అతను విరాట్ కోహ్లిని పూజించేవాడు. ఆమె బాబర్ ఆజమ్‌ను ఆరాధించేది. కోహ్లి సెంచరీ చేసినప్పుడల్లా అతనామెకు చూపించేవాడు, బాబర్ బాగా ఆడినప్పుడు ఆమె అతణ్ని ఆట పట్టించేది. ఈ క్రికెట్ పరిహాసం ఆయేషా, నూరుల్ హసన్‌ల ప్రేమ భాష. కానీ వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళిద్దిరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుసుకుని తరచూ ఆశ్చర్యపోతుంటారు.

2023 జూన్‌లో ప్రకటించిన క్రికెట్ ప్రపంచ కప్ టైమ్ టేబుల్‌ను చూసి అయేషా కళ్ళు మెరిశాయి. అక్టోబరు 14న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారత్‌-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందని దానిలో ఉంది. "మనం ఈ మ్యాచ్‌ను తప్పకుండా స్టేడియంలోనే చూడాలని నేను నూరుల్‌తో చెప్పాను," అని రాజాచే కుర్లే గ్రామంలో కూర్చొనివున్న 30 ఏళ్ళ ఆయేషా గుర్తు చేసుకుంది. పశ్చిమ మహారాష్ట్రలోని రాజాచే కుర్లే, ఆమె పుట్టిల్లు. "భారత్‌, పాకిస్థాన్‌లు చాలా అరుదుగా ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడతాయి. అది మాకిష్టమైన ఆటగాళ్ళు ఇద్దరినీ కలిసి చూసే అరుదైన అవకాశం."

సివిల్ ఇంజనీర్‌ అయిన 30 ఏళ్ళ నూరుల్, కొన్ని ఫోన్ కాల్స్ చేసి, ఎలాగైతేనేం రెండు టిక్కెట్లు సంపాదించాడు. దాంతో ఆ జంట ఆనందానికి హద్దు లేదు. అప్పటికి ఆయేషా ఆరు నెలల గర్భవతి. దాంతో వాళ్ళు సాతారా జిల్లాలోని తమ గ్రామమైన పుసేసావళి నుంచి 750 కిలోమీటర్ల ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. రైలు టిక్కెట్లు బుక్ చేసి, బస ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది, కానీ ఆ జంట మాత్రం మ్యాచ్‌ను చూడలేకపోయింది.

అక్టోబరు 14, 2023న సూర్యోదయం అయ్యే సమయానికి, నూరుల్ మరణించి నెల రోజులయింది, ఆయేషా ఆ బాధలో కూరుకుపోయి ఉంది.

*****

మహారాష్ట్రలోని సాతారా నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుసేసావళి గ్రామంలో ఆగస్టు 18, 2023న ఓ స్క్రీన్‌షాట్ వైరల్ అయింది. దానిలో గ్రామానికి చెందిన 25 ఏళ్ళ ఆదిల్ బాగ్వాన్ అనే ముస్లిమ్ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో హిందూ దేవుళ్ళను దూషించడం కనిపించింది. ఆ స్క్రీన్‌షాట్‌ను మార్ఫింగ్ చేసారని ఆదిల్ నేటికీ అంటాడు. నిజానికి ఇన్‌స్టాగ్రామ్‌లో అతని స్నేహితులు కూడా అతను చేసినట్లు చెబుతున్న ఆ కామెంట్‌ను చూడలేదు.

అయితే, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు, పుసేసావళిలోని ముస్లిమ్ వర్గానికి చెందిన పెద్దలు స్వయంగా ఆదిల్‌ని పోలీసుల వద్దకు తీసుకెళ్ళి, ఆ స్క్రీన్‌షాట్‌పై దర్యాప్తు చేయమని కోరారు. "ఆదిల్ దోషిగా తేలితే, అతన్ని శిక్షించాలని, మేం కూడా దానిని ఖండిస్తామని చెప్పాం," అని పుసేసావళి గ్రామంలో గ్యారేజీని నడుపుతున్న 47 ఏళ్ళ సిరాజ్ బాగ్వాన్ చెప్పారు. "పోలీసులు ఆదిల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, రెండు మతాల మధ్య శతృత్వాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అతనిపై ఒక ఫిర్యాదు నమోదు చేశారు."

'We also said that if Adil is found guilty, he should be punished and we will condemn it,' says Siraj Bagwan, 47, who runs a garage in Pusesavali village
PHOTO • Parth M.N.

పుసేసావళి గ్రామంలో గ్యారేజీ నడుపుతున్న 47 ఏళ్ళ సిరాజ్ బాగ్వాన్. 'ఆదిల్ దోషిగా తేలితే అతణ్ని శిక్షించాలని, అతని చర్యను మేమూ ఖండిస్తామనీ చెప్పాం,’ అన్నారాయన

అయినా, సాతారాలోని హిందూ మితవాద సంస్థలకు చెందిన సభ్యులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పుసేసావళిలోని ముస్లిములపై సామూహిక హింసకు పిలుపునిస్తూ మరుసటి రోజు ఒక ర్యాలీ నిర్వహించారు. శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకుంటామని కూడా బెదిరించారు.

స్క్రీన్‌షాట్‌పై న్యాయపరమైన దర్యాప్తు చేయాలంటూ స్థానిక పోలీసు స్టేషన్‌లో విజ్ఞప్తి చేసిన సిరాజ్, ముస్లిమ్ సముదాయానికి చెందిన ఇతర పెద్దలు, అదే సమయంలో పుసేసావళిలోని మిగతా ముస్లిములకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి, తమకు భద్రత కల్పించాలని అభ్యర్థించారు. "అల్లర్లు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందని మేం పోలీసులకు చెప్పాం," అని సిరాజ్ గుర్తు చేసుకున్నారు. "వాటిని అడ్డుకోవడానికి నివారణ చర్యలు తీసుకోవాలని వేడుకున్నాం."

అయితే, సిరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఔంధ్ పోలీస్ స్టేషన్‌లోని సహాయక పోలీస్ ఇన్‌స్పెక్టర్ గంగాప్రసాద్ కేంద్రే వారిని ఎగతాళి చేశాడు. "ప్రవక్త మొహమ్మద్ ఒక మామూలు మనిషి కదా, మీరు ఆయనను ఎందుకు అనుసరిస్తున్నారు అంటూ అతను మమ్మల్ని అడిగాడు," అని సిరాజ్ గుర్తు చేసుకున్నారు. "ఒక యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతాడని నేను ఊహించలేదు." పుసేసావళి ఔంధ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.

ఆ తర్వాత రెండు వారాల పాటు హిందూ ఏక్తా, శివప్రతిష్ఠాన్ హిందుస్థాన్ అనే రెండు మితవాద సంస్థల సభ్యులు పుసేసావళిలో అక్కడక్కడా ముస్లిమ్ పురుషుల్ని ఆపి, వాళ్ళ ఇళ్ళను తగలబెడతామని బెదిరిస్తూ, వాళ్ళని 'జై శ్రీరామ్' అనేలా బలవంతపెట్టేవాళ్ళు. దాంతో గ్రామంలో అశాంతి, ఉద్రిక్తత నెలకొన్నాయి.

సెప్టెంబరు 8న, 23 ఏళ్ళ ముజమ్మిల్ బాగ్వాన్, 23 ఏళ్ళ అల్త్‌మాశ్ బాగ్వాన్‌లు చేసినట్లుగా చెబుతున్న అలాంటి మరో రెండు స్క్రీన్‌షాట్‌లు వైరల్ అయ్యాయి. వాళ్ళిద్దరూ పుసేసావళి నివాసులే. ఆదిల్ లాగానే వాళ్ళూ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో హిందూ దేవుళ్ళను దుర్భాషలాడుతూ కనిపించారు. ఆదిల్‌లాగే, ఆ ఇద్దరు యువకులు కూడా ఆ స్క్రీన్‌షాట్‌లను ఫొటోషాప్ చేశారని ఆరోపించారు. ఆ పోస్ట్ కూడా హిందువులపై ముస్లిముల దూషణలన్నీ కలిపి (కొలాజ్) చేసిన పోస్ట్.

అయితే ఆ పోస్ట్‌ను మితవాద హిందూ సంస్థలే తయారుచేశాయనేది ఒక ఆరోపణ.

ఇదంతా జరిగి ఐదు నెలలకు పైగా గడిచిపోయినా, ఆ మూడు స్క్రీన్‌షాట్‌లు నిజమైనవా, కాదా అనే విషయాన్ని పోలీసులు ఇప్పటికీ తేల్చలేదు.

కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. మతపరమైన ఉద్రిక్తతలతో నిండిన గ్రామంలో, హింసాత్మక సంఘటనలు సంభవించాయి. సెప్టెంబరు 9న పుసేసావళిలోని స్థానిక ముస్లిములు వాటిని నివారించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇన్‌స్టాగ్రామ్ పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెప్టెంబరు 10, సూర్యాస్తమయం తర్వాత వందమందికి పైగా హిందూ మితవాద సంస్థలకు చెందిన వ్యక్తులు ముస్లిములకు చెందిన దుకాణాలను, వాహనాలను, ఇళ్ళను తగలబెట్టి, ధ్వంసం చేశారు. ముస్లిమ్ వర్గాల అంచనా ప్రకారం, 29 కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. మొత్తం రూ. 30 లక్షల నష్టం వాటిల్లింది. నిమిషాల వ్యవధిలో, జీవితకాలం చేసిన పొదుపు మొత్తం బూడిదైపోయింది.

Vehicles parked across the mosque on that fateful day in September were burnt. They continue to remain there
PHOTO • Parth M.N.

సెప్టెంబరు నాటి ఆ దురదృష్టకరమైన రోజున దగ్ధమైపోయిన మసీదు వద్ద నిలిపివున్న వాహనాలు. అవి ఇప్పటికీ అలాగే పడి ఉన్నాయి

పుసేసావళిలో ఇ-సేవ కేంద్ర (సాధారణ కక్షిదారుల అన్ని కోర్టు సంబంధిత అవసరాల కోసం ఏర్పాటు చేసిన కేంద్రం)ను నడుపుతున్న 43 ఏళ్ళ అష్ఫాక్ బాగ్వాన్ తన ఫోన్ తీసి, నేల మీద కూర్చున్న ఒక వృద్ధుడి ఫొటోను ఈ రిపోర్టర్‌కి చూపించారు. బలహీనంగా ఉన్న ఆ వృద్ధుడి తల రక్తంతో తడిసి ముద్దయింది. "వాళ్ళు మా కిటికీ మీద రాళ్ళు విసిరినప్పుడు, అద్దాలు పగిలిపోయి మా నాన్న తలకు పెద్ద గాయమైంది," అని అతను గుర్తుచేసుకున్నారు. “అదొక పీడకల. మా నాన్నకు గాయం చాలా లోతుగా తగిలింది, ఆ గాయానికి ఇంట్లో చికిత్స చేయలేకపోయాం.’’

కానీ బయట గుంపు అంతా ఉన్మాద స్థితిలో ఉండడంతో అష్ఫాక్ బయటకు వెళ్ళలేకపోయారు. అతను వెళ్ళి ఉంటే, అష్ఫాక్‌కు కూడా కొత్తగా పెళ్ళయిన క్రికెట్ ప్రేమికుడు నూరుల్ హసన్‌కు పట్టిన గతే పట్టేదేమో.

*****

ఆ సాయంత్రం నూరుల్ పని నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి, పుసేసావళిలో ఇంకా దహనకాండ ప్రారంభం కాలేదు. హిందూ మూకల గురించి తెలీని నూరుల్ కాళ్ళూముఖం కడుక్కుని సాయంత్రం ప్రార్థనలు చేయడానికి గ్రామ మసీదుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. "ఇంట్లో కొంతమంది అతిథులు ఉన్నారు, అందువల్ల నేను తనను ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోమన్నాను," అని ఆయేషా గుర్తుచేసుకుంది. "కానీ తొందరగా తిరిగి వస్తానంటూ తను వెళ్ళిపోయాడు."

ఒక గంట తర్వాత, నూరుల్ మసీదు నుంచి అయేషాకు ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రావద్దని చెప్పాడు. నూరుల్ విషయంలో భయాందోళనలకు గురైన ఆయేషా, అతను మసీదులో ఉన్నాడని తెలిశాక ఊపిరి పీల్చుకుంది. "ఆ గుంపు మసీదు మీద దాడి చేస్తుందని నేను ఊహించలేదు," ఆమె వాపోయింది. "ఆ విషయం అంత దూరం వెళ్తుందని నేను అనుకోలేదు. అతను మసీదు లోపల సురక్షితంగా ఉంటాడని అనుకున్నాను.’’

కానీ ఆమె పొరబడింది.

ముస్లిములకు చెందిన ఆస్తులను ధ్వంసం చేసి, తగలబెట్టిన తరువాత, ఆ గుంపు లోపల నుంచి తాళం వేసి ఉన్న మసీదును చుట్టుముట్టింది. కొంతమంది బయట పార్క్ చేసివున్న కొన్ని వాహనాలను తగలబెడితే, మరికొందరు లోపలికి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. వాళ్ళ దెబ్బలకు మసీదు తలుపు గొళ్ళెం విరిగిపోయి, తలుపులు తెరుచుకున్నాయి.

ఉన్మాద స్థితిలో ఉన్న ఆ గుంపు కర్రలు, ఇటుకలు, గచ్చు పలకలతో అప్పటివరకు శాంతియుతంగా ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లిములపై దాడి చేసింది. వాళ్ళలో ఒకడు ఒక పలకతో నూరుల్ తల పగలగొట్టాడు, ఆ తర్వాత అతడిని కొట్టి చంపేశారు. ఈ దాడిలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. "నేను అతని మృతదేహాన్ని చూసేంత వరకు అది నిజమని నమ్మలేకపోయాను," అని అయేషా చెప్పింది.

The mosque in Pusesavali where Nurul Hasan was lynched
PHOTO • Parth M.N.

నూరుల్ హసన్‌ను కొట్టి చంపేసిన పుసేసావళిలోని మసీదు

“నూరుల్ హత్య కేసులో నిందితులెవరో నాకు తెలుసు. వాళ్ళు అతన్ని భాయ్ [సోదరుడు] అని పిలిచేవాళ్ళు. అతన్ని కొట్టి చంపుతున్నప్పుడు వాళ్ళకు అది ఎందుకు గుర్తుకు రాలేదా అని నేను ఆశ్చర్యపోతున్నాను,” ఆయేషా బాధతో అంది.

పుసేసావళిలో ఇలాంటి దాడి జరగవచ్చని ముందే ఊహించి, కొన్ని రోజుల ముందు నుంచే తమకు భద్రత కల్పించాలని ముస్లిములు పోలీసులను వేడుకుంటూ వచ్చారు. ఆ గుంపు రావడాన్ని ఒక మైలు దూరం నుంచే వాళ్ళు చూశారు. కానీ సాతారా పోలీసులు మాత్రం ఆ గుంపును చూడలేకపోయారు.

*****

మసీదుపై ఈ దారుణమైన దాడి జరిగి ఐదు నెలలైంది, పుసేసావళి ఇప్పుడు ఒక ఛిద్రమైన ఇల్లులా ఉంది. ఇప్పుడు హిందు-ముస్లిములు కలవకపోవడమే కాదు, ఒకరినొకరు అనుమానంతో చూసుకుంటున్నారు. ఒకప్పుడు ఒకరి ఇళ్ళలో ఒకరు భోజనం చేసిన వ్యక్తులు ఇప్పుడు కేవలం నామమాత్రపు మాటలు, పనికి సంబంధించిన విషయాలు మాత్రం మాట్లాడుకుంటున్నారు. హిందూ దేవుళ్ళను కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పుసేసావళికి చెందిన ముగ్గురు ముస్లిమ్ యువకులు ప్రాణభయంతో గ్రామాన్ని వదిలి, తమ బంధువులతోనో లేదా స్నేహితులతోనో నివసిస్తున్నారు.

"భారతదేశంలో, మామూలుగా నేరం రుజువయ్యే వరకు ఒక మనిషిని నిర్దోషిగానే చూడాలి," అని 23 ఏళ్ళ ముజమ్మిల్ బాగ్వాన్ అన్నాడు. తాను ఎక్కడ ఉంటున్నానో వెల్లడించకూడదనే ఒప్పందం మీద అతను ఈ విలేకరితో మాట్లాడాడు. "కానీ మీరు ముస్లిమ్ అయితే మాత్రం, నిర్దోషిగా నిరూపణ అయ్యే వరకు మిమ్మల్ని దోషిగానే చూస్తారు."

సెప్టెంబరు 10వ తేదీ రాత్రి, ముజమ్మిల్ ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొని తిరిగి పుసేసావళికి వస్తూ, గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఏదైనా తిందామని ఆగాడు. ఆహారం కోసం ఎదురు చూస్తూ, తన హిందూ స్నేహితులు తమ స్టేటస్‌లో ఏం పెట్టారో చూడడానికి వాట్సప్ తెరిచాడు.

అప్‌డేట్‌ను చూసేందుకు క్లిక్ చేసిన ముజమ్మిల్ నిశ్చేష్టుడయ్యాడు. అతనికి వాంతి వచ్చినంత పనైంది. వాళ్ళంతా ముజమ్మిల్‌ హిందూ దేవుళ్ళను కించపరిచాడని చెబుతున్న స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్ చేసి, దాన్ని ఖండిస్తూ కామెంట్లు పెట్టారు. "అలాంటివి పోస్ట్ చేసి నేనెందుకు కావాలని సమస్యలను కొని తెచ్చుకుంటాను?" అని అతను ప్రశ్నించాడు. "ఇది హింసను ప్రేరేపించడం కోసం ఫొటోషాప్ చేసి పెట్టిన చిత్రం."

ముజమ్మిల్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన ఫోన్‌ను సరెండర్ చేశాడు. "దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయమని నేను వాళ్ళను కోరాను," అని అతను చెప్పాడు.

ఇన్‌స్టాగ్రామ్‌ సొంతదారైన మెటా సంస్థ ప్రతిస్పందన కోసం వేచి ఉన్న పోలీసులు, ఆ కామెంట్లు నిజమా కాదా అనేది గుర్తించలేకపోయారు. అవసరమైన వివరాలను ఆ సంస్థకు పంపామనీ, సర్వర్‌ను పరిశీలించిన అనంతరం, దాని నుంచి వాళ్ళకు సమాధానం రావచ్చుననీ సాతారా పోలీసుల సమాచారం.

డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఒసామా మంఝర్ మాట్లాడుతూ, "దీని మీద ప్రతిస్పందించడానికి మెటా చాలా సమయం తీసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు," అన్నారు. "ఇది వాళ్ళ ప్రాధాన్యం కాదు, పోలీసులకు కూడా దీన్ని పరిష్కరించడానికి పెద్ద ఆసక్తి లేదు. ఇక్కడ పరిశోధనా ప్రక్రియే శిక్షగా మారుతుంది."

తాను నిర్దోషి అని రుజువు అయ్యేంత వరకు గ్రామానికి తిరిగి రాలేనని ముజమ్మిల్ చెప్పాడు. ప్రస్తుతం అతను పశ్చిమ మహారాష్ట్రలోని ఓ పట్టణంలో నెలకు రూ. 2,500 అద్దె చెల్లిస్తూ ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. అతను ప్రతి 15 రోజులకు ఒకసారి తన తల్లిదండ్రులను కలుస్తాడు, కానీ వాళ్ళ మధ్య చాలా తక్కువ సంభాషణ జరుగుతుంది. "మేం ఎప్పుడు కలిసినా, మా అమ్మానాన్నలు కన్నీళ్ళు పెట్టుకుంటారు," అని ముజమ్మిల్ చెప్పాడు. "నేను వాళ్ళ కోసం ధైర్యంగా ఉన్నట్లు నటిస్తాను."

'In India, you are supposed to be innocent until proven guilty,' says Muzammil Bagwan, 23, at an undisclosed location. Bagwan, who is from Pusesavali, was accused of abusing Hindu gods under an Instagram post
PHOTO • Parth M.N.

'భారతదేశంలో, మామూలుగా నేరం రుజువయ్యే వరకు ఒక మనిషిని నిర్దోషిగానే చూడాలి,' అని తాను ఉన్న ప్రదేశాన్ని వెల్లడించడానికి ఇష్టపడని 23 ఏళ్ళ ముజమ్మిల్ బాగ్వాన్ అన్నాడు. పుసేసావళికి చెందిన బాగ్వాన్‌ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో హిందూ దేవుళ్ళను దుర్భాషలాడాడనే ఆరోపణను ఎదుర్కొంటున్నాడు

ముజమ్మిల్ తన ఇంటి అద్దె చెల్లించటం కోసం, ఇతర ఖర్చుల కోసం ఇప్పుడు ఒక కిరాణా దుకాణంలో రూ. 8000 జీతంతో పనికి కుదిరాడు. పుసేసావళిలో, అతను సొంతంగా ఒక ఐస్‌క్రీమ్ పార్లర్‌ను నడుపుకునేవాడు. "దాన్ని నేను అద్దెకు తీసుకున్నాను," ముజమ్మిల్ చెప్పాడు. “దాని యజమాని హిందువు. ఈ సంఘటన జరిగాక అతను నన్ను బయటకు గెంటేశాడు. నేను నిర్దోషినని రుజువయ్యాకే నాకు తిరిగి దాన్ని ఇస్తానని చెప్పాడు. దాంతో ఇల్లు గడవటానికి మా అమ్మానాన్నలు ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నారు. కానీ గ్రామంలోని హిందువులు వాళ్ళ నుంచి ఆ కూరగాయలు కొనడానికి కూడా నిరాకరిస్తున్నారు.’’

ఈ గొడవల నుంచి ఇక్కడ చిన్న పిల్లలకూ మినహాయింపు లేదు.

ఒకరోజు సాయంత్రం, అష్ఫాక్ బాగ్వాన్ తొమ్మిదేళ్ళ కొడుకు ఉజెర్ మిగతా పిల్లలు తనతో ఆడుకోవడం లేదంటూ స్కూలు నుంచి చిన్నబోయి ఇంటికి వచ్చాడు. "అతని తరగతిలోని హిందూ పిల్లలు మా వాడిని ' లాండ్యా ' అని పిలుస్తూ, వాడ్ని ఆటల్లో చేర్చుకోలేదు. ఇది ముస్లిములకు వ్యతిరేకంగా సున్తీని సూచిస్తూ ఉపయోగించే ఒక అవమానకరమైన పదం," అని అష్ఫాక్ చెప్పారు. “నేను పిల్లలను నిందించను. ఇంట్లో వాళ్ళేం వింటే దాన్నే బయట అంటారు. దురదృష్టకరం ఏమిటంటే, మా ఊరిలో ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు.’’

పుసేసావళిలో ప్రతి మూడేళ్ళకోసారి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో అక్కడి హిందువులు ఎనిమిది రోజుల పాటు పవిత్ర గ్రంథాలను జపిస్తారు. గ్రామంలో హింస చెలరేగడానికి ఒక నెల ముందు ఆగస్టు 8న అలాంటి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం మొదటి రోజున స్థానిక ముస్లిములు వారికి మొదటి భోజనాన్ని అందించారు. 1,200 మంది హిందువుల కోసం వారు 150 లీటర్ల షీర్ కుర్మా (సేమ్యాతో చేసే తియ్యటి వంటకం) తయారుచేశారు.

“మేం ఆ భోజనాల కోసం రూ. 80,000 ఖర్చు చేశాం,” అని సిరాజ్ చెప్పారు. “అది మన సంస్కృతి అనుకుంటూ మావాళ్ళు మొత్తం ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కానీ నేను అదే డబ్బుతో మసీదుకు ఇనుప గేటు ఏర్పాటు చేసి ఉంటే, ఈ రోజు మా మనిషి ఒకరు బతికి ఉండేవాళ్ళు.’’

*****

ఈ కేసును విచారిస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ దేవ్‌కర్ చెప్పిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 10న జరిగిన హింసాకాండకు సంబంధించి 63 మందిని అరెస్టు చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. 34 మంది పరారీలో ఉండగా, ఇప్పటికి 59 మందికి బెయిల్ కూడా వచ్చింది.

‘‘ఈ కేసులో రాహుల్ కదమ్, నితిన్ వీర్ ప్రధాన నిందితులు. వారిద్దరూ హిందూ ఏక్తా సంస్థలో పని చేస్తున్నారు,’’ అని అతను చెప్పాడు.

పశ్చిమ మహారాష్ట్రలో క్రియాశీలకంగా ఉన్న హిందూ ఏక్తా ప్రధాన నాయకుడు విక్రమ్ పావస్కర్, ఇతను మహారాష్ట్ర రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు కూడా. ఇతని సోషల్ మీడియా అకౌంట్లలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తాయి. ఇతను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సన్నిహితుడని అంటారు.

సీనియర్ హిందుత్వ నాయకుడు వినాయక్ పావస్కర్ కుమారుడైన విక్రమ్‌కు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తాడని, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడతాడనే చరిత్ర ఉంది. ఏప్రిల్ 2023లో, సాతారాలో ‘చట్టవిరుద్ధంగా నిర్మించిన మసీదు’ని కూల్చివేయలంటూ నిర్వహించిన ఆందోళనకు అతను నాయకత్వం వహించాడు.

Saffron flags in the village
PHOTO • Parth M.N.

గ్రామంలో ఎగురుతున్న కాషాయ జెండాలు

జూన్ 2023లో, ఇస్లామ్‌పూర్‌లో జరిగిన ఒక ర్యాలీలో, ‘హిందువులంతా ఏకం కావాల’ని, 'లవ్ జిహాద్'ని నిర్మూలించాలని పావస్కర్ పిలుపునిచ్చాడు. ఈ ‘లవ్ జిహాద్’ అనేది పూర్తిగా హిందూ మతోన్మాదుల కల్పన. ‘లవ్ జిహాద్’ పేరుతో ముస్లిమ్ పురుషులు హిందూ స్త్రీలను ప్రలోభపెట్టి, ఇస్లామ్ మతంలోకి మార్చుకుంటున్నారనీ, దీని వల్ల ముస్లిముల జనాభా పెరిగి, చిట్టచివరికి వాళ్ళ ఆధిపత్యం పెరుగుతుందని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. "మా బిడ్డలను, మా తోబుట్టువులను 'లవ్-జిహాద్' కోసం అపహరించి, వేటాడుతున్నారు," అని అతను అంటాడు. "జిహాదీలు హిందూమతంలోని మహిళలను, సంపదను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మనమందరం వాళ్ళకు గట్టిగా సమాధానం ఇవ్వాలి.” భారతదేశం హిందూదేశంగా మారాలని, ముస్లిములను ఆర్థికంగా బహిష్కరించాలంటూ ఇచ్చిన పిలుపును అతను సమర్థించాడు.

పుసేసావళి హింసాకాండకు ప్రత్యక్షసాక్షి చెప్పిన వివరాల ప్రకారం, దాడికి కొన్ని రోజుల ముందు పావస్కర్ నిందితుల్లో ఒకరి నివాసంలో సమావేశం నిర్వహించాడు. గ్రామంపై దాడి చేసిన హిందుత్వ మూకలో వందమందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. ఆ మూకలో 27 మంది గ్రామానికి చెందిన వాళ్ళున్నారని, వాళ్ళలో కొందరు పావస్కర్‌ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారని ఆ ప్రత్యక్షసాక్షి పోలీసులకు చెప్పాడు. ఆ మూక గ్రామంలోని మసీదులోకి ప్రవేశించినప్పుడు, వారిలో ఒకరు, "ఈ రాత్రికి ఏ లాండ్యా బతకకూడదు. విక్రమ్ పావస్కర్ మన వెనకున్నాడు. ఎవరి పట్లా దయ చూపొద్దు," అని అన్నాడని ఆ సాక్షి తెలిపాడు.

అయినా పోలీసులు అతన్ని అరెస్టు చేయలేదు. సాతారా పోలీసు సూపరింటెండెంట్, సమీర్ షేక్, ఈ కథనంపై ఈ రిపోర్టర్‌తో మాట్లాడడానికి నిరాకరించారు. "మీకు కావాల్సిన వివరాలన్నీ ఇప్పటికే అందరికీ తెలుసు," అని ఆయన అన్నాడు. దర్యాప్తు గురించి లేదా పావస్కర్ పాత్ర గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆయన తప్పించుకున్నాడు.

జనవరి 2024 చివరి వారంలో, పావస్కర్‌పై ఎటువంటి చర్య తీసుకోనందుకు బాంబే హైకోర్టు సాతారా పోలీసులను తప్పు పట్టింది.

*****

సాతారా పోలీసులు సరిగా ప్రతిస్పందించకపోవడంతో, తమకు ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా, నూరుల్ హంతకులకు శిక్షపడుతుందా, సూత్రధారులను ఎప్పుడైనా చట్టం ముందుకు తీసుకువస్తారా అని ఆయేషాకు సందేహం వస్తోంది. స్వయంగా ఒక న్యాయవాది అయిన ఆమె, ఈ వ్యవహారాన్ని అటకెక్కిస్తారేమోనని అనుమానపడుతోంది.

"చాలామంది నిందితులు ఇప్పటికే బెయిల్‌ మీద బయటికొచ్చారు, గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు" అని ఆమె చెప్పింది. "ఇదొక క్రూర పరిహాసం."

ఆయేషా నిరంతరం భర్తను తలచుకుంటూ ఉంటుంది. పుసేసావళిలో తన భద్రత మీద అనుమానాలున్న ఆమె, ఎక్కువ సమయం రాజాచే కుర్లేలోని తల్లిదండ్రుల వద్ద గడుపుతోంది. "కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి నేను రెండు గ్రామాల మధ్య తిరగగలను," అని అయేషా చెప్పింది. "కానీ ప్రస్తుతం, నా జీవితాన్ని తిరిగి దారిలోకి తీసుకురావడమే నా మొదటి ప్రాధాన్యం."

Ayesha Hasan, Nurul's wife, in Rajache Kurle village at her parents’ home
PHOTO • Parth M.N.

రాజాచే కుర్లే గ్రామంలో తన తల్లిదండ్రుల ఇంటి వద్ద నూరుల్ భార్య అయేషా హసన్

ఆమె తన న్యాయవాద వృత్తిని తిరిగి ప్రారంభించాలని భావించినా, ఆ వృత్తికి గ్రామంలో ఆశాజనకమైన అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం దానిని వాయిదా వేసింది. "నేను సాతారా నగరానికో లేదా పుణేకో మారితే పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు," అని అయేషా చెప్పింది. “కానీ నేను మా అమ్మానాన్నలకు దూరంగా ఉండాలనుకోవడం లేదు. వాళ్లకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నేను వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది.”

ఆయేషా తల్లి 50 ఏళ్ళ షమాకు బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంది. ఆమె తండ్రి 70 ఏళ్ళ హనీఫ్‌కు, డిసెంబర్ 2023లో తన కుమార్తె పరిస్థితికి కలిగిన వత్తిడి వల్ల గుండెపోటు వచ్చింది. "నాకు తోబుట్టువులెవరూ లేరు," అని అయేషా చెప్పింది. "మా నాన్న తనకు కొడుకు లేడన్న బాధను నూరుల్ పూరిస్తున్నాడని తరచూ అనేవాడు. అతను చనిపోయిన నాటి నుంచి, మా నాన్న తను తనుగా లేడు.”

అయేషా తన తల్లిదండ్రులతో ఉంటూ వాళ్ళను చూసుకోవాలని నిర్ణయించుకున్నా, ఆమె చేయాల్సింది చాలా ఉంది. తన జీవితానికి అర్థాన్ని, చనిపోయిన తన భర్త కోరికలను నెరవేర్చాలని ఆమె కోరుకుంటోంది.

సంఘటన జరగడానికి కేవలం ఐదు నెలల ముందు నూరుల్, అయేషాలు తమ సొంత నిర్మాణ కంపెనీ - అశనూర్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. అతను సివిల్ పనులను తీసుకువస్తే, దానికి సంబంధించిన న్యాయవ్యవహారాలను ఆమె చూసుకోవాలని వాళ్ళు అనుకున్నారు.

ఇప్పుడు అతను లేకపోయినా, దానిని మూసివేయాలని ఆమె అనుకోవడం లేదు. "నిర్మాణం గురించి నాకు పెద్దగా తెలియదు," అని ఆమె చెప్పింది. “కానీ నేను తెలుసుకుని, మా కంపెనీని ముందుకు తీసుకెళ్తాను. నేను ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాను కానీ నిధులు సేకరించి అది పనిచేసేలా చేస్తాను.’’

ఆమె రెండో కోరిక పెద్ద కష్టమైనదేమీ కాదు.

నూరుల్ తన బిడ్డ క్రికెట్ నేర్చుకోవాలని తహతహలాడాడు. అది ఏ స్పోర్ట్స్ అకాడమీ నుంచో కాదు, విరాట్ కోహ్లి శిక్షణ పొందిన చోటనే. ఆయేషా నూరుల్ కలను నిజం చేసే పనిలోనే ఉంది. "నేను చేస్తాను," అని ఆమె స్థిరనిశ్చయంతో చెప్పింది.

అనువాదం: రవి కృష్ణ

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Vishaka George

Vishaka George is Senior Editor at PARI. She reports on livelihoods and environmental issues. Vishaka heads PARI's Social Media functions and works in the Education team to take PARI's stories into the classroom and get students to document issues around them.

Other stories by Vishaka George
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna