక, తన నాలుగు ఎకరాల పొలంలో అత్యంత లాభదాయకమైన ఒక ఎకరం భాగాన్ని అమ్ముదామని నిశ్చయించుకొని, కొనుగోలుదారుల కోసం అతను వెతకడం ప్రారంభించారు.

భూమి కొనేందుకు ఎవరో ముందుకు వచ్చారని తన పెద్ద కూతురు శిరీషతో, నోట్ల రద్దుకు ముందు, అతను చెప్పారు.

శిరీష పెళ్ళి కోసం 2012లో తీసుకున్న రూ. 4 లక్షల అప్పుతో బాలయ్య ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. రూ. 2 లక్షలు ఖర్చుచేసి నాలుగు బోరు బావులు తవ్విస్తే, మూడింటిలో నీళ్ళు పడలేదు. ఇవన్నీ అతని పెరిగిపోతున్న అప్పుల భారాన్ని మరింత పెంచాయి.

కొన్ని నెలల క్రితం, బాలయ్య చిన్న కుమార్తె అఖిల (17) ఇంటర్మీడియట్ స్థాయి, లేదా 12వ తరగతికి చేరుకుంది; తన పెద్ద కూతురికి అదే ఈడులో వివాహం జరిపించిన బాలయ్య, అఖిల పెళ్ళి గురించి ఆందోళన పడసాగారు. చేసిన అప్పులన్నీ ఎలాగైనా తీర్చాలనుకున్నారు.

PHOTO • Rahul M.

బాలయ్య చిన్న కూతురు అఖిల, అతని తల్లి విషం కలిపిన కూర తినకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు

బాలయ్య అమ్మాలనుకున్న భూమి హైవే పక్కనే ఉందని, ఒక ఎకరానికి దాదాపు రూ. 15 లక్షలు సులువుగా వచ్చేదని ధర్మారం ప్రజలు చెబుతున్నారు. ఆ డబ్బు అనేక సమస్యలను పరిష్కరించి ఉండేది: మొక్కజొన్న పంట కారణంగా అతను చేసిన అప్పులు, వడ్డీల కోసం అతన్ని వేటాడుతున్న వడ్డీ వ్యాపారులు; అఖిల పెళ్ళి గురించిన ఆందోళన!

కానీ ప్రభుత్వం రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేయడంతో, బాలయ్య ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. అతని పొలాన్ని కొంటానన్న వ్యక్తి వెనక్కి తగ్గాడు. “మా నాన్నగారు మొదట్లో బాగానే ఉన్నారు. నోట్ల రద్దు తర్వాతి పరిణామాలను చూసి, తనకు ఎవరూ డబ్బు ఇవ్వరని (పొలం తీసుకుని) ఆయనకు అర్థమైంది. దాంతో ఆయన చాలా బాధపడ్డారు,” అని అఖిల గుర్తుచేసుకుంది.

అయినా బాలయ్య పట్టువదలకుండా పొలం కొనేవాళ్ళ కోసం వెతికారు. కానీ చాలామంది దృష్టిలో, వారు పొదుపు చేసుకున్న డబ్బు రాత్రికి రాత్రే పనికిరాకుండా పోయిందనే అభిప్రాయం పడిపోయింది. ఈ ఊరిలో చాలా మందికి క్రియాశీలమైన బ్యాంక్ ఖాతాలు కూడా లేవు.

నవంబర్ 16 నాటికి, నోట్ల రద్దు ప్రకటించిన వారం తర్వాత, తన భూమిని ఎవరూ కొనలేరని బాలయ్యకు అర్థమైంది. ఆ రోజు ఉదయం తన పొలానికి వెళ్ళి, నాశనమైన మొక్కజొన్న పంట స్థానంలో వేసిన సోయా చిక్కుళ్ళ పంటకు పురుగుమందును పిచికారీ చేశారు. సాయంత్రం తన పొలంలో, మైసమ్మ దేవతకు నైవేద్యంగా కోడిని కోసి, రాత్రి భోజనం కోసం దాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు.

ఇంట్లో పండగల సమయంలోనో, లేదా శిరీష తన అత్తగారింటి నుండి ఇంటికి వచ్చినప్పుడూ మాత్రమే వాళ్ళు కోడిమాంసాన్ని వండుకునేవారు. మాంసాన్ని ఎప్పుడూ బాలయ్య స్వయంగా వండేవారు. గత బుధవారం, బహుశా అతను తన చివరి భోజనం పండగ భోజనంలా ఉండాలనుకున్నట్టున్నారు; తన కష్టాలు తీరుస్తుందనుకున్న ఆస్తిని ఒక పీడకలలా మార్చిన ఆ ఏడు రోజులను మర్చిపోవడానికి చేసుకుంటున్న విందు అది. బాలయ్య కోడికూరలో పురుగుమందు గుళికలను కలిపారు. ఆయనలా కలపడం అతని కుటుంబంలో ఎవరూ గమనించలేదు. “తన కుటుంబాన్ని భారీ (ఆర్థిక) సంక్షోభంలో విడిచివెళ్ళడం అతనికి ఇష్టం లేదు. అందుకే వాళ్ళందరినీ తన వెంట తీసుకెళ్ళాలని అతను నిర్ణయించుకున్నాడు,” అని బాలయ్య బంధువొకరు వివరించారు.

రాత్రి భోజనం చేస్తున్నప్పుడు, తన 19 ఏళ్ళ కుమారుడు ప్రశాంత్‌, కూర నుండి వస్తున్న వింత వాసన గురించి అడిగినప్పుడు తప్ప బాలయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. “నేను పొద్దున్నుండీ సాయంత్రం దాకా పొలంలో పురుగుమందు కొట్టివచ్చాను. ఇది అదే వాసన” – అందరూ చివరిసారిగా కలిసి భోజనం చేస్తున్నప్పుడు, తన తండ్రి అన్న మాటలను అఖిల గుర్తు చేసుకుంది.

ఆ కుటుంబ సభ్యులు ఆరుగురిలో, నలుగురు చికెన్ కూర తిన్నారు – బాలయ్య, అతని భార్య బాలలక్ష్మి, బి.టెక్. చదువుతున్న ప్రశాంత్, బాలయ్య తండ్రి 70 ఏళ్ళ గాలయ్య. అఖిల, ఆమె నానమ్మ మాంసం తినరు కాబట్టి, వారు ఆ ప్రాణాంతకమైన విందు నుండి ప్రాణాలతో బయటపడ్డారు.

PHOTO • Rahul M.

తన భర్త గాలయ్యను, కొడుకు బాలయ్యను కోల్పోయి, దుఃఖంలో ఉన్న తల్లి; ఇరుగు పొరుగువారితో

“రాత్రి భోజనం అయ్యాక, తాతయ్యకి తల తిరుగుతోందని కింద పడుకున్నాడు. అప్పుడు ఆయన నోటి నుండి నురగ వచ్చింది. అది పక్షవాతమేమోనని భయపడి, మేము ఆయన పాదాలనూ, చేతులనూ రుద్దాము,” అని అఖిల గుర్తుచేసుకుంది. కానీ కొద్దిసేపటికే గాలయ్య మృతి చెందారు.

బాలయ్య కూడా వాంతులు చేసుకొని పడిపోవడంతో, అనుమానం వచ్చి, భయపడిపోయిన అఖిల, ప్రశాంత్‌లు వెంటనే ఇరుగుపొరుగువారిని సహాయం కోసం పిలిచారు. కోడి కూరలో పురుగులమందు కలిపిన విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కలవాళ్ళు, బాలయ్య, బాలలక్ష్మి, ప్రశాంత్‌లను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అఖిల తన నానమ్మతో ఇంట్లోనే ఉండిపోయింది – తాతయ్య మృతదేహాన్ని చూసుకుంటూ.

ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో బాలయ్య మృతి చెందారు. అతని భార్య, కుమారుడు వారి గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శిరీష, ఆమె భర్త రమేశ్‌లు ఆ తల్లీ కొడుకుల సంరక్షణ కోసం, బిల్లులు చెల్లించే ప్రయత్నం చేస్తూ ఆ ఆస్పత్రిలో ఉన్నారు. “ప్రశాంత్‌ను ఎమర్జెన్సీ వార్డులో చేర్చడంతో, అతనికి ఆరోగ్యశ్రీ (పథకం) కింద చికిత్స అందుతోంది. మేము పొదుపు చేసిన డబ్బుతో, (మా గ్రామంలో) తెలిసినవాళ్ళ దగ్గర చేసిన అప్పుతో మా అత్తగారికి చికిత్స చేయిస్తున్నాం,” అని రమేశ్‌ తెలిపారు. బాలయ్య మరణానంతరం, ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం ప్రకటించడంతో, ఆస్పత్రి బిల్లులన్నిటినీ అతను భద్రపరిచారు.

ఇంటి దగ్గర, ఇరుగుపొరుగు వారి నుండి అప్పుగా తీసుకున్న డబ్బుతో తన తండ్రి, తాతయ్యల అంత్యక్రియలు నిర్వహించింది అఖిల. జిల్లా అధికారులు రూ. 15,000 ఆర్ధిక సహాయం చేసినట్లు సమాచారం.

ఆమె ముఖం భావరహితంగా ఉంది, కానీ భవిష్యత్తు గురించి దిగులుపడుతోంది: “నాకు చదువంటే చాలా  ఆసక్తి. నాకు గణితం అంటే చాలా ఇష్టం. నేను ఎమ్‌సెట్ (EAMCET - ఇంజనీరింగ్, వైద్య విద్యార్హత పరీక్ష) రాయాలనుకున్నాను. కానీ ఇప్పుడు, నాకు తెలియదు...”

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

Rahul M.

Rahul M. is an independent journalist based in Andhra Pradesh, and a 2017 PARI Fellow.

Other stories by Rahul M.
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi