కలయస్సేరి పరాస్సిని కడవు  వద్ద ఉన్న గుడి అసాధారమైంది. ఆ గుడిలో ప్రవేశానికి అన్ని కులాల వారికీ అనుమతి ఉంది. అక్కడి పూజారులు వెనుకబడిన వర్గాలకు చెందినవారు. ఆ గుడిలో ఉన్న దేవుడి పేరు, ముతప్పన్ - ఆయన్ని పేదవారి దేవుడిగా పిలుస్తారు. ఆ దేవుడికి కల్లు, మాంసం నైవేద్యంగా పెడతారు. సాధారణంగా దేవాలయాల్లో దేవుడి విగ్రహాల మధ్య ఉన్న కాంస్య లోహ కుక్కలను లెక్కించరు. కానీ కేరళలోని కన్నూర్ జిల్లాలో ఉన్న ముత్తప్పన్ గుడి మాత్రమే లెక్కిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వేటగాళ్ల దేవుడు ఉన్నాడు కదా మరి.

అయితే 1930 లలో, ముతప్పన్, వేటకు గురైన వారికి కూడా దేవుడే. ముఖ్యంగా బ్రిటిష్ వారి నుండి తప్పించుకుంటున్న జాతీయవాదులకు, కమ్యూనిస్టులకు. “అక్కడున్న భూస్వాములతో పోరాడడానికి ఆ గుడి కూడా మాతో చేతులు కలిపింది”, అన్నారు కె పి ఆర్ రాయప్పన్. ఆయన 1997కు ముందు, ఆ తరవాత ఇక్కడ ఉన్న అన్ని పోరాటాలలోనూ చురుకుగా పాల్గొనేవారు. “లెఫ్ట్ మూవ్మెంట్ లో ముఖ్యులైన వారు ఏదోక సమయంలో ఇక్కడ గూడు వెతుక్కున్నవారే.”

నాస్తికులకు, ఆస్తికులకు ఉన్న ఈ చిత్రమైన కూటమికి తార్కిక ఆధారం ఉంది. ఇద్దరి ఆర్ధిక స్థాయి ఇంచుమించుగా చెట్టాపట్టాలేసుకుని ఉన్నాయి. ఇద్దరూ కులాధిపత్యానికి వ్యతిరేకులు. ఇద్దరూ భూస్వాముల దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నవారే. పైగా జాతీయోద్యమం గాఢమవుతున్న వేళ, అందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే ఉన్నారు.

“ఇక్కడి పెద్ద జమీందారు ఈ గుడిని ఆక్రమించుకుందామనుకున్నాడు.” అన్నారు రాయప్పన్. “దాని మీద వచ్చే అంతులేని రాబడికి ఆశపడ్డాడు.” ఈ విషయాన్ని నమ్మడం  తేలికే. ఈ రోజుకు కూడా ముత్తప్పన్ గుడి రోజుకు నాలుగు వేలమందికి, వారాంతాలలో ఆరువేలమందికి భోజనం పెడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న బడి పిల్లలకి ప్రతీరోజూ ఇక్కడే భోజనం.

వీరిని దాచడానికి ఆ గుడి చాలా అసాధారణ ప్రమాదాలను కొనితెచ్చుకుంది. కానీ కల్లియస్సేరి  ప్రజలు, ఆ చుట్టుపక్కల ఊర్లవారు కూడా అసాధారణమైనవారే. వారి రాజకీయ చైతన్యానికి చాలా చరిత్ర ఉంది. పప్పీనేస్సేరి లో టెక్స్టైల్ మిల్లునే తీసుకుంటే, అది చుట్టుపక్కల ఊరిలో ఉన్న పనివారందరిని  సంఘటితం చేసింది. 1946 లో బొంబాయిలో జరుగుతున్న రాయల్ ఇండియన్ నేవీ మ్యుటినీ కి మద్దతుగా కేరళ లోని ఈ చిన్న ఊరిలో ప్రజలు 100 రోజుల పాటు స్ట్రైక్ జరిపారు. ఇది బ్రిటిష్ వారి పరిపాలనను ప్రతికూలిస్తూ జరిగిన ఒక మొండి సంఘటన.

“ఈ ప్రదేశంలో సెక్షన్ 144(నిషేధిత ఆదేశాలు) ఒక సంవత్సర కాలం పైనే విధించారు,  అయినా మేము చురుగ్గా ఉండేవాళ్ళం.” అన్నారు 81 ఏళ్ళ పయనదన్ యశోద. ఈమె 30వ దశాబ్దం తరవాత మలబార్ రాజాకీయాలలో కీలకమైన పాత్ర పోషించిన ఉపాధ్యాయ ఉద్యమానికి నాయకురాలు.

ఇక్కడి పోరాటాలు వేరే పోరాటాల కన్నా ఎలా భిన్నమైనవి? “మేము వ్యవస్థీకృతమయ్యాము. రాజకీయ మార్గాలలోనే పని చేశాము. మా లక్ష్యాలు స్పష్టంగా ఉండేవి. మాలో సామూహిక స్పృహ, భాగస్వామ్యం ఉండేది. మేము జాతీయవాద ఉద్యమంలో పాల్గొన్నాము. పైగా  సామాజిక సంస్కరణ, కుల వ్యతిరేక ఆందోళనలలో ఉన్నాము. భూ పోరాటాలు కూడా చేశాము. ఇలా ప్రతిదీ ముడిపడి ఉన్న వ్యవస్థలో పని చేశాము."

కల్లియస్సేరి , దాని చుట్టూ పక్కల ప్రాంతం అంతా 50 ఏళ్ళ స్వేచ్ఛను సరిగ్గా వినియోగించుకున్నారు. దాదాపు వందశాతం అక్షరాస్యత ఉందక్కడ. ప్రతి పిల్లవాడు బడికి వెళ్తాడు. వారి ఇతర అభివృద్ధిని సూచించే విషయాలను పాశ్చాత్య సమాజాలతో పోల్చవచ్చు. వీటిని సామూహిక రాజకీయ చర్యలను వ్యవస్థీకృతం చేయడం వలన వచ్చిన లాభాలుగా యశోద పరిగణిస్తారు.

కానీ ఇదంతా పరిస్థితిని అతిశయించి చెప్పడం కాదా? ముఖ్యంగా సంఘటిమైన రాజకీయ పోరాటాల పాత్రను గురించి? పైగా కేరళ లో ఇదివరలోనే అక్షరాస్యత చాలా ఎక్కువ. కానీ ఆ తాలూకా లో మొట్టమొదటి మహిళా టీచర్ అయిన యశోద ఒప్పుకోరు. “1930 చివరలో కూడా మలబార్ లో అక్షరాస్యత 8 శాతం మాత్రమే ఉంది. ట్రావంకోర్ లో 40 శాతం ఉంది, మేము మా ప్రయత్నాల ద్వారా కష్టపడి ప్రగతిని సాధించాం.” అన్నారు.

ఆ లెక్కలో మలబార్ లో జరిగిన మార్పు భారతదేశంలో అరుదుగా జరిగే  విషయంగా అనిపిస్తుంది. ఆ ప్రాంతం త్వరగానే అందరితో సంబంధాలు ఏర్పరచుకొంది.  ఇది ట్రావంకోర్, కొచ్చిన్ను వేరే విషయాలలో సైతం అనుసరించింది. “మా వ్యవస్తీకృత రాజకీయ కార్యకలాపాలు మార్పును తీసుకొచ్చాయి”, అన్నారు రాయరప్పన్. “యాభైల్లో, అరవైల్లో వచ్చిన భూసంస్కరణలు చాలా మొండి నిర్మాణాలను, ముఖ్యంగా కులవ్యవస్థను కలవరపెట్టాయి. విద్య ఆరోగ్య ప్రమాణాలు వేగంగా మెరుగుపడ్డాయి. కల్లియస్సేరిలో 1928 లో 24 మంది కుటుంబాలకు  43 శాతం భూమి ఉండేది. కానీ ఇప్పుడు 13 కుటుంబాలకు మాత్రమే 5 ఎకరాలకన్నా ఎక్కువ భూమి ఉంది. పైగా మొత్తం భూమిలో వారికి 6 శాతం మాత్రమే భాగస్వామ్యం ఉంది.”

కల్లియస్సేరి  ప్రజలు వారి ఆహారంలో చాలా మంచి మార్పును గమనించారు. పాలు, మాంసం వినియోగం పెరిగింది. ఇక్కడి వారు వేసుకున్న దుస్తులను బట్టి వారు కూలివారా కాదా చెప్పడం కూడా కష్టం.

ఎనభైల్లో, రాష్టంలో జరిగిన భారీ అక్షరాస్యత సంకల్పం వలన చాలా లాభాలు చేకూరాయి.  కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ వంటి సంస్థల ప్రయత్నాల వలన  కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. ఇవన్నీ, ఈ ప్రాంత రాజకీయ సంప్రదాయాల ప్రాతిపదికన నిర్మించారు. కల్లియస్సేరితో సహా మలబార్ ఇతర విషయాల్లో కూడా మార్గదర్శి అయింది.

"కల్లియస్సేరి  30ల చివరలోనూ 40లలోనే చాలా ప్రయోగాలు చేసింది. ఇది ఉత్పత్తిదారుల, వినియోగదారుల సహకార సంస్థలను నిలిపివేసింది," అని కన్నూర్ లోని కృష్ణ మీనన్ కాలేజీ లెక్చరర్ మోహన్ దాస్ చెప్పారు. "ఇలా చేయడం వలన సరసమైన ధరలలో వస్తువులు అందించే దుకాణాలను స్థాపించడానికి  ప్రేరణ వచ్చింది."

"వారు కరువు, ఆకలి ఉన్న కాలంలో అభివృద్ధి చెందారు. అప్పట్లో రైతుల ధాన్యంపై భూస్వాముల డిమాండ్లు కఠినమవుతున్నాయి. బహుశా భూస్వాములు కూడా బ్రిటిష్ వారి నుండి ఎక్కువ డిమాండ్లను ఎదుర్కొంటున్నారనుకుంటా. అంతకుముందు, కరువు కాలంలో ప్రజల నుండి సేకరించిన ధాన్యం మొత్తానికి కొంత రాయితీలు ఉండేవి. నలభైలలో, అది ఆగిపోయింది."

డిసెంబర్ 1946 లో సంక్షోభం ఏర్పడిందని రిటైర్డ్ టీచర్ అగ్ని షర్మాన్ నంబూదిరి చెప్పారు. "కరివెల్లూర్ గ్రామంలో ధాన్యం లాక్కోవడానికి భూస్వాములు చేసిన ప్రయత్నాన్ని ప్రజలు ప్రతిఘటించారు. ఆ తరువాత జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. చాలా భీభత్సం జరిగింది. అయితే ఇది భూస్వామిక వ్యతిరేక స్ఫూర్తిని రేకెత్తించింది.” భూ సంస్కరణల కోసం ఈ ప్రాంతం విజయవంతంగా పోరాడటానికి ప్రేరణనిచ్చింది.

కానీ ఇప్పుడు, కల్లియస్సేరి విజయాలతో పాటు భయంకరమైన సమస్యలు ఉన్నాయి. "వ్యవసాయం గందరగోళంగా ఉంది" అని రాయరప్పన్ చెప్పారు. "దిగుబడి తగ్గింది. వ్యవసాయ కూలీలకు పని దొరకడం లేదు."

మోహన్ దాస్ చెప్పినట్లుగా: "వరి భూమిని ఇళ్ళు నిర్మించడానికి, నగదు పంటల వేయడానికి వాడడం చాలా నష్టాన్ని కలిగించింది. ఉదాహరణకు, భూస్వామి యాజమాన్యంలోని ఒక భారీ పొలాన్ని తీసుకోండి. కల్లియస్సేరి వరి భూమిలో 50 శాతం ఆ పొలంలో ఉంది. ఇప్పుడు ఇళ్ళు, నగదు పంటలు దానిని ఆక్రమించాయి. జరిగిన నష్టం గురించి అందరిలో స్పృహ పెరుగుతోంది. కానీ ఇప్పటికే చాలా కోల్పోయాము. "

నిరుద్యోగ సమస్య చాలా  ఎక్కువగా ఉంది. పైగా బయట పనులలో మగవారితో పోలిస్తే ఆడవారు సగం కన్నా తక్కువగా పాల్గొంటున్నారు. కార్మిక రంగంలో ఉన్న ఆడవాళ్ళలో దాదాపు సగం మంది నిరుద్యోగులే. ఆడవారు చాలా తక్కువ నైపుణ్యం గల ఉద్యోగాలలో ఉన్నారు. అందులో కూడా వారు వారితో పని చేసే ఇతర మగవారి కంటే తక్కువ వేతనాలు పొందుతున్నారు.

భయంకరమైన సమస్యలు ఉన్నాకూడా ఇక్కడ నిరాశాభావం లేదు. పంచాయతీ రాజ్ తో కేరళ ప్రయోగాలలో, కల్లియస్సేరి  ముందంజలో ఉంది. రాష్ట్రంలోని 900కి పైగా ఇతర పంచాయతీల మాదిరిగానే, ఇది తన సొంత అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. అది కూడా ప్రజలు తమంతట తామ సేకరించిన డేటా ఆధారంగానే. ఈ ప్రాంతపు చాలా కార్యకలాపాలు స్థానిక వనరుల వలన,  స్వచ్ఛంద శ్రమల నుండి ఉత్పన్నమవుతాయి. "ఇక్కడి ప్రజలు ఈ పంచాయతీలో 62 కిలోమీటర్ల రోడ్లను నిర్మించారు" అని రాయరప్పన్ చెప్పారు.

అందరూ గ్రామసభ సమావేశాలలో బాగా పాల్గొంటారు, వారి అభిప్రాయాలను బాగా వ్యక్తం చేస్తారు.  దాదాపు 1,200 మంది వాలంటీర్లు కల్లియస్సేరిని మరో మైలురాయి వరకు నడిపించారు: ప్రజల వనరుల మ్యాపింగ్ కార్యక్రమాన్ని(Peoples' Resource Mapping Programme) చేపట్టిన దేశంలో ఇది మొదటి పంచాయతీ. గ్రామం యొక్క సహజ, మానవ వనరుల స్థితి గురించి ఖచ్చితమైన చిత్రం బయటి నుండి నిపుణుల సహాయంతో స్థానికుల తయారు చేశారు. అంతేగాక గ్రామప్రణాళికలోని ప్రాజెక్టులు, వాటి వలన పర్యావరణ ప్రభావాన్నీ విశ్లేషించేందుకు ఒక విభాగం కూడా ఉంది.

రిటైర్డ్ వ్యక్తుల 'స్వచ్ఛంధ సాంకేతిక దళాలు'(voluntary technical corps-VTC) - ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు - ప్రాజెక్టులను పర్యవేక్షించడంలో సహాయపడతారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు 5,000 మందికి పైగా వీటీసీ సభ్యులు ఉన్నారు.

ఈ సవాళ్ళు ఇంకా భారీగానే ఉన్నాయి. ఊరివాళ్ల సమస్యలకు కారణాలు ఊరి సరిహద్దుల్ని దాటే ఉన్నాయి. కానీ కల్లియస్సేరి  విశ్వాసంతో నిలబడి ఉంది. రాయప్పన్ చెప్పినట్టు, “మేమెమప్పుడు మా పోరాటాన్ని ఆపలేదు.”

1947 తరవాత కూడా.


ఈ కథనం మొదటిసారి ది టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఆగష్టు 29, 1997 లో ప్రచురితమైంది.

ఫోటోలు : పి సాయినాథ్

ఈ వరసలో ఇంకొన్ని శీర్షికలు :

సాలిహాన్ రాజ్ మీద ఎదురుదాడి చేయగా

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు -1

పనిమారా స్వాతంత్య్ర క్షేత్ర యోధులు - 2

లక్ష్మి పాండా ఆఖరి పోరాటం

తొమ్మిది దశాబ్దాల అహింస

గోదావరి: దాడి కై ఎదురుచూస్తున్న పోలీసులు

షేర్ పూర్ : గొప్ప త్యాగం, గుర్తులేని జ్ఞాపకం

సోనాఖాన్ : వీర్ సింగ్ రెండు సార్లు మరణించాడు

కల్లియస్సేరి: సుముకన్ కోసం వెతికే ఒక ప్రయత్నం

1930-40 లలో పరాస్సిని కడవు దగ్గర ఉన్న ఈ గుడి, జాతీయవాదులకు బ్రిటిష్ వారి నుండి తప్పించుకుని తలదాచుకోవడానికి గూడయ్యింది. ఈ గుడి దైవం, ముత్తప్పన్, వేటగాళ్లకు దేవుడు. ఈ గుడిలో దేవుడి విగ్రహాల మధ్య కాంస్యలోహం తో చేసిన కుక్కల విగ్రహాలున్నాయి.

అనువాదం : అపర్ణ తోట

پی سائی ناتھ ’پیپلز آرکائیو آف رورل انڈیا‘ کے بانی ایڈیٹر ہیں۔ وہ کئی دہائیوں تک دیہی ہندوستان کے رپورٹر رہے اور Everybody Loves a Good Drought اور The Last Heroes: Foot Soldiers of Indian Freedom کے مصنف ہیں۔

کے ذریعہ دیگر اسٹوریز پی۔ سائی ناتھ
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

کے ذریعہ دیگر اسٹوریز Aparna Thota