జీవన్‌భాయ్ బరియాకు నాలుగేళ్ల వ్యవధిలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. 2018లో మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆయన భార్య గాభీబెన్ వెంటనే ఆయనను ఉరుకులపరుగుల మీద ఆసుపత్రికి తీసుకెళ్ళారు. 2022 ఏప్రిల్‌లో ఆయన అరేబియా సముద్రంలో చేపల ట్రాలర్‌ను నడుపుతుండగా, అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. ఆయన వెంట ఉన్న తోటి పనివాళ్లలో ఒకరు స్టీరింగ్ చక్రాన్ని తీసుకోగా, మరొకరు భయపడుతూనే ఆయన కింద పడుకోవడానికి సహాయం చేశారు. వారు ఒడ్డుకు చేరాలంటే ఐదు గంటల సమయం పడుతుంది. చనిపోయే ముందు జీవన్‌భాయ్ రెండు గంటలకు పైగా మృత్యువుతో పోరాడారు.

గాభీబెన్ భయపడినంతా జరిగింది.

మొదటిసారి గుండెపోటు వచ్చిన సంవత్సరం తర్వాత జీవన్‌భాయ్ తిరిగి చేపల వేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె దాని గురించి పెద్దగా ఆసక్తి చూపలేదు. అది ప్రమాదకరమని ఆమెకు తెలుసు. అలాగే జీవన్‌భాయ్‌కు కూడా ఆ విషయం తెలుసు. గుజరాత్‌లోని అమరేలీ జిల్లాలోని చిన్న తీరప్రాంత పట్టణమైన జాఫరాబాద్‌లో గుడ్డి వెలుతురు ఉన్న తన గుడిసెలో కూర్చొని, "నేను ఆయనను వెళ్లొద్దని చెప్పాను," అని గాభీబెన్ చెప్పారు.

కానీ పట్టణంలోని చాలామంది ప్రజల్లాగే 60 ఏళ్ల జీవన్‌భాయ్‌కు చేపలు పట్టడం తప్ప మరో పని తెలీదు. దాని వల్ల ఆయన యేడాదికి దాదాపు రూ. 2 లక్షలు సంపాదిస్తారు. “ఆయన 40 ఏళ్లుగా అదే వృత్తిలో ఉన్నారు,” అని 55 ఏళ్ల గాభీబెన్ చెప్పారు. “గుండెపోటు వచ్చిన తర్వాత ఆయన ఒక సంవత్సరం పాటు విశ్రాంతి తీసుకున్నప్పుడు, నేను మా ఇల్లు గడవడానికి కూలీగా (ఇతర మత్స్యకారుల చేపలను ఎండబెట్టడం) పనిచేశాను. తాను కోలుకున్నానని భావించాక, ఆయన తిరిగి పనికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.”

జీవన్‌భాయ్ జాఫరాబాద్‌లోని పెద్ద మత్స్యకారులలో ఒకరికి చెందిన ట్రాలర్‌ మీద పనిచేశారు. వర్షాకాలం మినహా, సంవత్సరంలో ఎనిమిది నెలలు పనివాళ్లు ఈ ట్రాలర్‌లను 10-15 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి తీసుకువెళతారు. వాళ్లు తమతో పాటు రెండు వారాలకు సరిపడా నీళ్లు, ఆహారాన్ని తీసుకుపోతారు.

‘‘అత్యవసర సేవలు అందని చోట, సముద్రం మధ్య అన్ని రోజులు ఉండడం ఎంత మాత్రం సురక్షితం కాదు,’’ అన్నారు గాభీబెన్. ‘‘వాళ్ల దగ్గర ఉండేది కేవలం ప్రాథమిక చికిత్స కోసం ఉండే కిట్ మాత్రమే. ఇక గుండె సంబంధిత రోగులకైతే, అది మరింత ప్రమాదం.’’

Gabhiben holding a portrait of her late husband, Jeevanbhai, at their home in Jafrabad, a coastal town in Gujarat’s Amreli district
PHOTO • Parth M.N.

గుజరాత్‌లోని అమరేలీ జిల్లా జాఫరాబాద్‌లోని తమ ఇంటి వద్ద మరణించిన భర్త చిత్రపటాన్ని పట్టుకుని కూర్చునివున్న గాభీబెన్

భారతదేశంలోని రాష్ట్రాలన్నింటిలో గుజరాత్ అత్యంత పొడవైన తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది 13 జిల్లాలలోని 39 తాలుకాలలో, 1,600 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. దేశ సముద్ర ఉత్పత్తిలో 20 శాతం వాటా ఈ రాష్ట్రానిదే. మత్స్యశాఖ కమిషనర్ వెబ్‌సైట్ ప్రకారం, రాష్ట్రంలోని 1,000 కంటే ఎక్కువ గ్రామాలలో ఐదు లక్షల మందికి పైగా ప్రజలు మత్స్య పరిశ్రమలో పని చేస్తున్నారు.

సముద్రం మీద గడిపే వీరిలో అనేకమంది సుమారు నాలుగు నెలల పాటు వైద్య సేవలకు పూర్తిగా దూరమవుతారు.

జీవన్‌భాయ్ మొదటిసారి గుండెపోటుకు గురయ్యాక ఆయన సముద్రానికి బయలుదేరిన ప్రతిసారీ, గాభీబెన్ ఒత్తిడి, ఆందోళనలకు గురయ్యేవారు. ఆశ, భయాల మధ్య ఊగిసలాడే ఆలోచనలతో ఒంటరిగా మిగిలిపోయి, నిర్వికారంగా సీలింగ్ ఫ్యాన్‌వైపు చూస్తూ నిద్రలేని రాత్రులు గడిపేవారు. జీవన్‌భాయ్ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాక, ఆమె ఊరటచెందినట్టు ఒక్క నిట్టూర్పు విడిచేవారు.

ఒక రోజున ఆయన తిరిగి రాలేదు.

*****

గుజరాత్ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం హైకోర్టుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటే జీవన్‌భాయ్ తలరాత వేరుగా ఉండేది.

ఏప్రిల్ 2017లో, జాఫరాబాద్ తీరంలోని శియాల్ బేట్ అనే ద్వీపానికి చెందిన 70 ఏళ్ల జందూర్‌భాయి బాలధియా, చాలా కాలంగా వాయిదా పడుతున్న బోట్ అంబులెన్స్‌ల కోసం డిమాండ్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విషయంలో ఆయనకు మార్గనిర్దేశం చేసిన 43 ఏళ్ల అరవింద్‌భాయ్ ఖుమాన్, అహ్మదాబాద్‌ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్‌కు చెందిన న్యాయవాది, కార్యకర్త. ఈ సంస్థ అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని విస్మరిస్తూ మత్స్యకారుల జీవించే హక్కుకు హామీ ఇచ్చే ‘ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోంద’ని ఆ పిటిషన్ పేర్కొంది.

వర్క్ ఇన్ ఫిషింగ్ కన్వెన్షన్, 2007లోని ‘వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య రక్షణ, వైద్య సంరక్షణకు సంబంధించిన కనీస అవసరాలను’ కూడా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Standing on the shore of Jafrabad's coastline, 55-year-old Jeevanbhai Shiyal says fisherfolk say a silent prayer before a trip
PHOTO • Parth M.N.

జాలర్లు తమ ప్రయాణానికి ముందు నిశబ్దంగా ప్రార్థిస్తారని జాఫరాబాద్ సముద్రతీరంలో నిలబడివున్న 55 ఏళ్ల జీవన్‌భాయ్ శియాల్ చెప్పారు

ఆగస్టు 2017లో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని హామీలు లభించిన తర్వాత హైకోర్టు ఈ పిటిషన్‌ను పరిష్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన మనీషా లవ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వం ‘మత్స్యకారుల హక్కులపై,  తీరప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల విషయంలో చాలా అప్రమత్తంగానూ అవగాహనతోనూ ఉంద’ని కోర్టుకు తెలిపారు.

ముఖ్యంగా, తీరంలోని 1,600 కిలోమీటర్ల మేర నడిపేందుకు ‘ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధమైన’ ఏడు పడవ అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కోర్టు ఆదేశంలో పేర్కొన్నారు.

ఐదేళ్లుగా మత్స్యకారులు అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కానీ వాగ్దానం చేసిన ఏడు పడవ అంబులెన్స్‌లలో రెండు- ఓఖాలో ఒకటి, పోర్‌బందర్‌లో ఒకటి మాత్రమే ఇప్పటివరకు కార్యరూపం దాల్చాయి.

"తీరం వెంబడే ఉన్న చాలా ప్రాంతం ఇంకా ప్రమాదకరంగానే ఉంది," అని జాఫరాబాద్‌కు ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజులా అనే చిన్న పట్టణంలో నివసించే అరవింద్‌భాయ్ తెలిపారు. "నీటి అంబులెన్స్‌లు అనేవి స్పీడ్ బోట్లు. ఇవి చేపల ట్రాలర్‌లకన్నా రెట్టింపు వేగంతో దూరాన్ని అధిగమించగలవు. ఈ సమయంలో మత్స్యకారులు తీరానికి దగ్గరగా ఉండరు కాబట్టి మాకు ఈ అంబులెన్స్‌లు చాలా అవసరం."

ప్రాణాంతకమైన ఆ గుండెపోటుకు గురైనప్పుడు జీవన్‌భాయ్ తీరం నుండి 40 నాటికల్ మైళ్లు లేదా దాదాపు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సుమారు 20 యేళ్ల క్రితం, మత్స్యకారులు చాలా అరుదుగా మాత్రమే అంత దూరం సముద్రంలోకి వెళ్ళేవారు.

"ఆయన చేపలు పట్టడం మొదలుపెట్టిన మొదట్లో, ఐదు లేదా ఎనిమిది నాటికల్ మైళ్లలోపే తగినన్ని చేపలు లభించేవి" అని గాభీబెన్ చెప్పారు. "అది తీరం నుండి గంటా రెండు గంటల దూరంలో ఉండేది. గత కొన్నేళ్ళుగా, పరిస్థితులు చాలా అధ్వాన్నంగా మారుతూవస్తున్నాయి. ఈ రోజున మేం తీరానికి 10 లేదా 12 గంటల దూరం వెళ్ళి చేపలు పట్టాల్సివస్తోంది."

Gabhiben recalls the stress and anxiety she felt every time Jeevanbhai set off to sea after his first heart attack. Most fisherfolk in Gujarat are completely cut off from medical services during time they are at sea
PHOTO • Parth M.N.

మొదటిసారి గుండెపోటు వచ్చాక జీవన్‌భాయ్ సముద్రం మీదకు వెళ్లిన ప్రతిసారీ తానెంత వత్తిడికీ, ఆందోళనకూ గురయ్యేవారో గాభీబెన్ గుర్తు చేసుకున్నారు. గుజరాత్‌లోని అనేకమంది మత్య్సకారులు సముద్రం మీదికి వెళ్లినపుడు వైద్య సేవలకు పూర్తిగా దూరమైపోతారు

*****

రెండు కారణాలు మత్య్సకారులను సముద్రం లోలోపలికి వెళ్లేలా చేస్తాయి: తీరప్రాంతంలో పెరుగుతున్న కాలుష్యం, మడ అడవులు విస్తరించిన ప్రాంతం తగ్గిపోవడం

తీరప్రాంతంలో ప్రబలుతున్న పారిశ్రామిక కాలుష్యం సముద్ర పర్యావరణ వ్యవస్థపై దారుణమైన ప్రభావాన్ని చూపుతోందని నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరమ్ కార్యదర్శి ఉస్మాన్ గనీ చెప్పారు. "దీని వల్ల చేపలు తీరానికి దూరంగా వెళ్లిపోతాయి, దీంతో మత్స్యకారులు కూడా మరింతగా సముద్రం లోపలికి వెళ్లాల్సివస్తుంది," అని అతనన్నారు. "వారు సముద్రం లోపలికి వెళ్లేకొద్దీ, అత్యవసర సేవలు అందడం మరింత క్లిష్టంగా మారుతుంది."

స్టేట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ రిపోర్ట్ ( SOE), 2013 ప్రకారం, గుజరాత్ తీరప్రాంత జిల్లాలలో 58 ప్రధాన పరిశ్రమలున్నాయి. వీటిలో ఇతర పరిశ్రమలతో పాటు రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఉక్కు, లోహాల పరిశ్రమలు కూడా ఉన్నాయి. 822 మైనింగ్ లీజులు, 3156 క్వారీ లీజులు ఉన్నాయి. 2013లో నివేదిక వెలువరించిన నాటి నుండి, ఈ సంఖ్య గణనీయంగా పెరిగిందని కార్యకర్తలు భావిస్తున్నారు.

రాష్ట్రంలో ఉన్న 70 శాతానికి పైగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు రాష్ట్రంలోని 13 తీరప్రాంత జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నాయనీ, మిగిలిన 20 జిల్లాలలో 30 శాతం ఉత్పత్తి అవుతోందనీ నివేదిక పేర్కొంది.

"పరిశ్రమలు తరచుగా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తాయి. ప్రతి ఒక్కరూ తమ వ్యర్థాలను నేరుగా లేదా నదుల ద్వారా సముద్రంలోకి పంపుతారు,” అని బరోడాకు చెందిన పర్యావరణ కార్యకర్త రోహిత్ ప్రజాపతి చెప్పారు. “గుజరాత్‌లో దాదాపు 20 కలుషితమైపోయిన నదులున్నాయి. వాటిలో చాలా నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి.’’

అభివృద్ధి పేరుతో రాష్ట్రం తీరం వెంట ఉన్న మడ అడవులకు కూడా నష్టం చేస్తోందని గనీ అంటారు. "మడ అడవులు తీరాన్ని రక్షిస్తాయి, అవి చేపలకు గుడ్లు పెట్టడానికి సురక్షితమైన స్థలంగా ఉపయోగపడతాయి," అని అతను వివరించారు. “కానీ గుజరాత్ తీరంలో ఎక్కడ వాణిజ్య పరిశ్రమలు వచ్చినా మడ అడవులను నరికేస్తున్నారు. మడ అడవులు లేనప్పుడు చేపలు తీరానికి రావు.’’

Jeevanbhai Shiyal on a boat parked on Jafrabad's shore where rows of fish are set to dry by the town's fishing community (right)
PHOTO • Parth M.N.
Jeevanbhai Shiyal on a boat parked on Jafrabad's shore where rows of fish are set to dry by the town's fishing community (right)
PHOTO • Parth M.N.

జాఫరాబాద్ తీరంలో ఉన్న పడవ మీద కూర్చొనివున్న జీవన్‌భాయ్ శియాల్, పట్టణానికి చెందిన మత్య్సకారులు ఎండడం కోసం పరిచిన చేపల వరుస (కుడి)

2021 ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం, 2019 నుండి దేశవ్యాప్తంగా మడ అడవులు 17 శాతం పెరిగినప్పటికీ గుజరాత్‌లోని మడ అడవులు మాత్రం 2 శాతం తగ్గాయి.

గుజరాత్‌ తీరంలోని39 తాలూకాల లో 38 చోట్ల తీరరేఖ వివిధ స్థాయిలలో కోతకు గురయ్యే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది. మామూలుగా అయితే మడ అడవులు ఈ కోతను నిరోధించేవి.

“మడ అడవులను రక్షించడంలో వైఫల్యం గుజరాత్ తీరం వెంబడి సముద్ర మట్టం పెరగడానికి ఒక కారణం. సముద్రం ఇప్పుడు మనం విసిరేసే పారిశ్రామిక కాలుష్యాన్ని తిరిగి వెనక్కి తీసుకువస్తోంది,” అని ప్రజాపతి చెప్పారు. "కాలుష్యం, (తత్ఫలితంగా) మడ అడవులు లేకపోవడం వల్ల తీరం చుట్టూ ఉన్న నీరు కలుషితమవుతోంది."

మత్స్యకారులు తీరం నుండి మరింత దూరంగా ప్రయాణించాల్సి రావడంతో వాళ్లిప్పుడు బలమైన నీటి ప్రవాహాలను, తీవ్రమైన గాలులను, అనూహ్య వాతావరణాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి తగినంత బలంగా లేని చిన్న చేపల పడవలను నడిపే పేద మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఏప్రిల్ 2016లో, సనాభాయ్ శియాల్ పడవ సముద్రం మధ్యలో ఉండగా చెడిపోయింది. బలమైన ప్రవాహం కారణంగా పడవలో ఒక చిన్న పగులు ఏర్పడి, పడవలో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారులు ఎంత ప్రయత్నించినా నీరు లోపలికి రావడం మొదలైంది. చుట్టుపక్కల ఎవరూ లేనందున సహాయం కోసం పిలిచినా అది వ్యర్థమే అవుతుంది. దాంతో వాళ్లే ఆ సమస్యను ఎదుర్కోవాల్సివచ్చింది.

మత్స్యకారులు ప్రాణాలను కాపాడుకునేందుకు సముద్రంలోకి దూకే సమయంలోనే పడవ ముక్కలై మునిగిపోయింది. నీటిలో తేలుతూ ఉండటం కోసం అందరూ చేతికి దొరికిన తలో చెక్క ముక్కను పట్టుకున్నారు. ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. 60 ఏళ్ల సనాభాయ్‌తో పాటు మరొకరు చనిపోయారు.

ప్రమాదం నుండి బ్రతికి బయటపడ్డవాళ్లు సుమారు 12 గంటల పాటు అలా సముద్రంలో తేలుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఒక ట్రాలర్ వాళ్లను చూసి రక్షించింది.

Jamnaben's husband Sanabhai was on a small fishing boat which broke down in the middle of the Arabian Sea. He passed away before help could reach him
PHOTO • Parth M.N.

జమనాబెన్ భర్త సనాభాయ్, చేపలు పట్టే తన చిన్న పడవ చెడిపోయినపుడు అరేబియా సముద్రం మధ్యలో ఉన్నారు. సాయం అందేలోపే ఆయన మరణించారు

"ఆయన మృతదేహాన్ని మూడు రోజుల తర్వాత కనిపెట్టారు," అని సనాభాయ్ భార్య, జాఫరాబాద్ నివాసి 65 ఏళ్ల జమనాబెన్ చెప్పారు. "స్పీడ్ బోట్ ఉంటే ఆయనను రక్షించి ఉండేవారేమో నాకు తెలీదు. కానీ ఆయన కనీసం బతికే అవకాశం ఉండేది. పడవలో ఏదో లోపం ఉందని గ్రహించిన తర్వాత ఆయన అత్యవసర సహాయం కోసం పిలిచి ఉండవచ్చు. దురదృష్టం ఏమిటంటే, ఏం  జరిగి ఉంటుందో అని మేమింకా ఆశ్చర్యపోతూనే ఉన్నాం. ”

ఆమె ఇద్దరు కుమారులు - 30 ఏళ్ల దినేశ్, 35 ఏళ్ల భూపద్, వాళ్లిద్దరికీ పెళ్లిళ్లై,  ఇద్దరికీ చెరో ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లు కూడా మత్స్యకారులే. సనాభాయ్ మరణం తరువాత, వాళ్లలో కొంత ఆందోళన మొదలైంది.

“దినేశ్ ఇప్పటికీ క్రమం తప్పకుండా చేపలు పడుతున్నాడు. భూపద్ తనకు చేతనైనంత వరకు చేపల వేటకు వెళ్ళకుండా ఉండేందుకే చూస్తున్నాడు,” అని జమనాబెన్ చెప్పారు. “కానీ మాకంటూ ఒక కుటుంబం ఉంది, ఒకే ఒక ఆదాయ వనరు ఉంది. మా జీవితాలు సముద్రానికే అంకితం.’’

*****

ఒక చేపలు పట్టే ట్రాలర్‌కు యజమాని అయిన 55 ఏళ్ళ జీవన్‌భాయ్ శియాల్, మత్స్యకారులు తాము చేపలు పట్టడానికి వెళ్లే ముందు నిశబ్దంగా ఒక ప్రార్థన చేస్తారని తెలిపారు.

"సుమారు ఒక ఏడాది క్రితం సముద్రంపై ఉండగా, మా పనివాళ్ళలో ఒకరికి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చింది" అని ఆయన గుర్తుచేసుకున్నారు. "మేం వెంటనే తీరం వైపు ప్రయాణాన్ని ప్రారంభించాం," ట్రాలర్ తిరిగి తీరానికి చేరుతున్నప్పుడు ఛాతీపై చేతులు పెట్టుకున్న ఆ కార్మికుడు ఐదు గంటల పాటు ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఆ ఐదు గంటల ప్రయాణం తమకు ఐదు రోజుల్లాగా అనిపించిందని శియాల్ చెప్పారు. ప్రతి సెకను దాని ముందుదాని కంటే ఎక్కువ సమయంలా అనిపించింది. ప్రతి నిమిషం, మునుపటి దానికంటే ఎక్కువ ఒత్తిడిగా తోచింది. వారు తీరాన్ని చేరుకోగానే ఆస్పత్రిలో చేర్పించడంతో ఆ కార్మికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

శియాల్‌కు ఆ ఒక్క ట్రిప్పుకే రూ. 50,000కు పైగా ఖర్చయింది, ఎందుకంటే ఆయన వెళ్లిన ఒక రోజుకే వెనక్కితిరిగి రావాల్సి వచ్చింది. "ఒకసారి వెళ్లి రావడానికి 400 లీటర్ల ఇంధనం అవసరం," అని ఆయన చెప్పారు. "మేం ఒక్క చేపను కూడా పట్టుకోకుండానే తిరిగి వచ్చేశాం."

When one of Jeevanbhai Shiyal's workers suddenly felt chest pains onboard his trawler, they immediately turned back without catching any fish. The fuel expenses for that one trip cost Shiyal over Rs. 50,000
PHOTO • Parth M.N.

జీవన్‌భాయ్ శియాల్‌కు చెందిన పనివాళ్లలో ఒకరికి ట్రాలర్ పైన ఉన్నప్పుడే హఠాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో వాళ్లు చేపలు పట్టకుండానే వెంటనే వెనక్కి తిరగిరావాల్సి వచ్చింది. ఆ ఒక్క ట్రిప్పుకే శియాల్ రూ.50,000కు పైగా ఇంధనం ఖర్చులు భరించాల్సి వచ్చింది

'We bear the discomfort when we fall sick on the boat and get treated only after we are back home,' says Jeevanbhai Shiyal
PHOTO • Parth M.N.

'పడవ మీద ఏదైనా అసౌకర్యం కలిగినా మేం దాన్ని భరించి, తిరిగి ఇంటికి వచ్చాకే దానికి చికిత్స చేయించుకుంటాం’ అన్నారు జీవన్‌భాయ్ శియాల్

చేపలు పట్టడంలో పెరుగుతున్న పై ఖర్చుల కారణంగా, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వాళ్లు చేసే మొదటి పని దానిని పట్టించుకోకపోవడం అని శియాల్ చెప్పారు. "అది ప్రమాదకరం కావచ్చు. అయితే మేం ఎలాంటి పొదుపూ చేయలేని నిరాడంబర జీవితాలను గడుపుతున్నాం. మా పరిస్థితుల కారణంగా ఆరోగ్యాన్ని విస్మరించాల్సి వస్తోంది. మేము పడవలో అనారోగ్యానికి గురైతే, ఆ బాధను భరిస్తాం, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే చికిత్స చేయించుకుంటాం.’’

శియాల్ బేట్ వాసులకు ఇంటివద్ద ఉన్నప్పుడు కూడా వైద్యం అందే అవకాశం లేదు. వాళ్ల ద్వీపానికి చేరుకోవాలంటే కనీసం15 నిమిషాలు పడవ ద్వారా ప్రయాణించాలి; అటూ ఇటూ కదిలే పడవలో ఎక్కడానికి, దిగడానికి ఐదు నిమిషాలు పోరాటం కూడా చేయాలి.

పడవ అంబులెన్స్‌లతో పాటు, శియాల్ బేట్‌లో నివాసముండే 5,000 మంది కోసం - వీరంతా ఆదాయం కోసం మత్స్య సంపదపై ఆధారపడుతున్నవారే - ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా బాలధియా తన పిటిషన్‌లో కోరారు.

దీనిపై స్పందించిన హైకోర్టు జిల్లా పరిసర ప్రాంతాల వైద్యాధికారులను వారానికి ఐదు రోజుల పాటు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఆరోగ్య కేంద్రానికి పంపాలని ఆదేశించింది.

కానీ, క్షేత్రస్థాయిలో అది అమలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు.

Kanabhai Baladhiya outside a Primary Health Centre in Shiyal Bet. He says, 'I have to get on a boat every time I need to see a doctor'
PHOTO • Parth M.N.

శియాల్ బేట్‌లోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెలుపల ఉన్న కానాభాయ్ బాలధియా. 'నేను డాక్టరుని కలవాల్సిన ప్రతిసారీ పడవెక్కి రావాల్సిందే,' అంటారాయన

Hansaben Shiyal is expecting a child and fears she won’t get to the hospital on time
PHOTO • Parth M.N.

త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతోన్న హంసాబెన్ శియాల్, తాను సరైన సమయంలో ఆసుపత్రిని చేరుకోలేనేమోనని భయపడుతోంది

ప్రస్తుతం చేపలు పట్టడం మానేసిన మత్స్యకారుడు కానాభాయ్ బాలధియా మాట్లాడుతూ, తనను పదే పదే ఇబ్బందిపెట్టే మోకాళ్ల సమస్యకు చికిత్స చేయించుకోవడానికి జాఫరాబాద్‌కుగానీ, రాజులాకుగానీ వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. "ఇక్కడ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరచుగా మూసేస్తుంటారు," అని ఆ 75 ఏళ్ల వృద్ధుడు చెప్పారు. "ఏదో ఒక కారణం వల్ల వారానికి ఐదు రోజులు ఇక్కడ డాక్టర్ ఉండాలని కోర్టు చెప్పింది, అదేదో వారాంతాల్లో ప్రజలు అనారోగ్యం బారిన పడరన్నట్టు! కానీ ఇక్కడ పనిదినాల్లో కూడా ఏమంత మెరుగ్గా ఉండదు. నేను డాక్టర్‌ని కలవాల్సిన ప్రతిసారీ పడవ ఎక్కాల్సిందే.”

ఇక గర్భిణులకైతే, అదింకా పెద్ద సమస్య.

28 ఏళ్ల హంసాబెన్ శియాల్, ఎనిమిది నెలల గర్భవతి. వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా ఈ కాలంలో మూడుసార్లు జాఫరాబాద్‌లోని ఆసుపత్రికి రావాల్సి వచ్చింది. తాను ఆరు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్రమైన కడుపు నొప్పిని ఎలా అనుభవించిందో ఆమె గుర్తుచేసుకుంది. అది అర్ధరాత్రి సమయం, పడవలు పగలు ఎప్పుడో ఆగిపోయాయి. ఆమె రాత్రంతా మేలుకుని, వేకువ జాము కోసం వేచి ఉండాలని నిర్ణయించుకుంది. అదో సుదీర్ఘమైన, ఆందోళనతో నిండిన రాత్రి.

తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో, హంసాబెన్ ఇక ఉండలేకపోయింది. ఆమె తనకు సహాయం చేయమని ఓ పడవ నడిపే మనిషిని పిలిస్తే అతను దయతలచాడు. "గర్భవతిగా ఉండి, నొప్పితో బాధపడుతున్నప్పుడు పడవ ఎక్కడం దిగడం చాలా ఒత్తిడితో కూడుకున్నది," అని ఆమె చెప్పింది. “పడవ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. మీరు అటూ ఇటూ ఊగిపోకుండా కూర్చోవాలి. చిన్న పొరపాటు జరిగినా నీళ్లలో పడిపోతారు. మీ జీవితం దారం చివర వేలాడుతున్నట్లు ఉంటుంది.’’

ఆమె పడవ ఎక్కిన తర్వాత, ఆమె అత్తగారు 60 ఏళ్ల మంజూబెన్, అంబులెన్స్ సర్వీస్‌కు ఫోన్ చేశారు. "మేం వాళ్లకు ముందుగానే ఫోన్ చేస్తే కొంత సమయం కలిసి వస్తుందని అనుకున్నాం" అని ఆమె చెప్పారు. "కానీ జాఫరాబాద్ తీరంలో దిగిన తర్వాత మళ్లీ కాల్ చేయమని వాళ్లు మాకు చెప్పారు."

అంటే ఆంబులెన్స్ రావడం కోసం వాళ్లు ఇంకో 5-7 నిమిషాలు వేచి చూడాల్సి వచ్చింది, ఆ తర్వాతే ఆమెను ఆసుపత్రికి తీసుకుపోయారు.

Passengers alighting at Shiyal Bet (left) and Jafrabad ports (right)
PHOTO • Parth M.N.
Passengers alighting at Shiyal Bet (left) and Jafrabad ports (right)
PHOTO • Parth M.N.

శియాల్ బేట్ వద్ద దిగుతున్న ప్రయాణికులు (ఎడమ), జాఫరాబాద్ తీరాలు (కుడి)

ఈ అనుభవంతో హంసాబెన్‌ భయపడిపోయింది. "నా కానుపు కోసం నేను సమయానికి ఆసుపత్రికి చేరలేనేమోనని భయపడుతున్నాను" అని ఆమె చెప్పింది. “నాకు పురిటి నొప్పులు వచ్చేటప్పుడు నేను పడవలోంచి పడిపోతానేమోనని భయంగా ఉంది. సకాలంలో ఆసుపత్రికి చేరక చనిపోయిన మా గ్రామంలోని మహిళల గురించి నాకు తెలుసు. పిల్లలు ప్రాణాలతో బయటపడని సందర్భాల గురించి కూడా తెలుసు.’’

ఇటీవలి కాలంలో శియాల్ బేట్ నుండి పెరుగుతున్న వలసలకు ఆరోగ్య సంరక్షణ లేకపోవడం ఒక ప్రధాన కారణమని పిటిషన్‌ వేసిన న్యాయవాది-కార్యకర్త అరవింద్‌భాయ్ అన్నారు. "తమకున్న ప్రతి వస్తువునూ అమ్ముకున్న కుటుంబాలు మీకిక్కడ కనిపిస్తాయి," అని అతను చెప్పారు. “ఆరోగ్య సంరక్షణ లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు విషాదాన్ని చవిచూశాయి. వారు తీరానికి దూరంగా వెళ్ళిపోయి, తామెప్పటికీ తిరిగి రాబోమని ఒట్టుపెట్టుకున్నారు.’’

తీర ప్రాంతంలో నివసించే గాభీబెన్ కూడా, తన కుటుంబంలోని తరువాతి తరం ఇకపై ఎన్నడూ తమ పూర్వీకుల వృత్తిని చేపట్టబోదని ఒట్టుపెట్టుకున్నారు. జీవన్‌భాయ్ మరణం తర్వాత, ఆమె మిగతా మత్స్యకారుల వద్ద చేపలను ఎండబెట్టే కూలీగా పని చేస్తున్నారు. అది చాలా కష్టమైన పని, దాని వల్ల ఆమెకు కేవలం రోజుకు రూ. 200 మాత్రం లభిస్తుంది. ఆమె సంపాదించే ప్రతి రూపాయి జాఫరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన 14 ఏళ్ల కొడుకు రోహిత్‌ చదువు కోసమే. ఒక మత్స్యకారుడిగా తప్ప, అతనెలా కోరుకుంటే అలా పెరగాలనేది ఆమె కోరిక..

దాని కోసం రోహిత్ వృద్ధాప్యంలో గాభీబెన్‌ను ఒంటరిగా వదిలిపెట్టి జాఫరాబాద్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చినా సరే. జాఫరాబాద్‌లో భయంభయంగా జీవిస్తున్న ప్రజలు అనేకమంది ఉన్నారు. వారిలో ఒకరిగా ఉండడం గాభీబెన్‌కు ఇష్టం లేదు.

ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నుండి అందే స్వతంత్ర జర్నలిజం గ్రాంట్ ద్వారా పార్థ్ ఎం.ఎన్. ప్రజారోగ్యం, పౌర హక్కులపై నివేదిస్తున్నారు. ఈ నివేదికలోని అంశాలపై ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్‌కు ఎలాంటి సంపాదకీయ నియంత్రణా లేదు.

అనువాదం: రవికృష్ణ

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Sangeeta Menon

Sangeeta Menon is a Mumbai-based writer, editor and communications consultant.

Other stories by Sangeeta Menon
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna